Saturday, November 19, 2011

సజీవ దృశ్య చిత్రణ గోగొల్ 'ఓవర్ కోటు'


సవ్వడి డెస్క్ - కె. ఆనందాచారి (prajasakti 23/10/2011)
రష్యన్‌ రచయితలందరి పక్షాన మహారచయిత దొస్తొయేవ్‌స్కీ ''మేమందరమూ గోగొల్‌ 'ఓవర్‌కోటు' నుండి తయారైన వాళ్ళమే'' అన్నాడంటే ప్రఖ్యాత రష్యన్‌ నవాలాకారుడు, నాటకకర్త, కథారచయిత, కవి నికొలారు వసీరియోవిచ్‌ గోగొల్‌ విశిష్టత మనకు అర్థమవుతుంది. గడచిపోయిన నా జీవితంలోని సంతోషాలను మాత్రమే ప్రపంచం చూసింది కానీ నా కన్నీళ్ళను కాదు' అన్న గోగొల్‌ ప్రఖ్యాతమైన 'ఓవర్‌కోటు' కథను ఒక మారు పరికిద్దాము.
అది సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతం. అకాకి అకియోవిచ్‌ ఒక డిపార్ట్‌మెంట్‌లో గుమస్తా. పొట్టిగా వుంటాడు. గుమస్తా గిరి ఉద్యోగం కోసమే పుట్టినట్టు వున్నాడని అందరూ అనుకుంటారు. నిజంగా చాలా అమాయకుడు. ఆఫీసూ, పని తప్ప ఏదీ తెలియనివాడు. ఒకే పనిలో ఎంతోకాలంగా వుంటున్నాడు. ఉత్తరాలకి, కాగితాలకీ, దస్తావేజులకీ నకళ్ళు రాసే కాపీయిస్టుగా వుండటమంటేనే అతనికి ఇష్టం. ప్రమోషనిచ్చినా నిరాకరించాడు. డిపార్ట్‌మెంట్‌లో అతడంటే ఎవరూ పిసరంత గౌరవం చూపరు. ఆఖరికి బంట్రోతు కూడా. సిరస్తదార్లు అతన్ని ఎందుకూ కొరగానట్లుగా అదొక మోస్తరు దాష్టీకపు తిరస్కార భావంతో చూస్తారు. హెడ్డు గుమస్తా కాగితం అతని ముఖంపై పడేసి నఖలు చేసి పెట్టమని చెప్పేవాడు.తోటి గుమస్తాలు, కుర్రకారు ఉద్యోగులు వేళాకోళం చేస్తూ వెటకారాలాడేవారు. నెత్తి మీద కాగితం ముక్కలు విసిరి వెక్కిరించేవారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా తనముందు ఎవరూ లేనట్టు తన పని తాను చేసుకుంటూ పోయేవాడు అకాకి అకియోవిచ్‌. ఎపుడన్నా మరీ చికాకుపుడితే 'నన్ను చంపకండి బాబూ' అని మాత్రమే అనేవాడు.
అతని ఉద్యోగ చిహ్నమైన పొడుగు కోటుకు మొదట వుండిన ఆకుపచ్చ రంగు ఏనాడో వెలసిపోయి, అదొక చిత్రమైన గోధుమ ఛాయ వచ్చింది. కోటు కాలరు బిగుతుగా, సన్నగా అయిపోయింది. ఎక్కడైనా మాసికలు వేయాల్సి వస్తే కాలరు నుండి తీసి వేయించేవాడు. చీకిపోయి పలుచబడ్డ కోటులో నుండి లోపల ధరించే 'కపోట్‌' (గౌను) కనిపిస్తూ వుండేది. కోటు గురించి ఎప్పుడూ ఆఫీసు వాళ్ళు అనేక జోకులు పేలుస్తుంటారు.
అయితే సంవత్సరానికి నాలుగు వందల రూబుళ్ళతో బ్రతుకు సాగిస్తున్న పీటర్స్‌బర్గ్‌లో ఒక పరమ శత్రువు వున్నాడు. గాఢంగా వీచే చలిగాలే శత్రువు. సూదులతో పొడుస్తూ, కొడుతున్నట్టుగా వీచే గాలులు ఇంటి నుండి ఆఫీసుకు పోయే ఉద్యోగస్తులకు ప్రాణాలు తీసే శత్రువు లాంటిదే. చీకిపోయి పలుచబడ్డ కోటు గుండా అకాకి అకియోవిచ్‌ శరీరాన్ని చలిగాలులు తాకుతూ కరుడుగట్టించేస్తూ వున్నాయి. తెంపులుపడ్డ కోటును మరమ్మతు చేయించాలనుకుంటాడు. పెట్రోవిచ్‌ అనే దర్జీ వద్దకు వెళ్ళి చాలా మర్యాదగా మాసిక వేయమంటాడు. దాన్ని తిరగేసి మరగేసి చూసిన పెట్రోవిచ్‌ లాభం లేదంటాడు. ఏదో ప్రయత్నం చేయమంటాడు. పూర్తిగా చీకిపోయింది. మాసికలేసినా ఆగదని, తక్కువ ధరకే కొత్త కోటు కుట్టిస్తానని దర్జీ చెబుతాడు. ఏం చేయాలో తోచక ఇంటికి తిరిగి వచ్చి, అదేపనిగా ఆలోచిస్తూ ''ఇలా జరిగిందా?... అనుకోలేదే....'' పరధ్యానంగా ఆలోచిస్తూ రెండోసారి పెట్రోవిచ్‌ని కలిసి అడుగుతాడు. అయినా లాభం లేకపోవడంతో కొత్త ఓవరుకోటు కుట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నిర్ణయానికి వచ్చి డబ్బుల కోసం ఆలోచిస్తాడు. పొదుపు చర్యలు ప్రారంభిస్తాడు. డబ్బాలో చిల్లర డబ్బులు వేస్తూ దాచడం మొదలుపెడతాడు. ఒక సంవత్సరం వరకు ఖర్చు తగ్గించాలనుకుని, టీ త్రాగడం మానేస్తాడు. చీకటి పడగానే క్రొవ్వొత్తి వెలిగించడం మాని, ఇంటి యజమాని దీపం వద్ద రాసుకుంటాడు. చెప్పులు అరగకుండా మునివేళ్ళపై నడుస్తాడు. తరచూ చాకలికి బట్టలు వేయకుండా జాగ్రత్తపడతాడు. కొత్త ఓవరుకోటు కుట్టించుకోవడం తన జీవిత లక్ష్యం అవుతుంది. కొత్త ఓవరుకోటు మార్టెన్‌ బొచ్చు కాలరు పెట్టించుకోవడం గురించిన ధ్యాసలో మొదటిసారి ఆఫీసులో నఖలు రాయడంలో జరిగిన పొరపాటుకు నాలిక కరచుకున్నాడు కూడా. కొత్త కోటు ఆలోచన తన కళ్ళల్లో కొత్త కాంతిని నింపేది. ఆఫీసువాళ్ళు ఇచ్చిన బోనసు డబ్బు, తాను దాచుకున్న డబ్బుతో కోటు కుటించుకుంటాడు అకాకి అకియోవిచ్‌.
దర్జాగా కొత్త కోటు వేసుకుని ఆఫీసుకు వెళ్ళి అపురూపంగా దాన్ని ఆఫీసు గోడకు తగిలించి అటెండరును జాగ్రత్త సుమా అని చెబుతాడు. అతని కొత్త కోటు చూసి ఆఫీసువాళ్ళు అందరూ అభిమానిస్తారు. కొంత గర్వంగా, గౌరవంగా ఆనందిస్తాడు అకాకి. కొత్త కోటు సందర్భంగా ఉద్యోగులందరూ పార్టీ ఇవ్వమంటారు. కానీ అకాకి ఏమీ మాట్లాడడు. ఎంతకు కుదరకపోయే సరికి హెడ్‌గుమస్తా నేనే పార్టీ ఇస్తాను. రోజు సాయంత్రం అందరూ నా ఇంటికి రండి అంటాడు. ముందు రానని చెప్పినా ఆఖరికి అకాకి కూడా వస్తానంటాడు. హెడ్డుగారి ఇంటిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళతాడు. పార్టీ పూర్తయ్యేసరికి చాలా రాత్రవుతుంది. కాస్త భయం భయంగా పెద్ద పెద్ద అడుగులేస్తూ ఇంటికి వస్తూ వుండగా, ఇద్దరు దొంగలు ఎదురుపడి ' ఓవరు కోటు మాది 'ఇచ్చేరు' అంటూ బెదిరించి బలవంతంగా గుంజుకుని పారిపోతారు. ఏమి చేయాలో తోచక ఆందోళనతో, దుఃఖంతో లబోదిబోమంటూ దగ్గరలోనే వున్న పోలీసుకు విషయం చెబుతాడు. అతను ఏమీ చేయలేకపోతాడు. గందరగోళంతో పరుగెత్తుకుంటూ ఇల్లు చేరుకుంటాడు అకాకి.
ఇంటి యజమానురాలు అతని ఆందోళనను గమనించి విషయం తెలుసుకుంటుంది. ఓదారుస్తుంది. తెల్లవారి పోలీసు సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేయబోగా అసలు నువ్వు అర్థరాత్రి ఎందుకు వీధిలో తిరుగుతున్నావు. ఏం పని? అని లక్ష ప్రశ్నలు సంధిస్తాడు. ఆఫీసువాళ్ళు కోటుపోయిన విషయాన్ని తెలుసుకుని అకాకిని ఓదారుస్తారు. కొత్త కోటుకొనేందుకు చందాలు వేసుకోవడానికి కుదరక వూరుకుంటారు. పోలీసులకు బదులు ఒక అతిముఖ్యమైన మనిషి వున్నాడు. అతనికీ కోటు గురించి చెబితే వెంటనే తేల్చుతాడని ఆఫీసువాళ్లు సలహా ఇస్తారు.
అతిముఖ్యమైన మనిషిని కలిసేందుకు అకాకి వెళ్తాడు. అతను స్నేహితునితో మాట్లాడుతూ ఆఫీసు ముందు అకాకిని చాలాసేపు కూర్చోపెడతాడు. చివరగా ముఖ్యమైన మనిషిని కలుసుకోగా - ''నీకు ఎలా చెప్పుకోవాలో పద్ధతి తెలియదా? ముందు సెక్రటరీకి అర్జీ పెట్టుకోవాలి. తరువాత నా వద్దకు రావాలి. మాత్రం తెలియదా! అంటూ గద్దిస్తూ తిడతాడు. అతిముఖ్యమైన మనిషి చాలా డాబూదర్పం వున్నవాడు. మధ్యనే పెద్ద మనిషిగా ఎదిగినవాడు. అతన్ని చూసి వణుకుతూ చెమటలు పట్టగా అకాకి ''క్షమించాలి సెక్రటరీలను నమ్మలేమని, నా ఓవరు కోటు పోయిన విషయం మీతోనే చెప్పాలని వచ్చాననగానే?'' ఏమిటి? నువ్వెరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎంత గుండె ధైర్యం? మా ఉద్యోగులపై అభాండాలు వేస్తావా? నీకేమైనా మతిపోయిందా అంటూ బిగ్గరగా అరుస్తూ ఇంతెత్తున లేస్తాడు అతిముఖ్యమైన మనిషి. గడగడ వణికిపోతూ మూర్చవచ్చినంత పని అవుతుంది. భయపడటం చూసి ముఖ్యుడు చాలా సంతోషపడిపోతాడు. వెంటనే మేడమెట్లు దిగి, కాళ్లూ చేతులు చచ్చు బడిపోయినట్లు స్పృలేనట్లుగా గాలిలో నడుచుకుంటూ పడుతూ లేస్తూ ఇంటికి చేరుతాడు అకాకి.ఇంటికి వచ్చిన మరుక్షణమే మంచం పడతాడు. విపరీతమైన జ్వరం వస్తుంది. ఇంటి యజమానురాలు డాక్టరును పిలిపించగా డాక్టరు ''రోగం చాలా ముదిరిపోయింది. ఇక కష్టం'' అని చెప్పి వెళ్లిపోతాడు. జ్వరంతో, కోటును తలచుకొంటూ, కలవరిస్తూ అతని ఏకైక వస్తువు ఓవరుకోటు చుట్టూ మనస్సు పరిభ్రమిస్తుండగా శాశ్వతంగా కన్ను మూస్తాడు అకాకి అకియోవిచ్‌.
అతను పోయింతర్వాత కొన్ని రోజుల వరకూ ఎవరూ అతని గురించి అనుకునేవారే లేకపోయినా గవర్నమెంటు గుమాస్తా రూపంలో దయ్యం ఒకటి చోరీ అయిన ఓవరు కోటు కోసం వెతుకుతూందని, ఎలాంటి మనుషులనైనా, కోటు ధరించిన వారి నుండి కోటును నిలువుగా లాగేసుకుంటోందని ఎవరినీ లెక్కచేయటం లేదనే పుకారు ఒకటి పీటర్స్‌బర్గ్‌ అంతటా వ్యాపించింది. ఇదిలా వుండగా అతి ముఖ్యమైన వ్యక్తి అంతఃకరణం నిజంగా చివుక్కుమంది. అతడు వాస్తవంగా సహృదయుడే. మానవుని పట్ల సానుభూతి వున్నవాడే కానీ అవి పైకి రాకుండా అతని హోదా వాటిని అణచివేస్తూంటుంది. అకాకి పట్ల కొంత విచారపడి, అధికార్లను చివాట్లు పెట్టి అతన్ని పిలుచుకురమ్మంటాడు. కానీ అతను చనిపోయాడని తెలిసి చాలా బాధపడతాడు. అకియావిచ్‌ ఆకస్మాత్తుగా చనిపోయాడని రోజంతా మధనపడిపోయాడు. బాధ నుండి తప్పించుకొనేందుకు స్నేహితుని ఇంటికి వెళతాడు అతిముఖ్యమైన మనిషి. అక్కడ స్నేహితులతో చాలా సరదాగా, సంతోషంగా గడిపి ఇంటికి వచ్చేందుకు బండి ఎక్కి బయలు దేరుతాడు. రాత్రివేళ మంచుతో కూడిన గాలి విపరీతంగా కొడుతున్నట్లు వీస్తుంటుంది. గాలి వేగానికి బండిని ఆపేస్తాడు బండి నడిపేవాడు. గాలికి ముఖ్యమైన మనిషి వేసుకున్న కోటు అటూ ఇటూ ఎగిరిపడుతూ వుంటుంది. లోపుగా ఎవరో తన ఓవరు కోటు కాలరు పట్ట్టుకుని లాగుతారు. ఎవరా అని చూసేసరికి ఇంకెవరు చిరిగి పీలకలయిన ఓవరు కోటు వేసుకున్న గవర్నమెంటు గుమాస్తా అకియోవిచ్‌. అతన్ని చూసి భయపడిపోతాడు. మంచులాగునే తెల్లగా చచ్చిన వాడి ముఖంలా కనిపించి ముఖ్యమైన మనిషి వణికిపోతాడు.
''ఓహో చివరికి దొరికావే... నా ఓవరు కోటు పోయిందని మొరపెట్టుకుంటే, గడ్డి పోచంత లక్ష్యం లేకపోయిందే, పైగా నన్ను తిట్టిపోసారు. నీ ఓవరు కోటు నాదే'' అని లాగేసుకుంటుంది అకియోవిచ్‌ దయ్యం. అతిముఖ్యమైన మనిషి పై ప్రాణాలు పైనే పోతాయి. ''వెంటనే బండి ఇంటికి పోనీరు'' అంటూ నడిపేవాన్ని కేకవేసి వణుకుతూ ఇంటికి వస్తాడు. ఘటన అతి ముఖ్యుడైన వ్యక్తిపై ప్రగాఢమైన ప్రభావం కలిగించింది. ఆనాటి నుండి అతడు గుమాస్తాలను తిట్టడం మానేసాడు. గుమాస్తాలు చెప్పే విషయాలు సావధానంగా వినేేవాడు. ఎవరినీ అనవసరంగా గద్దించేవాడు కాదు. ఆనాటి నుండి గవర్నమెంటు గుమాస్తా దయ్యం కనపడడం మానేసింది. అది అతి ముఖ్యమనిషి ఓవరు కోటుతో సంతృప్తి చెంది వుంటుంది. అయినా గానీ ఇదిగో పులి అంటే అదిగో తోక అనేవాళ్లు దయ్యం ఇంకా తిరుగుతుందనే చెప్పుకుంటుండేవారు. గవర్నమెంటు ఆఫీసులో వేళాకోళాలు, ఎగతాళి చేయడాలు ఏవీ ఇప్పుడు జరగడం లేదు.
నూటాయాభై సంవత్సరాలకు పూర్వం రాసిన కథ ఆద్యంతం అందర్నీ చదివిస్తుంది. ఇప్పటికీ అకాకి పాత్రల్లాంటివి మనకు అక్కడక్కడ కనిపిస్తాయి కూడా. దుర్మార్గమైన వారు కూడా వారి హోదా, పదవులవల్ల అలా తయారయ్యారని విశదపరుస్తాడు గోగోల్‌. తప్పు చేసిన వారిలో, దుర్మార్గంగా వ్యవహరించిన వారి అంతరంగంలో తాము చేసింది సరైనది కాదనే భావన వుంటుందని, పరిసరాల ప్రభావంతో మనుషులు మారతారని కథవల్ల తెలుస్తుంది. దయ్యం వల్ల అందరూ మారటంగా మనకు కనిపించినా, అసలు వారి అంతరంగాల్లో వున్న తప్పు చేశామన్న గుబులే మారటానికి అసలు కారణం. వివిధ మనస్తత్వాల చిత్రణ ఎంతోగొప్పగా వుంటుంది. వాతావరణం, సన్నివేశాల వర్ణన మనల్ని అందులోకి తీసుకుపోతుంది. దయ్యం సినిమాలతో అందరినీ భయపెట్టించే మన రాంగోపాల్‌వర్మ గోగొల్‌ సృష్టించిన దయ్యం లాంటి దయ్యాలను సృష్టిస్తే ఎంత బాగుంటుందోనిపించింది.
(రాచకొండ విశ్వనాథశాస్త్రి "అల్పజీవి" నవల, గోగోల్ "ఓవర్ కోటు" స్ఫూర్తితో రాసినదే--అశోకబాబు

No comments:

Post a Comment