Thursday, May 22, 2014

టెలికాం చట్టాల్ని మార్చాలి; నెట్ వర్క్ కంపెనీ, సర్వీసెస్ డెలివరీ కంపెనీలను విడివిడిగాఏర్పాటు చేయాలి –కొత్త ప్రభుత్వానికి డి ఓ టి ప్రతిపాదన

ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, ఇండియన్ వైర్లెస్ టెలిగ్రఫి చట్టం 1933, టి ఆర్ ఏ ఐ చట్టం 1997, కేబుల్ టి వి నెట్ వర్క్(రెగ్యులేషన్) చట్టం 1995, ఐ టి చట్టం 2000 కు బదులు ఒకే చట్టం “కమ్యూనికేషన్స్స్ చట్టం” తేవాలి.ఒకే కంపెనీ టెలికాం, కేబుల్ మరియు బ్రాడ్కాస్టింగ్ సర్వీసులు అందించేందుకు, వీటన్నింటికి కలిపి ఒకే బిల్లు ఇచ్చేందుకు వీలు కలిగించాలి.టెలికాం నెట్ వర్క్సుకు, టెలికాం సర్వీసుల నిర్వహణకు లైసెన్సులు విడిగా ఇవ్వాలి. అంటే నెట్ వర్క్ కంపెనీ విడిగా, సెర్వీసులు అందించే కంపెనీ విడిగా వుండాలి.ఇవి మోడి ప్రభుత్వానికి డి ఓ టి సమర్పించిన ప్రతిపాదనలలో కొన్ని. ఈ ప్రతిపాదనల ఉద్దేశం టెలికాం రంగాన్ని, బ్రాడ్కాస్ట్ రంగాన్ని నాలుగైదు గుత్తసంస్థల ఆధిపత్యం క్రిందికి తేవటమే. వీటిని ఆమోదిస్తే టెలికాం రంగం లో పెను మార్పులు వస్తాయి. బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ లు మరిన్ని ఇబ్బందులనెదుర్కోవాల్సి వస్తుంది.

Wednesday, May 21, 2014

రాబోయే మోడి సర్కారుకు టెలికాం కంపెనీల వినతి –విలీనాలు, స్వాధీనాలు లాభసాటిగా వుండే విధముగా నిబంధనలు సవరించండి!

నష్టాల్లో వున్న ప్రయివేటు కంపెనీలు కొన్నింటిని లాభాలతో నడిచే ప్రయివేటు కంపెనీలు కొనేయాలనుకుంటున్నాయి. కొన్ని ప్రయివేటు కంపెనీలు ఒకదానితో ఒకటి విలీనమయి ఒక పెద్ద కంపెనీగా ఏర్పడాలనుకుంటున్నాయి. దీనికోసం యు పి ఏ ప్రభుత్వము ఒక నిబంధనావళిని రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం స్వాధీనాలు, విలీనాల వలన ఏర్పడే కంపెనీ మార్కెట్ వాటా 50 శాతం (వినియోగ దారులు, ఆదాయం రెండింటిలో) మించకూడదు. స్వాధీనం చేసుకోబడిన లేదా విలీనమయిన కంపెనీలలో దేని స్పెక్ట్రమ్ అయినా ప్రభుత్వ నియంత్రిత ధరకు కొన్నదిగా వుంటే దానికి మార్కెట్ ధరను చెల్లించాలి. 2010 కి ముందు స్పెక్ట్రమ్ ను మార్కెట్ లో వేలం వేయకుండా ప్రభుత్వమే చాలా తక్కువ ధరకు కేటాయించింది. అటువంటి స్పెక్ట్రమ్ కు కలయిక/స్వాధీనం సందర్భముగా మార్కెట్ రేటు (2010, ఆ తరువాత వేలము లో నిర్ణయించబడిన ధర) చెల్లించాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి.

రాబోయే మోడి ప్రభుత్వము ఈ నిబంధనను మార్చి, మార్కెట్ రేటు చెల్లించాల్సిన అవసరం లేకుండా, అసలేమీ చెల్లించాల్సిన అవసరం లేకుండా స్వాధీనం చేసుకున్న లేదా విలీనం చేసుకున్న కంపెనీ యొక్క స్పెక్ట్రమ్ ను బదిలీ చేసేందుకు వీలు కల్పించాలని ప్రయివేట్ టెలికాం కంపెనీలు కోటుతున్నాయి. ఆ మేరకు అవి కేబినెట్ సెక్రెటరీకి 20.5.2014 న మెమోరాండం సమర్పించాయి.

ఈ సమావేశం లో కేబినెట్ సెక్రెటరీ డి ఓ టి ని టెలికాం రంగానికి సంబంధించి కొత్త ప్రభుత్వం తక్షణం శ్రద్ధ పెట్టాల్సిన ఐదు అంశాలపై ఒక పత్రం తయారు చేసి ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది.
 
 
 

Tuesday, May 20, 2014

మోడీ ప్రచార తీరు…. కథా కమామీషు....

దేశంలో బీజేపీ అన్ని సీట్లు గెలవడానికి కారణం ఏమిటీ ? ఎన్నికల ప్రచారంలో మోడీ కీలక పాత్ర పోషించారు. మరి మోడీ ప్రచారం ఏ విధంగా చేశారో తెలుసుకోవాలని ఉందా ?

మ్యాజిక్ నంబరే కాదు.. అంతకు మించిన సీట్లు సాధించింది బిజెపి. ఈ బృహత్కార్యంలో నరేంద్ర మోడీదే కీలక పాత్ర అని ఇటు మీడియానే కాదు.. ఇటు సొంత పార్టీ నేతలు కూడా చెప్పుకొచ్చారు. మోడీ వస్తే తప్ప మార్పు రాదంటూ నినదించారు. ఈ క్రమంలో మోడీని ఇమేజ్ లో ఎలాంటి మార్పులొచ్చాయి? ఎలా వచ్చాయి?
మోడీ గురించి ఏడాది క్రితం మీరేమనుకునే వాళ్లు? ఇప్పుడేమనుకుంటున్నారు? ఇమేజ్ లో మార్పేమన్నా కనిపిస్తోందా? అలా కనిపిస్తే ఎలా సాధ్య పడింది జరిగింది? నరేంద్ర మోడీ తనను తాను బ్రాండింగ్ చేసుకునేందుకు చాలా శ్రమించారా? వందలాది మంది టీమ్ వర్క్ గా పనిచేసి బ్రాండ్ మోడీని క్రియేట్ చేశారా? ఎన్నికలకు ముందు ఏం జరిగింది?

పక్కా ప్లాన్... ఫుల్ మార్కెటింగ్ స్ట్రాటెజీ...

టీ షర్టులు, కాఫీ కప్పులపై, నిలువెత్తు హోర్డింగుల్లో ఆయన ఫోటోలు హడావుడి చేసాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భారీ బడ్జెట్ సినిమా స్టైల్లో, స్టార్ హీరో లెవెల్లో, లార్జర్ దాన్ లైఫ్ కేరెక్టర్ డిజైన్ చేసి జనాల పైకి వదిలారు.. అబ్ కీ బార్ అంటూ గ్యాప్ ఇవ్వకుండా సౌండ్ చేశారు. రేడియోలు, టీవీ ఛానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా... అక్కడా ఇక్కడా అనేది లేదు.. ఏ చోటునీ వదల్లేదు. ఎక్కడ చూసినా అవే సీన్ లు..అవే కాప్షన్ లు..ఒక్క రోజు కాదు.. నెలల తరబడి కాన్సిస్టెంట్ కాంపెయిన్ . ఏ చిన్న పొరపాటూ జరక్కుండా, ప్రత్యర్థికి ఒక్క అవకాశమూ మిగల్చకుండా, కేర్ ఫుల్ గా చేశారు. అన్ని మాధ్యమాలను కవర్ చేశారు. ఇది ఒక్కరితో సాధ్యమా? మోడీ ప్రచారంలో అసలు ఎంతమంది పని చేశారు? ఎవరేం పనిచేశారు...?

ఓ బడా కంపెనీ...

'ఓగిల్వీ అండ్ మాధర్' అనే పేరు ఎపుడైనా విన్నారా? పోనీ, ఈయనెవరో తెలుసా? వీరిద్దరికీ మోడీ ఇమేజ్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అబ్ కీ బార్ మోడీ సర్కార్ ఈ నినాదం తెలుసు కదా.. దాన్ని రాసింది ఈయనే వాల్డ్ క్లాస్ టాప్ ఎడ్వర్టైజింగ్ కంపెనీ ఓగిల్వీ అండ్ మాధర్ క్రియేటివ్ డైరెక్టర్ పియూష్ పాండే.. అంటే ఓ బడా కంపెనీ తమ ప్రచారానికి ఎడ్వర్టైజింగ్ ఏజన్సీని వాడుకున్నట్టు ఇక్కడ మోడీ పంచ్ లైన్ కోసం కూడా వాడారు. మోడీని ప్రొజెక్ట్ చేయడానికి బిజెపి వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని బాగా ఉపయోగించుకున్నారు. ఈయనెవరో తెలుసా మీకు? ప్రసూన్ జోషి.. మెక్ కాన్ వాల్డ్ గ్రూప్ సౌత్ ఆసియా అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ అధ్యక్షుడు, బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషి. ఈయన బిజెపి ప్రచార గీతం రాశారు. వీరిద్దరినే కాదు...ఎందరో నిపుణులను, పలు రంగాల్లో నిష్ణాతులు వందలాది మందిని మోడీ తన ప్రచారంలో, బ్రాండ్ మోడి లో వాడుకున్నారు.

మీడియా..మార్కెటింగ్..అడ్వర్టయిజింగ్..ద్వారా ప్రచారం...

టాగ్ లైన్ లు ప్రచార గీతాలు, టాప్ ఎడ్వర్టైజింగ్ ఏజన్సీలు...ఇంతవరకు చూశాం. కానీ, ఇవన్నీ ఒక చిన్న పీస్ మాత్రమే. ఒక క్యాంపెయిన్ ఎంత పకడ్బందీగా చేయొచ్చో, ఈ ఎన్నికల్లో మోడీ రుజువు చేశారు. టెక్నిక్ గా ఇమేజ్ బ్రాండ్ వాల్యూ సాధించటం ఎలాగో చేసి చూపించారు. ఓ వస్తువుకు బ్రాండ్ ఇమేజ్ కల్పించినట్డానికి బడా కార్పోరేట్ సంస్థలు ఏ విధంగా కృషి చేస్తాయో తెలుసా? కన్స్యూమర్ నాడిని బట్టి, అప్పటికి ఉన్న ప్రత్యర్థుల బలహీనతను తమ బలాన్ని ఒకేలా హైలైట్ చేస్తూ.... మెల్లగా వినియోగదారుణ్ని తమ వల్లో వేసుకుంటాయి. ఇక్కడ బ్రాండ్ మోడి మేకింగ్ లోనూ అదే జరిగింది. ఓ పథకం ప్రకారం మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి విస్తృత ప్రచారం చేసింది. మీడియా, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ ద్వారా మోడీకి ప్రచారం కల్పించడంలో వందకు వంద శాతం సక్సెస్ అయినట్టు ఈ ఎన్నికలు రుజువు చేశాయంటున్నారు విశ్లేషకులు. మోడీ బ్రాండిగ్ కు ఉన్న అన్ని కోణాలను బిజెపీ సమర్థవంతంగా వాడుకుందని పరిశీలకుల అంచనా.

మోడీ వార్ రూం...

మోడీ వార్ రూమ్. అంటే మోడీకి కావాల్సిన సమాచారాన్ని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, టాప్ కాలేజెస్ లో మేనేజ్ మెంట్ చదివినవాళ్లు క్షణాల్లో వెతికి పెడుతారు. అరవింద్ గుప్తా ఆధ్వర్యంలోని ఐటి టీమ్ కనీ వినీ ఎరుగని రీతిలో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసింది. వీళ్లు మాత్రమే కాదు. మోడీ కోసం రేయింబవళ్లు కష్టపడ్డ వారెందరో ఉన్నారు. కేవలం మోడీకి పాజిటివ్ ఇమేజ్ వచ్చేలా, ఓటర్ల మనసు దోచేలా రకరకాల ప్లాన్స్ వేయటమే వీరి పని. ఆన్ లైన్ లో మోడీ గురించి పాజిటివ్ ఒపీనియన్స్ రాయటం, కార్టూన్ లు, గ్రాఫిక్స్ ద్వారా మోడీ పై అభిమానాన్ని పెంచటమే వీరి జాబ్. అయితే వీరే కాదు.. ఈ పనిచేసిపెట్టేందుకు కొన్ని ఫేక్ కంపెనీలూ ఉన్నాయి. అప్పట్లోనే ఆపరేషన్ బ్లూ వైరస్ పేరుతో కోబ్రాపోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్ దీన్ని బట్టబయలు చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లలో ఫేక్ ఐడిలతో దొంగ లైక్ లు, ఫేక్ ఫాలోయర్స్ ని తయారు చేసే కంపెనీల బండారం కూడా బయటపడింది.

భారతీయ ఎన్నికల చరిత్రలో ప్రథమం..

కనిపించే ప్రతి దృశ్యాన్ని, వినిపించే ప్రతి మాటని ఆకర్షణీయంగా మలిచే ప్రయత్నం చేసింది కమల దళం. ఆఖరికి మోడీ హావభావాలు, ధరించే బట్టల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పుడు మోడీ కుర్తాలకు ఓ గుర్తింపు వచ్చింది. ఓ రాజకీయనేతకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడం భారతీయ ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం. ఓ వస్తువును మార్కెటింగ్ చేసిన విధంగా మోడీని మార్కెటింగ్ చేశారంటున్నారు బ్రాండింగ్ నిపుణులు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఆన్ లైన్, సోషల్ మీడియా లాంటి ఏరియాల్లోనే కాదు... ర్యాలీలు నిర్వహించడం, టీ స్టాల్స్ వద్ద వినియోగదారులను ఆకర్షించటం కోసం చాయ్ కప్పులపై మోడీ ఫొటోలు వేశారు. వారణాసి రొట్టెలపై నమో ముద్ర వేశారు.

ఫ్రంట్ పేజీ అడ్వర్టయిజింగ్..

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాష పత్రికల్లో ఫ్రంట్ పేజి అడ్వర్టయిజింగ్ ఇచ్చారు. టీవిల్లో మోడి అడ్వర్టయిజింగ్ మోత మోగింది. నగరాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టారు.. పట్టణాల్లో రేడియో నెట్ వర్క్ ను ఉపయోగించుకున్నారు. డిజిటల్ మీడియాలో మోడీ స్టోరీలు పెట్టారు. ట్విట్టర్ లో హల్ చల్ చేశారు. ప్రీ రికార్డెడ్ వీడియో మెసేజ్ లను మారుమూల గ్రామీణ ప్రాంతాలకు పంపారు. పబ్లిక్ మీటింగ్ లో త్రీడీ హాలోగ్రామ్ ఇమేజ్ సిస్టం ఉపయోగించారు. ఈ రేంజ్ లో ప్రచారం చేయాలంటే ఎంత డబ్బు కావాలి. ఇదంతా లెక్కలో ఉన్నదేనా? లేక వేరే ఎవరన్నా స్పాన్సర్ చేశారా? ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్టు కార్పొరేట్ శక్తులు తెరవెనుక ఉన్నాయా? ఓ పథకం ప్రకారం మోడీని ప్రమోట్ చేసింది అంబానీలు టాటాలే అని చాలా ఆరోపణలున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం బిజెపి 5 వేల నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. ఇందులో మీడియా, అడ్వర్టయిజ్ మెంట్లకే భారీ ఎత్తున బడ్జెట్ కేటాయింపులున్నాయని అంటోంది. వ్యక్తిగత లాభాల కోసం రాజకీయాలను వాడుకుంటున్న ముకేష్ అంబాని మోడీతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తూనే ఉన్నాయి.

బిజెపి వైపు మొగ్గిన బడా కార్పోరేట్లు

ఓ పథకం ప్రకారమే మోడీని కార్పోరేట్ సంస్థలు తెరపైకి తెచ్చాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అవినీతి, కుంభకోణాలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు వ్యతిరేకత ఉండడంతో ఆ పార్టీ అధికారం కోల్పోనుందని గమనించిన బడా కార్పోరేట్లు ప్రత్యామ్నాయంగా బిజెపి వైపు మొగ్గారని విశ్లేషకులు చెబుతున్నారు. తమ స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తమకు అనుకూలంగా ఉండే మోడీని సమర్థించారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంబానీలు, అదానీలు, టాటాలు మోడీకి వంత పాడుతూ, బిజెపి అధికారంలోకి వస్తుందని హైప్ చేసి, బ్రాండ్ మోడి ఇమేజ్ కోసం కార్పోరేట్ మీడియాను వాడుకున్నారనే విమర్శలున్నాయి. మోడీని ఓ ప్రోడక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తూ, చేసిన క్యాంపెయిన్ తో ప్రజల్లో ఈయనో స్ట్రాంగ్ లీడర్ గా ప్రమోట్ అయ్యారని అడ్వర్టైజింగ్ రంగ నిపుణులు కూడా చెప్తున్నారు.

మోడి ఇమేజ్ కోసం బిజెపి పక్కా స్కెచ్...

గుజరాత్ అభివృద్ధి బ్రహ్మండంగా జరుగుతోంది అంటూ మొదలైన ప్రచారం... ఆఖరికి దేశానికి మోడీ తప్ప దిక్కులేదు అనే దిశలోకి టర్న్ తీసుకుంది. ఇదే దిశలో పక్కా ప్లాన్ తో ప్రచారం చేసి బ్రాండ్ మోడీ క్రియేషన్ లో సక్సెస్ అయ్యారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కి రాహుల్ ని ప్రమోట్ చేసుకునే సత్తా ఉన్నా విఫలం కావటం వెనుక కారణాలు అనేకం. మోడీ ఇమేజ్ కోసం బిజెపి పక్కా స్కెచ్ వేసింది. మేనేజ్ మెంట్, ఐటి ఎక్స్ పర్ట్స్, టెక్నాలజీ, కమ్యునికేషన్, ప్రొఫెషనల్ టీమ్స్, ఆర్ఎస్ఎస్ నెట్ వర్క్ కృషి చేశాయి. ఇక కాంగ్రెస్ కు ఖర్చు చేసే స్థోమత ఉన్నప్పటికీ ఆచరణలో విఫలమైదంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రచారం చేసిన ప్రతిచేతికి శక్తి, ప్రతి చేతికి అభివృద్ధి అనే నినాదం మాస్ ని తాకలేకపోయింది.
తనను తాను నేతగా బిల్డ్ చేసుకునేందుకు మోడీ చమటోడ్చినంతగా 2014 ఎన్నికల్లో మరెవరూ చేసి ఉండరు. 3లక్షల కిలోమీటర్ల దూరం, 437 ర్యాలీలు మోడీ స్వయంగా తిరిగారు. ఒక్క యూపి, బీహార్ లోనే, జిపిఎస్ ఉంచిన వాహనాలు మారుమూల పల్లెల్లో మోడీ వీడియోలు, స్పీచ్ లతో ప్రచారం చేశాయి.

బ్రాండ్ మోడీ సామర్ధ్యం ఎంత?

అంబానీలు, అదానీలు ప్రమోట్ చేస్తే ఎదిగిన నేత పనితీరు ఎలా ఉంటుంది? సామాన్యుడి పక్షాన వహించగలడా? అది సాధ్యమా? ఏ వనరులు కొల్లగొట్టడానికి సర్కారు సపోర్ట్ బడా బాబులు ఆశిస్తున్నారో దాన్ని ఇవ్వకుండా మోడీ ఉండగలరా? కార్పొరేట్ ల పెంపుడు నేత సామాన్యుడి ఇంట్లో సభ్యుడు కాగలడా? వేల కోట్ల వ్యాపారాలు ప్రభుత్వాలని నడిపే కాలంలో, దేశానికి పనికొచ్చే పనులు మోడీ చేస్తారా? వాళ్లు చేయనిస్తారా? ఇవన్నీ కళ్లముందున్న ప్రశ్నలు.. వీటికి సమాధానాలు త్వరలోనే తేలిపోతాయి. ప్రోడక్ట్ లాంచింగ్ అయితే, బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పటికి బ్రాండింగ్ కథలో చిన్న విరామం వచ్చింది. మరి బ్రాండ్ మోడీ సామర్ధ్యం ఎంత? పనితనం ఎలా ఉంటుందో ? తొందర్లోనే తెలియబోతోంది. ఊదరగొట్టిన ఉపన్యాసాల్లో నిజం ఎంతో బయటపడనుంది.
(10టి‌వి) 


Sunday, May 18, 2014

ఎన్నికల ఫలితాలు, ఆ తరువాత

2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాజకీయ పరిస్థితిని సమూలంగా మార్చాయి.  1984 తరువాత లోక్ సభలో  ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. కానీ ఇప్పుడు బి జె పి ఒక్క దానికే 282 సీట్లతో పూర్తి మెజారిటీ వచ్చింది. బి జె పి తో సహా  ఎన్ డి ఏ కూటమి కి 333 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా 44 సీట్లు మాత్రమే వచ్చి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. లోక సభ లో ప్రతిపక్ష గ్రూపులేగాని ప్రతిపక్ష పార్టీ అంటూ ఏది వుండదు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటివరకు వున్న రాజకీయ పరిస్థితి మొత్తముగా మితవాదానికి మత వాదానికి అనుకూలముగా లేదు. కానీ ఇప్పుడు మితవాద, మతవాద పార్టీ అయిన బిజెపి కి పూర్తి మెజారిటీ వచ్చింది. (మన దేశ రాజకీయాలలో కాంగ్రెస్  మధ్యేవాద పార్టీగా, బిజెపి మితవాద- మత వాద పార్టీగా, వామ పక్షాలు అతివాద పార్టీలుగా వున్నాయి.). ఇది సమూలమయిన మార్పు.

నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ రంగ సంక్షోభం, అవినీతి వలన ఏర్పడిన తీవ్ర అసంతృప్తి కారణంగా ప్రజలు కాంగ్రెస్ ని చిత్తు చిత్తుగా ఓడించారు. బి జె పి మినహా మరో ప్రత్యామ్నాయం ఏదీ కనిపించనందున ప్రజలకు కాంగ్రెస్ ను ఓడించటానికి బి జె పి ని గెలిపించారు. కార్పొరేట్ మీడియా బిజెపి కి వున్న అవలక్షణాలన్నీ కప్పిపుచ్చింది.  మోడి వస్తే బ్రహ్మాండమయిన అభివృద్ధి జరుగుతుందని, సుపరిపాలన వస్తుందని, అవినీతి వుండదని ప్రచారం చేసింది. ఈ విధమయిన భ్రమలను ప్రజలలో కార్పొరేట్ మీడియా విజయవంతముగా సృష్టించగలిగింది. మరోవంక ప్రజలను , ప్రత్యేకించి యూపీ, బీహార్ లో మతపరమయిన ఉద్వేగాలతో బిజెపి వెనుక సమీకరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు మోడి అనుచరుడు అమిత్ షా ఆధ్వర్యములో జరిగాయి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ వ్యతిరేక వోటు బి జె పి కి భారీ స్థాయిలో లభించింది.

వామపక్షాలు కేరళలో తమ బలాన్ని కొంత పెంచుకోగలిగాయి. త్రిపురలో వున్న రెండు లోక్ సభ  సిట్లలోను  సి పి ఏం మరో సారి మరింత మెజారిటీతో ఘన విజయం సాధించింది. కానీ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాపితముగా భారీ ఎత్తున రిగ్గింగుకు, బెదిరింపులకు, హింసకు పాల్పడినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోటం లో విఫలమయినందున రెండు సీట్లలో మాత్రమే వామ పక్షం గెలవగలిగింది. ఇంతటి అననుకూల పరిస్థితులలో కూడా లెఫ్ట్ ఫ్రంట్ కు  బెంగాల్లో 30 శాతం ఓటింగు వచ్చింది. ఏమయినప్పటికి వామపక్షాలు ఎందుకిలా జరిగిందో, క్రమముగా ఎన్నికల రాజకీయాలలో బలం ఎందుకు తగ్గుతున్నదో  సమీక్షించుకుని సరయిన గుణపాఠం తీసుకుని తగు కార్యాచరణను నిర్ణయించుకోవాల్సిన అవసరం వున్నది.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని చేయగల సమర్థత బాబు-మోడి జోడికి మాత్రమే వున్నదన్న ప్రచారాన్ని, రైతులకు ఋణ మాఫీ తదితర హామీలను  ప్రజలు విశ్వసించి చంద్రబాబుకు పట్టం కట్టారు. రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా అభిమానించి అది కురిపించిన హామీలను నమ్మి తెలంగాణా లో ప్రజలు టి ఆర్ ఎస్ కు  పట్టం కట్టారు. మన రాష్ట్రములో ఎన్నికలలో డబ్బు ప్రభావం విపరితమయింది. పోటీ చేసిన ప్రధాన బూర్జువా పార్టీలు వోటర్లకు డబ్బులు పెద్ద ఎత్తున ఇచ్చాయి. విపరీతముగా డబ్బు ఖర్చు పెట్టాయి. ఇది డబ్బు ఖర్చు పెట్టలేని వామపక్షాలను ఉద్యమం ఒక మేరకు వున్న చోట్లకూడా ఎన్నికల పోటీలో నిలబడటం కష్టమయిన పరిస్థితిని సృష్టించింది. డబ్బు తో వొట్ల కొనుగోలు విధానం ఎన్నికల రంగం నుండి   వామ పక్షాలని తొలగించేందుకు దారి తీస్తున్నది.  ఈ ఎన్నికలలో గమనించాల్సిన ఒక ముఖ్యమయిన విషయం కార్పొరేట్ అధినేతలు, అధిక సంపన్నులు బూర్జువా పార్టీల అభ్యర్థులుగా అత్యధిక స్థానాలలో నిలబడటం. 

కేంద్రం లో గెలిచిన బి జె పి అవినీతి లేని,  దృఢమయిన నిర్ణయాలతో కూడిన సుపరిపాలన అందిస్తానన్నది. అవినీతి విశ్వరూపం ధరించటానికి మూలకారణం నయా ఉదార వాద ఆర్థిక విధానాలు. బి జె పి నయా ఉదార వాద ఆర్థిక విధానాలకు, కాంగ్రెస్ వలెనే, లేదా అంతకన్నా ఎక్కువ, అనుకూలం. అటువంటప్పుడు అది అవినీతిని ఎలా నిర్మూలించగలదు? ఎన్ డి ఎ (వాజపాయి) హయాములో జరిగిన అవినీతి, గుజరాత్ లో జరిగిన అవినీతిని గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడు అవినీతిని నిర్మూలించటానికి మోడి వద్ద వున్న మంత్రదండమేమిటనే సందేహం రాక తప్పదు.దృఢమయిన నిర్ణయాలు ఎవరికోసం ప్రభుత్వం తీసుకోవాలనేదే ప్రధాన సమస్య. ప్రధాన మంత్రిగా మోడి తీసుకోబోయే “దృఢమయిన” నిర్ణయాలు ప్రజలకి అనుకూలముగా వుంటాయా లేక విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్ల దోపిడి మరింత విశృంఖలముగా జరగటానికి అనుకూలముగా వుంటాయా?

ధరల పెరుగుదలని నియంత్రించటం, నల్ల ధనం వెలికి తీయటం, ఆహార భద్రత, సామాజిక న్యాయం, సాధికారికత, మైనారిటీలకు సమాన అవకాశాలు, మధ్యతరగతి ఆశలు నెరవేర్చటం, ఉద్యోగాల కల్పన, దారిద్ర్య నిర్మూలన కార్య క్రమాలు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ప్రజలకు పట్టణ సౌకర్యాలు, పట్టణాలలో ట్రాన్స్పోర్టు మరియు హౌసింగులకు ప్రత్యేక కార్య క్రమాలు, పట్టణ దారిద్ర్య నిర్మూలన కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానం లో ప్రగతి, పిల్లల సంరక్షణ మరియు అభివృద్ధి,సీనియర్ సిటిజన్సు సంరక్షణ మరియు ఆరోగ్య రక్షణ, వికలాంగుల సంక్షేమం, యువజనుల అభివృద్ధి,మహిళా సంక్షేమం, మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్ కు చట్టం చేయటం, విద్యా రంగం అభివృద్ధి,నైపుణ్యం మరియు ఉత్పాదకతల అభివృద్ధి, నాణ్యమయిన వైద్యం తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి తేవటం, ఆర్థిక మాంద్యం తొలగింపు కు తగిన నిర్ణయాలు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ పెట్టుబడి పెంచటం, రైతులకు ఎరువులు విత్తనాలు ఎలక్ట్రిసిటీ తదితరాల ధరల తగ్గింపు,వ్యవసాయ ఖర్చు పై 50 శాతం లాభం గ్యారంటీ చేయటం, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమయిన చర్యలు, చిన్న పరిశ్రమలకు సంరక్షణ,ఎగుమతులకు ప్రోత్సాహం, స్వల్ప ఖర్చుతో అందరికీ గృహవసతి, మౌలిక వసతుల(రోడ్లు, రైలు మార్గం, ఓడ రేవులు, విమానాశ్రయాలు, తేలికమ్యూనికేషన్సు, ఎలక్ట్రిసిటీ మొదలగునవి మౌలిక వసతులు) అభివృద్ధి, వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు,దేశ రక్షణకు దృఢమయిన చర్యలు తదితర హామీలను బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో ఇచ్చింది. కాంగ్రెస్ కూడా దాదాపు ఈ హామీలనే ఇచ్చింది. ఇప్పటివరకు కొనసాగిన కాంగ్రెస్ పాలన రుచి చూసి అంతకుముందున్న బిజెపి పాలన రుచి మర్చిపోయినందున ప్రజలు బిజెపికే మొగ్గు చూపారు. ఏమయినా ప్రజలకి అనుకూలముగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఏర్పడబోయే మోడి ప్రభుత్వానికి వున్నది. ఈ హామీల అమలుకు ప్రభుత్వము పై ఒత్తిడి చేయాల్సిన అవసరం వున్నది.

ఈ హామీల అమలు అలా వుంచితే, బి జె పి తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినదాని  ప్రకారం అది రక్షణ రంగం తో సహా అన్నీ రంగాలకు (మల్టీబ్రాండ్ రిటెయిల్ వ్యాపార రంగం  మినహా) ఎఫ్ డి ఐ ని భారీ ఎత్తున స్వాగతం చెప్పటానికి అనుకూలముగా వున్నది. ప్రభుత్వాన్ని కనీస స్థాయికి కుదించాలని బి జె పి ఎన్నికల ప్రణాళిక ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయటమా? గత ఎన్ డి ఎ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వేస్టుమెంటుకు ఒక ప్రత్యేక శాఖని సృష్టించిందని ఈ సందర్భముగా మనము గుర్తు చేసుకోవాలి. పబ్లిక్  ప్రైవేట్ పార్టీసీపేషన్ తో మౌలిక వసతుల అభివృద్ధి జరగాలని బి జె పి ప్రణాళిక అంటున్నది. దీని  అర్థం ప్రభుత్వ సొమ్ముతో ప్రయివేట్ కార్పొరేట్లు లాభ పడటం. ఇంతేగాక బి జె పి ఎన్నికల ప్రణాళిక  కార్మిక చట్టలకు కాలం చెల్లిందని, వాటిని సంస్కరించాలని అన్నది. కార్మిక చట్టాలను సంస్కరించటం అంటే కార్మికులకు వ్యతిరేకముగా వాటిని మార్చటమే.

బి జె పి ప్రణాళిక ప్రకారం అయోధ్యలో రామ మందిరాన్ని బాబ్రీ మసీదును పడగొట్టిన చోట,  రాజ్యాంగం పరిధిని ఉల్లంఘించకుండా కట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని వుంది. బాబ్రీ మసీదుని పడగొట్టటమే రాజ్యాంగ విరుద్ధమయినప్పుడు అక్కడ మందిరాన్ని కాట్టటం రాజ్యాంగ బద్ధం ఎ విధముగా అవుతుంది? జమ్ము కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కి రాజ్యాంగం లో వున్న ఆర్టీకిల్ 370 ని రద్దు చేయాలని బి జె పి ప్రణాళిక అంటునంది. ఇటువంటి ప్రత్యేక ప్రతిపత్తి మన దేశం లో అనేక ప్రాంతాలకు ఏదో ఒక రూపములో వుండగా కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని మాత్రమే రద్దు చేస్తామనటం మత ప్రాతిపదికన, ఆ రాష్ట్రం లో ముస్లిం లు ఎక్కువ వున్నారనే అక్కసుతో , చేస్తున్నది కాదా? మతం ప్రాతిపదికన ప్రజలని విభజించే, కలహాలు స్ర్రుష్టించే ఇటువంటి అంశాలు బిజెపి ఎన్నికల ప్రణాళికలో వున్నాయి. బి జె పి కి సొంతంగానే లోక్ సభలో మెజారిటీ వచ్చింది కాబట్టి,  ఎన్ డి ఏ కూటమిలో వుంటే వీటన్నింటికి తాను కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి,  ఇప్పటికయినా ఎన్ డి ఏ లో కొనసాగే విషయం చంద్రబాబు పునరాలోచించుకుంటే తెలుగు ప్రజలకు మంచిది.  

ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించాల్సిన అవసరం తక్షణ ఆవశ్యకతగా ముందుకు వచ్చిందని ఈ ఎన్నికలలో విచ్చలవిడిగా చేసిన డబ్బు ఖర్చు, వోటును కొనుగోలు సరుకుగా మార్చిన వైనం స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించటానికి,  (అ)రాజకీయ పార్టీలకు కార్పొరేట్సు ఎన్నికల విరాళాలు ఇవ్వటాన్ని నిషేధించాలి (ఆ) రాజకీయ పార్టీయల కు  ఎన్నికల విరాళం ఇచ్చేబదులు కార్పొరేట్ సంస్థలు  భారత ప్రజాస్వామ్యానికి ఆర్థికముగా తోడ్పడేలా విరాళాలిస్తే బాగుంటుంది. ఈ విరాళాలను ఎన్నికల కమిషన్ లేదా ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్వహించే కార్పస్ నిధికి ఇవ్వాలి.  అనేక పశ్చిమ దేశాలలో వున్నట్లుగా ప్రభుత్వ ఖర్చుల నిర్వహణతోనే ఎన్నికలు జరపాలి. (ఇ) అన్నింటికన్నా ముఖ్యమయినది మన ఎన్నికలలో పాక్షిక దామాషా పద్ధతిని ప్రవేశ పెట్టటం.

మొత్తం వోట్లలో 50 శాతం మించి వచ్చిన అభ్యర్థి గెలిచే విధానం మన ఎన్నికలలో లేదు. పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన వోట్ల ప్రకారం మొదటి స్థానం లో ఎవరు వుంటే వాళ్ళే గెలిచినట్లు లెక్క. కాబట్టి ఈ విధానం డబ్బుతో వోట్లు కొనటానికి దారి తీస్తున్నది. ఇంతేగాక ఈ విధానం ప్రజాభిప్రాయం లో అధిక భాగానికి స్థానం లేకుండా చేస్తున్నది. మిగతా అందరూ అభ్యర్థులకు 30 శాతం కన్నా తక్కువ వచ్చి ఒక అభ్యర్థికి 30 శాతం వస్తే ఆ అభ్యర్థే గెలిచినట్లు లెక్క. 70 శాతం వొట్లకు విలువ లేకుండా పోతున్నది. దీనిని నివారించటానికి పాక్షిక దామాషా పద్ధతి అవసరం.
పాక్షిక దామాషా పద్ధతి లో రెండు లోక్ సభా స్థానాలను కలిపి ఒకటిగా చేసి, ప్రతి ఓటరుకు రెండు వోట్లు ఇవ్వాలి. అందులో ఒక ఓటు నిర్దిష్ట అభ్యర్థికి, రెండో వోటు విధానాలు, కార్యక్రమాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీ కి వేయాలి. దీనికి గాను రాజకీయ పార్టీలు ముందుగానే ఎన్నికల కమిషన్ కు తమ ప్రతినిధుల ప్రాధాన్యతా జాబితాను ఎన్నికల కమిషన్ కు అందజేయాలి. దేశ వ్యాపితముగా ఆ రాజకీయ పార్టీకి వచ్చిన వోట్ల శాతం ప్రకారం అంతకు ముందు సమర్పించిన ప్రాధాన్యతా జాబితానుండి సీట్లు కేటాయించాలి. ఈ విధానం ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించటానికి లేదా తగ్గించటానికి తోడ్పడుతుంది. ఇటువంటి ఎన్నికల పద్ధతికోసం ఎన్నికలలో డబ్బు ప్రభావాన్ని నివారించాలనుకునే వారందరూ ఉద్యమించాలి.

ఈ ఎన్నికల ప్రచారం సందర్భముగా బి జె పి, టిడిపి, టి ఆర్ ఎస్ లు ప్రచారం చేసిన భ్రమలు ఇప్పుడు కాకపోతే తర్వాతైనా పటాపంచలవుతాయి. ఈ ఎన్నికల ప్రచారానికి ఈ పార్టీలకి ఏ కార్పొరేట్సు అయితే ఆర్థిక సాయం అందించారో వారికి రేపు  ఈ పార్టీల ప్రభుత్వాలు అనేక రాయితీలిచ్చి బదులు చెల్లించాల్సి వస్తుంది. ఇంతేగాక ఈ పార్టీల తరఫున గెలిచిన వారిలోనే అనేక మండి కార్పొరేట్ ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు తదితర సంపన్నులున్నారు. ప్రభుత్వ అధికారాన్ని వారు తాము అధిక లాభాలు సంపాదించుకొటానికే ఉపయోగించుకుంటారు. దీని వలన ప్రభుత్వాలు ప్రజలపై మరిన్ని భారాలు మోపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎన్నికల ప్రచారం లో అంతర్లీనముగా సాగిన హిందుత్వ ఎజెండా వలన మన లౌకిక, ప్రజాస్వామిక పునాదులకు మరింత ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. మతోన్మాద శక్తులు మరింత పదును తేలతాయి. ఈ రెండు ప్రమాదాలను ఎలా ఎదుర్కొంటామనే దాని పైనే మన ప్రజల, దేశ భవిష్యత్తు నిర్వచించబడతాయి.

మన దేశ ఐక్యత, సమగ్రత, లౌకిక ప్రజాస్వామిక పునాదులను పటిష్ట పరుస్తూ సామాజిక సామరస్యత కోసం కృషి చేయాల్సిన అవసరం వున్నది.  ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను ప్రతిఘటిస్తూ, ప్రత్యామ్నాయ ప్రజానుకుల విధానాలను ప్రచారం చేసేందుకు, బలపరచేందుకు కృషి చేయాల్సిన అవసరం వున్నది.


Thursday, May 15, 2014

పడిపోతున్న పారిశ్రామిక అభివృద్ధి సూచిక, పెరుగుతున్న ధరలు, రిజర్వు బ్యాంకుకు ప్రభుత్వానికి మధ్య వివాదం

కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం ఫిబ్రవరి 2014 లో పారిశ్రామిక అభివృద్ధి సూచిక 1.8 శాతం తగ్గగా దానిపై మార్చి 2014 లో 0.5 శాతం తగ్గింది. వినియోగదారుల ధరల సూచిక పెరుగుదల మార్చి 2014 లో 8.31 శాతం వుండగా ఏప్రిల్ లో 8.59శాతం పెరిగింది. 5శాతం కన్నా తక్కువ వున్న పెరుగుదల రేటు నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సూచనలు కనిపించటం లేదని ఇది తెలియజేస్తున్నది. సరుకుల తయారీ రంగం లో 11 రంగాలలో అంటే సగం రంగాలలో మార్చి నెలలో క్షీణత కనపడింది. కన్స్యూమర్  డ్యూరబుల్స్ ఉత్పత్తి మార్చి నెలలో 11.8 శాతం పడిపోయింది. ఏప్రిల్ 2013 నుండి మార్చి 2014 వరకు చూస్తే 12.2 శాతం పడిపోయింది.

ఆర్థిక వ్యవస్థ పెరుగుదల లో మాంద్యం సమస్య పరిష్కారం కావాలంటే పారిశ్రామిక వేత్తలకు వడ్డీ రేటు తగ్గించి అప్పులిచ్చి పెట్టుబడులు పెట్టటానికి ప్రోత్సహించాలని, ఇందుకు రిజర్వు బ్యాంకు చొరవ తీసుకుని వడ్డి రేటు తగ్గించాలని ప్రభుత్వం అంటున్నది. వడ్డీ రేటు తగ్గించి అప్పులిస్తే డబ్బు సర్క్యులేషన్ పెరిగి ధరలు మరింతగా పెరుగుతాయని, ఇప్పటికి ద్రవ్యోల్బణం 8 శాతం పైగా వున్నదని, ద్రవ్యోల్బణాన్ని 2015మార్చి నాటికి 8 శాతం కు తగ్గించాలని రిజర్వు బ్యాంకు అంటున్నది. ద్రవ్యోల్బణం తగ్గించాలి కాబట్టి వడ్డీ రేటు తగ్గింపు సాధ్యం కాదని రిజర్వు బ్యాంకు అంటున్నది.

కానీ అసలు సమస్య పెట్టుబడికి అవసరమయిన డబ్బును సప్లై చేయటం కాదు. అసలు సమస్య కొనుగోలు శక్తిని పెంచటం. ప్రజల కొనుగోలు శక్తి తగు స్థాయిలో లేనందున ఉత్పత్తి చేసిన సరుకు అమ్ముడు పోవటం లేదు కాబట్టి పరిశ్రమలలో ఉత్పత్తిని పెంచటం లేదు. ఈ సమస్యని పరిష్కరించకుండా పెట్టుబడిదారులకు తక్కువ వడ్డీకి అప్పులిచ్చినంత మాత్రాన వాళ్ళు ఉత్పత్తిని పెంచుతారా?

కాబట్టి అసలు సమస్య ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకోటం. కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరిస్తుందా? కాంగ్రెస్ గాని, బి జె పి గాని ఏ ఇతర బూర్జువా పార్టీగాని ప్రజల కొనుగోలు శక్తిని పెంచటమే అసలు సమస్య అని గుర్తించటం లేదు. పెట్టుబడిదారులకు రాయితీలిస్తే చాలు, వాళ్ళే దేశాన్ని అభివృద్ధి చేస్తారని అందరూ అదే పాత పాడుతున్నారు. ఇటువంటి రాయితీలను పెట్టుబడిదారులకు నిర్భయముగా తెగింపుతో ఇవ్వగల సమర్థుడు మోడీ అని భారత బడా పెట్టుబడిదారుల భావన. అందుకే వారు మోడీని సమర్థించారు.

కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు అవకాశం కనిపించటం లేదు. తగినన్ని సీట్లు ఎన్ డి ఏ కి వచ్చి మోడి ఏర్పాటు చేస్తాడా లేక ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చి మూడవ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందా? ఏది ఏమయినప్పటికి ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి అవసరమయిన చర్యలు తీసుకోవాలని కొత్త ప్రభుత్వం పై ఒత్తిడి తేవాల్సిన అవసరం వుంది.







Wednesday, May 14, 2014

ఎన్నికల ఫలితాలపై ప్రజాశక్తి దిన పత్రిక అంచనా

(తెలంగాణా లో వోటింగుకు ముందు ఏప్రిల్ 25,26 తేదీలలో జరిపిన సర్వే మరియు ఆంధ్ర ప్రదేశ్ లో 30 ఏప్రిల్ న ఎగ్జిట్ పోల్ సర్వే ఆధారముగా ప్రకటించినది)

తెలంగాణా లోని 119 అసెంబ్లీ మరియు 17 పార్లమెంటు స్థానాల పరిధిలో ఏప్రిల్ 25,26 తేదీలలో ఎన్నికలకు ముందు ప్రజాశక్తి ఐ ఎన్ ఎన్ కలిసి 33236 మంది ఓటర్లతో శాంపిల్ సర్వే నిర్వహించింది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 175 నియోజక వర్గాలలోనూ ప్రతి నియోజక వర్గానికి మూడు మండలాల చొప్పున పోలింగ్ బూత్ నుంచి రాగానే బ్యాలట్  ఇచ్చి ఓట్లు వేయించింది. ఈ సర్వేల ఆధారముగా ప్రజాశక్తి అంచనాలు ఈ క్రింది విధముగా వున్నాయి:

తెలంగాణ
శాసన సభ-- టి ఆర్ ఎస్ కు 60-70; కాంగ్రెస్ కు 21-30; టిడిపి 4-10; బి జె పి 2-5; వై సి పి 3-4; సి పి ఏం 2-3; ఏం ఐ ఏం 5-8; పోటా  పోటీ 19;

లోక్ సభ—టి ఆర్ ఎస్ 6, కాంగ్రెస్ 2, వై సి పి 1, బి జె పి 1, పోటాపోటి 7

ఆంధ్ర ప్రదేశ్

శాసన సభ – వైసీపీ 89; టిడిపి 82; కాంగ్రెస్ 0; జై సమైక్యాంధ్ర-1; ఇతరులు 2;

లోక్ సభ—వైసీపీ 14; టి డి పి 10; కాంగ్రెస్ 0; జై సమైక్యాంధ్ర 0; బి జె పి 1;

ఈ అంచనాలు  ఎంత వరకు నిజమవుతాయో  16 న తెలుసుకుందాం.






Saturday, May 10, 2014

4జి పై వాయిస్ కాల్స్ ను అక్రమంగా అనుమతించటం పై రిలయన్స్ జియోకు, ప్రభుత్వానికి, టి ఆర్ ఏ ఐ కి సుప్రీం కోర్టు నోటీసు

ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్  సర్వీసెస్  లిమిటెడ్ అనే కంపెనీ 2010 లో జరిగిన 4జి స్పెక్ట్రమ్ (2300 ఏం హెచ్ జడ్ బ్యాండ్) వేలం లో ఈ స్పెక్ట్రమ్ ను దేశ వ్యాపితముగా అన్నీ సర్కిల్సుకు కొన్నది. ఇది ఐ ఎస్ పి అనగా ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్ మాత్రమే. ఆ తరువాత ఈ వేలం ముగిసిన కొన్ని రోజులలోనే ఈ కంపెనీని ముకేష్ అంబానీ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ రు. 12750 కోట్లు పెట్టి  కొన్నది.

2013 మార్చి లో ప్రభుత్వము ఈ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ను తన ఐ ఎస్ పి లైసెన్సు ను యూనిఫైడ్ లైసెన్సుగా మార్చుకుని 4జి స్పెక్ట్రమ్ పై డేటా సర్వీసులనేగాక వాయిస్ కాల్స్ సర్వీసులను కూడా అందించేందుకు అనుమతించిది. ఇందుకు రిలయన్స్ జియో ప్రభుత్వానికి చెల్లించింది రు.1658 కోట్లు మాత్రమే. ఇది  టెలికాం సర్వీసు కంపెనీలు దేశం లో అన్నీ సర్కిల్సులో సర్వీసులందించేందుకు చెల్లించాల్సిన లైసెన్సు ఫీజు. ఇది 2001 లో నిర్ణయించబడిన ఫీజు. 2008లో కూడా ఇంత తక్కువ లైసెన్సు ఫీజు తో టెలికాం సర్వీసు కంపెనీలకు కొత్తగా లైసెన్సు ఇవ్వటం దానితోపాటు 2జి స్పెక్ట్రమ్ ఇవ్వటం అక్రమమని చెప్పి సుప్రీం కోర్టు 122 లైసెన్సులను రద్దు చేసింది. అయినప్పటికి ప్రభుత్వము 2013 లో ఇదే స్వల్ప మొత్తం రు.1658 కోట్లు తీసుకుని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు తన 4జి స్పెక్ట్రమ్ పై 2జి వాయిస్ సర్వీసులిచ్చేందుకు అనుమటించింది.

దీనిని సి ఏ జి (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తప్పు పట్టింది. 2010 లో అన్నీ సర్కిల్సులో  3 జి డేటా అండ్ వాయిస్ స్పెక్ట్రమ్ కోసం ఇతర టెలికాం కంపెనీలు రు.33000 కోట్లు చెల్లించగా రిలయన్స్ జియో కు రు.12750 కోట్లతో అన్నీ సర్కిల్సు లో 4జి స్పెక్ట్రమ్ ను డేటా కె గాక వాయిస్ కాల్స్ సర్వీసులకు కూడా అనుమతించటం అక్రమమని సి ఏ జి అన్నది. దీనివలన ప్రభుత్వ ఖజానాకి సుమారు రు.20,000 కోట్లు నష్టం వచ్చిందని సి ఏ జి అన్నది.

ప్రభుత్వ ఖజానాకి  ఈ అక్రమం వలన జరిగిన నష్టాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తెస్తూ “సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్” ఒక పి‌ఐ‌ఎల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ కేసు) ను దాఖలు చేసింది. దీనిపై న్యాయ మూర్తులు హెచ్ ఎల్ దత్తు మరియు ఎస్ ఏ బొబ్డే లతో కూడుకున్న ద్విసభ్య ధర్మాసనం 9.5.2014 న ప్రభుత్వానికి, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు, టి ఆర్ ఏ ఐ కి  నోటీసులు జారీ చేసింది.