Saturday, November 15, 2014

నెహ్రూ,ప‌టేల్:వార‌స‌త్వత‌గాదా

ఈ నెల 14వ తేదీన పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి సందర్భంగా దేశంలో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అది ఇప్పట్లో ఆగేటట్లులేదు. స్వాతంత్య్రోద్యమంలో ఇద్దరు ముఖ్య నాయకులైన నెహ్రూ గొప్పవాడా లేక సర్దార్‌ వల్లభభారు పటేల్‌ గొప్పవాడా అన్నది ఈ చర్చ. నిజానికి ఈ చర్చ ఈ నాటిది కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌, దాని రాజకీయ విభాగమైన బిజెపి (దాని పూర్వ రూపమైన జనసంఫ్‌ు) గతం నుంచీ చేస్తున్నదే. నెహ్రూ కాకుండా పటేల్‌ ప్రధాని అయ్యుంటే కాశ్మీర్‌లో కొంత భాగం పాకిస్థాన్‌కు వెళ్లేది కాదు, భారత దేశం చైనా చేతిలో ఓడిపోయి ఉండేది కాదు, ఈ దేశం రూపు రేఖలు ఇలా ఉండేవి కావు అనేది వీరి వాదన. ఇంకా చెప్పాలంటే, పటేల్‌ ప్రధానయ్యుంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం చెబుతున్న అఖండ భారత్‌ సాధ్యమయ్యేదని ఈ సైద్ధాంతిక ఆలోచన చేస్తున్న వారు నమ్ముతున్నారు. నరేంద్ర మోడీ కూడా ఇటీవల ఒక సభలో ఇదే వాదన వినిపించారు. పటేల్‌ పట్ల వీరికి ఇంతటి విశ్వాసం ఉండడానికి కారణం ఆయన కాంగ్రెస్‌ నాయకుడే అయినా హిందూ మతతత్వవాదం జీర్ణించుకున్న వ్యక్తి. ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి దగ్గరగా ఉంటారు. ముస్లింల పట్ల కించిత్‌ ద్వేషం కలిగి ఉంటారు. పటేల్‌ తన హిందూ మతతత్వ భావాలనూ, ముస్లిం వ్యతిరేకతనూ అనేక సందర్భాల్లో ప్రదర్శించారు. అవన్నీ రికార్డుల రూపంలో ఉన్నాయి. అంతే కాదు మహాత్మా గాంధీని హత్య చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త నాథూరామ్‌ వినాయక్‌ గాడ్సేకు శిక్ష పడకుండా అడ్డుచక్రం వేయడంలో నాడు కేంద్ర హోం మంత్రిగా ఉన్న పటేల్‌ ప్రధాన పాత్ర నిర్వహించారు.
         అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిలూ, వాటి సైద్ధాంతికవేత్తలూ నెహ్రూను తక్కువ చేసి, పటేల్‌ను పైకెత్తడానికి పదేపదే ప్రయత్నిస్తుంటారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో బ్రిటిష్‌ వారికి సహకరించిన ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి జాతీయోద్యమ వారసత్వం లేదు. కనుక దాన్ని కాంగ్రెస్‌ నుంచో, మరో పార్టీ నుంచో తెచ్చుకోవడం మినహా వారికి మరో మార్గం లేదు. అందువల్లనే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం కాంగ్రెస్‌ నాయకత్వంలో తమకు సైద్ధాంతికంగా దగ్గరగా ఉన్న పటేల్‌ను అరువు తెచ్చుకున్నారు.
        నెహ్రూ అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి ఎప్పుడూ ద్వేషమే. ఎందుకంటే ఆయన ఆధునిక భారత దేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య పునాదుల మీద నిలబెట్టడానికి ప్రయత్నించారు. భారత బూర్జువా వర్గంలో లిబరల్‌ సెక్షన్‌కు నాయకత్వం వహించారు. శాస్త్రీయ ఆలోచనలను నమ్మారు. అందువల్ల మతతత్వాన్నీ, మత ఛాందసత్వాన్నీ నిరసించారు. అంతర్జాతీయంగా ఫాసిజాన్ని ద్వేషించారు. సోషలిజాన్ని ఆహ్వానించారు. 1936లో స్పెయిన్‌లో ఫాసిస్టులకు వ్యతిరేకంగా పాపులర్‌ ఫ్రంట్‌ వీరోచిత పోరాటం చేస్తున్నప్పుడు అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లి ఫ్రంట్‌కు మద్దతు తెలపడం ద్వారా ఆయన ఒక గొప్ప ప్రపంచ రాజనీతిజ్ఞుడుగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈ లక్షణాలేవీ ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి నచ్చవు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురువు అయిన గోల్వాల్కర్‌ హిట్లర్‌ భక్తుడు. ఫాసిజాన్ని ఆహ్వానించారు. సోషలిజమంటే వారికి కంపరం. కనుకనే నెహ్రూ అంటే ఆర్‌ఎస్‌ఎస్‌కు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకతే.
ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడం, గతంలోలాగా కాకుండా పూర్తి మెజారిటీ సాధించి అధికార పీఠాన్ని అధిష్టించడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారానికి ధైర్యం వచ్చింది. తన ఎజెండాను నిరాఘాటంగా అమలు చేయడానికి పూనుకున్నది. భారతీయ చరిత్ర గ్రంథాలను మార్చివేయడం, పాఠ్యాంశాలను హిందూ మతపురాణాలతో నింపేయడం, ఆధునికతకు అడ్డుకట్టవేసి బూజుపట్టిన ప్రాచీన భావాలను విజ్ఞానం పేరుతో ప్రజల్లోకి ఎక్కించడం ... వీటితో బాటు ఇటీవలి చరిత్రను కూడా పూర్తిగా తలకిందులు చేయడానికి పూనుకున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ నాయకుడైన పటేల్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ కండువా కప్పి ఆయనను మహాత్మాగాంధీ, నెహ్రూకన్నా గొప్ప నాయకుడుగా చేస్తున్నది. గుజరాత్‌లోని వడోదరా వద్ద నర్మదా నది మధ్యలో పటేల్‌కు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 597 అడుగుల ఎత్తు విగ్రహాన్ని నిర్మించబూనుకున్నది. దీనికి గాను కేంద్ర బడ్జెట్‌లో తొలి దఫాగా రూ.200 కోట్లు కేటాయించింది. పటేల్‌ జన్మదినాన్ని జాతీయ దినంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం దాన్ని దేశ సమైక్య దినంగా జరపాలని ప్రజలను ఆదేశించింది. పటేల్‌ను పొగడడంతో ఆగలేదు. నెహ్రూ వారసత్వాన్ని దేశ ప్రజల మనస్సుల నుంచి చెరిపేయాలన్న ప్రయత్నాలు ప్రారంభించింది. మే నెలలో అధికారంలోకి వచ్చింది లగాయతు దేశంలోని 650 పథకాలు, ప్రాజెక్టులు, సంస్థలకు ఉన్న నెహ్రూ, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు తొలగించాలని నిశ్చయించుకుంది.
           బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారంతో బెంబేలెత్తిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు నెహ్రూ వారసత్వం మాదే అని చాటుకోవడానికి నెహ్రూ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తోంది. గురువారం నాడు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సభకు దేశ, విదేశీ ప్రతినిధులను ఆహ్వానించిన కాంగ్రెస్‌ నాయకులు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీని పిలవలేదు. ఏమంటే, ఆయన నెహ్రూకు వ్యతిరేకి, నెహ్రూ వారసత్వానికి మేమేగాని ఆయన తగడు అని చెబుతోంది. నెహ్రూ ఈ దేశ తొలి ప్రధాని. 1947 నుంచి 64 వరకు దేశాన్ని పాలించారు. అయినా ఆయన 125వ జయంతిని బిజెపి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి నెహ్రూ, పటేల్‌ వారసత్వాల గురించి ఇంతగా కీచులాడుకుంటున్న కాంగ్రెస్‌, బిజెపి రెండూ కూడా ఆచరణలో వారి వారసత్వాన్ని గాలికొదిలేశాయి. కాంగ్రెస్‌ పార్టీ నెహ్రూ వారసత్వం గురించి మాట్లాడే హక్కును 1991లో నూతన ఆర్థిక విధానాలు అమలు చేయడంతోనే కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ దగ్గర ఆయన వారసత్వం ఏమి మిగిలి ఉంది ? నెహ్రూ ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాంగ్రెస్‌ వాటిని బజారులో పెట్టి అమ్మేసింది. ఆయన స్వావలంబన విధానాలు అవలంబించారు. కాంగ్రెస్‌ పార్టీ విదేశీ పెట్టుబడులకూ, విదేశీ వస్తువులకూ ద్వారాలు తెరిచింది. ఆయన స్వతంత్ర అలీన విదేశాంగ విధానానికి పునాదులు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ అలీన విధానానికి తిలోదకాలిచ్చి సామ్రాజ్యవాదులకు దేశాన్ని జూనియర్‌ భాగస్వామిగా చేసింది. ఆయన లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ లౌకికతత్వం విషయంలో ఊగిసలాడుతోంది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోంది. అందువల్ల చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం మినహా ఇప్పుడు కాంగ్రెస్‌ దగ్గర నెహ్రూ వారసత్వం కొద్దిగా కూడా లేదు.
బిజెపి కూడా పటేల్‌ పేరు చెబుతోందే గాని నిజానికి ఆయన ఆశయాలను పాటించడం లేదు. పటేల్‌ మతతత్వానికి అనుకూలుడైతే కావచ్చు. కానీ ఆయన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు. మహాత్మాగాంధీ అనుయాయిగా ఉన్నారు. అందుకే తాను అభిమానించిన గాంధీని హత్య చేసినందుకుగాను ఆర్‌ఎస్‌ఎస్‌ మీద తీవ్రమైన ఆగ్రహం ప్రకటించారు. 1948 జులై 18న ఆయన జనసంఫ్‌ు నాయకుడు డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి గాంధీజీ హత్యపై ఇలా ఉత్తరం రాశారు : 'ఈ రెండు సంస్థల (ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూ మహాసభ) కార్యకలాపాల వల్ల, మరీ ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల వల్ల ఈ దేశంలో ఇటువంటి విషాదం జరగడానికి అవకాశమిచ్చే వాతావరణం ఏర్పడింది. ఈ కుట్రలో హిందూ మహాసభ ప్రమేయం ఉందన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు ప్రభుత్వ, రాజ్య ఉనికికి స్పష్టమైన ప్రమాదంగా మారాయి' (సర్దార్‌ పటేల్‌ కరస్పాండెన్స్‌ : వాల్యూమ్‌ 6, పేజీ 323, నవజీవన్‌-1973). నాడు పటేల్‌ ఏ విదేశీ పాలనకు వ్యతిరేకంగా పోరాడారో నేడు బిజెపి నేతలు ఆ విదేశీ పెట్టుబడులకు దేశాన్ని తాకట్టుపెడుతున్నారు. అమెరికా, జపాన్‌, తదితర దేశాల ప్రాపకం కోసం దేశంలోని కోట్ల మంది ప్రజల ప్రాణాలు బలిపెడుతున్నారు. (స్పష్టమైన ఉదాహరణ, అమెరికా వెళ్లడానికి ముందు ఒబామా సంతృప్తి కోసం మోడీ సర్కారు 100కు పైగా ప్రాణాంతక మందులపై కంట్రోలు ఎత్తేయడం. దానివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు, దేశ ప్రజలకు ప్రాణావసర మందుల ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.) అందువల్ల నెహ్రూ, పటేల్‌ వారసత్వమే కాదు నాటి స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలొడ్డిన అశేష త్యాగధనుల వారసత్వం పొందడానికి కాంగ్రెస్‌, బిజెపి రెంటికీ ఏమాత్రమూ అర్హత లేదు.
           నేడు ఈ చర్చ చేస్తున్న కార్పొరేట్‌ మీడియా ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపిల గురించి కొన్ని నగసత్యాలు మాత్రం చెప్పకుండా దాస్తోంది. అవేమంటే, స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎఎస్‌, హిందూ మహాసభ ఎన్నడూ పాల్గొనలేదు. పాల్గొన్న సావర్కార్‌లాంటి వాళ్లు బ్రిటిష్‌ వారికి లొంగుబాటు పత్రాలు ఇచ్చి జైలు నుంచి తప్పించుకున్నట్లు రికార్డులున్నాయి. పైగా అనేక సందర్భాల్లో సంఫ్‌ు పరివారం బ్రిటిష్‌ వారికి సహకరించినట్లు కూడా దాఖలాలున్నాయి. ఈ విషయాలు చర్చించకుండా మీడియా తప్పిస్తోంది.
           ఇంకో విషయం. కమ్యూనిస్టుల స్వాతంత్య్రోద్యమం వారసత్వం గురించి కూడా కార్పొరేట్‌ మీడియా ఒక్క మాటా చెప్పడం లేదు. నిజానికి 1920 తరువాత కాంగ్రెస్‌ పార్టీలో రాడికలిజం ప్రవేశపెట్టింది కమ్యూనిస్టు పార్టీ. కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ సంపూర్ణ స్వరాజ్యం నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది కమ్యూనిస్టులు. భూస్వామ్య వ్యవస్థను నాశనం చేయడం, కుల పీడనను అంతమొందించడం ద్వారా సమూలమైన సామాజిక మార్పులు తీసుకురావాలన్న ఎజెండాను స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశపెట్టింది కమ్యూనిస్టులు. ఫ్యూడల్‌ దోపిడీకి వ్యతిరేకంగా దేశంలో అనేక చోట్ల రైతాంగ పోరాటాలు నడపడం ద్వారా భూమి సమస్య, గ్రామీణ పేదరికం సమస్య ముందుకు తీసుకువచ్చింది కమ్యూనిస్టులు. దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాల ద్వారా కార్మికుల సమస్య ముందుకు తెచ్చింది కమ్యూనిస్టులు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించింది కమ్యూనిస్టులు. అందువల్ల స్వాతంత్య్ర పోరాట ఉత్తమ వారసత్వాన్ని నెలకొల్పిందీ, నేటికీ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నదీ కమ్యూనిస్టులు మాత్రమే. స్వాతంత్య్రోద్యమంలో ఎటువంటి పాత్రా వహించని, దానికి వ్యతిరేకంగా బ్రిటిష్‌ వారితో కుమ్మక్కయిన, నేటికీ సామ్రాజ్యవాదుల ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న మతతత్వవాదులగానీ, స్వాతంత్య్రోద్యమ వారసత్వాన్ని నేడు సామ్రాజ్యవాదులకు తాకట్టుపెట్టిన కాంగ్రెస్‌గానీ స్వాతంత్య్రోద్యమానికిగానీ, దాని నాయకత్వానికిగానీ ఇంకెంత మాత్రం వారసులు కారు. మీడియాలో వారి కొట్లాటంతా ప్రజలను మోసగించడానికే.
--ఎస్.వెంకట రావు, ప్రజాశక్తి 15.11.2014