Tuesday, September 1, 2015

మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలలో డిమాండ్స్ పరిష్కారానికి ప్రభుత్వము ముందుకు రానందున సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయండి

సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెకి సంబంధించిన 12 డిమాండ్స్ పై ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం కేంద్ర కార్మిక సంఘాలతో ఆగస్టు 26, 27 తేదీలలో రెండు సార్లు చర్చలు జరిపి డిమాండ్స్ పరిష్కరించకుండానే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగుల సంఘాలు తిరస్కరించాయి. సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెని యధాతథంగా జరపాలని పిలుపునిచ్చాయి.

సమ్మె హక్కు తో సహా కార్మిక హక్కులు తొలగించేందుకు ప్రతిపాదించిన చట్టాల సవరణలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వము ఈ చర్చలలో ముందుకు  రాలేదు. రాజస్తాన్, ఛత్తీస్ఘర్, మధ్య ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు కార్మిక హక్కులు తొలగించే విధముగా చట్టాలను ఇప్పటికే ఆమోదించగా వాటిని కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్ర పతి ఆమోదించారు. కార్మిక చట్టలకు తాము ప్రతిపాదించిన సవరణలపై త్రిపక్ష సంప్రదింపులు జరుపుతామని మాత్రమే కేంద్ర ప్రభుత్వము అంటున్నది. కానీ అటువంటి త్రైపాక్షిక సమావేశాలలో ఏకగ్రీవముగా అందరి ఆమోదాన్ని పొందిన ప్రతిపాదనల మేరకు మాత్రమే  చట్టాలను సవరిస్తామని  హామీ ఇచ్చేందుకు తిరస్కరించింది. నామమాత్రముగా త్రైపాక్షిక సమావేశం జరిపి తాను చేయదలచుకున్న కార్మిక వ్యతిరేక సవరణలు చేయటమే ప్రభుత్వ ఉద్దేశమని దీనివలన రుజువవుతున్నది. కార్మిక హక్కులు రద్దు చేసి  కార్మికులను ఉద్యోగులను బానిసలుగా మార్చే  ఈ చట్ట సవరణలకు కార్మిక వర్గం ఎట్టి పరిస్థితిలోను ఆమోదించకూడదు.

ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంట్ ను ఆపేందుకు పూర్తిగా తిరస్కరించింది. 

బోనస్  అర్హతపై వున్న  సిలింగును రు.10,000 లు నుండి రు.21000లు,   లెక్కింపు పై వున్న రు.3500 సిలింగును  రు.7000కు  పెంచే ప్రతిపాదన చేసిందేకాని ఈ సిలింగులను తొలగించాలనే డిమాండుకు ప్రభుత్వము అంగీకరించలేదు. యజమానుల లాభాలపై సిలింగు లేనప్పుడు కార్మికుల బోనస్ పై సిలింగు అసంగతం.

 డి సి ఆర్ జి చెల్లింపు పై వున్న రు.10 లక్షల సిలింగును తొలగించేందుకు, డి సి ఆర్ జి ఫార్ములాని మెరుగు పరచేందుకు అంగీకరించలేదు. 

కనీస పెన్షన్ రు.1000 నుండి రు.3000కు పెంచాలనే డిమాండును అంగీకరించలేదు. 

ఈ పి ఎఫ్ లెక్కింపు పై వున్న రు.15000 వేతన సిలింగును తొలగించేందుకు అంగీకరించలేదు. పెన్షన్ భద్రతకు హామీ ఇవ్వలేదు.

 కనీస వేతనం విషయం లో కొత్తగా ఒక ఫార్ములాని తయారు చేసి దానిప్రకారం చట్టం తెస్తామని ప్రభుత్వము అనటంలో  అర్థం లేదు. 15వ భారత కార్మిక సదస్సు గతం లోనే ఇందుకు సంబంధించి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు ప్రకారం వచ్చేదానికి అదనముగా మరో 25 శాతం కలపాలని సుప్రీం కోర్టు చెప్పింది. దీని ప్రకారం కనీస వేతనాన్ని నిర్ణయించాలని  2012 మరియు 2015లో  జరిగిన 44వ  మరియు 46వ  భారత కార్మిక సదస్సులలో యాజమాన్యాల, ప్రభుత్వాల, కార్మిక సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవ అభిప్రాయానికి వచ్చారు.  దీని ప్రకారం అయితే కనీస వేతనం రు.20,000 లు వుండాలి. కానీ కార్మిక సంఘాలు రు.15,000లు కి తగ్గకుండా కనీస వేతనం వుండాలని కోరుతున్నాయి. ప్రభుత్వము దీనికి అంగీకరించకుండా ఇంకా వేరే ఏదో ఫార్ములాను తాను తయారు చేస్తాననటం, యాజమాన్యాలతో  సంప్రదించిన తరువాత రు.7100లు కనీస వేతనాన్ని ప్రతిపాదిస్తాననటం  అంగీకరించిన దానినుండి వైదొలగటమే.

 కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ కార్మికులతో సమంగా వేతనాలు ఇచ్చేందుకు అంగీకరించకుండా వారికి కనీస వేతనం చెల్లింపు జరిగేలా చూస్తాననటం అర్థరహితం. ఇప్పుడున్న చట్టాల ప్రకారం కాంట్రాక్టు కార్మికులకి కనీస వేతనం చెల్లింపు జరగాల్సిందే.

2013 మరియు 2015 లో జరిగిన 45వ మరియు 46వ భారత కార్మిక సదస్సులు  అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర ప్రభుత్వ స్కీములలో పని చేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం తదితర కార్మిక హక్కులిచ్చేందుకు సిఫార్సు చేశాయి. ప్రభుత్వము కూడా ఈ సిఫార్సు చేయటం లో భాగస్వామిగా వున్నది. కానీ ఈ సిఫార్సు అమలుకు ఈ చర్చలలో ప్రభుత్వము ముందుకు రాలేదు.

నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నప్పటికి ప్రభుత్వము ధరలు తగ్గుతున్నాయని బుకాయిస్తున్నది. ధరలు పెరగకుండా వుండేందుకు నిత్యావసర సరుకుల మార్కెట్లో స్పెక్యులేషన్/ఫార్వర్డ్ ట్రేడింగ్ ను నిషేధించాలని, పౌర సరఫరా  వ్యవస్థను పటిష్టం చేయాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోలేదు.

 ఉద్యోగావకాశాలు పెంచేందుకు నిర్దిష్ట చర్యలు ప్రతిపాదించలేదు.

కాబట్టి ప్రభుత్వ వైఖరి ఏ మాత్రం అనుకూలంగా లేదని, సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెని యధాతథంగా నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు (ఐ ఎన్ టి యు సి, హెచ్ ఏం ఎస్,   ఏ ఐ టి యు సి, సి ఐ టి యు, ఏ ఐ యు టి యు సి, టి యు సి సి, ఎస్ ఇ డబ్లూ ఏ , ఏ ఐ సి సి  టి యు , యు టి యు సి, ఎల్ పి ఎఫ్)  మరియు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, బ్యాంకు ఇన్సూరెన్సు ఉద్యోగుల సంఘాలు, బి ఎస్ ఎన్ ఎల్  ఉద్యోగుల సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 

సమ్మెని వ్యతిరేకించవద్దని బి ఎం ఎస్ కు విజ్ఞప్తి చేశాయి.


సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మెలో పాల్గొందాం, కార్మిక హక్కులు సౌకర్యాలపై దాడిని తిరస్కరించుదాం.