Monday, March 23, 2015

మార్చి 22 బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం మార్చి 23 భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ దేశం కోసం అమరులయిన రోజు

2001 మార్చి 22న విశాఖపట్టణం లో జరిగిన టెలికాం యూనియన్ల జాతీయ సదస్సులో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించింది. బి ఎస్ ఎన్ ఎల్ ను, బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల ప్రయోజనాలను, కార్మిక వర్గ ప్రయోజనాలను,  దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కార్మిక వర్గ ఐక్య పోరాటం ప్రాధాన్యతను గుర్తించి అటువంటి కృషిని కొనసాగించేందుకు ముందుకు తీసుకు పోయెందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పడింది. ఈ సంవత్సరం మార్చి 22 ఆదివారం అయినందున 23వ తారీఖున బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
మార్చి 23 భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు దేశ స్వాతంత్ర్యం కోసం అమరులయిన రోజు. 1931 మార్చి 23న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారత స్వాతాంత్ర్యం కోసం విప్లవమార్గం లో పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరితీశారు. వీరి బలిదానం సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థకి, మతోన్మాదం, కుల తత్వాలకి వ్యతిరేకముగా పోరాడుతున్న భారత కార్మిక వర్గానికి, ప్రజలకు నిరంతర స్ఫూర్తినిస్తున్నది. భగత్ సింగ్ కార్యదర్శిగా ఏర్పడిన “నౌజవాన్ భారత్ సభ” తన మేనిఫెస్టో లో,  “మతోన్మాద భావజాలాన్ని వ్యాపింపజేస్తుంటాయి కాబట్టి మత పరమయిన సంస్థలతో లేదా అటువంటి పార్టీలతో ఎలాంటి సంబంధం పెట్టుకోరాదు” “ మతం అనేది మనిషి యొక్క వ్యక్తిగత నమ్మకమని, అందుకు అనుగుణంగానే మనిషి పూర్తిగా వ్యవహరించాలన్న సాధారణ సహన స్ఫూర్తిని ప్రజలలో కల్గించాలి” అని ప్రకటించింది.
1931 మార్చి లో తన ఉరి శిక్ష అమలుకు కొద్ది రోజులు ముందు భగత్ సింగ్ పంజాబ్ గవర్నర్ కు రాసిన లేఖలో “భారతీయ కార్మిక వర్గాన్ని, వారి శక్తి సామర్థ్యాలని గుప్పెడు మంది పరాన్న జీవులు దోపిడి చేస్తున్నంత కాలం దేశం లో ప్రస్తుతం నెలకొని వున్న యుద్ధ వాతావరణం ఇలా కొనసాగుతూనే వుంటుంది. ఆ పరాన్నజీవులు సంపూర్ణంగా బ్రిటిష్ పెట్టుబడిదారులు కావచ్చు, బ్రిటిషర్లు, భారతీయులు కలిసి కట్టుగా వున్న పెట్టుబడిదారులు కావచ్చు, లేదా సంపూర్ణంగా భారతీయ పెట్టుబడిదారులే కావచ్చు... భారతీయ బ్యూరోక్రాటిక్ వ్యవస్థను ఉపయోగించుకుని వారు తమ దుర్మార్గమయిన దోపిడిని కొనసాగిస్తుండ వచ్చు. కానీ ఇవేవీ ఎలాంటి తేడాను చూపావు. ఈ యుద్ధం కొనసాగుతూనే వుంటుంది. కొత్త శక్తితో సాహసంతో మరింత ఉధృతంగా, సోషలిస్ట్ సమాజం ఏర్పడే వరకు అకుంఠిత అంకిత భావంతో సాగుతుంది” అని అన్నాడు. మార్చి 23, 1931న ఈ ముగ్గురు విప్లవకారులు “సామ్రాజ్యవాదం నశించాలి”, “విప్లవం వర్ధిల్లాలి” అనే నినాదాల మధ్య అమరులయ్యారు. వారి పెదవులపై కదలాడిన ఆఖరు పాట చరణాలు ఇవి:
“దిల్ సే నికలేగీ న మర్ కర్ భీ వతన్ కీ ఉల్ఫత్
మేరీ మిట్టి సే భీ ఖుష్బూయే వతన్ ఆయేగీ”
(మాతృభూమి పట్ల నాకున్న ప్రేమ
నా మరణానంతరం కూడా నా హృదయాన్ని వదిలి పోదు,
దాని సువాసన బూడిదలో సైతం ఉంటుంది )
స్వాతంత్ర్యం, లౌకిక వాదం, సోషలిజం ఇవి ఈ అమరుల ఆశయాలు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి విప్లవకారులు జరిపిన పోరాటాలు, మహాత్మా గాంధీ మరియు  కాంగ్రెస్ నాయకత్వం లో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమం, ఆ ఉద్యమం లో భాగస్వాములుగా వుంటూ కమ్యూనిస్టులు నిర్వహించిన అనేక కార్మిక వర్గ మరియు రైతాంగ   పోరాటాలు వీటన్నింటి ఫలితముగా 1947 ఆగస్టు 15 న మనకు స్వాతంత్ర్యం వచ్చింది.  స్వాతంత్ర్య ఉద్యమ ప్రభావం వలన, కార్మిక రైతు  ఉద్యమాల వలన  స్వతంత్ర భారత దేశం లౌకిక రాజ్యముగా, పార్లమెంటరీ ప్రజాస్వామిక రాజ్యముగా  అవతరించింది. కార్మికుల హక్కులు కాపాడే చట్టాలు వచ్చాయి. రాజ్యం సంక్షేమ రాజ్యముగా వుండాలని, ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించాలని అనక తప్పని పరిస్థితి, ఆ దిశలో కొంత ముందుకు అడుగెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. పంచవర్ష ప్రణాళికలు వచ్చాయి. ప్రభుత్వ రంగం బలంగా రూపొందింది. మన దేశాన్ని సోషలిస్టు దేశముగా రాజ్యాంగం ప్రకటించింది. అమెరికా కి ఉపగ్రహం లాగా కాకుండా స్వతంత్రముగా వ్యవహరించే విదేశాంగ విధానం అమలులోకి వచ్చింది.
కానీ పాలకులు పెట్టుబడిదారుల, భూస్వాముల ప్రయోజనాలకే అంటిపెట్టుకుని దేశాభివృద్ధికి నెరవేర్చాల్సిన కర్తవ్యాలను సక్రమముగా నెరవేర్చనందున  ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో పడింది.  దానిని అధిగమించే పేరుతో 1991 లో పి.వి.నరసింహారావు ప్రభుత్వము నూతన ఆర్థిక విధానాలను ప్రకటించింది. అప్పటినుండి సరళీకృత ఆర్థిక విధానాలు దశలవారిగా అమలు జరుగుతూ వచ్చాయి. కానీ ఈ విధానాల వలన పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. ఈ విధానాల వలన స్వాతంత్ర్యోద్యమం మరియు కార్మిక, రైతాంగ పోరాటాలు సాధించిన విజయాలు క్రమముగా మసిబారుతున్నాయి.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వము సరళీకరణ విధానాలను అమలు చేసినందున, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినందున ప్రజలు దానిని ఓడించారు. కానీ దాని స్థానములో వచ్చిన నరేంద్ర మోడి బి జె పి ప్రభుత్వము అంతకన్నా ఘోరముగా  ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది.  మోడీ హయాములో కార్పొరేట్ ఉన్మాదము  మరియు మతోన్మాదం ప్రబలుతున్నది. అనేక రంగాలలో దేశ ప్రయోజనాలకు హాని కలిగించే విధముగా విదేశీ పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలుకుతున్నది. కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకముగా విదేశీ స్వదేశీ బడా పెట్టుబడిదారులకు అనుకూలముగా మారుస్తున్నది. ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను పెద్ద ఎత్తున డిజిన్వేస్టుమెంటు చేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. కార్పొరేట్సుకు విపరితమయిన రాయితీలిస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నది. ప్రజా సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు కోత పెడుతున్నది. విదేశాంగ విధానాన్ని మరింతగా అమెరికా కి అనుకూలముగా మారుస్తున్నది. మరో వంక మతోన్మాద శక్తులు విజృంభించేందుకు తోడ్పడుతున్నది. మూఢనమ్మకాలు పెంచే విధముగా బాధ్యతగల ప్రధాన మంత్రి తదితరులే మాట్లాడుతున్నారు. మెజారిటీ మతోన్మాదాన్ని చూపించి మైనారిటీ మతోన్మాదం, దానిని చూపించి మెజారిటీ మతోన్మాదం ఒకదాని ఆసరాతో మరొకటి పెరుగుతున్నాయి. ఒక మతంలో వుండే కొందరి  నమ్మకాల  కోసం అదే మతం లో వున్న వారి మరియు ఇతర మతాల వారి ఆహార అలవాట్లపై దాడి జరిగే విధముగా కొన్ని రాష్ట్రాలలో చట్టాల సవరణ జరుగుతున్నది.
కార్పొరేట్ ఉన్మాదం మతోన్మాదం కలిసి పరిస్థితిని క్షీణింపజేస్తున్నాయి. ఈ క్రమం లో భాగంగానే ప్రభుత్వ రంగం పై దాడి తీవ్రమవుతున్నది. టెలికాం రంగం లో వున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఐ టి ఐ, ఏం టి ఎన్ ఎల్, బి ఎస్ ఎన్ ఎల్ లు నష్టాలలో కొనసాగుతున్నా వాటి పునరుద్ధరణకు అవసరమయిన చర్యలను మోడీ ప్రభుత్వము తీసుకోటం లేదు. ఐటిఐ ని 2004 లోనే ఖాయిలా పడిన సంస్థగా ప్రకటించారు. ఆ సంస్థ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వము ఇచ్చే సహాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎం టి ఎన్ ఎల్ ను ఇటీవలే ఖాయిలా పడిన సంస్థగా ప్రకటించారు. బి ఎస్ ఎన్ ఎల్ కూడా ఈ పరిస్థితికి చేరువయింది. కానీ బి ఎస్ ఎన్ ఎల్ ను పునరుద్ధరించేందుకు అవసరమయిన చర్యలను మోడి ప్రభుత్వము తీసుకోటం లేదు. గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వస్తున్న నష్టాలకి పరిహారం చెల్లిస్తామని బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పడిన సందర్భముగా ఇచ్చిన హామీని అమలు చేయుటకు నిరాకరిస్తునంది. సరేందర్ చేసిన బి డబ్ల్యూఏ స్పెక్ట్రమ్ కు కాను బి ఎస్ ఎన్ ఎల్ కు వాపస్సు చేయాల్సిన రు.6724 కోట్లను ఒక్క సారిగా చెల్లించకుండా 2014-15 బడ్జెట్ లో రు.100 కోట్లు, 2015-16 బడ్జెట్ లో రు 830 కోట్లు మాత్రమే కేటాయించింది. బి ఎస్ ఎన్ ఎల్ కు పునరుద్ధరణకు అవసరమయిన చర్యలను యూనియన్సు తో చర్చించి నిర్ణయించాలని విజ్ఞప్తి చేసినా మోడీ ప్రభుత్వము పట్టించుకోటం లేదు. అదే సందర్భం లో విదేశీ స్వదేశీ బడా పెట్టుబడిదారులు నిర్వహిస్తున్న ప్రయివేటు టెలికాం కాంపెనీల ప్రతినిధులతో అనేక సమావేశాలు నిర్వహించింది.
 బి ఎస్ ఎన్ ఎల్  అవసరం ఒక్క బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులకు మాత్రమే కాదు. ప్రజలకు టెలికాం సౌకర్యాలు తక్కువ రేటుకు అండేందుకు,  దేశ భద్రత రీత్యా కూడా బి ఎస్ ఎన్ ఎల్ ఒక బలమయిన ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాల్సిన అవసరం వున్నది.  అంతా విదేశీ పెట్టుబడిదారులు భాగస్వాములుగా వున్న ప్రయివేటు టెలికాం కంపెనీలకే వదిలేస్తే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వము ఆధారపడ దగిన టెలికాం సేవల సంస్థ అంటూ లేకుండా పోతుంది. ఇంతేగాక బి ఎస్ ఎన్ ఎల్ లేకుంటే ప్రయివేటు టెలికాం కంపెనీలు కుమ్మక్కై రేట్లు పెంచుతాయి. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ ను, ప్రభుత్వ రంగాన్ని కాపాడటం బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల దేశభక్తి యుత కర్తవ్యం.
బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడుకునేందుకు ఏప్రిల్ 21,22న జరుగు రెండు రోజుల సమైక్య సమ్మేని ఉద్యోగుల, అధికారుల సంఘాలన్నింటిని కలుపుకుని  జయప్రదం చేసే కర్తవ్యానికి పునరంకితమవుదాం.
భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల వర్ధంతి మార్చి 23 సందర్భముగా మన దేశ స్వాతంత్ర్యాన్ని, సార్వ భౌమత్వాన్ని, లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ రంగాన్ని, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని,  ప్రజా సంక్షేమాన్ని, కార్మిక హక్కులను కాపాడుకునే కర్తవ్యాన్ని మరింత పట్టుదలతో నెరవేర్చేందుకు అంకితమవుదాం.




Monday, March 2, 2015

మోడి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ప్రభుత్వ రంగ వ్యతిరేక, ఎస్ సి /ఎస్టీ/మహిళ/శిశు వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా 3.3.2015న భోజన విరామ సమయం లో ప్రదర్శనలు నిర్వహించండి --బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్


మోడీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో 28.2.2015న ప్రవేశ పెట్టిన 2015-16 సంవత్సరపు బడ్జెట్ ఉద్యోగులకు, కార్మికులకు, ప్రజలకు, ఎస్ సి/ఎస్టీ/మహిళా/శిశు తదితర బలహీన తరగతులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు   పూర్తి వ్యతిరేకముగా వున్నది. స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు, సంపన్నులకు పూర్తి అనుకూలముగా వున్నది.

స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు సంపన్నులకు 2014-15 లో మోడీ ప్రభుత్వము ఇచ్చిన రాయితీల విలువ రు 5,89,285.20 కోట్లు. ఇది ఆ సంవత్సరపు బడ్జెట్ లోటు రు.5,55,649 కోట్లకన్నా ఎక్కువ. కాబట్టి బడ్జెట్ లోటుకి కారణం సంపన్నులకిచ్చిన అనుచిత రాయితీలే. ఇప్పుడు 2015-16 బడ్జెట్ లో కూడా ఇదే ధోరణిని మోడీ ప్రభుత్వము కొనసాగిస్తున్నది. రు. 5 లక్షల కోట్లకు మించిన ఈ భారీ రాయితీలను కొనసాగిస్తూనే ఈ బడ్జెట్ లో అదనముగా  సంపన్నులకు ప్రత్యక్ష పన్నులలో రు. 8315 కోట్లు రాయితీనిచ్చింది. ఇంతేకాక సంపద పన్నును పూర్తిగా రద్దు చేసింది. కార్పొరేట్ కంపెనీల లాభాలపై వేసే కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి దశలవారిగా 25 శాతం కు నాలుగు సంవత్సరాలలో తగ్గిస్తామని ప్రకటించింది. ఎఫ్ డి ఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) మరియు ఎఫ్ ఐ ఐ (విదేశీ సంస్థాగత పెట్టుబడి) లకు అనేక రాయితీలిచ్చింది. వాటాల అమ్మకం వలన వచ్చే లాభాలపై పన్ను (క్యాపిటల్ గెయిన్స్ టాక్స్) చెల్లింపునుండి మినహాయింపునిచ్చింది.

ఈ విధముగా స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు, సంపన్నులకు లక్షలాది కోట్ల అనుచిత రాయితీలిచ్చి అందువలన బడ్జెట్ లో ఏర్పడే లోటును భర్తీ చేసే పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మి (డిజిన్వెస్ట్మెంట్) తద్వారా రు.70,000 కోట్లు ఆదాయం సమకూర్చాలని, ప్రజలు వాడుకునే సరుకులపై పన్నులు (పరోక్ష పన్నులు) పెంచి తద్వారా అదనముగా రు.23383 కోట్లు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. లోటును తగ్గించేందుకు ప్రజా సంక్షేమానికి పెట్టె ఖర్చును (సబ్సిడీలను)  తగ్గించాలని నిర్ణయించింది.  గత సంవత్సరం (2014-15) లోనే ప్రభుత్వ ఖర్చును బడ్జెట్ లో కేటాయించినదానిలో 7 శాతం (రు. 1,14,000 కోట్లు) తగ్గించారు. గత సంవత్సరం 2014-15 లో ప్రభుత్వ ఖర్చుకు బడ్జెట్ కేటాయింపు జి డి పి (స్థూల జాతీయ ఉత్పత్తి) లో 10.8 శాతం కాగా ఇప్పుడు 2015-16 బడ్జెట్ లో 10.3 శాతం కు తగ్గింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి, ఆహార భద్రత పథకానికి కేటాయింపు ల నిజ విలువ పెరగకుండా స్తబ్ధముగా వున్నది. మొత్తం సబ్సిడీలు గత బడ్జెట్ లో జి డి పి లో 2.1 శాతం (రు. 2.60 లక్షలు)  కాగా ఇప్పుడు ఈ బడ్జెట్ లో 1.7 శాతం ( 2.44 లక్షలు)కు కుదించారు. ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమానికి గత బడ్జెట్ లో రు. 35,163 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్ లో రు.29,653 కోట్లు మాత్రమే కేటాయించారు. గృహనిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలనకు గత బడ్జెట్ లో రు.6008 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్ లో రు.5634 కోట్లు మాత్రమే కేటాయించారు.

మోడీ బడ్జెట్ ఎస్ సి/ఎస్ టి/మహిళా/శిశు తదితర బలహీన తరగతులకు వ్యతిరేకముగా వున్నది.  ట్రైబల్ సబ్ ప్లాన్ కు కేటాయింపు గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ లో రు.5000 కోట్లు తగ్గింది. బడ్జెట్ లో ట్రైబల్ సబ్ ప్లాన్ కు 8.2 శాతం కేటాయించాలనే నిబంధనను ఉల్లంఘించి 5.5 శాతమే కేటాయించారు. ఎస్ సి సబ్ ప్లాన్ కు 17 శాతం కేటాయించాలనే నిబంధనను ఉల్లంఘించి 8.34 శాతమే (కేటాయించాల్సిన దానికన్నా రు.12000 కోట్లు తక్కువ) కేటాయించారు. మహిళా సాధికారికత మరియు అభ్యుదయానికి కేటాయించే జండర్ బడ్జెట్ కేటాయింపును గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్ లో 20 శాతం (రు.20,000 కోట్లు) తగ్గించారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐ సి డి ఎస్) కు గత సంవత్సరం రు. 16,000 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం (2015-16) అందులో సగం రు.8000 కోట్లు మాత్రమే కేటాయించారు.

ఈ బడ్జెట్ లో అనేక ప్రతిపాదనలు ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకముగా వున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంట్ ను పెద్ద ఎత్తున అమలు చేయాలని ప్రతిపాదించింది. గతం లో ఎన్నడూ లేనంతగా, రు.70,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వేస్టుమెంటు ద్వారా 2015-16 సంవత్సరం లో సంపాదించాలని నిర్ణయించింది. ఇంతేగాక ప్రభుత్వ శాఖల ఆధీనములో వున్న ఓడ రేవులను కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించింది. వాటి ప్రయివేటీకరణకి ఈ విధముగా పునాది వేస్తున్నది. ఈ విధముగా ప్రభుత్వ రంగం పై పెద్ద దాడిని ప్రకటించింది. ఇన్కమ్ టాక్స్ మినహాయింపు పరిమితిని పెంచకుండా మధ్యతరగతి ఉద్యోగులను నిరుత్సాహపరచింది. ఈపీఎఫ్ అమలు జరుగుతున్న ఉద్యోగులను అది సరిగా పని చేయటం లేదనే సాకుతో దానినుండి తప్పించి నూతన పెన్షన్ విధానం కు దారి మళ్లించే ప్రయత్నం ఈ బడ్జెట్ లో కనపడుతున్నది. ఈ పి ఎఫ్ కు గాని లేదా నూతన పెన్షన్ విధానానికి గాని ఆప్షన్ ఇచ్చే అవకాశం ఇస్తామని బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ పి ఎఫ్ నిధులను షేర్ మార్కెట్ జూదానికి ఎరగా వేసే అవకాశం అంతగా లేదు. అదే నూతన పెన్షన్ విధానమయితే ఉద్యోగుల పెన్షన్ కంట్రిబ్యూషన్ నిధులను పెన్షన్ ఫండ్ కంపెనీలు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్ట వచ్చు. పెన్షన్ ఫండ్ కంపెనీలకు నష్టాలు వస్తే పెన్షన్ రాని పరిస్థితి నూతన పెన్షన్ విధానం లో ఎదురవుతుంది. ఇదే విధముగా  ఈ ఎస్ ఐ గాని ఆరోగ్య బీమా పథకానికి గాని ఆప్షన్ ఇస్తామని బడ్జెట్ ప్రతిపాదించింది. ఆరోగ్య నిధులను కూడా ఇన్సూరెన్సు కంపెనీల జూదానికి  మళ్లించే ప్రయత్నం ఇది.

మోడీ ప్రభుత్వ బడ్జెట్ నష్టాలలో వున్న ప్రభుత్వరంగ సంస్థలను ఆడుకునేందుకు ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. నష్టాలలో వున్న ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంటును ప్రతిపాదించింది. ఈవైఖరి బిఎస్ఎన్ ఎల్ పునరుద్ధరణకు వ్యతిరేకముగా వున్నది. బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను వాపసు చేసినందుకు గాను అందుకు చెల్లించిన రు.6724 కోట్ల రూపాయిలను ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు వెంటనే తిరిగి ఇవ్వాలని మనము డిమాండ్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వము ఈ బడ్జెట్ లో ఇందుకుగాను కేవలము రు.830 కోట్లు మాత్రమే కేటాయించింది(2014-15 లో రు.100 కోట్లే చెల్లించింది). జబ్బు పడిన సంస్థగా ప్రకటించబడిన ఐటిఐ కి ఉద్యోగుల జీతాల చెల్లింపుకు మద్దతుగా రు. 150 కోట్లు, పునరుద్ధరణకు 50 కోట్లు  కేటాయించింది(గత సంవత్సరం జీతాల చెల్లింపుకు మద్దతుగా రు.165 కోట్లు కేటాయించింది. పునరుద్ధరణకు రు.460 కోట్లు కేటాయించి ఆ తరువాత దానిని రు.192 కోట్లకే కుదించింది).  కానీ ఆ సంస్థ పునరుద్ధరణకు రు. 4157 కోట్లు తో ఒక ప్యాకేజీని గత యు పి ఏ ప్రభుత్వము 12.2.2014న ఆమోదించినప్పటికి , ఈ పునరుద్ధరణ పథకాన్ని 18 నెలలలో  అమలు చేయాలని నిర్దేశించినప్పటికి అందుకవసరమయిన నిధులను కేటాయించలేదు. ప్రభుత్వ రంగ సంస్థల పునరుద్ధరణ పట్ల మోడి ప్రభుత్వానికి ఏ మాత్రమూ ఆసక్తి లేదని ఈ బడ్జెట్ కేటాయింపులు రుజువు చేస్తున్నాయి. అదే సందర్భములో ప్రయివేట్ టెలికాం కంపెనీలు వోడాఫోన్ మొదలగునవి చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయిల క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ను వదులుకోటానికి మోడి ప్రభుత్వము సంసిద్ధమయింది. 

మోడీ బడ్జెట్  గత యు పి ఏ ప్రజా వ్యతిరేక విధానాలనే మరింత జోరుగా అమలు జేసేదిగా వున్నది. విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు మరిన్ని రాయితీలిస్తేనే వారు వచ్చి పెట్టుబడులు పెట్టి దేశాన్ని అభివృద్ధి చేస్తారని దాని వలన ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరుగుతాయనే  తర్కం దీని వెనుక వున్నది. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా పెట్టుబడిదారులకు రాయితీలిచ్చి ఉత్పత్తిని పెంచినా పెంచిన ఉత్పత్తిని అమ్మేదెలా? కాబట్టి ప్రజల కొనుగోలు శక్తిని పెంచకుండా ఉత్పత్తి నిరంతరాయముగా పెరగటం సాధ్యము కాదు. ప్రపంచ వ్యాపితముగా ఆర్థిక మాంద్యం మరి కొన్ని సంవత్సరాలు కొనసాగే పరిస్థితిలో మన ఉత్పత్తులను ఇక్కడి ప్రజలు కొనలేక పోయినా విదేశాలలో అమ్మటం కూడా సాధ్యం కాదు. అందుకనే మన ఎగుమతుల రంగం మాంద్యం లో వున్నది. కాబాట్టి స్వదేశీ విదేశీ బడా పెట్టుబడిదారులకు భారీ స్థాయిలో అనుచిత రాయితీలిచ్చే విధానం, అందుకోసం ప్రజలకిచ్చే సబ్సిడీలను, సంక్షేమ పథకాలను కత్తిరించి వారి కొనుగోలు శక్తిని మరింత క్షీణింపజేయటం మంచిది కాదు. కార్పొరేత్సుకిచ్చే లక్షలాది కోట్ల అనుచిత రాయితీలను రద్దు చేసి ఆ నిధులను ప్రజా సంక్షేమానికి, మౌలిక వసతులు అమృయు వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఖర్చు పెడితే ఆర్థిక ప్రగతి, ఉద్యోగ అవకాశాల పెరుగుదల తప్పకుండా సాధ్యమవుతుంది. కానీ ఎన్నికలలో తనకి మద్దతునిచ్చిన కార్పొరేత్సు రుణం తీర్చుకునేందుకు మోడీ వారికి భారీ రాయితీలిచ్చి ఆ భారాల్ని ప్రజలపై, ఉద్యోగులపై, కార్మికులపై, ప్రభుత్వ రంగా సంస్థాలపై మొపే పనిలో వున్నాడు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కార్మికు, ఉద్యోగులు, ప్రజలు  ప్రతిఘటించాలి. ప్రజానుకుల ఆర్థిక విధానాల కోసం  పోరాడాలి.

ఈ పోరాటం లో భాగంగా , మోడి ప్రజా వ్యతిరేక బడ్జెట్ కు నిరసనగా 3.3.2015న ప్రదర్శనలు జరపాలని బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ హెడ్ క్వార్టర్సు పిలుపునిచ్చింది. ఈ పిలుపుననుసరించి అన్నీ జిల్లా కేంద్రాలలో, ఇతర ముఖ్యమయిన కేంద్రాలలో ప్రదర్శనలు నిర్వహించాలని సర్కిల్ యూనియన్ విజ్ఞప్తి చేస్తున్నది
.
అభినందనలతో
బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్