Tuesday, May 5, 2015

అంబేద్కర్‌పై కాషాయ పడగనీడ

 భారతదేశ ఎన్నికల మార్కెట్లో ప్రవేశపెట్టబడిన వివిధ రాజకీయ ప్రారిశ్రామికవేత్తలు తయారుచేసిన అంబేద్కర్‌ ప్రతిమలు అసలు అంబేద్కర్‌ను మసకబారుస్తున్నాయి. అవి దళితుల విమోచనకు ఉపయోగపడే రాజకీయ ఆయుధాల్ని నాశనం చేస్తున్నాయి. ఈ ప్రతిమల మధ్య ఛాయలో తేడాలున్నప్పటికీ ఇవన్నీ అంబేద్కర్‌కు నయా ఉదారవాదరంగు పులుముతున్నాయి.

 అంబేద్కర్‌ దళితులందరికీ ఆరాధ్యదైవం అయ్యాడనటంలో సందేహం లేదు. ఆయన వారికోసం ఏక వ్యక్తిగా, ఏకైక ధ్యేయంతో చేసిన కృషికి వారలా భావించటం సహజం. అది నిజమైనప్పటికీ అంబేద్కర్‌ను పూజ్యనీయుడిగా ప్రతిష్టించటంలోనూ, ప్రోత్సహించటంలోనూ పాలకవర్గాలు ఉత్ప్రేరక పాత్ర పోషించాయి. ఈ మధ్యకాలంలో బిజెపి అంబేద్కర్‌ను బాహాటంగా సొంతంచేసుకోవాలనే ప్రయత్నాల వెనుక కారణాల గతిశీలతను దళితులు అర్థంచేసుకోవాల్సి వుంది.

పూజ్యనీయునిగా...

                   రాజకీయ హిందూకు ప్రాతినిధ్యంవహిస్తున్న కాంగ్రెస్‌ అంబేద్కర్‌కు ప్రధాన ప్రత్యర్థి. 1932లో జరిగిన రౌండు టేబుల్‌ సమావేశంలో దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటుకు అంబేద్కర్‌ చేసిన ప్రయత్నాలను గాంధీ తీవ్రంగా వ్యతిరేకించటమే కాకుండా, దళితుల స్వతంత్ర రాజకీయ అస్తిత్వం ఏర్పడే సాధ్యతను శాశ్వతంగా దూరంచేసిన పూనా ఒడంబడిక చేసుకునేలా ఆయనపై ఒత్తిడి చేశాడు. అధికారం బదిలీ అయిన తరువాత అంబేద్కర్‌ను రాజ్యాంగ పరిషత్తులోకి ప్రవేశించకుండా కాంగ్రెస్‌ చేయగలిగిందంతా చేసింది. కానీ అంతలోనే అది ప్లేట్‌ మార్చింది. వివరణ కోసం పిట్టకథలు ఎన్నిచెప్పినా రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశించే అవకాశంలేని అంబేద్కర్‌ను ఎన్నికయ్యేలా చేసి, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడయ్యేలా చూడటం వెనుక గాంధీ వ్యూహాత్మక మేథస్సు వుంది. రాజ్యాంగంలో దళితుల హక్కులకు భద్రత కల్పించినందుకు ప్రతిగా అంబేద్కర్‌ ఒక రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించాడు. ఆ సౌభ్రాతృత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. హిందూ కోడ్‌ బిల్లు విషయంలో తిరోగమన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నెహ్రూ మంత్రివర్గంనుంచి అంబేద్కర్‌ వైదొలిగాడు. ఆ తరువాత తనను ఒక కూలీగా వాడుకుని వదిలేశారని, ఈ రాజ్యాంగం ఎవరికీ పనికిరానిదని, దానిని కాల్చటానికి తాను ప్రథముడిననీ అంబేద్కర్‌ అన్నాడు. కాంగ్రెస్‌ ఒక తగలబడుతున్న గృహంలాంటిదని, దానిలోకి ప్రవేశిస్తే దళితులు ప్రమాదంలో పడతారని ఆయన పేర్కొన్నాడు. అయితే అనేకమంది 'అంబేద్కరైట్స్‌' కాంగ్రెస్‌లో చేరటానికి, 'అంబేద్కరిజానికి' సేవచేయటానికి ఆయన వ్యాఖ్యలు వారినేమీ నిరుత్సాహపరచలేదు.

                 హరిత విప్లవాన్ని, భూ సంస్కరణలను ప్రవేశపెట్టి గ్రామీణప్రాంతంలో అశేషంగా వున్న శూద్ర కులాల నుంచి ధనిక రైతాంగ వర్గాన్ని కాంగ్రెస్‌ చాకచక్యంగా ఆవిర్భవింపజేసింది. చాలాకాలం తనకు మిత్రపక్షంగా వున్నప్పటికీ ఈ వర్గం తన స్వంత రాజకీయ ఆకాంక్ష పెంచుకుంది. ప్రాంతీయపార్టీలను స్థాపించి క్రమక్రమంగా స్థానిక, ప్రాంతీయస్థాయిలలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎన్నికల రాజకీయాలలో పోటీ పెరిగి సామాజిక న్యాయం, మత సంస్కరణల పేరిట రాజ్యాంగంలో అత్యంత ప్రావీణ్యతతో భద్రపరిచిన కులం, కమ్యూనిటీల రూపంలో ఓటుబ్యాంకులు ముందుకొచ్చాయి. అక్కడి నుంచి అంబేద్కర్‌ను ఉద్దేశపూర్వకంగా స్వంతం చేసుకునే ప్రయత్నం మొదట కాంగ్రెసుతో మొదలైంది. ఆయన ప్రధాననమైనవిగా భావించిన విషయాలు మసకబారాయి. ఆయన్ని ఒక పద్ధతి ప్రకారం జాతీయవాదిగా, కాంగ్రెసువాదివాదిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, రాజ్యాంగనిర్మాతగా కొనియాడారు. అంబేద్కర్‌ గురించిన ఈ ప్రచారం అనేక పర్యవసానాలకు దారితీసింది. అంబేద్కర్‌ను ప్రేమించే అశేష ప్రజానీకం కాంగ్రెసుకు అనుకూలంగా మారారు. అవకాశవాద దళిత నాయకులు కాంగ్రెస్‌లో చేరటం వేగవంతమైంది. దళిత ఉద్యమం స్థితిభ్రాంతి(డిస్‌ఓరియంటేషన్‌)కి గురై అస్థిత్వ రాజకీయాల పంచన చేరింది. అంబేద్కర్‌ సిద్ధాంతంలోని విప్లవపార్శం క్రమేణా బలహీనపడింది. మిగిలిన పార్టీలు కూడా నెమ్మదిగా తమ తమ అంబేద్కర్‌ రూపాలను నిర్మించి పోటీలో ప్రవేశిం చాయి. తన ప్రభావాన్ని విస్తృత పరచుకోవటానికి, తన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవ టానికి కావాల్సిన వ్యూహాత్మక విషయాల్ని పట్టించుకో వటానికి సంఫ్‌ు పరివార్‌ రెండోతరం సంస్థల్ని వినియోగిస్తున్నది. దళితులను తనవైపు ఆకర్షించటానికి సమాజిక్‌ సమరసతా మంచ్‌ (ఒక సామాజిక ఆత్మీయ వేదిక)ను ఏర్పాటుచేసింది. కమ్యూనిస్టు, దళిత ఉద్యమాలతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ 1925లో పుట్టింది. ప్రారంభంలో ఊహాత్మక హిందూ మెజారిటీపై ఆధారపడినప్పటికీ 1977లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రభంజనంలో 94 సీట్లు గెలిచేదాకా సామాజికంగాను, రాజకీయంగాను ప్రగతి సాధించటంలో విఫలమైంది.

'కాషాయీకరణ'కు గురవుతున్న అంబేద్కర్‌

                 ప్రారంభంలో అంబేద్కర్‌ హిందూ వ్యతిరేకిగా నిందింపబడటంతో ఆయన్ని అంతర్లీనంగా ద్వేషించి బాల్‌థాకరేలాగా అంబేద్కర్‌ను వ్యతిరేకించే దళితులపై ఆధారపడ్డారు. ఐతే రాజకీయాధికార మాంసం రుచిమరిగాక దేశవ్యాప్తంగా దళితులకు ఆరాధ్యదైవమైన అంబేద్కర్‌ను విస్మరించటం సాధ్యపడదని బిజెపికి అర్థమైంది. ఆయన యాదృచ్ఛికంగా ఇచ్చిన ప్రకటనల్ని సందర్భరహితంగా ఉటంకిస్తూ, వాటిని గోబెల్స్‌ తరహా అబద్ధాలతో కలగలిపి అంబేద్కర్‌ను కాషాయీకరించేందుకు బిజెపి ప్రణాళిక రచించింది. అంబేద్కర్‌ను హెగ్డేవార్‌తో పోలుస్తూ వారిద్దర్నీ 'డాక్టర్లు' అని పేర్కొనటం ద్వారా ఆయనపై మొట్టమొదటిసారి కాషాయం వేటు పడింది. మెట్రిక్‌ పాసైన తర్వాత ఆర్‌ఎమ్‌పిగా మెడికల్‌ ప్రాక్టీస్‌ చేసిన హెగ్డేవార్‌ను విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాలలో రెండు విభిన్న విషయాలపై డాక్టరేట్‌ చేసిన అంబేద్కర్‌తో సమానంగా చూపే ప్రయత్నం జరుగుతోంది. వీరిద్దరి మధ్య సారూప్యత ఏమిటి?

ఏకకాలంలో వాస్తవీకరింపడిన 'స్వేచ్ఛ సమానత్వం, సౌబ్రాతృత్వం' ఆధారంగా ఏర్పడే ఆదర్శ సమాజం ఆయన జీవిత ప్రధాన ఆశయమన్న విషయాన్ని ఎవరూ విస్మరించలేరు. కుల సంహారం, సామ్యవాదం(వర్గ సంహారం) అలాంటి సమాజ నిర్మాణానికి పూర్వావసరం అని ఆయనకు తెలుసు. దానిలో ప్రజాస్వామ్యం ప్రధాన అంతర్భాగంగాను, బుద్ధిజం నైతిక శక్తిగాను వుంటాయి.

                 ప్రతి అంశంలోను ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాపంచిక దృక్పథం దీనికి పూర్తిగా వ్యతిరేకం. కాషాయీకరించబడిన అంబేద్కర్‌ జాతీయవాది. కుల చైతన్యం వల్ల హిందువులు ఒక జాతిగా రూపొందలేరని అంబేద్కర్‌ వాదించాడు. 'హిందూ జాతి' అనే భావన అత్యంత ప్రమాదకరమైందని ఆయన మరీమరీ హెచ్చరించాడు. నేను హిందువుగా మరణించే ప్రసక్తేలేదని అంబేద్కర్‌ ప్రతిజ్ఞచేసినా ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో ఆయన ఒక హిందువు. హిందుమతాన్ని పరిత్యజించి అంబేద్కర్‌ ఆమోదించిన బుద్దిజం చరిత్రనంతా విస్మరించి హిందూమతానికి దానిని మరో శాఖగా ఆర్‌ఎస్‌ఎస్‌ అభివర్ణిస్తుంది. హిందూ మతానికి వ్యతిరేకంగా జరిగిన శ్రమన్‌ విప్లవం, బుద్ధిజానికి వ్యతిరేకంగా హిందూమతం చేసిన ప్రతీఘాత విప్లవం వల్ల దాని జన్మస్థలంలోనే అది నిర్మూలించబడిందన్న వాస్తవాలను పూర్తిగా విస్మరించటం జరుగుతున్నది.
                         సంస్కృతాన్ని జాతీయభాష చేయాలని అంబేద్కర్‌ కోరాడని చెప్పటం, కాషాయజెండాను జాతీయ జెండాగా చేయాలన్నాడనటం, ఆర్‌ఎస్‌ఎస్‌ను మంచిపని చేస్తున్నదని పొగిడాడని చెప్పటం, ఆయన 'ఇంటికి తిరిగి రావటానికి(ఘర్‌వాపసి) అనుకూలం అని చెప్పటం అంటే అంబేద్కర్‌ను విశ్వహిందూ పరిషత్‌ కోతుల స్థాయికి కుదించేందుకు ప్రయత్నించటమే. అలాంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానించటానికి కూడా అర్హమైనివి కావు. అయితే ఆయన ఉదార కథనాలు, అనేక ఉల్లేఖనల్లో ఇస్లాంలోకి మారటాన్ని ఎంచుకోవటందాకా ముస్లిం సమాజాన్ని పొగడటం(ముక్తి కోన్‌ పథే 1936) గమనించినప్పుడు ఆయన్ని కుసంస్కారి అయిన ముస్లిం వ్యతిరేకిగా చిత్రించటం సాధ్యపడదు. తన వేదికపై కొందరు దళితతొత్తులను చౌకగా అంబేద్కర్‌కు వ్యతిరేకంగా నిలపగలదేమోగాని ఆయన్ని ఒక మతతత్వవాదిగా చూపలేనని ఆర్‌ఎస్‌ఎస్‌ అర్థం చేసుకుంటే బాగుంటుంది.

నయాఉదారవాద నిర్బంధం

                    భారతదేశ ఎన్నికల మార్కెట్లో ప్రవేశపెట్టబడిన వివిధ రాజకీయ ప్రారిశ్రామికవేత్తలు తయారుచేసిన అంబేద్కర్‌ ప్రతిమలు అసలు అంబేద్కర్‌ను మసకబారుస్తున్నాయి. అవి దళితుల విమోచనకు ఉపయోగపడే రాజకీయ ఆయుధాల్ని నాశనం చేస్తున్నాయి. ఈ ప్రతిమల మధ్య ఛాయలో తేడాలున్నప్పటికీ ఇవన్నీ అంబేద్కర్‌కు నయా ఉదారవాదరంగు పులుముతున్నాయి. 1947 నుంచి 1980వ దశకం దాకా ప్రభుత్వ చిహ్నంగా కొనసాగిన గాంధీని ఒక అంబేద్కర్‌ రూపం స్థానభ్రంశం చేసింది. ప్రభుత్వ పాలన నిర్వహించటంలోను, దాని ప్రజావ్యతిరేక వ్యూహాత్మక సంకల్పాన్ని, దాని సంక్షేమ వాగాడంబరాన్ని, దాని హిందూ వృద్ధిరేటు నిజస్వరూపాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వానికి గాంధీ ఉపయోగపడ్డాడు. ఐతే నయాఉదారవాద విధానాలను పాలకులు అవలంబించవలసి రావటంతోనూ, పెట్టుబడిదారీ సంక్షోభం తీవ్రమవటంతోనూ ప్రభుత్వం తన శోభను కోల్పోవటం మొదలైంది. ఎదురులేని అభివృద్ధి, ఆధునికత, బహిరంగ పోటీ, స్వేచ్చా మార్కెట్ల గురించిన వాగాడంబరాన్ని సమర్థించటానికి ఒక నూతన పూజ్యనీయ ప్రతిమను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. స్వేచ్చా-మార్కెట్‌ నమూనాను అనుసరిస్తే బికార్లు కూడా బూర్జువాలయ్యే అవకాశముంటుందని ఈ ప్రతిమ ద్వారా ప్రజలకు ముఖ్యంగా ఈ విధానంతో నష్టపోయే అట్టడుగువర్గాలకు హామీ ఇవ్వాల్సి వుంటుంది. ఇందుకోసం సరిగ్గా పనికొచ్చే వ్యక్తి అంబేద్కర్‌ తప్ప వేరెవరో కాదు. బలహీనంగా అప్పుడే పుట్టిన భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు గాంధీ గ్రహించిన వ్యూహాత్మక ఆవశ్యకతే ఇప్పుడు అవసరమైంది. నయా ఉదారవాదానికి చెందిన సామాజిక డార్వినిస్టు లక్షణం దురహంకార ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో అనునాదం అయింది. అదే బిజెపిని రాజకీయాధికార వినీలాకాశంలో నిలిపింది.

                దళితులను ఆకర్షించటానికి అన్నిపార్టీలు అంబేద్కర్‌ పూజ్య రూపాన్ని ఉపయోగించాయి. ఇలా చేయటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అందరికంటే ముందుంది. 1990వ దశకం నుంచి దళితులకు రిజర్వ్‌ చేయబడిన స్థానాలలో బిజెపి కాంగ్రెస్‌ కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవటం జరుగుతున్నది. నయా ఉదారవాద పాలనకు దళితులలో నటించగలిగేవారు అవసరమయ్యారు. అందుకు వాళ్లు దొరికారు. దళితులకు నయాఉదారవాదంతో ఎలా మేలుజరుగుతుందో, అంబేద్కర్‌ ఎలా నయాఉదారవాది అవుతాడో, ఈ విధానాలతో దళితులు ఊహాతీతంగా ప్రగతి సాధించి దళిత బూర్జువాలయ్యే అవకాశం కల్పించే 'విప్లవం' ఎలా శృంఖలాలు తెంచుకుని ముందుకొస్తుందో తెలియజెప్పటానికి దళిత మధ్యతరగతికి నాయకత్వం వహించిన నాయకులు ఆరంభంలో కష్టపడ్డారు. ఈ మధ్యతరగతి బిజెపిలో ఒక ప్రత్యేక బాంధవ్యం కనుగొంది. అందుకే నేడు చాలామంది దళితనేతలు బిజెపిలో కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం లండన్‌లో ఒక భవనాన్ని రూ.44 కోట్లకు బిజెపి ప్రభుత్వం కొన్నది. అంబేద్కర్‌ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ భవనంలో నివసించాడు.ముంబయిలోని ఇందూ మిల్లు భూమిలో అంబేద్కర్‌ స్మారక చిహ్నాన్ని నిర్మించటానికి వున్న అడ్డంకులన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించింది. అలాగే డిల్లీలో అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ నిర్మించటానికి ఒక ప్రణాళిక రచించింది. 

                     గత శతాబ్దారంభంలో 90 శాతం మంది దళితులు ఏ స్థాయిలో జీవించారో అదే స్థాయిలో లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ప్రస్తుతం జీవిస్తున్నారు. ఆ రోజుల్లో వారిలో ఆశ వుండేది. నేడు అది కరువైంది. అంబేద్కర్‌ సమత సంఫ్‌ు పరివార్‌ చెప్పే సమరసత ఒకటి కాదని లేక అంబేద్కర్‌ ప్రాపంచిక దృక్పథం నయా ఉదారవాదం కాదని, సామాజిక డార్వినిజం వాటిని నాశనం చేసేందుకే బయలుదేరిందని దళితులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కేవలం ఒక దశాబ్ద కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కాజేసిన దళితులకు చెందాల్సిన 5 లక్షల కోట్లతో పోల్చినప్పుడు అంబేద్కర్‌ స్మారక చిహ్నాలపై ఖర్చుచేసే ఒకటి, రెండొందల కోట్లు ఒక సాధారణ బిక్షతో సమానమని కూడా దళితులు అర్థం చేసుకోలేకపోతున్నారు! 

(ఎకనామిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ సౌజన్యంతో)
-ఆనంద్‌ తెల్‌తుంబ్డే


(నవ తెలంగాణ దిన పత్రిక, 5.5.2015 తేదీ సంచిక లో ప్రచురించబడిన వ్యాసం ఇది)