Sunday, April 29, 2012

విప్లవతత్వమే ఆయన ఔన్నత్యం


(సుందరయ్య గారి 100వ జన్మదినోత్సవం 01.05.2012 న జరుగుతున్న సందర్భంగా,  కా. బి.వి.రాఘవులు రాసిన ఈ వ్యాసాన్ని చదవాల్సిందిగా మనవి.)
  సుందరయ్య వ్యక్తిత్వం గొప్పది. నా దృష్టిలో సుందరయ్య ప్రాపంచిక దృక్పథం ఇంకా గొప్పది. దీనితో కొంతమంది ఏకీభవించకపోవచ్చు. ఆయన దృక్పథానికి, వ్యక్తిత్వానికి ఏ మాత్రమూ సంబంధం లేదు అనుకునేవారు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. సమాజాన్ని మార్చాలని, సమానత్వం సాధించాలని ఆయన పడిన తపన, ఆయన నడిపిన ఉద్యమాలు మినహాయించి ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. ప్రజల కోసం, ప్రగతి కోసం చేసిన కృషి నుండే సుందరయ్య వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. నిరాడంబరత, నిజాయితీ, త్యాగశీలత, నిబద్ధ్దత, పట్టుదల, సత్యసంధత, శ్రమశీలత, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సాహసం, ధైర్యం - ఈ సుగుణాలన్నీ ఆయన వ్యక్తిత్వంలో మూర్తీభవించి ఉన్నాయి. అవి సమసమాజాన్ని కోరుకునే వారందరికీ ఇప్పటికీ ఆదర్శంగా, అనుసరణీయంగా ఉన్నాయి. మంచి అని నమ్మినపుడు మెచ్చుకోవడం, ప్రశంసించడంతో సరిపెట్టుకోవడం సుందరయ్యకు అలవాటు లేదు. ఆచరించడం ఆయన గొప్పతనం. చెప్పడమే కాదు, చేయడం ఆయన పద్ధతి. అందుకే ఆయనకు ఆబాలగోపాలం నివాళులర్పిస్తుంది. అభిమానులు, అనుయాయులు, ఆయనను వేనోళ్ళ కొనియాడడడంలో ఆశ్చర్యం లేదు. ఆయనను మనసులో ఈసడించుకునేవారు కూడా ప్రశంసిస్తుంటారు. వారు సుందరయ్య వ్యక్తిత్వాన్ని మానవ మాత్రమైనదిగా కాకుండా మానవాతీతమైనదిగా ఆకాశానికెత్తుతారు, అందరూ అనుసరించసాధ్యం కానిదని చెప్పకనే చెబుతుంటారు.

    సుందరయ్య నిరాడంబరతకు మారు పేరు. చిన్న వయసులో ఆయన దుస్తులు ఖాకీ నిక్కరు, ముతక ఖద్దరు చొక్కా. తరువాత ఖద్దరు చొక్కా, లూజు పైజామా. జీవితాంతం ఇవే దుస్తులు. వాటిని ఆయనే ఉతుక్కొనేవారు, శుభ్రం చేసుకొనేవారు. ఆయన ప్రయాణం కాలి నడక, సైకిల్‌. ఎంత దూరమైనా సైకిల్‌ మీద అవలీలగా వెళ్ళేవారు. దూర ప్రయాణాలు సైతం రైళ్లలో, అదీ మూడవ తరగతిలోనే చేసే వారు. తనకు కావలసిన అన్నింటిని పెట్టి చుట్టచుట్టి పట్టుకు పోగలిగే హౌల్‌ఆల్‌ ఒకటి. తిండికి ప్రత్యేకత లేదు. ఎక్కడేది దొరికితే, ప్రజలు తమకున్న దాంట్లో ఏది పెడితే అదే తినేవారు. పచ్చడి మెతుకులైనా, గంజి, సంకటైనా ఫరవాలేదు. పెట్టింది మెతుకు కూడా వృథా కాకుండా తినడం, తిన్న కంచం స్వయంగా కడగడం. యథాలాపంగా జరిగిపోయే పనులు. విశ్రాంతికి కటిక బండైనా, పంచ అరుగైనా, నులక మంచమైనా,  వ్యత్యాసం లేదు. ప్రజల విశ్రాంతి సదుపాయాలే తనకూ సదుపాయాలుగా భావించేవారు.
    
    ఫైళ్ళు క్యారేజికి కట్టుకుని సైకిల్‌పై వెళ్ళి, స్టాండ్‌లో సైకిల్‌ పెట్టి, సమయం తప్పకుండా లోపలికి వెళ్ళి సీట్లో కూర్చొని, పత్రాల అధ్యయనంలో నిమగమై ఉండే సుందరయ్య ఆనాడు పార్లమెంట్‌కు ఒక ప్రత్యేకత. శాసనసభలో ఉన్నపుడు సభకే కాకుండా ముఖ్యమంత్రి ఇంటికి సైతం సైకిల్‌పై వెళ్ళి పని చూసుకురావడం ఆనాడు అందరినీ అబ్బురపరిచేది.

    తన వస్తువులను తనే మోసుకునే వారు. సహాయం చేయబోయినా అంగీకరించే వారు కాదు. స్వాగతాలంటే పడేవి కాదు. పనీ, సమయం వృథా చేసుకొని ఎందుకు చేశారని అభ్యంతరం చెప్పేవారు. 1977లో అనకాపల్లిలో పార్టీ కార్యకర్తల వేసవి శిక్షణా శిబిరం జరుగుతోంది. ప్రముఖ నాయకులందరూ ఆ పాఠశాలలో ఉపన్యాసకులు. సుందరయ్య గారికి స్వాగతం చెప్పేందుకు శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థ్ధులు, నిర్వాహకులు అనేక మంది రైల్వేస్టేషనుకు వెళ్ళారు. దీనికి ఆయన తీవ్రంగా అభ్యంతరం పెట్టారు. శిక్షణా శిబిరానికి కార్యకర్తలను రాజకీయాలు నేర్పేందుకు తీసుకు వచ్చారా? నాయకులకు స్వాగతం చెప్పడానికిి తీసుకు వచ్చారా? అని నిర్వాహకులతో వాదన పెట్టుకొన్నారు. అందరూ తిరిగి వెళ్ళేదాకా స్టేషను నుండి కదలలేదు. ఇటువంటి ఘటనలు కోకొల్లలు. ఆయనతో పరిచయం ఉన్నవారు ఇంకా ఎన్నో చెప్పగలరు.

    పాత తరం నాయకుల్లో సుందరయ్య లాంటి నిరాడంబరులు ఇంకా అనేక మంది ఉన్నారు. జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం ఎంతోమందిని అలా తీర్చిదిద్దింది. బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను సమీకరించడానికి ప్రజల జీవితాలతో పెనవేసుకుపోవడం అవసరమయింది. ప్రజల జీవనసరళితో మమేకం అయినపుడే నాయకులు ప్రజలను ఉత్తేజపర్చగలరని నమ్మారు. అందుకే గాంధీ సూటు, బూటు, హ్యాటూ వదిలి కొల్లాయి గట్టి, కర్ర చేత బట్టాడు. ఈ ఒరవడిలోనే సుందరయ్య సంపన్న కుటుంబంలో జన్మించినా అన్ని హంగులూ సమకూర్చుకోగల అవకాశం వున్నా సాదాసీదా జీవన సరళితో ప్రజల మనిషి అయ్యారు. ఇప్పటికీి ప్రజా ఉద్యమాలను నిర్వహించాలంటే ప్రజల్లో మమేకమైపోవడం ఉద్యమకారులకు, నాయకులకు అవసరం. ప్రజల జీవనస్థాయికి తగ్గట్టు వ్యక్తి జీవన విధానాన్ని మలచుకోవడమే నిరాడంబరత. వ్యక్తిగత నైతిక ప్రమాణమే కాదు, అది ఒక ప్రజా సమీకరణ సాధనం కూడా.

    సమానత్వ సాధన కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం జరిగే కృషిలో నిరాడంబరత్వం ఒక పోరాట సాధనం అవుతుంది. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాకు ఒక ప్రాతిపదిక అవుతుంది. ఆడంబరత్వం అసమానతలకూ, ఆధిపత్యానికీ ఒక ప్రతీక. జీవనానికి అవసరం కాకపోయినా వర్గ సమాజంలో తమ ఔన్నత్యాన్ని చాటి చేప్పేందుకు సంపన్న వర్గాలకు అడంబరత్వం ఒక సాధనం. నేడు విచ్చలవిడిగా పెరిగిన వినిమయ సంస్కృతికి ఆడంబరత్వం ఒక రూపం. కొత్తకొత్తవి కొనడం, అవసరం లేకపోయినా పోగు చేసుకోవడం అనే విషవలయంలో మార్కెట్‌ మాయాజాలంలో నడిచే వ్యవస్థ మనది. దీనితో సహజ వనరులు విచ్చలవిడిగా వృథా చేయబడుతున్నాయి. హరించుకుపోతున్నాయి. భవిష్యత్తరాల అవసరాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అసమానతలపై పోరాడే శక్తులు, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి ప్రకృతి సంపదను పరిరక్షించాలనే శక్తులు ఆడంబరత్వం మీద ధ్వజమెత్తాలి. నిరాడంబరతను జీవన విధానంగా మార్చుకోవాలి.

    సుందరయ్య త్యాగం జగద్విదితం. ఆయన ఆస్థిని ఉద్యమాలకు ఖర్చు చేశారు. స్నేహితుల, అభిమానుల నుండి పోగు చేసి ప్రజల కోసం వినియోగించారు. జీవితం, సమయం ఉద్యమాలతో ముడిపడి ఉన్నందున శ్రద్ధ్ద పెట్టలేమన్న తలంపుతో పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ పాటించారు. ప్రజలకు సేవకులం అనుకున్నపుడు, ప్రజలే వారసులు అనుకోవడం సహజం. జాతీయోద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో ఆస్థులు త్యాగం చేసినవారూ, వివాహం అడ్డం అనుకొని పెళ్ళి చేసుకోని వారూ ఎంతో మంది ఉన్నారు. ఉద్యమాలకూ, ఉద్యమకారులకూ ఇప్పటికీ అటువంటి త్యాగనిరతి అవసరం ఉంది.

    ఇప్పుడు రాజకీయాలలో త్యాగానికి విలువ తగ్గుతున్నది. స్వార్థానికి బలం పెరుగుతున్నది. రాజకీయం, వ్యాపారం పీటముడి వేసుకుంటున్నాయి. సంపాదనా పరులు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. తమ సంపాదనకు రాజకీయాలను సాధనంగా చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తమ పలుకుబడిని సంపాదనకు సాధనంగా మలచుకొంటున్నారు. ఈ కొల్లగొట్టే విద్యలో ఎంత ఆరితేరితే, ఎంత విజయం సాధిస్తే అంత గొప్పవాడిగా భావించే ధోరణిని పెంచుతున్నారు. అడ్డగోలు సంపాదన చేసుకోనివాడు, రాజకీయాలను సంపాదనకోసం వాడుకోనివాడు అసమర్థుడిగా, అమాయకుడిగా పరిగణించే భావజాలాన్ని పెంచుతున్నారు. త్యాగం చేసేవారిని పిచ్చివాడిగా, మరో లోకం వాడిగా పరిగణించే అభిప్రాయాలను వ్యాపింపజేస్తున్నారు. ఈ ధోరణులు దోపిడీి వ్యవస్థను కాపాడడానికి ఉపయోగపడతాయనేది వేరే చెప్పనవసరం లేదు.

    వ్యాపార దృష్టే ప్రధానంగా ఉన్న ప్రస్తుత సమాజం స్వార్థాన్ని సర్వవ్యాపితం చేస్తున్నది. అందుకే అవినీతి, అక్రమాలు, మోసాలూ అన్నీ వ్యాపార సాధనాలుగానే చలామణి అవుతున్నాయి. స్వంతం గురించి ఆలోచన తప్ప తోటి మానవుని గురించి ఆలోచన ఉండదు. పరస్పర పోటీ, ఘర్షణ తప్ప, పరస్పర సహాయం, సహకారం అనే విలువలకు తావుండదు. వ్యాపార సమాజానికి సహకార సమాజమే ప్రత్యామ్నాయం. ఇది సాధించేందుకు త్యాగనిరతిని పెంపొందించడం ఒక మార్గం. త్యాగశీలత నుండి జనించే సహకారం, సహాయం, మానవత్వం ప్రజా ఉద్యమాలను కూడా బలపరుస్తాయి.
    
   మనిషి మనుగడే ఒక మార్పు. మనుషులతో కలసి ప్రకృతిపై పోరాడుతూ మనిషి సాగించే జీవన ప్రక్రియే మానవ సమాజాన్ని నిరంతరం ముందుకు నెడుతుంటుంది. దాన్ని వేగవంతం చేసేందుకూ, అభిలషణీయ మార్గాలను పట్టించేందుకూ నాయకుల కృషి తోడ్పడుతుంది. సుందరయ్య జీవిత కృషి అలాంటిదే. స్వగ్రామంలో కుల వివక్షతను వ్యతిరేకించినా, కూలీ సంఘాలు పెట్టినా, స్కూల్లో ఖద్దరు టోపీ ధరించినా, సైమన్‌ గో బ్యాకు నినాదంతో క్లాసులు బహిష్కరించినా, ఉప్పు సత్యాగ్రహం చేసినా, కల్లు దుకాణాల ఎదుట పికెటింగ్‌ జరిపినా, కార్మికరక్షణ సమితులను నిర్మాణం చేసినా, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినా... ఇవన్నీ అసమానతలు తొలగించి సమాజాన్ని సమానత్వం బాట పట్టించడానికే చేశారు.

    ప్రజా ఉద్యమాలు ఎంత ప్రాధాన్యమో, ప్రజాసేవ కార్యక్రమాలూ విప్లవోద్యమానికి అంతే ప్రాధాన్యం అన్న భావన సుందరయ్య కృషిలో మనకు కన్పిస్తుంది. నిర్మాణాత్మక కార్యక్రమాలు కూడా పోరాట సాధనాలుగా ఉపయోగపడతాయన్న భావన ఇమిడి ఉంది. స్వగ్రామంలో పేదలకు వయోజన పాఠశాల నడిపినా, కులవివక్షతను ప్రశ్నిస్తూ గ్రామంలో సహపంక్తి భోజనం ఏర్పాటుచేసినా, సామాన్య ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రథóమ చికిత్స నేర్చుకున్నా, సోదరునితో ప్రజావైద్యశాలను ప్రారంభింప జేసినా, వాలంటీర్లను సమీకరించి బందరు కాల్వ పూడిక తీయడంలో స్వయంగా పాల్గొన్నా, ధరలు తగ్గించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం కిలో బియ్యాన్ని రూపాయికి అమ్మించినా, దివిసీమ ఉప్పెన సందర్బంగా పార్టీని కదిలించి సేవాకార్యక్రమాలలో అగ్రభాగాన నిలబెట్టినా - ఇవన్నీ సేవా కార్యక్రమాలే కాదు, పాలక వర్గ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసే చర్యలు. సమీకరించే సాధనాలు కూడా. సేవా కార్యక్రమాలను చులకనగా చూడడాన్ని విప్లవోద్యమాన్ని పక్కదోవ పట్టించే చర్యలుగా, విప్లవోద్యమాల్లో వ్యక్తమయ్యే పొరపాటు ధోరణులుగా సుందరయ్య భావించారు.
   
    అంతులేని జ్ఞానతృష్ణ సుందరయ్యది. బాల్యం నుండి పుస్తకాలు చదవడం జీవితంలో భాగం అయింది. దొరికిన పుస్తకం చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన పడడం, గ్రంథాలయాలలో గంటల తరబడి పఠనం చేయడం, విలువైన గ్రంథాలను సేకరించడం జీవితాంతం కొనసాగింది. ఆయన సేకరించిన వేలాది గ్రంథాలలో అరుదైనవి ఎన్నో ఉన్నాయి. ఎన్‌సైక్లోపీిడియాలు, అట్లాస్‌లు, డిక్షనరీలు, అరుదైన పుస్తకాలు ఎన్నో వున్నాయి. అందుకే గ్రంథాలయమే ఆయనకు నిజమైన నివాళిగా భావించి సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించాం.

    ఉద్యమం కోసం, పోరాటం కోసం అధ్యయనం అని సుందరయ్య నమ్మకం. విజ్ఞానం మానసిక ఉల్లాసానికో, కాలక్షేపానికో అయితే దానికి పెద్ద విలువ ఉండదు. అధ్యయనం సత్యాన్వేషణ కోసం. సత్యాన్వేషణ సమాజాన్ని మార్చడం కోసం.... ఈ దృష్టితోనే అధ్యయనాన్నీ విజ్ఞాన సంపాదననూ ఉద్యమాభివృద్ధికి ఒక సాధనంగా సుందరయ్య వినియోగించారు. రైతు ఉద్యమాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన భూ సంబంధాలను కూలంకషంగా అధ్యయనం చేశారు. కాజ, అనంతవరం గ్రామాలలో సమగ్ర సమచారం సేకరించి భూ సమస్యపై ప్రామాణిక గ్రంథాన్ని రచించారు. వ్యవసాయ కార్మికోద్యమ కార్యకర్తలకు కొల్లిపరలో జరిగిన శిక్షణాశిబిరంలో రాష్ట్రంలో పలు గ్రామాలలో కూలి రేట్లనూ, ఉత్పత్తి ఖర్చులనూ నిర్దిష్టంగా సేకరించి వాటిపై ఆధారపడి విశ్లేషణ చేశారు. రాష్ట్రంలో నీటి వనరులను సక్రమంగా సమానంగా వినియోగించుకునేే సూచనలతో రూపొందించిన 'ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర నీటి పథకం' పుస్తకం ఇప్పటికీ ప్రామాణికమైనది. తెలుగు ప్రజలు ఐక్య రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధి సాధించడం కోసం అవసరమైన ప్రణాళికలతో ఆయన రచించిన 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనాడు తెలుగు రాష్ట్ర ఐక్యతా ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చింది. సత్యం అంటే పాలక వర్గాలకు భయం. అందుకే సత్యాన్ని వెలికి తీసే అధ్యయనం సమాజ మార్పుకోసం కృషి చేసే ప్రతి వారికీి ఆయుధంగా ఉపయోగపడుతుంది.

    సుందరయ్య వ్యక్తిత్వం ఉద్యమాలలో పుట్టి పెరిగింది. ఆ ఉద్యమాల అభివృద్దికీి విసృతికీి తోడ్పడింది. నేటికీ ఉద్యమాలకు అటువంటి వ్యక్తిత్వం కల్గిన మనుషులు కావాలి. ఉద్యమాల నుండి అటువంటి వారు నిరంతరం ఉద్భవిస్తూనే వుంటారు. నూతన సమాజంలో అవిర్భవించే మానవుని వ్యక్తిత్వంలో ఉండవలసిన అంశాలు ఈ దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బీజ ప్రాయంగా ఆవిర్భవిస్తాయి. వాటికి మేటి ప్రతినిధే సుందరయ్య.

1. సామాజిక మార్పు, సమానత్వ సాధనకై సుందరయ్య పడిన తపన, నడిపిన ఉద్యమాలను వేరుచేసి ఆయన వ్యక్తిత్వాన్ని చూడలేము.
2. సైకిలుపై సకాలంలో పార్లమెంటుకు వెళ్ళడం, అధ్యయనంలో నిమగం కావడం ఆయన మరో ప్రత్యేకత. శాసనసభలో ఉన్నపుడు సభకే కాకుండా ముఖ్యమంత్రి నివాసానికి సైతం సైకిల్‌పై వెళ్ళి పని చూసుకురావడం అందరినీ అబ్బురపరిచేది.
3. దొరికిన పుస్తకం చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన, గ్రంథాలయాలలో గంటల తరబడి పఠనం, విలువైన గ్రంథాల సేకరణ ఆయన అలవాటు. అందుకే గ్రంథాలయమే ఆయనకు నిజమైన నివాళిగా భావించి సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించాం.
4. ఆయన ఆస్థిని ఉద్యమాలకు ఖర్చు చేశారు. స్నేహితుల, అభిమానుల నుండి పోగు చేసి ప్రజల కోసం వినియోగించారు.
5. జీవితం, సమయం ఉద్యమాలతో ముడిపడి ఉన్నందున శ్రద్ధ్ద పెట్టలేమన్న తలంపుతో పిల్లలు కలగకుండా కుటుంబ నియంత్రణ పాటించారు. ప్రజలకు సేవకులం అనుకున్నపుడు, ప్రజలే వారసులు అనుకోవడం సహజం.
6. నేటి రాజకీయాలలో త్యాగానికి విలువ తగ్గుతున్నది. స్వార్థానికి బలం పెరుగుతున్నది. రాజకీయం, వ్యాపారం పీటముడి వేసుకుంటున్నాయి. సంపాదనా పరులు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. సంపాదనకు రాజకీయాలను సాధనంగా చేసుకుంటున్నారు. ఈ కొల్లగొట్టే విద్యలో ఎంత ఆరితేరితే, ఎంత విజయం సాధిస్తే అంత గొప్పవాడిగా భావించే ధోరణిని పెంచుతున్నారు.
7. ప్రజల జీవనసరళితో మమేకం అయ్యేందుకు గాంధీ సూటు, బూటు, హ్యాటూ వదిలి కొల్లాయి గట్టి, కర్ర చేత బట్టాడు. ఈ ఒరవడిలోనే సుందరయ్య సాదాసీదా జీవన సరళితో ప్రజల మనిషి అయ్యారు. ప్రజల జీవనస్థాయికి తగ్గట్టు వ్యక్తి జీవన విధానాన్ని మలచుకోవడమే నిరాడంబరత.
-బి.వి రాఘవులు