అంధకారమయమవుతున్న బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల, పెన్షనర్ల
భవిష్యత్తు
పెరుగుతున్న నష్టాలు
ప్రభుత్వ రంగ
సంస్థలను ధ్వంసం చేసే విధానాలలో భాగంగానే ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ ను ధ్వంసం
చేస్తున్నది. ఈ విధానాల కారణంగా బి ఎస్ ఎన్ ఎల్ కు 2009-10లో రు 1823 కోట్లు, 2010-11లో రు 6384 కోట్లు, 2011-12 లో రు 8851 కోట్లు నష్టం వచ్చింది. 2012-13 లో మరో రు 10,000 కోట్లు నష్టం వస్తుందని అంచనా.
జబ్బు ప్రారంభమయిన సంస్థగా నిర్ధారించబడిన బి ఎస్ ఎన్ ఎల్
బి ఆర్ పి ఎస్ ఇ (బ్యూరో ఫర్ రికన్స్ట్రక్షన్
ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైసెస్) 29.11.2012 న జరిగిన సమావేశంలో బి ఎస్ ఎన్ ఎల్ ను "జబ్బు ప్రారంభమయిన
సంస్థ" (ఇన్సిపియెంట్ సిక్) గా
నిర్ధారించింది. వరుసగా రెండు సంవత్సరాలు నష్టాలు వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థను
"ఇన్సిపియెంట్ సిక్" సంస్థగా బి ఆర్ పి ఎస్ ఇ నిర్ధారిస్తుంది. ఈ
సంవత్సరం 2012-13ను కూడా కలుపుకుంటే బి ఎస్ ఎన్ ఎల్ కు ఇప్పటికి వరుసగా 4
సంవత్సరాలు నష్టాలు వచ్చాయి.
ఇలాగే కొనసాగితే
ఒకటి, రెండు సంవత్సరాలలో జబ్బుపడిన సంస్థగా బి ఎస్ ఎన్ ఎల్ నిర్ధారించబడుతుంది
ఒక ఆర్థిక
సంవత్సరంలో దానికి అప్పటివరకు వచ్చిన నష్టాల మొత్తం ఆ సంస్థ గత 4 సంవత్సరాల సగటు నికర విలువలో 50 శాతం మించితే ఆ సంస్థ జబ్బు పడిన సంస్థగా
పరిగణించ బడుతుంది. బి ఎస్ ఎన్ ఎల్ గత
నాలుగు సంవత్సరాల సగటు నికర విలువ సుమారు 84000 కోట్ల రూపాయిలు
వుంటుంది. అందులో 50 శాతం రు 42000 కోట్లు. ఇప్పటి
వరకు బి ఎస్ ఎన్ ఎల్ కు వచ్చిన నష్టాల మొత్తం (2012-13 అంచనా రు 10,000 కోట్లు కూడా కలుపుకుంటే) రు 27000 అయింది.
ఇదే విధంగా నష్టాలు కొనసాగితే మరో ఒకటి, రెండు
సంవత్సరాలలో బి ఎస్ ఎన్ ఎల్ నష్టాల మొత్తం దాని నికర విలువలో 50 శాతం దాటి , జబ్బుప్రారంభమయిన సంస్థ నుండి జబ్బు పడిన
సంస్థగా మారుతుంది.
నష్టాలు కొనసాగితే 1.1.2017 నుంది జరగాల్సిన
తదుపరి వేతన సవరణ, పెన్షన్ సవరణ జరగదు
డి పి ఇ (డిపార్ట్మెంట్
ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైసెస్) గైడ్ లైన్సు
ప్రకారం ఈ విధంగా జబ్బు ప్రారంభమయిన సంస్థగా ప్రకటించ బడిన సంస్థకు గానీ, జబ్బు పడిన సంస్థగా ప్రకటించ బడిన సంస్థకు గానీ
వేతన సవరణ జరగదు.
7.9.2012న ప్రభుత్వము
రాజ్య సభకు ఇచ్చిన సమాచారం ప్రకారం, అనేక సంవత్సరాలు వరుసగా నష్టాలు వచ్చినందున ఐ టి ఐ ని జబ్బు పడిన సంస్థగా
ప్రకటించి బి ఐ ఎఫ్ ఆర్ కు 2004 లో నివేదించారు.అందువలన ఐ టి ఐ లో 1.1.2007న
జరగాల్సిన వేతన సవరణ జరగలేదు. 1997 పే స్కేల్సులోనే
వారు కొనసాగుతున్నారు.
బి ఎస్ ఎన్ ఎల్ కు 2017 వరకూ ఇదే విధంగా నష్టాలు కొనసాగితే 1.1.2017 నుండి జరగాల్సిన తదుపరి వేతన సవరణ గాని,
పెన్షన్ సవరణ గానీ జరగదు. కాబట్టి
1.1.2017 లోగా బి ఎస్ ఎన్ ఎల్ కోలుకుని
తిరిగి లాభాలు సాధిస్తేనే 1.1.2017 న
జరగాల్సిన వేతన సవరణ గానీ, పెన్షన్ సవరణ గానీ జరుగుతుంది.
వి ఆర్ ఎస్, డిజిన్వెస్టుమెంటు
మనపై జరిగే దాడి తప్ప, పరిష్కారం కాదు
బి ఎస్ ఎన్ ఎల్
ను తిరిగి లాభాల బాట పట్టించాలంటే లక్షమందికి వి ఆర్ ఎస్ ఇవ్వాలనీ, ముప్ఫై శాతం వాటాలు ప్రయివేటు పరం చేయాలనీ
ప్రభుత్వము తరఫున ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఇంతేగాక బి ఎస్ ఎన్ ఎల్ ను టవర్
కంపెనీ, బ్రాడ్ బ్యాండ్
కంపెనీ, రియల్ ఎస్టేట్ డివిజను
తదితర రూపాలలో అనేక ముక్కలుగా విభజించాలనే ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి.
ఉద్యోగులను ఇంటికి పంపించి, సంస్థను ముక్కలు
చేసి అమ్మేందుకు ఈ విధమయిన కుట్ర జరుగుతున్నది.
లక్ష మందికి వి
ఆర్ ఎస్ అమలు చేయాలంటే రు 18,000 కోట్లు కావాలి.
నష్టాలలో వున్న బి ఎస్ ఎన్ ఎల్ వద్ద సొమ్ము లేదు. ప్రభుత్వం ఇవ్వదు. బ్యాంకునుండి అప్పు చేసి వి
ఆర్ ఎస్ అమలు చేయాలి. కానీ దానివలన బి ఎస్ ఎన్ ఎల్ పై విపరీతమయిన భారం పడి మరింత
మునుగుతుంది. వి ఆర్ ఎస్ తీసుకునేవాళ్ళు మిగిలిన సర్వీసును అందువలన పెరిగే పెన్షన్
ను కోల్పోతారు. ఇంతేగాక సంస్థ నష్టాలు కొనసాగి 2017 లో వేతన సవరణ, పెన్షన్ సవరణ జరగక పోతే మరింత నష్ట పోతారు. ఆ
విధంగా రెండు విధాలా, సర్వీసులో
కొనసాగితే ఇంక్రిమెంట్సు వచ్చినందున పెరిగే పెన్షన్ను, మరియు అందరితోపాటు 2017 లో జరగాల్సిన పెన్షన్ రివిజన్ ను కోల్పోతారు.
కాబట్టి వి ఆర్ ఎస్ పరిష్కారం కాదు. అది ఉద్యోగులను, బి ఎస్ ఎన్ ఎల్ ను మరింతగా ముంచుతుంది. ఇటువంటి నష్టం జరగకుండా వుండాలంటె సంస్థని
లాభాల బాట పట్టించి 2017 లో వేతన సవరణ
జరిగేలా, పెన్షన్ సవరణ
జరిగేలా చూడాలి.
డిజిన్వెస్టుమెంటు
ఉద్దేశం ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మి, బడ్జెటు లోటు
పూద్చుకోవటమేనని ప్రభుత్వము చెపుతున్నది. సంపన్నులకు పన్నుల చెల్లింపులో గత మూడు
నాలుగు సంవత్సరాలలో రు 5,28,000 కోట్ల పన్నుల రాయితీలను వారి లాభాలు
పెంచేందుకు ప్రభుత్వము ఇచ్చింది. దాని వలన బడ్జెటు లోటు ఏర్పడింది. ఈ లోటు భర్తీ
చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మలని, పెట్రోల్, గ్యాస్, డీజెల్ తదితరాలపై
ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని ప్రభుత్వము నిర్ణయించి అమలు చేస్తున్నది. కాబట్టి
డిజిన్వెస్టుమెంటు అనేది ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు చవకగా అమ్మి ప్రయివేటు పరం
చేయటానికి, సంపన్నులకు రాయితీలిచ్చినందున బడ్జెటులో
ఏర్పడిన లోటును పూద్చుకోటానికి మాట్రమే. కాబట్టి వీ ఆర్ ఎస్, డిజిన్వెస్ట్మెంటులను పూర్తిగా వ్యతిరేకించాలి.
బి ఎస్ ఎన్ ఎల్
నష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలే
ప్రయివేటు టెలికం
కంపెనీలు చెల్లించాల్సిన రు 50,000 కోట్లు పైగా
వున్న లై సెన్సు ఫీజు చెల్లింపునుండి మినహాయింపునిచ్చేందుకు ఆ నాటి ఎన్ డి ఏ
ప్రభుత్వము "1999 నూతన టెలికం
విధానం" ను ప్రకటించింది. ఇంతేగాక డి ఓ టి అధీనంలో వున్న టెలికం సర్వీసులను
కుడా ప్రయివేటు పరం చేసెందుకు వీలుగా ఆ నాటి ఎన్ డి ఏ ప్రభుత్వము 1.10.2000 న బి ఎస్ ఎన్ ఎల్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసింది. దివాళా తీయించి
ప్రయివేటు పరం చేసేందుకే దీనిని ఏర్పాటు చేశారు.
బి ఎస్ ఎన్ ఎల్ ను దివాళా తీయించే ఈ కుట్రలో భాగంగా ఆ నాటి ఎన్ డి ఏ
ప్రభుత్వము మొబైల్ సర్వీసులందించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ను 2002 వరకు అనుమతించకుండా
ఆ రంగం లో ప్రయివేటు కంపేనీలకు పూర్తి అవకాశం ఇచ్చింది. ఇంతేగాక స్పెక్ట్రం
కేటాయింపులో అనేక అక్రమ మార్గాలలో ప్రయివేటు కంపెనీలకు తోడ్పడింది. ఎన్ డి ఏ హయాములో స్పెక్ట్రం కేటాయింపులో జరిగిన
ఈ అక్రమాలపై సి బి ఐ, ఇటీవలే చార్జి షీటు దాఖలు చేసింది.
ఆ తరువాత 2004 లో
అధికారంలోకి వచ్చిన యు పి ఏ ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ పై దాడిని మరింత తీవ్రం చేసింది.
భారత అమెరికా బడా పెట్టుబడిదారుల ఒత్తిడికి లొంగి బి ఎస్ ఎన్ ఎల్ కు సామాజిక
ప్రయోజనాల కోసం నష్టాలు భరించి నిర్వహిస్తున్న ల్యాండ్ లైన్ నెట్వర్కుకు ఇస్తున్న
సంవత్సరానికి సుమారు రు. 5000 కోట్ల నష్ట పరిహారాన్ని పూర్తిగా ఆపు జేసింది.
మొబైల్ సర్వీసులు వేగంగా విస్తరిస్తున్న కాలంలో అందుకు అవసరమయిన ఎక్విప్మెంటును
కొననీయకుండా బి ఎస్ ఎన్ ఎల్ కు అనేక ఆటంకాలు సృష్టించి ఆ రంగంలో బాగా వెనకబడేలా
చేసింది. తద్వారా మార్కెట్లో 90 శాతం పైగా వాటా ప్రయివేటు కంపెనీలకు దక్కేలా
చేసింది. 3జి స్పెక్ట్రం కొనని
సర్కిల్సులోకూడా ఇతర కంపెనిల స్పెక్ట్రం ను అక్రమంగా వాడుకుని ప్రయివేటు కంపెనీలు 3జి
సర్వీసులందిస్తున్నా ఇప్పటికీ ఆపు జేయకుండా, బి ఎస్ ఎన్ ఎల్
ను లాభసాటి కాని సర్కిల్సుతో సహా అన్ని సర్కిల్సు కూ 3జి స్పెక్ట్రం తీసుకునేలా
చేసి ఆ పేరుతొ దానినుండి రు.10000 కోట్లు వసూలు చేసింది. ఇంతేగాక, అంతగా పనికిరాని నాసిరకం బి డబ్ల్యు
స్పెక్ట్రమ్ను బి ఎస్ ఎన్ ఎల్ కు అంటగట్టి
ఆ పేరుతో మరో రు 8500 కోట్లు వసూలు చేసింది. ఈ స్పెక్ట్రం ను బి ఎస్ ఎన్
ఎల్ వాపసు ఇచ్చినప్పటికి అందుకు చెల్లించిన రు 8500 కో ట్ల ను తిరిగి
ఇవ్వటం లేదు. ఇంతేగాక గతంలో
ఇచ్చిన స్పెక్ట్రంకే ఇప్పుడు బి ఎస్ ఎన్ ఎల్ నుండి మరో రు 6000 కోట్లు వసూలు చేయాలని ప్రయివేటు కంపెనీలు ప్రభుత్వాన్ని
ఒత్తిడి చేస్తున్నాయి.ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా ప్రభుత్వము అనుసరిస్తున్న
ఈ విధానాల కారణంగా నే బి ఎస్ ఎన్
ఎల్ కు నష్టాలు వస్తున్నాయి.
ఈ విధానాల వలన
ఉద్యోగుల జీత భత్యాలూ పెన్షను మాత్రమేగాక, దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతున్నది. మన టెలికం నెట్వర్కులో వాడుతున్న
పరికరాలన్నీ విదేశీ తయారీలయినందున ఈ ముప్పు ఏర్పడుతున్నది.
పెన్షన్ కు దాపురించిన ముప్పు
పెన్షన్
చెల్లింపు బాధ్యతనుండి ప్రభుత్వము తప్పుకుని, ప్రయివేటు
పెన్షన్ ఫండ్ కంపెనీలకు ఈ బాధ్యతను అప్పగించేందుకు మరియు ఈ ప్రయివేటు పెన్షన్ ఫండ్
కంపెనీలలో 49 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని
అనుమతించేందుకు వీలుగా యు పి ఏ ప్రభుత్వము ఇటీవల పార్లమెంటు ఆమోదం కోసం ఒక బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ ప్రతిపాదన
తమ హయాములోనే చేసిన ఎన్ డి ఏ (బి జె పి) ఇందుకు మద్దతునిస్తున్నది. దీనినిగనుక
పార్లమెంటు ఆమోదిస్తే మరి కొన్ని సంవత్సరాలకు పెన్షన్ చెల్లింపు ప్రయివేటు పరమై
దాని భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.
ఇ పి ఎఫ్ కత్తిరింపు విధానాలు
బి ఎస్ ఎన్ ఎల్
లో రిక్రూటయిన ఉద్యోగులకు ఇ పి ఎఫ్ అమలులో వుంది. ఇంతేగాక ప్రభుత్వ రంగ సంస్థలలో,
ప్రయివేటు రంగ సంస్థలలో
పని చేస్తున్న కోట్లాది మందికి ఇది అమలులో వున్నది. కానీ ప్రభుత్వ విధానాలు ఇ పి ఎఫ్ కు కోత
పెడుతున్నాయి. ఇ పి ఎఫ్ చట్టం ప్రకారం పే, డి ఏ పై మాత్రమేగాక హెచ్ ఆర్ ఏ మినహా ఇతర అలవెన్సులన్నింటి మొత్తం పై 12 శాతాన్ని యాజమాన్యం
వాటాగా ఉద్యోగి ఇ పి ఎఫ్ ఖాతాకు చెల్లించాలి. కానీ ఇది జరగటం లేదు. పే
మరియు డి ఏ పై మాత్రమే జమ చేస్తున్నారు. 30.11.2012 న ఇ పి ఎఫ్ సంస్థ ఇచ్చిన క్లారిఫేషన్ లో ఇది
తప్పని, పే మరియు డి ఏ పై మాత్రమే గాక ఇతర అలవెన్సులు
కూడా కలిపి దాని పై ఇ పి ఎఫ్ ఎంత
చెల్లించాలో లెక్కించాలన్నది. వెంటనే ప్రయివేటు కంపెనీల యాజమాన్యాలు, బడా
పెట్టుబడి దారుల చేతిలో వున్న పత్రికలు మరియు టి వి చానళ్ళూ ఇందుకు
వ్యతిరేకంగా గగ్గొలు పెట్టాయి. ప్రభుత్వము దిగి వచ్చి ఈ ఆర్డరు అమలును ఆపు జేసింది.
ఇంతేగాక ఇ పి ఎఫ్
కంట్రిబ్యూషన్ సీలింగు 12 శాతం వుండటం వలన
అంతకు మించి ఇ పి ఎఫ్ లో పొదుపు చేయదలచుకున్న వారికి సాధ్యం కావటం లేదు.
పెట్రోలు, డీజెలు ధరలపై
నియంత్రణ ఎత్తివేత
2010లో యు పి ఏ
ప్రభుత్వము పెట్రోలు ధరల పై నియంత్రణ ఎత్తివేసింది. ప్రభుత్వ అనుమతితో నిమిత్తం
లేకుండా పెట్రొలు ధరలు నిర్ణయించేందుకు ఆయిల్ కంపెనీలకు అధికారమిచ్చింది.
అప్పటినుండి ఇప్పటివరకు పెట్రొలు ధరలను ఆయిల్ కంపెనీలు 27 సార్లు సవరించాయి. ఇందులో 19 సార్లు ధరలు
పెంచితే, 8 సార్లు మాత్రమే తగ్గించాయి. నికరంగా పెట్రొలు
ధరలు బారీగా పెరిగాయి.
2013 జనవరిలో యు పి ఏ
ప్రభుత్వము డీజిల్ ధరల పై నియంత్రణను తొలగించింది. డీజిల్ ధర వ్యక్తిగత వినియోగదారులకు లిటరుకు 45
పైసలు పెంచింది. కానీ ఆర్
టి సి, రైల్వే, మరియు ప్రభుత్వ రంగ, ప్రయివేటు రంగ సంస్థలు వంటి భారీ
వినియోగదారులకు లీటరుకు రు 11 పెంచింది. అంతకు
ముందు సెప్టెంబరు 2012లో లీటరుకు రు 6
పెంచింది. నియంత్రణ
తొలగించినందున రానున్న కాలంలో అనేక సార్లు డీజెల్ ధరలు పెరుగుతాయి. జనవరిలో పెంచిన
రు 11 వలన ఎ పి ఎస్ ఆర్
టి సి పై రు 712 కోట్లు అదనపు
భారం పడుతున్నది. రైల్వే పై రు 2727 కోట్లు అదనపు భారం పడుతున్నది. ఆర్ టీ
సి, రైల్వే రవాణా రేట్లు
పెంచటానికి ఇది దారి తీస్తున్నది. అనేక రాష్ట్రాలలో ఆర్ టీ సి సంస్థలు ఈ భారాన్ని
మోయలేక నష్టాల పాలవుతున్నాయి. రైలు చార్జీలు ఇప్పటికే పెంచారు. రవాణా చార్జీలు
పెరిగి నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరగటానికి ఇది దారి తీస్తున్నది.
వ్యక్తిగత
వినియోగదారులకు జనవరిలో లీటరుకు 45
పైసలే పెంచినా, ఆ తరువాత దాదాపు ప్రతి నెలా పెంచుకుంటు పోయి మరో సంవత్సరం తరువాత వ్యక్తి గత
వినియోగదారులనుండి కూడా భారీ వినియోగదారులతో సమంగా వసూలు చేసేందుకు ఆయిల్
కంపెనీలను ప్రభుత్వము అనుమతించింది. కాబట్టి వ్యక్తిగత వినియోగదారులయినాప్పటికి ఒక
సంవత్సరం తరువాత భారీ వినియోగదారులతో సమంగా చెల్లించాల్సి వస్తుంది.
డీజెల్ ధరల పెరుగుదల-బి ఎస్ ఎన్ ఎల్ పై మరింత భారం
డీజెల్ ధరలు
విపరీతంగా పెంచినందున టెలికం చార్జీలు
పెరుగుతాయి. బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలు మరింత పెరుగుతాయి. టెలికం రంగం 2012లో వాడిన దీజెల్ 300 కోట్ల లీటరులు. లీతరుకు రు 17 చొప్పున ధర పెరిగినందున డీజెల్
పై సంవత్సరానికి రు 5100 కోట్లు అదనపు భారం టెలికం సర్వీసుల రంగంపై
పడుతున్నది.
మోయలేని భారంగా తయారవుతున్న ఎలక్ట్రిసిటీ రేట్లు
ప్రయివేటు
బొగ్గుగనుల యాజమాన్యాలకు, గ్యాస్
సప్లయిదారయిన రిలయన్సుకు అధిక లాభాలు కట్టబెట్టేందుకు ఎలక్ట్రిసితీ ఉత్పత్తికి అవసరమయిన ఇంధనం ధరలను
ప్రభుత్వము భారీగా పెంచింది. మన రాష్ట్రంలో ఆ నాటి తెలుగు దేశం ప్రభుత్వము
ప్రయివేటు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి కంపెనీలను అనుమతించి వాటికి అధిక లాభాలు కట్ట
బెట్టే విధంగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసింది. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్
ప్రభుత్వము ఈ దోపిడీ విధానాన్ని మరింత బలపరిచింది. దీనివలన విద్యుత్ పంపిణీ
కంపెనీలు అధిక రేట్లతో ఎలక్ట్రిసిటీని కొనాల్సి వస్తున్నది. విద్యుత్ ధరలు
పెరుగుతున్నందున అంత సబ్సిడీ తామివ్వలేమని రాష్ట్ర ప్రభుత్వము చేతులెత్తేసింది.
దీని వలన ఇటీవల ఎలక్ట్రిసిటీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సర్చార్జి పేరుతో కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయి.
ఏప్రిల్ నుండి కరెంటు బిల్లు మరో 42 శాతం పెంచేందుకు
రంగం సిద్ధమవుతున్నది. కాంగ్రెస్, తెలుగు దేశం,
బి జె పి, టి ఆర్ ఎస్, వై కా పా
వంటి పార్టీలు ఇంత తీవ్రమయిన సమస్యను పట్టించుకోకుండా, ఇందుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయకుండా, ప్రత్యేక తెలంగాణ,
సమైక్య ఆంధ్ర ప్రదేశ్
సమస్యను తేల్చకుండా సెంటిమెంట్లు రెచ్చ గొడుతూ , వోట్ల కోసం పాదయాత్రలతో కాలక్షేపం
చేస్తున్నాయి. వామ పక్షాలు మాత్రమే ఈ సమస్యపై పోరాటాలు కొనసాగిస్తున్నాయి.
విద్యుత్తు,
ఇంధనం రేట్లు మరింత
పెంచాల్సిన అవసరం వుందని ప్రధాని మన్మోహన్ సింగు ఇటీవల బహిరంగంగా ప్రకటించారు.
ప్రజల పై పెద్ద ఎత్తున ఈ భారాలు మరింతగా మోపేందుకు రంగం సిద్ధమవుతున్నది.
ఎలక్ట్రిసిటీ రేట్ల పెరుగుదల వలన సరుకుల ధరలు పెరుగుతాయి. ఇంతేగాక బి ఎస్ ఎన్ ఎల్
పై మరింత భారం పడి నష్టాలు పెరుగుతాయి.
డి ఏ-ధరల పెరుగుదల
ఈ విధానాల
కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, ప్రత్యెకించి
ఆహార ధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
పెట్రోలు, డీజెలు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి.
కరెంటు బిల్లులు కట్ట లేని పరిస్థితి ఏర్పడుతున్నది. ధరల పెరుగుదలకి పరిహారంగా
మనకి చెల్లిస్తున్న డి ఏ కన్నా ధరల పెరుగుదల చాలా అధికంగా వుంటున్నది. జనవరి 2013
నుండి మనకి 4.2 శాతం డి ఏ ఇచ్చారు. కానీ ధరల పెరుగుదల అంతకన్నా చాలా అధికంగా
వుంటున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి
యు పి ఏ
ప్రభుత్వము అంతకు ముందు ఎన్ డి ఏ ప్రభుత్వము అమలు చేసిన విధానాల వలన తెలికం రంగంలో
ప్రభుత్వ రంగ సంస్థలయిన ఐ టి అఈ,
బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ దెబ్బతింటున్నాయి. ఇతర రంగాలలో కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థలు
ఇబ్బందుల పాలయ్యాయి. సంపన్నులకు పన్నుల మినహాయింపు భారీగా ఇచ్చి అందువలన బడ్జెటులో
పెరిగిన లోటును భర్తీ చేసుకునేందుకు
ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకానికి పూనుకుంటున్నది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల
అమ్మకం ద్వారా 2012-13 లో రు 30,000 కోట్లు, 2013-14లో మరో 30,000 కోట్లు
సంపాదించాలని నిర్ణయించింది.
తగ్గుతున్న రెగ్యులర్ ఉద్యోగాలు-పెరుగుతున్న క్యాజువల్ , కాంట్రాక్ట్
ఉద్యోగాలు
2004-05 నుండి 2009-10 సంవత్సరాల మధ్య
మన దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతం పైగా అభివృద్ధి సాధించింది. కానీ ఈ
కాలంలో ఉద్యోగిత కేవలం 0.83 శాతమే పెరిగింది. 2008 తరువాత ప్రపంచ వ్యాపితంగా ఆర్థిక సంక్షోభం వచ్చిందనే పేరుతో యు పి ఏ
ప్రభుత్వము స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడిదారులకు అనేక
రాయితీలిచ్చింది. అయినప్పటికి అది వారి లాభాలు కాపాడిందేగాని ఉద్యోగాలు పెరగలేదు.
ఇంతేగాక, ఆర్థిక వ్యవస్థ పెరుగుదల దిగజారి ప్రస్తుతం 5 శాతానికి పడిపోయింది. వాస్తవం ఇది కాగా, పెట్టుబడిదారులను
ప్రోత్సహించే పేరుతో వారికి మరిన్ని రాయితీలిచ్చేందుకు, అందుకు ప్రజలపై మరిన్ని భారాలు మోపేందుకు (ప్రతిపక్ష బి జె పి సహకారంతో)
మన్మోహన్ సింగు ప్రభుత్వము సిద్ధమవుతున్నది. ఈ విధానాల కారణంగా రెగులర్ ఉద్యోగాల
సంఖ్య తగ్గుతున్నది. కేంద్ర ప్రభుత్వ అధీనంలో వున్న ప్రభుత్వ రంగ సంస్థలలో 1980 లో 23 లక్షల మంది ఉద్యోగులుండగా ఇప్పుడు 14 లక్షలే వున్నారు. బి ఎస్ ఎన్ ఎల్ లో ఉద్యోగుల సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా
తగ్గుతున్నది. 2002లో 2,98,432 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులుండగా, 2011 నాటికి 2,29,690 మందే వున్నారు.
ఒక వంక రెగ్యులర్
ఉద్యోగాలు తగ్గుతుండగా మరో వంక ఉద్యోగభద్రత లేకుండా స్వల్ప వేతనాలతో ఎటువంటి
సౌకర్యాలూ హక్కులూ లేని క్యాజువల్,
కాంట్రాక్టు ఉద్యోగుల
సంఖ్య పెరుగుతున్నది. మొత్తం కార్మిక వర్గంలో క్యాజువల్, కాంట్రాక్టు పని వారలు 93 శాతం వున్నారు. 2004-05 నుండి 2009-10 మధ్య కాలంలో క్యాజువల్ పని వారి సంఖ్య మహిళలో 6 శాతం, పురుషులలో 5 శాతం పెరిగింది.
అతి తక్కువగా వున్నప్పటికీ అమలు కాని కనీస వేతనాలు
అన్ని రంగాలలో కనీస వేతనం రు 10,000 గా నిర్ణయించాలి
ప్రణాళికా సంఘం లెక్కల ప్రకారం పట్టణ కార్మికులకు రోజుకు 2100 కేలరీల ఆహారం అవసరం. 2009-10 లెక్కల ప్రకారం ఇంత శక్తినిచ్చే ఆహారం కావాలంటే
నెలకు తలకు రు 2125 కావాలి. కుతుంబంలో నలుగురుంటారనుకుంటే నెలకు రు
8500 కావాలి. 2011 నాతికి 12.5 శాతం ధరల పెరుగుదలను లెక్కలోకి తీసుకుంటే ఇది
రు 10,785 అవుతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కనీస వేతనం
రు 10,00 ఉండాలి. ధరల పెరుగుదలకు అనుగుణంగా దానిని
పెంచాలి. ఇటువంటి కనీస వేతనం అందుబాటులో లేనందున పట్టణ జనాభాలో నూటికి 74 శాతం మందికి రోజుకి 2100 కేలరీల ఆహరం అందుబాటులో లేకుండా పోతున్నది.
రెగ్యులర్
కార్మికులతో సమంగా అదేపని చేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్
కార్మికులకు వేతనాలివ్వలి
భారత దేశ
రాజ్యాంగం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కాబట్టి ఒక పని చేస్తున్న
క్యాజువల్, కాంట్రాక్ట్
కార్మికునికి అదే పని చేస్తున్న రెగులర్ కార్మికునితో సమంగా వేతనం ఇవ్వాలి. బి ఎస్
ఎన్ ఎల్ లో పని చేస్తున్న క్యాజువల్, కాంట్రాక్టు
కార్మికులకు గ్రూప్ డి తో సమంగా ఐ డి ఏ వేతనం ఇవ్వాలి.
బోనస్ పై పరిమితులు
తొలగించాలి
రు 10,000 లోపు జీతం
వచ్చేవారికే బోనస్ కు అర్హత వున్నదని, బోనస్
చెల్లింపుకు నెల జీతం రు 3500 గా మాత్రమే లెక్కించాలనీ బోనస్ చట్టంలో
విధించిన పరిమితులను ఎత్తి వేయాలి. సంస్థ లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా 8.33 శాతం (ఒక నెల
జీతం) కనీస బోనస్ ను చెల్లించాలి.
సార్వత్రిక సాంఘిక భద్రత
రెగ్యులర్
ఉద్యోగులకు పి ఎఫ్, పెన్షను, మెదికల్ సౌకర్యం, పనిలో వికలాంగులయినా, చనిపోయినా పరిహారం తదితర సాంఘిక భద్రత పథకాలు
అమలులో వున్నాయి. కానీ అసంఘతిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు ఇటువంటి సాంఘిక భద్రత అమలులో లేదు. అరకొరగా కొన్ని
పథకాలున్నా ప్రయోజనం నామ మాత్రం. 2008
లో అసంఘతిత కార్మికులకు
ప్రభుత్వము ఒక సాంఘిక భద్రతా చట్టాన్ని అమలులోకి తెచ్చింది. కానీ ఇది దారిద్ర్య
రెఖకు దిగువన వున్న వారికే వర్తిస్తుంది. మొత్తం 43 కోట్ల అసంఘటిత
కార్మికులలో కేవలం 6 కోట్ల మందికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
వ్యవసాయ కార్మికులకు ఇది వర్తించదు. అంతేగాక సంఘటిత రంగంలో పని చేస్తున్న అసంఘటిత
కార్మికులకు (ఉదాహరణకు బి ఎస్ ఎన్ ఎల్ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు, క్యాజువల్ కార్మికులకు) ఇది వర్తించదు. ఈ 6 కోట్లమందికయినా
సాంఘిక భద్రత అమలుకు అవసరమయిన నిధులు కేటాయించలేదు. కాబట్టి ఇటువంటి కంటి తుడుపు చట్టం కాకుండా అసంఘటిత రంగ కార్మికులందరికీ, సంఘటిత రంగంలో వున్న అసంఘటిత కార్మికులకు, గృహ పరిస్రమలలో
పని చేసేవారికి, ఇంటి పని మనుషులకు, పేద రైతులకు వ్యవసాయ కార్మికులకు
అందరికి వారు దారిద్ర్య రేఖకు దిగువన వున్నారా, ఎగువన వున్నారా
అనేదానితో నిమిత్తం లేకుండా వర్తించే విధంగా "సార్వత్రిక సాంఘిక భద్రతా
చట్టం" తీసుకు రావాలి. 60
సంవత్సరాల వయసు నిండిన
అనంతరం పెన్షను, వితంతువులకు పెన్షను, మెటర్నిటీ సౌకర్యాలు, ఆరోగ్య మరియు ప్రమాద బీమ, డిజెబిలిటీ అలవెన్సు, అందరికీ అందుబాటులో వుండే ప్రభుత్వ వైద్య
వ్యవస్థ ఈ చట్టం ద్వారా అందుబాటులోకి తేవాలి. ఇందుకు అవసరమయిన "జాతీయ సాంఘిక
సంక్షేమ నిధి" ని ఏర్పాటు చేసి దానికి తగినంత నిధిని కేటాయించాలి.
అమలు కాని కార్మిక చట్టాలు-పెరుగుతున్న దాడులు
బి ఎస్ ఎన్ ఎల్
తో సహా క్యాజువల్, కాంట్రక్టు
కార్మికులకు అనేక రంగాలలో కనీస వేతనాల చట్టం అమలు కావటం లేదు. చట్ట విరుద్ధంగా
పనిగంటలు పెంచుతున్నారు. పి ఎఫ్ సౌకర్యం సక్రమంగా అమలు చేయటం లేదు. రెగ్యులర్
ఉద్యోగులకు కూడా ఇ పి ఎఫ్ ను యాజమాన్యం సక్రమంగా చెల్లించటం లేదు. ప్రభుత్వము ఈ
ఉల్లంఘనలను పట్టించుకోటం లేదు. ఇంతేగాక ఇటివల హర్యానాలో వున్న మారుతీ కంపెనీలో 500 మంది ఉద్యోగులను అక్రమంగా తొలగించినా ఆ
ప్రభుత్వము పట్టించుకోటం లేదు.
ట్రేడ్ యూనియన్
హక్కుల పై దాడి
ట్రేడ్
యూనియన్ల రిజిస్ట్రేషన్ ను ఉద్దెశ పుర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. సంఘం
పెట్టుకున్నందుకు అనేక ప్రయివేటు పరిశ్రమలో కార్మికులను తొలగిస్తున్నారు. బి ఎస్
ఎన్ ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా కాంట్రాక్టు వర్కర్సు జీతం పెంచాలని
పోరాడితే తొలగిస్తున్నారు.అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐ ఎల్ ఓ ఆమోదించిన కన్వెన్షన్ 87(యాజమాన్యం జోక్యం
లేకుండా నిర్నిబంధంగా సంఘం పెట్టుకునే హక్కు) మరియు కన్వెన్షన్ 98(సమిష్టి బేరం హక్కు) ను భారత ప్రభుత్వము ఆమోదించేందుకు
నిరాకరిస్తున్నది.
గ్రాట్యుటీ పెంచాలి
డెత్ కం రిటైర్మెంటు గ్రాట్యుటీ చెల్లింపు
పరిమితిని కార్మికోద్యమ పోరాటాల ఫలితంగా రు 5 లక్షలనుండి రు 10 లక్షలకు పెంచారు. అయినప్పటికి దీనివలన ఎక్కువ మందికి ప్రయోజనం లభించటం లేదు. 16.5 నెలల జీతమే గరిష్టంగా ఇస్తున్నందున ఈ పరిస్థితి
ఏర్పడింది. కాబట్టి గ్రాటుఇటీ చెల్లింపును మరింతగా పెంచాలి.
అన్ని రంగాల
కార్మికుల, ఉద్యోగుల సాధారణ
డిమాండ్స్
విదేశీ, స్వదేశీ బడా
పెట్టుబడిదారుల లాభాలు కాపాడేందుకు,
మరింత పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాలను అమలు చేస్తున్నాయి, మరింత ఉధృతం చేస్తున్నాయి. ఈ దాడిని ప్రతిఘంటించేందుకు దేశ వ్యాపితంగా అన్ని
రంగాల కార్మికులు, ఉద్యోగులు అందరికీ వర్తించే ఈ క్రింది సాధారణ
డిమాండ్స్ కోసం ఫిబ్రవరి 20,21 తేదీలలో రెండు రోజులు దేశ వ్యాపిత సార్వత్రిక
సమ్మె చేయాలని 13 కేంద్ర కార్మిక సంఘాలు (సి ఐ టి యు, ఎ ఐ టి యు సి, ఐ ఎన్ టి యు సి, బి ఎం ఎస్, హెచ్ ఎం ఎస్ మొదలగునవి), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగుల సంఘాలు, బ్యాంకు, ఇన్సూరెన్సు
ఉద్యోగుల సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ
రంగ సంస్థల ఉద్యోగుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా బి ఎస్ ఎన్ ఎల్ లో బి
ఎస్ ఎన్ ఎల్ ఇ యు, ఎన్ ఎఫ్ టి ఇ, బి టి ఇ యు, ఎఫ్ ఎన్ టి ఓ తదితర నాన్ ఎగ్జిక్యూటివ్ సంఘాలన్నీ పిలుపునిచ్చాయి.
డిమాండ్స్
1.ధరల పెరుగుదలను
అరికట్టేందుకు నిర్దిష్టమయిన చర్యలు తీసుకోవాలి.
2. ఉద్యోగిత
పెంచేందుకు నిర్దిష్టమయిన చర్యలు తీసుకోవాలి.(బి ఎస్ ఎన్ ఎల్ లో వి ఆర్ ఎస్
ప్రతిపాదన విరమించాలి)
3. కార్మిక చట్టాలను
సక్రమంగా అమలు చేయాలి
4. సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేసే అసంఘటిత కార్మికులందరిని సాంఘిక భద్రత చట్టం పరిధిలోకి తేవాలి. జాతీయ
సాంఘిక భద్రత నిధిని ఇందు కోసం ఏర్పాటు చేయాలి.
5. ప్రభుత్వ రంగ
సంస్థల వాటాల అమ్మకాన్ని ఆపివేయాలి(బి ఎస్ ఎన్ ఎల్ లో వాటాల అమ్మకం ప్రతిపాదన
విరమించాలి)
6. శాశ్వత స్వభావం
కల పనులను, కొన్ని సంవత్సరాలు కొనసాగే పనులను కాంట్రాక్టు
కార్మికులతో చేయించే విధానాన్ని విరమించాలి.
7. అదే పని
చేస్తున్న రెగ్యులర్ వర్కర్సుతో సమంగా కాంట్రాక్టు కార్మికులకు వేతనం చెల్లించాలి.
8. అన్ని రంగాలకు
వర్తించే విధంగా, రు 10,000/- కనీస వేతనాన్ని
నిర్ణయించాలి. ధరల పెరుగుదలకు అనుగుణంగా దానిని పెంచాలి. ఇందుకనుగుణంగా కనీస వేతన
చట్టాన్ని సవరించాలి
9. బోనస్, పి ఎఫ్ ల పై వున్న పరిమితులన్నింటిని తొలగించాలి.
10. గ్రాత్యుటీ
చెల్లింపు మొత్తాన్ని పెంచాలి.
11. అందరికి పెన్షన్
సౌకర్యం కలిగించాలి. దానికి భద్రత కల్పించాలి.
12.అప్లికేషన్
పెట్టిన 45 రోజులలోగ ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్
చేయాలి.
13. ఐ ఎల్ ఓ
కన్వెన్షన్ 87, 98 లను భారత ప్రభుత్వము వెంటనే ఆమోదించాలి.
సార్వత్రిక సమ్మె
అవసరం
ఏ రంగానికి ఆ రంగంలో విడి విడిగా పోరాటాలు
చేయటంతో పాటు అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు తమ
ఉమ్మడి డిమాండ్స్ కోసం, తమ పై సరళీకరణ విధానాల పేరుతో జరుగున్న దాడిని
ప్రతిఘటించటం కోసం దేశ వ్యాపితంగా అన్ని రంగాలలో సార్వత్రికంగా, సమైక్యంగ పోరాటాలు, సమ్మెలు చేయటం ద్వారా ఉద్యమాన్ని మరింత బలోపేతం
చేయాలి. ఇప్పటికి మన దేశంలో 1991 నుండి 14 సార్లు ఇటువంటి
సార్వత్రిక సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలలో పాల్గొనేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ
వచ్చింది. రంగాల వారీగా విడి విడిగా జరిగే సమ్మెలతో పాటు ఈ సార్వత్రిక సమ్మెలతో
బలమయిన పోరాటాలు చేయటం వలన ఇప్పటి వరకు ప్రభుత్వ రంగాన్ని, పెన్షన్ ను, సంక్షేమ పథకాలను, దానితో పాటు
ఆర్థిక వ్యవస్థను కాపాడుకున్నాము. ప్రపంచ వ్యాపితంగా ఆర్థిక సంక్షోభం
వచ్చినప్పటికి దాని ప్రభావం మన ఆర్థిక వ్యస్థ పై ఎక్కువగా పడకుండా, మన ఆర్థిక వ్యవస్థ దివాళా తీయకుండా కాపాడుకోగలిగాము. దీనిని సహించలేని స్వదేశీ, విదేశీ బడా పెట్టుబడిదారులు ఇటీవల విపరీతంగా చేసిన ఒత్తిడివలన మన్మొహన్ సింగు
ప్రబుత్వము పైన తెలియ చేసిన విధంగా కార్మిక వ్యతిరెక, ప్రజా వ్యతిరేక చర్యలకు ఉధృతంగా పూనుకుంటున్నది. కాబట్టి కార్మికులు, ఉద్యోగులు గతంకన్నా ఎక్కువగా మరింత ఐక్యంగా ఈ రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో
పాల్గొని ఈ దాడిని ప్రతిఘటించాల్సిన అవసరం వున్నది.బి ఎస్ ఎన్ ఎల్ లో ప్రతి ఒక్క
ఉద్యోగి ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి.
·
ఫిబ్రవరి 20, 21 సార్వqత్రిక సమ్మెను
జయప్రదం చేయండి
·
కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి