పరాధీనతకు
పరాకాష్ట, టెలికాం లో 100% ఎఫ్ డి ఐ
12 రంగాలలో ఎఫ్ డి ఐ(విదేశీ
ప్రత్యక్ష పెట్టుబడి) పరిమితులను పెంచాలని లేదా ఆటోమేటిక్ రూట్ లో అనుమతించాలని 16.7.2013
న మన్మోహన్ సింగ్ ప్రభుత్వము నిర్ణయించింది. ఇందులో భాగంగా టెలికాం సర్వీసుల
రంగం(ల్యాండ్ లైన్ మరియు మొబైల్ సర్వీసుల రంగం) లో ఎఫ్ డి ఐ పరిమితిని ఇప్పుడున్న
74 శాతం నుండి 100 శాతం కు పెంచాలని నిర్ణయించింది. (గతం లో ఈపరిమితి 49
శాతం గా వుండగా, 3.11.2005న 74 శాతం కు పెంచింది).
టెలికాం
పరికరాల ఉత్పత్తి రంగం లో ఎఫ్ డి ఐ పరిమితి గతం లోనే 100 శాతం వున్నది. ఈ విధంగా
టెలికాం పరికరాల తయారీ రంగం తో పాటు టెలికాం సర్వీసుల రంగం లో కూడా ఎఫ్ డి ఐ
పరిమితి 100 శాతం అయింది. పరికరాల తయారీ రంగం లో ఎఫ్ డి ఐ 100 శాతం ఆటోమేటిక్ గా, వచ్చిన
నెల రోజుల లోగా రిజర్వు బ్యాంకుకు తెలియజేసి రావచ్చు. టెలికాం సర్వీసుల రంగం లో 49 శాతం వరకూ ఈ ఆటోమేటిక్ రూట్ లో రావచ్చు. 50
నుండి వంద శాతం వుంటే ఎఫ్ ఐ పి బి(ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్
బోర్డ్) అనుమతి తో రావచ్చు. ఈ విధంగా భారత భాగస్వామి లేకుండా విదేశీ కంపెనీలు
టెలికాం పరికరాల తయారీ రంగం లో, సర్వీసుల రంగం లో
ప్రవేశించేందుకు తలుపులు తెరిచారు.
రాబోయే
ఐదు సంవత్సరాలలో టెలికాం రంగం లో 5 లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడి అవసరం. అంత మనదగ్గర
లేనందున 100 శాతం ఎఫ్ డి ఐ కి అనుమతించి
ప్రోత్సహించాల్సి వచ్చిందని కమ్యూనికేషన్సు మంత్రి కపిల్ సిబాల్ ఈ నిర్ణయానికి గల
కారణాన్ని వివరించారు. 5
లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు 5 సంవత్సరాలలో మన టెలికాం రంగం లోకి
వస్తాయనుకోటం వాస్తవ విరుద్ధం. విదేశీ పెట్టుబడులను విచ్చలవిడిగా అనుమతించినందున
దేశం అభివృద్ధి చెందుతుందనటం అంతకన్నా వాస్తవ విరుద్ధం. ప్రజలను నమ్మించటానికి
చెప్పే సాకులు ఇవి.
ఏప్రిల్
2000 నుండి డిసెంబరు 2012 వరకు మన టెలికాం రంగం లోకి(పరికరాల ఉత్పత్తి, సర్వీసులు అన్నీ
కలిపి) వచ్చిన ఎఫ్ డి ఐ, రూ. 57585 కోట్లు మాత్రమే. వాస్తవం
ఇది కాగా రానున్న ఐదు సంవత్సరాలలో 5 లక్షల కోట్ల ఎఫ్ డి ఐ ఏ విధంగా వస్తుంది? పైగా టెలికాం సర్వీసుల మార్కెట్టు గతం లో విస్తరించినంత వేగంగా ఇప్పుడు
విస్తరించటం లేదు.
ఎఫ్
డి ఐ వలన మనకి పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందనే వాదన నిజం కాలేదు.
పైగా అందుకు విరుద్ధంగా జరిగింది. 2000 ఏప్రిల్ నుండి 2012 డిసెంబరు వరకు వచ్చిన
ఎఫ్ డి ఐ రూ. 57585 కోట్లు మాత్రమే కాగా టెలికాం పరికరాల దిగుమతికి మనము 2004
ఏప్రిల్ నుండి 2012 డిసెంబరు వరకు రూ.3,11,714 కోట్లు విదేశీ
కంపెనీలకు చెల్లించాము. అంటే మనకు వచ్చింది రూ. 57585 కోట్లు అయితే ఇచ్చింది రూ.3,11,714
కోట్లు! టెలికాం పరికరాల తయారీ రంగం లో 100 శాతం ఎఫ్ డి ఐ ని
ఆటోమేటిక్ రూట్ లో అనుమతించినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి
చేసుకుంటున్నామేగాని మనకి మనముగా అభివృద్ధి చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. టెలికాం
రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించిన లెక్కల ప్రకారం మన టెలికాం నెట్వర్క్స్ విస్తరణకు
వినియోగించిన పరికరాల విలువలో కేవలము 11 శాతాన్ని మాత్రమే మన దేశంలో సృష్టిస్తుండగా 89 శాతం విదేశాలకు
చెల్లిస్తున్నాము.
మన
టెలికాం సర్వీసుల నెట్ వర్క్సును విదేశాలనుండి దిగుమతి చేసుకున్న పరికరాలతో ఈ
విధంగా విస్తరించుకుంటూ పోతే అది దేశ భద్రతకు ముప్పు తెస్తుందని హోమ్ శాఖ అన్నది. విదేశాలనుండి దిగుమతి చేసుకునే
పరికరాలలో మనకి తెలియకుండానే దానికి తగిన కోడ్ ను సాఫ్ట్ వేర్, హార్డ్వేర్, ఫర్మ్ వేర్ లలో అమర్చి మన
సమాచారాన్ని విదేశీ ఏజెన్సీలు తెలుసుకునే అవకాశం వున్నది. కీలక సమయాలలో మన టెలికాం నెట్వర్కు పనిచేయకుండా
చేసే అవకాశం వున్నది. కాబట్టి టెలికాం
నెట్ వర్క్సు విస్తరణలో భారత దేశం లో తయారయిన పరికరాల వాడకం శాతం పెరగాలని హోమ్ శాఖ అన్నది. దీనికి అనుగుణంగా ప్రభుత్వరంగ
సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు క్రమంగా తమ
నెట్వర్క్సు విస్తరణలో విదేశీ పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికాం శాఖ
5.12.2012 ను ఆదేశించింది. ఇదే విధానాన్ని
ప్రయివేటు టెలికాం ఆపరేటర్లు కూడా కొన్ని కీలకమయిన పరికరాల విషయం లో అమలు చేయాలని
ఒక డ్రాఫ్ట్ ఆర్డరు ను(ఇది ఫైనల్ ఆర్డర్ కాదు, చిత్తు ప్రతి
మాత్రమే) వెబ్ సైట్ లో పెట్టింది.
దీనికి
వ్యతిరేకంగా అమెరికా-భారత బిజినెస్
కవున్సిల్(ఇది అమెరికా బడా పెట్టుబడిదారులు, భారత బడా పెట్టుబడిదారులు కలిసి ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్, దీని హెడ్ క్వార్టర్సు వాషింగ్టన్ లో వున్నది) విదేశీ టెలికాం పరికరాల
తయారీ కంపెనీలు, అమెరికా ప్రభుత్వము,
భారత ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల అసోసియేషన్ “సి ఓ ఏ ఐ”(సెల్యులార్ ఆపరేటర్స్
అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రధాన మంత్రి కార్యాలయం పై వత్తిడి తెచ్చాయి. చివరకి
ఇటీవలే ప్రధాన మంత్రి కార్యాలయం ఇందుకు
అనుగుణంగా స్పందించి స్వదేశీ టెలికాం పరికరాల వినియోగాన్ని పెంచాలనే నిబంధన
ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లకు
మాత్రమే వర్తింపజేయాలని, ప్రయివేటు టెలికాం ఆపరేటర్లను
మినహాయించాలని నిర్ణయించింది.ఇందుకు
అనుగుణంగా 8.7.2013 న ప్రకటన జారీ చేసింది(http://pmindia.nic.in/press-details.php?nodeid=1660 లో
ఈ ప్రకటన చూడవచ్చు). దీని ప్రకారం స్వదేశీ టెలికాం పరికరాలకు ప్రాధాన్యతనివ్వాలనే
సూత్రం ప్రయివేటు ఆపరేటర్లకు(ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా , రెలయన్స్
కమ్యూనికేషన్స్, టాటా టేలిసర్వీసెస్,
మొదలగునవి) వర్తింపజేయకూడదు. అసలు “భద్రత” అంటే ఏమిటి?
ఎవరికి భద్రత? అనే సంశయం మన్మోహన్ సింగ్ గారికి వచ్చింది.
విదేశీ స్వదేశీ బడా పెట్టుబడిదారులకు ఏది లాభమో అదే “భద్రత’
అని ఆయన ఉద్దేశం. కాబట్టి “భద్రత ” ని పునర్నిర్వచించాలని ఈ ప్రకటనలో ప్రధాన
మంత్రి, నేషనల్ సెక్యూరిటీ కవున్సిల్ సెక్రెటేరియట్ ను
ఆదేశించారు!ఆగస్టు 8 లోగా ప్రయివేటు టెలికాం ఆపరేటర్లకు నిర్ణీబంధంగా విదేశీ
పరికరాల దిగుమతిని అనుమతించే విధంగా కొత్త గైడ్ లైన్స్ ను తయారు చేసి ను తయారు చేసి కేబినెట్ ఆమోదానికి పంపించాలని
ఆదేశించారు.
టెలికాం
సర్వీసుల రంగం లో 100 శాతం ఎఫ్ డి ఐ ని అనుమతించినందువలన జరిగేదేమిటి?వివిధ టెలికాం
సర్వీసుల కంపెనీలలో ఎఫ్ డి ఐ ఈ క్రింది విధంగా ప్రస్తుతం వున్నది:
1.
వోడాఫోన్-74
శాతం(వోడాఫోన్ బ్రిటిష్ కంపెనీ), భారత దేశపెట్టుబడి-11 శాతం పిరామల్ గ్రూపు, 13%
అనల్జిత సింగ్, ఐ డి
ఎఫ్ సి గ్రూప్ లు)
2.
ఎయిర్సెల్
–74 శాతం మ్యాక్సిస్ (సింగపూర్ కంపెనీ), 26 శాతం అపోలో హాస్పిటల్స్ గ్రూపు(భారతపెట్టుబడి)
3.
యూనినార్
–49 శాతం టెలినార్(నార్వే), 51 శాతం సన్ ఫార్మా(భారత పెట్టుబడి)
4.
సిస్టెమా
శ్యామ్(ఎంటి ఎస్)—56.68 శాతం సిస్టెమా గ్రూపు(రష్యా కంపెనీ), 17.14 శాతం రష్యా
ప్రభుత్వము –మొత్తం 73.82 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)
5.
భార్తి
ఎయిర్టెల్ –32.25 శాతం సింగ్ టెల్
(సింగపూర్), 5 శాతం కాతార్ ఎండోమెంట్ ఫౌండేషన్(కాతార్)-మొత్తం 37.25 శాతం , మిగతాది భార్తి గ్రూపు(స్వదేశీ)
6.
ఐడియా
సెల్యులార్—యాక్సియేటా గ్రూపు(మలేషియా)-20.98 శాతం, మిగతాది ఆదిత్య బిర్లా తదితర స్వదేశీ
పెట్టుబడి)
7.
రిలయన్స్
కమ్యూనికేషన్స్—ఎఫ్ డి ఐ దాదాపు లేదు, 68.06 శాతం అనిల్ అంబానీ గ్రూప్ పెట్టుబడులు
8.
టాటా
టేలిసర్వీసెస్—26 శాతం డో కొ మొ(జపాన్), మిగతాది టాటా గ్రూప్ తదితర భారత పెట్టుబడి. (పత్రికలలో వార్తల ప్రకారం
రష్యా కంపెనీ సిస్టెమా, డో కో మో నుండి 26 శాతాన్ని, టాటా నుండి మరి కొంత శాతాన్ని
కొని మెజారిటీ భాగస్వామి కావాలని ప్రయత్నిస్తున్నది)
9.
బి
ఎస్ ఎన్ ఎల్—నూటికి నూరు శాతం భారత ప్రభుత్వ పెట్టుబడి, ఎఫ్ డి ఐ గాని, స్వదేశీ ప్రయివేటు పెట్టుబడిగానీ లేదు.
10. ఎం టి ఎన్ ఎల్—58.67% భారత
ప్రభుత్వ పెట్టుబడి, మిగతాది ప్రయివేటు పెట్టుబడి; ఎఫ్ డి ఐ లేదు.
అయితే
ఎఫ్ డి ఐ పరిమితి 100 శాతం చేసినందున ఉత్సాహపడి ఎఫ్ డి ఐ పెద్ద ఎత్తున వస్తుందా? వచ్చే పరిస్థితి
లేదు. తాము పెద్ద ఎత్తున రావాలంటే ఎఫ్ డి ఐ పరిమితిని 100 శాతం కు పెంచితే చాలదని
విదేశీ పెట్టుబడిదారులంటున్నారు. మరిన్ని రాయితీలివ్వలంటున్నారు. తమకి ఇప్పుడున్న
74 శాతం ఎఫ్ డి ఐ నూరు శాతం కావాలంటే 26 శాతం వాటాదారుల వాటాలను కొని స్వాధీనం
చేసుకోవాలి. లేదా రెడు మూడు కంపెనీలు కలిసి ఒకే కంపెనీగా మారటానికి (విలీనం) వీలు
కలిపించాలి. ఈ కలయికలు, విలీనాలు తేలికగా, ఎటువంటి షరతులూ లేకుండా జరగాలని కోరుతున్నాయి. అంతేగాక స్పెక్ట్రమ్ వేలం
లో కనీస ధర చాలా ఎక్కువగా నిర్ణయించారనీ, దానిని తగ్గించాలనీ
కోరుతున్నాయి. చట్టం ప్రకారం వోడాఫోన్ చెల్లించాల్సిన రూ.11200 కోట్లు పన్ను ను
వసూలు చేయకుండా వుండాలని కోరుతున్నాయి. ప్రయివేటు టెలికాం కంపెనీలు బ్యాంకులనుండి
అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాయి. కానీ ఈ అప్పులు తీర్చటం ఇబ్బందికరంగా
తయారయింది. కాబట్టి కొన్ని వాటాలు విదేశీ పెట్టుబడులకు అమ్ముకోటం లేదా మొత్తముగా
తమ వాటాని విదేశీ పెట్టుబడిదారులకు అమ్ముకోటం మార్గమని భావించాయి. అందువలన అవి
విదేశీ పెట్టుబడులు మరింత రావాలని కోరుతున్నాయి. అవి రావటానికి వీలుగా ఎఫ్ డి ఐ పరిమితి
100 శాతం చేయటంతో పాటు అనేక రాయితీలివ్వాలని కోరుతున్నాయి. ప్రయివేటు టెలికాం
సర్వీసుల కంపెనీలు చట్టాలని, నిబంధలనీ ఉల్లంఘించినందుకు
దాదాపు రూ.20,000 కోట్ల వరకూ పెనాలిటీలు చెల్లించాలి. ఈ
చెల్లింపునుండి కూడా మినహాయింపు కోరుతున్నాయి.
ఈ
రాయితీలన్నీ ఇచ్చేందుకు ప్రభుత్వము సిద్ధమవుతున్నది. ఈ నెల ఆఖరులోగా కలయిక, స్వాధీనాలను
సరళీకరిస్తూ గైడ్ లైన్స్ ను ప్రకటిస్తామని
కమ్యూనికేషన్స్ మంత్రి కపిల్ సిబాల్ ప్రకటించారు.
కలయిక లేదా స్వాధీనం వలన ఏర్పడే
కంపెనీకి మార్కెట్ లో(మొత్తం టెలికాం వినియోగదారులలో) 35 శాతం ఆటోమేటిక్ గా వుండ
వచ్చునని, టి ఆర్ ఏ ఐ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్
ఇండియా) అనుమతితో 60 శాతం వరకూ ఉండవచ్చునని ఈ గైడ్ లైన్స్ లో ప్రకటించబోతున్నట్లు
పత్రికలలో వార్తలు వస్తున్నాయి. స్పెక్ట్రమ్ వేలం లో కనీస ధర తగ్గించేందుకు
ప్రభుత్వము ప్రయత్నిస్తున్నది. కనీస ధర ఎంత తగ్గించవచ్చో
పరిశీలించాలని టి ఆర్ ఏ ఐ ని కోరింది. వోడాఫోన్ పై విధించిన పన్నును
తగ్గింవ్చేందుకు, ప్రయివేటు టెలికాం కంపెనీలపై విధించిన
పెనాలిటీలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నది. ఈ రాయితీలన్నీ ఇచ్చినా జరిగేది
ఏమిటి?
టి
ఆర్ ఏ ఐ లెక్కల ప్రకారం 30.4.2013 నాటికి వివిధ టెలికాం సర్వీసుల కంపెనీల మార్కెట్
వాటా(వైర్
లైన్, మొబైల్ వినియోగ దారుల మొత్తం సంఖ్యలో వాటా) ) ఈ క్రింది విధంగా వున్నది:
1.
భార్తి
ఎయిర్టెల్ =21.78 శాతం
2.
వోడాఫోన్=17.74
శాతం
3.
రిలయన్స్
కమ్యూనికేషన్స్=14.27 శాతం
4.
ఐడియా=14.17
శాతం
5.
బి
ఎస్ ఎన్ ఎల్=11.42 శాతం
6.
టాటా=7.57
శాతం
7.
ఎయిర్సెల్=6.93
శాతం
8.
యూనిటెక్(యూనినార్)=3.67
శాతం
9.
సిస్టెమా
శ్యామ్=1.16 శాతం
10. ఏం టి ఎన్ ఎల్(ఇది ఢిల్లీ, ముంబయి కే పరిమితమయిన
ప్రభుత్వరంగ సంస్థ)=0.56%
11.
లూప్=0.34
శాతం;
12. విడియోకాన్=0.25 శాతం
13. క్వాడ్రాంట్=0.16 శాతం
విదేశీ
పెట్టుబడిని నూరు శాతం అనుమతించినందున, కలయిక, స్వాధీనాలు సరళం చేసినందున, ఇతర రాయితీలిచ్చినందున పై
కంపెనీలలో కొన్ని ఒక దానితో ఒకటి కలిసి లేదా ఒకటి మరో దానిని కొని స్వాధీనం
చేసుకుని పెద్ద కంపెనీలుగా మారే అవకాశం వున్నది. వోడాఫోన్ మిగతా 24 శాతాన్ని కొని
100% విదేశీ యాజమాన్యపు కంపెనీ అయ్యే అవకాశం వున్నది. ఇదే విధంగా ఎయిర్సెల్, యూనినార్, సిస్టెమా శ్యామ్ లను విదేశీ కంపెనీలు
పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం వున్నది. ఎయిర్టెల్,
రిలయన్స్, ఐడియా సెల్యులార్, టాటా టేలిసర్వీసెస్
లలో విదేశీ పెట్టుబడిది పై చెయ్యి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కలయికలు, స్వాధీనాలు జరిగి ఇప్పుడున్న 13 కంపెనీలకు బదులు 5 లేదా 6 భారీ స్థాయి
కంపెనీలు మాత్రమే రంగం లో మిగులుతాయి.దీని వలన కొన్ని కంపెనీల మార్కెట్ వాటా
భారీగా పెరుగుతుంది. ఈ పోటీలో బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ల మార్కెట్ వాటా మరింత తగ్గే పరిస్తితి
ఏర్పడుతుంది. గత నాలుగు సంవత్సరాలనుండీ నష్టాలలో
వున్న బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ ల పరిస్తితి
మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది.
100%
ఎఫ్ డి ఐ పరిమితి వలన టెలికాం పరికరాల తయారీ రంగం దెబ్బతిన్నది. విదేశాలపై ఆధార
పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెలికాం పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఐ
టి ఐ 2003 నుండి నష్టాలలో వున్నది. కేబుల్సు తయారు చేసే ప్రభుత్వ రంగా సంస్థ హెచ్ సి ఎల్ 1993 నుండీ నష్టాలలో వున్నది. మన
దేశం లో జరుగుతున్న కొద్దిపాటి టెలికాం పరికరాల ఉత్పత్తి లో కూడా అధిక శాతాన్ని
ఇక్కడ ఫ్యాక్టరీలను పెట్టిన మోటారోలా, నోకియా, జడ్ టి ఈ , సామ్సుంగ్
తదితర విదేశీ కంపెనీలే చేస్తున్నాయి.
ఇదే
విధంగా ఇప్పుడు ఎఫ్ డి ఐ పరిమితి టెలికాం సేవల రంగం లో 100 శాతం చేసినందున గత
నాలుగు సంవత్సరాలనుండి నష్టాలలో వున్న ప్రభుత్వ రంగ సంస్థలు బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు
మరింత నష్టాలలో కూరుకు పోయే పరిస్తితి ఏర్పడుతుంది. వాటి మార్కెట్ వాటా ఇప్పుడున్న
11.98 శాతం నుండి మరింత భారీగా తగ్గుతుంది. టెలికాం సర్వీసుల రంగం లో 90 శాతం పైగా
మార్కెట్ ను అచ్చం విదేశీ కంపెనీలు, లేదా విదేశీ పెట్టుబడిదే పై చేయిగా వున్న కంపెనీలు నడిపే పరిస్తితి
ఏర్పడుతుంది.
విదేశాలలో
తయారయిన ఎక్విప్మెంటు తో ఏర్పడిన టెలికాం సర్వీసుల నెట్ వర్కులు, ఆ నెట్ వర్కులను
నిర్వహించే విదేశీ టెలికాం సర్వీసుల కంపెనీలు,
కునారిల్లుతున్న స్వదేశీ టెలికాం పరికరాల తయారీ పరిశ్రమ-ఇది ఈ విధానాల ఫలితం.
ఇది
మన దేశ భద్రతకు ప్రమాదం కాదా?కాదని మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అంటున్నది. కానీ ఈ విధానాలను
అవలంబించాలని మన పై ఒత్తిడి చేస్తున్న అమెరికా తన దేశం లో ఏమి చేస్తున్నది? అది టెలికాం రంగం లో విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతించ లేదు.
అమెరికా కమ్యూనికేషన్స్ చట్టం లోని సెక్షన్ 310 ప్రకారం టెలికాం సర్వీసుల రంగం లో
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 25 శాతం మించిన సందర్భం లో అది దేశ ప్రయోజనాలకు విరుద్ధమని అమెరికా ప్రభుత్వము
భావిస్తే అనుమతి నిరాకరించవచ్చు. ఇటీవలే అమెరికా హౌస్ కమిటీ చైనా టెలికాం పరికరాల
తయారీ కంపెనీలయిన జడ్ టి ఇ మరియు హువాయి లతో వ్యాపారం చేయకూడదని, దేశ భద్రత రీత్యా ఇది అవసరమని తమ టెలికాం కంపెనీలను హెచ్చరించాయి. తమ
వ్యాపారాన్ని దెబ్బ తీసే దురుద్దేశంతోటే హౌస్ కమిటీ ఈ విధంగా చేస్తున్నదని ఈ చైనా
కంపెనీలు ఖండించాయి. మనకన్నా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం టెలికాం రంగం లో కలిగి
వున్న అమెరికాయే విదేశీ టెలికాం పరికరాలపై, విదేశీ టెలికాం
సంస్థలపై ఇటువంటి ఆంక్షలు విధిస్తుంటే మన ప్రభుత్వము ఎందుకు విదేశీ టెలికాం
పరికరాల దిగుమతిని, విదేశీ టెలికాం సర్వీసుల కంపెనీలను 100
శాతం ఎఫ్ డి ఐ పరిమితితో అనుమతిస్తున్నది? విదేశీ టెలికాం
కంపెనీలు మన దేశం లో టెలికాం సర్వీసులను భారత భాగస్వామ్యం లేకుండా నిర్వహించటం
చాలా ప్రమాదకరమని హోమ్ శాఖ హెచ్చరించినా ప్రభుత్వము ఎందుకు పట్టించుకోటం లేదు?ప్రతిపక్షం లో వున్న బి జె పి కూడా ఈ విధానాలకు అనుకూలమే. అందుకనే అది ఈ విధానాలకు
వ్యతిరేకంగా ఉద్యమించటం లేదు. ప్రాంతీయ పార్టీలు కూడా పెట్టుబడిదారులకు అనుకూలమయిన
దృక్పథం తో పని చేస్తూ ఈ విధానాలను వ్యతిరేకించటం లేదు. దేశ భద్రతకన్న, ప్రజాప్రయోజనాలకన్నా విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కును పెంచుకుంటూ మన
దేశం లో అదే విధముగా విదేశాలలో తమ లాభాల వేటను కొనసాగిస్తున్న స్వదేశీ బడా
పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ పార్టీలు వుండటమే ఇందుకు కారణం.
అమెరికా లో ప్రయివేటు టెలికాం కంపెనీలయిన
వేరిజోన్,
స్ప్రింట్ మొదలయినవి ఇంటర్నెట్ సంస్థ లయిన
మైక్రోసోఫ్ట్, గూగుల్, యాహూ, స్పైక్, పాల్ టాక్ మొదలగునవి వినియోగదారులలో ఎవరు
ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎక్కడినుండి మాట్లాడుతున్నారు, ఇంటర్నెట్ లో ఏ
సమాచారం చూస్తున్నారు, ఏ సమాచారం పంపుతున్నారు తదితర వివరాలన్నీ
రహస్యంగా అమెరికా ప్రభుత్వానికి
తెలియజేస్తున్నాయి. ఇవి ఇతరదేశాల ప్రజల, సంస్థల సమాచారాన్ని
కూడా తెలియజేస్తున్నాయి. ఈ పరిస్థితులలో
ఇంటర్నేట్ పై, టెలికాం వ్యవస్థ పై అమెరికా ఆధిపత్యాన్ని, విదేశీ ఆధిపత్యాన్ని పెరగటానికి అనుమతించటం మన దేశ ప్రయోజనాలకు హానికరం.
దేశ భద్రత రీత్యా మాత్రమేగాక టెలికాం రంగములో మన స్వావలంబనను కూడా ఈ విధానాలు దెబ్బ
తీస్తున్నాయి. విదేశాలనుండి టెలికాం ఎక్విప్మెంటు కొనుగోలుకు లక్షలాది కోట్ల
రూపాయిలు చెల్లించాల్సిన పరిస్థితిని ఈ విధానాలు సృష్టించాయి. స్వదేశీ టెలికాం
పరికరాల పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడుతున్నది. స్వదేశీ టెలికాం సాంకేతిక
పరిజ్ఞానం అభివృద్ధికి అవసరమయిన పరిశోధనలు , పరిశోధనా
సంస్థలు మూలన పడ్డాయి. టెలికాం సర్వీసుల మార్కెట్టు పూర్తిగా విదేశీ పరమవుతున్నది.
ప్రభుత్వరంగ సంస్థలు ఐ టి ఐ, హెచ్ సి ఎల్ లు ఖాయిలా పడ్డాయి.
బి ఎస్ ఎన్ ఎల్, ఎం
టి ఎన్ ఎల్ లు గత నాలుగు సంవత్సరాలనుండి నష్టాలతో నడుస్తున్నాయి. టెలికాం రంగములో
రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గి తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. కార్మిక
హక్కులను కత్తిరించాలని విదేశీ,స్వదేశీ ప్రయివేటు టెలికాం
కంపెనీల ప్రతినిధులు వాదిస్తున్నారు. బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి
ఎన్ ఎల్ లలో ఉద్యోగుల సంఖ్యని భారీగా తగ్గించి వాటిని ముక్కలుగా విభజించి
ప్రయివేటు పరమ్ చేసే ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి.
కాబట్టి
ఈ దివాళాకోరు సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నాయముగా సరయిన విధానాలను ప్రతిపాదించి
అందుకోసం పోరాడాల్సిన అవసరం వున్నది. ఎఫ్ డి ఐ ని మన సాంకేతిక పరిజ్ఞానాన్ని
పెంపొందించుకునేందుకు, ఉద్యోగాలు పెరిగేందుకు, మన పరిశ్రమలు అభివృద్ధి
చెండేందుకు అవసరమయిన మేరకే వినియోగించుకోవాలితప్ప దానిపైనే పూర్తిగా ఆధారపడి
స్వావలంబన కోల్పోవటాన్ని వ్యతిరేకించాలి. స్వదేశీ టెలికాం సాంకేతిక పరిజ్ఞానం
అభివృద్ధిని,
స్వదేశీ టెలికాం పరికరాల తయారీ సంస్థలను , స్వదేశీ
టెలికాం సర్వీసుల సంస్థలను ప్రోత్సహించాలి. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ లయిన ఐ టి
ఐ, బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లను
ప్రోత్సహించాలి. చైనా లో టెలికాం సర్వీసుల కంపెనీలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే. ఆ
విధముగా చైనా ప్రభుత్వము టెలికాం సర్వీసుల మార్కెట్టును తన ఆధీనములో వుంచుకుని
దాని ఆధారముగా విదేశీ టెలికాం పరికరాల తయారీ సంస్థల పై ఒత్తిడి తెచ్చింది. అవి తమ దేశములో ఒక చైనా
కంపెనీ భాగస్వామిగా పెట్టుబడి పెట్టవచ్చునని , కానీ అందుకు
బదులుగా అవి తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా కంపెనీకి బదిలీ చేయాలని షరతు
విధించింది. ఆ విధముగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది దాని పై మరిన్ని
పరిశోధనలు చేసి స్వదేశీ టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహించింది. దీని ఫలితంగా
చైనా టెలికాం పరికరాల తయారీ కంపెనీలయిన జడ్ టి ఇ, హువాయి
మొదలయినవి మనదేశానికేగాక అమెరికా తదితర దేశాలకు కూడా టెలికాం పరికరాలను పోటీపడి
అమ్మగలిగే స్థాయికి ఎదిగాయి. వాటి ధాటికి అమెరికా యే బెంబేలెత్తిపోయే పరిస్తితి
ఏర్పడింది. కాబట్టి టెలికాం సర్వీసులలో ఎఫ్ డి ఐ పరిమితిని 100 శాతం పెంచే
విధానాన్ని ప్రభుత్వము వెంటనే ఉపసంహరించాలి. టెలికాం రంగములో స్వావలంబనను
పెంపొందించే విధానాలను అవలంబించాలి.
--పుతుంబాక
అశోకబాబు
జాతీయ
ఉపాధ్యక్షులు, బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్