Wednesday, February 10, 2016

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సమస్యలు



                అభివృద్ధి, వెనుకబాటుతనం గురించి దేశంలోను, రాష్ట్రంలోను నేడు పెద్ద చర్చ జరుగుతోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని నరేంద్రమోడీ, నూతన రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేయగలనని చంద్రబాబు- ప్రజలను నమ్మించి ఇరువురూ అధికారంలోకి వచ్చారు. ఏడాదిన్నర కాలం పైగా జరుగుతున్న పరిణామాల ప్రత్యేకత ఏమి టంటే అభివృద్ధి ముసుగులో ఈ ఇరువురి నాయ కులు నయా ఉదారవాద విధానాలను మరింత స్పీడుగా అమలు చేయడం. 
మనరాష్ట్రంలో చంద్రబాబునాయుడుగారు రాష్ట్ర అభివృద్ధికి జిల్లాకో ఎయిర్పోర్టు, పరిశ్రమల స్థాపనకు ప్రతిజిల్లాలో లక్ష ఎకరాల ల్యాండ్ బ్యాంక్, ఇంటికో ఉద్యోగం, నదులు అనుసంధానం, ప్రపంచలోనే అగ్రగామి రాజ ధాని నిర్మాణం, మెకిన్ ఆంధ్రప్రదేశ్ వంటి అనేక రూపాల్లో ప్రయత్నాలు చేస్తునట్లు ప్రకటి స్తున్నారు. ఈ ప్రకటనలు మాటల వరకేనా? ఆచరణ రూపం దాలుస్తాయా? అన్నదానిని బట్టి రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. 
రాష్ట్ర విభజనముందు, తర్వాత కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చర్చనీయాంశ మైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో నియమించిన శ్రీకృష్ణ కమీషన్, విభజన చట్టం - రెండింటి లోను వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి చెప్పబడింది. రాయలసీమలో నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, ప్రకా శం జిల్లా - రాష్ట్రంలోని 13 జిల్లాలలో 8 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఉన్నాయి. మిగిలిన 5జిల్లాలు అంటే ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలు అభివృద్ధి జిల్లాలుగా ఉన్నాయి. రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే, సాధించిన అభివృద్ధిని నిలుపు కుంటూ, వెనుకబడిన జిల్లాలను / ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి. ఇది ఏ రకంగా చేయాలో తెలుసుకోవడానికి అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి ఎలా సాధ్యం? వంటి రెండు ప్రాధమిక విషయాలను పరిశీలించాలి. వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాల్లో మార్పులను ఈ వ్యాసంలో పరిశీలించడం జరిగింది.
రాష్ట్రంలో పరిస్థితి : మన రాష్ట్రంలో నూతన పరిశ్రమల స్థాపన, విద్యుత్ ప్లాంట్లనిర్మాణం, ఎయిర్పోర్టుల వంటి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు భూములు ఇవ్వడానికి రైతులు, పవర్ప్లాంట్లు వద్దని ఆ ప్రాంతాల లోని ప్రజలు పెద్దఎత్తున ప్రతిఘటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట, కాకరాపల్లి, పోరాకి వంటి ప్రాంతాల్లోను, నెల్లూరు, కాకినాడలలోను పవర్ప్లాంట్స్ నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్దఉద్యమాలు సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ముగ్గురు, కాకరాపల్లిలో ముగ్గురు పోలీసుకాల్పుల్లో ప్రాణాలు కూడా కోల్పోయారు. భోగాపురం, గన్నవరం, కుప్పం విమానశ్రాయా లకు భూములు ఇవ్వడానికి రైతులు నిరాకరిస్తు న్నారు. విశాఖజిల్లా పూడిమడక వద్ద ప్రభుత్వ రంగ ఎన్.టి.పి.సి పరిశ్రమస్థాపనకు ఆ ప్రాంత ప్రజలు ఒప్పుకోవడం లేదు.
ఇక్కడ ఒక సందేహం సహజంగానే వస్తుం ది. అదేమంటే పరిశ్రమల స్థాపనకు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రయత్ని స్తుంటే ప్రజలు ఎందుకు వృత్తిరేకిస్తున్నట్లు? ప్రజలు అభివృద్ధి నిరోధకులా? లేదా కొన్ని స్వార్ధపర శక్తులు వారిని రెచ్చగొడుతున్నాయా? ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న వారిని ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి రాక్షసుల్లా అడ్డు పడుతున్నారని అంటున్నారు. అటువంటి రాక్షసు లా ప్రజలు? ప్రజలు ఈ రకంగా ఉంటే ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? 
ఈ ప్రశ్నలన్నింటికి ఖచ్చితంగా సమాధానా లు సరైనవిగా ఉండాలి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే అమాయకులు కాదు ప్రజలు. రెచ్చ గొట్టడాలు కూడా దీర్ఘకాలం సాధ్యంకాదు. సోం పేటలో ధర్మల్ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు గత 5సం||లుగా పోరాడుతున్నారు. ప్రభుత్వాన్ని నిలవరించారు. ప్రజలలో బలమైన సంకల్పం లేకపోతే ఇంత దీర్ఘకాల ఉద్యమం సాధ్యంకాదు. మరి ప్రభుత్వం ప్రజల ఆలోచన లను ఎందుకు గౌరవించడం లేదు? ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎందు కు ప్రయత్నించడం లేదు?
పోనీ ప్రజలు అభివృద్ధిని కోరుకోరు, భూములను వదిలి మెరుగైన జీవితానికి వెళ్ళరు, మార్పును ఆమోదించరు, కూపస్తు మండూ కాలుగా ఉండడానికి ఇష్టపడతారని అనుకుం దామా! అంటే నేటి పరిస్థితులకు భిన్నంగా పరిశ్రమలు, ప్రాజెక్టులస్థాపనకు స్వచ్ఛందంగా భూమిలిచ్చిన చరిత్ర ఆంధ్రరాష్ట్ర ప్రజలకుంది. ఉదాహరణకు మన రాష్ట్రంలోని అతిపెద్ద స్టీల్ప్లాంట్కు సుమారు 36వేల ఎకరాల భూమిని 16450 మంది రైతుల నుండి 1984-90 సం||లో ప్రభుత్వం సేకరించింది. రైతులు ఎలాంటి ప్రతిఘటన లేకుండా భూములు ఇంత పెద్దఎత్తున ఇచ్చారు. మరి ఇప్పుడు తక్కువ భూములను ఇవ్వడానికి కూడా ఎందుకు నిరాకరిస్తున్నారు? ఇది తెలుసుకోవా లంటే అసలు అభివృద్ధి అంటే ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం వెతకాలి.
అభివృద్ధి అంటే ఏమిటి?
అభివృద్ధి గురించి నోబెల్ బహుమతి గ్రహీత డా||అమార్త్యసేన్ ఈ క్రింది విధంగా తెలిపారు. ''అభివృద్ధి ప్రజల జీవితాలను మెరుగుపరిచేదిగా ఉండాలి. ప్రజల సామర్ధ్యా లను పెంచేదిగా, తమ భవిష్యత్ను తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ నిచ్చేదిగా ఉండాలి''. 
అమర్త్యసేన్ చెప్పిన విషయాన్ని పరిగణన లోనికి తీసుకుని, నేడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలి. ఉదాహరణకు స్టీల్ప్లాంట్ నిర్మాణానికి రైతులు భూములిచ్చా రంటే దానికి కారణం ప్రభుత్వరంగ పరిశ్రమలో మంచి ఉపాధి లభిస్తుందని, తమ జీవితాలు మెరుగుపడతామని భావించారు కాబట్టే. వారి భావన సరైనదని కూడా నేడు నిరూపించ బడింది. భూములిచ్చి నిర్వాసితులైన రైతులు స్టీల్ప్లాంట్లో మంచి ఉపాధినే పొందారు. మెరుగైన జీతాలు పొందుతున్నారు. గతంలో వ్యవసాయంపై వారుపడ్డ కష్టం, పొందిన ఆదాయాలతో పోలిస్తే ఖచ్చితంగా నేడు మెరు గైన జీవన విధానాన్ని కలిగిఉన్నారు. నిర్వాసితు లలో ఇంకా కొంతమందికి ఉపాధి రాలేదు, కాని ఉపాధి వచ్చిన వారు మాత్రం సుఖంగానే ఉన్నారు. అందరికీ మెరుగైన జీవనం కలుగుతుం దంటే ప్రజలు ముందుకు వస్తారని ఈ అను భవం తెలుపుతోంది. 
దీనికి భిన్నమైన మరో అనుభవం కూడా విశాఖ జిల్లాలోనే ఉంది. అచ్యుతాపురం ఎస్ఇ జెడ్లో రైతుల నుండి 6947 ఎకరాల భూమిని 2006 సం||లో ప్రభుత్వం సేకరించింది. రైతులు భూములు ఇవ్వడానికి ప్రతిఘటించినా ప్రభుత్వం బలవంతంగా లాక్కొంది. 6 వేల మంది నిర్వాసితులయ్యారు. అందరికీ ఉపాధి కల్పిస్తామని నమ్మబలికింది. ఈ భూములను వివిధ కంపెనీలకు చౌకగా ఇచ్చింది. ఉదాహర ణకు 'బ్రాండిక్స్' అనే బహుళజాతి కంపెనీకి ఎకరానికి సం||నికి ఒకరూపాయి చొప్పున వెయ్యి ఎకరాలను లీజుకు ఇచ్చింది. ఆ కంపెనీ 60వేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిసి, కేవలం 25 వేల మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చింది. వీరిలో భూములు కోల్పోయిన రైతులు, ఉపాధి కోల్పోయిన వృత్తిదారులు నామ మాత్రంగా ఉన్నారు. 90శాతం మంది నిర్వాసితులకు సెజ్లో ఉపాధి కల్పించబడలేదు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగభద్రత లేదు. నెల వేతనం రూ|| 5-6 వేలు మాత్రమే. విపరీతమైన పని ఒత్తిడి వీటికి తోడు వృత్తి సంబంధిత వ్యాధులకు కూడా గురవుతున్నారు. ఇక్కడ రైతులు మెరుగైన జీవితాలను కోల్పోయి ఏ ఉపాధిలేక బికారుల్లా మారుతున్నారు. ఒక బహుళజాతి కంపెనీ ప్రయోజనాలకోసం, వేలమంది రైతుల జీవితా లను ఫణంగా పెట్టినదానికి తార్కాణం ఇది.
అయినా రైతులు భూములివ్వడానికి ముందుకు వస్తారని ఆశించడం సమంజసమా? తమ జీతాలు బుగ్గిపాలవుతుంటే ప్రతిఘటిం చడం రాక్షసత్వం ఎలా అవుతుంది? పై రెండూ రెండు భిన్నమైన అనుభవాల ఆధారంగా నేడు రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను పరిశీలిద్ధాం.
కాలుష్యపరిశ్రమలు :
అభివృద్ధి పేరుతో నేడు రాష్ట్ర తీరప్రాంతం లో అనేక మందుల, రసాయిన పరిశ్రమలు వస్తున్నాయి. వీటివల్ల ఈ ప్రాంత ప్రజలకు వస్తున్న ఉపాధి అతితక్కువ. అదే సందర్భంలో భూములు, వృత్తులు కోల్పోతున్నవారు మాత్రం అధికం. ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలు ష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. నీరు కలుషిత మవుతోంది. పశుసంపద నాశన మవుతోంది. రసాయిన వ్యర్ధాలు సముద్రంలో కలవడంతో రాష్ట్రంలోని 982 కి||మీ|| తీరప్రాంతంలోని మత్స్య సంపద నాశనమై మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ విచ్చలవిడి పారిశ్రామికీకరణ వల్ల పర్యావరణం ధ్వంసం అవుతోంది. కోస్తాతీరం ఎక్కువగా వున్న శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదా వరి, నెల్లూరు జిల్లాలలో వస్తున్న పరిశ్రమలన్నీ ఇలాంటివే. ఈ కాలుష్యకారక పరిశ్రమల వల్ల ప్రజల జీవితాలు మెరుగు అవడం మాట అటుంచి, మరింత దుర్భరంగా మారుతున్నాయి. 
అనేక ధర్మల్ పవర్ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. పెద్దఎత్తున భూము లను సేకరిస్తోంది.ఈ ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్ దేశంలో ఎక్కడైనా అమ్ముకుని లాభాలు గడించుకునే స్వేచ్ఛ ఆ పరిశమ్రలకు ఉంది. స్థానికులకు మాత్రం భూమి, భుక్తి పోయి, ధూళీ, కాలుష్యం మిగులుతాయి. అందుకే ప్రజలు వీటి స్థాపనకు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు. 
విచిత్రంగా అమార్త్యసేన్ చెప్పినట్లు ఇక్కడ ప్రజలకు తమకు ఏంకావాలో చెప్పుకునే స్వేచ్ఛను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. వ్యతిరేకించినవారిని అభివృద్ధి నిరోధకులుగా ప్రభుత్వం ముద్రవేస్తుంది. ప్రతిఘటించినవారిపై తీవ్ర నిర్భంధం ప్రయోగిస్తోంది. 
విమానాశ్రయాలు : ప్రతి జిల్లాకి కనీసం ఒక విమానాశ్రయాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు తన అభివృద్ధి పథకంలో భాగంగా ప్రకటిం చారు. ఈ విమానాశ్రయాల వల్ల ఆ ప్రాంత ప్రజలు కోల్పోయేదేమిటి? పొందే దేమిటి? అన్నది ప్రధాన అంశం.
నేడు భోగాపురం, కుప్పంలలో విమానా శ్రయాల నిర్మాణం, గన్నవరంలో విస్తరణ కోసం రైతుల నుండి భూసేకరణకు ప్రభుత్వం పూనుకుంది. భోగాపురంలో 3873 ఎకరాలు, కుప్పంలో 600 ఎకరాలు, గన్నవరంలో 650 ఎకరాల భూమిని రైతులు నుండి సేకరిస్తామని తెలిపింది. రైతులు భూములివ్వడానికి ఒప్పుకోవడం లేదు. నాగార్జునసాగర్ (గుంటూ రు), దొనకొండ (ప్రకాశం), తాడేపల్లిగూడెం (ప||గో), ఓర్వకల్లు (కర్నూలు), దగదర్తి (నెల్లూ రు)లలో 5 ఎయిర్పోర్టులకు 7వేల ఎకరాల భూసేకరణకు పూనుకుంది. విశాఖపట్నం అంత ర్జాతీయ విమానాశ్రయానికి 15వేల ఎకరాలు అవసరమని ప్రతిపాదించింది. 
విమానాశ్రయాలకు ఇంత భూమి అవసరమా అన్నది పెద్ద ప్రశ్న. ఉదాహరణకు దేశంలోనే అతిపెద్ద ముంబాయి ఎయిర్పోర్టు 1850 ఎకరాలల్లో ఉంది. చెన్నై 1200 ఎకరాలు, అహమ్మదాబాద్ 1180 ఎకరాలు, త్రివేండ్రం ఎయిర్పోర్టు 700 ఎకరాలు కంటే తక్కువ భూమిలో ఉన్నాయి. ఇవన్నీ మహానగరాలు మరి అటువంటి ఎయిర్పోర్టులకే అవసరం లేనింత భూమి మన రాష్ట్రంలో ఎయిర్పోర్టులకెందుకు? ముంబాయి కంటే విశాఖపట్నం పెద్ద కేంద్ర మా? లేక త్రివేండ్రం కంటే కుప్పాం పెద్ద కేంద్రమా?
అవసరాలకు మించి భూములు సేకరించ డానికి ప్రభుత్వం ఎందుకు పూనుకుంటోంది? రైతులను రోడ్డుపై పడేసి, రియల్ఎస్టేట్ వ్యాపా రాన్ని ప్రోత్సహించడానికి కాదా? తమకు మెరు గైన జీవితం కలుగుతుందనే నమ్మకం, భరోసా ప్రభుత్వం కల్పిస్తే రైతులు భూములివ్వడానికి సిద్ధపడతారేమో. కాని ప్రభుత్వం ఆపని చేయక పోగా, భూసేకరణకు వేరే అప్రజాస్వామిక మార్గం ఎంచుకుంది. ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది? ఎందుకంటే ప్రభుత్వానికి కూడా తెలుసు, ఈ విమానాశ్రాయాల వల్ల భూములు కోల్పోయిన రైతులకు దమ్మిడి ప్రయోజనం కూడా ఉండదని. ఇక్కడ ప్రభుత్వానికి కావలసింది కొంతమంది సంపన్నులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనం తప్ప మరొకటి కాదు. అయితే ప్రభుత్వం మాత్రం ఆశ్చర్యకరంగా తాము అభి వృద్ధికి కృషి చేస్తుంటే, కొంతమంది రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని వాదన చేస్తోంది. ఇది అభివృద్ధా?. వేలాది మంది ప్రజలను రోడ్డున పడేసే చర్యలతో అభివృద్ధి ఎలాసాధ్యమవు తుంది. కాని ఇది తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం చేస్తున్న వాదన సరైనదేనా? వేరే మార్గంలో అభివృద్ధి సాధ్యం కాదా? ఇవి తెలు సుకోవాలంటే అభివృద్ధి మార్గాలేమిటో పరిశీలించాలి. 
అభివృద్ధి మార్గాలు 
ఏ ప్రాంతమైనా, ఏదేశమైనా అభివృద్ధి ఎలా సాధించవచ్చో ప్రముఖ ఆర్ధికవేత్త డబ్ల్యు.ఏ లూయీస్ ఈ క్రింది విధంగా తెలిపారు. 
1. ఆ ప్రాంతంలోని వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. 
2. విధానాలు భవిష్యత్తుకు ఉపయోగ పడేలా వుండాలి.
3. ప్రతి ఒక్కరికీ ఫలాలు అందేలా అభివృద్ధి వుండాలి.
పై నియమాలు పాటిస్తే వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి సాధిస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటి దాకా అభివృద్ధి చెందిన దేశాలు / ప్రాంతాలన్నీ ఈ విధంగానే అభివృద్ధి సాధించాయి. అలాగే ఈ సూత్రాలను పాటించకపోతే అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా వెనుకబాటు చెందుతాయని కూడా ఆయన తెలిపారు. ఈ కోణం నుండి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేయవచ్చు, అభివృద్ధి చెందిన జిల్లా లలో ఎలా అభివృద్ధిని కొనసాగించవచ్చు అన్న విషయాలను పరిశీలించాలి. 
బాగా వెనుకబడ్డ ప్రాంతంగా ఉత్తరాం ధ్రను, బాగా అభివృద్ధి చెందిన పశ్చిమగోదావరి జిల్లాలను శాంపిల్స్గా తీసుకుందాం. లూయీస్ తెలిపిన సూత్రాల ఆధారంగా వీటిని క్లుప్తంగా పరిశీలిద్దాం.
ఉత్తరాంధ్ర : రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖపట్నం జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు. ఇక్కడ ప్రధాన వనరులు 
1) విశాలమైన తీర ప్రాంతం
2) ప్రభుత్వరంగ పరిశ్రమలు
3) దట్టమైన అటవీ ప్రాంతం
4) అధిక వర్షపాతం
పై వనరులను సక్రమంగా వినియోగించు కోవడం ఎలా వుందో చూద్దాం.
అధిక వర్షపాతం : మన రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న జిల్లాలివి. సగటున 1050 మి.మీ. పైగా మూడు జిల్లాలలో వర్షం కురుస్తోంది. అయితే విచిత్రంగా సాగునీరు, త్రాగునీరు సమస్యలు ఇక్కడ తీవ్రంగా వున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో విస్తారంగా భూమి వున్నా సాగులోవున్న భూమి బాగా తక్కు వ. ఉదాహరణకు కాలువలు, బావుల ద్వారా సాగు అవుతున్న భూమి రాష్ట్రంలో అతి తక్కువగా విశాఖపట్నంలో 92 వేల హెక్టార్లు, 93 వేల హెక్టార్లతో విజయనగరం జిల్లాలు అట్టడుగున వున్నాయి. సాగునీరు లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఉత్పాదకత కూడా చాలా తక్కువగా వుంటోంది. 2013-14 సం||లో వరి ఉత్పాదకత హెక్టారుకు శ్రీకాకుళంలో 1749 కెజీలు (13వ స్థానం) విశాఖపట్నం 1752 కేజీలు (12వ స్థానం), విజయనగరం 2491 కేజీలు (10వస్థానం)లో వున్నాయి. అంటే అత్యధిక వర్షపాతం వున్నా వ్యవసా యంలో అత్యంత వెనుకబడ్డ జిల్లాలుగా ఉత్తరాంధ్ర జిల్లాలు వున్నాయి. ఆ నీటిని నిల్వ చేసుకునే ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించక పోవడంతో వర్షపు నీరు వృధాగా బంగాళా ఖాతంలో కలిసిపోతోంది. 
తీర ప్రాంతం : ఉత్తరాంధ్రలో 353 కి||మీ పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉండి చేపలు, రొయ్యలకు సముద్రతీరం ఉపయుక్తంగా వుం డేది. రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా విశాఖ వుండేది. అయితే నయా ఉదారవాద విధానాలు అమలవుతున్న గత రెండున్నర దశాబ్దాల కాలంలో సముద్రతీరంలో మత్య్స సంపద క్రమేణా కనుమరుగవడం ప్రారంభ మైంది. తీరప్రాంతం వెంబడి నిర్మిస్తున్న మందు లు, రసాయన పరిశ్రమలు, ధర్మల్ఫవర్ప్లాంట్ల వ్యర్ధాలు సముద్రంలో కలవడంతో ఈ ప్రాంతం లోని మత్య్స సంపద నాశనవడమే కాకుండా తీవ్ర పర్యావరణ సమస్యలు కూడా తలెత్తు తున్నాయి. ఫలితంగా మత్య్సకారులు వృత్తి కోల్పోయి రోడ్డున పడ్డారు. కొత్తగా నెలకొల్పు తున్న ఇటువంటి పరిశ్రమలలో వీరికి వస్తున్న ఉపాధి కూడా దాదాపు శూన్యం. ఒకప్పుడు గౌరవంగా బ్రతికిన మత్య్సకారులు నేడు బికారు ల్లా తిరుగుతున్నారు. 
ప్రభుత్వరంగ పరిశ్రమలు : ఉత్తరాంధ్ర ఈ మాత్రంగానైనా వుందంటే దానికి ప్రధాన కార ణం విశాఖలోని ప్రభుత్వరంగ పరిశ్రమలు. విశాఖ ఆర్ధికాభివృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషి స్తున్నాయి. వీటివల్ల విశాఖజిల్లా స్థూల ఉత్పత్తి 64,458 కోట్లరూపాయలు, తలసరి ఆదాయం రూ|| 1,24,162లతో రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. అంతేకాక మెరుగైన సౌక ర్యాలు కలిగిన ఉపాధి అవకాశాలకు కేంద్రంగా విశాఖ ప్రభుత్వరంగ పరిశ్రమలున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ధిక, పారిశ్రామిక రాజధానిగా విశాఖ విలసిల్లడానికి ఈ ప్రభుత్వరంగ పరిశ్రమ లే ప్రధాన కారణం. 
అయితే నయా ఉదారవాద కాలంలో ఈ పరిశ్రమలను బలహీన పరిచే చర్యలను పాల కులు చేపట్టారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినావిశాఖపట్నం స్టీల్ప్లాంట్ కు స్వంత గనులను కేటాయించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. ఓబులా పురం గనులను ఇంకా ఉనికిలో లేని బ్రాహ్మణీ స్టీల్కు కేటాయించిన రాష్ట్రప్రభుత్వం విశాఖ స్టీల్ప్లాంట్కు మాత్రం ఆ గనులను కేటాయించ లేదు. మరో ప్రక్క స్టీల్ప్లాంట్లో 10% వాటాల అమ్మకంతో ప్రారంభించి, ప్రైవేటీకరణ చేయాల ని కుట్ర పన్నుతున్నారు. 
ఇతర ప్రభుత్వరంగ పరిశ్రమలైన హిందూ స్థాన్ షిప్యార్డు, బి.హెచ్.పి.విలు ఆర్డర్ల లేమితో కొట్టుమిట్డాతున్నాయి. విశాఖపట్నం పోర్టులోని 26 బెర్తులు ఏదోఒక రూపంలో ప్రైవేట్ సంస్థల నిర్వహణలో వున్నాయి. పోర్టు లోని కీలకమైన ''ఓర్హేండ్లిగ్ ప్లాంట్'' ను బహుళజాతి వేదాంత కంపెనీకి ధారాదత్తం చేసారు. విశాఖ కేంద్ర కార్యాలయంగా వున్న ' డ్రైడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' కష్టాల కడలిలో వుంది. ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగి, విశాఖ ఆర్ధికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన విశాఖ ప్రభుత్వరంగ పరిశ్రమలు నేడు ఇలా కూనారిల్లుతున్నాయి. 
దట్టమైన అటవీ ప్రాంతం : రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉత్తరాంధ్రలో వుంది. విశాఖ జిల్లాలో 2326.41 చ||కి||మీ విస్తీర్ణంలో దట్ట మైన అడవులు వున్నాయి. 2011 జనాభా లెక్క ల ప్రకారం రాష్ట్రంలో మొత్తం గిరిజనులు 15, 40,133 మంది వుండగా, వారిలో 10, 20,174 (75%) మంది అంటే మూడు వంతులకుపైగా గిరిజనులు ఉత్తరాంధ్రలోనే వున్నారు. 
గిరిజన ప్రాంతం అపారమైన అటవీ సంపదను, అరుదైన ఔషద వృక్షాలను, ప్రపంచ ప్రఖ్యాత ఆర్గానిక్ కాఫీని సృష్టిస్తోంది. కాఫీ, పిప్పళ్ళు, చింతపండు, పసుపు, మిరియాలు, తేనె, కూరగాయలు, ఫలాలు విస్తారంగా దొరు కుతాయి. వీటిని వినియోగించుకుని ఆ ప్రాంతా న్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయవచ్చు. వెనుక బడ్డ గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చు. అయితే ఈ సంపదను వినియోగించుకునే చిన్న, సహకార పరిశ్రమలు ఏవీ ప్రభుత్వం స్థాపించక పోవడం తో, ఈ సంపదంతా దళారుల పాలవు తోంది. దీనివల్ల అపార సంపదవున్నా, గిరిజనులుపాధి కోసం వలసలు పోవలసిన దుస్థితి ఏర్పడింది. 
అభివృద్ధికి అవసరమైన ఈ చర్యలేవీ ప్రభుత్వం చేపట్టకపోగా, నేడు అభివృద్ధి పేరుతో వినాశకర బాక్సైట్ తవ్వకాలకు సిద్ధపడింది. ఈ తవ్వకాలవల్ల ఆ ప్రాంతంలోని గిరిజనులు నిరాశ్రయులవడమే కాక, తీవ్ర పర్యావరణ సమ స్యలు తలెత్తుతాయి. గిరిజనులు, పర్యావరణ వేత్తలు, మేధావులు వద్దని ఎంతగా వారిస్తున్నా నేటి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ప్రజలను మోసపుచ్చి, బాక్సైట్ నిక్షేపాలను అన్రాక్, జిందాల్ సంస్థలకు ధారపోయాలని కంకణం కట్టుకుంది. దీనికి ప్రభుత్వం చేస్తున్న వాదనేమిటంటే, అత్యంత విలునైన బాక్సైట్ను వృధాగా వదలిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని? ఈ వాదన బయటకు చూడడానికి బాగానే వుంటుంది. కాని కొద్దిగా పరిశీలిస్తే రెండు విషయాలు అవగతమవుతాయి. ఒకటి ఈ త్రవ్వకాల వల్ల రెండు ప్రైవేట్ సంస్థలు లాభపడ తాయి తప్ప, గిరిజనులకు ఒరిగేదేమీ వుండదు. దుమ్ము, ధూళీ, కాలుష్యం, భూమి కోల్పోవడం తప్ప. రెండవది అతి ముఖ్యమైన విషయమేమి టంటే బాక్సైట్ నిక్షేపాలు తవ్వుతున్న కొద్దీ హరించుకుపోతాయి తప్ప కొత్తగా ఊరవు. మరి అంతా ఖాళీ ఆయన తర్వాత ఆ ప్రాంత భవిషత్ ఏమిటి? పచ్చగావున్న గిరిజన ప్రాంతం బీడుగా మారడమే. భవిష్యత్ నాశనమయ్యే ఇటువంటి చర్యల వల్ల అభివృద్ధి సాధ్యం కాదని లూయీస్ అభివృద్ధి సిద్ధాంతం తెలుపుతోంది.
పుష్కలంగా వున్న వనరులను వినియోగిం చుకోకపోవడమే నేటి ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణం. వర్షపు నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం కాదు. ప్రభుత్వ రంగ పరిరక్షణ, కాలుష్యకారక పరిశ్రమల నుండి తీర ప్రాంతాన్ని రక్షించడం, అటవీ ఉత్పత్తులను పూర్తిగా వినియోగించుకుని, గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారానే అభివృద్ధి సాధ్యం. ప్రజలందరి క్షేమం కోరేవారైతే ఇటు వంటి చర్యలే చేపట్టాలి. కాని నేడు పాలకులు ఈ అభివృద్ధి చర్యలు చేపట్టడానికి పసేమిరా నిరాకరిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను వంచన చేసి, ప్రకృతి వనరులను ప్రైవేట్ సంస్థలు కొల్లగొట్టకుపోవడానికి అనుమతిస్తు న్నారు. వద్దు మొర్రో అని ప్రజలు మొత్తుకుంటు న్నా, కాలుష్య కారక పరిశ్రమలను విచ్చలవిడిగా అనుమతిస్తున్నారు. ఆఖరుకు పరిశ్రమల స్థాపనకు చట్టప్రకారం చేపట్టవలసిన ప్రజాభి ప్రాయ సేకరణ కూడా నిర్బంధం ప్రయోగించి, ఒక ఫార్సుగా మార్చివేయడం రివాజుగా మారింది. ఇటువంటి వినాశకర చర్యల వల్ల అభివృద్ధి ఎడారిలో ఎండమావే. వీటివల్ల వెనుకబాటు తనం పోదు, సరికదా ఉత్తరాంధ్ర మరింత వెనుకబాటుతనంలోకి నెట్టడుతుంది. 
వెనుకబడిన ప్రాంతాల పరిస్థితి ఇలా వుండగా అభివృద్ధి అయిన జిల్లాలుగా వున్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వస్తున్న మార్పు లను పరిశీలిస్తే రాష్ట్ర అభివృద్ధి ఏ దిశలో వుంది, ఎటువంటి భవిష్యత్ వైపు మనం పయనిస్తున్నమనే విషయాలు అవగతమవుతాయి. 
అభివృద్ధి చెందిన జిల్లాలలో వస్తున్న మార్పులు: 
ఉమ్మడి రాష్ట్రంలోను, నూతన రాష్ట్రంలోను అభివృద్ధి చెందిన జిల్లాలుగా ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలు వున్నాయి. దీనికి కారణం ఆ జిల్లాలు వ్యవసాయంలో సాధించిన అభివృద్ధి ఈ అభివృద్ధికి మూలం ఆ జిల్లాలలో వున్న గోదావరి, కృష్ణ వంటి నదీ జలాలను సక్రమంగా వినియోగించుకోవడం. ఫలితంగా వరిసాగు, ఇతర ఆహార ధాన్యాల ఉత్పాదకత, ఉత్పత్తిలో ఈ జిల్లాలు అగ్రభాగాన వున్నాయి. అయితే ఇది ఒకప్పటి మాట. గత రెండు దశాబ్ధాలకు పైగా అమలవుతున్న సరళీకరణ విధానాల ప్రభావం ఈ జిల్లాలపై కూడా తీవ్రంగా పడుతోంది. దీనివల్ల జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి సగటు ఆదాయాలలో కూడా ఈ జిల్లాల అభివృద్ధిలో మార్పులు వస్తున్నాయి. 2004 - 05 - 2012-13 ల మధ్య ఈ రెండు సూచికలలో వచ్చిన మార్పులను ప్రక్కనున్న వివరాల ద్వారా గమనించవచ్చు. 
పై వివరాలను పరిశీలిస్తే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్థూల ఉత్పత్తి వాటా ఈ 8సం||లో తగ్గిందని తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా వాటా 2004-05లో 12.82% నుండి 2012-13కు 10.55కు తగ్గింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇదే కాలంలో 9.42% నుండి 8.45%కు తగ్గింది. మిగిలిన మూడు జిల్లాలలో స్వల్పంగా పెరుగుదల కనపడుతుంది. ఉభయ గోదావరి జిల్లాలలో తగ్గడానికి ఒక ప్రధానమైన, కీలకమైన కారణం వుంది. అదే మంటే ఈ రెండు జిల్లాలు వరిసాగు, అత్యధి కంగా వున్న జిల్లాలు. 
రాష్ట్రంలో గత 10 సం||రాల కాలంలో వరి ఉత్పత్తి క్రమేణా తగ్గడం గమనించవచ్చు. దీని కారణం వరిసాగు భూమి తగ్గడం, ఉత్పాదకత కూడా తగ్గడం. 2005-06లో వరిసాగు భూమి మొత్తం రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు ఉండగా 2013-14కు 25 లక్షల హెక్టార్లకు తగ్గింది. వరి ఉత్పత్తి కూడా 2005-06లో 1.17 కోట్ల టన్నులు ఉండగా 2013-2014కు 79లక్షలకు పడిపోయింది. ఉదాహరణకు పశ్చిమగోదావరి జిల్లాలో కాలువలు ద్వారా వ్యవసాయం క్రమేణా తగ్గుతోంది. 1991-92లో కాలువ ద్వారా వ్యవసాయం ఈ జిల్లాలో 2.05 లక్షల హెక్టార్లలో జరగగా 2013-14కు 1.75 లక్షల హెక్టార్లకు తగ్గింది. ఇదే కాలంలో హెక్టారుకు వరి ఉత్పాదకత కూడా 3394 కేజీల నుండి 3191 కేజీలకు పడిపోయింది. ప్రభుత్వ విధానాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే నిరంతరం సశ్య శ్యామలంగా ఉండే ఉభయగోదావరి జిల్లాలలో రైతులు 2011లో మొట్టమొదటిసారి పంట శెలవు (క్రాప్ హలీడే) ప్రకటించే దుస్థితి ఏర్పడింది. 
పశ్చిమగోదావరి జిల్లాను ఆంధ్రరాష్ట్ర ''ధాన్య భాండాగారం'' అని పిలుస్తారు. అటువంటి జిల్లాలో ఇటువంటి పరిణామం జరగడం ఆందోళన కలిగించే విషయం. దీన్ని పరిశీలించవలసివుంది. 
1980వ దశకంలో రాష్ట్రంలో రొయ్యల చెరువులు త్రవ్వడం ప్రారంభమైంది. రాష్ట్ర 982 కి||మీ కోస్తా ప్రాంతంలో ఉప్పునీటి వనరులు పుష్కలంగా వుండడంతో రొయ్యల ఉత్పత్తిని ఎగుమతుల ద్వారా వాణిజ్యం కోసం ప్రభుత్వం ప్రోత్సహించింది. 1980లో రాష్ట్ర మత్య్సశాఖ 17వేల హెక్టార్లు రొయ్యల సాగుకు అనుకూలమని గుర్తించింది. 
రాష్ట్రంలో 1990లో 6వేల హెక్టార్లలో ప్రారంభమైన రొయ్యల సాగు 2012కు 84,951 హెక్టార్లకు పెరిగింది. 2012 ఆఖరుకు దేశంలో మొత్తం 2 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తికాగా, అందులో 1.6 లక్షల టన్నులు (80%) ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యాయి. ఈ ఉత్పత్తికి ప్రధాన కారణం పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువగా రొయ్యల సాగు పెరగడం. ఈ జిల్లాలో 1987సం||లో 240.20 హెక్టార్ల నుండి 2012కు 25,438 హెక్టార్లకు ఈ సాగు విస్తరించింది. అంటే 10 రెట్ల పైగా భూమిలో రొయ్యల సాగు పెరిగింది. వరిపంట కంటే, రొయ్యల సాగు లాభదాయ కంగా వుండడంతో నయా ఉదారవాద విధానాల కాలంలో ప్రభుత్వం ఈ పంటకు రైతులను ప్రోత్సహించింది, సబ్సిడీలూ ఇచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, లాభదాయ కంగా వుండడం వంటి కారణాలవల్ల రైతులు కూడా పెద్దఎత్తున రొయ్యలపంటకు మొగ్గు చూపారు. వరిసాగు భూమిని రొయ్యల చెరువు లుగా మార్చారు. కేవలం ఉప్పునీటి భూమిలోనే కాకుండా ఉప్పునీటిలో మంచినీటిని కూడా కలిపి చెరువులను ఏర్పరచారు. ఈ భూములు భవిష్యత్లో వ్యవసాయానికి ఉపయోగపడవు. ఈ మార్పు ప్రభావంతో వరి ఉత్పత్తి,ఉత్పాదకత తగ్గడమే కాకుండా కాలుష్యం, ఉపాధి, భవిష్యత్ అవసరాలు, ఇతర సామాజిక సమస్యలు తలెత్తు న్నాయి. 
కాలుష్యం : ప్రతి టన్ను రొయ్యలు / చేపల ఉత్పత్తికి 42-66 కేజీల నైట్రోజన్ వ్యర్ధాలు, 72- 10.5 కేజీల ఫాస్పరస్ వ్యర్ధాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. పంటను మార్చి మరో రొయ్యల పంటను చెరువులను సిద్ధం చేస్తున్న ప్పుడు ఒక హెక్టారుకు ఒక టన్ను రసాయన వ్యర్ధాలు వెలువడుతాయి. ఈ వ్యర్ధాలు నేరుగా పరిసర నీటిలో కలిసిపోతాయి. ఈ చెరువుల లోని ఉప్పునీరు ఇంకిపోయి భూగర్భ జలాల్లో కలిసిపోతుంది. (నేషనల్ ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరి)
దీనివల్ల వ్యవసాయం దెబ్బతినడమే కాక ప్రజలను త్రాగునీరు కూడా లేకుండా పోయింది. భూగర్భ నీటి నుండి దుర్వాసన రావడమే కాకుండా, చర్మవ్యాధులు, డయేరియా, అమీబయాసిస్ వంటి రోగాల బారిన ప్రజలు పడుతున్నారు. ఉదాహరణకు జిల్లాలో 60% పైగా రొయ్యలసాగు జరుగుతున్న భీమవరం రెవిన్యూ డివిజన్లోని అనేక గ్రామాల ప్రజలు 15 కి||మీ దూరం కూడా వెళ్ళి మంచినీరు తెచ్చుకోవలసి వస్తోంది. 
కాలుష్యమే కాక రొయ్యల సాగువల్ల ఉష్ణోగ్రత పెరగడం, కరువు, వరదలు, గాలి వానలు, సముద్రమట్టం పెరగడం వంటి దీర్ఘ కాల ఆనర్ధాలకు దారితీసి పెద్ద ఎత్తున పర్యా వరణ సమస్యలు ఉద్భవిస్తాయి. (డిసిల్వా, సోటో 2009, పొన్నయ్య, మురళీధర్ 2009)
ఉపాధి : వ్యవసాయంలో పోలిస్తే రొయ్యల సాగుకు మానవశ్రమ తక్కువ. ఉదాహరణకు ఒక హెక్టారు వరిసాగుకు 125 పని దినాలు అవసరమైతే అదే రొయ్యలసాగుకు 80 పని దినాలు కంటే తక్కువ మాత్రమే సరిపోతాయి. దీనివల్ల ఉపాధి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విష యాన్ని గమనించాలి. అదేమంటే వ్యవ సాయం బాగా అభివృద్ధి చెందింది కాబట్టి పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు ఎక్కువగా వుంటారని భావిస్తాం. కాని విచిత్రంగా 2011లో రాష్ట్రంలోనే అత్యధికంగా వ్యవసాయ కార్మికులు ఈ జిల్లాలో ఉన్నారు. జిల్లాలోని మొత్తం 15,63,867 మంది ప్రధాన కార్మి కులలో 9,11,184 మంది (58.26%) వ్యవ సాయ కార్మికులే. ఉపాంగ కార్మికులు 2,44, 426 మంది వుండగా వీరిలో 1,77,817 (72.75%) మంది వ్యవసాయ కార్మికులుగా వున్నారు. వ్యవసాయం తగ్గిపోవడం, రొయ్యల సాగులో ఉపాధి తక్కువగా వుండడంతో గ్రామీణ నిరుద్యోగం ఈ జిల్లాలో పెద్దఎత్తున పెరుగుతోంది. గమనించవలసిన విషయం ఇక్కడేమిటంటే మహిళలు రొయ్యల సాగులో సాధారణంగా పాల్గొనకపోవడం. దీనివల్ల సాధారణ నిరుద్యోగం పెరగడంతో పాటు, మహిళలతో నిరుద్యోగం మరింత ఎక్కువగా పెరగడం ప్రత్యేకతంగా గుర్తించాలి. వీరిలో అత్యధికులు దళితులు. ఈ మహిళలు మరో ఆధారం లేక ఇంటి పనుల కోసం విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్దేశాలకు వలసపోతున్నారు. ఈ సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో ఇతరత్రా అంత ప్రాధాన్యంలేని భీమవరం పట్టణంలో ప్రత్యేకంగా 'పాస్పోర్టు ఆఫీస్' ను నెలకొల్పారు. 5 జిల్లాలకు కేంద్రంగా ఉన్న విశాఖ పాస్పోర్టు ఆఫీసులో 2009లో 61,745 పాస్పోర్టులు జారీకాగా, 2012లో 1,10,526 పాస్పోర్టులు జారీ చేసారు. అంటే కేవలం మూడు సంవత్స రాలలో పాస్పోర్టుల జారీ 44% పెరిగింది. ఈ పెరుగుదలో అధికభాగం పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉంది. 
ఇతర సామాజిక సమస్యలు : 
కాలుష్యం, పర్యావరణం, ఉపాధి వాటి సమస్యలే కాక అనేక ఇతర సామాజిక సమస్యలు కూడా పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్పన్నమవుతున్నాయి. 
1. అక్షరాస్యత పెరుగుదల రాష్ట్రంలోనే అత్యల్వంగా వుంది. 2001-11 మధ్య 10 సం||రాల కాలంలో రాష్ట్రంలో అక్షరాస్యత 6.98% పెరగగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇది కేవలం 0.79% మాత్రమే. గ్రామీణ ప్రాంతంలో పెరుగుతున్న పేదరికానికి ఇది నిదర్శనం. 
2.జనాభా పెరుగుదల రేటు కూడా రాష్ట్రంలోనే అత్యల్వంగా వుంది. 1961-71 లో రాష్ట్రంలో 4వ స్థానంలో వున్న జిల్లా 1991-2001 కి 10వ స్థానానికి చేరి 2001-11 కు ఆఖరి స్థానానికి దిగజారింది. జనాభా పెరుగుదల 1961-71లో 20.02% (రాష్ట్రం 18.96%), 1971-81లో 21.04 (20.53%), 1981-91లో 22.39% (21.13%), 1991-2001లో 8.13% (11.89%) 2001-11లో 3.51% (9.21%) గా వుంది. 1991 నుండి రాష్ట్ర సగటు కంటే జనాభా పెరుగుదల బాగా తక్కువగా వుండడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం వలసలు, ముఖ్యంగా మహిళలు సుదూర ప్రాంతాలకు వలస పోవడం. 
3. వీటిన్నింటికి మించి నేరాల సంఖ్య అత్యధికంగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. 2013లో రాష్ట్ర నేర రికార్డుల ప్రకారం జిల్లాలో 123 రేప్ కేసులు నమోదై రాష్ట్రంలో అత్యధిక రేప్లు జరిగిన జిల్లాగా నిలించింది. 86 కిడ్నాప్లతో కూడా అగ్రస్థానంలో నిలిచింది. కన్నపు దొంగతనాలో కూడా 490తో అగ్రస్థానం, ఇతర నేరాలు కూడా రాష్ట్రంలో అత్యధికంగా 4065 ఈ జిల్లాలో జరిగాయి. 
ముగింపు 
ఈ అంశాలన్నీ పరిశీలిస్తే మూడు విషయాలు అవగతమవుతాయి. మొదటిది వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోలేకపోతే వెనుకబాటు తనం మరింత పెరుగుతోందేగాని, అభివృద్ధి జరగడం లేదు. రెండవది అభివృద్ధి చెందిన పశ్చిమగోదావరి వంటి ప్రాంతాలలో వనరు లను దుర్వినియోగపరచడం వల్ల అభివృద్ధి తిరోగమనంలో వుంటోంది. అన్నపూర్ణగా పేరు గాంచిన గోదావరి జిల్లాలలో వరి ఉత్పత్తి భవి ష్యత్లో బాగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. మూడవది పాలకులు అభివృద్ధి పేరుతో చేపడుతున్న విధానాల వల్ల సామాన్యులు కుదేలై, సంపన్నులు లాభపడుతున్నారు. 
దీనికి భిన్నంగా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా విధానాలు వుండాలి. ప్రకృతి వనరులను కొల్లగొట్టకుపోయే క్రోని కేపిటలిజం వల్ల వినాశనమే మిగులుతుంది. నేడు వీటినేమీ ఖాతరుచేయకుండా నిర్భందాన్ని కూడా ప్రయో గించి మోడీ, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రజల నుండి పెద్దఎత్తున భూములు లాక్కొని, ప్రకృతి సంపదను కార్పొరేట్ సంస్థలు దోచుకుపోయే విధానాలు అవంభిస్తున్నాయి. అభివృద్ధి మార్గా లు తెలిపిన డా|| అమార్త్యసేన్, లూయీస్లు సోషలిస్టు ఆర్థికవేత్తలేం కాదు. పెట్టబడిదారీ విధానంలో కూడా కనీస సూత్రాలు పాటించడం ద్వారా అభివృద్ధి సాధ్యమేనని వారు తెలిపారు. మన పాలకులు ఈ పాటి కనీస చిత్త శుద్ధినైనా ప్రదర్శించేలా ఒత్తిడి చేయడం నేడు ప్రజల ముందున్న సవాలు. 
- అజ శర్మ

ఆర్థిక వ్యవస్థ బాగుంది...బాగాలేదు...ఏమైనా సంస్కరణలు వేగంగా అమలు చేయాలి!(కార్పొరేట్ల మనోగతం)



ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015 జూలై –సెప్టెంబరు త్రైమాసికం లో  భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జి డి పి) 7.4 శాతం పెరిగింది. 2015 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం లో  7.3 శాతం పెరుగుతుంది. ఇది చైనా పెరుగుదల 6.8 శాతం కన్నా ఎక్కువ.
కానీ ఈ లెక్కలను ఎవరు నమ్మటం లేదు. బడా పెట్టుబడిదారులు, ఆర్థిక వేత్తలలో అత్యధికులు  అసలే నమ్మటం లేదు. జి డి పి లెక్కలకు, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వాస్తవాలకు పొంతన లేదు. ఒక సంవత్సరం క్రితం వరకు భారత ఆర్థిక వ్యవస్థ పెరుగుదల 5 శాతం లోపే వుంటూ వచ్చింది. కానీ జి డి పి లెక్కల ఫార్ములా మార్చటం తో అభివృద్ధి బ్రహ్మాండముగా జరిగినట్లు కనిపిస్తున్నది! కానీ వాస్తవాలేమిటి?
గత 13నెలలుగా ఎగుమతులు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గ్రామీణ వేతనాల పెరుగుదల చాలా స్వల్పముగా వున్నందున, వరుసగా 2 సార్లు కరువు వచ్చినందున గ్రామీణ ప్రజల ఖర్చు చాలా బలహీనముగా వున్నది. కార్పొరేట్ కంపెనీల ఆర్డర్సులో పెరుగుదల లేదు. పైగా తయారయిన సరుకులు, వాటి , అమ్మకాల మధ్య నిష్పత్తి లో పెరుగుదల లేదు. ఫ్యాక్టరీలు తమ సామర్థ్యం లో 30 శాతాన్ని అమ్మకాలు లేనందున వినియోగించటం లేదు. బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకు పోయినందున కొత్తగా అప్పులివ్వటం లేదు. దీని వలన వడ్డీ రేట్లు తగ్గించినా ఉపయోగం లేకుండా పోయింది.
 మరి బయట పడటం ఎట్లా? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం వేతనాలు పెరిగితే మార్కెట్ లో కొనుగోలు శక్తి పెరిగి దాని ఫలితముగా పెట్టుబడులు పెట్టటం పెరుగుతుందని ఒక ఆశాభావం!కానీ కార్పొరేట్సు దృష్టిలో ప్రజల కొనుగోలు శక్తి గాని, మార్కెట్ గాని చెప్పుకోతగిన విధముగా పెరగదు. అందుకని వారు కార్మిక సంస్కరణలు ( తక్కువ వేతనాలతో పని చేయించుకునేందుకు కార్మిక హక్కుల రద్దు), బ్యాంకింగు సంస్కరణలు (వడ్డీ రేట్లు తగ్గించి కార్పొరేట్లకు అప్పులివ్వటం, బ్యాంకులలో డిజిన్వెస్ట్మెంటు పెద్ద ఎత్తున జరపటం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించటం), భూ సంస్కరణలు ( భూమి పంచటం కాదు, రైతులనుండి భూమిని బలవంతముగా లాక్కుని కార్పొరేత్సుకు నామమాత్రపు ధరలకు అప్పగించటం), పన్నుల సంస్కరణలు ( మరింత పెద్ద ఎత్తున పన్ను రాయితీలను కార్పొరేట్సుకు అందించటం) పెద్ద ఎత్తున అమలు చేయాలని మోడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మోడి ప్రభుత్వము అనుకూలముగా వున్నా రాజకీయ పరిస్థితులు అందుకు పూర్తిగా సహకరించే విధముగా లేవని వాపోతున్నారు. ఇప్పుడున్న అతి స్వల్ప పెరుగుదల మరింతగా పెరగాలంటే ఈ సంస్కరణలు వేగముగా జరగాలని, మోడి ప్రభుత్వము వెంటనే ఇందుకు ఉపక్రమించాలని కార్పొరేట్ల కోరిక!
సారాంశ ఏమిటంటే ప్రజల కొనుగోలు శక్తిని తద్వారా మార్కెట్లను పెంచే చర్యలెవీ తీసుకోకుండా కార్మిక హక్కుల కత్తిరింపు, రైతుల భూములు లాక్కోటం, బ్యాంకుల ప్రయివేటీకరణ, పన్ను రాయితీల పెంపుదల తదితర ప్రజావ్యతిరేక చర్యలు మారింతగా అమలు జరిపి తమ లాభాలు పెంచాలని కార్పొరేట్ల కోరిక. వారి విశ్వాస పాత్రుడు మోడి కి కూడా ఈ ప్రజావ్యతిరేక చర్యలు చేపట్టాలనే వున్నది. అందుకు ఉపక్రమించే ప్రయత్నాలలో వున్నది.
ఉత్పత్తిని పెంచేందుకు పెరిగిన ఉత్పత్తి వలన మరింతగా పెరిగే సరుకులు అమ్ముడు పోవాలి. అందుకు ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. కానీ ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా కార్మికులను, రైతులను మరింత పీడించటం ద్వారా తమ లాభాలు పెంచుకోవాలాని దుర్మార్గ పూరిత అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడితో  మరింతగా కుమ్మక్కవుతున్న భారత బడా పెట్టుబడిదారుల వ్యూహం. కార్మిక వర్గం, రైతాంగం, అన్ని  రంగాల ప్రజలు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకముగా ఉద్యమించాలి.

మార్చి 10 న ప్రదర్శనలకి కేంద్ర కార్మిక సంఘాల పిలుపు


ఢిల్లీలో 27.1.2016న సమావేశమయిన కేంద్ర ట్రేడ్ యూనియన్లు (ఐ ఎన్ టి యు సి, బి ఏం ఎస్, ఏ ఐ టి యు సి, సి ఐ టి యు, హెచ్ ఏం ఎస్ మొ.) మోడి ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమీక్ష చేశాయి. కార్మిక హక్కుల రద్దు చేయటానికి చట్టాలు సవరించేందుకు మోడి ప్రభుత్వము ఉపక్రమిస్తున్నదని, ఈ చట్ట సవరణలు జరిగేలోగా కార్యనిర్వాహక ఆర్డర్సు ద్వారా కార్మిక హక్కులు రద్దు చేయటానికి ఉపక్రమిస్తున్నదని, కార్మిక హక్కులు రద్దు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలిస్తున్నదని  కార్మిక సంఘాలు గుర్తించాయి. ఇంతేగాక ప్రభుత్వ రంగ సంస్థల డిజిన్వెస్ట్మెంటుకు, కీలక రంగాలలో ఎఫ్ డి ఐ అనుమతికి ఉపక్రమిస్తున్నదని గమనించాయి.
 ఇటీవలే మోడి ప్రభుత్వము జనవరి 12న మోడి ప్రభుత్వము ఒక ఆర్డరును కార్మిఖ శాఖ కార్యదర్శి ద్వారా విడుదల చేయించింది. దీని ప్రకారం స్టార్ట్ అప్ కంపెనీలు వాటి వార్షిక టర్నోవరు ఋ.25 కోట్ల లోపు వుంటే అవి పారిశ్రామిక వివాదాల చట్టం, ఈ పి ఎఫ్ చట్టం, ఈ ఎస్ ఐ చట్టం, ట్రేడ్ యూనియన్ చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టం, బిల్డింగ్ మరియు కంస్ట్రక్షన్ వర్కర్స్ చట్టం, ఇంటర్ స్టేట్ మైగ్రాంట్ వర్కర్స్ చట్టం, ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ (స్టాండింగ్ ఆర్డర్) చట్టం, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-ఈ  9 కార్మిక చట్టాలను పాటిస్తున్నాయా లేదా పరిశీలించటానికి లేబర్ ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేయకూడదని, ఈ పి ఎఫ్ ఈ ఎస్ ఐ సంస్థలు కూడా పట్టించుకోకూడదని,  ఈ చట్టాలను పాటిస్తున్నట్లు అవి ఒక సెల్ఫ్ సర్టిఫికేట్ ఇస్తే చాలునని ఈ ఆర్డరు సారాంశం. ఈ విధముగా ఈ కంపెనీలు కార్మిక చట్టాల అమలును ఉల్లంఘించినా దిక్కు లేని పరిస్థితిని మోడి ప్రభుత్వము సృష్టిస్తున్నది. స్టార్ట్ అప్ కంపెనీలు ప్రారంభమయిన మొదటి 3 సంవత్సరాలు ఈ మినహాయింపునివ్వాలని ప్రభుత్వము ఆదేశించింది. ఇప్పటికే అనేక బడా కార్పొరేట్ కంపెనీలు తమ వ్యాపారాన్ని స్టార్ట్ అప్ కంపెనీల రూపం లోకి మార్చి మోడి ప్రభుత్వము స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రకటించిన 3 సంవత్సరాల పన్నుల మినహాయింపు, మూడు సంవత్సరాల కార్మిక చట్టాల మినహాయింపు రాయితీలను వాడుకోవాలనే ప్రయత్నం లో వున్నాయి.  స్టార్ట్ అప్ కంపెనీలలో పని చేసే కార్మికులను వెట్టి చాకిరీ చేసే బానిసలుగా మార్చటమే ఈ విధానాల ఉద్దేశం. మోడి ప్రభుత్వము దృష్టిలో పరిశ్రమలను ప్రోత్సహించటం అంటే రైతుల భూములను ఉచితముగా ఇవ్వటం, కార్మిక హక్కులు రద్దు చేయటమేనని స్పష్టమవుతున్నది.
మోడి ప్రభుత్వము అనుసరిస్తున్న ఈ విధానాలను కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఖండించాయి. బ్యాంకింగు, రక్షణ, బొగ్గు, పోర్ట్ అండ్ డాక్స్, టెలికాం తదితర రంగాలలో కార్మికులు/ఉద్యోగులు మరియు అంగన్వాడీలు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలిపాయి. 7వ వేతన సంఘం చేసిన తిరోగమన సిఫార్సులకు వ్యతిరేకముగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ట్రేడ్ యూనియన్లు బలపరచాయి. కోయంబత్తూరు లో ప్రికాల్ లిమిటెడ్ కంపెనీ వర్కర్సు 8 మందికి అతి కఠినముగా "రెండు రెట్ల యావజ్జీవ జైలు శిక్ష" ని న్యాయ స్థానం విధించటం పట్ల కేన్ద్ర్ర ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. వారికి మద్దతును, సహాయాన్ని అందించాలని కార్మికులందరికి కేంద్ర ట్రేడ్ యూనియన్లు విగ్జ్ఞప్తి చేశాయి.
మార్చి 2016 ఆఖరు వారం లో ఢిల్లీ లో తల్కతోరా స్టేడియం లో భారీస్థాయిలో కార్మిక వర్గ జాతీయ సదస్సు జరిపి భావిష్యత్తు ఐక్య కార్యాచరణను ప్రకటించాలని కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
మోడి ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు మార్చి 10న దేశ వ్యాపితముగా నిరసన చర్యలకు దిగాలని కార్మిక వర్గానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.
సెప్టెంబరు 2 సార్వత్రిక సమ్మేలో పాల్గొనకుండా మోడి ప్రభుత్వము ఏదో ఒరగబెడుతుందనే సాకుతో చివరి నిముషములో విరమించిన బి ఏం ఎస్ కూడా ఈ పిలుపులో భాగస్వామిగా వున్నది.
కార్మికులపై, ప్రజలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకముగా ఈ నిరసన ప్రదర్శనలలో అన్నీ రంగాల కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు  పెద్ద ఎత్తున పాల్గొనాలి.