29.1.2017న బెంగుళూరు లో జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల
యూనియన్ల జాతీయ సదస్సు తీర్మానం పూర్తి పాఠం
29.1.2017 న బెంగుళూరు లో జరిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల
కార్మికుల సంయుక్త జాతీయ సదస్సుకు కేంద్ర ట్రేడ్ యూనియన్లకు అనుబంధముగా వున్న, స్వతంత్రముగా వున్న ప్రభుత్వ రంగ సంస్థల
యూనియన్ల నాయకులు, ప్రతినిధులు దేశం లో అన్ని ప్రాంతాలనుండి
హాజరయ్యారు. 2.9.2016న చారిత్రాత్మకమయిన స్థాయిలో సమ్మేని విజయవంతముగా చేసినందుకు
ఈ సదస్సు కార్మికులందరిని అభినందిస్తున్నది. ఈ సమ్మె పునాది స్థాయిలో కార్మిక
ఐక్యత మరింత బలపడేలా చేసింది. ఎన్ డి ఏ ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక
వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకముగా పోరాటాలు నిర్వహించటం ద్వారా ఈ ఐక్యత మరింత బలపడేలా, విస్తృతమయ్యేలా చేయాలి.
ప్రభుత్వ రంగ సంస్థల మూసి వేత, ప్రయివేటీకరణ ల అమలుకు అనేక విధాలుగా జరుగుతున్న దాడులు
పూర్తి ప్రయివేటీకరణ, మూసివేత, తదితర అనేక పద్ధతులలో ప్రభుత్వ రంగ
సంస్థలను అంతరించేలా చేసేందుకు ఎన్ డి ఏ ప్రభుత్వము చేస్తున్న ఉధృతమయిన దాడి పట్ల ఈ సదస్సు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నది. ఆర్థిక మంత్రి
ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 1న 2017-18 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సమర్పణ జరుగుతుంది.
ఈ సందర్భముగా మనము 2016-17 బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా
రు.56500 కోట్లు సంపాదించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వము ప్రకటించిందని, అందులో ఇప్పటివరకు రు.23528.73 కోట్లు సాధించిందని,
దీనికి తోడు మరో రు.11,224.06 కోట్లు “బై బ్యాక్” మార్గం లో
సాధించిందని గమనించాలి.
ఈ ఆర్థిక సంవత్సరం 2016-17 లో మిగిలిన రోజులలో అనుమానాస్పదమయిన వాణిజ్య
మార్గాలలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను మరింత పెద్ద ఎత్తున అమ్మి నిధి వసూలును
మరింత పెంచేందుకు ప్రభుత్వము చేస్తున్న ప్రయత్నాలు
దిగ్భ్రాంతిని కలిగించేవిగా, ఖండించాల్సినవిగా వున్నాయి. మనము ఈ సదస్సునుండి తిరిగి మన డ్యూటీలకు వెళ్ళేలోగా పార్లమెంటులో సమర్పించే
బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థలపై మరిన్ని దాడులు ప్రతిపాదించే పరిస్తితి వున్నది.
(ఈ అనుమానాన్ని ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ నిజమని
ధృవీకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల
అమ్మకం ద్వారా 2017-18 లో రు.72500 కోట్లు సంపాదించాలని, ETF(ఎక్చేంజ్ ట్రెడెడ్ ఫండ్) మార్గం లో త్వరితముగా
డిజిన్వెస్ట్మెంట్ ను అమలు చేయాలని, ఎంపిక చేయబడిన ప్రభుత్వ
రంగ సంస్థలను ఒక నిర్ణీత కాల వ్యవధిలో షేర్ మార్కెట్ లో లిస్టింగుకు పెట్టాలని,రైల్వే విభాగం లో వున్న మూడు ప్రభుత్వ రంగ సంస్థలను—IRCTC, IRFC, మరియు IRCON—వెంటనే ఈ
విధముగా లిస్టింగుకు పెట్టాలని ఈ బడ్జెట్
లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు)
ఇప్పటికే ప్రభుత్వము వాణిజ్య పరమయిన, పాలనా పరమయిన పద్ధతులకు విరుద్ధముగా ప్రభుత్వ రంగ సంస్థల
ప్రయోజనాలను లెక్క చేయకుండా ఈ ETF మార్గం లో చాలా దూకుడుగా
వాటాల అమ్మకాన్ని కొనసాగిస్తున్నది. మీడియా రిపోర్టుల ప్రకారం ఈ ETF పద్ధతిలో రు.6000 కోట్లు సంపాదించాలని నిర్ణయించింది. ఇందుకోసం రు.13726
కోట్ల విలువయిన బిడ్స్ ప్రొసెస్ లో వున్నాయి. ప్రస్తుత ETF
లో 10 మహారత్న,
నవరత్న ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు (ఓ ఎన్ జి సి, జి ఏ ఐ ఎల్, కోల్ ఇండియా, ఆర్ ఈ సి, ఆయిల్
ఇండియా, పవర్ ఫైనాన్స్, కంటెయినర్
కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్,
మరియు ఇంజినీర్స్ ఇండియా) వున్నాయి. ఈ ETF ద్వారా జాతీయ
ప్రయోజనాలకు కీలకమయిన ప్రభుత్వ ప్రభుత్వ రంగ
సంస్థలను ప్రయివేటు పరం చేసే పనిని రిలయన్స్ మ్యూచ్యువల్ ఫండ్ మేనేజర్స్ కు అప్పగించి
ప్రభుత్వము తన నిజ స్వరూపాన్ని వెల్లడించింది.
ప్రమాదకరమయిన సిఫార్సులు
ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు సంబంధించి ఒక ప్రమాదకరమయిన ప్రణాళిక
ఇటీవలే వెలువడింది. ప్రభుత్వము ప్రోత్సహించి నిధులను సమకూర్చిన “ నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ”(NIPFP) అనే ఏజెన్సీ, ప్రభుత్వ రంగ సంస్థల
రద్దు కోసం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరింత దూకుడుగా ప్రయివేటీకరణ
అమలు చేయటమే ముందుకు పోయెందుకు మార్గం అని, ప్రత్యేకించి 17
నవరత్న సంస్థలను, 73 మినీ రత్న సంస్థలను, మిగతా 140 చిన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయాలని, అప్పుడు మాత్రమే ప్రభుత్వం పని వ్యాపారం చేయటం కాదని ప్రధాన మంత్రి అన్న
మాటకు విలువ ఇచ్చినట్లవుతుందని ఈ నివేదిక పేర్కొన్నది. ప్రతి సంవత్సరం ఇంత లక్ష్యం
అని పెట్టుకోటం వలన ఉపయోగం లేదని, ఆ విధముగా కాకుండా 10 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ
సంస్థల ఆస్తులలో 50 శాతం అమ్మాలనే లక్ష్యం తో పని చేయాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది.
74 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని ఇప్పటికే ప్రధాన మంత్రి
కార్యాలయానికి నీతి ఆయోగ్ ఒక జాబితాని సమర్పించిందని ఈ సందర్భముగా మనం గమనించాలి.
NIPFP ప్రతిపాదించిన ఈ వినాశకర మార్గాన్ని అనుసరించి మోడి
ప్రభుత్వము 20 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మెందుకు, ఖాయిలా పడినవని
చెప్పబడే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేయటానికి తన ఆమోద ముద్ర వేసింది. రక్షణ
రంగానికి సంబంధించిన BEML ను పూర్తిగా ప్రయివేటు పరం చేయాలని
నిర్ణయించింది. ఇప్పటికే ఇందులో 46 శాతం వాటాలు అమ్మేశారు. దీనికి అదనముగా మరో 25
శాతం వాటాలను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. ఇది జరిగితే ఈ సంస్థ
స్వదేశీ లేదా విదేశీ ప్రయివేటు కంపెనీ హస్తగతమవుతుంది. మరో మహారత్న సంస్థ SAIL పై కూడా తీవ్రమయిన దాడి జరుగుతున్నది. ఈ సంస్థ ఆధీనములో వున్న సేలం, దుర్గాపూర్, భద్రావతి స్టీల్ ప్లాంట్లను వ్యూహాత్మక
అమ్మకానికి పెట్టి ప్రయివేటు పరం చేయాలని ప్రభుత్వము నిర్ణయించింది. ఓ ఎన్ జి సి మరియు ఆయిల్ ఇండియా లు కనిపెట్టిన 67 ఆయిల్
ఫీల్దులను ప్రయివేటు పరం చేసే ప్రక్రియ
ప్రారంభమయింది. ప్రభుత్వ రంగం లో వున్న 5 జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలలో 25 శాతం
వాటాలను అమ్మాలని, ఇందుకోసం ఈ సంస్థలను షేర్ మార్కెట్ లో
లిస్టింగుకు పెట్టాలని ప్రభుత్వము ఒక దిగ్భ్రాంతికరమయిన నిర్ణయం చేసింది. ఇందుకు
ఆర్థిక మంత్రి తెలియజేసిన కారణాలు, లాభసాటిగా వున్న ఈ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలను
క్రమముగా ప్రయివేటు పరం చేయటమే అసలు ఉద్దేశమని తెలియజేస్తున్నాయి. ఐ డి పి ఎల్, ఆర్ డి పి ఎల్ లను మూసి వేయాలని, హిందుస్తాన్ యాంటీ
బయాటిక్స్ మరియు బెంగాల్ కెమికల్స్ ను
ప్రయివేటు పరం చేయాలని ఎన్ డి ఏ
ప్రభుత్వము నిర్ణయించింది.
ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను
పరిశీలించి వాటి పునరుద్ధరణకు లేదా మూసి వేతకు ఒక నిర్దిష్టమయిన పద్ధతిలో సిఫార్సు
చేసేందుకు ఏర్పాటు చేయబడిన రెగ్యులేటరీ సంస్థలు బి ఐ ఎఫ్ ఆర్ మరియు ఏ ఐ ఎఫ్ ఆర్ లను రద్దు చేయాలని ఒక
వినాశకరనిర్ణయాన్ని ప్రభుత్వము ప్రకటించింది. ఖాయిలా పడిన వేలాది సంస్థలు మూతపడి
లక్షలాది కార్మికులు నిరుద్యోగులవటం అనివార్యమవుతుంది. ఈ విధముగా ఖాయిలా పడిన సంస్థల పునరుద్ధరణకు
తర్క బద్ధమయిన, న్యాయ
బద్ధమయిన పద్ధతిలో వుండే అవకాశాలను ఒక వంక రద్దు చేసి, మరో
వంక సంబంధిత ప్రభుత్వ శాఖలే ప్రతి సంవత్సరము తమ ఆధీనములో వున్న ప్రభుత్వ రంగ
సంస్థల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి వాటిని ఖాయిలా పడినవిగా ఉదారముగా ప్రకటించి
రద్దు చేసేందుకు/మూసి వేసేందుకు వీలుగా వినాశకరమయిన ఆదేశాలను ప్రభుత్వము జారీ చేసింది.
రక్షణ, బొగ్గు, మైనింగ్, విద్యుత్తు, టెలికాం, సివిల్ ఏవియేషన్, శాటిలైట్స్,
నిర్మాణం, ఇన్సూరెన్సు, బ్యాంకింగు, పెన్షన్ ఫండ్స్, రైల్వే నిర్వహణ, మల్టీ బ్రాండ్ రిటెయిల్, ఫార్మాస్యుటికల్స్ తదితర
రంగాలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమటించేందుకు విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడి పరిమితిని పెంచటం ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున అనుమతించాలని
ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల పూర్వ రంగం లో పైన తెలియజేసిన ప్రభుత్వ రంగ సంస్థల
మూసివేత, ప్రయివేత్తికరణ నిర్ణయాలను పరిశీలించాలి. ఈ నిర్ణయాల వలన అనేక
కీలక రంగాలలో జాతీయ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణను కోల్పోయే వినాశకర పరిస్థితి
ఏర్పడుతుంది. సైన్యానికి కీలకమయిన ఆయుధాలను పరికరాలను అందిస్తున్న ప్రభుత్వ రంగ
సంస్థలు దెబ్బ తింటాయి. ఈ విధానాలు మన ఆర్థిక వ్యవస్థ ని ప్రపంచములో అత్యంత బహిరంగ
ఆర్థిక వ్యవస్థగా మార్చాయని, ఈ సంస్కరణలను మరింతగా
కొనసాగించేందుకు తాము కట్టుబడి వున్నామని ప్రధాన మంత్రి సగర్వముగా ప్రకటించటం
ఆశ్చర్యకరం.
వేగవంత మవుతున్న కాంట్రాక్టరీకరణ
ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టరీకరణ, కాంట్రాక్టు కార్మికులపై విశృంఖల దోపిడి వేగవంతమవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ట్రేడ్
యూనియన్ ఉద్యమం ప్రభుత్వ రంగం మొత్తముగా, అదే విధముగా ప్రతి
ప్రభుత్వ రంగ సంస్థలో తమ అనుబంధాలకు అతితముగా ఈ సమస్య పై స్వల్పకాలిక, దీర్ఘ కాలిక
ఐక్య పోరాటాలను తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే
విధముగా నిర్వహించాల్సిన అవసరం వున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. ఈ
పరిస్థితిలో రెగ్యులర్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు మధ్య సన్నిహిత సహకారం ఎంతయినా అవసరం. ప్రభుత్వ
రంగ సంస్థల ఉత్పత్తి మరియు లాభదాయకత లో కాంట్రాక్టు కార్మికుల భాగస్వామ్యం చాలా
వున్నప్పటికి కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధమయిన వేతనాలు,
సాంఘిక భద్రత, రక్షణ అమలు కావటం లేదు. సుప్రీం కోర్టు ఇటీవల
ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం తీర్పును కాంట్రాక్టు కార్మికులకు అమలు చేసేందుకు
ట్రేడ్ యూనియన్ ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమించాలి.
ప్రభుత్వ రంగ సంస్థలలో జరగనున్న వేతన సవరణ చర్చలు
జస్టిస్ సతీశ్ చంద్ర అధ్యక్షతన ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల వేతన సవరణ పై
నియమించబడిన కమిటీ (థర్డ్ పి ఆర్ సి) గతం లో ఎన్నడూ జరగని విధముగా తన సిఫార్సులను
డి పి ఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్) కి కాకుండా నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి
సమర్పించింది. ఈ సిఫార్సులపై ప్రధాన మంత్రి కార్ర్యాలయం ఉద్దేశ పూర్వక మౌనాన్ని
అవలంబిస్తున్నది. ఈ సిఫార్సుల వలన
అధికారులు,
ఉద్యోగులు అనేక తీవ్రమయిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తున్నది.
ఈ లోగా 1.1.2017 నుండి జరగాల్సిన వేతన సవరణ కి సంబంధించిన డిమాండ్స్ ను ట్రేడ్
యూనియన్లు మేనేజిమెంట్సుకు
సమర్పిస్తున్నాయి. సి పి ఎస్ టి యు (కమిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ట్రేడ్
యూనియన్స్) ఆద్వర్యం లో ఒక వర్క్ షాపును నిర్వహించి అందులో ప్రాధమికమయిన డిమాండ్స్
ను రూపొందించటం, వాటి
ఆధారముగా యూనియన్లు తమ డిమాండ్స్ ను సమర్పించటం
గతం లో జరిగేది. కానీ ఈ సారి అలా జరగ లేదు. ఏమయినప్పటికి, ఈ క్రింది ముఖ్యమయిన సమస్యలను వేతన సవరణ డిమాండ్స్ లో అన్నీ
యూనియన్లు పొందుపరచాల్సిన అవసరం వున్నది:
·
వివిధ
మార్గాలలో ప్రయివేటీకరణకు జరుగుతున్నా ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణను
డిమాండ్ చేయాలి.
·
పైన
తెలియజేసిన విధముగా కాంట్రాక్టు వర్కర్ల డిమాండ్స్ ను తప్పని సరిగా చేర్చాలి. ఆ
డిమాండ్స్ పై చర్చించి ఒప్పందం సాధించాలి. కోల్ ఇండియాలో కాంటాక్ట్ వర్కర్ల వేతన
సవరణ పై చర్చించి వారి డిమాండ్స్ పై ఒక చాప్టర్ గత వేతన సవరణ ఒప్పందం లో
చేర్పించటం జరిగింది.
·
ఆఫీసర్ల
అసోసియేషన్లు మరియు అనేక ప్రభుత్వ రంగ సంస్థల మేనేజిమెంట్లు థర్డ్ పి ఆర్ సి కి
సమర్పించిన మెమోరాండం లలో వేతన సవరణ
కాలపరిమితి 3 నుండి 5 సంవత్సరాలు వుండాలని డిమాండ్ చేశాయి. ఇదే వైఖరిని ట్రేడ్
యూనియన్లు అవలంబించాలి. కోల్ ఇండియాలో 5 సంవత్సరాల కాల పరిమితి ప్రాతిపదికగా వేతన
సవరణ చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
·
పెట్రోలియం
రంగం లో కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను మినహాయించి
మిగతా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో ట్రేడ్ యూనియన్లు పి ఆర్ పి (పెర్ఫార్మెంస్
రిలేటెడ్ పే =పని ప్రాతిపదికగా వేతనం) విధానాన్ని తిరస్కరించాయి. ఈ విధానం
కార్మికులకు ఉపయోగం అని అనుకోటం అంటే దూరదృష్టి లోపించటమే. పని ప్రమాణాన్ని, అందుకనుగుణమయిన వేతన స్థాయిని నిర్ధారించటం
లో అనేక కార్మిక వ్యతిరేక విధానాలకు ఇది అవకాశం కల్పిస్తుంది.
·
పే, పెర్క్స్స్, ఇతర
బెనిఫిట్సు మరియు సౌకర్యాల విషయం లో
అధికారులకు ఉద్యోగులకు మధ్య వివక్షత పెరుగుతున్నది. ఈ వివక్షతని నివారించాలని, హేతుబద్ధమయిన సాపేక్షత వుండాలని
డిమాండ్ చేయాలి.
·
అధికారుల
సంఖ్య పెరుగుతూ ఉద్యోగుల సంఖ్య తగ్గే క్రమాన్ని ఆపు చేయాలి. అధికారులు, ఉద్యోగుల మధ్య నిష్పత్తి ని
పునరుద్ధరించాలి. ఇందుకోసం తగు సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేయాలి.
·
ఆరోగ్యకరమయిన, భద్రత కలిగిన పని పరిస్థితులను మరియు సాంఘిక భద్రత ప్రయోజనాలను డిమాండ్
చేయాలి.
నోట్ల రద్దు
నల్ల ధనాన్ని రద్దు చేసేందుకు, ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు అనే పేరుతో
మోడి ప్రభుత్వము అమలు చేసిన నోట్ల రద్దు విధానం ప్రజలను అనేక ఇబ్బందులపాలు
చేసింది. రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారు. కార్మికులు పనిని, వేతనాన్ని కోల్పోయారు. స్వయం ఉపాధి దారులు మరియు చిన్న వ్యాపారులు తమ జీవనాధారాన్ని కోల్పోయారు. పనిని కోల్పోయిన
కార్మికుల సంఖ్య చాలా ఎక్కువగా వున్నది. నగదు కొరత వలన చిన్న మరియు మధ్య తరహా
పరిశ్రమల కార్మికులు ఉపాధిని కోల్పోయారు. రోజు కూలీలు నగదు చలామణి లేనందున పనులు
కోల్పోయారు. రెండు నెలలయినా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోలేదు. కార్మికులు
పట్టణాలను వదిలి గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది.
బ్యాంకులు , పోస్ట్ ఆఫీసుల వద్ద నగదు కోసం పొడవైన క్యూ లలో నిలబడి అలసట వలన, వైద్య సదుపాయం లేనందున కొందరు చనిపోయారు. వారాల తరబడి అర్ధ రాత్రి వరకు
పని చేసి ఆ ఒత్తిడి వలన 10 మంది బ్యాంకు ఉద్యోగులు చనిపోయారు. నోట్ల రద్దు
ఫలితముగా ఏర్పడిన ఈ పరిస్థితి వలన 120 మంది
చనిపోయారు. 28 జనవరి 2017న ఈ పరిస్థితులకు వ్యతిరేకముగా కేంద్ర ట్రేడ్ యూనియన్లు మరియు జాతీయ ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపుననుసరించి దేశ వ్యాపిత
నిరసన లో పాల్గొన్న వారిని ఈ సదస్సు అభినందిస్తున్నది.
సదస్సు పిలుపు
ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను వివిధ పద్ధతులలో అమ్మే
విధానాలను, పాక్షిక లేదా సంపూర్ణ ప్రయివేటీకరణను, బి ఐ ఎఫ్
ఆర్ మరియు ఏ ఐ ఎఫ్ ఆర్ ల రద్దును వ్యతిరేకిస్తూ దీర్ఘ కాలిక ప్రచారాన్ని ఆందోళనను
నిర్వహించాల్సిన అవసరం వుందని, ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతని
నివారించి వాటిని పూర్తి స్థాయి ప్రభుత్వ రంగా సంస్థలుగా పునరుద్ధరించేందుకు తగు
చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని, అదే విధముగా సమిష్టి
బేరం హక్కును, ప్రత్యేకించి రానున్న వేతన సవరణ చర్చల రీత్యా
కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ సదస్సు
నిర్ధారించింది. ఈ సదస్సు ఈ క్రింది కార్యక్రమాన్ని నిర్ణయించింది:
·
ప్రభుత్వ
రంగ సంస్థ/పరిశ్రమ/రంగం స్థాయిలో సంయుక్త సదస్సులు/సెమీనార్లు/సమావేశాలు స్థానిక/ ప్రాంతీయ/జాతీయ స్థాయిలో 28 ఫిబ్రవరి
2017 లోగా నిర్వహించాలి.
·
మార్చి
20, 2017
లోగా కరపత్రాలు, పోస్టర్లు, గేట్
మీటింగులు, ధర్నాలు, స్లోగన్లు
కార్యక్రమాలను విరామ సమయం లో లేదా డ్యూటీ అయిన వెంటనే నిర్వహించాలి.
·
మార్చి
30, 2017న
బ్లాక్ బ్యాద్జీలు, ధర్నా, ప్రదర్శనలు
తదితర రూపాలలో అఖిల భారత నిరసన దినం అమలు చేయాలి.
·
పార్ర్లమెంటు
బడ్జెట్ సమావేశాలు రెండవ విడత జరిగే సందర్భములో ఢిల్లీలో జాతీయ సదస్సు జరపాలి(
తేదీని తరువాత నిర్ణయిస్తారు)
·
ఈ
కార్యక్రమాలు అమలు చేయాలని, ఆ తరువాత దేశ వ్యాపిత సమ్మెకు (తగు సమయం లో సమ్మె తేదీ నిర్ణయించ
బడుతుంది) సంసిద్ధముగా వుండాలని ఈ సదస్సు పిలుపునిస్తున్నది.
ఈ తీర్మానం పై సంతకం చేసిన వారు :
డాక్టర్ జి.సంజీవరెడ్డి (ఇఐ ఎన్ టి యు సి), హెచ్.మహదేవన్ (ఏ ఐ టి యు సి), హర్భజన్
సింగ్ సిద్ధు (హెచ్ ఎం ఎస్), తపన్ సేన్ (సి ఐ టి యు), ఎం. షణ్ముగం (ఎల్ పి ఎఫ్), మీనాక్షీ సుందరం ( కన్వీనర్, జె ఏ ఎఫ్, బెంగుళూరు), యు.ప్రభాకర్ ( సి పి ఎస్ టి యు
కోఆర్డినేషన్ కమిటీ హైదారాబాద్ )