Oct 21,2022 07:14
అంతర్జాతీయ ద్రవ్య విపణిలో రూపాయి విలువ రోజురోజుకీ వెలవెలబోతూ...రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రూపాయి చరిత్రలోనే ఇది అత్యంత కనిష్టం. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 83.20కి క్షీణించింది. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 79 పైసలు కోల్పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతుంది. రూపాయి విలువ తగ్గుతున్నకొద్దీ దిగుమతుల విలువ పెరుగుతూ పోతుంది. మన దేశ అవసరాల్లో 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటున్నాం కనుక చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయి. దాంతో ఇంధన వ్యయం, రవాణా ఖర్చు పెరిగి, అన్నిటి ధరలూ ఆకాశానికి ఎగబాకుతాయి. కోవిడ్ నేపథ్యంలో ఉపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కష్టాలు మరింత పెరుగుతాయి. ఇంకోవైపున ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న పేరుతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. గడచిన మూడు ద్రవ్య సమీక్షల్లోనూ రిజర్వు బ్యాంకు రెపో రేటు పెంచుతూనే పోతోంది. భవిష్యత్తులోనూ ఆ దారినే కొనసాగించవచ్చు. అందువల్ల వడ్డీలు పెరిగి గృహ నిర్మాణానికో లేక ఇతర అవసరాలకో బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారికి పెను భారమవుతుంది. కొత్తగా అప్పులు పుట్టడమూ కష్టమే అవుతుంది. దిగుమతుల విలువ పెరిగిపోవడంతో దేశ వాణిజ్య లోటు అధికమవుతుంది. విదేశీ వాణిజ్య లోటు పెరగడంతోపాటు ప్రభుత్వానికి ద్రవ్య లోటు కూడా పెరుగుతుంది. దాంతో ప్రజలకిచ్చే సబ్సిడీలకు, ఇతర రాయితీలకు కోతలు పెట్టడం లేదా మంగళం పాడడమో జరుగుతుంది. ఇలా ఎటు చూసినా జనానికి బాదుడే !
డాలర్ బలపడడంవల్ల దాని విలువ పెరగడంతో రూపాయి విలువ తగ్గుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనాన్ని మభ్య పెడుతున్నారు. ఒకవేళ డాలర్ మాత్రమే బలపడితే రూపాయి మారకం విలువ దానితోనే పడిపోవాలి. కాని పౌండ్, యూరోతోనూ ఎందుకు దిగజారుతోంది? రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారమే నెల రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 20న ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా చలామణీ అయ్యే డాలర్, పౌండ్, యూరోలకు రూపాయి మారకపు విలువ వరుసగా 79.68, 91.16, 79.95గా ఉండగా అక్టోబర్ 20న 83.20, 93.36, 81.42కు దిగజారింది. బ్రిటన్ ప్రధానమంత్రి రాజీనామా చేయవలసినంతగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనా పౌండ్‌తో రూపాయి మారక విలువ దిగజారిందంటే సాధారణ పరిస్థితులే ఉంటే ఏమయ్యేదో! అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించడం సంఘపరివార్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. ఆ కుదురు నుండి వచ్చిన ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతోందని, మరోవైపు అమెరికా బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నందున ఈ దేశంలోని పెట్టుబడులు వెనక్కు తీసుకుపోవడం మూలంగా రూపాయి బలహీనపడుతోందన్నది విశ్లేషకుల మాట. ఏ దేశంలోనైనా కరెన్సీ విలువ తరగడం, ద్రవ్యోల్బణం పెరగడం జరిగితే అక్కడ విదేశీ పెట్టుబడులు నిలవవని ప్రపంచ అనుభవం చెబుతోంది. కాబట్టి ఇదో విష చక్రం. పర్యవసానంగా రూపాయి విలువ మరింత దిగజారడం, ధరలు ఇంకా ఇంకా పెరగడానికే దారి తీస్తుంది.
నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు వల్లనే దేశానికి ఈ దుస్థితి దాపురించింది. 1991 నుండి మన పాలకులు ఈ విధానాలు అమలు చేస్తున్నా నరేంద్ర మోడీ గద్దెనెక్కాక మరింత వేగవంతమయింది. ఉదాహరణకు 2014 మే నెలలో మోడీ అధికారానికి వచ్చినప్పుడు ఒక డాలరుకు 58.75 రూపాయలు కాగా ఎనిమిదేళ్ల తరువాత గడచిన బుధవారంనాడు డాలరు విలువ రూ. 83.20కి పెరిగింది. ఎనిమిదేళ్లలో డాలరుతో రూపాయి విలువ 41.61 శాతం దిగజారిందన్నమాట. ఇదీ మోడీ పాలనా ఘనత! ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారాలి. కాని, ఈ ప్రభుత్వం తనంతట తాను అందుకు పూనుకోదు కనుక ప్రజా ఉద్యమాలతో ఒత్తిడి తీసుకురావాలి. అది తప్ప వేరు దారి లేదు. (ప్రజాశక్తి 22.10.2022 తేదీ సంపాదకీయం)