Sunday, August 11, 2013

చరిత్ర చౌరస్తాలో చౌకబారు రాజకీయాలు

ఏది ఏమైనా ఇప్పుడు ఆంటోనీ కమిటీ అన్నది కాంగ్రెస్‌ పల్లవిగా ఉంది. దాని పట్ల ఎవరి వైఖరి వారు తీసుకోవచ్చు. ప్రభుత్వాలకు చెప్పదలచుకున్నది చెప్పొచ్చు. కానీ తాము ప్రకటించిన రాజకీయ విధానం నుంచి తామే వెనక్కు పోయి ప్రజల మనోభావాల పేరిట ఎడతెగని వివాదాలను సాగలాగడం ఎవరికీ మంచిది కాదు. ఈ క్రమంలో పై చేయి కోసం పోటాపోటీ నాటకాలాడుతూ చౌకబారు వాగ్యుద్ధాలకు దిగడం, ప్రాంతాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీయడం అసలే మంచిది కాదు. రాజకీయ, రాజ్యాంగ అంశాలపై స్థానిక సమ్మెలతో సాధించేది స్వల్పమని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితిని, గత నాలుగేళ్ల అనుభవాలను గమనంలో ఉంచుకుని ఎవరికి, దేనికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ విభజనకై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విధాన నిర్ణయం ప్రకటించిన తర్వాత గడచిన పది రోజులలోనూ ఆ పార్టీతో సహా ప్రధాన రాజకీయ పక్షాలు పిల్లిమొగ్గలు కొనసాగిస్తున్నాయి. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగి విభజన వల్ల సమస్యలు తీవ్రమవుతాయని, వాటిని పరిష్కరించిన తర్వాతనే అడుగు ముందుకేయాలనీ ప్రకటించారు. తాను కూడా సమైక్యాంధ్ర కోసం విభజనకు వ్యతిరేకంగా సంతకాలు చేశానని వెల్లడించారు. ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజ నరసింహ దళపతి కుట్రదారు కాకూడదంటూ బహిరంగ తిరుగుబాటు చేశారు. మామూలుగా మాట్లాడని కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌, ఎంపి వి హనుమంతరావు, తదితరులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో వైపున కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజీనామాకు సిద్ధమేనని గతంలో తాను చేసిన రాజీ వ్యాఖ్యలను సవరించుకుంటే ఉండవల్లి అరుణ్‌కుమార్‌, లగడపాటి రాజగోపాల్‌, తదితర నేతలు విభజనవాదులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కూడా సమైక్యాంధ్ర తమ నినాదమని గట్టిగా చెప్పారు. అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన వీరంతా ఈ విధంగా ధిక్కార స్వరం వినిపిస్తుంటే సదరు ఢిల్లీ పెద్దలు మాత్రం ఇదంతా పెద్ద సమస్య కాదన్నట్టు తేలిగ్గా తీసేస్తున్నారు. ఇలాటి వాదనలన్నీ వినడానికి ఆంటోనీ నాయకత్వాన ఒక కమిటీని వేశామని, దాని ముందు వీటిని వివరించవచ్చని అవకాశమిచ్చారు. ముఖ్యమంత్రి మీద చర్యలేమీ ఉండబోవని కూడా దిగ్విజరు సింగ్‌ తేల్చేశారు.

పైకి చాలా గజిబిజిగా కనిపించే ఈ వ్యవహారం వాస్తవానికి కాంగ్రెస్‌ మార్కు రాజకీయాల ప్రతిబింబం. రెండు ప్రాంతాలలోనూ తామే ముందుండాలనే తాపత్రయంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ నేతలను ఇష్టానుసారం మాట్లాడ్డానికి అనుమతించారన్నది ఇక్కడ తేటతెల్లమవుతున్న సత్యం. తమ పార్టీ తరపున ఆంటోనీ కమిటీ వేసి దానికి అందరి అభిప్రాయాలూ చెప్పుకోవాలనడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ అనిపించుకోదు. నదీజలాలు, ఉద్యోగాలు, మరీ ముఖ్యంగా హైదరాబాదు ప్రతిపత్తిపై అనేక సందేహాలు సృష్టించి వాటికి అధికారిక సమాధానాలు ఇవ్వకుండా ఆంటోనీ కమిటీకి మొర పెట్టుకోమని చెప్పడం అర్థం లేని విషయం. మంత్రులతో సహా ఒక వైపున తమవారే రాజీనామాలు సంధిస్తుంటే, ముఖ్యమంత్రి కూడా భిన్న స్వరం వినిపిస్తుంటే మిగిలిన పార్టీలపై విమర్శలు గుప్పించి తప్పించుకోవడం ఎలా కుదురుతుంది? అందరిలో ఏకాభిప్రాయం వచ్చాకనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్‌ పార్టీలోనే ఏకాభిప్రాయం లేకపోగా ఆ గుద్దులాటను అది అందరిపైనా రుద్దడం హాస్యాస్పదం. దిగ్విజరు సింగ్‌ రోజుకో విధంగా చేస్తున్న గీతా ప్రవచనాల సారం ఏమిటో తల పండిన పండితులకు కూడా బోధపడటం లేదు. మాట ఇచ్చాం గనక తప్పేది లేదు అన్న మాట తప్ప మరో అడుగు పడిందీ లేదు. రాష్ట్ర విభజనతో ముడిబడిన రాజ్యాంగ, రాజకీయ అంశాలపై సాధ్యమైనంత స్పష్టత ఇచ్చి ప్రజల సందేహాలను తొలగించే బదులు కాంగ్రెస్‌ ప్రయోజనాల పరిరక్షణకే పాకులాడటం ఇక్కడ పరిస్థితిని క్లిష్టం చేస్తున్నది. ఉదాహరణకు హైదరాబాదుకు ఢిల్లీ తరహా ఆలోచన అన్నారు అంటే ఎలా ఉంటుందనే సందేహం ఉభయ పక్షాలలోనూ ఉంది. కనీస వివరణ రావడం లేదు. నదీ జలాలపై సమస్యలే ఉండవని కొందరు, చాలా ఉంటాయని కొందరు వాదిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న వివరణ నాస్తి. ఇదంతా కావాలనే ఉద్రిక్తత పెంచే ప్రయత్నమా అని సందేహాలు కలగడానికి కారణమిదే.

అధికార పక్షం సంగతి ఇలా ఉంటే తెలుగుదేశం విషయం కూడా భిన్నం కాదు. వర్కింగ్‌ కమిటీ ప్రకటన వచ్చిన తర్వాత 36 గంటల పాటు చంద్రబాబు నాయుడు పెదవి విప్పలేదు. ఆ తర్వాత కొత్త రాజధానికి అయిదు లక్షల కోట్ల రూపాయల వరకూ అవసరమన్న అంశంపై కేంద్రీకరించి మాట్లాడారు. తక్కిన రాజకీయాంశాలు తర్వాత చెబుతామన్నారు. ఆయన ఏమైనా చెప్పేలోపలే ఆ పార్టీ సీమాంధ్ర ఎంఎల్‌ఎలు, ఎంపిలు రాజీనామాలు ప్రకటించారు. పార్టీ విధానానికి వ్యతిరేకం కాదంటూనే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందనే ఆరోపణతో ముందుకొచ్చారు. ఇలా పది రోజులు గడిచిన తర్వాత, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు ప్రధానికి లేఖ సంధించారు. సీమాంధ్ర ప్రజల భయాందోళనలుగా చెబుతున్నవి పొందుపరుస్తూ స్పష్టత కోసం ప్రభుత్వం తరపున ఏదైనా ప్రకటన చేయాలని కోరారు. వర్కింగ్‌ కమిటీ కాంగ్రెస్‌కు సంబంధించింది గనక తాము ప్రధానిని అడగడంలో తప్పేముందని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు గాని నిజానికి సీమాంధ్ర ప్రాంతంలో వైసిపి ముందుకు పోతున్నట్టు, తాము ఇరకాటంలో పడుతున్నట్టు పార్టీ వారి నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే చంద్రబాబు ఈ లేఖా వ్యూహం ప్రారంభించారని అర్థమవుతూనే ఉంది. తెలంగాణా ప్రాంతంలో తెలుగు దేశం రెండవ స్థానంలోనైనా వస్తుంది గాని మౌనం వల్ల తాము పూర్తిగా దెబ్బ తినిపోతామని వారు గగ్గోలు పెడుతుంటే అధ్యక్షుడు ఎలా ఉపేక్షిస్తాడని ఒక నాయకుడు నాతో అన్నారు. ఇది గతంలో ఆయన తీసుకున్న యూ టర్న్‌కు మరో రూపం మాత్రమేనని ప్రత్యర్థులు విమర్శలు మొదలు పెట్టారు. ఈ లోగా ఆత్మగౌరవ యాత్ర పేరిట మరో పర్యటన ప్రారంభించాలనుకుంటున్నట్టు సూచనలు వెలువరించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలతో కాస్త మెరుగుపడిందనుకున్న పార్టీ పరిస్థితి ఈ పరిణామాలతో మొదటికి వచ్చిందనేది తెలుగుదేశంలో కనిపించే ఆందోళన. అయితే దాన్ని అధిగమించడానికి స్పష్టమైన విధానాలతో గట్టిగా నిలబడటం తప్ప మరింత తడబాటుకు లోనవడం, మరోసారి తర్జనభర్జన పడటం ఎలా ఉపయోగపడుతుంది? విశ్వసనీయత మరింత దెబ్బతినొచ్చు.

ఇక రాజీనామాలు ప్రారంభించిన వైసిపి తన దూకుడు మరింత పెంచింది. అసలు వారి రాజీనామాలు సమైక్యత కోసమని చెప్పకుండా కేంద్రంపై దాడితో సరిపెట్టిన వైసిపి తెలంగాణాలో పరిణామాలు చూసిన కొద్దీ మరింత ముందుకే పోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో పార్టీ అధినేతలైన జగన్‌, విజయమ్మ కూడా రాజీనామా చేశారంటే ఈ వ్యూహం ఎంత ఉధృతంగా అమలు చేయాలనుకుంటున్నదీ తెలుస్తుంది. ప్రాంతీయ పార్టీగా చక్రం తిప్పాలనుకున్న వైసిపి ఉప ప్రాంతీయ పార్టీగా లేక రేపు ఏర్పడనున్న కొత్త రాష్ట్రానికే పరిమితమైన పార్టీగా తన స్థానాన్ని కుదించుకోవడానికి సిద్ధమైంది. అధినేత ఇప్పటికీ జైలు నుంచి విడుదల కాకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందిని ప్రాంతీయ పాత్రతో అధిగమించాలని పాచికలు వేస్తున్నది. వాస్తవానికి వైసిపి మొదటి నుంచీ తెలంగాణా సమస్యపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని దాటవేత వైఖరిని ప్రదర్శించింది. తీరా ఆ సమయం వచ్చాక అడ్డం తిరిగింది. పోనీ స్పష్టంగా సమైక్యత అని చెప్పిందా అంటే అదీ లేదు. మొత్తంపైన ఇది ఒక ప్రాంతంలో బలం పెంచుకునే రాజకీయ క్రీడ మాత్రమేనని స్పష్టమై పోయింది. అయితే ఆ పార్టీ నేతలు తమ పాత్రను సమర్థించుకుంటూ ఇతరులపై విరుచుకుపడటం ఇందులో అదనపు విశేషం.
ఈ సమయంలో నిజానికి చాలా సంతోషంగా ఉండాల్సిన టిఆర్‌ఎస్‌ నేతలు కూడా ఆచితూచి అడుగేస్తున్నారంటే కాంగ్రెస్‌ ఎత్తుగడల పట్ల వారికి ఉన్న ఆందోళనే కారణం. తెలంగాణా ఏర్పాటు ప్రకటిస్తే పార్టీని విలీనం చేస్తామని కెసిఆర్‌ చాలాసార్లు ప్రకటించారు. అది తమ రాజకీయ త్యాగానికి గుర్తు అని కూడా నేతలు చెప్పేవారు. అయితే కాంగ్రెస్‌ కమిటీ అలాటి నిర్ణయం ప్రకటించినప్పటికీ టిఆర్‌ఎస్‌ ఆశించినట్టు ఆ సంప్రదింపులలో, ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయలేదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇదంతా వైఎస్‌ రాజశేఖ రెడ్డి ప్రారంభించాడన్న వాస్తవాన్ని ముందుకు తెచ్చి టిఆర్‌ఎస్‌నూ వైసిపినీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. విలీనం కోసం ఇచ్చిన మాటను గుర్తు చేస్తూనే సేనాని లేకుండా సేనను కలిపేసుకున్నట్టు టిఆర్‌ఎస్‌ కీలక నేతలకు గాలం వేస్తున్నది. ప్రకటన వచ్చిన రోజునే విజయశాంతి, తర్వాత విజయరామారావు వంటి వారు బారులు తీరారు. పంచాయతీ ఎన్నికలలోనే ప్రభావం చూపిన ఈ ఎత్తుగడ విభజన నిర్ణయం తర్వాత టిఆర్‌ఎస్‌కు మరీ గుదిబండగా మారింది. ముందే మాట్లాడితే కెసిఆర్‌ నాయకత్వాన్ని సంతృప్తి పర్చడానికి చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది గనక ఆయన అనివార్యంగా తమలోకి వచ్చే వాతావరణం కల్పించాలన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడగా ఉంది. ఈ క్రమంలో అసౌకర్యానికి గురైన కెసిఆర్‌ ఒక దశలో గత తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలు కొని తెచ్చుకోవడమే గాక కాస్త ఉద్రిక్తతకూ కారణమైనారు. తర్వాత సర్దుకున్నప్పటికీ ఆదిలోనే హంసపాదులా జరగాల్సిన నష్టం జరిగింది. ఈ కారణం చేతనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్పందన అంటూనే హెచ్చరికలు, బెదిరింపుల వంటి వాటికి పోకుండా అవహేళనలు, అంకెలకే పరిమితమైనారు. కెసిఆర్‌ కన్నా దామోదర రాజ నరసింహ వ్యాఖ్యలే ఒక రకంగా తీవ్రంగా ఉన్నాయి.

పాలక పార్టీలకే అలవాటైన ద్వంద్వ విధానం కొన్ని వామపక్ష కార్మిక సంఘాలకు కూడా పాకడం ఈసారి మీడియాను ఆకర్షించింది. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రెండు చోట్ల రెండు రకాలుగా సమ్మె నోటీసులివ్వడం విచిత్ర పరిణామం. తెలంగాణాపై తగిన కసరత్తు లేకుండా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రకటన చేసిందని వ్యాఖ్యానించిన సిపిఐ రాష్ట్ర విస్తృత సమావేశం విడుదల చేసిన సుదీర్ఘ నివేదిక ఆసక్తి కలిగించింది. విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన మజ్లిస్‌ కేంద్ర ప్రకటన తర్వాత మద్దతు తెలిపింది. మొదట్లో కాస్త మెతగ్గా మాట్లాడిన కేంద్ర మంత్రులు తర్వాత గొంతు పెంచారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మాత్రం అన్ని పార్టీలూ రెండు ప్రాంతాల్లో ఒకే వైఖరి తీసుకుని చట్టసభల్లో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలే తప్ప ప్రజల మధ్య వైషమ్యాలు పెంచరాదని కోరింది. తొలి భాషా రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్‌ దేశంలో మరిన్ని రాష్ట్రాల విచ్ఛిన్నానికి తెర తీసినట్టయిందని సిపిఎం పొలిట్‌ బ్యూరో వ్యాఖ్యానించింది. అందుకు తగినట్టుగానే ఇరవైకి పైగా రాష్ట్రాలలో విభజన కోర్కెలు ముందుకొచ్చినట్టు హోం శాఖ ప్రకటించింది.
ఏది ఏమైనా ఇప్పుడు ఆంటోనీ కమిటీ అన్నది కాంగ్రెస్‌ పల్లవిగా ఉంది. దాని పట్ల ఎవరి వైఖరి వారు తీసుకోవచ్చు. ప్రభుత్వాలకు చెప్పదలచుకున్నది చెప్పొచ్చు. కానీ తాము ప్రకటించిన రాజకీయ విధానం నుంచి తామే వెనక్కు పోయి ప్రజల మనోభావాల పేరిట ఎడతెగని వివాదాలను సాగలాగడం ఎవరికీ మంచిది కాదు. ఈ క్రమంలో పై చేయి కోసం పోటాపోటీ నాటకాలాడుతూ చౌకబారు వాగ్యుద్ధాలకు దిగడం, ప్రాంతాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీయడం అసలే మంచిది కాదు. రాజకీయ, రాజ్యాంగ అంశాలపై స్థానిక సమ్మెలతో సాధించేది స్వల్పమని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితిని, గత నాలుగేళ్ల అనుభవాలను గమనంలో ఉంచుకుని ఎవరికి, దేనికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా సంకుచిత రాజకీయ వ్యూహాలకు, ఎన్నికల రాజకీయాలకు తమను సమిధలుగా ఉపయోగించే వారి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. 
-తెలకపల్లి రవి(ప్రజాశక్తి, 11.8.2013)

  

Saturday, August 10, 2013

'విభజన' - సమైక్యత ' నినాదాల నిజ స్వరూపం

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ సమైక్యత కోసం కట్టుబడి ఉన్నామంటున్నారు. 'సమైక్యత' అన్న మాటకు అందరి అర్థం ఒకటి కాదని పైపైన పరిశీలించినా తేటతెల్లమవుతుంది. చిరంజీవి గారు చెప్తున్న సమైక్యత హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌తో ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ వారి సమైక్యత పదేళ్లకు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీతో ముగుస్తుంది. కాంగ్రెస్‌ వారి సమైక్యత ఆంటోనీ కమిటీకి నివేదించుకోవడంతో అంతం అవుతుంది. వైఎస్‌ఆర్‌ వారి సమైక్యత అస్పష్ట వ్యాఖ్యలతో, ఎదురుదాడితో ముగుస్తుంది. తెలుగుజాతి ముక్కలు కాకుండానే, సమైక్యతలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని కొద్ది మంది మేధావులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఆందోళనలలోనూ పాల్గొంటుండవచ్చు. దేశం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసం తెలుగుజాతి ఐక్యతపై నిర్మాణమైన రాష్ట్రం ఒకటిగా ఉండాలని సిపిఐ(యం) అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పాలక ప్రతిపక్షాలు కూడా అలాగే అనుకోవడం లేదు. అందరూ ఇచ్చే సమైక్యత నినాదాలు ఒకటేననుకుంటే ప్రజలు దారుణంగా మోసపోతారు. 

దేశంలో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అప్రతిష్టను కాంగ్రెస్‌ మూటగట్టుకోబోతున్నది. మిగిలిన బూర్జువా, భూస్వామ్య ప్రతిపక్ష పార్టీలు తమ అవకాశవాద రాజకీయాలతో ఈ విచ్ఛిన్నంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. సమైక్య రాష్ట్రమే ఉండాలని ప్రకటిస్తూ వచ్చిన ఎంఐయం అభిప్రాయాన్ని మార్చుకుని ఇప్పుడు విభజన ప్రతిపాదనను సమర్థించింది. వాపపక్ష ప్రజాతంత్ర శక్తులలో ఒక ప్రధానమైన భాగం విభజనవాదాన్ని ఆలింగనం చేసుకుని పాలక పార్టీల రాజకీయ క్రీడకు ఒక అభ్యుదయ ముసుగు తగిలించింది. పార్లమెంటులో అత్యధిక సంఖ్యాబలం కలిగిన కాంగ్రెస్‌, బిజెపిలు ఒక్కటైన తర్వాత రాష్ట్ర విభజన అనివార్యమన్న పరిస్థితి ఏర్పడింది. చివరకు సిపిఎం ఒక్కటే దేశ, రాష్ట్ర, పీడిత ప్రజల ప్రయోజనాల దృష్టితో దాదాపు ఒంటరిగా రాష్ట్ర సమైక్యత కోసం నిలబడింది.

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సమస్యను సృష్టించి, నానబెట్టి ప్రతిష్టంభన సృష్టిస్తే, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు స్పష్టమైన అభిప్రాయాలు చెప్పకుండా సమస్యను జటిలం చేశాయి. పార్టీల నాయకులు ప్రాంతాల వారీగా వేర్వేరు వైఖరులను తీసుకుని అనైక్యతను పెంచి పోషించారు. టిఆర్‌ఎస్‌ విద్వేషపూరిత ప్రకటనల ద్వారా రెచ్చగొట్టుడు చర్యల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను పెంచింది. సుహృద్భావాన్ని ధ్వంసం చేసింది. పర్యవసానంగా సమస్యను ఎటువైపు పరిష్కరించినా అసంతృప్తి, ఆందోళన తప్పని పరిస్థితి ఏర్పడింది. మూడున్నరేళ్ల క్రితం విభజనకు సిద్ధమైనప్పుడు గాని, ఇప్పుడు విభజన విధాన నిర్ణయం ప్రకటించినప్పుడు కాని కాంగ్రెస్‌ నిర్ణయాల వెనక స్వార్థపూరిత ఎన్నికల ప్రయోజనమే ప్రధానంగా దాగి ఉన్నది. కాంగ్రెస్‌ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే గత రెండుసార్లు దానికి అక్షయపాత్రగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని సీట్లు రావాలి. లేకపోతే 2014 ఎన్నికలలో అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుంది. అందుకే ఇక ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్నది. అప్పుడు విభజన వలన రెండు ప్రాంతాల్లో లబ్ది పొందవచ్చని భావించింది. ఇప్పుడు ఐక్యంగా ఉంచితే రెండందాల నష్టపోతాం, విభజిస్తే ఒక చోటైనా లాభం పొందుతాం అన్న దుర్బుద్ధితో నిర్ణయం తీసుకున్నది.

ఇప్పటి వరకూ తమకు కొరకరాని కొయ్యగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన కాంగ్రెస్‌ ఇచ్చిన ఆయాచిత అవకాశంగా బిజెపికి కన్పించింది. రాష్ట్రాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ఫెడరలిజాన్ని బలహీనం చేయడం ద్వారా తన హిందూత్వ ఎజెండాను సులభంగా సాధించుకోవచ్చు, మతద్వేషాలను, సంఘర్షణలను రెచ్చగొట్టి బలపడవచ్చు అన్నది బిజెపి వ్యూహం. అందుకే విభజన గురించి ప్రధానమంత్రి సంప్రదించగానే బిజెపి నాయకత్వం ఎగిరి గంతేసి సమర్థిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ నుంచి, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాకముందే మీడియాకు చెప్పి తమ గొప్పతనాన్ని ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బిజెపి బలపర్చడానికి సిద్ధమైన తర్వాత రాష్ట్ర విభజన నిర్ణయం పార్లమెంటులో ఆమోదం పొందడం సునాయాసంగా జరిగిపోతుంది.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సహజంగానే తెలంగాణా ప్రాంతంలో ఉత్సాహాన్ని కలిగించింది. సీమాంధ్ర ప్రాంతంలో నిరసనకు, ఆగ్రహానికి కారణమైంది. గతంలో విభజన కోసం తెలంగాణాలో ఉద్యమాలు తీవ్రంగా జరిగితే ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోస్తా-రాయలసీమలో ఉధృతంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అధిష్ఠానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు రావడం ప్రారంభమైన తర్వాత సమైక్యతా సెంటిమెంట్‌ను ఎలా వినియోగించుకోవాలా అనే ఆదుర్దా బూర్జువా పార్టీల నాయకుల్లో మొదలైంది. సమైక్యత కోసం తామే గట్టిగా వాదించామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అధిష్ఠానానికి సమర్పించిన రోడ్‌ మ్యాప్‌లలోని అంశాలను పత్రికలకు లీకు చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వ్యాప్తి చేశారు. ఇతరులకన్నా తామే ఎక్కువ లబ్ధి పొందాలన్న ఆశతో అందరికన్నా ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. తామెక్కడ వెనకబడి పోతామోనని కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, తెలుగుదేశం శాసన సభ్యులు కూడా రాజీనామాలు సమర్పిస్తున్నారు.

అప్పటి వరకూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు, విభజనకు అనుకూలంగా పార్టీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన తెలుగుదేశం నాయకులు, కేంద్రం ఏ నిర్ణయం చేస్తే దానికి బద్ధులై ఉంటామని చెప్పిన వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వీరావేశాలతో ఊగిపోవడం, మీడియా ముందు ఊగిపోవడం చేస్తున్నారు. ఆ పార్టీల జెండాలతోనే ఆందోళనలు చేస్తున్నారు. విభజనకు సానుకూలమని చెప్పిన పార్టీలలో ఉంటూనే సమైక్యత పేరుతో రాజీనామాలు ఇవ్వడంలో, ఆందోళన చెయ్యడంలో వారికి వైరుధ్యమేమీ కన్పించడం లేదు. లేదా ప్రజలు గమనించరులే అన్న భరోసా అనుకోవాలి. పదవులకు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావు, ప్రయోజనాలేమీ పోవు, ఆ ధైర్యంతోనే పార్టీలకు కాకుండా పదవులకు రాజీనామా చేస్తుండవచ్చు. ఉద్యమాలతో ప్రజలు అలిసిపోయిన తర్వాత తమ పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉండవచ్చనే కపటత్వం ప్రదర్శిస్తున్నారనుకోవాలి. ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్‌ చేయడం రాజకీయ నాయకులు తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే తోడ్పడుతుంది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అది రాజ్యాంగ ప్రతిష్టంభనకేమీ దారితీయదు. మహా అయితే రాష్ట్రపతి పాలనకు దారితీస్తుంది. అప్పుడు ప్రజల స్థితి పెనం మీద నుంచి పొయ్యిలోపడినట్టు అవుతుంది తప్ప ఉపయోగమేమీ జరగదు.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ సమైక్యత కోసం కట్టుబడి ఉన్నామంటున్నారు. 'సమైక్యత' అన్న మాటకు అందరి అర్థం ఒకటి కాదని పైపైన పరిశీలించినా తేటతెల్లమవుతుంది. చిరంజీవి గారు చెప్తున్న సమైక్యత హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌తో ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ వారి సమైక్యత పదేళ్లకు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీతో ముగుస్తుంది. కాంగ్రెస్‌ వారి సమైక్యత ఆంటోనీ కమిటీకి నివేదించుకోవడంతో అంతం అవుతుంది. వైఎస్‌ఆర్‌ వారి సమైక్యత అస్పష్ట వ్యాఖ్యలతో, ఎదురుదాడితో ముగుస్తుంది. తెలుగుజాతి ముక్కలు కాకుండానే, సమైక్యతలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని కొద్ది మంది మేధావులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఆందోళనలలోనూ పాల్గొంటుండవచ్చు. దేశం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసం తెలుగుజాతి ఐక్యతపై నిర్మాణమైన రాష్ట్రం ఒకటిగా ఉండాలని సిపిఐ(యం) అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పాలక ప్రతిపక్షాలు కూడా అలాగే అనుకోవడం లేదు. అందరూ ఇచ్చే సమైక్యత నినాదాలు ఒకటేననుకుంటే ప్రజలు దారుణంగా మోసపోతారు.



బహుళజాతులున్న మన దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చేస్తే ఫెడరలిజం నాశనం అవుతుంది. కేంద్రంలో అధికారాలు, నిధులు కేంద్రీకృతమవుతాయి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. మతోన్మాద శక్తులు సులువుగా బలపడి లౌకికవాదానికి ప్రమాదం హెచ్చుతుంది. అంతర్జాతీయ, దేశీయ గుత్తపెట్టుబడిదారులు యథేచ్ఛగా ప్రభుత్వాలను శాసించి దోచుకోవడానికి అడ్డే ఉండదు. సరళీకరణ విధానాలకు కనీస ప్రతిఘటన ఇవ్వగల ప్రభుత్వాలు లేకుండా పోతాయి. కేంద్రం మీద ఆధారపడి మున్సిపాలిటీల స్థాయికి రాష్ట్రాలు దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాథమిక మెట్టుగా భాషా ప్రాయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నాన్ని కోరుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రకటన తర్వాత 20కి పైగా చిన్న రాష్ట్రాల కోర్కెలు రగుల్కొన్నాయి. నయా సరళీకరణ విధానాలను భుజానకెత్తుకున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఏదో ఒక రూపంలో విభజన వైపు మొగ్గు చూపడంలో ఆశ్చర్య పడాల్సిందేమీలేదు. బూర్జువా పాలక పార్టీలు ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తమ అవకాశవాద స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటాయి అన్న విషయాన్ని గత మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మరోసారి స్పష్టంగా రుజువు చేశాయి. రాష్ట్రంలో తమ మధ్య వనరులు, పదవుల పంపిణీ తగాదాలను పరిష్కరించుకునేందుకు బూర్జువా పాలక పార్టీలు, వర్గాలు విభజన- సమైక్యత సమస్యను సృష్టించాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు. రెండు రాష్ట్రాలలో ఎవరు పదవులు చేపట్టినా సరళీకరణ విధానాలను అనుసరిస్తారు. సంపదను పోగేసుకోవడానికి పదవులను వినియోగించుకుంటారు. పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు ఏ ప్రయోజనం దక్కదు. గతంలోనూ ప్రజా సమస్యలను పాలకవర్గ పార్టీలు పరిష్కరించలేదు. అప్పుడూ కార్మికులు, కూలీలు, రైతులు, సామాజిక, బలహీన వర్గాల ప్రజలు పోరాటాలు చేశారు. ఇప్పుడు రాష్ట్రం రెండయినా పేదల, బలహీనవర్గాల సమస్యలు పరిష్కారం కావు. అందువలన కొత్త రాష్ట్రాలలో కూడా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయక తప్పదు.

ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ సరళీకరణ విధానాలను అనుసరించాయి. రెండు రాష్ట్రాలయినా, ప్రస్తుత పాలక పార్టీలు ఏవి అధికారంలోకొచ్చినా సరళీకరణ విధానాలనే అనుసరిస్తాయి. పాలకులు అనుసరించిన సరళీకరణ విధానాల మూలంగా రాష్ట్రంలో గతంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. కొత్త రాష్ట్రాలలో ప్రాంతాల మధ్య అస మానతలు ఇంకా పెరు గుతాయి. వెనకబడిన ప్రాం తాల అభివృద్ధికి అప్పుడూ ఉద్యమాలు తప్పవు. వామపక్ష పార్టీలు కొన్ని ప్రాంతీయతత్వాన్ని భుజాన ఎత్తు కోవడమే ప్రస్తుత పరిస్థితిలో ఆందోళనకర అంశం. ప్రజల సెంటి మెంట్‌కు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా ఉద్యమం అభివృద్ధి అవుతుందన్న భావన ఈ శక్తులకు ఉండవచ్చు. కానీ కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వాల ద్వారా విప్లవోద్యమాలు ముందుకు పోయిన దాఖలాలు ఎక్కడా లేవు. వాస్తవంగా వీటి వలన ప్రజా ఉద్యమాలకు, ప్రజల ఐక్యతకు భంగం కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర విభజన విషయంపై వామపక్షాలలో ఉన్న అనైక్యత ప్రజా ఉద్యమాలకు ఆటంకం అయిందన్నది వాస్తవం. పైగా ప్రాంతీయతత్వాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో బలపడాలనే బిజెపి ప్రయత్నాలను వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్లోని ఒక సెక్షన్‌ గమనించకపోవడం ప్రస్తుత పరిస్థితిలోని విషాదం.

రాజకీయ పార్టీలలోనే కాక కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల్లోనూ అవకాశవాద ధోరణి ప్రబలంగానే ఉంది. రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ సంఘాలు తెలంగాణాలో విభజన కోసం, కోస్తా, రాయలసీమలో సమైక్యత కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొనడమేమిటి? రెండు పరస్పర విరుద్ధ డిమాండ్ల కోసం ఒకే సంఘం నిలబడడం ఎలా సాధ్యమవుతుంది? రెండు విరుద్ధ డిమాండ్లను ఏక కాలంలో సాధించడం ఎలా సాధ్యమవుతుందన్న కనీస ఆలోచన కూడా లేనట్లు అయోమయం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అవకాశవాదంతో వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో అవి స్పష్టమైన, సరైన వైఖరి తీసుకోకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలోనే రాష్ట్ర విభజన-సమైక్యత సమస్య పరిష్కారమవుతుందనుకోవడం అత్యాశ, అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు ప్రోత్సహించి సమ్మెల్లోకి దించవచ్చు. ఆ రకంగా సమ్మెలు చేసిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టం లేకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం వేరైనా రెండు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చే పాలకులు సమ్మె కాలానికి జీతభత్యాలు ఇవ్వకుండా ఉండలేరు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నా జీతాలు ఆపలేరు. కానీ గతంలో ఉపాధ్యాయుల సమ్మె మూలంగా తెలంగాణ ప్రాంతంలో పేదల పిల్లలు నష్టపోయారు. ఇప్పుడు కోస్తా-రాయలసీమలో నష్టపోతారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చాలని ఏ ప్రధాన పార్టీ చెప్పని నేపథ్యంలో పిల్లల భవిష్యత్తుకు హాని చేయడం అవసరమా అనేది ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించుకోవాలి. విభజన జరిగితే ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అటువంటి సమస్యలపై ఆందోళనలు-ఉద్యమాలు తప్పకపోవచ్చు. అటువంటి వాటి కోసం పోరాటమా? పాలక రాజకీయ పార్టీల అవకాశవాద అవసరాల కోసం పోరాటమా? అనేది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ముందున్న ప్రధాన సమస్య.

విభజన అంశాలపై చాలా సమస్యలొస్తాయి. విద్వేషాలు, వివాదాలను బూర్జువా పార్టీల నాయకులు రెచ్చగొడతారు. ఆవేశకావేశాలను సృష్టిస్తారు. సంకుచితత్వం, దురహంకార భావాలకు గురికాకుండా సామాన్య ప్రజల ఐక్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తూనే ఉపాధి రక్షణ, వనరుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాలన్నింటి అభివృద్ధికి చర్యలు, ఉద్యోగుల, పేదల, బలహీనవర్గాల హక్కుల రక్షణ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సమ న్యాయంతో నిర్ణయాలు తీసుకునేట్టుగా కృషి చేయడం అవసరం. 
-ప్రజామిత్ర

 (Prajasakti, 9.8.2013)

Wednesday, July 24, 2013

పరాధీనతకు పరాకాష్ట, టెలికాం లో 100% ఎఫ్ డి ఐ

పరాధీనతకు పరాకాష్ట, టెలికాం లో 100% ఎఫ్ డి ఐ
12 రంగాలలో ఎఫ్ డి ఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) పరిమితులను పెంచాలని లేదా ఆటోమేటిక్ రూట్ లో అనుమతించాలని 16.7.2013 న మన్మోహన్ సింగ్ ప్రభుత్వము నిర్ణయించింది. ఇందులో భాగంగా టెలికాం సర్వీసుల రంగం(ల్యాండ్ లైన్ మరియు మొబైల్ సర్వీసుల రంగం) లో ఎఫ్ డి ఐ పరిమితిని ఇప్పుడున్న 74 శాతం నుండి 100 శాతం కు పెంచాలని నిర్ణయించింది. (గతం లో ఈపరిమితి 49 శాతం గా వుండగా, 3.11.2005న 74 శాతం కు పెంచింది).
టెలికాం పరికరాల ఉత్పత్తి రంగం లో ఎఫ్ డి ఐ పరిమితి గతం లోనే 100 శాతం వున్నది. ఈ విధంగా టెలికాం పరికరాల తయారీ రంగం తో పాటు టెలికాం సర్వీసుల రంగం లో కూడా ఎఫ్ డి ఐ పరిమితి 100 శాతం అయింది. పరికరాల తయారీ రంగం లో ఎఫ్ డి ఐ 100 శాతం ఆటోమేటిక్ గా,  వచ్చిన  నెల రోజుల లోగా రిజర్వు బ్యాంకుకు తెలియజేసి  రావచ్చు. టెలికాం సర్వీసుల రంగం లో  49 శాతం వరకూ ఈ ఆటోమేటిక్ రూట్ లో రావచ్చు. 50 నుండి వంద శాతం వుంటే ఎఫ్ ఐ పి బి(ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్) అనుమతి తో రావచ్చు. ఈ విధంగా భారత భాగస్వామి లేకుండా విదేశీ కంపెనీలు టెలికాం పరికరాల తయారీ రంగం లో, సర్వీసుల రంగం లో ప్రవేశించేందుకు తలుపులు తెరిచారు.
రాబోయే ఐదు సంవత్సరాలలో టెలికాం రంగం లో 5 లక్షల కోట్ల రూపాయిల పెట్టుబడి అవసరం. అంత మనదగ్గర లేనందున  100 శాతం ఎఫ్ డి ఐ కి అనుమతించి ప్రోత్సహించాల్సి వచ్చిందని కమ్యూనికేషన్సు మంత్రి కపిల్ సిబాల్ ఈ నిర్ణయానికి గల కారణాన్ని వివరించారు. 5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు 5 సంవత్సరాలలో మన టెలికాం రంగం లోకి వస్తాయనుకోటం వాస్తవ విరుద్ధం. విదేశీ పెట్టుబడులను విచ్చలవిడిగా అనుమతించినందున దేశం అభివృద్ధి చెందుతుందనటం అంతకన్నా వాస్తవ విరుద్ధం. ప్రజలను నమ్మించటానికి చెప్పే సాకులు ఇవి.
ఏప్రిల్ 2000 నుండి డిసెంబరు 2012 వరకు మన టెలికాం రంగం లోకి(పరికరాల ఉత్పత్తి, సర్వీసులు అన్నీ కలిపి) వచ్చిన ఎఫ్ డి ఐ, రూ. 57585 కోట్లు మాత్రమే. వాస్తవం ఇది కాగా రానున్న ఐదు సంవత్సరాలలో 5 లక్షల కోట్ల ఎఫ్ డి ఐ ఏ విధంగా వస్తుంది? పైగా టెలికాం సర్వీసుల మార్కెట్టు గతం లో విస్తరించినంత వేగంగా ఇప్పుడు విస్తరించటం లేదు.
ఎఫ్ డి ఐ వలన మనకి పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందనే వాదన నిజం కాలేదు. పైగా అందుకు విరుద్ధంగా జరిగింది. 2000 ఏప్రిల్ నుండి 2012 డిసెంబరు వరకు వచ్చిన ఎఫ్ డి ఐ రూ. 57585 కోట్లు మాత్రమే కాగా టెలికాం పరికరాల దిగుమతికి మనము 2004 ఏప్రిల్ నుండి 2012 డిసెంబరు వరకు రూ.3,11,714 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించాము. అంటే మనకు వచ్చింది రూ. 57585 కోట్లు అయితే ఇచ్చింది రూ.3,11,714 కోట్లు! టెలికాం పరికరాల తయారీ రంగం లో 100 శాతం ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నామేగాని మనకి మనముగా అభివృద్ధి చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ప్రకటించిన లెక్కల ప్రకారం మన టెలికాం నెట్వర్క్స్ విస్తరణకు వినియోగించిన పరికరాల విలువలో కేవలము 11 శాతాన్ని మాత్రమే మన దేశంలో  సృష్టిస్తుండగా 89 శాతం విదేశాలకు చెల్లిస్తున్నాము.
మన టెలికాం సర్వీసుల నెట్ వర్క్సును విదేశాలనుండి దిగుమతి చేసుకున్న పరికరాలతో ఈ విధంగా విస్తరించుకుంటూ పోతే అది దేశ భద్రతకు ముప్పు తెస్తుందని హోమ్  శాఖ అన్నది. విదేశాలనుండి దిగుమతి చేసుకునే పరికరాలలో మనకి తెలియకుండానే దానికి తగిన కోడ్ ను సాఫ్ట్ వేర్, హార్డ్వేర్, ఫర్మ్ వేర్ లలో అమర్చి  మన సమాచారాన్ని విదేశీ ఏజెన్సీలు తెలుసుకునే అవకాశం వున్నది.  కీలక సమయాలలో మన టెలికాం నెట్వర్కు పనిచేయకుండా చేసే అవకాశం వున్నది.  కాబట్టి టెలికాం నెట్ వర్క్సు విస్తరణలో భారత దేశం లో  తయారయిన పరికరాల వాడకం శాతం పెరగాలని  హోమ్ శాఖ అన్నది. దీనికి అనుగుణంగా ప్రభుత్వరంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు క్రమంగా తమ నెట్వర్క్సు విస్తరణలో విదేశీ పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికాం శాఖ 5.12.2012 ను  ఆదేశించింది. ఇదే విధానాన్ని ప్రయివేటు టెలికాం ఆపరేటర్లు  కూడా  కొన్ని కీలకమయిన పరికరాల విషయం లో అమలు చేయాలని ఒక డ్రాఫ్ట్ ఆర్డరు ను(ఇది ఫైనల్ ఆర్డర్ కాదు, చిత్తు ప్రతి మాత్రమే) వెబ్ సైట్  లో పెట్టింది.  
దీనికి వ్యతిరేకంగా అమెరికా-భారత  బిజినెస్ కవున్సిల్(ఇది అమెరికా బడా పెట్టుబడిదారులు, భారత బడా పెట్టుబడిదారులు కలిసి ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్, దీని హెడ్ క్వార్టర్సు వాషింగ్టన్ లో వున్నది) విదేశీ టెలికాం పరికరాల తయారీ కంపెనీలు, అమెరికా ప్రభుత్వము, భారత ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల అసోసియేషన్ “సి ఓ ఏ ఐ”(సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ప్రధాన మంత్రి కార్యాలయం పై వత్తిడి తెచ్చాయి. చివరకి ఇటీవలే ప్రధాన మంత్రి  కార్యాలయం ఇందుకు అనుగుణంగా స్పందించి స్వదేశీ టెలికాం పరికరాల వినియోగాన్ని పెంచాలనే నిబంధన ప్రభుత్వ రంగ సంస్థలయిన బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లకు మాత్రమే వర్తింపజేయాలని, ప్రయివేటు టెలికాం ఆపరేటర్లను మినహాయించాలని  నిర్ణయించింది.ఇందుకు అనుగుణంగా 8.7.2013 న ప్రకటన జారీ చేసింది(http://pmindia.nic.in/press-details.php?nodeid=1660 లో ఈ ప్రకటన చూడవచ్చు). దీని ప్రకారం స్వదేశీ టెలికాం పరికరాలకు ప్రాధాన్యతనివ్వాలనే సూత్రం ప్రయివేటు ఆపరేటర్లకు(ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా , రెలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టేలిసర్వీసెస్, మొదలగునవి) వర్తింపజేయకూడదు. అసలు “భద్రత” అంటే ఏమిటి? ఎవరికి భద్రత? అనే సంశయం మన్మోహన్ సింగ్ గారికి వచ్చింది. విదేశీ స్వదేశీ బడా పెట్టుబడిదారులకు ఏది లాభమో అదే “భద్రత’ అని ఆయన ఉద్దేశం. కాబట్టి “భద్రత ” ని పునర్నిర్వచించాలని ఈ ప్రకటనలో ప్రధాన మంత్రి, నేషనల్ సెక్యూరిటీ కవున్సిల్ సెక్రెటేరియట్ ను ఆదేశించారు!ఆగస్టు 8 లోగా ప్రయివేటు టెలికాం ఆపరేటర్లకు నిర్ణీబంధంగా విదేశీ పరికరాల దిగుమతిని అనుమతించే విధంగా కొత్త గైడ్ లైన్స్ ను తయారు చేసి  ను తయారు చేసి కేబినెట్ ఆమోదానికి పంపించాలని ఆదేశించారు.

టెలికాం సర్వీసుల రంగం లో 100 శాతం ఎఫ్ డి ఐ ని అనుమతించినందువలన జరిగేదేమిటి?వివిధ టెలికాం సర్వీసుల కంపెనీలలో ఎఫ్ డి ఐ ఈ క్రింది విధంగా ప్రస్తుతం వున్నది:
1.     వోడాఫోన్-74 శాతం(వోడాఫోన్ బ్రిటిష్ కంపెనీ), భారత దేశపెట్టుబడి-11 శాతం పిరామల్ గ్రూపు, 13% అనల్జిత  సింగ్, ఐ డి ఎఫ్ సి గ్రూప్ లు)
2.    ఎయిర్సెల్ –74 శాతం మ్యాక్సిస్ (సింగపూర్ కంపెనీ), 26 శాతం అపోలో హాస్పిటల్స్ గ్రూపు(భారతపెట్టుబడి)
3.    యూనినార్ –49 శాతం టెలినార్(నార్వే), 51 శాతం సన్ ఫార్మా(భారత పెట్టుబడి)
4.    సిస్టెమా శ్యామ్(ఎంటి ఎస్)—56.68 శాతం సిస్టెమా గ్రూపు(రష్యా కంపెనీ), 17.14 శాతం రష్యా ప్రభుత్వము –మొత్తం 73.82 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)
5.    భార్తి ఎయిర్టెల్ –32.25 శాతం  సింగ్ టెల్ (సింగపూర్), 5 శాతం కాతార్ ఎండోమెంట్ ఫౌండేషన్(కాతార్)-మొత్తం 37.25 శాతం , మిగతాది భార్తి గ్రూపు(స్వదేశీ)
6.    ఐడియా సెల్యులార్—యాక్సియేటా గ్రూపు(మలేషియా)-20.98 శాతం, మిగతాది ఆదిత్య బిర్లా తదితర స్వదేశీ పెట్టుబడి)
7.    రిలయన్స్ కమ్యూనికేషన్స్—ఎఫ్ డి ఐ దాదాపు లేదు, 68.06 శాతం అనిల్ అంబానీ గ్రూప్ పెట్టుబడులు
8.    టాటా టేలిసర్వీసెస్—26 శాతం డో కొ మొ(జపాన్), మిగతాది టాటా గ్రూప్ తదితర భారత పెట్టుబడి. (పత్రికలలో వార్తల ప్రకారం రష్యా కంపెనీ సిస్టెమా,  డో కో మో నుండి 26 శాతాన్ని, టాటా నుండి మరి కొంత  శాతాన్ని కొని మెజారిటీ భాగస్వామి కావాలని ప్రయత్నిస్తున్నది)
9.    బి ఎస్ ఎన్ ఎల్—నూటికి నూరు శాతం భారత ప్రభుత్వ పెట్టుబడి, ఎఫ్ డి ఐ గాని, స్వదేశీ ప్రయివేటు పెట్టుబడిగానీ లేదు.
10.  ఎం టి ఎన్ ఎల్—58.67% భారత ప్రభుత్వ పెట్టుబడి, మిగతాది ప్రయివేటు పెట్టుబడి; ఎఫ్ డి ఐ లేదు.
అయితే ఎఫ్ డి ఐ పరిమితి 100 శాతం చేసినందున ఉత్సాహపడి ఎఫ్ డి ఐ పెద్ద ఎత్తున వస్తుందా? వచ్చే పరిస్థితి లేదు. తాము పెద్ద ఎత్తున రావాలంటే ఎఫ్ డి ఐ పరిమితిని 100 శాతం కు పెంచితే చాలదని విదేశీ పెట్టుబడిదారులంటున్నారు. మరిన్ని రాయితీలివ్వలంటున్నారు. తమకి ఇప్పుడున్న 74 శాతం ఎఫ్ డి ఐ నూరు శాతం కావాలంటే 26 శాతం వాటాదారుల వాటాలను కొని స్వాధీనం చేసుకోవాలి. లేదా రెడు మూడు కంపెనీలు కలిసి ఒకే కంపెనీగా మారటానికి (విలీనం) వీలు కలిపించాలి. ఈ కలయికలు, విలీనాలు తేలికగా, ఎటువంటి షరతులూ లేకుండా జరగాలని కోరుతున్నాయి. అంతేగాక స్పెక్ట్రమ్ వేలం లో కనీస ధర చాలా ఎక్కువగా నిర్ణయించారనీ, దానిని తగ్గించాలనీ కోరుతున్నాయి. చట్టం ప్రకారం వోడాఫోన్ చెల్లించాల్సిన రూ.11200 కోట్లు పన్ను ను వసూలు చేయకుండా వుండాలని కోరుతున్నాయి. ప్రయివేటు టెలికాం కంపెనీలు బ్యాంకులనుండి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాయి. కానీ ఈ అప్పులు తీర్చటం ఇబ్బందికరంగా తయారయింది. కాబట్టి కొన్ని వాటాలు విదేశీ పెట్టుబడులకు అమ్ముకోటం లేదా మొత్తముగా తమ వాటాని విదేశీ పెట్టుబడిదారులకు అమ్ముకోటం మార్గమని భావించాయి. అందువలన అవి విదేశీ పెట్టుబడులు మరింత రావాలని కోరుతున్నాయి. అవి రావటానికి వీలుగా ఎఫ్ డి ఐ పరిమితి 100 శాతం చేయటంతో పాటు అనేక రాయితీలివ్వాలని కోరుతున్నాయి. ప్రయివేటు టెలికాం సర్వీసుల కంపెనీలు చట్టాలని, నిబంధలనీ ఉల్లంఘించినందుకు దాదాపు రూ.20,000 కోట్ల వరకూ పెనాలిటీలు చెల్లించాలి. ఈ చెల్లింపునుండి కూడా మినహాయింపు కోరుతున్నాయి.
ఈ రాయితీలన్నీ ఇచ్చేందుకు ప్రభుత్వము సిద్ధమవుతున్నది. ఈ నెల ఆఖరులోగా కలయిక, స్వాధీనాలను సరళీకరిస్తూ  గైడ్ లైన్స్ ను ప్రకటిస్తామని కమ్యూనికేషన్స్ మంత్రి కపిల్ సిబాల్  ప్రకటించారు.  కలయిక లేదా స్వాధీనం  వలన ఏర్పడే కంపెనీకి మార్కెట్ లో(మొత్తం టెలికాం వినియోగదారులలో) 35 శాతం ఆటోమేటిక్ గా వుండ వచ్చునని, టి ఆర్ ఏ ఐ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) అనుమతితో 60 శాతం వరకూ ఉండవచ్చునని ఈ గైడ్ లైన్స్ లో ప్రకటించబోతున్నట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. స్పెక్ట్రమ్ వేలం లో కనీస ధర తగ్గించేందుకు ప్రభుత్వము ప్రయత్నిస్తున్నది. కనీస ధర ఎంత తగ్గించవచ్చో పరిశీలించాలని టి ఆర్ ఏ ఐ ని కోరింది. వోడాఫోన్ పై విధించిన పన్నును తగ్గింవ్చేందుకు, ప్రయివేటు టెలికాం కంపెనీలపై విధించిన పెనాలిటీలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నది. ఈ రాయితీలన్నీ ఇచ్చినా జరిగేది ఏమిటి?
టి ఆర్ ఏ ఐ లెక్కల ప్రకారం 30.4.2013 నాటికి వివిధ టెలికాం సర్వీసుల కంపెనీల మార్కెట్ వాటా(వైర్ లైన్, మొబైల్ వినియోగ దారుల మొత్తం సంఖ్యలో వాటా) ) ఈ క్రింది విధంగా వున్నది:
1.     భార్తి ఎయిర్టెల్ =21.78 శాతం
2.    వోడాఫోన్=17.74 శాతం
3.    రిలయన్స్ కమ్యూనికేషన్స్=14.27 శాతం
4.    ఐడియా=14.17 శాతం
5.    బి ఎస్ ఎన్ ఎల్=11.42 శాతం
6.    టాటా=7.57 శాతం
7.    ఎయిర్సెల్=6.93 శాతం
8.    యూనిటెక్(యూనినార్)=3.67 శాతం
9.    సిస్టెమా శ్యామ్=1.16 శాతం
10.  ఏం టి ఎన్ ఎల్(ఇది ఢిల్లీ, ముంబయి కే పరిమితమయిన ప్రభుత్వరంగ సంస్థ)=0.56%
11.   లూప్=0.34 శాతం;
12.  విడియోకాన్=0.25 శాతం
13.  క్వాడ్రాంట్=0.16 శాతం
విదేశీ పెట్టుబడిని నూరు శాతం అనుమతించినందున, కలయిక, స్వాధీనాలు సరళం చేసినందున, ఇతర రాయితీలిచ్చినందున  పై కంపెనీలలో కొన్ని ఒక దానితో ఒకటి కలిసి లేదా ఒకటి మరో దానిని కొని స్వాధీనం చేసుకుని పెద్ద కంపెనీలుగా మారే అవకాశం వున్నది. వోడాఫోన్ మిగతా 24 శాతాన్ని కొని 100% విదేశీ యాజమాన్యపు కంపెనీ అయ్యే అవకాశం వున్నది. ఇదే విధంగా ఎయిర్సెల్, యూనినార్, సిస్టెమా శ్యామ్ లను విదేశీ కంపెనీలు పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం వున్నది. ఎయిర్టెల్, రిలయన్స్, ఐడియా సెల్యులార్, టాటా టేలిసర్వీసెస్ లలో విదేశీ పెట్టుబడిది పై చెయ్యి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కలయికలు, స్వాధీనాలు జరిగి ఇప్పుడున్న 13 కంపెనీలకు బదులు 5 లేదా 6 భారీ స్థాయి కంపెనీలు మాత్రమే రంగం లో మిగులుతాయి.దీని వలన కొన్ని కంపెనీల మార్కెట్ వాటా భారీగా పెరుగుతుంది. ఈ పోటీలో బి ఎస్ ఎన్ ఎల్, ఎం  టి ఎన్ ల మార్కెట్ వాటా మరింత తగ్గే పరిస్తితి ఏర్పడుతుంది. గత నాలుగు సంవత్సరాలనుండీ నష్టాలలో  వున్న బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ ల పరిస్తితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది.
100% ఎఫ్ డి ఐ పరిమితి వలన టెలికాం పరికరాల తయారీ రంగం దెబ్బతిన్నది. విదేశాలపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెలికాం పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ ఐ టి ఐ 2003 నుండి నష్టాలలో వున్నది. కేబుల్సు తయారు చేసే ప్రభుత్వ రంగా సంస్థ  హెచ్ సి ఎల్ 1993 నుండీ నష్టాలలో వున్నది. మన దేశం లో జరుగుతున్న కొద్దిపాటి టెలికాం పరికరాల ఉత్పత్తి లో కూడా అధిక శాతాన్ని ఇక్కడ ఫ్యాక్టరీలను పెట్టిన మోటారోలా, నోకియా, జడ్ టి ఈ , సామ్సుంగ్ తదితర విదేశీ కంపెనీలే చేస్తున్నాయి.
ఇదే విధంగా ఇప్పుడు ఎఫ్ డి ఐ పరిమితి టెలికాం సేవల రంగం లో 100 శాతం చేసినందున గత నాలుగు సంవత్సరాలనుండి నష్టాలలో వున్న ప్రభుత్వ రంగ సంస్థలు బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు మరింత నష్టాలలో కూరుకు పోయే పరిస్తితి ఏర్పడుతుంది. వాటి మార్కెట్ వాటా ఇప్పుడున్న 11.98 శాతం నుండి మరింత భారీగా తగ్గుతుంది. టెలికాం సర్వీసుల రంగం లో 90 శాతం పైగా మార్కెట్ ను అచ్చం విదేశీ  కంపెనీలు, లేదా విదేశీ పెట్టుబడిదే పై చేయిగా వున్న కంపెనీలు నడిపే పరిస్తితి ఏర్పడుతుంది.
విదేశాలలో తయారయిన ఎక్విప్మెంటు తో ఏర్పడిన టెలికాం సర్వీసుల నెట్ వర్కులు, ఆ నెట్ వర్కులను నిర్వహించే విదేశీ టెలికాం సర్వీసుల కంపెనీలు, కునారిల్లుతున్న స్వదేశీ టెలికాం పరికరాల తయారీ పరిశ్రమ-ఇది ఈ విధానాల ఫలితం.
ఇది మన దేశ భద్రతకు ప్రమాదం కాదా?కాదని మన్మోహన్ సింగ్ ప్రభుత్వము అంటున్నది. కానీ ఈ విధానాలను అవలంబించాలని మన పై ఒత్తిడి చేస్తున్న అమెరికా తన దేశం లో ఏమి చేస్తున్నది? అది టెలికాం రంగం లో విదేశీ పెట్టుబడులను 100 శాతం అనుమతించ లేదు. అమెరికా కమ్యూనికేషన్స్ చట్టం లోని సెక్షన్ 310 ప్రకారం టెలికాం సర్వీసుల రంగం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి 25 శాతం మించిన సందర్భం లో అది దేశ  ప్రయోజనాలకు విరుద్ధమని అమెరికా ప్రభుత్వము భావిస్తే అనుమతి నిరాకరించవచ్చు. ఇటీవలే అమెరికా హౌస్ కమిటీ చైనా టెలికాం పరికరాల తయారీ కంపెనీలయిన జడ్ టి ఇ మరియు హువాయి లతో వ్యాపారం చేయకూడదని, దేశ భద్రత రీత్యా ఇది అవసరమని తమ టెలికాం కంపెనీలను హెచ్చరించాయి. తమ వ్యాపారాన్ని దెబ్బ తీసే దురుద్దేశంతోటే హౌస్ కమిటీ ఈ విధంగా చేస్తున్నదని ఈ చైనా కంపెనీలు ఖండించాయి. మనకన్నా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం టెలికాం రంగం లో కలిగి వున్న అమెరికాయే విదేశీ టెలికాం పరికరాలపై, విదేశీ టెలికాం సంస్థలపై ఇటువంటి ఆంక్షలు విధిస్తుంటే మన ప్రభుత్వము ఎందుకు విదేశీ టెలికాం పరికరాల దిగుమతిని, విదేశీ టెలికాం సర్వీసుల కంపెనీలను 100 శాతం ఎఫ్ డి ఐ పరిమితితో అనుమతిస్తున్నది? విదేశీ టెలికాం కంపెనీలు మన దేశం లో టెలికాం సర్వీసులను భారత భాగస్వామ్యం లేకుండా నిర్వహించటం చాలా ప్రమాదకరమని హోమ్ శాఖ హెచ్చరించినా ప్రభుత్వము ఎందుకు పట్టించుకోటం లేదు?ప్రతిపక్షం లో వున్న బి జె పి కూడా ఈ  విధానాలకు అనుకూలమే. అందుకనే అది ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించటం లేదు. ప్రాంతీయ పార్టీలు కూడా పెట్టుబడిదారులకు అనుకూలమయిన దృక్పథం తో పని చేస్తూ ఈ విధానాలను వ్యతిరేకించటం లేదు. దేశ భద్రతకన్న, ప్రజాప్రయోజనాలకన్నా విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కును పెంచుకుంటూ మన దేశం లో అదే విధముగా విదేశాలలో తమ లాభాల వేటను కొనసాగిస్తున్న స్వదేశీ బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ పార్టీలు వుండటమే ఇందుకు కారణం.
 అమెరికా లో ప్రయివేటు టెలికాం కంపెనీలయిన వేరిజోన్, స్ప్రింట్ మొదలయినవి ఇంటర్నెట్ సంస్థ  లయిన మైక్రోసోఫ్ట్, గూగుల్, యాహూ, స్పైక్, పాల్ టాక్ మొదలగునవి వినియోగదారులలో ఎవరు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎక్కడినుండి మాట్లాడుతున్నారు, ఇంటర్నెట్ లో ఏ సమాచారం చూస్తున్నారు, ఏ సమాచారం పంపుతున్నారు తదితర వివరాలన్నీ  రహస్యంగా అమెరికా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి. ఇవి ఇతరదేశాల ప్రజల, సంస్థల సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నాయి.  ఈ పరిస్థితులలో ఇంటర్నేట్ పై, టెలికాం వ్యవస్థ పై అమెరికా ఆధిపత్యాన్ని, విదేశీ ఆధిపత్యాన్ని పెరగటానికి అనుమతించటం మన దేశ ప్రయోజనాలకు హానికరం. దేశ భద్రత రీత్యా మాత్రమేగాక టెలికాం రంగములో మన స్వావలంబనను కూడా ఈ విధానాలు దెబ్బ తీస్తున్నాయి. విదేశాలనుండి టెలికాం ఎక్విప్మెంటు కొనుగోలుకు లక్షలాది కోట్ల రూపాయిలు చెల్లించాల్సిన పరిస్థితిని ఈ విధానాలు సృష్టించాయి. స్వదేశీ టెలికాం పరికరాల పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడుతున్నది. స్వదేశీ టెలికాం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి అవసరమయిన పరిశోధనలు , పరిశోధనా సంస్థలు మూలన పడ్డాయి. టెలికాం సర్వీసుల మార్కెట్టు పూర్తిగా విదేశీ పరమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలు ఐ టి ఐ, హెచ్ సి ఎల్ లు ఖాయిలా పడ్డాయి.  బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లు గత నాలుగు సంవత్సరాలనుండి నష్టాలతో నడుస్తున్నాయి. టెలికాం రంగములో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గి తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. కార్మిక హక్కులను కత్తిరించాలని విదేశీ,స్వదేశీ ప్రయివేటు టెలికాం కంపెనీల ప్రతినిధులు వాదిస్తున్నారు. బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లలో ఉద్యోగుల సంఖ్యని భారీగా తగ్గించి వాటిని ముక్కలుగా విభజించి ప్రయివేటు పరమ్ చేసే ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి.
కాబట్టి ఈ దివాళాకోరు సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నాయముగా సరయిన విధానాలను ప్రతిపాదించి అందుకోసం పోరాడాల్సిన అవసరం వున్నది. ఎఫ్ డి ఐ ని మన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, ఉద్యోగాలు పెరిగేందుకు, మన పరిశ్రమలు అభివృద్ధి చెండేందుకు అవసరమయిన మేరకే వినియోగించుకోవాలితప్ప దానిపైనే పూర్తిగా ఆధారపడి స్వావలంబన కోల్పోవటాన్ని వ్యతిరేకించాలి. స్వదేశీ టెలికాం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని,  స్వదేశీ టెలికాం పరికరాల తయారీ సంస్థలను , స్వదేశీ టెలికాం సర్వీసుల సంస్థలను ప్రోత్సహించాలి. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ లయిన ఐ టి ఐ, బి ఎస్ ఎన్ ఎల్, ఎం టి ఎన్ ఎల్ లను ప్రోత్సహించాలి. చైనా లో టెలికాం సర్వీసుల కంపెనీలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే. ఆ విధముగా చైనా ప్రభుత్వము టెలికాం సర్వీసుల మార్కెట్టును తన ఆధీనములో వుంచుకుని దాని ఆధారముగా విదేశీ టెలికాం పరికరాల తయారీ సంస్థల పై  ఒత్తిడి తెచ్చింది. అవి తమ దేశములో ఒక చైనా కంపెనీ భాగస్వామిగా పెట్టుబడి పెట్టవచ్చునని , కానీ అందుకు బదులుగా అవి తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా కంపెనీకి బదిలీ చేయాలని షరతు విధించింది. ఆ విధముగా విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది దాని పై మరిన్ని పరిశోధనలు చేసి స్వదేశీ టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహించింది. దీని ఫలితంగా చైనా టెలికాం పరికరాల తయారీ కంపెనీలయిన జడ్ టి ఇ, హువాయి మొదలయినవి మనదేశానికేగాక అమెరికా తదితర దేశాలకు కూడా టెలికాం పరికరాలను పోటీపడి అమ్మగలిగే స్థాయికి ఎదిగాయి. వాటి ధాటికి అమెరికా యే బెంబేలెత్తిపోయే పరిస్తితి ఏర్పడింది. కాబట్టి టెలికాం సర్వీసులలో ఎఫ్ డి ఐ పరిమితిని 100 శాతం పెంచే విధానాన్ని ప్రభుత్వము వెంటనే ఉపసంహరించాలి. టెలికాం రంగములో స్వావలంబనను పెంపొందించే విధానాలను అవలంబించాలి.
--పుతుంబాక అశోకబాబు
జాతీయ ఉపాధ్యక్షులు, బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్