Saturday, March 3, 2012

సార్వత్రిక సమ్మె చారిత్రాత్మకం


ఫిబ్రవరి28 నాటి సార్వత్రిక సమ్మె దేశ కార్మికోద్యమ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన దాదాపు అన్ని రంగల్లోని అఖిల భారత పారిశ్రామిక కార్మిక సమాఖ్యలు ఇచ్చిన ఈ సమ్మె పిలుపునకు దేశంలోని కార్మికవర్గం అద్భుతమైన రీతిలో స్పందించింది. ఐఎస్‌టియుసి, బిఎంఎస్‌లు ఇతర కేంద్ర కార్మిక సంఘాలు, పారిశ్రామిక సమాఖ్యలతో కలిసి సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం చరిత్రలో ఇదే ప్రథమం.ఈ అసాధారణ ఐక్యతకు కార్మిక లోకం నుంచి కూడా పెద్దయెత్తున మద్దతు లభించింది. ప్రాథమిక అంచనా ప్రకారం దేశ నలుమూలల నుంచి పది కోట్ల మందికిపైగా కార్మికులు, శ్రామికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్మికవ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉత్తరాన జమ్ము కాశ్మీర్‌ నుంచి దక్షిణాన తమిళనాడు వరకు, తూర్పున అస్సాం నుంచి పశ్చిమాన గుజరాత్‌ వరకు అన్ని ప్రాంతాల నుంచి ఈ సమ్మెలో పాల్గొన్నారు. మన దేశంలో నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత జరిగిన ఈ 14వ సార్వత్రిక సమ్మె అత్యంత ప్రాధాన్యత కలిగినట్టిది. అన్ని కేంద్ర కార్మిక సంఘాలు అపూర్వమైన ఐక్యతను ప్రదర్శించడమే కాదు, కార్మికుల డిమాండ్లతోబాటు అణగారిన వర్గాలకు చెందిన డిమాండ్లను కూడా లేవనెత్తాయి. ఉమ్మడి ప్రచారాన్ని రాష్ట్ర స్థాయిలోను, దిగువ స్థాయిలోనూ పెద్దయెత్తున నిర్వహించాయి. కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వాలు సంయుక్తంగా నిర్వహించిన ప్రచారం వల్ల అనేక స్వతంత్ర, రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాలు ఉత్తేజంగా సమ్మెలో పాల్గొన్నాయి.
ఈ ఫిబ్రవరి28 సమ్మె భారత కార్మికోద్యమ ఘట్టాలలో ప్రధానమైనదిగా నిలిచిపోతుంది. కార్మికవర్గం ఇంతవరకు చేపట్టిన సమ్మెల్లో ఇదే అతిపెద్దది. కార్మికవర్గం ఈ సమ్మె సందర్భంగా కొన్ని ప్రధానమైన డిమాండ్లను ముందుకు తెచ్చింది. అధిక ధరలను అదుపు చేసి ప్రజలకు కొంత ఊరట కలిగించాలని, కార్మికచట్టాలనన్నిటినీ సమర్థవంతంగా అమలు చేయాలని, ఈ చట్టాలను ఉల్లంఘించినవారిని కఠినంగా శిక్షించాలని, అసంఘటితరంగ కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత కల్పించేందుకు తగినన్ని నిధులతో జాతీయ సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేయాలని, శాశ్విత స్వభావం గల ఉద్యోగాలలో కాంట్రాక్టు కార్మికుల నియామకాన్ని ఆపాలని, పర్మినెంట్‌ ఉద్యోగులతో సమంగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు, ఇతర స77దుపాయాలు వర్తింపజేయాలని, కనీస వేతన చట్టాన్ని సార్వత్రికంగా అమలు చేయాలని, రు.10 వేలకు తగ్గకుండా కనీసవేతనం ఉండాలని, అందరికీ పింఛను ఇవ్వాలని, బోనస్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ మున్నగువాటిపై ఉన్న అన్ని పరిమితులను తొలగించాలని, నిర్దిష్ట 45 రోజుల గడువులోనే కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ను విధిగా చేయాలని కార్మికోద్యమం కోరింది.
పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఓటమి, ప్రస్తుత ముఖ్యమంత్రి బెదిరింపులు, కార్మికుల్లో భయోత్పాత వాతావరణం సృష్టించడంతో ఆ రాష్ట్రంలో సమ్మెను విఫలం చేయవచ్చని పాలకవర్గాలు భావించాయి. 
కానీ, చైతన్యవంతమైన బెంగాల్‌ కార్మికవర్గం ప్రభుత్వ క్రూరమైన నిర్బంధాన్ని, బెదిరింపులను, ఒత్తిళ్లను లెక్కచేయకుండా పెదయెత్తున సమ్మెలో పాల్గొని, దీనిని దిగ్విజయం గావించింది. ఈ సమ్మె వల్ల పశ్చిమ బెంగాల్‌, కేరళ పూర్తిగా స్తంభించాయి. ఈ వాస్తవాలేవీ కార్పొరేట్‌ మీడియాకు పట్టవు. బెంగాల్‌, కేరళ, త్రిపురల్లోనే కాదు అస్సాం, మణిపూర్‌ తదితర రాష్ట్రాల్లోను సమ్మె తీవ్ర ప్రభావం చూపింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, జార్ఖండ్‌లలో అనేక చోట్ల బంద్‌ వాతావరణం నెలకొంది. ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయమేర్పడింది. దుకాణాలు, మార్కెట్లు మూతపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో చాలా చోట్ల పాశవిక లాఠీచార్జీ, అరెస్టులు జరిగాయి. శ్రీనగర్‌ (జమ్ము కాశ్మీర్‌), భివాని (హర్యానా), గౌహతి, నుమాలిగఢ్‌( అస్సాం) వంటి చోట్ల శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై లాఠీచార్జి, అరెస్టులు జరిగాయి. బెంగాల్‌లో సమ్మెను భగం చేయడానికి అధికార పార్టీకి చెందిన గూండాలు కార్మికులపై భౌతిక దాడులు చేసి కొందరిని గాయపరిచారు. దేశ రాజధాని ఢిల్లీ, ఫరీదాబాద్‌, గుర్గావ్‌లలోని పారిశ్రామిక ప్రాంతాలు సమ్మె ప్రభావం వల్ల సాధారణ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.
దేశవ్యాపితంగా అన్ని రంగాల్లోనూ సమ్మెను పెద్దయెత్తున జయప్రదం చేసిన కార్మిక వర్గాన్ని సిఐటియు మనఃపూర్వకంగా అభినందిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో సమ్మెను విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పాలకపార్టీ గూండాలు సాగించిన దాడులు, దౌర్జన్యాలను వీరోచితంగా ప్రతిఘటించిన కార్మికులకు తన సంఘీభావాన్ని ప్రకటించింది.
కీలకమైన వ్యూహాత్మక రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలోపాల్గొన్నట్లు వివిధ ప్రాంతాల నుంచి సమాచారం అందింది. ఆ వార్తల ప్రకారం సమ్మెకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు...
బ్యాంకింగ్‌, బీమాతో సహా యావత్‌ ఫైనాన్షియల్‌ రంగంలోనూ సమ్మె దాదాపు సంపూర్ణంగా జరిగింది. ఈ రంగం నుంచి 20 లక్షల మంది దాకా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
బెంగళూరు, మైసూరు నగరాల్లోని అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ రంగంలోని ప్రధాన పరిశ్రమలు పూర్తిగా స్తంభించిపోయాయి.
దేశంలోని అన్ని ఓడరేవుల్లో సమ్మె పూర్తిగా జరిగింది. బెంగాల్‌లో పాలకపార్టీ భయానక దాడులకు దిగినప్పటికీ హాల్దియా రేవులో సమ్మె ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఏవో కొద్ది రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల, కార్పొరేషన్లకు చెందిన సుమారు 60 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బెంగాల్‌లో అననుకూల పరిస్థితుల మధ్య సైతం సమ్మె పిలుపునకు రాష్ట్ర ఉద్యోగులు అద్భుతంగా స్పందించారు.బెంగాల్‌లో సిఐటియు నాయకులు మాణిక్‌ సన్యాల్‌, జియా ఉల్‌ ఆలమ్‌లతో సహా రెండు వేల మంది కార్మికులు అరెస్టయ్యారు.
దేశ వ్యాపితంగా వున్న కేంద్ర ఉద్యోగులందరూ పెద్దయెత్తున సమ్మెలో పాల్గొన్నారు. రక్షణ రంగంలో 80 శాతం మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.
బిఇఎల్‌, హెచ్‌ఎఎల్‌ వంటి ప్రధాన రక్షణ ప్రభుత్వరంగ సంస్థల్లో దేశవ్యాపితంగా సమ్మె పూర్తిగా జరిగింది. తిరుచ్చి, రాణిపేట,హైదరాబాద్‌, బెంగుళూరుల్లోని నాలుగు బిహెచ్‌ఇఎల్‌ సంస్థల్లోను సమ్మె సంపూర్ణంగా జరిగింది.
ఇసిఎల్‌, బిసిసిఎల్‌, సిసిఎల్‌, ఎస్‌ఇసిఎల్‌, ఎన్‌సిఎల్‌, సిఎంపిడిఐఎల్‌తో సహా తొమ్మిది కంపెనీలకు చెందిన 6 లక్షల మంది బొగ్గు గని కార్మికుల్లో మెజార్టీ వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణి కాలరీస్‌లో సమ్మె పాక్షికం. జార్ఖండ్‌, ఒడిశా, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో నాన్‌ కోల్‌ మైనింగ్‌ బెల్టులో దాదాపు పూర్తి సమ్మె జరిగింది.
బిఎస్‌ఎన్‌ఎల్‌లో 70 శాతానికిపైగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
పెట్రోలియం రంగంలో ఉత్తర, ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల్లోని రిఫైనరీ, మార్కెటింగ్‌ సంస్థల్లో కార్మికులు మొత్తంగా ఈ సమ్మెలో పాల్గొనగా, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో 70 శాతానికి పైగా కార్మికులు పాల్గొన్నారు.
ఎనిమిది ఉక్కు పరిశ్రమల్లోని కాంట్రాక్టు కార్మికులు మూకుమ్మడిగా సమ్మెలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 90 శాతం, సలీమ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో 80 శాతం, దుర్గాపూర్‌లోని అల్లారు స్టీల్‌ ప్లాంట్‌లో 70 శాతం, ఐఐఎస్‌సిఓలో 50శాతం, రూర్కెలాలో 40శాతం రెగ్యులర్‌ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. బొకారో, భిలాయి స్టీల్‌ ప్లాంట్లలో పాక్షికంగా జరిగింది.
జమ్మూ కాశ్మీర్‌, హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో, చండీగఢ్‌లో ఆర్టీసి కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు కార్మికులు కూడా సమ్మెకు మద్దతుగా విధులను బహిష్కరించారు.
విద్యుత్‌ రంగంలో కాంట్రాక్టు కార్మికులు, రోజువారీ వేతన కార్మికులు అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు.
బెంగాల్‌, త్రిపుర, కేరళల్లో ప్లాంటేషన్‌ వర్కర్లు పూర్తిగాను, తమిళనాడు, అస్సాం, కర్ణాటకల్లో అత్యధిక కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
అన్ని రాష్ట్రాల్లోను ఇటుకబట్టీలు, నిర్మాణ, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కార్మికులు, బీడీ వర్కర్లు, మండివర్కర్లు, ఆటో రిక్షా డ్రైవర్లు మొదలైన వారంతా పెద్దయెత్తున సమ్మెలో పాల్గొన్నారు. ర్యాలీలు, ధర్నాలు, రైలు, రాస్తారోకోలు నిర్వహించారు.
హిమాచల్‌ ప్రదేశ్‌లోని అన్ని జలవిద్యుత్‌ కేంద్రాల్లోను, నిర్మాణ, తదితర అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు సమ్మెను విజయవంతం చేశారు.
15 లక్షల మంది అంగన్‌వాడీ ఉద్యోగులు, లక్షలాది ఆశా, మధ్యాహ్న భోజన పథక కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ప్రభుత్వ దిష్టి బొమ్మలను తగులబెట్టారు.
ఒకటిన్నర లక్షలమంది మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటిటివ్స్‌లో అత్యధిక శాతం మంది దేశవ్యాపితంగా సమ్మెలో పాల్గొన్నారు.
మత్స్య పరిశ్రమకు చెందిన లక్షలాది మంది కార్మికులు, జాలర్లు సంఘాల అనుబంధాల కతీతంగా సమ్మెలో పాల్గొన్నారు. తమ జీవన ప్రమాణాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తమ నిరసన తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికుల నుంచే కాకుండా సామాన్య ప్రజల నుంచి కూడా ఈ సమ్మెకు విస్తృతమద్దతు లభించింది. వామపక్ష పార్టీలు దీనికి పూర్తి మద్దతు ప్రకటించాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానిక రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలికాయి.
-డాక్టర్‌ హేమలత

No comments:

Post a Comment