ఇందుకు fsmi.in వెబ్ సైట్ చూసి దానిలో వున్న సమాచారం ప్రకారం మీ అభిప్రాయాన్ని 7.1.2016 లోగా టి ఆర్ ఏ ఐ కి ఈ మెయిల్ చేయండి
ఫేస్ బుక్ పత్రికలనిండా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నది. ఇందుకు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నది. తాము దేశ సేవ చేద్దామనుకుంటే “ఇంటర్నెట్ తటస్థత” కోసం పని చేసే కార్యకర్తలు అడ్డుపడుతున్నారని, కాబట్టి భారత ప్రజలు తమకి మద్దతు ఇవ్వాలని ఈ ప్రకటనల సారాంశం.
‘ఇంటర్నెట్ తటస్థత’ అంటే ఏమిటి? టెలిఫోన్ లో మీరు ఎవరితోనయినా మాట్లాడవచ్చు. ఏ విషయమయినా మాట్లాడవచ్చు. ఫలానా వారితోనే మాట్లాడాలి, ఫలానా విషయమే మాట్లాడాలి అంటే అంగీకరించము. అది మన టెలిఫోన్ హక్కుకి వ్యతిరేకం అంటాం. ఇంటర్నెట్ విషయం లో కూడా ఇదే విధమయిన హక్కుని ప్రతి వినియోగదారు కలిగి వుండాలి. మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఇస్తాము, కానీ మీరు మేము అనుమతించిన సమాచారాన్నే చూడాలి, మేము అనుమతించిన వెబ్ సైట్స్ నే చూడాలి, మేము అనుమతించిన బ్లాగులనే మీరు తయారు చేసుకోవాలి, మేము అనుమతించిన అప్లికేషన్సునే మీరు అభివృద్ధి చేసుకోవాలి అని ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఏ టెలికాం లేదా ఇంటర్నెట్ కంపెనీ అయినా సరే అంటే దానికి మనము అంగీకరిస్తామా? అంగీకరించము. ఇంతేగాక ఒక వెబ్ సైట్ చూడటానికి ఒక రేటు, ఇంకొక వెబ్ సైట్ చూడటానికి ఇంకొక రేటు వుండే వివక్షతా పూర్వక విధానాన్ని మనము అంగీకరించము. ఒక వెబ్ సైట్ ను వేగముగా మరొక వెబ్ సైట్ ను చాలా నెమ్మదిగా చూసే విధముగా , ఆ వెబ్ సైట్ యాజమాన్యం టెలికాం కంపెనీకి చెల్లించే రేటును బట్టి ఏర్పాటు చేసే విధానాన్ని మనము అంగీకరించము. ఇదే విధముగా ఎవరయినా ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని ఏదయినా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఒక రకమయిన అప్లికేషన్ కు ఒక రేటు, ఇంకొక రకమయిన అప్లికేషన్ కు ఇంకొక రేటు వుండే వివక్షతాపూర్వక విధానాన్ని మనము అనుమతించము. ఇంటర్నెట్ ను వినియోగించుకుని అప్లికేషన్ డెవలప్ చేయటానికి డేటా చార్జీలకు మించి అదనముగా చెల్లించటానికి అంగీకరించము. ఇంటర్నెట్ వినియోగానికి చెల్లించటం తోపాటు ఇంటర్నెట్ పై డెవలప్ చేసిన వాట్సప్, స్కైప్ తదితర అప్లికేషన్ వినియోగానికి అదనముగా చెల్లించాలంటే అందుకు మనము అంగీకరించము. ఈ విధముగా ఇంటర్నెట్ ను ఎటువంటి వివక్షత, ఆటంకము లేకుండా స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కునే "ఇంటర్నెట్ తటస్థత" అంటారు.
ఇప్పుడు ఫేస్ బుక్ చేసేది భారత ప్రజల హక్కు అయిన ఈ ఇంటర్నెట్ తటస్థతకి వ్యతిరేకమయిన కార్యక్రమం. దీని ఆటలు సాగనిస్తే కొన్నాళ్ళకి మనము ఇంటర్నెట్ తటస్థత హక్కుని కోల్పోతాము. ఇంతకీ ఫేస్ బుక్ చేయదలచుకున్నదేమిటి? ఇంతకు ముందే ఫేస్ బుక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం కంపెనితో ఒప్పందానికొచ్చి, “ఇంటర్నెట్. ఆర్గ్” (internet.org) పేరుతో రిలయన్స్ వినియోగదారుల మొబైల్ ఫోన్ లో ఉచితముగా 38 వెబ్ సైట్ లు, సర్వీసులు అందించే ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని వార్తలు అందించేవి, కొన్ని వార్తలు మరియు వినోదం అందించేవి, కొన్ని వినోదాన్ని అందించేవి వున్నాయి. కానీ ఈ సేవలందించే కంపెనీలలో ఒక కంపెనీని మాత్రమే అనుమతించి మిగతా కంపెనీలని అనుమతించలేదు. కాబట్టి వార్తలు చూడాలంటే ఏదో ఒక సంస్థ ఇచ్చే వార్తాలే చూడాలి. నచ్చిన వార్తా పత్రికని నెట్ లో చూడటానికి వీలు కాదు. ఫేస్ బుక్ కు నచ్చిన వార్తా పత్రికని మాత్రమే చూడాలి! ఇదే విధముగా ఇతర సేవలపై కూడా ఆంక్షలున్నాయి. కొంత విమర్శ వచ్చిన తరువాత ఫేస్ బుక్ ఈ ఇంటర్నెట్.ఆర్గ్ కు “ఫ్రీ బేసిక్స్” అనే పేరు పెట్టింది. పేరు మార్చినా విషయం మారలేదు. వివక్షత కొనసాగింది. ఇది వివక్షతా పూర్వక విధానమని, ఇంటర్నెట్ తటస్థతకి ఇది వ్యతిరేకమని చెప్పి టి ఆర్ ఏ ఐ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) దీనిని ఆపు చేయించింది.
అయినప్పటికి టి ఆర్ ఏ ఐ ఆపు చేయించిన ఈ “ఫ్రీ బేసిక్స్’ కు మద్దతుగా ఇదేదో తాము భారత దేశాన్ని ఉద్ధరించటానికి చేస్తున్న ఘనకార్యమన్నట్లు ఫేస్ బుక్ పత్రికా ప్రకటనలు విరివిగా ఇస్తున్నది. విచిత్రమయిన విషయమేమిటంటే ఫ్రీ బేసిక్స్ ను ఆపు చేయించిన టి ఆర్ ఏ ఐ, అందుకనుకులముగా ఫేస్ బుక్ ఇస్తున్న ఈ ప్రకటనలను మాత్రం ఆపు చేయించటం లేదు!
టి ఆర్ ఏ ఐ తన వెబ్ సైట్ లో ఈ సమస్య పై ఒక కన్సల్టెషన్ పేపర్ ను పెట్టింది. దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకునే ప్రతి ఒక్కరూ టి ఆర్ ఏ ఐ కి 7.1.2016 లోగా అందె విధముగా ఈ మెయిల్ ద్వారా గాని, పోస్ట్ ద్వారా గాని తెలియజేయవచ్చును.
మొబైల్ వినియోగ దారులలో అల్పాదాయ వర్గాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ను ఫ్రీ గా ఇచ్చి దాని ద్వారా కొన్ని వెబ్ సైట్స్ నయినా ఉచితముగా చూసే అవకాశం, కొన్ని సేవలని అయినా ఉచితముగా పొందే అవకాశం కల్పిస్తున్నామని, కానీ ఇంటర్నెట్ తటస్థత కార్యకర్తలు పేదలకు తాము ఈ విధముగా ఉచిత సేవలు ఉచితముగా అందించటాన్ని వ్యతిరేకిస్తున్నారని ఫేస్ బుక్ తప్పుడు ప్రచారం చేస్తున్నది.
పేదలకు నిజముగా ఉచితముగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఫేస్ బుక్ అందించదలచుకుంటే ఫలానా ఆదాయం లోపు వారికి తాము ఇన్ని ఏం బి లు లేదా ఇన్ని జి బీలు డేటా ఉచితముగా అందిస్తామని, అందుకయ్యే చార్జీలని తాము పేదల తరఫున ఆ డేటా అందించే టెలికాం కంపెనీలకు చెల్లిస్తామని చెప్పవచ్చు. లేదా నైట్ ఫ్రీ టెలిఫోన్ కాల్సు సౌకర్యాన్ని ల్యాండ్ లైన్స్ పై బి ఎస్ ఎన్ ఎల్ ఇచ్చినట్లు ఫేస్ బుక్ కూడా అల్పాదాయ మొబైల్ వినియోగదారులకు నైట్ టైమ్ ఉచితముగా డేటా అందించే ఏర్పాటును టెలికాం కంపెనీలతో ఒప్పందానికి వచ్చి ఏర్పాటు చేయవచ్చు. అలా చేయకుండా పేదలకు తమకి నచ్చిన వెబ్ సయిట్స్ మాత్రమే ఉచితముగా చూసే అవకాశం కల్పిస్తామని అంటున్నది. ఋ.2000 లు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనగలిగే వాళ్ళకి నెలకి ఋ.20 లేదా ఋ.30 చెల్లించి తమకి కావాల్సిన డేటా ప్లాన్ తీసుకోటం అంతా భారమవుతుందా? అయినా పేదలకు కొన్ని వెబ్ సయిట్స్ మాత్రమే చూసేందుకు అనుమతించటం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు ఎలా అవుతుంది?పేదలుల ఫేస్ బుక్ లో క్యాండి క్రష్ ఆట మాత్రమే ఆడుకోవాలని, గూగుల్ లేదా యు ట్యూబు తదితర సెర్చి ఇంజిన్లను వాడి తమకి కావాల్సిన వెబ్ సైట్లను చూడకూడదని ఫేస్ బుక్ ఉద్దేశమా? ఇది భారత దేశ పేద ప్రజలకి ఏదో ముష్టి వేసినట్లు అవమానించటమే కదా? ఇది ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం పేరుతో కుట్ర చేయటం తప్ప మరొకటి కాదు.
ప్రభుత్వము అందించే సేవలన్నింటిని తమ ఫ్రీ బేసిక్స్ ద్వారా ఉచితముగా అందిస్తామని ఫేస్ బుక్ అంటున్నది. ప్రభుత్వము నిజముగా ఫేస్ బుక్ ద్వారా మాత్రమే తన సేవలు ఉచితముగా అందిస్తే అది అక్రమం అవుతుంది.పోలీసు సేవలు 100 నంబరుకి డయల్ చేస్తే అందుబాటులోకి వస్తున్నాయి. ఏ టెలికాం కంపెనీ వినియోగదారు అయినా అదే నంబరుకి డయల్ చేయవచ్చు. అలా కాకుండా ఫలానా టెలికాం కంపెనీ వినియోగ దారులకి మాత్రమే ఈ సేవ అందుబాటులో వుంటుంది అని ప్రభుత్వము అంటే అది అక్రమం, చట్ట విరుద్ధం అవుతుంది. కాబట్టి ఫేస్ బుక్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి ప్రభుత్వము అంగీకరించటం సాధ్యము కాదు. ప్రభుత్వ సెవలను ఉచితముగా, ఏ టెలికాం సర్వీసు కంపెనీ వినియోగ దారు అయినా సరే, ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశం వుండాలి. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లందరికి ప్రభుత్వము ఈ షరతు విధించాలి.
కొన్ని వెబ్ సైట్స్ ను ఉచితముగా చూసే ప్లాన్ లను అనుమతించటం అంటే అది తీవ్రమయిన వివక్షతకు దారి తీస్తుంది. తమకి డబ్బులు ఎక్కువ చెల్లించే కంపెనీల వెబ్ సైట్సు ను ఉచితముగానో, లేదా ఎక్కువ స్పీడ్ తోనో చూపించే విధానానికి ఇది దారి తీస్తుంది. అంటే ఎక్కువ చెల్లించగలిగే కంపెనీల వెబ్ సయిట్సుకే ఇంటర్నెట్ లో ప్రాధాన్యత లభిస్తుంది. చెల్లించలేని కంపెనీల వెబ్ సైట్స్ చూడటం కష్ట సాధ్యమవుతుంది. చివరికి ఇంటర్నెట్ వినియోగాన్ని దాని శక్తి సామర్థ్యాలతో పోలిస్తే చాలా పరిమితమయిన స్థాయికి దిగజార్చటానికి ఇది దారి తీస్తుంది. ఇంతేగాక మిలియన్లకొద్ది వున్న వెబ్ సైట్సు, అప్లికేషన్సు లో ఏవో కొన్నింటిని మాత్రమే ఉచితముగా అందించి మిగతా వాటికి రకరకాలుగా చెల్లించే విధానం రావటం అంటే నేను చూసే వెబ్ సైట్సు మీకు అందుబాటులో లేక, మీరు చూసే వెబ్ సైట్సు నాకు అందుబాటులో లేక ఇంటర్నెట్ ద్వారా ఒకరితో ఒకరు సంబంధం కలిగి వుండటం చాలా పరిమితమవుతుంది.
ఉచితముగా అందించే పేరుతో ఫేస్ బుక్ ఈ విధముగా ఎక్కువ వినియోగదారులను పొందగలిగితే ఎవరయినా ఒక చిన్న పారిశ్రామిక వేత్త తన కంపెనీ వెబ్ సైట్ ను ఫేస్ బుక్ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటే అందుకు ఫేస్ బుక్ కు చాలా చెల్లించాల్సి వుంటుంది.
ఇంటర్నెట్ ను ఈ విధముగా పరిమితమయినదిగా చేయటాన్ని ప్రభుత్వము మరియు టి ఆర్ ఏ ఐ లు నివారించాలి. ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లద్వారా అండాలంటే దానికి ప్రభుత్వ నిధి అయిన యు ఎస్ ఓ ఫండ్ తో నిర్మించే ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ ఉపయోగించాలి. దేశ సహజ సంపద అయిన స్పెక్ట్రమ్ ను ఉపయోగించాలి. కాబట్టి ఇంటర్నెట్ ను ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకు రావటం, సాధ్యమయినంత తక్కువ ధరకు అందుబాటులోకి తేవటం, పేదలకు ఉచితముగా ఒక మెరకయినా అందుబాటులోకి వచ్చేలా చేయటం ప్రభుత్వము మరియు టి ఆర్ ఏ ఐ ల బాధ్యత. ఉచితముగా కొన్ని వెబ్ సైట్లు అందిస్తున్నామనే సాకుతో భారత దేశ ఇంటర్నెట్ ఆవరణలో అధిక భాగాన్ని కాజేసే అవకాశం ఫేస్ బుక్ కు ఇవ్వ కూడదు. పేదలకు ఉచితం పేరుతో ఫేస్ బుక్ ఇవ్వదలచుకున్న కొన్ని వెబ్ సైట్లు మాత్రమే చూసే అవకాశం కల్పించి అత్యధిక వెబ్ సైట్లు చూసే అవకాశం లేకుండా చేసే ఈ కుట్రని ఓడించాలి. పేదలకు తగిన మేరకు డేటాని అన్నీ రకాల వెబ్ సైట్లు చూడగలిగే విధముగా ఉచితముగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. భారత పేదల మీద ఫేస్ బుక్ కు నిజముగా అంతా ప్రేమ వుంటే అది కూడా పేదలకు ఎటువంటి ఆంక్షలు లేని విధముగా కొన్ని ఏం బి లు లేదా కొన్ని జి బి లు డేటాని ప్రతినెలా ఉచితముగా అందించేందుకు ముందుకు రావాలి. అంతే గాని ఈ మోస పూరిత విధానం మంచిది కాదు.
ఫ్రీ బేసిక్ లో అడ్వర్టైజ్మెంట్లు వుండవని ఫేస్ బుక్ అంటున్నది. కానీ అది ప్రస్తుతానికి మాత్రమే. భవిష్యత్తులో ఫ్రీ బేసిక్స్ లో ప్రకటనలు ప్రసారం చేసే హక్కు తనకి వునందని ఫేస్ బుక్ ఇప్పటికే ప్రకాటించింది. మరొక విషయం ఏమిటంటే ఫేస్ బుక్ తన వినియోగ దారుల డేటాని మార్కెటింగ్ కంపెనీలకి అమ్ముకుంటుంది. అదే దాని ఆదాయ మార్గం లో ముఖ్యమయినది. కాబాట్టి ఎంత మంది వినియోగదారులను రాబడితే ఫేస్ బుక్ కు అంత లాభం. ఇంతేగాక ఫేస్ బుక్ ఒక అమెరికా కంపెనీ. ఒక అమెరికా కంపెనీగా అది తన వినియోగదారుల డేటాని అమెరికా గూఢచారి సంస్థ లేదా భద్రతా సంస్థ “ఎన్ ఎస్ ఏ” (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ) ” కి అందించాలి. కాబట్టి ఇది భారతీయుల వ్యక్తిగత విషయాల భద్రతకి భంగకరం.
కాబట్టి పేదలకు ఉచితం పేరుతో కొన్ని వెబ్సైట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చి సంపూర్ణమయిన ఇంటర్నెట్ కు బదులు దానిని పాక్షికం చేసి ఇంటర్నెట్ ప్రయోజనాన్ని సంకుచితం చేసి తన లాభాలను పెంచుకునేందుకు ఫేస్ బుక్ చేస్తున్న కుట్రని ఓడించండి. ఇందుకు ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కు వ్యతిరేకముగా అదే విధముగా ఇంటర్నెట్ తటస్తతకు అనుకూలముగా, దానితోపాటు ప్రజలందరికీ కొన్ని ఏం బి లు లేదా జి బిల మేరకు డేటా ఉచితముగా, అన్నీ వెబ్సైట్లు/అన్నీ అప్లికేషన్లు అందుబాటులో వుండే విధముగా తగిన విధానాన్ని రుపోదించాలని కోరుతూ టి ఆర్ ఏ ఐ కి 7.1.2016 లోగా మీ అభిప్రాయాన్ని ఈ మెయిల్ ద్వారా తెలియజేయండి. ఇందుకు మీరు వెంటనే www.fsmi.in వెబ్ సైట్ చూడండి.