Sunday, April 26, 2015

భూకంప మృతుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి; అంతర్జాల తటస్థత (నెట్ న్యూట్రాలిటీ) ని సమర్తిస్తున్నాము, కానీ డేటా టారిఫ్ ను 6 రేట్లు పెంచాల్సి వస్తుంది-ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల వితండ వాదం; అభివృద్ధి పేరుతో భూమిని బలవంతంగా లాక్కోటం సమంజసమా?

భూకంప మృతుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి
ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారాం భూకంపం వలన నేపాల్ లో 1500 మంది, భారత దేశం లో 51 మంది చని పోయారు. అనేక మండి నిర్వాసితులయ్యారు. రిక్టర్ స్కేలు పై 7.9 ప్రమాణం లో భూకంపం రావటం నేపాల్ లో 80 సంవత్సరాల తరువాత ఇదే మొదటి సారి. భూకంపం లో చని పోయిన వారి కుటుంబాలకు ప్రపంచ ప్రజాలండరు సానుభూతిని తెలియజేస్తున్నారు. గాయ పడిన వారికి, నిర్వాసితులకు అవసరమయిన సహాయాన్ని వెంటనే అందించటానికి నేపాల్ తో పాటు భారత దేశం తదితర అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. బి ఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ నుండి నేపాల్ కు చేసే కాల్స్ కు మూడు రోజులపాటు లోకల్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాలని బి ఎస్ ఎన్ ఎల్ నిర్ణయించింది. నేపాల్ కు ఒక కాల్ కు సాధారణంగా రు. 10 అవుతుంది.  అందుకు బదులు లోకల్ కాల్ రేట్ నే 3 రోజుల పాటు బి ఎస్ ఎన్ ఎల్ వసూలు చేస్తుంది.
అంతర్జాల తటస్థత (నెట్ న్యూట్రాలిటీ) ని సమర్తిస్తున్నాము, కానీ డేటా టారిఫ్ ను 6 రేట్లు పెంచాల్సి వస్తుంది-ప్రయివేటు టెలికాం ఆపరేటర్ల వితండ వాదం
అంతర్జాలం (ఇంటర్నెట్)  ద్వారా ఏ  వెబ్ సైట్ ను చూసినా, వాట్సప్, స్కైప్ తదితర వెబ్సైట్స్ ద్వారా మెసేజ్ లు, కాల్స్ చేసినా ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేయక పోవటం నెట్ న్యూట్రాలిటీ. ఇంటర్నెట్ కు అయ్యే సాధారణ చార్జి మినహా కొన్ని వెబ్ సైట్స్ వాడినందుకు ప్రత్యేకంగా, అదనంగా ఛార్జీలు వసూలు చేయకూడదనటం నెట్ న్యూట్రాలిటీ. టి ఆర్ ఏ ఐ ఈ విషయాన్ని అధ్యయనం చేసేందుకు ప్రజల నుండి అభిప్రాయాలను ఆహ్వానిస్తూ విడుదల చేసిన పత్రం నెట్ న్యూట్రాలిటికి వ్యతిరేకంగా వున్నది. దీని పట్ల పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. లక్షలాది మండి నెట్ న్యూట్రాలిటిని సమర్థిస్తూ టి ఆర్ ఏ ఐ కి మెయిల్స్ పంపారు. దీనితో అప్పటి వరకూ నెట్ న్యూట్రాలిటిని వ్యతిరేకించిన ప్రయివేట్ టెలికాం ఆపరేటర్లు  తమ బాణీ మార్చారు. తాము కూడా నెట్ న్యూట్రాలిటిని సమర్తిస్తున్నామని అంటున్నారు. కానీ ఒక మెలిక పెడుతున్నారు. తమకి వర్తించే రూల్సునే ఓ టి టి (ఓవర్ ది టాప్ ) ప్లేయర్లకు (స్కైప్, వాట్సప్ వంటివి ఓవర్ ది టాప్ ప్లేయర్స్, అనగా ఇతర కంపెనీల ఇంటర్నెట్ నెట్ వర్క్ ను వినియోగించి తమ వెబ్ సైట్స్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించేవి) కూడా వర్తింపజేయాలంటున్నారు. అంటే తమకి కాల్స్ పై వచ్చే ఆదాయం పై ఏ విధముగా ప్రభుత్వము ఛార్జీలు వసూలు చేస్తున్నారో  అదే విధముగా వాట్స్ అప్ ద్వారా వెళ్ళే కాల్స్ పై కూడా ఛార్జీలు విధించాలని వీరు కోరుతున్నారు. అంటే వాట్స్ అప్ తదితరాలను కాల్స్ చేయటానికి వాడితే వాటి పై కూడా చార్జీలు వసూలు చేయాలని వీరి వాదం. అలా కాకుంటే ఇంటర్నెట్ వాడకం రేట్లను 6 రేట్లు పెంచాలని వీరు కోరుతున్నారు. వీరి వాదన సామంజసం కాదు. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాని ప్రయోజనం ప్రజలకు దక్కాలి. ఇంటర్నెట్ పై వాట్స్ అప్ ద్వారా కాల్స్ చేసేటప్పుడు టెలికాం ఆపరేటర్లకు ఇంటర్నెట్ ఛార్జీలు వస్తాయి. కాబట్టి వాట్స్ అప్ తదితరాల వలన ఇంటర్నెట్ వాడకం పెరిగి టెలికాం ఆపరేటర్ల ఆదాయం పెరుగుతుంది. వాస్తవం ఇది కాగా ప్రయివేటు టెలికాం ఆపరేటర్లూ వితండంగా వాదిస్తున్నారు. ప్రయివేట్ టెలికాం ఆపరేటర్లూ ప్రతిదీ తమ లాభాపేక్ష దృస్ష్టితోనే చూస్తారని, ప్రజల ప్రయోజనాలు వారికి పట్టవని ఇది రుజువు చేస్తున్నది.
అభివృద్ధి పేరుతో భూమిని బలవంతంగా లాక్కోటం సమంజసమా?
రోడ్లు, రైలు మార్గాలు, పరిశ్రమలు భూమి పైన కాకుండా ఆకాశాన నెలకొల్పుతామా? అభివృద్ధి కోసం చేస్తున్న భూసేకరణని వ్యతిరేకించటం అంటే అభివృద్ధిని వ్యతిరేకించటమే. ఇదీ జరుగుతున్న ప్రచారం. నిజమే కదా అని కొందరికి అనిపిస్తుంది.
కానీ భూసేకరణ నిజముగా అభివృద్ధి కోసమే జరుగుతున్నదా? ఎవరినుండయితే భూమిని సేకరిస్తున్నారో వారికి అభివృద్ధి అవసరం లేదా? వుంటే ఆ అభివృద్ధి ఫలితాలు తమకి దక్కుతాయని వారిని అంగీకరింపజేసి ఆ విధముగా వారి ఆమోదంతో భూమిని సేకరించవచ్చు గదా. మరి మోడి ప్రభుత్వము రైతుల ఆమోదం లేకుండానే ప్రాజెక్టులకు భూమిని సేకరించవచ్చునని 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్సు ఎందుకు జారీ చేసింది? 2013 భూసేకరణ చట్టం లో ఏదయినా ప్రాజెక్టుకు భూసేకరణ చేయాలంటే దానివలన సమాజం పై ఎటువంటి ప్రభావం పడుతుందో ముందుగా పరిశీలించాలని వున్నది. ఆహారభద్రత, పర్యావరణలకు హాని కలుగుతుందా? తదితర అంశాలను పరిశీలించాలి. కానీ మోడి ప్రభుత్వము ఈ నిబంధన అవసరం లేదని భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినేన్సు జారీ చేసింది. అభివృద్ధి అనే దానికి ఆహార బఃద్రత, పర్యావరణ పరిరక్షణ లతో సంబంధం లేదా? వాటి అవసరం లేదా? ఆహార భద్రత, పర్యావరణం లను ధ్వంసం చేసేది అభివృద్ధి అవుతుందా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు ప్రాజెక్టుల కోసం 6 కోట్ల మండి ప్రజాలు తమ భూముల నుండి తొలగించబడ్డారు. కానీ వారిలో 3వ వంతు కి మాత్రమే సరయిన పునరావాసం లభించింది. అత్యధికుయాల్కు సరయిన పునరావాసం లభించ లేదు. అభివృద్ధి పేరుతో ఈ విధముగా తొలగించబడియన్ వారిలో 40 శాతం ఆది వాసిలు, 20 శాతం దళితులు. సమాజపు అట్టడుగున వున్న వీరిని అభివృద్ధి పేరుతో తగు పునరావాసం లేకుండా తోల్గించి మరిన్ని ఇబ్బందులు కలిగించటం న్యాయమా?  
అభివృద్ధి పేరుతో సేకరించిన భూమిని సక్రమముగా ఉపయోగించటం లేదని కూడా రుజువవుతున్నది. సి ఏ జి ఇటీవల చేసిన  అధ్యయనం ప్రకారం 2006 నుండి 2013 వరకు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్) లకు సేకరించిన 60000 హెక్టార్ల భూమి లో 53 శాతం నిరుపయోగముగా పడి  వున్నది. నష్ట పరిహారం  అతి తక్కువగా ఇచ్చి ఈ విధముగా సేకరించిన భూమిని ప్రైవేట్ బిల్డర్స్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం ఈ దుర్వినియోగాన్ని అరికట్టే విధముగా వునండి. ఏ ప్రయోజనం కోసమయితే సేకరించారో ఆ ప్రయోజనం నెరవేరనప్పుడు ఆ భూమిని ఎవరి నుండయితే సేకరించారో వారికి తిరిగి ఇచ్చి వేయాలని ఈ చట్టం చెప్పింది. కానీ మోడి ప్రభుత్వము ఈ నిబంధనని తొలగిస్తూ ఆర్డినేన్సు జారీ  చేసింది!
ప్రజల ఆమోదం లేకుండా వారినుండి భూములు స్వాధీనం చేసుకునే విధానం వలన ప్రాజక్టులు మరింత జాప్యం అవుతాయి. ఎందుకంటే ప్రజలు ప్రతిఘటిస్తారు కాబట్టి. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధికి అవసరమయిన భూమిని సేకరించేందుకు ప్రజలకి అనుకూలమయిన విధానాలు అవలంబించాలి.
అనేక అనుభవాలు, పోరాటాల తరువాత యు పి ఏ ప్రభుత్వము బ్రిటిష్ కాలం  నాటి 1884 భూసేకరణ చట్టం ను సవరించి రైతులకు, ఆదివాసీలకు, దళితులకు అనుకూలముగా వుండే కొన్ని అంశాలతో 2013 భూసేకరణ చట్టాన్ని  చేసింది. ఆ నాడు ప్రతిపక్షం లో వున్న బి జె పి కూడా ఇందుకు మద్దతునిచ్చింది. కానీ అదే బి జె పి ఇప్పుడు తాను అధికారం లోకి వచ్చాక భూసేకరణ చట్టాన్ని రైతులకు, ఆదివాసీలకు, దళితులకు  వ్యతిరేకముగా మారుస్తూ  ఆర్డినేన్సు తెచ్చి ప్రజా వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నది. 

ప్రజలకి వ్యతిరేకముగా, కార్పొరేట్సుకి  అనుకూలముగా మోడి ప్రభుత్వము చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నదని ఇది రుజువు చేస్తున్నది. 

Wednesday, April 22, 2015

బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణ కోసం ఏప్రిల్ 21, 22 న జరిగిన రెండు రోజుల సమ్మె కి మద్దతుగా లోక్ సభలో ప్రసంగించిన సి పి ఎం సభ్యులు



బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, అధికారులు అందరూ బి ఎస్ ఎన్ ఎల్ ను నష్టాలబారినుండి కాపాడాలని కోరుతూ 2015 ఏప్రిల్ 21,22న దేశ వ్యాపితంగా సమ్మె చేశారు. ఈ సమ్మె 100 శాతం జయప్రదమయింది. ఈ సమ్మె కి మద్దతుగా సి పి ఎం లోక్ సభ సభ్యులు శ్రీ శంకర్ ప్రసాద్ దత్తా (త్రిపుర-పశ్చిమం) 22.4.2015న జీరో అవర్ లో ప్రత్యేక ప్రస్తావన గా ప్రసంగించారు. శ్రీ శంకర్ ప్రసాద్ దత్త ప్రత్యేక  ప్రస్తావన  లోక్ సభ వెబ్ సైట్ ప్రకారం ఈ క్రింది విధముగా వున్నది:
“శ్రీ శంకర్ ప్రసాద్ దత్తా (త్రిపుర వెస్ట్): గౌరవనీయులైన మేడమ్ అధ్యక్షా, నిన్న, ఈ రోజు బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు సమ్మె లో ఉన్న సంగతి మనకందరకు తెలుసు. వారి డిమాండ్ ఏమిటి?  వారి ప్రధాన డిమాండ్ బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడాలని. బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ. బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడాలని కోరుతున్నారు. 20 డిమాండ్స్ తో సమ్మె చేస్తున్నారు. బి ఎస్ ఎన్ ఎల్ ఆవిర్భవించినప్పుడు 3.5 లక్షల ఉద్యోగులున్నారు. ఇప్పటికే అందులో 1.4 లక్షల మంది రిటైరయ్యారు. 2.25 లక్షల ఉద్యోగులే వున్నారు. 2007 వరకూ బి ఎస్ ఎన్ ఎల్ లాభాలతో నడిచింది. మొత్తంగా దాదాపు 48000 కోట్లు లాభం వచ్చింది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ ను ఎం టి ఎన్ ఎల్ తో విలీనం చేయ వద్దని  ఉద్యోగులు కోరుతున్నారు. వారి ఇతర డిమాండ్స్ కొన్ని-- ఖాళీగా వున్న డైరెక్టర్స్ పోస్టులు భర్తీ చేయాలని, రు.6700 కోట్లు స్పెక్ట్రమ్ చార్జి రీఫండ్ చేయాలని, బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ఉచితముగా కేటాయించాలని, ఖాళీ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంటు జరపాలని. ప్రభుత్వము వారి కొరికలని పరిశీలిస్తుందని, బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడుతుందని, తద్వారా దేశ ప్రయోజనాలను కాపాడుతుందని ఆశిస్తున్నాను.”
స్పీకర్: “శ్రీ శంకర ప్రసాద్ దత్తా చేసిన ఈ ప్రస్తావనతో కలిసేందుకు శ్రీ ఎడ్వొకేట్ జాయిస్ జార్జి, శ్రీ పి.కె.బిజూ, శ్రీ జితేంద్ర చౌదరి, శ్రీ ఏ.సంపత్, మరియు శ్రీ పి.కరుణాకరన్ లను అనుమతిస్తున్నాను.”
పైన ప్రస్తావించిన వారందరూ సి పి ఎం పార్లమెంటు సభ్యులే.  


BSNL Strike issue raised in Lok Sabha

Dear Comrade, Shankar Prasad Datta, CPI(M) MP from Tripura raised the BSNL Strike and issues in the Parliament. Forum thanks him. VAN Namboodiri Convener Forum.

Tuesday, April 21, 2015

21.4.2015 వార్తలు-విశేషాలు

21.4.2015 వార్తలు-విశేషాలు
  • నేడు, రేపు (21,22 ఏప్రిల్ 2015) బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణ కోసం బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగుల, అధికారుల సమైక్య సమ్మె-ప్రభుత్వ విధానాలే బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలాకు కారణం- దేశ భక్తుడిలాగా ఫోజు పెడుతున్న మోడి,  బి ఎస్ ఎన్ ఎల్ ను నిర్వీర్యం చేసే కాంగ్రెస్ విధానాలనే కొనసాగిస్తూ టెలికాం రంగం లో జాతీయ భద్రతకు ప్రమాదం కలిగించేందుకు తోడ్పడుతున్నాడు- సమ్మె నోటీసునిచ్చి నెల రోజులు పైనే అవుతున్నప్పటికి యూనియన్ల ఐక్య వేదికతో చర్చించేందుకు ప్రభుత్వానికి తీర లేదు- 25.4.2015న చర్చలకు డి ఓ టి 20వ తారీఖు సాయంత్రం ఆహ్వానించి 21,22 సమ్మె వాయిదా వేయాలని కోరింది- ఐక్య వేదిక ఇందుకు నిరాకరించింది-సమ్మేని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది-సమ్మె జయప్రదం చేసి తద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి 25న జరిగే చర్చలలో ఫలితం వచ్చేలా చేయాల్సిన బాధ్యత బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, అధికారులు అందరిపై వున్నది.
  • “సూటు బూటు సర్కార్” –మోడి ప్రభుత్వం పై రాహుల్ విమర్శ –భూసేకరణ ఆర్డినేన్సు తెచ్చి రైతుల అనుమతి లేకుండానే వారి భూములను కార్పొరేట్సుకు కట్టబెడుతున్నట్లు మోడి పై విమర్శ- ప్రజలలో కోల్పోయిన అభిమానాన్ని సంపాదించుకునే ఎత్తుగడ యిది-ఇదే కాంగ్రెస్ పార్టీ బి జె పి తో కుమ్మక్కై ఇన్సూరెన్సు రంగం లో ఎఫ్ డి ఐ పరిమితి 26 నుండి 49 శాతం కు పెంచేందుకు, బొగ్గు గనుల ప్రయివేటీకరణకు చట్టాలు చేయటం లో తోడ్పడింది-కాంగ్రెస్ అనుసరించిన నయా ఉదార వాద ఆర్థిక విధానాలను, ఆ విధానాలలో భాగం గా జరిగిన అవినీతిని ప్రజలు తిరస్కరించారు-కానీ బి జె పి ని గెలిపించి అదే ప్రమాదం మరింత భారీగా కొనితెచ్చుకున్నట్లయింది-కాంగ్రెస్ కు బి జె పి లేదా బి జె పి కి కాంగ్రెస్ నిజమయిన ప్రత్యామ్నాయం కాదు-వామపక్ష ప్రజాతంత్ర శక్తులే నిజమయిన ప్రత్యామ్నాయం.
  • “మహిళలను వేధించటం పురుషుల హక్కు!”-మహిళలను వేధించినందుకు అరెస్ట్ అయిన వారి అభిప్రాయం-సైబరాబాద్ పోలీస్” షి”  టీం సర్వే లో వెల్లడయిన వాస్తవం –మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నందునే వారిపై వేధింపులు ఎక్కువవుతున్నాయని వారి అభిప్రాయం- పితృస్వామిక సమాజం భావజాలం మహిళలకి వ్యతిరేకముగా, వారిని తక్కువగా చూసే విధముగా ఏ స్థాయిలో వున్నదో ఇది రుజువు చేస్తున్నది. ఛత్తీస్ఘర్ రాష్ట్రం లో రాయిపూర్ జిల్లా మోదా గ్రామ మహిళా సర్పంచ్ గీతా ప్రహ్లాద్  ని హత్య చేశారు. అందుకు కారణం ఆమె తన తల్లి చితికి నిప్పు అంటించటమే. ఆమె సోదరుడు బాధ్యత తీసుకోనందున తల్లి తండ్రులను చూసే బాధ్యతని ఆమె నెరవేర్చింది. అందుకనే తల్లి చిటికి ఆమె నిప్పు అంటించింది. కానీ పురుషాధిక్య సమాజానికి ఇది నచ్చ లేదు. అందుకనే ఆమె సోదరుడు ఆమెని హత్య చేసినట్లు వార్త.
  • 555.89 పాయింట్లు భారీగా పతనమయిన స్టాక్ మార్కెట్ సూచిక- ఇందుకు కారణం దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుండి కోలుకోటం చాలా బలహీనముగా వున్నదని, కార్పొరేట్సు ఆదాయాలు తగ్గాయని వచ్చిన వార్తలు.  ఎఫ్ ఐ ఐ (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్) పై మాట్ (మినిమమ్ ఆల్టర్నేట్ టాక్స్) గతం నుండి వర్తించే విధముగా ఆదేశాలు ఇవ్వటం కూడా ఇందుకు తోడయిందని పత్రికల కథనం. మోడి ప్రభుత్వం  కార్పొరేట్సుకు ఎన్ని రాయితీలిచ్చినా అవి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడటం లేదని ఇది రుజువు చేస్తున్నది. దీనిని అవకాశం గా తీసుకుని తమకి మరిన్ని రాయితీలివ్వాలని వారు ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగం గానే మాట్ ను గతం నుండి వసూలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్సు కి రాయితీలు, ప్రభుత్వ రంగాన్ని అందుకు అమ్మటం, ప్రజాసంక్షేమానికి కోత పెట్టటం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టటం –ఇది మోడి పాలన సారాంశం.
సంస్కృతి

  • రంగూ-రూపం : దృశ్య జగత్తులోని ప్రతి వస్తువు ఏదో రంగును కలిగి వుంటుంది. అదే విధంగా ప్రతి రంగూ ఏదో ఒక రూపాన్ని కలిగి వుంటుంది. రూపం, రంగూ రెండూ లేనప్పుడు దృశ్య జగత్తే వుండదు. రంగు నుంచి రూపం, రూపం నుంచి రంగు వేరు చేయబడి చూడబడగలవా అంటే “అవును”, “కాదు” అని రెండు జవాబులు వస్తవి. రంగు నుంచి రూపాన్ని విడదిస్తే రూపం కంటికి ఏ విధంగా కనిపిస్తుంది? రంగు ఉంటేనే కంటికి రూపం గోచరించేది. రంగు అంటే కాంతి. కాంతి లేని రూపం కంటికెలా కనిపించగలదు? అదే విధంగా రూపం నుంచి రంగును విడదిస్తే, అసలు రంగు అనే దానికి అస్తిత్వం ఎక్కడిది? కంటికి రంగు ఏదో రూపం లో గుండ్రంగానో, సొగగానో, చదరంగానో మరో ఇంకొక రూపం లోనో గోచరించాల్సిందే-కనుక రంగు లేని రూపం, రూపం  లేని రంగు వుండటం అంటే వుండకపోవటమే అవుతుంది వస్తుగత దృష్టితో పరికిస్తే. అయితే, వ్యక్తిగత దృష్టితో పరిశీలిస్తే మాత్రం స్వతంత్రంగా రెండు వేరు వేరుగా వున్నట్లు మనం అనుభూతి చెంద గలం. వస్తుగత దృష్టి వాస్తవ అస్తిత్వాన్ని చూపితే, వ్యక్తిగత దృష్టి అనుభూతి మూలకమయిన సంవేదనను (sensation) చూపుతుంది.”.....సంజీవ దేవ్ 

Sunday, April 19, 2015

4 జి మరియు వాయిస్ సర్వీసులు త్వరలో దేశ వ్యాపితముగా యిచ్చేందుకు కొత్త కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సన్నద్ధం- మరి బి ఎస్ ఎన్ ఎల్ పరిస్థితి ఏమిటి? • బి ఎస్ ఎన్ ఎల్ వైర్ లైన్ నెట్ వ్కర్క్ (ల్యాండ్ లైన్) కు మంచి రోజులు రానున్నాయా? • ఏప్రిల్ 21,22 సమ్మె జయప్రదం చేసి బి ఎస్ ఎన్ ఎల్ కు అవసరమయిన సహాయం అందించేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ముకేష్ అంబానీ కంపెనీ.(రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అతని తమ్ముడు అనిల్ అంబానిది). ఈ కంపెనీ వద్ద మిగతా ఏ టెలికాం కంపెనికన్నా ఎక్కువగా సరళీకృత స్పెక్ట్రమ్ వున్నది. సరళీకృత స్పెక్ట్రమ్ అంటే ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు వలన  2012 నుండి ప్రభుత్వము స్పెక్ట్రమ్ ను వేలం లో అమ్మటం ప్రారంభించింది. అంతకు ముందు ప్రభుత్వము ఒక ధరను నిర్ణయించి ఆ ప్రకారం స్పెక్ట్రమ్ ను అమ్మేది.
ప్రభుత్వము నిర్ణయించిన ధర ప్రకారం 2012 కి ముందు కొన్న స్పెక్ట్రమ్ ద్వారా ఏ సర్వీసులు ఇవ్వాలో లైసెన్సు షరతులు నిర్ణయించాయి. 900 MHz మరియు 1800MHz బ్యాండ్స్ స్పెక్ట్రమ్ తో 2 జి సర్వీసులు మాత్రమే ఇవ్వాలి. ఈ బ్యాండ్స్ పై 3 జి, 4 జి కూడా ఇవ్వ వచ్చు. కానీ లైసెన్సు షరతు అందుకు ఒప్పుకోదు. ఇది ప్రభుత్వ నిర్దేశిత ధర ప్రకారం కొన్న స్పెక్ట్రమ్ సంగతి.
2012 నుండి స్పెక్ట్రమ్ ను వేలం లో అమ్మటం ప్రారంభమయింది. వేలం లో కొన్న స్పెక్ట్రమ్ తో ఏ సర్వీసులయినా (2జి, 3జి లేదా 4జి) ఇయ్య వచ్చును. అయితే 2012 కి ముందే ప్రభుత్వము నిర్ణయించిన ధరకి 2 జి స్పెక్ట్రమ్ ను కొన్న కంపెనీలు ఆ స్పెక్ట్రమ్ పై 4 జి సర్వీసులు ఇవ్వాలంటే ఏమి చేయాలి? 2012 తరువాత జరిగిన వేలం లో ఆ బ్యాండ్ స్పెక్ట్రమ్ కు ఎంత ధర పలికిందో దానికి, తాము ఆ బ్యాండు స్పెక్ట్రమ్ కోసం ప్రభుత్వ ధర ప్రకారం గతం లో చెల్లించినదానికి గల తేడాని ప్రభుత్వానికి చెల్లించి 4 జి సర్వీసులను 2 జి స్పెక్ట్రమ్ పై ఇచ్చేందుకు అనుమతి పొంద వచ్చు. దీనినే స్పెక్ట్రమ్ సరళీకరణ అంటారు. కాబట్టి సరళీకృత స్పెక్ట్రమ్ అంటే వేలం లో పలికిన ధరకి కొన్న స్పెక్ట్రమ్,  లేదా  వేలం లో పలికిన ధరకి మరియు గతం లో ప్రభుత్వ ధర ప్రకారం చెల్లించినదానికి మధ్య గల తేడాని చెల్లించి 4 జి సర్వీసులు ఇవ్వటానికి అనుమతి పొందిన స్పెక్ట్రమ్.
బి ఎస్ ఎన్ ఎల్ కు 2000 లో 2 జి స్పెక్ట్రమ్ ను 900 MHz మరియు 1800 MHz బ్యాండ్స్ లో ఉచితముగా కేటాయించారు. 2020 వరకు ఈ స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ వాడుకోవచ్చు. నూతన టెలికాం విధానం 1999 ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ను ఉచితముగా కేటాయించాలి. ఆ ప్రకారమే 2 జి స్పెక్ట్రమ్ ను ఉచితముగా కేటాయించారు. ఈ 2 జి స్పెక్ట్రమ్ పై 4 జి సర్వీసులు ఇచ్చేందుకు (స్పెక్ట్రమ్ సరళీకరణకు) బి ఎస్ ఎన్ ఎల్, ప్రభుత్వానికి ఈ స్పెక్ట్రమ్ కు మిగిలిన  లైసెన్సు కాలానికి మార్కెట్ రేటు ప్రకారం (అంటే వేలం లో పలికిన ధర ప్రకారం)  చెల్లించి అనుమతి పొందాలి. ఈ చెల్లింపు లేకుండానే 2 జి స్పెక్ట్రమ్ పై 4 జి ఇవ్వటానికి అనుమతించాలని యూనియన్లు మరియు బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు కోరుతున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం 2 జి స్పెక్ట్రమ్ ను బి ఎస్ ఎన్ ఎల్ కు ఉచితముగా కేటాయించినందున ఆ స్పెక్ట్రమ్ పై 4 జి సర్వీసులిచ్చేందుకు కూడా ఉచితముగానే అనుమతించాలి. అందుకు మార్కెట్ ధర చెల్లించాలనటం అక్రమం.
బి ఎస్ ఎన్ ఎల్ కు స్పెక్ట్రమ్ ను ఉచితముగా కేటాయించటం ప్రభుత్వ విధానమయినప్పుడు  3 జి స్పెక్ట్రమ్ ను మరియు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ ను కూడా ఉచితముగా కేటాయించాలి. కానీ  3జి మరియు బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ కు ప్రభుత్వము 2010 లో జరిగిన వేలం లో పలికిన ధర ప్రకారం ఋ. 18500 కోట్లు  బి ఎస్ ఎన్ ఎల్ నుండి  వసూలు చేసింది.
ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా తదితర టెలికాం కంపెనీలకు మొదట ప్రభుత్వము నిర్ణయించిన తక్కువ ధరకి 2 జి స్పెక్ట్రమ్ (900 MHz మరియు 1800 MHz బ్యాండ్స్ లో ) కేటాయించారు. ఆ తరువాత కొన్ని సర్కిల్సులో 20 సంవత్సరాల గడువు తీరినందున ఆ సర్కిల్సులో ఈ స్పెక్ట్రమ్ ను ఈ కంపెనీలు వేలం లో కొన్నాయి. ఈ విధముగా ఈ కంపెనీలకు కొన్ని సర్కిల్సు లో ప్రభుత్వము నిర్ణయించిన ధర ప్రకారం కొన్న 2 జి స్పెక్ట్రమ్ (ఇది సరళీకృతం కానీ స్పెక్ట్రమ్.  దీనితో 3 జి కానీ, 4 జి కానీ ఇవ్వ కూడదు) మరి కొన్ని సర్కిల్సులో  వేలం లో పలికిన ధర ప్రకారం కొన్న 2 జి స్పెక్ట్రమ్ (ఇది సరళీకృత స్పెక్ట్రమ్. దీని పై 3 జి, 4జి సర్వీసులు కూడా ఇయ్యవచ్చు) వున్నది. అంటే ఈ కంపెనీలకు కొన్ని సర్కిల్సు లోనే సరళీకృత స్పెక్ట్రమ్ వున్నది.
ఇందుకు భిన్నముగా త్వరలో సర్వీసులు ప్రారంభించబోయే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అన్నీ సర్కిల్సు లోనూ సరళీకృత స్పెక్ట్రమ్ (అంటే వేలం లో కొన్న స్పెక్ట్రమ్) వున్నది.  ఈ స్పెక్ట్రమ్ తో అది 2 జి, 3 జి, 4జి ఏ సర్వీసులయినా  ఇయ్య వచ్చు. ఈ కంపెనీ ఇటీవల జరిగిన వేలం లో 800 MHz(ఇది 4 జి కి అత్యంత ఉపయోగకరమయిన బ్యాండ్),  మరియు 1800 MHz ( ఈ బ్యాండ్స్ పై 2 జి తో పాటు 4 జి కూడా ఇయ్య వచ్చు) ను అనేక సర్కిల్సు లో కొన్నది. 2300 MHz (ఇది కూడా 4 జి కి పనికి వచ్చే బ్యాండ్) స్పెక్ట్రమ్ ను ఈ కంపెనీ గతం లోనే (2010 లో) అన్నీ సర్కిల్సుకు  కొని అలానే వుంచుకున్నది. ఈ విధముగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వద్ద ఏ ఇతర కంపెనీ వద్ద లేనంత ఎక్కువగా సరళీకృత స్పెక్ట్రమ్ వున్నది. ఈ స్పెక్ట్రమ్ ద్వారా త్వరలో అది దేశ వ్యాపితముగా 4 జి సర్వీసులు ప్రారంభించబోతున్నది. ఈ విధముగా దానికి ఇతర ఏ టెలికాం కంపెనికి లేని అనుకూలత వున్నది.
మొబైల్ కాల్ టెర్మినేషన్ చార్జి  ( తన నెట్ వర్క్ లో టెర్మినేట్ అయ్యే మొబైల్ కాల్ కు ఆ మొబైల్  కంపెనీ ఆ కాల్ ప్రారంభం అయిన మొబైల్ కంపెనీ నుండి వసూలు చేసే చార్జి- దీనినే క్లుప్తముగా MTC అంటారు) ని నిమిషానికి 20 పైసల నుండి 14 పైసలకు టి ఆర్ ఏ ఐ తగ్గించింది. ఇది అన్యాయమని ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా లు అంటున్నాయి. టెలికాం కంపెనీల రెవిన్యూ లో 70 శాతం ఈ 3 కంపెనీలకే వస్తున్నది. MTC ని లెక్కించేటప్పుడు స్పెక్ట్రమ్ యూసెజ్ చార్జి, లైసెన్సు ఫీజు, మరియు స్పెక్ట్రమ్ కొనుగోలుకు వేలం లో చెల్లించిన ధర-వీటిని కూడా లెక్కించాలని ఈ కంపెనీలు వాదిస్తున్నాయి. ఈ విధముగా లెక్కిస్తే ఒక కాల్ కు MTC 18.5 పైసలు అవుతుందని అంటున్నాయి. ఈ మూడు కంపెనీలకే వినియోగ దారులలో అత్యధికులున్నందున వీటికే  ఇంటర్ కనెక్ట్ చార్జి ఎక్కువగా ఇతర కంపెనీలు చెల్లించాల్సి వస్తున్నది. అందుకే ఇవి ఇంటర్ కనెక్ట్ చార్జి (MTC)  కనీసం 18.5 పైసలు వుండాలని వాదిస్తున్నాయి.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొత్తగా వస్తున్నది కాబట్టి అది తక్కువ మంది వినియోగదారులతో ప్రారంభమవుతుంది. వినియోగ దారులు అధికముగా వున్న పై 3  కంపెనీలకు అది ఇంటర్ కనెక్టు చార్జి అధికముగా చెల్లించాల్సి వస్తుంది. అందుకనే అది ఇంటర్ కనెక్ట్ చార్జి 14 పైసలే వుండాలన్న టి ఆర్ ఏ ఐ నిర్ణయాన్ని సమర్థిస్తున్నది. తక్కువ వినియోగదారులున్న విడియోకాన్, తదితర టెలికాం కంపెనీలు కూడా MTC తగ్గింపును సమర్తిస్తున్నాయి. మొత్తం గా చూస్తే MTC తగ్గింపు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు అనుకూలం గా వున్నది.
అయితే టి ఆర్ ఏ ఐ ఇచ్చిన ఒక ఆర్డరు లాండ్ లైన్ నెట్ వర్క్ మనుగడకు కొంత ఉపయోగకరముగా వున్నది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వటానికి వైర్లెస్ కన్నా వైర్ లైన్ మారింత అనుకూలమని టి ఆర్ ఏ ఐ తేల్చి చెప్పింది. డేటా సర్వీసులు ఇవ్వటానికి తగినంత స్పెక్ట్రమ్ అందుబాటులో వుండదని, వైర్ లెస్ కన్నా వైర్ లైన్ మాత్రమే డేటా సర్వీసులకు మరింత అనుకూలమని అన్నది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ ల వైర్ లైన్ నెట్ వర్క్ లను కొనసాగించాల్సిన, విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్స్ పై వచ్చే రెవెన్యూ తో మాత్రమే బి ఎస్ ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ ల వైర్ లైన్ నెట్ వర్క్ మనుగడ సాగించలేవని, వాయిస్ కాల్సు కూడా వైర్ లైన్ నెట్ వర్క్ ద్వారా అధికముగా చేసే పరిస్థితి వుంటేనే వైర్ లైన్ నెట్ వర్క్స్ మనుగడ సాగించగలవని టి ఆర్ ఏ ఐ అన్నది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వైర్ లైన్ నెట్ వర్క్ నుండి మొబైల్ నెట్ వర్క్ కు చేసే కాల్స్ కు MTC (మొబైల్ టెర్మినేషన్ చార్జి)  ని పూర్తిగా రద్దు చేసింది. ఇదే విధముగా మొబైల్ నుండి వైర్ లైన్ కు, వైర్ లైన్ నుండి వైర్ లైన్ కు చేసే కాల్స్ కు కూడా టెర్మినేషన్ ఛార్జీలు రద్దు చేసింది. టెర్మినేషన్ ఛార్జీలు రద్దు చేసినందున ల్యాండ్ లైన్ నుండి మొబైల్ కు లేదా ల్యాండ్ లైన్ కు చేసే కాల్సు రేటు ఆ ప్రకారమే తగ్గించి మరింత మంది వినియోగ దారులను  ల్యాండ్ లైన్ కనెక్షన్సు  తీసుకునేలా చేయ వచ్చు. ఆ విధముగా ల్యాండ్ లైన్ నెట్ వర్క్ ను పటిష్టవంతం చేయ వచ్చును.
బి ఎస్ ఎన్ ఎల్ మేనేజిమెంటు 1.5.2015 నుండి ల్యాండ్ లైన్ వినియోగ దారులు రాత్రి 9 గం. నుండి ఉదయం 7 గం. వరకు బి ఎస్ ఎన్ ఎల్ ల్యాండ్ లైన్, మొబైల్ కు మాత్రమే కాక  ఏ ఇతర నెట్ వర్క్ కు కాల్ చేసినా చార్జి వుండదని ప్రకటించింది. దీని వలన బి ఎస్ ఎన్ ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్లకు డిమాండ్ పెరిగే అవకాశం వున్నది.

ల్యాండ్ లైన్స్ బిజినెస్ ను ఈ విధముగా పెంచుకుంటూనే మొబైల్ రంగం లో కూడా బి ఎస్ ఎన్ ఎల్ ముందుకు పోవాల్సిన అవసరం వున్నది. 4జి సర్వీసులను కూడా బి ఎస్ ఎన్ ఎల్ ప్రారంభించాలి. ఇందుకు బి ఎస్ ఎన్ ఎల్ తన 2 జి స్పెక్ట్రమ్ పైనే 4 జి సర్వీసులిచ్చేందుకు ప్రభుత్వము ఉచితముగా అనుమతించాలి. అవసరమయితే 800 MHz బ్యాండ్ స్పెక్ట్రమ్ ను కూడా బి ఎస్ ఎన్ ఎల్ కు 4 జి సర్వీసులు అందించేందుకు ఉచితముగా కేటాయించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం  తో మొబైల్ సర్వీసుల విస్తరణకు, ఆప్టిక్ కేబుల్ విస్తరణకు అవసరమయిన పెట్టుబడిని సమకూర్చుకునేందుకు ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు చెల్లించాల్సిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ చార్జి రీఫండ్ ఋ.6724 కోట్లను, టి ఆర్ ఏ ఐ సిఫార్సు ప్రకారం 2012-13 సంవత్సరం లో ల్యాండ్ లైన్స్ పై వచ్చిన నష్టానికి పరిహారముగా చెల్లించాల్సిన ఋ.1250 కోట్లను వెంటనే చెల్లించాలి. బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు సందర్భముగా యిచ్చిన హామీ ప్రకారం గ్రామీణ ప్రాంత ల్యాండ్ లైన్స్ పై వస్తున్న నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలి. ఎక్విప్మెంటు కొనేందుకు అవసరమయిన పెట్టుబడి కోసం ప్రభుత్వము హామీ వుంది బి ఎస్ ఎన్ ఎల్ కు తక్కువ వడ్డీ కి బ్యాంకులనుండి అప్పు ఇప్పించాలి. ఈ డిమాండ్స్ తో పాటు బి ఎస్ ఎన్ ఎల్ యూనియన్ల ఐక్య వేదిక సమర్పించిన మొత్తం 20 డిమాండ్స్ ను ప్రభుత్వము ఆమోదించాలి. ఇందు కోసం ప్రభుత్వం పై  ఒత్తిడి చేసేందుకు ఏప్రిల్ 21,22 న జరుగు సమ్మె లో బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు, అధికారులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలి

Sunday, April 12, 2015

మందగించిన పెరుగుదల, హెచ్చు స్థాయి నిరుద్యోగం – ఐ ఎం ఎఫ్ హెచ్చరిక

స్వల్ప పెరుగుదల, అధిక నిరుద్యోగం, ఋణ భారం-ఈ పరిస్థితిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘ కాలం ఎదుర్కొబోతున్నదని ఐ ఎం ఎఫ్ 8.4.2015న విడుదల చేసిన “వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్”  డాక్యుమెంటు లో హెచ్చరించింది. ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమయిన మాంద్యానికి గల కారణాలు పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదిలోనే వున్నాయని, ఈ కారణాలను పరిష్కరించటం లో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ  విఫలమయిందని ఈ డాక్యుమెంటు రుజువు చేస్తున్నది. అమెరికా, యూరప్, ఆసియా ఖండాలలో వున్న అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో ఉత్పాదక రంగాలలో మదుపు (పెట్టుబడులు పెట్టటం) స్థిరముగా  తగ్గిపోతున్నదని ఈ డాక్యుమెంటు అన్నది.  అభివృద్ధి చెందిన దేశాలలో పెరుగుదలకి అవకాశాలు సంక్షోభానికి ముందరి కాలం కంటే తక్కువగా వున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ అవకాశాలు మరింత తక్కువగా వున్నాయని ఈ డాక్యుమెంటు అన్నది.
ఈ పరిస్థితిలో జీవన ప్రమాణాలు భవిష్యత్తులో చాలా స్వల్పముగా మాత్రమే పెరుగుతాయి. అభివృద్ధి మందగించినందున పన్నుల వసూలు కూడా తదనుగుణముగా తగ్గి ద్రవ్య పటిష్టత కొనసాగింపు కష్టమవుతుంది.
అభివృద్ధి చెందిన దేశాల జనాభా లో వయోవృద్ధుల శాతం పెరగటం, ఉత్పాదకత పెరుగుదల రేటు తగ్గటం, తదితరాలు ఈ మాంద్యానికి కారణాలని ఐ ఎం ఎఫ్ అంటున్నది. కానీ అసలు వాస్తవాన్ని అది కప్పి పుచ్చుతున్నది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పరాన్న భుక్కు తత్వం వలన వనరులను ఉత్పాదక రంగాలనుండి, ప్రత్యేకించి కార్మిక వర్గము నుండి కొద్ది మంది సంపన్నుల లాభాపేక్షకు మళ్లించటమే ఈ అసలు కారణం. ఆర్థిక వ్యవస్థ మాంద్యం లో వున్నప్పటికి, అత్యధిక ప్రజానీకం జీవన ప్రమాణాలు పడిపోతున్నప్పటికి ప్రపంచ పెట్టుబడిదారీ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సంపన్నులకు, అతి సంపన్నులకు అధిక లాభాలు సమకూరుస్తున్నాయి. కాబట్టి వీరి సంపద పెరుగుదల కి ఉత్పత్తి పెరుగుదలతో సంబంధం లేదు. పైగా ఉత్పత్తి పెరుగుదలని దెబ్బ తీయటం ద్వారానే వీరి సంపద పెంచబడుతున్నది.
ఆరు నెలల క్రితం తాను స్వల్ప పెరుగుదల పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగుతుందని చెప్పానని, ఇది వాస్తవం కాకుండా చూడాల్సిన బాధ్యత నేడు మన పై వున్నదని 9.4.2015న “అట్లాంటిక్ కవున్సిల్” సమావేశం లో ఐ ఎం ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లాగార్దే అన్నారు. స్వల్ప పెరుగుదల, స్వల్ప ద్రవ్యోల్బణం మరియు అధిక అప్పులు, అధిక నిరుద్యోగం సమస్య అభివృద్ధి చెందిన దేశాలను వేధిస్తున్నదని ఆమె అన్నారు. సాధారణం కన్నా తక్కువగా వున్న ఈ పెరుగుదల వలన మరో ఆర్థిక పతనం ప్రమాదం పొంచి వున్నదని ఆమె అన్నారు. వాణిజ్యం లో పెరుగుదలసాధారణం కన్నా తక్కువగా వుండటం ఇది వరుసగా 4వ సంవత్సరం అని ఆమె అన్నారు.
డిమాండ్ ను మరియు ఉత్పాదక పెట్టుబడులను పెంచటం ద్వారా పెరుగుదల రేటును పెంచాలని ఆమె చెప్పిన చిట్కా బడా పెట్టుబడిదారులకు అనుకూలముగా , కార్మిక వర్గానికి వ్యతిరేకముగా వున్నది. ఇందుకోసం కార్మిక సంస్కరణలు అవసరమని అన్నది.  కార్మిక హక్కులను, స్వల్పంగా మిగిలిన ఉద్యోగ భద్రతను రద్దు చేయాలనే ఈ కార్మిక సంస్కరణల అర్థం. ఆయిల్ ను దిగుమతి చేసుకునే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆయిల్ సబ్సిడీలను రద్దు చేయాలని ఆమె అన్నది.
ద్రవ్యోల్బణం రేటుతో సరి చేసిన ఉత్పత్తి పెరుగుదల రేటు (ఉత్పత్తి పెరుగుదల సామర్థ్యం)  2015-2020 మధ్య కేవలం 1.6 శాతమే వుంటుందని, ఇది 2008 లో జరిగిన పతనానికి ముందున్న రేటు 2.25 తో పోలిస్తే చాలా తక్కువ అని ఐ ఎం ఎఫ్ డాక్యుమెంటు అన్నది. చైనా, భారత్, బ్రెజిల్, రష్యా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో 2008-2014 మధ్య 6.5 శాతం ఉత్పత్తి పెరుగుదల సామర్థ్యం  వుండగా 2015-2020 మధ్య 5.2 శాతమే వుంటుందని ఐ ఎం ఎఫ్ అన్నది. 2008 సెప్టెంబరు నుండి ప్రారంభమయిన సంక్షోభానికి ముందున్న పెరుగుదల తో పోలిస్తే పెరుగుదల ఇంకా బలహీనంగానే వున్నదని ఈ డాక్యుమెంటు అన్నది.
అభివృద్ధి చెందిన దేశాలలో 2008 లో ద్రవ్య సంక్షోభం ప్రారంభం కావటానికి ముందున్న ప్రయివేటు పెట్టుబడుల పెరుగుదలతో పోలిస్తే గత 6 సంవత్సరాలలో సగటున సంవత్సరానికి 20 శాతం తగ్గింది. 1929 లో మహా ఆర్థిక మాంద్యం ప్రారంభం తరువాత 6 సంవత్సరాలలో పెట్టుబడుల పెరుగుదల 10 శాతమే తగ్గింది.
నేటి సంక్షోభం దశలో పెట్టుబడుల పెరుగుదల ఈ విధముగా తగ్గటానికి కారణం ఊహించవచ్చు. పెట్టుబడిదారీ విధానం, ప్రత్యేకించి అమెరికా పెట్టుబడిదారీ విధానం  ఘోరంగా కుళ్లి పోవటమే దీనికి కారణం. ఉద్యోగాలు తగ్గించి, వేతనాలకు కోత పెట్టి కార్పొరేషన్లు ట్రిలియన్ల కొలది డాలర్లను మూట కట్టుకున్నాయి. మరో వంక కేంద్ర బ్యాంకులు దాదాపు ఉచితముగా ఇచ్చిన నిధులతో స్టాక్ మార్కెట్ ల సూచికలను పెంచి లాభాలు దండుకున్నాయి. ఉత్పాదక రంగాలలో పెట్టుబడులు పెట్టె బదులు కార్పొరేట్లు ఈ విధముగా స్టాక్ మార్కెట్ అమ్మకాలు, కొనుగోళ్ళు మరియు విలీనాలు స్వాధీనాలు తదితర పరాన్నభుక్కు కార్యక్రమాలకోసం కేంద్ర బ్యాంకులు తమకి ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశాయి. ఈ కార్యకలాపాలు అదనముగా ఎటువంటి విలువను సృష్టించవు. కానీ ద్రవ్య పెట్టుబడిదారుల జాతకాలని వర్ధిల్లజేస్తాయి. కార్పొరేట్ కొనుగోళ్ళు ఉత్పాదక సౌకర్యాల   సమీకరణ మరియు ఉద్యోగాల కోత ద్వారా ఉత్పాదక శక్తులను దెబ్బ తీస్తాయి.
ఈ పరాన్న భుక్కు తత్వం ఇటీవలి కాలం లో మరింతగా వ్యక్తమవుతున్నది. యూరపులో స్టాక్  మార్కెట్ నూతన శిఖరాలకు  చేరుకున్నది. గత 15 సంవత్సరాలలో ఎన్నడూ చేరుకొని స్థాయికి జపాన్ స్టాక్ మార్కెట్ సూచిక “నిక్కి” 20,000 పాయింట్లకు చేరుకున్నది. 2000 మార్చిలో చేరుకున్న 405.5 పాయింట్లకన్నా ఎక్కువగా 409.15 పాయింట్లకు “స్టాక్స్ యూరపు 600”  సూచిక చేరుకున్నది.
8.4.2015న రాయల్ డచ్ షెల్ ఆయిల్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం అది బ్రిటన్ కు చెందిన బి జి గ్రూప్ ను 70 బిలియన్ల డాలర్లకు కొనేందుకు అంగీకరించింది. ఎనర్జీ రంగం లో ఒక దశాబ్ద కాలం లో జరిగిన అతి పెద్ద స్వాధీనం ఇది. దీని వలన ఎనర్జీ రంగం లో వేలాది ఉద్యోగాలు రద్దవుతాయి. 2015 లో ఇప్పటి వరకు జరిగిన స్వాధీనాల విలువ 1 ట్రిలియన్ డాలర్లు. ఇదే విధముగా కొనసాగితే 2015 లో మొత్తం స్వాధీనాల విలువ 3.7 ట్రిలియన్ల డాలర్లు మించుతుంది. ఈ స్వాధీనాలు, విలీనాల ద్వారా వాల్ స్ట్రీట్ బ్యాంకర్లకు మిలియన్ల డాలర్ల లాభాలు వస్తున్నాయి. 8.4.2015న గోల్డ్ మాన్ సాక్స్, షెల్ బి జి కంపెనీకి మైలాన్ పెరిగో అనే కంపెనీని కొనేందుకు సహాయం చేసింది. ఈ ఒప్పందం విలువ 100 బిలియన్ డాలర్లు. ఇందులో గోల్డ్ మెన్ సాక్స్ కు వచ్చే లాభం 50 మిలియన్ డాలర్లు.
ఈ విధముగా ఆర్థిక మాంద్యం కాలం లో కేంద్ర బ్యాంకులు దాదాపు ఉచితముగా ఇచ్చిన నిధులతో స్టాక్ మార్కెట్ లావా దేవిలు, విలీనాలు-స్వాధీనాల ద్వారా ఉత్పత్తి పెంచకుండా లాభాలు దండుకునే ప్రయత్నం లో కార్పొరేట్లు వున్నాయి.
----పి.అశోక బాబు, జాతీయ ఉపాధ్యక్షులు, బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు
( మూలం: IMF warns of slow growth, high unemployment “ by Barry Gray, 11.4.2015, as published in the facebook page “vedika” of Com M.Koteswara Rao)   



Saturday, April 11, 2015

మే 26న కార్మిక సంఘాల జాతీయ సదస్సు

9.4.2015న ఢిల్లీలో ఐ ఎన్ టి యు సి కార్యాలయం లో కేంద్ర కార్మిక సంఘాలు BMS, INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, UTUC, LPF లు సమావేశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ఈ సమావేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. శ్రమ జీవుల జీవితాలపై ఈ విధానాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని సమావేశం భావించింది. ఈ విధానాలకు వ్యతిరేకముగా జరిగిన పోరాటాలను ఈ సమావేశం సమీక్షించింది.  ఈ విధానాలకు వ్యతిరేకముగా దేశ వ్యాపితముగా మరింత తీవ్రమయిన  సమైక్య పోరాట కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం వున్నదని ఈ సమావేశం భావించింది. దేశవ్యాపిత సార్వత్రిక సమ్మె తో సహా ప్రత్యక్ష పోరాట కార్యక్రమాన్ని నిర్ణయించేందుకు మే 26,2015న ఢిల్లీ లో కార్మికుల జాతీయ సదస్సు జరపాలని ఈ సమావేశం నిర్ణయించింది. 

Wednesday, April 8, 2015

బి ఆర్ పి ఎస్ ఈ ని రద్దుచేయాలని మోడి ప్రభుత్వ ప్రణాళిక

బి ఆర్ పి ఎస్ ఈ (బోర్డ్ ఫర్ రికంస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ) ఖాయిలా పడిన ప్రభుత్వ రంగా సంస్థల పునరుద్ధరణకి తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసే సంస్థ. దీనిని రద్దు చేసి ఆ స్థానం లో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ అనంత గితే 7.4.2015న అన్నారు. పత్రికలలో వచ్చిన వార్తల ప్రకారం దీని ఉద్దేశం ఖాయిలా పడిన65  ప్రభుత్వ రంగ సంస్థలని డిజిన్వెస్టు చేసేందుకు వీలు కలిగించటమే. ఖాయిలా పడిన ప్రభుత్వ రంగా సంస్థలను పునరుద్దఃరించే అవకాశాన్ని పరిశీలించకుండా వాటిని అమ్మెందుకు మోడి ప్రభుత్వము ఆలోచిస్తున్నదని ఇది రుజువు చేస్తున్నది. 

Friday, April 3, 2015

కమ్యూనికేషన్సు మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారూ, మీరు మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు కారణం అని విమర్శిస్తే చాలదు, బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడేందుకు తగు చర్యలు తీసుకుని మీ నిజాయితిని రుజువు చేసుకోండి

కమ్యూనికేషన్సు మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ 02.04.2015న పి టి ఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వాజపాయి ప్రభుత్వము దిగిపోయేటప్పుడు బి ఎస్ ఎన్ ఎల్  2004 లో రు. 10,000 కోట్లు లాభం తో వున్నదని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ  హయాములో దానికి రు.9000 కోట్లు నష్టం వచ్చిందని, బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు కారణం ఏ శక్తులో  అని ప్రశ్నిస్తూ అమాయకత్వం నటించారు.కానీ వాస్తవానికి బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు పునాది వేసింది వాజ్పాయి ప్రభుత్వము కాదా?

బిఎస్ఎన్ఎల్ ను ఏర్పాటు చేయటం దానిని నష్టాలపాలు చేయటానికేనని ఆనాడు అనేక మండి మేధావులు, ఉద్యోగుల స్సంఘాలు అన్నాయి. అయినప్పటికి వాజపాయి ప్రభుత్వము మొండిగా డి ఓ టి అధీనం లో వున్న టెలికాం సర్వీసులను బి ఎస్ ఎన్ ఎల్ పేరుతో 1.10.2000 న కార్పొరేషన్ గా మార్చింది. గ్రామీణ ల్యాండ్ లైన్ సర్వీసులపై వస్తున్న నష్టాలకు పూర్తి  పరిహారం చెల్లిస్తామని హామీ యిచ్చింది. బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు సందర్భముగా వాజపాయి నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఈ క్రింది హామీని యిచ్చింది:

“Financial viability: (i) Bharat Sanchar Nigam Ltd would be duly compensated for discharging obligations in regard to rural telephony or any other uneconomic service in accordance with any Government directive for implementation of NTP-99. (ii) GoM has further assured that under no circumstances Bharat Sanchar Nigam Ltd would be allowed to become non-viable as this would be a potential instrument in the hands of the Government for achieving its NTP-99 objectives”
(“ఆర్థిక పటిష్టత: ఎన్ టి పి-99 (న్యూ టెలికాం పాలసీ 1999) లక్ష్యాలు నెరవేర్చేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ప్రభుత్వము చేతిలో ఒక సాధనముగా వుంటుంది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ ను ఎట్టి పరిస్థితిలోను ఆర్థిక పటిష్టత లేని సంస్థగా కానీయమని ప్రభుత్వము హామీ యిచ్చింది. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న గ్రామీణ టెలిఫోనీ మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్ టి పి-99 లక్ష్యాలు నెరవేర్చేందుకు నేరావేర్చే ఆర్థికముగా గిట్టుబాటుగాని ఏ ఇతర సేవలకయినా బి ఎస్ ఎన్ ఎల్ కు ప్రభుత్వము తగిన పరిహారం చెల్లిస్తుంది”)

పైన తెలియజేసినది బి ఎస్ ఎన్ ఎల్ 01.10.2000 న ఏర్పడేముందు 25.9.2000 న మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన హామీల ప్రకారం తయారు చేసిన కేబినెట్ నోట్ లో వున్నది. కానీ ఈ కేబినెట్ నోట్ ను వాజపాయిగారి మంత్రివర్గం యధాతథముగా ఆమోదించకుండా బి ఎస్ ఎన్ ఎల్ ను దెబ్బ తీసే విధముగా కొన్ని మార్పులు చేసింది. మంత్రి వర్గ ఉప్సంఘం ఇచ్చిన హామీ ప్రకారం గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వచ్చే నష్టానికి బి ఎస్ ఎన్ ఎల్ కు తగు పరిహారాన్ని చెల్లించాలి. కానీ మంత్రివర్గం దీనిని మార్చి,”Government will consider and provide a package of measures so that the viability of BSNL is not impaired because of implementation of any socially desirable uneconomic activity, such as rural telephony, undertaken by BSNL at the behest of Government” (ప్రభుత్వా ఆదేశం ప్రకారం బి ఎస్ ఎన్ ఎల్ తనకు ఆర్థికముగా గిట్టుబాటుగానప్పటికి నిర్వహించే గ్రామీణ టెలిఫోనీ తదితర సేవలకు పరిహారాన్ని చెల్లించేందుకు ప్రభుత్వము ఒక ప్యాకేజీని రూపొందిస్తుంది”.)

ఇక్కడ మనము గమనించాల్సింది ఏమిటంటే ప్యాకేజీ అంటే స్వల్పకాలం అమలులో వుండేది.గ్రామీణ ల్యాండ్ లైన్స్    పై నష్టాలు వస్తున్నంత కాలం పరిహారం ఇవ్వకుండా ఒక ప్యాకేజీ రూపం లో ఈ పరిహారాన్ని కొద్ది కాలమే చెల్లిస్తామని ఈ విధముగా వాజపాయి ప్రభుత్వము నిర్ణయించింది. ఈ ప్రకారమే లైసెన్సు ఫీజు మరియు స్పెక్ట్రమ్ చార్జి రీయింబర్స్మెంటును మొదట 2002-03 వరకే అనుమతించి ఆ తరువాత మరొక సంవత్సరం అంటే 2003-04 వరకు పొడిగించింది. బి ఎస్ ఎన్ ఎల్ కు నోషనల్ గా యిచ్చిన అప్పు కు అసలు మరియు వడ్డీ వాయిదాల చెల్లింపుపై మోర టోరియమ్ ను మార్చి 2005 వరకే అనుమతించింది. యూపీ ఏ ప్రభుత్వము లైసెన్సు ఫీజు మరియు స్పెక్త్ర్రమ్ చార్జి రియింబర్స్మెంటును మరొక సంవత్సరం 2005-06 వరకు తక్కువ మొత్తం రియింబర్స్ చేసే విధముగా అనుమతించింది. ఈ విధముగా ప్రతిసంవత్సరమూ గ్రామీణ ల్యాండ్ లైన్స్ పై వచ్చే నష్టానికి పూర్తి పరిహారం చెల్లించే బదులు ప్యాకేజీ రూపములో కొద్ది సంవత్సరాలే ఇస్తామని ప్రకటించి వాజపాయి ప్రభుత్వమే బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు పునాది వేసింది.
2001-02 నుండి 2013-14 వరకు బి ఎస్ ఎన్ ఎల్ కు సంవత్సరానికి సగటున రు. 8000 కోట్ల చొప్పున రు. 1,04,000 కోట్లు వచ్చి వుంటుందని అంచనా. కానీ బి ఎస్ ఎన్ ఎల్ కు వివిధ రూపాలలో లభించిన పరిహారం రు.41370 కోట్లు మాత్రమే. బి ఎస్ ఎన్ ఎల్ కు ల్యాండ్ లైన్స్ పై వచ్చిన నష్టాలలో 40 సాతమే పరిహారముగా ఇవ్వటానికి కారణమయిన వాజపాయి ప్రభుత్వము ప్రయివేటు టెలికాం ఆపరేటర్లకు మాత్రం 10 సంవత్సరాల లైసెన్సు కాలాన్ని 20 సంవత్సరాలకు పొడిగించి, లైసెన్సు ఫీజుగా ఒకే సారి చెల్లించాల్సిన భారీ మొత్తానికి బదులు ప్రతి సంవత్సరము ఆదాయములో కొద్ది శాతం మాత్రమే చెల్లించేందుకు వీలుగా విధానాన్ని మార్చి రు.43000 కోట్లు అనుచిత లాభం చేకుర్చింది. కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు కారణం వాజపాయి ప్రభుత్వము అనుసరించిన విధానమే.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వము వాజపాయి విధానాన్నే కొనసాగించి బిఎస్ఎన్ఎల్ కు ల్యాండ్ లైన్స్ పై నష్ట పరిహారం చెల్లింపును ఆపి వేసింది. ఇంతేగాక మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాములో 2008 నుండి 2012 వరకు బి ఎస్ ఎన్ ఎల్ మొబైల్ సర్వీసుల విస్తరణకు అవసరమయిన జిఎస్ఏం ఎక్విప్మెంటు టెండర్లు రద్దు చేసి ఎక్విప్మెంటు కొననీయకుండా చేసి మొబైల్ సర్వీసుల మార్కెట్లో బి ఎస్ ఎన్ ఎల్ వెనకబడేలా చేసింది. 3 జి /బి డబ్ల్యూఏ స్పెక్ట్రమ్ కు బి ఎస్ ఎన్ ఎల్ వద్ద రు.18500 కోట్లు అనుచితముగా వసూలు చేసి దాని నగదు నిల్వలు హరించి వేసింది. ఈ విధముగా వాజపాయి మరియు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల విధానాలవలన బి ఎస్ ఎన్ ఎల్ నష్టాల పాలాయింది. నష్టాలకు బాధ్యత తమది కాదని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వానిది మాత్రమేనని రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పేది బుకాయింపు మాత్రమే.

వాజపాయి మరియు మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు అనుసరించిన బి ఎస్ ఎన్ ఎల్ వ్యతిరేక విధానాలనే మోడి ప్రభుత్వము మరింత జోరుగా కొనసాగిస్తున్నది. కార్పొరేట్స్ కు గత ప్రభుత్వాలకన్నా మరింత తన్మయత్వముతో సేవ చేస్తూ, కార్మిక వర్గం, ప్రభుత్వ రంగము మరియు ప్రజలపై దాడిని తీవ్రం చేస్తున్నది. బి ఎస్ ఎన్ ఎల్ ను పునరుద్ధరించాలని నిజముగా మోడి ప్రభుత్వానికి వుంటే ఆ ప్రభుత్వములో కమ్యూనికేషన్సు మంత్రిగా వునన్ శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు ఈ క్రింది ప్రశ్నలకు జవాబు  చెప్పాలి:

  1. వాపసు చేసిన బి డబ్ల్యూ ఏ స్పెక్ట్రమ్ కు రు. 6724 కోట్లు బి ఎస్ ఎన్ ఎల్ కు రీఫండ్ చేయాలని ఫిబ్రవరి 2014 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము నిర్ణయించింది. ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించకుండా మీ  ప్రభుత్వము 2014-15 బడ్జెట్ లో రు.100 కోట్లు, 2015-16 బడ్జెట్ లో రు.830 కోట్లు మాత్రమే ఎందుకు కేటాయించింది? ? ఈ విధముగా అయితే ఎన్ని సంవత్సరాలకు ఈ మొత్తాన్ని చెల్లిస్తారు? రు.6724 కోట్లు వెంటనే బి ఎస్ ఎన్ ఎల్ కు రీఫండ్ జరిగేలా చేసేందుకు కమ్యూనికేషన్సు మంత్రిగా మీరు చేసింది ఏమిటి?

  2. టి ఆర్ ఏ ఐ సిఫార్సుల ప్రకారం 2012-13 సంవాత్సరానికి గ్రామీణ ల్యాండ్ లైన్స్ కు మద్దతుగా బి ఎస్ ఎన్ ఎల్ కు రు.1250 కోట్లు యు ఎస్ ఓ ఫండ్ నుండి చెల్లించాలి. దీనిని ఇంత వరకు బి ఎస్ ఎన్ ఎల్ కు ఎందుకు చెల్లించలేదు? మీ ప్రభుత్వము కూడా దీని చెల్లింపుకు ఎందుకు ముందుకు రావటం లేదు?

  3. బి ఎస్ ఎన్ ఎల్ నెట్ వర్క్ విస్తరణకు అవసరమయిన పెట్టుబడికోసం బి ఎస్ ఎన్ ఎల్ కు మీ ప్రభుత్వము హామీ వుంది నామ మాత్రపు వడ్డీకి అప్పు ఇప్పించవచ్చు గదా! ఎందుకు మీ ప్రభుత్వము ఈ పని చేయటం లేదు? కార్పొరేత్సుకు రాయితీల మీద రాయితీలిస్తూ వారికి రైతులనుండి బలవంతముగా భూములు లాక్కొని కట్టబెట్టేందుకు ఆర్డినేన్సుల మీద ఆర్డినేన్సులు జారీ చేస్తున్న మీ ప్రభుత్వము బి ఎస్ ఎన్ ఎల్ కు ఎందుకు ఈ వ్విద్ధముగా తన  హామీతో అప్పు ఇప్పించలేక పోతున్నది?
కాబట్టి బి ఎస్ ఎన్ ఎల్ నష్టాలకు పునాది వేసింది వాజ్పాయి ప్రభుత్వము కాగా అవే విధానాలను కొనసాగించి నష్టాలకు దారి తీసింది మన్మోహన్ సింగ్ ప్రభుత్వము. మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ప్రభుత్వముకన్నా భిన్నమయినదని అనుకుంటే పైన తెలియజేసిన విధాముగా బి ఎస్ ఎన్ ఎల్ కు న్యాయముగా చెల్లించాల్సిన రు. 6724 కోట్లు మరియు రు.1250 కోట్లు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ హామీతో బి ఎస్ ఎన్ ఎల్ కు స్వల్ప వడ్డీకి అప్పు ఇప్పించి ఎక్విప్మెంటు కొనుగోలుకు సహకరించాలి.