ఎరుపులోనె మెరుపుంది
పోరాడే శక్తుంది
శ్రమజీవుల హక్కులకై
ఎలుగెత్తే బలముంది! - సుబ్బారావు పాణిగ్రాహి.
చరిత్ర నిరూపించిన సత్యానికి అక్షర రూపమిది. ప్రపంచ చరిత్రలో ఎందరెందరో మహరాజులు, సామ్రాట్టులూ హంగు దర్పాలతో అలరారుతున్న అధునాతన పాలకవర్గ నేతలూ ఎవరూ ఇవ్వని విశ్వాసమిచ్చిన చైతన్యం నింపిన మహత్తర సిద్ధాంతం, ఆచరణల సమతా సమరానికి ప్రతీకగా నిలిచిన వందేళ్ల ప్రస్థానం సంస్మరించుకుంటోంది భారతదేశం.
ఇలాంటి సమయంలో కూడా కమ్యూనిస్టు ఉద్యమ ఔన్నత్యానికి జేజేలు పలికే బదులు శాపనార్థాలు పెట్టేందుకు, దీనాలాపనలు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. 'వందేళ్ల వర్గ పోరాట వక్రీభవనం' (ఆంధ్రజ్యోతి-17.10.20) అంటూ తేల్చిపారేస్తున్నారు.
వేల సంవత్సరాలలో ఘనీభవించిన దోపిడీ వర్గాల శక్తియుక్తులనూ అపారంగా వారికి అందుబాటులో వున్న భౌతిక, బౌద్ధిక వనరులను ప్రత్యక్ష ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రచార యంత్రాన్ని గమనించకుండా భారత దేశంలోని కమ్యూనిస్టు పార్టీలూ బృందాలూ అన్నీ విఫలమైపోయాయని తేల్చిపారేస్తున్నారు.
మరో వంక సామ్రాజ్యవాద ప్రపంచ నేతగా వున్న అమెరికా అధ్యక్షుల వారికి తన ఎన్నికల ప్రత్యర్థి కమలా హారిస్ కమ్యూనిస్టుగా కనిపిస్తున్నారు. భారతీయ ట్రంప్ లాంటి నరేంద్ర మోడీజీకి జెఎన్‌యులో, హెచ్‌సియులో, కరోనాతో కదలిన వలస కార్మికుల అలజడిలో, సిఎఎపై ఎలుగెత్తిన షహీన్‌బాగ్ నిరసనలో ప్రతి చోటా కమ్యూనిస్టులే కనిపిస్తున్నారు. మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నుంచి మావోయిస్టుల వరకూ అందరూ జాతి ద్రోహులుగా అగుపిస్తున్నారు.
వందేళ్లనాడు భారత కమ్యూనిస్టు ఉద్యమ అంకురార్పణ చేసిన తొట్ట తొలి తరం యోధులపై మీరట్, కాన్పూర్ కుట్రకేసులు పెడితే... ఇప్పుడు కూడా షహీన్‌బాగ్, భీమా కోరెగావ్, ఆఖరుకు హథ్రాస్ ప్రతి చోట ప్రతీఘాత శక్తులకు ఇదే ప్రత్యామ్నాయ చైతన్యం భయంగొల్పుతున్నది.
'ఈ నాడు యూరప్‌ను ఒక భూతం భయపెడుతున్నది' అన్న కమ్యూనిస్టు ప్రణాళికలో ప్రారంభ వాక్యాలు ఇప్పటి పాలక వర్గాలకూ అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి. ముప్పై ఏళ్ల కిందట సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ప్రతికూల పరిణామాలు ఉద్యమాభిమానులకు ఎంత బాధాకరమైనప్పటికీ భూతాన్ని సీసాలో బంధించడం మాత్రం జాతీయ అంతర్జాతీయ పాలకవర్గాల తరం కాలేదు. వడలని సంకల్పంతో సమరం సాగుతూనే వుంది. వాస్తవాలను ఆకళింపు చేసుకుంటూ తప్పొప్పులు దిద్దుకుంటూ పున: ప్రస్థానం చేస్తూనే వుంది.
పాక్షికత్వంతో పరాచకాలు
వామపక్ష పదజాలం వల్లించే కొందరు విమర్శకులు ఈ మొత్తం పరిస్థితి గమనిస్తున్నారా అని సందేహం కలుగుతుంది. అధ్యయనంతో రచనలతో తలపండిన రచయితలకు రచయిత్రులకు కూడా కమ్యూనిస్టుల వైఫల్యాలే కనిపిస్తున్నాయి. మార్క్స్, ఎంగెల్సులు అంత సూటిగా రాస్తే ఈ పార్టీల నాయకులు ఎందుకు పట్టుకోలేకపోయారని పడక కుర్చీలలో కూర్చుని లేదా ఇంటర్‌నెట్లు శోధిస్తూ కొందరు తెగ ఇదై పోతున్నారు. ఇంతా చేసి ఈ వందేళ్లలో పాలకవర్గాల పన్నాగాలనూ కమ్యూనిస్టులు ఎదుర్కొన్న ఘోర నిర్బంధాన్ని, చేసిన బలిదానాలనూ అవగాహనలో, ఆచరణలో సైద్ధాంతిక నిర్మాణ సమస్యలనూ లోతుగా పరిశీలించే ఓపిక వుంటుందా! అదీ నాస్తి.
ఈ వందేళ్లలోనూ కమ్యూనిస్టులు ముళ్లదారిలో నడిచారే గాని పూల బాటలో పయనించలేదని గుర్తించ లేకపోవడం...ఆ ముళ్ల పొదల మాటు నుంచి కాలసర్పాలు వారిని ఎన్నిసార్లు కాటేశాయో, ఇంకా వేస్తూనే వున్నాయో అర్థం కాకపోవడం...ఈ ఆరోపణలకూ ఆవేదనలకూ అసలు కారణం. విజ్ఞానశాస్త్రంలో ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం వక్రీభవనం అంటే ఏంటో తెలుసు. ఒక వాహకం లోంచి మరో దానిలోకి మారినప్పుడు అంటే గాలి లోంచి నీటి లోకి మారినపుడు కాంతి గమనం నెమ్మదించి వంగినట్టుగా కనిపిస్తుంది. అంతేగాని ఆగదు. అలాగే దేశంలో ప్రపంచంలో పరిస్ధితులు, వర్గశక్తుల బలాబలాలు, పొందికలు మారినప్పుడు రాజకీయ గమనంలో హెచ్చుతగ్గులు వుంటాయి. సామాజిక శాస్త్రం కూడా అయిన మార్క్సిజాన్ని దాన్ని ఆచరణలో అమలు చేసి అపూర్వమైన మార్పులు తెచ్చిన కమ్యూనిస్టుల పాత్రనూ దృష్టి దోషాలతో చూస్తే అలాగే వుంటుంది.
వందేళ్లలో ప్రపంచమంతా మార్చలేకపోగా బలహీనమవడం కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధమైనట్టు గోచరిస్తుంటుంది. చరిత్రను సరిగా చూడకపోబట్టి చారిత్రిక తప్పిదాలు అన్న మాట పరాచికంగా మారిపోతుంటుంది. అలాంటి వారు శత్రు శిబిరానికి చెందినవారైతే ముఖం వాచేలా సమాధానం చెప్పడం మిత్రబృదంలో వారైతే సహనంతో తెలియజెప్పడం మాత్రమే మార్గం.
యథాస్థితికి కంచుకోటలే!
కమ్యూనిస్టేతర శక్తులేవీ సైద్ధాంతికంగా ఈ వ్యవస్థను మార్చే లక్ష్యం వున్నవి కావు. అంటే దానితో ముడిపడిన అసమానతలూ వివక్షతలూ దోపిడీ, పీడన కొత్త రూపాలలో కొనసాగించేవే గాని తుదముట్టించేవి కావు. మహా అయితే కొన్ని సంక్షేమ పథకాలతో సరిపెట్టి అంతకు పదింతల సంపదలు శతసహస్ర కోటీశ్వరులకు ధారాదత్తం చేస్తూనే వుంటాయి. ఆరేళ్ల మోడీ పాలనలో అయిదు రెట్లు పెరిగిన ముఖేష్ అంబానీ ఆస్తి, మూడు రెట్లు పెరిగిన గౌతం అదానీ ఆస్తులూ, వంద రెట్లు పెరిగిన మత విద్వేషాలు, కులాల వివక్షలూ, ట్రంప్ కంపు వ్యవహారాలూ కనిపిస్తూనే వున్నాయి. వీటిపై నికరంగా నిశ్చలంగా విమర్శ చేస్తున్నదీ వీరోచితంగా పోరాడుతున్నదీ ప్రగతిశీల శక్తులు తప్ప గొప్పలు పోయే పాలకవర్గాలు కాదు.
అయితే లెనిన్ అన్నట్టు కార్మిక వర్గ పోరాటంలో అతి భీకరమైన భాగం సైద్ధాంతిక రంగంలో జరుగుతుంది. సోషల్ మీడియా వ్యాప్తి, ఆరెస్సెస్ బిజెపిలు దాన్ని విషప్రచార సాధనంగా మార్చుకోవడం జరిగాక అనుక్షణం అసంఖ్యాక కథనాలు చెలరేగిపోతున్నాయి. ప్రత్యక్ష అణచివేతలూ చెలరేగిపోతున్నాయి. భారతీయ సమర క్షేత్రంలో అరుణ పతాకానికి వందేళ్ల వందనం సమర్పించేప్పుడు ఈ శక్తులను పసిగట్టి పని పట్టడానికి పటిష్టమైన యోచనలు, ఆచరణ తప్పనిసరి.
ఉద్యమంలో కదం తొక్కే అరుణ సైన్యానికి అండగా అశేషమైన అభిమానులూ శ్రేయోభిలాషులూ వాటిని గమనిస్తూనే వున్నారు గనక నిరంతర తోడ్పాటు కొనసాగిస్తున్నారు. ఎర్ర జండా అండనే పోరాటాలు సాధ్యమని శ్రమజీవులూ నిరుపేదలూ నమ్ముతున్నారు. ఎవరో కవి అన్నట్టు 'పీడితులు, తాడితులు, కార్మికులు, కర్షకులు నీ నీడనే నేడు నిలిచి వున్నారే..నిన్ను నమ్ముకునే వారు బతుకుతున్నారే.. నీకు సాటెవ్వరే సమతా పతాకా' అని పాడుతూనే వున్నారు. మరింత గట్టిగా పోరాడాలని కమ్యూనిస్టులపై వీరు చేసే ఫిర్యాదు వాస్తవానికి వారి గౌరవాన్ని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ యుగం దాన్ని కాపాడటానికి మత మార్కెట్ శక్తులు కలసి తీసుకొచ్చిన జాతి మత చాందస శక్తుల స్వైర విహారం ఆందోళనకరమే. కాని కమ్యూనిస్టులు ఈ పరిస్థితికి దీటుగా తమను తాము మల్చుకోవడం, మార్చుకోవడం క్షణాల మీద జరిగిపోదు. వర్గ సమరం సాగిస్తూ అంతర్గత దిద్దుబాట్లు చేసుకోవడానికి ఈ శతవార్షిక సందర్భమే సరైంది. వర్గ పోరాటంలో సిద్ధాంతాన్ని మించిన ఆయుధం లేదన్నట్లే ఐక్యతను మించిన పునాది కూడా వుండదు. ఈ రెంటినీ మేళవించే నవయుగ సైనికుల పతాకమే అరుణ పతాకం.
సిపిఐ(ఎం) విలక్షణ పాత్ర
ప్రపంచంలో చాలా దేశాలతో పోలిస్తే భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర చాలా సుదీర్ఘమైంది. ప్రభావశీలమైంది కూడా. అనేకసార్లు సరైన దిశా నిర్దేశం చేసింది. ప్రజాచైతన్యం పెంచింది. కేవలం గతం ఘనతనే కీర్తించే ఈ పుణ్యభూమిలో నవచైతన్యాంకురాలు నాటింది. ప్రత్యామ్నాయ ప్రజా సాహిత్య సంస్మృతులను సృజించడమే కాదు. ఉద్యమాలలోనూ పాలనలోనూ కూడా ఆ శక్తుల నమూనాను చూపించింది. వామపక్ష శిబిరంలో అన్ని స్రవంతులనూ విచక్షణా రహితంగా ఈసడించే సిద్ధాంత కోవిదుల మాట ఎలా వున్నా ఆ మౌలిక భావనలను సజీవంగా వుంచడానికి ప్రధానమైన వామపక్షంగా సిపిఎం చొరవ చూపింది. 1998లో మార్క్స్ 125వ వర్ధంతిని దేశ దేశాల కమ్యూనిస్టు వర్కర్స్ పార్టీల సమ్మేళనంతో జరిపి చెల్లాచెదురుగా వున్న విప్లవకర శక్తులకు కొత్త ఊపిరిలూదింది. పదవుల లోకి రావడమే విజయమనుకుంటే సిపిఎం నేత పాతికేళ్ల కిందటే భారత ప్రధాని అయివుండేవారని మర్చిపోరాదు. సరళీకరణను, గరళీకరణగా మారుతున్న తీరును చెప్పి దేశవ్యాపితంగా కోట్లాది మంది కార్మికులను సమరపథంలో నడిపిస్తున్న తీరుకు రేపు నవంబర్‌లో జరిగే సమ్మె కూడా సంకేతం కానుంది. ఇటీవల వక్రమార్గాలతో పార్లమెంటులో ఆమోదించుకున్న రైతు వ్యతిరేక బిల్లులపై పోరాటం జరుగుతూనే వుంది. హథ్రాస్‌లో అమానుషంగా బలైన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సిపిఎం, ఐద్వా బృందంతో ఆ గృహస్తుడు తాను కార్మిక సంఘంలో పని చేశానని, కమ్యూనిస్టులే ప్రజల కోసం నిలబడతారని చెప్పడం ఈ దేశంలో కమ్యూనిస్టులు విత్తిన చైతన్యానికి ఒక నిదర్శనం.
ఎర్రబావుటా నిగనిగలు
పిడుక్కూ బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు తీరిగ్గా కూర్చుని తిట్టేవాళ్లు తిట్టవచ్చుగాక. తిన్నది అరగని పాలకవర్గ ప్రవక్తలు శాపనార్థాలు పెట్టవచ్చుగాక. ఎక్కడికీ తృప్తి లేక ఇంకా ఇంకా సంపదల కోసం వెంపర్లాడే ధనస్వామ్య భూస్వామ్య అభివృద్ధి నిరోధక శక్తులు సామదానభేద దండోపాయాలను ప్రయోగించుగాక. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మతాన్ని గతాన్ని కూడా తోడు తెచ్చుకుని నిలవాలని పాచికలు వేయొచ్చుగాక.
ఇవన్నీ ఎన్నో చూసిన తర్వాత కూడా ఎర్రజెండా పైపైకి ఎగురుతూనే వుంది. ఉంటుంది. 'కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు ధగధగలు ఎర్రబావుటా నిగనిగలు' అని ప్రశ్నిస్తూనే వుంది. 'ముళ్లూ రాళ్లూ అవాంతరాలు ఎన్ని వున్నా ముందు దారి మాదే..మాదే..' అని ప్రకటిస్తోంది. వక్రీభవనం కాంతి మార్గాన్ని తప్పుగా చూపిస్తుందేగాని గమనాన్ని ఆపలేదన్న శాస్త్రీయ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఈరోజు దేశమంతటా ఉద్యమ కేంద్రాలలో ఎగిరిన అరుణ పతాకాలే అందుకు సాక్ష్యం.
......... ప్రజాశక్తి, 18.10.2020, తెలకపల్లి రవి వ్యాసం