ఈ రోజు గాంధీ జయంతి సందర్భముగ చదవదగ్గవ వ్యాసం “ జాతీయ సమైక్యత- బాపూజీ”. రచయిత కామ్రేడ్ ఈ ఎం ఎస్ నంబూదిరిపాద్. ఈ వ్యాసం దిగువన ఇస్తున్నాము.
జాతీయ సమైక్యత- బాపూజీ
బ్రిటిష్ వారు అధికారాన్ని 1947లో తమ చేతిలో పెట్టటం ప్రపంచం లోనే ఒక అసాధారణ విషయంగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటారు. ఫ్రాన్స్, రష్యా, చైనా మొదలైన దేశాలలో జరిగిన విప్లవాల్లా కాకుండా 1947 'ఇండియా విప్లవం' ఒక్క రక్తపు చుక్క కూడా కార్చకుండా సాధించబడిందనీ, దానికి కారణం అహింసావాది నాయకత్వమేననీ చెప్పుకుంటారు.
1947 ఆగస్టు 15న ఆనాటి కాంగ్రెసు అధ్యక్షుడు ఆచార్య కృపలానీ దేశానికొక సందేశమిస్తూ ఈ విషయాన్ని సాధికారంగానే ప్రకటించారు.
'అంత తక్కువ రక్తపాతంతో, అంత తక్కువ హింసతో కోట్లకొలది స్త్రీ పురుషుల భవిష్యత్‌ను మార్చే మహద్ఘటన ఇంతకు పూర్వం ఎప్పుడూ జరగలేదు. మహాత్మా గాంధీ నాయకత్వమే దీనికి కారణం. మన జాతిపిత అంటే ఆయనే.
స్వాతంత్య్ర సాధనకై అహింసా పోరాటాన్ని సాగించడంలో ఆయన మనకు నాయకత్వం వహించాడు. ఆ స్వాతంత్య్రాన్ని ప్రజాసేవలో ఫలవంతం చెయ్యడానికి ఆయన మార్గం చూపించారు''.
ఈ అభిప్రాయం తో ఒక్క వ్యక్తి మాత్రమే ఏకీభవించలేదు. ఆ వ్యక్తి మరెవరో కాదు. గాంధీజీయే. టెండూల్కర్ ఇలా రాశారు- ( టెండూల్కర్, గాంధీ గారి జీవిత చరిత్ర రాశారు. దీనిని గాంధీగార చదివి ఆమోదించారు)
''దేశమంతటా ఉత్సవాలు జరుగుతున్నాయి. విదేశీ పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరచడంలో విశేష పాత్ర వహించిన వ్యక్తి మాత్రం ఆ ఉత్సవాల్లో పాల్గోలేదు. భారత ప్రభుత్వం ప్రచార శాఖకు సంబంధించిన ఒక ఉద్యోగి సందేశం ఇవ్వమంటూ గాంధీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పేదేమీ లేదన్నారు. సందేశం ఇవ్వకపోతే బాగుండదని ఆయనన్నారు. 'సందేశం ఏమీ లేదు. బాగుండకపోతే పోనీ' అని గాంధీజీ సమాధానం ఇచ్చారు.'' (సం.8, పుట 95-96)
మరో అయిదు నెలలకు 1948 జనవరి 26న గాంధీజీ చంపివేయబడటానికి నాలుగు రోజుల ముందు - ఆయన ఇలా అన్నారు - ''జనవరి 26 స్వాతంత్య్రదినం. అంతవరకు మనకు కనిపించని, చేజిక్కని స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజుల్లో ఈ ఉత్సవం జరపడం బాగానే ఉండేది. కాని ఇప్పుడంటారా, అది మన చేతికి వచ్చింది. కాని మనం ఆశించినది మాత్రం రాలేదు. మీ మటుకు ఏమోగాని, నా మటుకు మాత్రం జరిగినదిదే.'' (సం. 8, పుట 338)
ఈ నిరాశకు కారణం దేశమంతటా విజంభించిన మతోద్రేకాలే. 1946-47లో బ్రిటిష్ ప్రభుత్వానికీ, కాంగ్రెస్-ముస్లింలీగ్ తదితర పార్టీల నాయకులకూ మధ్య చర్చలు జరిగిన అనంతరం భారత జాతీయోద్యమ చరిత్రలో కనీవినీ ఎరుగనంతటి భయంకరమైన ఉద్రేకాలు చెలరేగాయి. ఆగస్టు 15కు ముందు నెలల్లో జరిగినట్లు ఒక వైపున ముస్లింలు, మరొక వైపున హిందువులు, శిక్కులు ఎన్నో వేల మంది ఒకరినొకరు హత్య చేసుకున్నారు.
భారత ప్రజలకు తాను నిర్దేశించినది ప్రేమ మార్గమే కాని ద్వేష మార్గం కాదని గాంధీజీ ఎప్పుడూ చెప్తూండేవారు. భారత ప్రజలు ఈ మార్గాన్ని అనుసరిస్తే... దేశాన్ని మహా క్రూరంగా అణచి పెడుతూన్న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల హృదయాలను మార్చివేయగలుగుతారని ఆయన అభిప్రాయం. కాని, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల హృదయాలను మార్చటం మాట అట్లా వుంచి, మన దేశ ప్రజల హృదయాలను ఐక్యపరచడంలో ఆ విధానం విఫలమయ్యే పరిస్థితి ఏర్పడింది.
తాను తన జీవితమంతా బోధించిన సిద్ధాంతాలు అధికార సంక్రమణాన్ని తెచ్చి పెట్టిన పరిస్థితులచే ఓడింపబడ్డాయే గాని జయించలేదని ''పూర్తిగాను, నిరాడంబరంగాను'' అంగీకరించినది గాంధీజీయే. జూలై 14న ఆయన ఇలా అన్నారు.
''ఈ 30 ఏళ్ళూ మనం ఆచరించినది అహింసాయుత ప్రతిఘటన కాదు, నిష్క్రియా ప్రతిఘటన. ఇది మన అశక్తత. సాయుధ ప్రతిఘటన చేయడానికి అయిష్టత మూలంగా నీరసమైన ప్రతిఘటన చేశాం. ఉక్కు గుండెలు కలవాళ్ళు మాత్రమే ప్రతిఘటన చేయగలరు. అదెట్లాగో చేతనయితే, స్వతంత్ర భారతదేశం ప్రపంచం ముందు మరొకలా కనిపించేది. ఇప్పటిలాగా రెండుగా చీల్చబడటం, పరస్పరం అనుమానాలతో కొట్టుమిట్టాడటం వుండేది కాదు. సాధారణ ప్రజానీకానికి మతమంటే ఏమిటో తెలియదు. వాళ్ళకు దేవుడొక్కడే. జీవితావసరాలు ఆ దేవుడు. ఆకలికి నకనకలాడుతున్న ఆ దిగంబర ప్రజాకోటికి ఇంత తిండీ బట్టా పెట్టే ఆలోచన మాని ఈ రెండు భాగాలూ ఒకదానితో ఒకటి సంఘర్షణ పడుతున్నాయి''. (సం.7, పుట 57)
గాంధీజీ జీవించి వున్న ఆఖరి క్షణం వరకూ తనకు తోచిన పద్ధతిలో దుష్ట మత శక్తులకు వ్యతిరేకంగా పోరాడటం ఆయన గొప్పతనం. 1946 ఆగస్టు 16వ తేదీని ముస్లింలీగు ''ప్రత్యక్ష కార్యాచరణ'' దినంగా ప్రకటించింది. ఆ రోజున కలకత్తాలో మొట్టమొదటి సారిగా మత కలహాలు బయలుదేరాయి. దేశమంతటా మతోద్రేకాలు ప్రమాదకరంగా పెరిగిపోయేటట్లు కనపడ్డాయి. ఆ క్షణం నుంచి గాంధీజీ మత సామరస్యం బోధించడానికి తన శక్తినంతటినీ వినియోగించారు. కొట్లాటలు పట్టణాల నుంచి పల్లెలకు పాకుతున్నాయనగానే, ఇతర పనులన్నీ కట్టిపెట్టి ఐక్యతా ప్రబోధానికై ఉద్యమించారు. ఆనేక వారాలపాటు బెంగాల్ లోని నవఖలీ జిల్లాలో గ్రామ గ్రామం తిరిగారు. అదే ప్రచారంలో నవఖలీ నుంచి బీహారు వెళ్ళారు. అక్కడ నుండి పంజాబు వెళ్ళాలని ఆయన ఊహ. అక్కడ నుండి కలకత్తా, మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. మతోద్రేకాలను ప్రతిఘటించటం, కొట్లాటల్లో బాధపడినవారికి సహాయం చెయ్యడం, కాందిశీకులకు రక్షణ ఇవ్వటం మొదలైన సమస్యలు ప్రార్ధనానంతర ఉపన్యాసాలలో ప్రాముఖ్యత వహించేవి.
కాని, ఆయన సందేశం వెనుకటంత ఉపయోగకరంగా లేదని స్పష్టమయింది. చివరలో ఆయన ఎదురుగుండా ఉంటే చాలు. ఉపవాసం చేస్తే చాలు - మత ద్వేషాలు పెరగకుండా ఆగేవి. వివిధ మతాల నాయకుల్ని ప్రజల్ని ఐక్యపరచేవి. ఇప్పుడు నవఖలీ, బీహారు, కలకత్తా, ఢిల్లీ మొదలైన ప్రదేశాలకు ఆయన వెళ్ళడం వలన కలహాలు కొంతకాలం ఆగినా, దూర ప్రదేశాల మాట అటుంచి ఆయన ఉన్న చోట కూడ పరిస్థితులలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు.
మత సామరస్యం కోసం ఎవరన్నా ప్రయత్నం చేస్తే దాని మీదికి రెండు మతాలకూ చెందిన దురహంకారులు విరుచుకు పడేటంతగా మత ద్వేషాలు పెరిగి ఉన్నాయని గాంధీజీ ఎరుగును. మత ద్వేషాలను ప్రతిఘటించడంలో తనకు ప్రమాదం రాగలదని కూడ ఆయన ఎరుగును.
జనవరి 28వ తేదీన రాజకుమారి అమత కౌర్‌తో మాట్లాడుతూ తనను ''ఏ పిచ్చివాడో కాల్చి చంపే'' అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. అటువంటిది తటస్థపడితే ''చిరునవ్వుతో స్వీకరిస్తాను. నాలో కోపం ఉండకూడదు. హదయం లోను, పెదవుల మీద కూడ భగవంతుడే ఉండాలి'' అన్నారు. ఈ మాటలన్న రెండు రోజులకే ఆ దుర్ఘటన జరిగింది.
('మహాత్ముడు-ఆయన సిద్ధాంతాలు' పుస్తకం నుంచి)
No comments:
Post a Comment