Wednesday, November 30, 2011

దేశమును ప్రేమించుమన్నా 
మంచి అన్నది పెంచుమన్నా.
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !


పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువ్వు పాటుపడవోయ్,
తిండి కలిగితే కండకలదోయ్
కండగలవాడేను మనిషోయ్ !


ఈసురోమని మనుషులుంటే 
దేశమే గతి బాగుపడునోయ్ ?
బల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !

అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశి సరుకులు నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు 
కీర్తి సంపద లబ్బవోయ్ !


వెనుక చూచిన కార్యమేమోయ్ 
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుకపడితే వెనెకెనోయ్ !

పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధకలహం పెంచబోకోయ్ 
కత్తివైరం కాల్చవోయ్ !

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !


ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !



పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కదోయ్
ఒకరిమేల్ తన మేలనెంచే 
నేర్పరికి మేల్ కొల్లలోయ్ ! 

సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్ ! 

చెట్టపట్టాల్ పట్టుకుని 
దేశస్థులంతా నడవవలెనోయ్ 
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్ ! 

మతం వేరైతేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే 
జాత మన్నది లేచి పెరిగీ
లోకమున రాణీంచునోయ్ !

దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనంపంటలు పండవలెనోయ్ ! 

ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయ్,
పలుకులను విని, దేశమందభి 
మానములు మొలకెత్తవలెనోయ్. 

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐకి అనుమతి ఆత్మహత్యా సదృశం -- సారంపల్లిమల్లారెడ్డి


''రిటైల్‌ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రాకతో పొలంలో పండిన ఉత్పత్తులు నేరుగా స్టోర్స్‌కు చేరతాయి. వృథా గణనీయంగా తగ్గుతుంది. రైతులు మెరుగైన ప్రతిఫలాన్ని పొందుతారు.''
- భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో ఒక భాగం.
కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మల్టీ బ్రాండ్‌ వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో వస్తున్న బెస్ట్‌బై, వాల్‌మార్ట్‌, క్యారీఫోర్‌, టెస్కో లాంటి బహుళజాతి సంస్థలకు ఆహ్వానం పలికితే సాధారణ ఉత్పత్తిదారుడు జాడలేకుండా పోతాడు. ఎఫ్‌డిఐ నుండి సహాయం పొందిన చిల్లర వర్తకులు దేశీయ ఉత్పత్తిదారుల నుండి 30 శాతం ఉత్పత్తులు సేకరిస్తామని, తద్వారా వీరి ఉత్పత్తులకు ధరలు పెరుగుతాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. అంటే 70 శాతం ఉత్పత్తులు విదేశాల నుండి దిగుమతి చేసుకున్నవే ఉంటాయన్న మాట. ఆ ముప్పయి శాతం కూడా చిన్న, మధ్య తరగతి రైతులు చేసే వ్యవసాయోత్పత్తులే అనుకుంటే పొరపాటు. వీటిని పెద్ద మొత్తంలో సేకరించేందుకు టెండరు పిలుస్తారు. మంచి నాణ్యత ఉన్నవాటినే తీసుకుంటామంటారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి సేద్యం చేసినప్పుడే వారు నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవడం సాధ్యం. భారత దేశంలోని బడుగు రైతుకు అంత సామర్థ్యం ఎక్కడుంటుంది? వ్యవసాయ రంగంలోకి ఎఫ్‌డిఐని ఆహ్వానించడం, కార్పొరేట్‌ వ్యవసాయం దిశగా మళ్లించేందుకు యత్నిస్తున్న పరిస్థితుల్లో ఇది సహజంగానే ఆ వర్గాలకే ఉపయోగపడుతుంది. సాంప్రదాయక వ్యవసాయాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. రిటైల్‌ రంగంలో సింహ భాగం ఆహార ఉత్పత్తులదే కాబట్టి ఈ రంగంపై విదేశీ, బహుళజాతి సంస్థల ఆధిపత్యం వహించడమంటే అది మన ఆహార భద్రతను పరాధీనం చేయడమే కాగలదు. నేడు 80 దేశాలలో ఈ గుత్త సంస్థలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు మంచి ధర లభిస్తే ఆ దేశాలలో ఎందుకు ఆందోళనలు సాగుతున్నట్లు? పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు మాత్రం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులు లబ్ధి పొందుతారని చెప్పడం వట్టి బోగస్‌.
బిగ్‌ బజార్లు, స్పెన్సర్‌ మార్కెట్‌లు, మెట్రోల ప్రవేశంతో ఇప్పటికే అనేక మంది వీధి వ్యాపారులు, చిల్లర వ్యాపారులు చితికిపోతున్నారు. రేపు ఈ వాల్‌ మార్ట్‌లు, టెస్కోలు వంటి బకాసుర సంస్థలు రిటైల్‌లోకి నేరుగా ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశం వల్ల దేశానికి మంచి కన్నా చెడే ఎక్కువనేది వివిధ దేశాల అనుభవాలు తెలియజేస్తున్నాయి. వాల్‌ మార్ట్‌, ఫోర్‌క్యారీయర్‌, టెస్కో వంటి బహుళజాతి సంస్థల ధాటికి దేశంలోని చిల్లర వర్తకులు తట్టుకుని నిలదొక్కుకోవడం సాధ్యమేనా? వాల్‌మార్ట్‌నే తీసుకుందాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్‌ వ్యాపార సంస్థ. 2004లో దాని టర్నోవర్‌ 25,600 కోట్ల డాలర్లు. ప్రతి యేటా దాని టర్నోవర్‌లో వృద్దిరేటు 12-13 శాతం దాకా పెరుగుతూ వస్తోంది. నికర లాభం 900 కోట్ల డాలర్లు. 2004 నాటికి ఈ సంస్థ ప్రపంచ వ్యాపితంగా 4,806 స్టోర్స్‌ను కలిగి ఉంటే అందులో పని చేసే సిబ్బంది 14లక్షల మంది మాత్రమే. వీటిలో 1355 స్టోర్స్‌ అమెరికా వెలుపలే అది నిర్వహిస్తున్నది. ఒక్కొక్క స్టోర్‌ విస్తీర్ణం సగటున 85వేల చదరపు అడుగులు. ఒక్కో స్టోర్‌ సగటు టర్నోవర్‌ 5,100 కోట్ల రూపాయలు. ఇది భారతీయ రిటైల్‌ వ్యాపారి టర్నోవర్‌ కన్నా వేల రెట్లు ఎక్కువ. భారత్‌లోని కోటి 20 లక్షల రిటైల్‌ షాపుల్లో కేవలం 4 శాతం మాత్రమే 500 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగినవి. అవి కూడా కార్పొరేట్‌ సంస్థల ఆధ్వర్యంలోనివే.
మిగతావన్నీ సాంప్రదాయకంగా నడుపుకుంటున్న కిరాణా దుకాణాలు, పాన్‌ షాపులే. స్థానిక రిటైల్‌ షాపులు మూతపడేలా చేసేందుకు ఈ బహుళజాతి సంస్థలు మొదట కొంతకాలం పాటు లాభం మార్జిన్‌ను తగ్గించుకుని సరుకులు ఇతర రిటైల్‌ షాపులకన్నా తక్కువకు ఇస్తాయి. పోటీ పూర్తిగా తొలగిపోగానే ధరలు పెంచేస్తాయి. వాల్‌మార్ట్‌ ఎక్కడైనా సాధారణంగా అనుసరించే వ్యూహమే ఇది. దీనివల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోతారు. భారత దేశంలో పది లక్షలకు పైగా జనాభా కలిగిన పట్టణాలు నేడు 53 దాకా ఉన్నాయి. మొదట వీటిని తమ గుప్పెట్లో పెట్టుకుంటాయి. తరువాత వీటిని కేంద్రాలుగా చేసుకుని గ్రామీణ ప్రాంతాలకు కూడా తమ రిటైల్‌ చైన్‌ను విస్తరింపజేస్తాయి.
ఎఫ్‌డిఐని ఆహ్వానించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం తెస్తున్న వాదనలో ఏమాత్రం పసలేదు. ఎందుకంటే ఈ పట్టణాల్లో వాల్‌ మార్ట్‌ నెలకొల్పే స్టోర్స్‌లో గరిష్టంగా పది వేల మంది ఉద్యోగులుంటారు. కానీ, ఈ స్టోర్‌ వల్ల ఉపాధి కోల్పోయే చిల్లర వర్తకుల సంఖ్య దీనికి అనేక రెట్లు అధికంగా ఉంటుంది. ఈ లెక్కన దేశవ్యాపితంగా నాలుగు కోట్ల మందికిపైగా ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. హిందూస్థాన్‌ లీవర్స్‌ లిమిటెడ్‌ సంస్థ 80 వేల కోట్ల పెట్టుబడితో రిటైల్‌ రంగంలోకి ప్రవేశించి 43,540 మందికి ఉపాధి కల్పిస్తే, దాని ప్రవేశం వల్ల ఉపాధి కోల్పోయినవారు 80 లక్షల మంది దాకా ఉన్నారు. కాబట్టి విదేశీ, బహుళజాతి సంస్థలు రిటైల్‌ రంగంలోకి రావడం వల్ల అదనంగా లభించే ఉద్యోగాలేమీ ఉండకపోగా, ఉన్న ఉపాధి ఊడిపోతుంది. కాకర కాయ దగ్గర నుంచి కంప్యూటర్ల దాకా అన్నిటినీ విక్రయించే ఈ రాకాసి వాల్‌మార్ట్‌ల ప్రభావం ఒక్క చిలర్ల వర్తక రంగానికే పరిమితం కాదు, తత్సంబంధితమైన చాలా రంగాలపై అది ప్రభావం చూపుతుంది. మన దేశంలో 69 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయంపైనా ఇది ప్రభావం చూపిస్తుంది. గత పదిహేనేళ్లలో రెండున్నర లక్షల మంది రైతుల ఆత్మహత్యలతో సంక్షుభితమైన వ్యవసాయ రంగం మరింత దిగజారితే ఈ రంగంలో ఉపాధి కోల్పోయేవారి సంఖ్య ఆ మేరకు పెరుగుతుంది. ఇది దేశంలో తీవ్ర అశాంతికి దారితీసే ప్రమాదముంది. అందుకే ఇది చాలా సునిశితమైన అంశం. దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా విస్తారమైన దేశీయ రిటైల్‌ మార్కెట్‌లోకి 51 శాతం విదేశీ ఫైనాన్స్‌ను అనుమతిస్తూ కేబినెట్‌ నిర్ణయించడం దేశ ప్రయోజనాలకే హానికరం. దీనిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబరు1న దేశ వ్యాపితంగా జరుగుతున్న ఆందోళనకు అన్ని తరగతుల ప్రజానీకం మద్దతు తెలపాలి. (Prajasakti, 30/11/2011)

Saturday, November 19, 2011

సజీవ దృశ్య చిత్రణ గోగొల్ 'ఓవర్ కోటు'


సవ్వడి డెస్క్ - కె. ఆనందాచారి (prajasakti 23/10/2011)
రష్యన్‌ రచయితలందరి పక్షాన మహారచయిత దొస్తొయేవ్‌స్కీ ''మేమందరమూ గోగొల్‌ 'ఓవర్‌కోటు' నుండి తయారైన వాళ్ళమే'' అన్నాడంటే ప్రఖ్యాత రష్యన్‌ నవాలాకారుడు, నాటకకర్త, కథారచయిత, కవి నికొలారు వసీరియోవిచ్‌ గోగొల్‌ విశిష్టత మనకు అర్థమవుతుంది. గడచిపోయిన నా జీవితంలోని సంతోషాలను మాత్రమే ఈ ప్రపంచం చూసింది కానీ నా కన్నీళ్ళను కాదు' అన్న గోగొల్‌ ప్రఖ్యాతమైన 'ఓవర్‌కోటు' కథను ఒక మారు పరికిద్దాము.
అది సెంట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతం. అకాకి అకియోవిచ్‌ ఒక డిపార్ట్‌మెంట్‌లో గుమస్తా. పొట్టిగా వుంటాడు. ఈ గుమస్తా గిరి ఉద్యోగం కోసమే పుట్టినట్టు వున్నాడని అందరూ అనుకుంటారు. నిజంగా చాలా అమాయకుడు. ఆఫీసూ, పని తప్ప ఏదీ తెలియనివాడు. ఒకే పనిలో ఎంతోకాలంగా వుంటున్నాడు. ఉత్తరాలకి, కాగితాలకీ, దస్తావేజులకీ నకళ్ళు రాసే కాపీయిస్టుగా వుండటమంటేనే అతనికి ఇష్టం. ప్రమోషనిచ్చినా నిరాకరించాడు. డిపార్ట్‌మెంట్‌లో అతడంటే ఎవరూ పిసరంత గౌరవం చూపరు. ఆఖరికి బంట్రోతు కూడా. సిరస్తదార్లు అతన్ని ఎందుకూ కొరగానట్లుగా అదొక మోస్తరు దాష్టీకపు తిరస్కార భావంతో చూస్తారు. హెడ్డు గుమస్తా ఓ కాగితం అతని ముఖంపై పడేసి నఖలు చేసి పెట్టమని చెప్పేవాడు.తోటి గుమస్తాలు, కుర్రకారు ఉద్యోగులు వేళాకోళం చేస్తూ వెటకారాలాడేవారు. నెత్తి మీద కాగితం ముక్కలు విసిరి వెక్కిరించేవారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా తనముందు ఎవరూ లేనట్టు తన పని తాను చేసుకుంటూ పోయేవాడు అకాకి అకియోవిచ్‌. ఎపుడన్నా మరీ చికాకుపుడితే 'నన్ను చంపకండి బాబూ' అని మాత్రమే అనేవాడు.
అతని ఉద్యోగ చిహ్నమైన పొడుగు కోటుకు మొదట వుండిన ఆకుపచ్చ రంగు ఏనాడో వెలసిపోయి, అదొక చిత్రమైన గోధుమ ఛాయ వచ్చింది. ఈ కోటు కాలరు బిగుతుగా, సన్నగా అయిపోయింది. ఎక్కడైనా మాసికలు వేయాల్సి వస్తే కాలరు నుండి తీసి వేయించేవాడు. చీకిపోయి పలుచబడ్డ కోటులో నుండి లోపల ధరించే 'కపోట్‌' (గౌను) కనిపిస్తూ వుండేది. ఈ కోటు గురించి ఎప్పుడూ ఆఫీసు వాళ్ళు అనేక జోకులు పేలుస్తుంటారు.
అయితే సంవత్సరానికి నాలుగు వందల రూబుళ్ళతో బ్రతుకు సాగిస్తున్న పీటర్స్‌బర్గ్‌లో ఒక పరమ శత్రువు వున్నాడు. గాఢంగా వీచే చలిగాలే ఆ శత్రువు. సూదులతో పొడుస్తూ, కొడుతున్నట్టుగా వీచే గాలులు ఇంటి నుండి ఆఫీసుకు పోయే ఉద్యోగస్తులకు ప్రాణాలు తీసే శత్రువు లాంటిదే. చీకిపోయి పలుచబడ్డ కోటు గుండా అకాకి అకియోవిచ్‌ శరీరాన్ని చలిగాలులు తాకుతూ కరుడుగట్టించేస్తూ వున్నాయి. తెంపులుపడ్డ కోటును మరమ్మతు చేయించాలనుకుంటాడు. పెట్రోవిచ్‌ అనే దర్జీ వద్దకు వెళ్ళి చాలా మర్యాదగా మాసిక వేయమంటాడు. దాన్ని తిరగేసి మరగేసి చూసిన పెట్రోవిచ్‌ లాభం లేదంటాడు. ఏదో ప్రయత్నం చేయమంటాడు. పూర్తిగా చీకిపోయింది. మాసికలేసినా ఆగదని, తక్కువ ధరకే కొత్త కోటు కుట్టిస్తానని దర్జీ చెబుతాడు. ఏం చేయాలో తోచక ఇంటికి తిరిగి వచ్చి, అదేపనిగా ఆలోచిస్తూ ''ఇలా జరిగిందా?... అనుకోలేదే....'' పరధ్యానంగా ఆలోచిస్తూ రెండోసారి పెట్రోవిచ్‌ని కలిసి అడుగుతాడు. అయినా లాభం లేకపోవడంతో కొత్త ఓవరుకోటు కుట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని నిర్ణయానికి వచ్చి డబ్బుల కోసం ఆలోచిస్తాడు. పొదుపు చర్యలు ప్రారంభిస్తాడు. డబ్బాలో చిల్లర డబ్బులు వేస్తూ దాచడం మొదలుపెడతాడు. ఒక సంవత్సరం వరకు ఖర్చు తగ్గించాలనుకుని, టీ త్రాగడం మానేస్తాడు. చీకటి పడగానే క్రొవ్వొత్తి వెలిగించడం మాని, ఇంటి యజమాని దీపం వద్ద రాసుకుంటాడు. చెప్పులు అరగకుండా మునివేళ్ళపై నడుస్తాడు. తరచూ చాకలికి బట్టలు వేయకుండా జాగ్రత్తపడతాడు. కొత్త ఓవరుకోటు కుట్టించుకోవడం తన జీవిత లక్ష్యం అవుతుంది. కొత్త ఓవరుకోటు మార్టెన్‌ బొచ్చు కాలరు పెట్టించుకోవడం గురించిన ధ్యాసలో మొదటిసారి ఆఫీసులో నఖలు రాయడంలో జరిగిన పొరపాటుకు నాలిక కరచుకున్నాడు కూడా. కొత్త కోటు ఆలోచన తన కళ్ళల్లో కొత్త కాంతిని నింపేది. ఆఫీసువాళ్ళు ఇచ్చిన బోనసు డబ్బు, తాను దాచుకున్న డబ్బుతో కోటు కుటించుకుంటాడు అకాకి అకియోవిచ్‌.
దర్జాగా కొత్త కోటు వేసుకుని ఆఫీసుకు వెళ్ళి అపురూపంగా దాన్ని ఆఫీసు గోడకు తగిలించి అటెండరును జాగ్రత్త సుమా అని చెబుతాడు. అతని కొత్త కోటు చూసి ఆఫీసువాళ్ళు అందరూ అభిమానిస్తారు. కొంత గర్వంగా, గౌరవంగా ఆనందిస్తాడు అకాకి. కొత్త కోటు సందర్భంగా ఉద్యోగులందరూ పార్టీ ఇవ్వమంటారు. కానీ అకాకి ఏమీ మాట్లాడడు. ఎంతకు కుదరకపోయే సరికి హెడ్‌గుమస్తా నేనే పార్టీ ఇస్తాను. ఈ రోజు సాయంత్రం అందరూ నా ఇంటికి రండి అంటాడు. ముందు రానని చెప్పినా ఆఖరికి అకాకి కూడా వస్తానంటాడు. హెడ్డుగారి ఇంటిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళతాడు. పార్టీ పూర్తయ్యేసరికి చాలా రాత్రవుతుంది. కాస్త భయం భయంగా పెద్ద పెద్ద అడుగులేస్తూ ఇంటికి వస్తూ వుండగా, ఇద్దరు దొంగలు ఎదురుపడి 'ఈ ఓవరు కోటు మాది 'ఇచ్చేరు' అంటూ బెదిరించి బలవంతంగా గుంజుకుని పారిపోతారు. ఏమి చేయాలో తోచక ఆందోళనతో, దుఃఖంతో లబోదిబోమంటూ ఆ దగ్గరలోనే వున్న పోలీసుకు విషయం చెబుతాడు. అతను ఏమీ చేయలేకపోతాడు. గందరగోళంతో పరుగెత్తుకుంటూ ఇల్లు చేరుకుంటాడు అకాకి.
ఇంటి యజమానురాలు అతని ఆందోళనను గమనించి విషయం తెలుసుకుంటుంది. ఓదారుస్తుంది. తెల్లవారి పోలీసు సూపరిండెంట్‌కు ఫిర్యాదు చేయబోగా అసలు నువ్వు అర్థరాత్రి ఎందుకు వీధిలో తిరుగుతున్నావు. ఏం పని? అని లక్ష ప్రశ్నలు సంధిస్తాడు. ఆఫీసువాళ్ళు కోటుపోయిన విషయాన్ని తెలుసుకుని అకాకిని ఓదారుస్తారు. కొత్త కోటుకొనేందుకు చందాలు వేసుకోవడానికి కుదరక వూరుకుంటారు. పోలీసులకు బదులు ఒక అతిముఖ్యమైన మనిషి వున్నాడు. అతనికీ కోటు గురించి చెబితే వెంటనే తేల్చుతాడని ఆఫీసువాళ్లు సలహా ఇస్తారు.
ఆ అతిముఖ్యమైన మనిషిని కలిసేందుకు అకాకి వెళ్తాడు. అతను స్నేహితునితో మాట్లాడుతూ ఆఫీసు ముందు అకాకిని చాలాసేపు కూర్చోపెడతాడు. చివరగా ఆ ముఖ్యమైన మనిషిని కలుసుకోగా - ''నీకు ఎలా చెప్పుకోవాలో పద్ధతి తెలియదా? ముందు సెక్రటరీకి అర్జీ పెట్టుకోవాలి. ఆ తరువాత నా వద్దకు రావాలి. ఈ మాత్రం తెలియదా! అంటూ గద్దిస్తూ తిడతాడు. అతిముఖ్యమైన మనిషి చాలా డాబూదర్పం వున్నవాడు. ఈ మధ్యనే పెద్ద మనిషిగా ఎదిగినవాడు. అతన్ని చూసి వణుకుతూ చెమటలు పట్టగా అకాకి ''క్షమించాలి సెక్రటరీలను నమ్మలేమని, నా ఓవరు కోటు పోయిన విషయం మీతోనే చెప్పాలని వచ్చాననగానే?'' ఏమిటి? నువ్వెరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎంత గుండె ధైర్యం? మా ఉద్యోగులపై అభాండాలు వేస్తావా? నీకేమైనా మతిపోయిందా అంటూ బిగ్గరగా అరుస్తూ ఇంతెత్తున లేస్తాడు ఆ అతిముఖ్యమైన మనిషి. గడగడ వణికిపోతూ మూర్చవచ్చినంత పని అవుతుంది. భయపడటం చూసి ఆ ముఖ్యుడు చాలా సంతోషపడిపోతాడు. వెంటనే మేడమెట్లు దిగి, కాళ్లూ చేతులు చచ్చు బడిపోయినట్లు స్పృలేనట్లుగా గాలిలో నడుచుకుంటూ పడుతూ లేస్తూ ఇంటికి చేరుతాడు అకాకి.ఇంటికి వచ్చిన మరుక్షణమే మంచం పడతాడు. విపరీతమైన జ్వరం వస్తుంది. ఇంటి యజమానురాలు డాక్టరును పిలిపించగా డాక్టరు ''రోగం చాలా ముదిరిపోయింది. ఇక కష్టం'' అని చెప్పి వెళ్లిపోతాడు. జ్వరంతో, కోటును తలచుకొంటూ, కలవరిస్తూ అతని ఏకైక వస్తువు ఓవరుకోటు చుట్టూ మనస్సు పరిభ్రమిస్తుండగా శాశ్వతంగా కన్ను మూస్తాడు అకాకి అకియోవిచ్‌.
అతను పోయింతర్వాత కొన్ని రోజుల వరకూ ఎవరూ అతని గురించి అనుకునేవారే లేకపోయినా గవర్నమెంటు గుమాస్తా రూపంలో దయ్యం ఒకటి చోరీ అయిన ఓవరు కోటు కోసం వెతుకుతూందని, ఎలాంటి మనుషులనైనా, కోటు ధరించిన వారి నుండి కోటును నిలువుగా లాగేసుకుంటోందని ఎవరినీ లెక్కచేయటం లేదనే పుకారు ఒకటి పీటర్స్‌బర్గ్‌ అంతటా వ్యాపించింది. ఇదిలా వుండగా అతి ముఖ్యమైన వ్యక్తి అంతఃకరణం నిజంగా చివుక్కుమంది. అతడు వాస్తవంగా సహృదయుడే. మానవుని పట్ల సానుభూతి వున్నవాడే కానీ అవి పైకి రాకుండా అతని హోదా వాటిని అణచివేస్తూంటుంది. అకాకి పట్ల కొంత విచారపడి, అధికార్లను చివాట్లు పెట్టి అతన్ని పిలుచుకురమ్మంటాడు. కానీ అతను చనిపోయాడని తెలిసి చాలా బాధపడతాడు. అకియావిచ్‌ ఆకస్మాత్తుగా చనిపోయాడని ఆ రోజంతా మధనపడిపోయాడు. ఈ బాధ నుండి తప్పించుకొనేందుకు స్నేహితుని ఇంటికి వెళతాడు ఆ అతిముఖ్యమైన మనిషి. అక్కడ స్నేహితులతో చాలా సరదాగా, సంతోషంగా గడిపి ఇంటికి వచ్చేందుకు బండి ఎక్కి బయలు దేరుతాడు. రాత్రివేళ మంచుతో కూడిన గాలి విపరీతంగా కొడుతున్నట్లు వీస్తుంటుంది. ఆ గాలి వేగానికి బండిని ఆపేస్తాడు బండి నడిపేవాడు. గాలికి ముఖ్యమైన మనిషి వేసుకున్న కోటు అటూ ఇటూ ఎగిరిపడుతూ వుంటుంది. ఈ లోపుగా ఎవరో తన ఓవరు కోటు కాలరు పట్ట్టుకుని లాగుతారు. ఎవరా అని చూసేసరికి ఇంకెవరు చిరిగి పీలకలయిన ఓవరు కోటు వేసుకున్న గవర్నమెంటు గుమాస్తా అకియోవిచ్‌. అతన్ని చూసి భయపడిపోతాడు. మంచులాగునే తెల్లగా చచ్చిన వాడి ముఖంలా కనిపించి ఆ ముఖ్యమైన మనిషి వణికిపోతాడు.
''ఓహో చివరికి దొరికావే... నా ఓవరు కోటు పోయిందని మొరపెట్టుకుంటే, గడ్డి పోచంత లక్ష్యం లేకపోయిందే, పైగా నన్ను తిట్టిపోసారు. నీ ఓవరు కోటు నాదే'' అని లాగేసుకుంటుంది అకియోవిచ్‌ దయ్యం. ఆ అతిముఖ్యమైన మనిషి పై ప్రాణాలు పైనే పోతాయి. ''వెంటనే బండి ఇంటికి పోనీరు'' అంటూ నడిపేవాన్ని కేకవేసి వణుకుతూ ఇంటికి వస్తాడు. ఆ ఘటన ఆ అతి ముఖ్యుడైన వ్యక్తిపై ప్రగాఢమైన ప్రభావం కలిగించింది. ఆనాటి నుండి అతడు గుమాస్తాలను తిట్టడం మానేసాడు. గుమాస్తాలు చెప్పే విషయాలు సావధానంగా వినేేవాడు. ఎవరినీ అనవసరంగా గద్దించేవాడు కాదు. ఆనాటి నుండి ఆ గవర్నమెంటు గుమాస్తా దయ్యం కనపడడం మానేసింది. అది ఆ అతి ముఖ్యమనిషి ఓవరు కోటుతో సంతృప్తి చెంది వుంటుంది. అయినా గానీ ఇదిగో పులి అంటే అదిగో తోక అనేవాళ్లు దయ్యం ఇంకా తిరుగుతుందనే చెప్పుకుంటుండేవారు. గవర్నమెంటు ఆఫీసులో వేళాకోళాలు, ఎగతాళి చేయడాలు ఏవీ ఇప్పుడు జరగడం లేదు.
నూటాయాభై సంవత్సరాలకు పూర్వం రాసిన ఈ కథ ఆద్యంతం అందర్నీ చదివిస్తుంది. ఇప్పటికీ అకాకి పాత్రల్లాంటివి మనకు అక్కడక్కడ కనిపిస్తాయి కూడా. దుర్మార్గమైన వారు కూడా వారి హోదా, పదవులవల్ల అలా తయారయ్యారని విశదపరుస్తాడు గోగోల్‌. తప్పు చేసిన వారిలో, దుర్మార్గంగా వ్యవహరించిన వారి అంతరంగంలో తాము చేసింది సరైనది కాదనే భావన వుంటుందని, పరిసరాల ప్రభావంతో మనుషులు మారతారని కథవల్ల తెలుస్తుంది. దయ్యం వల్ల అందరూ మారటంగా మనకు కనిపించినా, అసలు వారి అంతరంగాల్లో వున్న తప్పు చేశామన్న గుబులే మారటానికి అసలు కారణం. వివిధ మనస్తత్వాల చిత్రణ ఎంతోగొప్పగా వుంటుంది. వాతావరణం, సన్నివేశాల వర్ణన మనల్ని అందులోకి తీసుకుపోతుంది. దయ్యం సినిమాలతో అందరినీ భయపెట్టించే మన రాంగోపాల్‌వర్మ గోగొల్‌ సృష్టించిన దయ్యం లాంటి దయ్యాలను సృష్టిస్తే ఎంత బాగుంటుందోనిపించింది.
(రాచకొండ విశ్వనాథశాస్త్రి "అల్పజీవి" నవల, గోగోల్ "ఓవర్ కోటు" స్ఫూర్తితో రాసినదే--అశోకబాబు)