''రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రాకతో పొలంలో పండిన ఉత్పత్తులు నేరుగా స్టోర్స్‌కు చేరతాయి. వృథా గణనీయంగా తగ్గుతుంది. రైతులు మెరుగైన ప్రతిఫలాన్ని పొందుతారు.''
- భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో ఒక భాగం.
కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మల్టీ బ్రాండ్ వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో వస్తున్న బెస్ట్‌బై, వాల్‌మార్ట్, క్యారీఫోర్, టెస్కో లాంటి బహుళజాతి సంస్థలకు ఆహ్వానం పలికితే సాధారణ ఉత్పత్తిదారుడు జాడలేకుండా పోతాడు. ఎఫ్‌డిఐ నుండి సహాయం పొందిన చిల్లర వర్తకులు దేశీయ ఉత్పత్తిదారుల నుండి 30 శాతం ఉత్పత్తులు సేకరిస్తామని, తద్వారా వీరి ఉత్పత్తులకు ధరలు పెరుగుతాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. అంటే 70 శాతం ఉత్పత్తులు విదేశాల నుండి దిగుమతి చేసుకున్నవే ఉంటాయన్న మాట. ఆ ముప్పయి శాతం కూడా చిన్న, మధ్య తరగతి రైతులు చేసే వ్యవసాయోత్పత్తులే అనుకుంటే పొరపాటు. వీటిని పెద్ద మొత్తంలో సేకరించేందుకు టెండరు పిలుస్తారు. మంచి నాణ్యత ఉన్నవాటినే తీసుకుంటామంటారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి సేద్యం చేసినప్పుడే వారు నిర్దేశించిన ప్రమాణాలను అందుకోవడం సాధ్యం. భారత దేశంలోని బడుగు రైతుకు అంత సామర్థ్యం ఎక్కడుంటుంది? వ్యవసాయ రంగంలోకి ఎఫ్‌డిఐని ఆహ్వానించడం, కార్పొరేట్ వ్యవసాయం దిశగా మళ్లించేందుకు యత్నిస్తున్న పరిస్థితుల్లో ఇది సహజంగానే ఆ వర్గాలకే ఉపయోగపడుతుంది. సాంప్రదాయక వ్యవసాయాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. రిటైల్ రంగంలో సింహ భాగం ఆహార ఉత్పత్తులదే కాబట్టి ఈ రంగంపై విదేశీ, బహుళజాతి సంస్థల ఆధిపత్యం వహించడమంటే అది మన ఆహార భద్రతను పరాధీనం చేయడమే కాగలదు. నేడు 80 దేశాలలో ఈ గుత్త సంస్థలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. చిన్న, మధ్య తరహా ఉత్పత్తిదారులకు మంచి ధర లభిస్తే ఆ దేశాలలో ఎందుకు ఆందోళనలు సాగుతున్నట్లు? పెట్టుబడిదారీ ఆర్థిక వేత్తలు మాత్రం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగా ఉత్పత్తిదారులు, వినియోగదారులు లబ్ధి పొందుతారని చెప్పడం వట్టి బోగస్.
బిగ్ బజార్లు, స్పెన్సర్ మార్కెట్‌లు, మెట్రోల ప్రవేశంతో ఇప్పటికే అనేక మంది వీధి వ్యాపారులు, చిల్లర వ్యాపారులు చితికిపోతున్నారు. రేపు ఈ వాల్ మార్ట్‌లు, టెస్కోలు వంటి బకాసుర సంస్థలు రిటైల్‌లోకి నేరుగా ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశం వల్ల దేశానికి మంచి కన్నా చెడే ఎక్కువనేది వివిధ దేశాల అనుభవాలు తెలియజేస్తున్నాయి. వాల్ మార్ట్, ఫోర్‌క్యారీయర్, టెస్కో వంటి బహుళజాతి సంస్థల ధాటికి దేశంలోని చిల్లర వర్తకులు తట్టుకుని నిలదొక్కుకోవడం సాధ్యమేనా? వాల్‌మార్ట్‌నే తీసుకుందాం. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ వ్యాపార సంస్థ. 2004లో దాని టర్నోవర్ 25,600 కోట్ల డాలర్లు. ప్రతి యేటా దాని టర్నోవర్‌లో వృద్దిరేటు 12-13 శాతం దాకా పెరుగుతూ వస్తోంది. నికర లాభం 900 కోట్ల డాలర్లు. 2004 నాటికి ఈ సంస్థ ప్రపంచ వ్యాపితంగా 4,806 స్టోర్స్‌ను కలిగి ఉంటే అందులో పని చేసే సిబ్బంది 14లక్షల మంది మాత్రమే. వీటిలో 1355 స్టోర్స్ అమెరికా వెలుపలే అది నిర్వహిస్తున్నది. ఒక్కొక్క స్టోర్ విస్తీర్ణం సగటున 85వేల చదరపు అడుగులు. ఒక్కో స్టోర్ సగటు టర్నోవర్ 5,100 కోట్ల రూపాయలు. ఇది భారతీయ రిటైల్ వ్యాపారి టర్నోవర్ కన్నా వేల రెట్లు ఎక్కువ. భారత్‌లోని కోటి 20 లక్షల రిటైల్ షాపుల్లో కేవలం 4 శాతం మాత్రమే 500 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగినవి. అవి కూడా కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలోనివే.
మిగతావన్నీ సాంప్రదాయకంగా నడుపుకుంటున్న కిరాణా దుకాణాలు, పాన్ షాపులే. స్థానిక రిటైల్ షాపులు మూతపడేలా చేసేందుకు ఈ బహుళజాతి సంస్థలు మొదట కొంతకాలం పాటు లాభం మార్జిన్‌ను తగ్గించుకుని సరుకులు ఇతర రిటైల్ షాపులకన్నా తక్కువకు ఇస్తాయి. పోటీ పూర్తిగా తొలగిపోగానే ధరలు పెంచేస్తాయి. వాల్‌మార్ట్ ఎక్కడైనా సాధారణంగా అనుసరించే వ్యూహమే ఇది. దీనివల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోతారు. భారత దేశంలో పది లక్షలకు పైగా జనాభా కలిగిన పట్టణాలు నేడు 53 దాకా ఉన్నాయి. మొదట వీటిని తమ గుప్పెట్లో పెట్టుకుంటాయి. తరువాత వీటిని కేంద్రాలుగా చేసుకుని గ్రామీణ ప్రాంతాలకు కూడా తమ రిటైల్ చైన్‌ను విస్తరింపజేస్తాయి.
ఎఫ్‌డిఐని ఆహ్వానించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం తెస్తున్న వాదనలో ఏమాత్రం పసలేదు. ఎందుకంటే ఈ పట్టణాల్లో వాల్ మార్ట్ నెలకొల్పే స్టోర్స్‌లో గరిష్టంగా పది వేల మంది ఉద్యోగులుంటారు. కానీ, ఈ స్టోర్ వల్ల ఉపాధి కోల్పోయే చిల్లర వర్తకుల సంఖ్య దీనికి అనేక రెట్లు అధికంగా ఉంటుంది. ఈ లెక్కన దేశవ్యాపితంగా నాలుగు కోట్ల మందికిపైగా ఉపాధి కోల్పోయే ప్రమాదముంది. హిందూస్థాన్ లీవర్స్ లిమిటెడ్ సంస్థ 80 వేల కోట్ల పెట్టుబడితో రిటైల్ రంగంలోకి ప్రవేశించి 43,540 మందికి ఉపాధి కల్పిస్తే, దాని ప్రవేశం వల్ల ఉపాధి కోల్పోయినవారు 80 లక్షల మంది దాకా ఉన్నారు. కాబట్టి విదేశీ, బహుళజాతి సంస్థలు రిటైల్ రంగంలోకి రావడం వల్ల అదనంగా లభించే ఉద్యోగాలేమీ ఉండకపోగా, ఉన్న ఉపాధి ఊడిపోతుంది. కాకర కాయ దగ్గర నుంచి కంప్యూటర్ల దాకా అన్నిటినీ విక్రయించే ఈ రాకాసి వాల్‌మార్ట్‌ల ప్రభావం ఒక్క చిలర్ల వర్తక రంగానికే పరిమితం కాదు, తత్సంబంధితమైన చాలా రంగాలపై అది ప్రభావం చూపుతుంది. మన దేశంలో 69 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయంపైనా ఇది ప్రభావం చూపిస్తుంది. గత పదిహేనేళ్లలో రెండున్నర లక్షల మంది రైతుల ఆత్మహత్యలతో సంక్షుభితమైన వ్యవసాయ రంగం మరింత దిగజారితే ఈ రంగంలో ఉపాధి కోల్పోయేవారి సంఖ్య ఆ మేరకు పెరుగుతుంది. ఇది దేశంలో తీవ్ర అశాంతికి దారితీసే ప్రమాదముంది. అందుకే ఇది చాలా సునిశితమైన అంశం. దీని పర్యవసానాల గురించి ఆలోచించకుండా విస్తారమైన దేశీయ రిటైల్ మార్కెట్‌లోకి 51 శాతం విదేశీ ఫైనాన్స్‌ను అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయించడం దేశ ప్రయోజనాలకే హానికరం. దీనిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా డిసెంబరు1న దేశ వ్యాపితంగా జరుగుతున్న ఆందోళనకు అన్ని తరగతుల ప్రజానీకం మద్దతు తెలపాలి. (Prajasakti, 30/11/2011)
No comments:
Post a Comment