గుడిపూడి విజయరావు(Prajasakti, 10/11/2011)
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ప్రపంచంలోనే అతిసంపన్నమైన అమెరికాలోనే ఈ సంక్షోభం నాలుగేళ్ల క్రితం మొదలయి బెయిలవుట్పేరుతో బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు ప్రభుత్వం సమకూర్చిన నిధులతో మెరుగవుతుందన్నట్లు కనిపించినా, నిరుద్యోగసమస్య తగ్గతకపోగా మరింత తీవ్రమై అమెరికా మరో సంక్షోభం బారిన పడనున్నదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బెయిలవుట్ ఒక శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైనాన్స్ సంస్థలకు, బడా పెట్టుబడిదారులకైతే, మిగిలిన మా 99 శాతం మంది పరిస్థితి ఏమిటి అని నిలదీస్తూ అమెరికాలో ఫైనాన్స్ పెట్టుబడికి కేంద్రమయిన వాల్‌స్ట్రీట్ ముట్టడిగా నిరసనోద్యమం ప్రారంభమైంది. ఇప్పుడది అమెరికా అంతటా వ్యాపించడమే కాకుండా ప్రపచంలోని ఇతర నగరాలకూ విస్తరించి ఫైనాన్స్ పెట్టుబడికి, దానికి మూలమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు తీవ్రమైన సవాలును విసురుతున్నది.
సంపన్న పెట్టుబడిదారీ ప్రపచంలో మరో ప్రధాన విభాగమైన యూరో ప్రాంతం తొలుత ధీమాగా ఉన్నప్పటికీ అది ఇప్పుడు అత్యంత తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి బయటపడటం ఎలా అన్న గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నది. ఐరోపా యూనియన్లో కొన్ని దేశాలు దివాళా అంచుకు చేరుకున్నాయి. ఇటీవల కేన్స్లో జరిగిన సంపన్న దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జి20 సమావేశం గ్రీస్ సంక్షోభాన్ని నివారించడం అనే ఏకైక అంశం చుట్టూనే తిరగడం సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నది. యూరో ప్రాంత దేశాలు ఒక ఆర్ధిక యూనియన్గానే కాక, ఉమ్మడి కరెన్సీ యూరోను సైతం ఏర్పరచుకుని బలమైన కూటమిగా మారాయని అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఒక దేశం సమస్య ఆ దేశానికే పరిమితం కాకుండా మిగతా అన్ని దేశాలకూ సమస్యగా మారడంతో అవి ఇప్పుడు సంక్షోభ భయాన్ని ఎదుర్కొంటున్నాయి.గ్రీస్ ప్రభుత్వ రుణభారం వూహలకందని రీతిలో పెరిగి పోయింది. కేవలం 1.13 కోట్ల జనాభా కలిగిన ఆ దేశ రుణభారం 36,000 కోట్ల యూరోలు. ఇది ఆ దేశపు స్థూలజాతీయోత్పత్తి (జిడిపి) కన్నా ఒకటిన్నర రెట్లకుపైగా 160 శాతానికి చేరింది. దీనిలో నాల్గింట మూడింతలు దేశం బయటినుండి వచ్చిందే. ఇంతటి భారీ రుణాన్ని తిరిగి చెల్లించాలంటే అవసరమైన నిధులను ఎగుమతులను అధికం చేసుకోవడం ద్వారా సమకూర్చుకోవాలి. కాని ప్రపంచ వ్యాపితంగా మాంద్యం వ్యాపించి ఉన్న నేటి తరుణంలో ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశం లేదు. సాధారణంగా అన్ని దేశాల మాదిరిగా తన కరెన్సీ మారకం విలువను తగ్గించుకొని ఎగుమతులకు గిరాకీ పెంచుకునే అవకాశమూ దానికి లేదు. ఉమ్మడి కరెన్సీ యూరో మారకం విలువను నిర్ణయించే అధికారం గ్రీసుకు లేదు. ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలను తీసుకోవడం ఒక్కటే మార్గం. కాని ఆ సంస్థ ఇచ్చే రుణాలకు అనేక షరతులు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వ వ్యయం తగ్గింపు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, ఉద్యోగాల తగ్గింపు, వేతనాల కోత- లాంటి షరతులకు తలొగ్గి అలాంటి రుణాలను తీసుకొచ్చింది. కొన్ని ప్రభుత్వాలు రుణాలు అందించినా అవీ పరిమితమే. రుణాలు తెచ్చినప్పటికీ దాన్ని అనుసరించే షరతులను అమలుచేయడం గ్రీస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు. ప్రజల నుండి పెద్దఎత్తున నిరసన ఎదురవుతున్నది. ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఏర్పడింది.
గ్రీస్ ఈ సంక్షోభం నుండి బయటపడటానికి ఒక మార్గం యూరో నుండి వైదొలగి తన కరెన్సీ విలువను తానే నిర్ణయించుకొని తన తంటాలు తాను పడటం. కాని దానికి జర్మనీ, ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ యూనియన్‌లోని బలమైన దేశాలు అంగీకరించడానికి సిద్ధంగా లేవు. ఐరోపా యూనియన్ ఏర్పడిన తర్వాత దానిలో అభివృద్ధి చెందిన దేశాలు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు చౌకగా ఎగుమతులు చేయడం ద్వారా లాభపడ్డాయి. పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల అభివృద్ధి ఈ క్రమంలో మరింత వెనకపట్టుపట్టింది. ఈ దేశాలు తమ అవసరాల కోసం విదేశీ రుణాలపైనే ప్రధానంగా ఆధారపడ్డాయి. ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలలోని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ వద్ద పడిఉన్న నిధులను రుణంగా అందించి వడ్డీని పొందుతూ వచ్చాయి. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ ఎగుమతులను అధికం చేసుకోవడానికి కూడా ఇలాంటి రుణాలు తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు చేరడాన్ని ప్రోత్సహించాయి. అమెరికా మాదిరిగానే ఐరోపా యూనియన్ అభివృద్ధి కూడ రుణం ఆధారంగా జరిగిన అభివృద్ధిగా మారింది.
గ్రీస్ ప్రభుత్వం రుణం చెల్లించలేక దివాళా తీస్తే దానికి రుణాలందించిన బ్యాంకులు నష్టాలపాలవుతాయి. ఇవి కేవలం దేశీయ బ్యాంకులు మాత్రమే కాదు. విదేశీ బ్యాంకులు కూడ గణనీయంగా ఉన్నాయి. ఇలా గ్రీస్ ప్రభావం దేశ దేశాల బ్యాంకులపై పడి అంతర్జాతీయ సమస్యగా మారుతోంది. సంక్షోభం ఇలా వ్యాపించకుండా నివారించడానికే జి20 దేశాల సమావేశాలలో ప్రయత్నం జరిగింది. గ్రీస్ లాంటి దేశాల మూలంగా ప్రధానంగా ప్రయోజనం పొందింది జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలే. కాని ఇప్పుడు గ్రీస్ సమస్యను పరిష్కరించే భారాన్ని మోయడానికి మాత్రం అవి ముందుకు రావడం లేదు. ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తున్నాయి. గ్రీస్ దివాళా తీస్తే మొత్తం ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం పడుతుంది కాబట్టి అన్ని దేశాలు దాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నట్లు వ్యవహరిస్తున్నాయి. జి20 దేశాల సమావేశాలలో గ్రీస్ సమస్యకు పరిష్కార భారాన్ని చైనా, ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడ స్వీకరించాలని ఒప్పించేందుకు ప్రయత్నం జరిగింది. కాని దానికి అవి అంగీకరించలేదు. పైగా చైనా లాంటి దేశం ఎగుమతులను తగ్గించి, దిగుమతులను పెంచే విధంగా తన యువాన్ మారకం విలువను పెంచాలన్న సంపన్న దేశాల విజ్ఞప్తులకు సైతం స్పందించడం లేదు. గ్రీస్తో పాటు ఐరోపా యూనియన్లో మూడవ అతిపెద్ద దేశమయిన ఇటలీ పరిస్థితీ ఆందోళనకరంగా మారింది. ఇటలీ తన ఆర్థిక కార్యకలాపాలను ఐఎంఎఫ్ పర్యవేక్షించడానికి అంగీకరించిందంటే అది ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. ఆ దేశ ప్రధాని కూడ పదవినుండి వైదొలగడానికి సిద్ధపడ్డాడని వార్తలొస్తున్నాయి. ఇలాంటి ప్రపంచ వ్యాపిత సంక్షోభం ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది? తప్పనిసరిగా భారత్పైనా పడుతుంది. కాని మన పాలకులు మాత్రం దాని ప్రభావం అంతగా ఉండదనే చెబుతున్నారు. ఆర్థికాభివృద్ధి రేటు 9 శాతం కచ్చితంగా ఉంటుందని కొంతకాలం క్రితం చెప్పిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ దాన్ని తర్వాత 8 శాతానికి, ఇప్పుడు మరింతగా 7.6 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ సంపన్న దేశాల 1-2 శాతం అభివృద్ధి రేటుతో పోలిస్తే ఇది చాల ఎక్కువని, మన ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, త్వరలోనే ఆశించిన 9 శాతం లక్ష్యాన్ని చేరుకోవడమూ అసాధ్యం కాదన్నరీతిలో ఆయన మాటలుంటున్నాయి. కాని ఇది నిజమేనా?
భారత దేశపు ఎగుమతుల్లో అత్యధిక భాగం సంక్షోభం అతి తీవ్రంగా ఉందని ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అమెరికా, ఐరోపాలకే జరుగుతున్నాయి. భారత దేశం తన సరుకుల ఎగుమతుల్లో 20.2 శాతాన్ని ఐరోపా యూనియన్కు, 10.9 శాతాన్ని అమెరికాకు చేస్తున్నది. భారత దేశం మూడోవంతు సరుకులు ఎగుమతి చేసే దేశాలన్నీ సంక్షోభంలో కాని, తీవ్రం మాంద్యంలో కూరుకుపోయి ఉన్నాయి. భారత ఎగుమతుల్లో అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలకు 23.4 శాతం, చమురు ఎగుమతి చేసే ఓపెక్ దేశాలకు 21.1 శాతం జరుగుతున్నాయి. సంక్షోభం తీవ్రమయితే ఆసియా దేశాలు ఇలాగే మన సరుకులను దిగుమతి చేసుకుంటాయని చెప్పలేము. ఒపెక్ దేశాలు సైతం చమురు ధరలు తగ్గకుండా ఉంటేనే ఈ మాదిరి దిగుమతులు చేసుకుంటాయి. ప్రపంచ సంక్షోభం తీవ్రమయినపుడు చమురు ధరలు తగ్గించాలన్న వత్తిడి వాటిపైకి రాకపోదు. మనం గొప్పగా చెప్పుకునే సాఫ్ట్‌వేర్ ఎగుమతులు సైతం ఒక్క అమెరికాకే 61 శాతం జరుగుతున్నాయి. బ్రిటన్తో సహా ఐరోపా దేశాలకు 26.5 శాతం జరుగుతున్నాయి. సంక్షోభం ముదురుతున్న దశలో ఇదే రీతిన సాఫ్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతాయని ఆశించలేము. అందుచేత మన అభివృద్ధి గమనం ఆర్థిక మంత్రి చెబుతున్నంత సజావుగా ఉండబోదన్నది స్పష్టం. విదేశీ వాణిజ్యం, వాణిజ్యలోటుకు సంబంధించి తాజాగా విడుదలయిన గణాంకాల పట్ల విదేశీ వాణిజ్య విభాగం ఆందోళన వ్యక్తం చేస్తున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు మాసాల కాలంలో విదేశీ వాణిజ్యలోటు ఇంతకు ముందెన్నడూ లేనంతగా 93.7 బిలియన్ డాలర్లకు చేరింది.
సంక్షోభం నుండి బయటపడేందుకు, లేదా నివారించేందుకు జరిగే ప్రయత్నాలన్నీ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు నిధులను అందిస్తే, అవి అధికంగా రుణాలను అందించడం ద్వారా నిజ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు దోహదపడతాయన్న దృష్టిలోనే జరుగుతున్నాయి. కాని ఇలాంటి ఫైనాన్స్ పెట్టుబడులపై ఆధారపడటం వల్లనే ఈ సంక్షోభం ఇంత తీవ్రంగా మారిందన్నది గమనంలో ఉండటం లేదు. గతంలో మాదిరి ప్రభుత్వాలు నేరుగా ఉత్పాదక వ్యయాన్ని అధికం చేసి ఉపాధిని పెంచి, గిరాకీ పెరుగుదలకు దోహదపడటం లాంటి మార్గాన్ని మర్చిపోయారు. ప్రజల కొనుగోలు శక్తిని స్థిరంగా పెంచే మార్గాన్ని అనుసరించినప్పుడు మాత్రమే ప్రస్తుత సంక్షోభాల్లాంటి వాటికి పటిష్టమైన పరిష్కారం లభిస్తుంది.
No comments:
Post a Comment