Friday, November 18, 2011

ఉన్నమాటంటే ఉలుకెందుకు?


మీడియా ప్రజలకు కొంత వినోదం కూడా అందించాలన్న విషయం నిజమే. అయితే అది ప్రసారం చేసే కార్యక్రమాల్లో 90 శాతం కార్యక్రమాలు వినోద ప్రధానమైనవి, పది శాతం మాత్రమే సామాజిక- ఆర్థిక అంశాలకు సంబంధించినవైతే మీడియా ప్రాధాన్యతలు మారి బాధ్యతలు సరిగా నెరవేర్చనట్లే.
మీడియాపై నా అభిప్రాయాలను అనేక టెలివిజన్‌ ఇంటర్వ్యూల్లో చెప్పాను. కొన్ని దిన పత్రికల్లో వ్యాసాలు కూడా రాశాను. అయితే అనేక మంది, మీడియా వారితో సహా, నేను లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని, విపులీకరించాలని కోరారు. నేను లేవనెత్తిన కొన్ని అంశాలపై కొంత వివాదం నెలకొనడంతో వివరణ ఇస్తున్నాను.
భారత దేశం నేడు మన చరిత్రలో పరివర్తన చెందే దశలో ఉంది. ఫ్యూడల్‌ వ్యవసాయదారీ సమాజం నుండి ఆధునిక పారిశ్రామిక సామాజం దిశగా భారత దేశంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చరిత్రలో ఇది అత్యంత బాధాకరమైన, వేదన కలిగించే కాలం. పురాతన ఫ్యూడల్‌ సమాజం వేళ్లతో పెకిలింపబడుతూ విచ్ఛిన్నమైపోతోంది. కొత్త ఆధునిక పారిశ్రామిక సమాజం ఇంకా పూర్తిగా, బలంగా వేళ్లూనుకోలేదు. మన విలువలు పతనమవుతున్నాయి. అయితే వాటి స్థానంలో కొత్త విలువలు విస్తరించలేదు. ప్రతి ఒక్కటీ గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉంది. సంక్షోభంలో చిక్కుకుపోయి ఉంది. మాక్‌బెత్‌లో షేక్స్‌పియర్‌ చెప్పినట్లుగా ''మంచి చెడు అవుతోంది. చెడు మంచి అవుతోంది''.
16 నుండి 19 శతాబ్దం వరకు ఫ్యూడలిజం నుండి ఆధునిక సమాజం వైపు పయనిస్తున్న యూరప్‌ చరిత్రను చదివితే ఈ పరివర్తన కాలం పూర్తిగా సంక్షోభం, యుద్ధాలు, గందరగోళం, విప్లవాలు, అల్లర్లు, సామాజిక కల్లోలంతో కూడుకుని ఉంది. ఇటువంటి కొలిమిలో కాలిన తరువాతే యూరప్‌లో ఆధునిక సమాజం ఆవిర్భవించింది. భారత్‌ ప్రస్తుతం అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. మనం మన దేశ చరిత్రలో అత్యంత గడ్డుకాలంలో ఉన్నాం. ఈ పరిస్థితి నేను ఊహించినంతవరకు, మరో 15 నుండి 20 సంవత్సరాలపాటు కొనసాగుతుంది. ఈ పరివర్తన బాధ లేకుండా తక్షణమే చోటుచేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అయితే దురదృష్టవశాత్తు చరిత్ర అలా నడవదు.
ఈ పరివర్తనా సమయంలో, ఉదాహరణకు, స్వేచ్చా ఆలోచనలు, సమానత్వ ఆలోచనలు, మత స్వాతంత్య్ర (లౌకికవాదం) ఆలోచనలు యూరప్‌లో చైతన్యం వెల్లివిరిస్తున్న సమయంలో, ముఖ్యంగా అమెరికా, ఫ్రెంచ్‌ విప్లవ సమయంలో ఆలోచనలు, అలాగే మీడియా ఆలోచనలు అత్యంత ముఖ్యమైనవి. ఒక ప్రత్యేక చారిత్రాత్మక సమయంలో ఈ ఆలోచనలు బలమైన శక్తిగా ఆవిర్భవించాయి. యూరప్‌లో ఫ్యూడల్‌ వ్యవస్థ నుండి ఆధునిక వ్యవస్థకు మారే తరుణంలో మీడియా ( అప్పుడు ప్రింట్‌ మీడియా మాత్రమే ఉంది) అత్యంత గొప్ప, చారిత్రాత్మక పాత్ర పోషించింది.
నా అభిప్రాయంలో, భారత మీడియా కూడా యూరప్‌ మీడియా ( వ్యవస్థ మార్పు చెందుతున్న తరుణంలో) వ్యవహరించిన తీరులో ప్రగతిశీలక పాత్ర పోషించాలి. కులతత్వం, మతతత్వం, మూఢనమ్మకాలు, మహిళల అణచివేత మొదలైన వెనకబడిన, ఫ్యూడల్‌ ఆలోచనలపై వ్యతిరేక ప్రచారం నిర్వహించడం, ఆధునిక, హేతుబద్ధమైన శాస్త్రీయ ఆలోచనలు, లౌకికవాదం, సంయమనం వంటి సిద్ధాంతాలను ప్రోత్సహించాలి. ఒకానొక సమయంలో మీడియా మన దేశంలో గొప్ప పాత్ర పోషించింది.
వ్యవహర శైలి
భారత మీడియా, ముఖ్యంగా ప్రసార మీడియా అటువంటి ప్రగతిశీలక, సామాజికంగా బాధ్యతాయుతమైన పాత్ర పోషించకపోవడాన్ని నేను విమర్శించినపుడు ఒక వర్గం మీడియా నాపై తీవ్ర స్థాయిలో దాడి చేసింది. నా అభిప్రాయాలను తీవ్రంగా ఖండించింది. కొంతమందైతే నా మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. నేను ప్రభుత్వ ఏజెంట్‌నని ఆరోపించారు. మీడియా పనితీరుపై కొన్ని నిశితమైన విషయాలు పరిశీలనకు వచ్చినపుడు ఆ అంశాలపై చిత్తశుద్ధితో దృష్టి సారిస్తారని ఎవరైనా భావిస్తారు.
మీడియాను విమర్శించడం ద్వారా వ్యవహరణ శైలిని మార్చుకునేలా చూడటమే నా ఉద్దేశం. వాటిని దెబ్బతీయాలనే ఉద్దేశం నాకు ఏకోశానా లేదు. పరివర్తనా సమయంలో భారతీయ మీడియా కీలకపాత్ర పోషించాలి.ఈ దేశానికి వారు నిర్వహించాల్సిన చారిత్రిక పాత్రను వారికి గుర్తు చేయడమే నా ఉద్దేశం. నా విమర్శను వారు సహృదయంతో, సరైన స్ఫూర్తితో స్వీకరించకుండా మీడియాలో ఒక సెక్షన్‌ నాపై దుష్ప్రచారం ప్రారంభించింది. నన్ను నియంతృత్వ భూతంగా చిత్రీకరించింది.
వినోదంపై మరింతగా దృష్టి
మీడియా నన్ను వారి శ్రేయోభిలాషిగా చూడాలి. మీడియా లోపాలను సరిదిద్దుకుని యూరోపియన్‌ ప్రెస్‌ అనుసరిస్తున్న గౌరవప్రదమైన మార్గంలో పయనించాలని నేను కోరుతున్నాను. భారత ప్రజలు అప్పుడే వారి పట్ల గౌరవభావం ప్రదర్శిస్తారు.
నా దేశ ప్రజల్లో 80 శాతం మంది దుర్భర పేదరికంలో మగ్గుతున్నారని పేర్కొన్నాను. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది, ప్రజలకు తగిన ఆరోగ్య సంరక్షణ, వైద్యం అందుబాటులో లేవు, గౌరవ హత్యలు, వరకట్న మరణాలు, కులపరమైన అణచివేత, మత ఛాందసత్వం వంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్న విషయాన్ని నేను వివరించాను. ఈ సమస్యలపై చిత్తశుద్ధితో దృష్టి సారించకుండా మీడియా వినోదం వైపు పరుగులు పెడుతోంది. ఉదాహరణకు, సినిమా నటీనటుల జీవితాలలు, ఫ్యాషన్‌ పెరేడ్లు, పాప్‌ మ్యూజిక్‌, డిస్కో డాన్సింగ్‌, క్రికెట్‌ మొదలైనవి, జ్యోతిష్యం వంటి మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాయి.
మీడియా వినోదం పంచాల్సిందే, ఇందులో సందేహం లేదు. అయితే వాటి కార్యక్రమాల్లో 90 శాతం వినోదానికి కేటాయించి, 10 శాతం మాత్రమే సామాజిక, ఆర్థిక అంశాలకు మొత్తంమీద కేటాయిస్తే, మీడియా ప్రాధాన్యతలు సక్రమంగా లేవని స్పష్టమవుతుంది. సామాజిక-రాజకీయ అంశాలు నిజమైన సమస్యలు కాగా మీడియా వారి ఆలోచనను సినీ నటీనటులు, ఫ్యాషన్‌ పెరేడ్స్‌, పాప్‌ మ్యూజిక్‌, , క్రికెట్‌ వంటి ప్రాధాన్యతలేని అంశాలపై సారిస్తున్నాయి. మన ప్రాధాన్యతలను ఎంచుకోవడంలో వైఫల్యం, మూఢనమ్మకాలను ప్రచారం చేయడాన్ని నేను విమర్శించాను.
నేను ఏమి చెప్పాను?
విమర్శలకు భయపడకూడదు. దానిని ఖండించకూడదు. వారు నన్ను ఎంతగా అభిమానిస్తారో, అంతగా విమర్శించవచ్చు. నేనీమీ ఆగ్రహం వ్యక్తం చేయను. అదేవిధంగా నేను విమర్శిస్తే మీడియా బాధపడకూడదు. నేను అలా విమర్శించడంలో నా ధ్యేయం మీడియా సిబ్బందిని మరింత మెరుగ్గా పనిచేసేలా చేయడం,
విమర్శిస్తున్న సందర్భాల్లో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సరైన పదాలను ప్రయోగించాలి. వాస్తవాలను వక్రీకరించకూడదు. లేనిపోని అర్థాలు వెతక్కూడదు. మన తత్వశాస్త్రవేత్తలు ఈ విధానాన్ని అనుసరిస్తారు. వారు తమ ప్రత్యర్థుల అభిప్రాయాలను తొలుత చెపుతారు. దీనిని 'పూర్వపక్ష' అని వ్యవహరిస్తారు. ప్రత్యర్థి హాజరైతే అతడు కూడా ఇంతకంటే బాగా అభిప్రాయాలు వ్యక్తం చేయలేడు. ఆ తరువాత వాటిని ఖండించాలి.
అయితే దురదృష్టవశాత్తు ఈ విధానాన్ని మీడియా అనుసరించం లేదు.
తొలిగా, మీడియా సిబ్బంది అందరి గురించి నేను మాట్లాడలేదు. మెజారిటీ వ్యక్తుల గురించే మాట్లాడాను. అనేకమంది మీడియా సిబ్బంది నన్నెంతగానో గౌరవిస్తారు. ఇక రెండవ అంశంగా, మొత్తం మీడియా పట్ల నేను ఒకే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు. ఈ మెజారిటీ చదువుకోనివారుగానో, నిరక్ష్యరాస్యులుగానో నేను చెప్పలేదు. నేను చెప్పినదానిని ఉద్దేశపూర్వకంగానే వక్రీకరించారు. నేనెన్నడూ 'చదువులేనివారు' అనే పదాన్ని ఉపయోగించలేదు. మెజారిటీ జర్నలిస్టులు పేలవమైన మేధోసం పత్తిగలవారని చెప్పాను. ఒక వ్యక్తి బిఎ లేదా ఎంఎ ఉత్తీర్ణుడై ఉండవచ్చు. అయినా పేలవమైన మేథోసంపత్తి గలవారిగా మిగిలిపోవచ్చు.
నా వ్యాసాలు, ప్రసంగాలు, టివి ఇంటర్వ్యూల్లో నేను పదేపదే ఒక విషయం చెప్పాను. నేను మీడియాపై కఠిన చర్యలు తీసుకోవడానికి వ్యతిరేకమని చెప్పాను.
ప్రజాస్వామ్యంలో, సమస్యలను పాధారణంగా చర్చల ద్వారా, కొంతమంది పదేపదే ప్రస్తావించడం ద్వారా, సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తారు. నేను కూడా ఆపద్ధతికే సానుకూలం. ఒక చానల్‌ లేదా దినపత్రిక ఏదైనా పొరపాటు చేస్తే అందుకు బాధ్యులైన వారిని పిలిపించి ఓర్పుగా వారు చేసింది సరిగా లేదని చెబుతాను. పొరపాట్లు చేస్తే 90 లేదా అంతకంటే ఎక్కువ శాతం మందిని సంస్కరించి వారిని మంచివారిగా మార్చవచ్చని నేను గట్టిగా నమ్ముతాను.
అత్యంత అసాధారణ సందర్భాల్లోనే-ఐదు నుండి పది శాతం కేసుల్లో- కఠిన చర్యలు తీసుకోవడం అవసరం కావచ్చు. అప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతులు విఫలమైనప్పుడు మాత్రమే, ఆ వ్యక్తిని చక్కదిద్డడం సాధ్యం కాదని నిర్ధారణ అయిన తరువాత మాత్రమే ఈ పద్ధతిని పాటించాలి.
నేను చేసిన ప్రకటనను వక్రీకరించారు. పొరపాటు అభిప్రాయం సృష్టించారు. నేను దేశంలో అత్యవసర పరిస్థితిని విధించాలని కోరుకున్నట్లు ప్రచారం చేశారు. కొన్ని పత్రికల్లో కార్టూన్లు ప్రచురించారు. నన్ను నియంతగా చూపారు.
అయితే వాస్తవం ఏమంటే, నేనెప్పుడూ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని కోరుకునే వ్యక్తిని, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగా నేను వెల్లడించిన తీర్పులే ఇందుకు నిదర్శనం. న్యాయమూర్తులు ప్రజల హక్కులు, స్వేచ్ఛకు సంరక్షకులు అని నేను భావిస్తాను. వారి హక్కులను పరిరక్షించలేకపోతే వారి బాధ్యతల నిర్వహణలో విఫలమైనట్లే. అయితే స్వేచ్ఛ, స్వాతంత్య్రం అంటే తాను కోరుకున్నదంతా చేసేయవచ్చని కాదు. అన్ని రకాల స్వాతంత్య్రాలకు సముచితమైన పరిమితులుంటాయి. వాటితో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. స్వీయ నియంత్రణ గురించి ప్రస్తుతం చర్చించుకుందాం.
ప్రసార మీడియా స్వీయ నియంత్రణ
ఎలక్ట్రానిక్‌ మీడియాను నియంత్రించేందుకు ప్రస్తుతం ఎటువంటి వ్యవస్థా అందుబాటులో లేదు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రింట్‌ మీడియాను మాత్రమే నియంత్రించగలదు. జర్నలిస్టుల నైతిక నియమాలను ఉల్లంఘించిన సందర్భాల్లో కూడా అభిశంసించడం వంటి శిక్ష మాత్రమే విధించే అవకాశం ఉంది. ప్రెస్‌ కౌన్సిల్‌ చట్టాన్ని సవరించాలని నేను ప్రధానికి విజ్ఞప్తి చేశాను. ఎలక్ట్రానిక్‌ మీడియాను కూడా ప్రెస్‌ కౌన్సిల్‌ పరిధిలోకి తీసుకురావాలని, ప్రెస్‌ కౌన్సిల్‌కు మరిన్ని అధికారాలు కల్పించాలని కోరారు.
ఇందుకు ఎలక్ట్రానిక్‌ మీడియా గట్టిగా వ్యతిరేకించింది. స్వీయ నియంత్రణ పాటిస్తామని పేర్కొంది. సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులకు కూడా ఇటువంటి అధికారం లేదు. వారిని కూడా పార్లమెంటు లేదా అభిశంసించే అవకాశం ఉంది. న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ పరిధిలోకి వస్తారు. వృత్తిపరమైన పొరపాట్లకు పాల్పడితే సస్పెండ్‌ చేయడం లేదా వారి లైసెన్స్‌ను రద్దు చేయవచ్చు. వైద్యులు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పరిధిలోకి వస్తారు. మరి ఎలక్ట్రానిక్‌ మీడియా వారికి ప్రెస్‌ కౌన్సిల్‌ పరిధిలోకి ఎందుకు తీసుకు రాకూడదు? ఈ ద్వంద్వ ప్రమాణాలెందుకు?అనేక దినపత్రికల్లో ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించాను. టెలివిజన్‌ వార్తలు ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అందువల్ల వాటిని ప్రజలకు బాధ్యులుగా చేయాలి. స్వీయ నియంత్రణకు వారు పట్టుబడితే అదే లాజిక్‌ ప్రకారం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకు కూడా దీనిని వర్తింపచేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు బాధ్యత వహించాలి.
(హిందూ దినపత్రిక సౌజన్యంతో సంక్షిప్తంగా...)
-జస్టిస్‌ మార్కండేయ కట్జు
  (reproduced from Prajasakti dated 18/11/2011)

No comments:

Post a Comment