Monday, August 12, 2013

రాజకీయ చదరంగం లో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పావులు కావొద్దు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, కార్మికుల, ఉద్యోగుల, ప్రజల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు నిర్వహించాలి

రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ప్రధాన ప్రతిపక్షం బి జె పి మద్దతు తెలిపింది. ఇరుపార్టీలకూ కలిపి పార్లమెంటులో మూడింట రెండువంతుల బలమున్నది. కాబట్టి విభజన, సమైక్యత విషయములో ఎవరి అభిప్రాయము ఏ విధముగా వున్నా విభజన  అనివార్యమన్న పరిస్థితి ఏర్పడింది.
తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు గతములోనే విభజనకి అనుకూలముగా లెటరు ఇచ్చారు. సమైక్యత కావాలని చెప్పకుండా కేంద్రమే సబబయిన నిర్ణయము తీసుకోవాలని చెప్పి వై ఎస్ ఆర్ సి పి విభజనను సమర్థించింది. ఇక బి జె పి మన దేశ ఫేడరల్ రాజ్యాంగానికే వ్యతిరేకం. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు, బలమయిన రాష్ట్రాలకు అది వ్యతిరేకం. మతఘర్షణలు రెచ్చగొట్టి పెరిగేందుకు, హిందుత్వ ఎజెండా సాధనకు చిన్న రాష్ట్రాలు దానికి అనువుగా వుంటాయి. సిపిఐ తన విధానం సమైక్యత, తన పత్రిక విశాలాంధ్ర కాగా ఆ వైఖరిని విరమించి విభజనకు అనుకూలంగా తీర్మానించింది. యం ఐ యం చివరి నిమిషం లో తన అభిప్రాయం మార్చుకుని విభజనను సమర్థించింది.

విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు కూడా తమ సరళీకరణ, ప్రయివేటీకరణ ఎజెండా నిరాటంకంగా అమలు జరిగేందుకు బలమయిన కేంద్రము, బలహీనమయిన రాష్ట్రాలు వుండాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా పెట్టుబడిదారులు, వారి పార్టీలయిన కాంగ్రెస్, టిడిపి, వైఎసార్సిపి, టి ఆర్ ఎస్  లు విభజనని సమర్థించాయి. పెట్టుబడిదారీ పార్టీలుగానే గాక మత  తత్వ పార్టీలుగా వున్న బి జె పి, యం ఐ యం లు విభజనని సమర్థించాయి. వామ పక్ష పార్టీలుగా వున్న సి పి ఐ తదితర పార్టీలు పెటీ బూర్జువా ఆలోచనా విధానానికి లోనై విభజనని సమర్థించాయి. ఒక్క సి పి ఐ(యం) మాత్రమే రాష్ట్రం సమైక్యంగా వుండాలని లెటరు  ఇచ్చింది. స్పష్టంగా చెప్పింది. కార్మిక వర్గ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అది అనుకూలం. కానీ పార్లమెంటులో దాని బలం స్వల్పం.

 ఈ నాటి  వాస్తవం ఏమంటే కాంగ్రెస్, బి జె పి లు అదే విధముగా తెలుగు దేశం పార్టీలు తెలంగాణా విభజన కి అనుకూలముగా ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవు. వై ఎస్ ఆర్ సిపి కూడా తన విధానము ఆంధ్ర ప్రదేశ్ సమైక్యముగా వుండటమేనని అనటం లేదు. మరి విభజన ఆగటానికి అవకాశము ఎక్కడ వున్నది?ఒక వేళ సీమాంధ్ర ప్రాంతములో వున్న అన్నీ పార్టీల పార్లమెంటు సభ్యులు కలిసి విభజనకి వ్యతిరేకముగా పార్లమెంటులో వోటువేసినా(ఇది జరగదు) విభజన ఆగదు. ఎందుకంటే ఆ విధముగా జరిగినప్పటికీ విభజన బిల్లును పాస్ చేయించగల బలము పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లకు వున్నది కాబట్టి.

అయినప్పటికి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్, టి డి పి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు పోటీపడి ఎవరికి వారు తామే నిజమయిన సమైక్యతావాదులమని ఎందుకు ప్రకటిస్తున్నారు? సీమాంధ్ర ప్రాంతములో వున్న సెంటిమెంటును ఎన్నికలలో సొమ్ము చేసుకోటానికే వీరు ఈ నాటకాలు వేస్తున్నారు. వీరికే చిత్తశుద్ధి వుంటే విభజనకి అనుకూలముగా తమ నాయకత్వాలు నిర్ణయించినందున తమ తమ పార్టీలకు రాజీనామా చేయాలి. కానీ వీరు ఆ పని చచ్చినా చేయరు. కావాలంటే వాటిలోనే ఒక పార్టీనుండి ఇంకొక పార్టీకి తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు చూసుకుని మారుతుంటారు. ఇవే పార్టీల నాయకులు  తెలంగాణ సెంటిమెంటును సొమ్ము చేసుకోటానికి అక్కడ ఒకరితో ఒకరు పోటీపడి తామే మెరుగయిన విభజనవాదులమని చెప్పుకుంటున్నారు. ఇటువంటి వారు ఆడుతున్న విభజన, సమైక్యత అనే రాజకీయ చదరంగములో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు పావులు కాకుండా వుండటము ఎంతయినా అవసరము. వీరిని నమ్మి మోసపోవద్దు.
సీమాంధ్రలో కొంతమంది ఈ రాజకీయ పార్టీల నాయకులతో సంబంధములేకుండా సమైక్యాంధ్ర ఉద్యమము జరుగుతున్నదనే భ్రమలో వున్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ఏం ఎల్ ఏ, ఏం పి పదవులకు రాజీనామా యిస్తే విభజన ఆగిపోతుందని భ్రమ పడుతున్నారు. ఏం ఎల్ ఏ, ఏం పి పదవులకు రాజీనామా చేసినా, మంత్రి పదవులకు రాజీనామా చేసినా వాటిని వెంటనే ఆమోదించరు. మంత్రి పదవులకు రాజీనామా చేశామన్న వారు కూడా బుగ్గ కార్లలో అదే హోదాలో తిరుగుతున్నారు. ఒక వేళ  ఈ రాజీనామాలను ఆమోదించినా ఉప ఎన్నికలు కూడా జరగవు. ఎందుకంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి కాబట్టి చట్టం ప్రకరం ఉప ఎన్నికలు జరగవు. మహా అయితే ఈ ఆందోళణల వలన పదవులకు రాజీనామాలవలన రాష్ట్రపతి పాలన వస్తుంది. ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నముగా తయారవుతుంది.

విభజన అనివార్యమయినప్పుడు  హైదారాబాద్ సంగతేమిటి? నదీజలాల వివాదాల పరిష్కారం ఎలా జరుగుతుంది? తెలంగాణాలో వున్న ఆంధ్రా ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?రాష్ట్ర అప్పులని, ఆస్తులని  కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య ఏ విధముగా పంచాలి? ఇవన్నీ విభజించాలనే నిర్ణయము వలన తలయెత్తే సమస్యలు. అయితే ఈ సమస్యలు ముందే పరిష్కరించి ఆ తరువాత విభజన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆంధ్రా ప్రాంత కాంగ్రెస్, టి డి పి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు అతితెలివి వాదన చేస్తున్నారు. విభజనకి నిర్ణయించిన తరువాతనే ఆస్తుల పంపకం జరుగుతుంది గాని, ఆ నిర్ణయం తీసుకోటానికి ముందే ఆస్తులు ఏ విధముగా పంచుతారు? మన రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర విభజనకి ఒక ప్రక్రియ వున్నది. ఆ ప్రక్రియ ప్రకారం:

1.     కేంద్ర మంత్రివర్గ సమావేశము విభజనకి అనుకూలముగా నిర్ణయము తీసుకోవాలి.దానిపై రాష్ట్ర శాసన సభ, శాసన మండలి తీర్మానాలు అడగాలి.

2.    శాసన సభ, శాసన మండలి తీర్మానాలు తనకి అందిన అనంతరం  రాష్ట్రపతి  వాటిని కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తారు.అప్పుడు విభజన వలన ఏర్పడే సమస్యల పరిష్కారానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలి. (ఒక వేళ శాసన సభ, శాసన మండలి విభజనకి వ్యతిరేకముగా చెప్పినా కేంద్రము విభజన ప్రక్రియని కొనసాగించి పార్లమెంటు ఆమోదానికి పెట్టవచ్చు)

3.    ఈ మంత్రివర్గ ఉపసంఘం విభజనవలన ఏర్పడే సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ, ఉమ్మడి రాష్ట్రపు ఆస్తులు-అప్పుల పంపకాలు, ఉద్యోగులకు విభజన వలన ఎదురయ్యే సమస్యలు, నదీజలాల వివాదాలు, సీమాంధ్ర కి రాజధాని విషయం, హైదారాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎన్నాళ్ళుండాలి, ఉమ్మడి రాజధానిగా వుంటే అది ఎవరి ఆధీనములో వుండాలి తదితర సమస్యల పరిష్కారాన్ని తెలియజేస్తూ ఒక ప్రతిపాదన తయారు చేసి రాష్ట్రపతికి సమర్పించాలి.

4.    ఈ విధముగా వచ్చిన ప్రతిపాదనను రాష్ట్రపతి మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకి పంపించి ఒక గడువులోగా దానిపై అభిప్రాయం తెలియజేయాలని కోరాలి.

5.    ఆ విధముగా ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ అభిప్రాయము వచ్చిన అనంతరము కేంద్ర మంత్రి వర్గము విభజన బిల్లును తయారు చేసి లోక సభ, రాజ్య సభ ల ఆమోదానికి విడి విడిగా సమర్పిస్తుంది.

6.    పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించిన అనంతరము కొత్త రాష్ట్ర ఆవిర్భావ తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు.

7.     అయితే తెలంగాణా రాష్ట్రము ఈ విధముగా ఏర్పడే ముందు ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల ప్రజలకు విద్యా, ఉద్యోగాలు తదితరాలలో సమాన అవకాశాలు కల్పించే వుద్దేశముతో( దీనిని కాంగ్రెస్, టిడిపి లు ఉల్లంఘించాయి, అది వేరే విషయం)రాజ్యాంగానికి జరిగిన సవరణ(ఆర్టీకిల్ 371 డి)కి కాలము చెల్లుతుంది.  కాబట్టి ఆ సవరణని రాజ్యాంగమునుండి తొలగించటానికి పార్లమెంటు ఆమోదించాలి.

కాబట్టి ఇప్పటివరకూ జరిగినది విభజనకి అనుకూలముగా కాంగ్రెస్, బి జె పి, టిడిపి, వై ఎస్ ఆర్ సిపిల నిర్ణయం వరకే. కాంగ్రెస్, బి జె పి లు విభజనకి అనుకూలముగా నిర్ణయించాయి కాబట్టి విభజన అనివార్యమయిన పరిస్తితి ఏర్పడింది. ఇప్పుడు చేయగలిగినదల్లా ఇరుప్రాంతాలకీ సమన్యాయము జరిగేలా చూడటమే. రాజధాని, ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, నదీజలాలు తదితర పంపకాల సమస్య చర్చించి పరిష్కరించాల్సిన సమయము అందుకోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన తరువాత వస్తుంది. అప్పుడు మంత్రివర్గ ఉపసంఘానికి ఈ సమస్యలపై అభిప్రాయాలూ చెప్పి ఇరుప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాల్సిన అవసరము వున్నది. ఇందు కోసం చిత్తశుద్ధితో,  రాజకీయస్వార్థము కోసం ఉద్రేకాలను రెచ్చగొట్టకుండా,  శాస్త్రీయమయిన పద్ధతిలో, రాజ్యాంగ పరిధిలో ఈ పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించాలి. కానీ ఇందుకు కూడా కాంగ్రెస్, టి డి పి, వై ఎస్ ఆర్ సి, టి ఆర్ ఎస్ లు సహకరించవు. ప్రతి అంశము పైనా ప్రాంతీయ, ఉపప్రాంతీయ, వివాదాలను సృష్టించి రాజకీయ స్వార్థాలు నెరవేర్చుకునేందుకు వ్యక్తిగతముగా, ముఠాలవారిగా, జిల్లాల వారీగా, ఉపప్రాంతాలవారిగా ఏ పద్ధతిలో వీలయితే ఆ పద్ధతిలో తగాదాలు సృష్టిస్తారు. కాబట్టి ఇటువంటి జిత్తులమారి రాజకీయనాయకుల స్వార్థాలకు బలికావటానికి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు నిరాకరించాలి.

 విడిపోవటానికి అనుకూలముగా వుంటూ సీమాంధ్రకు విభజన అనంతరము ఆ ప్రాంతానికి బయటవున్న హైదరాబాదు శాశ్వత రాజధానిగా వుండాలనే కోరిక అర్థ రహితము. విభజన వలన హైదారాబాద్ లో, తెలంగాణా లో వున్న ఇతర ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధముగా ఇతర ప్రాంతాలలో వున్న తెలంగాణా ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సమస్యలకు  న్యాయమయిన పరిష్కారం చూపించాలి. విడిపోయినా పదేళ్ళ పాటు హైదరాబాదు సీమాంధ్ర కు రాజధానిగా వుంటుంది కాబట్టి ఈ పదేళ్ళలో  హైదరాబాదు పరిపాలన ఏ విధముగా వుండాలో రాజ్యాంగ పరిధిలో స్పష్టత చూపించాలి. హైదరాబాదు మరియు  తెలంగాణ ప్రాంతములో  ప్రయివేటు రంగములో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల, ఇతర ప్రాంతాల కార్మికులు, ఉద్యోగులను రాజ్యాంగం ప్రకారము అక్కడినుండి వెళ్ళాలనే హక్కు ఎవరికీ లేదు. ఇతర దేశాలనుండి, ఇతర రాష్ట్రాలనుండి హైదారాబాద్, మరియు తెలంగాణా లో పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నప్పుడు అక్కడ ప్రయివేటురంగములో పని చేస్తున్న ఇతర ప్రాంతాల కార్మికులను, ఉద్యోగులను పంపించటం కుదరదు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ మంత్రివర్గ ఉపసంఘము సక్రమముగా పరిష్కరించాలి. అందుకోసము కార్మికుల, ఉద్యోగుల, ప్రజల శ్రేయస్సు కోరే వారందరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి.

కాంగ్రెస్,  బి జె పి, టిడిపి, టీఆర్ ఎస్, యం ఐ యం అన్నీ పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాల పార్టీలే. వారందరి విధానాలూ ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు హాని కలిగించే సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలే. ఈ విధానాల వలన వెనకబడిన ప్రాంతాలు మరింత వెనకబడతాయి. అభివృద్ధి కొన్ని ప్రాంతాలలోనే కేంద్రీకృతమవుతుంది. కాబట్టి వెనకబాటుతనాన్ని మండలాల వారీగా గుర్తించి అటువంటి మండలాల అభివృద్ధికి కృషి చేయాలని పోరాడాల్సిన అవసరం వున్నది. ప్రభుత్వ రంగ సంస్థలకు, పెన్షన్ కు, ఉద్యోగ భద్రతకు, ప్రజా సంక్షేమ పథకాలకు, కార్మిక సంక్షేమ పథకాలకూ చేటు తెచ్చే సరళీకరణ విధానాలకు వ్యతిరేకముగా పోరాడాల్సిన అవసరము వున్నది. ధరలు విపరీతంగా పెంచే విధానాలకు వ్యతిరేకముగా పోరాడాల్సి వున్నది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే పెన్షన్ భద్రతకు చేటు తెచ్చే పెన్షన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు యు పి ఏ ప్రభుత్వము సమాయత్తమవుతుండగా  దానిని ఆమోదించేందుకు బి జె పి సిద్ధముగా వున్నది. ఇందుకు వ్యతిరేకముగా పోరాడాల్సి వున్నది.

కాబట్టి పాలక పార్టీలు ప్రాంతాలవారీగా రెచ్చగొట్టే విచ్ఛిన్నకర ఉద్యమాలకు బలికాకుండా అన్నీ ప్రాంతాల కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరము వున్నది. ఈ తక్షణ కర్తవ్యానికి కార్మిక, ప్రజా సంఘాలు పూనుకోవాలి.

Sunday, August 11, 2013

దళపతులూ, జన గతులూ!

పాత కాలంలో జానపద చిత్రాల్లో, కథల్లో కూడా ఎక్కువసార్లు కుట్రలు చేసేది ఎవరంటే సేనాధిపతులే! విప్లవకారులను నాశనం చేయడానికి సైన్యాలను పంపిస్తుంటారు గానీ సైన్యమే కుట్ర చేసి రాజులను, చక్రవర్తులను కూలదోయడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. సోదరులూ కుమారులూ బావలూ మరుదలూ మామలూ అల్లుళ్లూ ఒకరేమిటి రాజ్యాధికారం దగ్గరకు వచ్చేసరికి పదవీ వ్యామోహం ఎంత పనైనా చేయిస్తుంది. అసలు కుట్ర చేసే అవకాశం ఉండాలంటేనే అధికార పీఠానికి దగ్గరగా ఉండాలి కదా! అధికారం అన్నాక దొంతరలుంటాయి. ఆ దొంతరల్లో ఎప్పుడు ఏది, ఎవరిని కాటేసేదీ చివరి వరకూ తెలియదు. ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ రాత్రికి రాత్రి ప్రభుత్వాలు కూలిపోతాయన్నా, మారిపోతాయన్నా ఈ దళపతుల దగాకోరు రాజకీయాలే కారణం. బహుశా ఇవన్నీ తెలిసే ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహులు దళపతి కుట్రదారుడు కాకూడదని నర్మగర్భంగా తమ ప్రభుత్వాధినేతపై ధ్వజమెత్తారు. కాగా సదరు దళపతి కిరణ కుమారులు కూడా మీరు చేసే విభజనతో సమస్యలు తీవ్రమైపోతాయని అత్యున్నత అధిష్ఠానం నిర్ణయాన్నే ఆక్షేపించినట్టు మాట్లాడారు. ఇందులో ఎవరు ఎవరి మీద కుట్ర చేసినట్టు? లేక వీరంతా కలసి ప్రజల మీద కుట్ర చేసినట్టా? ఎ హౌస్‌ హాఫ్‌ డివైడెడ్‌ అగైనెస్ట్‌ ఇట్‌ సెల్ఫ్‌ అన్నది ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ అన్న ప్రఖ్యాత వర్ణన. ఇక్కడ కూడా పరస్పరం విడిపోయినట్టు మాట్లాడుతున్న ఈ నేతలు, ఉపనేతలు నిజంగా విడిపోయారా లేక విడిపోయినట్టు మాట్లాడుతూ రెండు వైపుల నుంచీ తామే యు ద్ధం చేస్తు న్నారా? అదీ అసలైన ప్రశ్న.

ఉభయులూ అదే పార్టీలో, అదే ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. దాన్ని పడగొడతామని ఒక్కరూ అనడం లేదు. పోనీ వీరి అధిష్ఠానమైనా పరస్పరం కీచులాడు కుంటున్నందుకు, తమ నిర్ణయాన్ని ధిక్కరించి క్రమ శిక్షణ తప్పినందుకు ఏమైనా అంటుందా? రాజగురు వంటి దిగ్విజయ సింహులు మా వాళ్లు మంచి బాలలు అన్నట్టు కితాబులిచ్చేస్తున్నారు. వారు తమ వాదనలు చెప్పుకోవడానికే మార్క్‌ ఆంటోనీ వంటి మహామహుని నేతృత్వంలో కమిటీ వేసుకున్నాం, వచ్చి చెప్పేసుకోండని అవకాశం కల్పిస్తున్నారు. సార్వభౌములకు కనిపించని కుట్ర సామంతులకు కనిపించినట్టు అధినేతలకు అగుపించని కుట్ర ఉప నేతలకు గోచరించడం మరో విచిత్రం. అంటే పాతకాలపు జానపద చిత్రాల్లో కూడా కుట్ర దారులంతా ఎవరి పాత్ర వారు పోషిస్తూ ఎప్పటికేం చెప్పాలో అది చెబుతూ కథను రక్తి కట్టిస్తుంటారు. ఇంత తతంగం ఎందుకంటే ప్రతిపక్ష చంద్రులూ, జగన్మోహనులూ గందరగోళపడాలి. తమ ఎత్తులకు చిత్తయి పోవాలి. అంతే. ఇదంతా ఒక ఆధునిక రాచరిక రాజకీయ క్రీడ. కాకుంటే చదరంగంలో పావుల్లా ఈ క్రీడలో నలిగిపోయేది తెలుగు ప్రజలే. తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రాంతమేదైతేనేం ఒకోసారి ఒకరు. రాజ నరసింహులు అన్నట్టు ఎప్పుడూ దళపతులు కుట్ర చేయకూడదు. జనపతులు అసలే చేయకూడదు. కానీ ఈ రాష్ట్ర రంగ స్థలంపై ఎడతెగని రాజకీయ నాటకం సాగిపోతూనే ఉంది. రాజు మంచి వాడే సేనాపతి లేదా దళపతి చెడ్డవాడు, యజమాని మంచివాడే మేనేజర్‌ లేదా సూపర్‌ వైజర్‌ చెడ్డవాడు అన్నది వర్గ సామరస్య కథల్లో సర్వసాధారణ వ్యవహారం. ముందడుగు అనే చిత్రంలో ఇలాటి సందేశమే ఇస్తే కొడవటిగంటి కుటుంబరావుకు ఒళ్లు మండి సినిమాల్లో వింత అభ్యుదయం అని ఒక వ్యాసం రాశారు. అత్యున్నత స్థాయిలో అవకాశవాదాలనూ కాలాంతక వ్యూహాలనూ పసిగట్టకుండా ప్రాంతాల పేరిట పరస్పర వైషమ్యాలు పెంచుకోవడం అలాటి వ్యవహారమే అవుతుంది. ఇప్పటి వరకూ మాత్రమే గాక ఇంకా ఈ రాష్ట్రాన్ని సంయుక్తంగా పాలిస్తున్న వారు ఒకరినొకరు ఎంతగా తిట్టుకున్నా, దుమ్మెత్తిపోసుకున్నా ఏం విలువ? అత్యంత విధేయులుగా అధికార పీఠం సంపాదించిన వారు అనూహ్యమైన భిన్న స్వరం వినిపించి కూడా లక్షణంగా కొనసాగగలిగితే ఎలా విశ్వసించడం? ఇలాటి సమయంలోనే కారల్‌ మార్క్స్‌ చెప్పిన సూక్తి 'ప్రతి మనిషీ ప్రతి దాన్నీ విమర్శనాత్మకంగా చూడాలి' అన్నది గుర్తుకు వస్తుంది. కులం, మతం, ప్రాంతం వంటి రేఖలు ఏవైనా కావచ్చు. వాటన్నిటినితో పాటు వాటన్నిటినీ మించి కూడా వర్గం రాజకీయార్థికాధికారం అనే అంశాలు ఉంటాయి. అన్నిటినీ శాసిస్తుంటాయి. ఆ క్రమంలో మరణ శాసనాలూ రాస్తుంటాయి. దారుణ వ్యూహాలూ రచిస్తుంటాయి. చెప్పే మాటలకూ, జరిగే పరిణామాలకూ పొంతన కుదరక, లంగరు అందక ప్రజలు అల్లాడిపోతారు.అప్పుడు మళ్లీ వారే ఆపద్బంధువులమంటూ వస్తారు. ఇదంతా ఒక పెద్ద కుట్రే. మరి దళపతులు కుట్రదారులు కాకూడదనుకుంటే ఇలాటి మాయాజాలం కట్టిపెట్టాల్సి ఉంటుంది. ప్రజాస్వామికంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా అన్నట్టు ఉండాలి గాని కోటలో పాగా వెయ్యడమూ, వేసిన పాగా పోకుండా చూసుకోవడమే ఏకైక లక్ష్యం కాకూడదు. అలా అయిన తర్వాత మిగిలేది కుట్రలూ, కుహకాలే! రాజకీయ రంగస్థలంపై ఇప్పుడు చూస్తున్న జుగుప్సాకర ప్రహసనాలన్నీ ఆ ప్రతిరూపాలే. వీటికి స్వస్తిచెప్పడం ఎప్పుడంటే ఏ మాట వెనక ఎవరి ఏ ప్రయోజనం ఉందో ప్రజలు గ్రహించినప్పుడు. ఆగ్రహించినప్పుడు
 (సంపాదకీయం, ప్రజాశక్తి, 11.8.2013)


చరిత్ర చౌరస్తాలో చౌకబారు రాజకీయాలు

ఏది ఏమైనా ఇప్పుడు ఆంటోనీ కమిటీ అన్నది కాంగ్రెస్‌ పల్లవిగా ఉంది. దాని పట్ల ఎవరి వైఖరి వారు తీసుకోవచ్చు. ప్రభుత్వాలకు చెప్పదలచుకున్నది చెప్పొచ్చు. కానీ తాము ప్రకటించిన రాజకీయ విధానం నుంచి తామే వెనక్కు పోయి ప్రజల మనోభావాల పేరిట ఎడతెగని వివాదాలను సాగలాగడం ఎవరికీ మంచిది కాదు. ఈ క్రమంలో పై చేయి కోసం పోటాపోటీ నాటకాలాడుతూ చౌకబారు వాగ్యుద్ధాలకు దిగడం, ప్రాంతాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీయడం అసలే మంచిది కాదు. రాజకీయ, రాజ్యాంగ అంశాలపై స్థానిక సమ్మెలతో సాధించేది స్వల్పమని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితిని, గత నాలుగేళ్ల అనుభవాలను గమనంలో ఉంచుకుని ఎవరికి, దేనికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ విభజనకై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విధాన నిర్ణయం ప్రకటించిన తర్వాత గడచిన పది రోజులలోనూ ఆ పార్టీతో సహా ప్రధాన రాజకీయ పక్షాలు పిల్లిమొగ్గలు కొనసాగిస్తున్నాయి. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రంగంలోకి దిగి విభజన వల్ల సమస్యలు తీవ్రమవుతాయని, వాటిని పరిష్కరించిన తర్వాతనే అడుగు ముందుకేయాలనీ ప్రకటించారు. తాను కూడా సమైక్యాంధ్ర కోసం విభజనకు వ్యతిరేకంగా సంతకాలు చేశానని వెల్లడించారు. ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దామోదర రాజ నరసింహ దళపతి కుట్రదారు కాకూడదంటూ బహిరంగ తిరుగుబాటు చేశారు. మామూలుగా మాట్లాడని కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్‌, ఎంపి వి హనుమంతరావు, తదితరులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరో వైపున కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజీనామాకు సిద్ధమేనని గతంలో తాను చేసిన రాజీ వ్యాఖ్యలను సవరించుకుంటే ఉండవల్లి అరుణ్‌కుమార్‌, లగడపాటి రాజగోపాల్‌, తదితర నేతలు విభజనవాదులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ కూడా సమైక్యాంధ్ర తమ నినాదమని గట్టిగా చెప్పారు. అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పిన వీరంతా ఈ విధంగా ధిక్కార స్వరం వినిపిస్తుంటే సదరు ఢిల్లీ పెద్దలు మాత్రం ఇదంతా పెద్ద సమస్య కాదన్నట్టు తేలిగ్గా తీసేస్తున్నారు. ఇలాటి వాదనలన్నీ వినడానికి ఆంటోనీ నాయకత్వాన ఒక కమిటీని వేశామని, దాని ముందు వీటిని వివరించవచ్చని అవకాశమిచ్చారు. ముఖ్యమంత్రి మీద చర్యలేమీ ఉండబోవని కూడా దిగ్విజరు సింగ్‌ తేల్చేశారు.

పైకి చాలా గజిబిజిగా కనిపించే ఈ వ్యవహారం వాస్తవానికి కాంగ్రెస్‌ మార్కు రాజకీయాల ప్రతిబింబం. రెండు ప్రాంతాలలోనూ తామే ముందుండాలనే తాపత్రయంతో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ నేతలను ఇష్టానుసారం మాట్లాడ్డానికి అనుమతించారన్నది ఇక్కడ తేటతెల్లమవుతున్న సత్యం. తమ పార్టీ తరపున ఆంటోనీ కమిటీ వేసి దానికి అందరి అభిప్రాయాలూ చెప్పుకోవాలనడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ అనిపించుకోదు. నదీజలాలు, ఉద్యోగాలు, మరీ ముఖ్యంగా హైదరాబాదు ప్రతిపత్తిపై అనేక సందేహాలు సృష్టించి వాటికి అధికారిక సమాధానాలు ఇవ్వకుండా ఆంటోనీ కమిటీకి మొర పెట్టుకోమని చెప్పడం అర్థం లేని విషయం. మంత్రులతో సహా ఒక వైపున తమవారే రాజీనామాలు సంధిస్తుంటే, ముఖ్యమంత్రి కూడా భిన్న స్వరం వినిపిస్తుంటే మిగిలిన పార్టీలపై విమర్శలు గుప్పించి తప్పించుకోవడం ఎలా కుదురుతుంది? అందరిలో ఏకాభిప్రాయం వచ్చాకనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్‌ పార్టీలోనే ఏకాభిప్రాయం లేకపోగా ఆ గుద్దులాటను అది అందరిపైనా రుద్దడం హాస్యాస్పదం. దిగ్విజరు సింగ్‌ రోజుకో విధంగా చేస్తున్న గీతా ప్రవచనాల సారం ఏమిటో తల పండిన పండితులకు కూడా బోధపడటం లేదు. మాట ఇచ్చాం గనక తప్పేది లేదు అన్న మాట తప్ప మరో అడుగు పడిందీ లేదు. రాష్ట్ర విభజనతో ముడిబడిన రాజ్యాంగ, రాజకీయ అంశాలపై సాధ్యమైనంత స్పష్టత ఇచ్చి ప్రజల సందేహాలను తొలగించే బదులు కాంగ్రెస్‌ ప్రయోజనాల పరిరక్షణకే పాకులాడటం ఇక్కడ పరిస్థితిని క్లిష్టం చేస్తున్నది. ఉదాహరణకు హైదరాబాదుకు ఢిల్లీ తరహా ఆలోచన అన్నారు అంటే ఎలా ఉంటుందనే సందేహం ఉభయ పక్షాలలోనూ ఉంది. కనీస వివరణ రావడం లేదు. నదీ జలాలపై సమస్యలే ఉండవని కొందరు, చాలా ఉంటాయని కొందరు వాదిస్తున్నారు. కేంద్రం ఇస్తున్న వివరణ నాస్తి. ఇదంతా కావాలనే ఉద్రిక్తత పెంచే ప్రయత్నమా అని సందేహాలు కలగడానికి కారణమిదే.

అధికార పక్షం సంగతి ఇలా ఉంటే తెలుగుదేశం విషయం కూడా భిన్నం కాదు. వర్కింగ్‌ కమిటీ ప్రకటన వచ్చిన తర్వాత 36 గంటల పాటు చంద్రబాబు నాయుడు పెదవి విప్పలేదు. ఆ తర్వాత కొత్త రాజధానికి అయిదు లక్షల కోట్ల రూపాయల వరకూ అవసరమన్న అంశంపై కేంద్రీకరించి మాట్లాడారు. తక్కిన రాజకీయాంశాలు తర్వాత చెబుతామన్నారు. ఆయన ఏమైనా చెప్పేలోపలే ఆ పార్టీ సీమాంధ్ర ఎంఎల్‌ఎలు, ఎంపిలు రాజీనామాలు ప్రకటించారు. పార్టీ విధానానికి వ్యతిరేకం కాదంటూనే కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందనే ఆరోపణతో ముందుకొచ్చారు. ఇలా పది రోజులు గడిచిన తర్వాత, ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యాఖ్యల తర్వాత చంద్రబాబు ప్రధానికి లేఖ సంధించారు. సీమాంధ్ర ప్రజల భయాందోళనలుగా చెబుతున్నవి పొందుపరుస్తూ స్పష్టత కోసం ప్రభుత్వం తరపున ఏదైనా ప్రకటన చేయాలని కోరారు. వర్కింగ్‌ కమిటీ కాంగ్రెస్‌కు సంబంధించింది గనక తాము ప్రధానిని అడగడంలో తప్పేముందని తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు గాని నిజానికి సీమాంధ్ర ప్రాంతంలో వైసిపి ముందుకు పోతున్నట్టు, తాము ఇరకాటంలో పడుతున్నట్టు పార్టీ వారి నుంచి వచ్చిన ఒత్తిడి వల్లనే చంద్రబాబు ఈ లేఖా వ్యూహం ప్రారంభించారని అర్థమవుతూనే ఉంది. తెలంగాణా ప్రాంతంలో తెలుగు దేశం రెండవ స్థానంలోనైనా వస్తుంది గాని మౌనం వల్ల తాము పూర్తిగా దెబ్బ తినిపోతామని వారు గగ్గోలు పెడుతుంటే అధ్యక్షుడు ఎలా ఉపేక్షిస్తాడని ఒక నాయకుడు నాతో అన్నారు. ఇది గతంలో ఆయన తీసుకున్న యూ టర్న్‌కు మరో రూపం మాత్రమేనని ప్రత్యర్థులు విమర్శలు మొదలు పెట్టారు. ఈ లోగా ఆత్మగౌరవ యాత్ర పేరిట మరో పర్యటన ప్రారంభించాలనుకుంటున్నట్టు సూచనలు వెలువరించారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలతో కాస్త మెరుగుపడిందనుకున్న పార్టీ పరిస్థితి ఈ పరిణామాలతో మొదటికి వచ్చిందనేది తెలుగుదేశంలో కనిపించే ఆందోళన. అయితే దాన్ని అధిగమించడానికి స్పష్టమైన విధానాలతో గట్టిగా నిలబడటం తప్ప మరింత తడబాటుకు లోనవడం, మరోసారి తర్జనభర్జన పడటం ఎలా ఉపయోగపడుతుంది? విశ్వసనీయత మరింత దెబ్బతినొచ్చు.

ఇక రాజీనామాలు ప్రారంభించిన వైసిపి తన దూకుడు మరింత పెంచింది. అసలు వారి రాజీనామాలు సమైక్యత కోసమని చెప్పకుండా కేంద్రంపై దాడితో సరిపెట్టిన వైసిపి తెలంగాణాలో పరిణామాలు చూసిన కొద్దీ మరింత ముందుకే పోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలో పార్టీ అధినేతలైన జగన్‌, విజయమ్మ కూడా రాజీనామా చేశారంటే ఈ వ్యూహం ఎంత ఉధృతంగా అమలు చేయాలనుకుంటున్నదీ తెలుస్తుంది. ప్రాంతీయ పార్టీగా చక్రం తిప్పాలనుకున్న వైసిపి ఉప ప్రాంతీయ పార్టీగా లేక రేపు ఏర్పడనున్న కొత్త రాష్ట్రానికే పరిమితమైన పార్టీగా తన స్థానాన్ని కుదించుకోవడానికి సిద్ధమైంది. అధినేత ఇప్పటికీ జైలు నుంచి విడుదల కాకపోవడం వల్ల ఎదురైన ఇబ్బందిని ప్రాంతీయ పాత్రతో అధిగమించాలని పాచికలు వేస్తున్నది. వాస్తవానికి వైసిపి మొదటి నుంచీ తెలంగాణా సమస్యపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని దాటవేత వైఖరిని ప్రదర్శించింది. తీరా ఆ సమయం వచ్చాక అడ్డం తిరిగింది. పోనీ స్పష్టంగా సమైక్యత అని చెప్పిందా అంటే అదీ లేదు. మొత్తంపైన ఇది ఒక ప్రాంతంలో బలం పెంచుకునే రాజకీయ క్రీడ మాత్రమేనని స్పష్టమై పోయింది. అయితే ఆ పార్టీ నేతలు తమ పాత్రను సమర్థించుకుంటూ ఇతరులపై విరుచుకుపడటం ఇందులో అదనపు విశేషం.
ఈ సమయంలో నిజానికి చాలా సంతోషంగా ఉండాల్సిన టిఆర్‌ఎస్‌ నేతలు కూడా ఆచితూచి అడుగేస్తున్నారంటే కాంగ్రెస్‌ ఎత్తుగడల పట్ల వారికి ఉన్న ఆందోళనే కారణం. తెలంగాణా ఏర్పాటు ప్రకటిస్తే పార్టీని విలీనం చేస్తామని కెసిఆర్‌ చాలాసార్లు ప్రకటించారు. అది తమ రాజకీయ త్యాగానికి గుర్తు అని కూడా నేతలు చెప్పేవారు. అయితే కాంగ్రెస్‌ కమిటీ అలాటి నిర్ణయం ప్రకటించినప్పటికీ టిఆర్‌ఎస్‌ ఆశించినట్టు ఆ సంప్రదింపులలో, ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయలేదు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇదంతా వైఎస్‌ రాజశేఖ రెడ్డి ప్రారంభించాడన్న వాస్తవాన్ని ముందుకు తెచ్చి టిఆర్‌ఎస్‌నూ వైసిపినీ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. విలీనం కోసం ఇచ్చిన మాటను గుర్తు చేస్తూనే సేనాని లేకుండా సేనను కలిపేసుకున్నట్టు టిఆర్‌ఎస్‌ కీలక నేతలకు గాలం వేస్తున్నది. ప్రకటన వచ్చిన రోజునే విజయశాంతి, తర్వాత విజయరామారావు వంటి వారు బారులు తీరారు. పంచాయతీ ఎన్నికలలోనే ప్రభావం చూపిన ఈ ఎత్తుగడ విభజన నిర్ణయం తర్వాత టిఆర్‌ఎస్‌కు మరీ గుదిబండగా మారింది. ముందే మాట్లాడితే కెసిఆర్‌ నాయకత్వాన్ని సంతృప్తి పర్చడానికి చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది గనక ఆయన అనివార్యంగా తమలోకి వచ్చే వాతావరణం కల్పించాలన్నది కాంగ్రెస్‌ ఎత్తుగడగా ఉంది. ఈ క్రమంలో అసౌకర్యానికి గురైన కెసిఆర్‌ ఒక దశలో గత తరహా వ్యాఖ్యలు చేసి విమర్శలు కొని తెచ్చుకోవడమే గాక కాస్త ఉద్రిక్తతకూ కారణమైనారు. తర్వాత సర్దుకున్నప్పటికీ ఆదిలోనే హంసపాదులా జరగాల్సిన నష్టం జరిగింది. ఈ కారణం చేతనే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్పందన అంటూనే హెచ్చరికలు, బెదిరింపుల వంటి వాటికి పోకుండా అవహేళనలు, అంకెలకే పరిమితమైనారు. కెసిఆర్‌ కన్నా దామోదర రాజ నరసింహ వ్యాఖ్యలే ఒక రకంగా తీవ్రంగా ఉన్నాయి.

పాలక పార్టీలకే అలవాటైన ద్వంద్వ విధానం కొన్ని వామపక్ష కార్మిక సంఘాలకు కూడా పాకడం ఈసారి మీడియాను ఆకర్షించింది. ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రెండు చోట్ల రెండు రకాలుగా సమ్మె నోటీసులివ్వడం విచిత్ర పరిణామం. తెలంగాణాపై తగిన కసరత్తు లేకుండా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రకటన చేసిందని వ్యాఖ్యానించిన సిపిఐ రాష్ట్ర విస్తృత సమావేశం విడుదల చేసిన సుదీర్ఘ నివేదిక ఆసక్తి కలిగించింది. విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన మజ్లిస్‌ కేంద్ర ప్రకటన తర్వాత మద్దతు తెలిపింది. మొదట్లో కాస్త మెతగ్గా మాట్లాడిన కేంద్ర మంత్రులు తర్వాత గొంతు పెంచారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మాత్రం అన్ని పార్టీలూ రెండు ప్రాంతాల్లో ఒకే వైఖరి తీసుకుని చట్టసభల్లో సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలే తప్ప ప్రజల మధ్య వైషమ్యాలు పెంచరాదని కోరింది. తొలి భాషా రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్‌ దేశంలో మరిన్ని రాష్ట్రాల విచ్ఛిన్నానికి తెర తీసినట్టయిందని సిపిఎం పొలిట్‌ బ్యూరో వ్యాఖ్యానించింది. అందుకు తగినట్టుగానే ఇరవైకి పైగా రాష్ట్రాలలో విభజన కోర్కెలు ముందుకొచ్చినట్టు హోం శాఖ ప్రకటించింది.
ఏది ఏమైనా ఇప్పుడు ఆంటోనీ కమిటీ అన్నది కాంగ్రెస్‌ పల్లవిగా ఉంది. దాని పట్ల ఎవరి వైఖరి వారు తీసుకోవచ్చు. ప్రభుత్వాలకు చెప్పదలచుకున్నది చెప్పొచ్చు. కానీ తాము ప్రకటించిన రాజకీయ విధానం నుంచి తామే వెనక్కు పోయి ప్రజల మనోభావాల పేరిట ఎడతెగని వివాదాలను సాగలాగడం ఎవరికీ మంచిది కాదు. ఈ క్రమంలో పై చేయి కోసం పోటాపోటీ నాటకాలాడుతూ చౌకబారు వాగ్యుద్ధాలకు దిగడం, ప్రాంతాల మధ్య వాతావరణాన్ని దెబ్బతీయడం అసలే మంచిది కాదు. రాజకీయ, రాజ్యాంగ అంశాలపై స్థానిక సమ్మెలతో సాధించేది స్వల్పమని కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితిని, గత నాలుగేళ్ల అనుభవాలను గమనంలో ఉంచుకుని ఎవరికి, దేనికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా సంకుచిత రాజకీయ వ్యూహాలకు, ఎన్నికల రాజకీయాలకు తమను సమిధలుగా ఉపయోగించే వారి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. 
-తెలకపల్లి రవి(ప్రజాశక్తి, 11.8.2013)

  

Saturday, August 10, 2013

'విభజన' - సమైక్యత ' నినాదాల నిజ స్వరూపం

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ సమైక్యత కోసం కట్టుబడి ఉన్నామంటున్నారు. 'సమైక్యత' అన్న మాటకు అందరి అర్థం ఒకటి కాదని పైపైన పరిశీలించినా తేటతెల్లమవుతుంది. చిరంజీవి గారు చెప్తున్న సమైక్యత హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌తో ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ వారి సమైక్యత పదేళ్లకు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీతో ముగుస్తుంది. కాంగ్రెస్‌ వారి సమైక్యత ఆంటోనీ కమిటీకి నివేదించుకోవడంతో అంతం అవుతుంది. వైఎస్‌ఆర్‌ వారి సమైక్యత అస్పష్ట వ్యాఖ్యలతో, ఎదురుదాడితో ముగుస్తుంది. తెలుగుజాతి ముక్కలు కాకుండానే, సమైక్యతలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని కొద్ది మంది మేధావులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఆందోళనలలోనూ పాల్గొంటుండవచ్చు. దేశం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసం తెలుగుజాతి ఐక్యతపై నిర్మాణమైన రాష్ట్రం ఒకటిగా ఉండాలని సిపిఐ(యం) అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పాలక ప్రతిపక్షాలు కూడా అలాగే అనుకోవడం లేదు. అందరూ ఇచ్చే సమైక్యత నినాదాలు ఒకటేననుకుంటే ప్రజలు దారుణంగా మోసపోతారు. 

దేశంలో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అప్రతిష్టను కాంగ్రెస్‌ మూటగట్టుకోబోతున్నది. మిగిలిన బూర్జువా, భూస్వామ్య ప్రతిపక్ష పార్టీలు తమ అవకాశవాద రాజకీయాలతో ఈ విచ్ఛిన్నంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. సమైక్య రాష్ట్రమే ఉండాలని ప్రకటిస్తూ వచ్చిన ఎంఐయం అభిప్రాయాన్ని మార్చుకుని ఇప్పుడు విభజన ప్రతిపాదనను సమర్థించింది. వాపపక్ష ప్రజాతంత్ర శక్తులలో ఒక ప్రధానమైన భాగం విభజనవాదాన్ని ఆలింగనం చేసుకుని పాలక పార్టీల రాజకీయ క్రీడకు ఒక అభ్యుదయ ముసుగు తగిలించింది. పార్లమెంటులో అత్యధిక సంఖ్యాబలం కలిగిన కాంగ్రెస్‌, బిజెపిలు ఒక్కటైన తర్వాత రాష్ట్ర విభజన అనివార్యమన్న పరిస్థితి ఏర్పడింది. చివరకు సిపిఎం ఒక్కటే దేశ, రాష్ట్ర, పీడిత ప్రజల ప్రయోజనాల దృష్టితో దాదాపు ఒంటరిగా రాష్ట్ర సమైక్యత కోసం నిలబడింది.

కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ సమస్యను సృష్టించి, నానబెట్టి ప్రతిష్టంభన సృష్టిస్తే, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు స్పష్టమైన అభిప్రాయాలు చెప్పకుండా సమస్యను జటిలం చేశాయి. పార్టీల నాయకులు ప్రాంతాల వారీగా వేర్వేరు వైఖరులను తీసుకుని అనైక్యతను పెంచి పోషించారు. టిఆర్‌ఎస్‌ విద్వేషపూరిత ప్రకటనల ద్వారా రెచ్చగొట్టుడు చర్యల ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను పెంచింది. సుహృద్భావాన్ని ధ్వంసం చేసింది. పర్యవసానంగా సమస్యను ఎటువైపు పరిష్కరించినా అసంతృప్తి, ఆందోళన తప్పని పరిస్థితి ఏర్పడింది. మూడున్నరేళ్ల క్రితం విభజనకు సిద్ధమైనప్పుడు గాని, ఇప్పుడు విభజన విధాన నిర్ణయం ప్రకటించినప్పుడు కాని కాంగ్రెస్‌ నిర్ణయాల వెనక స్వార్థపూరిత ఎన్నికల ప్రయోజనమే ప్రధానంగా దాగి ఉన్నది. కాంగ్రెస్‌ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే గత రెండుసార్లు దానికి అక్షయపాత్రగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తగినన్ని సీట్లు రావాలి. లేకపోతే 2014 ఎన్నికలలో అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుంది. అందుకే ఇక ఆలస్యం చేయడం మంచిది కాదనుకున్నది. అప్పుడు విభజన వలన రెండు ప్రాంతాల్లో లబ్ది పొందవచ్చని భావించింది. ఇప్పుడు ఐక్యంగా ఉంచితే రెండందాల నష్టపోతాం, విభజిస్తే ఒక చోటైనా లాభం పొందుతాం అన్న దుర్బుద్ధితో నిర్ణయం తీసుకున్నది.

ఇప్పటి వరకూ తమకు కొరకరాని కొయ్యగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదన కాంగ్రెస్‌ ఇచ్చిన ఆయాచిత అవకాశంగా బిజెపికి కన్పించింది. రాష్ట్రాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి ఫెడరలిజాన్ని బలహీనం చేయడం ద్వారా తన హిందూత్వ ఎజెండాను సులభంగా సాధించుకోవచ్చు, మతద్వేషాలను, సంఘర్షణలను రెచ్చగొట్టి బలపడవచ్చు అన్నది బిజెపి వ్యూహం. అందుకే విభజన గురించి ప్రధానమంత్రి సంప్రదించగానే బిజెపి నాయకత్వం ఎగిరి గంతేసి సమర్థిస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌ నుంచి, ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ప్రకటన రాకముందే మీడియాకు చెప్పి తమ గొప్పతనాన్ని ప్రచారం చేసుకున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బిజెపి బలపర్చడానికి సిద్ధమైన తర్వాత రాష్ట్ర విభజన నిర్ణయం పార్లమెంటులో ఆమోదం పొందడం సునాయాసంగా జరిగిపోతుంది.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన సహజంగానే తెలంగాణా ప్రాంతంలో ఉత్సాహాన్ని కలిగించింది. సీమాంధ్ర ప్రాంతంలో నిరసనకు, ఆగ్రహానికి కారణమైంది. గతంలో విభజన కోసం తెలంగాణాలో ఉద్యమాలు తీవ్రంగా జరిగితే ఇప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోస్తా-రాయలసీమలో ఉధృతంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అధిష్ఠానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు రావడం ప్రారంభమైన తర్వాత సమైక్యతా సెంటిమెంట్‌ను ఎలా వినియోగించుకోవాలా అనే ఆదుర్దా బూర్జువా పార్టీల నాయకుల్లో మొదలైంది. సమైక్యత కోసం తామే గట్టిగా వాదించామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు అధిష్ఠానానికి సమర్పించిన రోడ్‌ మ్యాప్‌లలోని అంశాలను పత్రికలకు లీకు చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వ్యాప్తి చేశారు. ఇతరులకన్నా తామే ఎక్కువ లబ్ధి పొందాలన్న ఆశతో అందరికన్నా ముందు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యులు స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. తామెక్కడ వెనకబడి పోతామోనని కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, తెలుగుదేశం శాసన సభ్యులు కూడా రాజీనామాలు సమర్పిస్తున్నారు.

అప్పటి వరకూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు, విభజనకు అనుకూలంగా పార్టీ చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన తెలుగుదేశం నాయకులు, కేంద్రం ఏ నిర్ణయం చేస్తే దానికి బద్ధులై ఉంటామని చెప్పిన వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఇప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వీరావేశాలతో ఊగిపోవడం, మీడియా ముందు ఊగిపోవడం చేస్తున్నారు. ఆ పార్టీల జెండాలతోనే ఆందోళనలు చేస్తున్నారు. విభజనకు సానుకూలమని చెప్పిన పార్టీలలో ఉంటూనే సమైక్యత పేరుతో రాజీనామాలు ఇవ్వడంలో, ఆందోళన చెయ్యడంలో వారికి వైరుధ్యమేమీ కన్పించడం లేదు. లేదా ప్రజలు గమనించరులే అన్న భరోసా అనుకోవాలి. పదవులకు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావు, ప్రయోజనాలేమీ పోవు, ఆ ధైర్యంతోనే పార్టీలకు కాకుండా పదవులకు రాజీనామా చేస్తుండవచ్చు. ఉద్యమాలతో ప్రజలు అలిసిపోయిన తర్వాత తమ పార్టీ అభిప్రాయానికి కట్టుబడి ఉండవచ్చనే కపటత్వం ప్రదర్శిస్తున్నారనుకోవాలి. ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్‌ చేయడం రాజకీయ నాయకులు తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే తోడ్పడుతుంది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అది రాజ్యాంగ ప్రతిష్టంభనకేమీ దారితీయదు. మహా అయితే రాష్ట్రపతి పాలనకు దారితీస్తుంది. అప్పుడు ప్రజల స్థితి పెనం మీద నుంచి పొయ్యిలోపడినట్టు అవుతుంది తప్ప ఉపయోగమేమీ జరగదు.

కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పుడు అందరూ సమైక్యత కోసం కట్టుబడి ఉన్నామంటున్నారు. 'సమైక్యత' అన్న మాటకు అందరి అర్థం ఒకటి కాదని పైపైన పరిశీలించినా తేటతెల్లమవుతుంది. చిరంజీవి గారు చెప్తున్న సమైక్యత హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం డిమాండ్‌తో ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ వారి సమైక్యత పదేళ్లకు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీతో ముగుస్తుంది. కాంగ్రెస్‌ వారి సమైక్యత ఆంటోనీ కమిటీకి నివేదించుకోవడంతో అంతం అవుతుంది. వైఎస్‌ఆర్‌ వారి సమైక్యత అస్పష్ట వ్యాఖ్యలతో, ఎదురుదాడితో ముగుస్తుంది. తెలుగుజాతి ముక్కలు కాకుండానే, సమైక్యతలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని కొద్ది మంది మేధావులు, సామాన్య మధ్యతరగతి ప్రజలు అనుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఆందోళనలలోనూ పాల్గొంటుండవచ్చు. దేశం, రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసం తెలుగుజాతి ఐక్యతపై నిర్మాణమైన రాష్ట్రం ఒకటిగా ఉండాలని సిపిఐ(యం) అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పాలక ప్రతిపక్షాలు కూడా అలాగే అనుకోవడం లేదు. అందరూ ఇచ్చే సమైక్యత నినాదాలు ఒకటేననుకుంటే ప్రజలు దారుణంగా మోసపోతారు.



బహుళజాతులున్న మన దేశంలోని భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చేస్తే ఫెడరలిజం నాశనం అవుతుంది. కేంద్రంలో అధికారాలు, నిధులు కేంద్రీకృతమవుతాయి. ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది. మతోన్మాద శక్తులు సులువుగా బలపడి లౌకికవాదానికి ప్రమాదం హెచ్చుతుంది. అంతర్జాతీయ, దేశీయ గుత్తపెట్టుబడిదారులు యథేచ్ఛగా ప్రభుత్వాలను శాసించి దోచుకోవడానికి అడ్డే ఉండదు. సరళీకరణ విధానాలకు కనీస ప్రతిఘటన ఇవ్వగల ప్రభుత్వాలు లేకుండా పోతాయి. కేంద్రం మీద ఆధారపడి మున్సిపాలిటీల స్థాయికి రాష్ట్రాలు దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాథమిక మెట్టుగా భాషా ప్రాయుక్త రాష్ట్రాల విచ్ఛిన్నాన్ని కోరుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రకటన తర్వాత 20కి పైగా చిన్న రాష్ట్రాల కోర్కెలు రగుల్కొన్నాయి. నయా సరళీకరణ విధానాలను భుజానకెత్తుకున్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు, ఏదో ఒక రూపంలో విభజన వైపు మొగ్గు చూపడంలో ఆశ్చర్య పడాల్సిందేమీలేదు. బూర్జువా పాలక పార్టీలు ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను తమ అవకాశవాద స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుంటాయి అన్న విషయాన్ని గత మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మరోసారి స్పష్టంగా రుజువు చేశాయి. రాష్ట్రంలో తమ మధ్య వనరులు, పదవుల పంపిణీ తగాదాలను పరిష్కరించుకునేందుకు బూర్జువా పాలక పార్టీలు, వర్గాలు విభజన- సమైక్యత సమస్యను సృష్టించాయి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు. రెండు రాష్ట్రాలలో ఎవరు పదవులు చేపట్టినా సరళీకరణ విధానాలను అనుసరిస్తారు. సంపదను పోగేసుకోవడానికి పదవులను వినియోగించుకుంటారు. పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు ఏ ప్రయోజనం దక్కదు. గతంలోనూ ప్రజా సమస్యలను పాలకవర్గ పార్టీలు పరిష్కరించలేదు. అప్పుడూ కార్మికులు, కూలీలు, రైతులు, సామాజిక, బలహీన వర్గాల ప్రజలు పోరాటాలు చేశారు. ఇప్పుడు రాష్ట్రం రెండయినా పేదల, బలహీనవర్గాల సమస్యలు పరిష్కారం కావు. అందువలన కొత్త రాష్ట్రాలలో కూడా ప్రజలు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయక తప్పదు.

ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ సరళీకరణ విధానాలను అనుసరించాయి. రెండు రాష్ట్రాలయినా, ప్రస్తుత పాలక పార్టీలు ఏవి అధికారంలోకొచ్చినా సరళీకరణ విధానాలనే అనుసరిస్తాయి. పాలకులు అనుసరించిన సరళీకరణ విధానాల మూలంగా రాష్ట్రంలో గతంలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. కొత్త రాష్ట్రాలలో ప్రాంతాల మధ్య అస మానతలు ఇంకా పెరు గుతాయి. వెనకబడిన ప్రాం తాల అభివృద్ధికి అప్పుడూ ఉద్యమాలు తప్పవు. వామపక్ష పార్టీలు కొన్ని ప్రాంతీయతత్వాన్ని భుజాన ఎత్తు కోవడమే ప్రస్తుత పరిస్థితిలో ఆందోళనకర అంశం. ప్రజల సెంటి మెంట్‌కు అనుగుణంగా వ్యవహరించడం ద్వారా ఉద్యమం అభివృద్ధి అవుతుందన్న భావన ఈ శక్తులకు ఉండవచ్చు. కానీ కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వాల ద్వారా విప్లవోద్యమాలు ముందుకు పోయిన దాఖలాలు ఎక్కడా లేవు. వాస్తవంగా వీటి వలన ప్రజా ఉద్యమాలకు, ప్రజల ఐక్యతకు భంగం కలుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్ర విభజన విషయంపై వామపక్షాలలో ఉన్న అనైక్యత ప్రజా ఉద్యమాలకు ఆటంకం అయిందన్నది వాస్తవం. పైగా ప్రాంతీయతత్వాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో బలపడాలనే బిజెపి ప్రయత్నాలను వామపక్ష ప్రజాతంత్ర శక్తుల్లోని ఒక సెక్షన్‌ గమనించకపోవడం ప్రస్తుత పరిస్థితిలోని విషాదం.

రాజకీయ పార్టీలలోనే కాక కొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల్లోనూ అవకాశవాద ధోరణి ప్రబలంగానే ఉంది. రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ సంఘాలు తెలంగాణాలో విభజన కోసం, కోస్తా, రాయలసీమలో సమైక్యత కోసం జరిగే ఉద్యమాల్లో పాల్గొనడమేమిటి? రెండు పరస్పర విరుద్ధ డిమాండ్ల కోసం ఒకే సంఘం నిలబడడం ఎలా సాధ్యమవుతుంది? రెండు విరుద్ధ డిమాండ్లను ఏక కాలంలో సాధించడం ఎలా సాధ్యమవుతుందన్న కనీస ఆలోచన కూడా లేనట్లు అయోమయం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ అవకాశవాదంతో వ్యవహరిస్తున్న ప్రస్తుత తరుణంలో అవి స్పష్టమైన, సరైన వైఖరి తీసుకోకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలోనే రాష్ట్ర విభజన-సమైక్యత సమస్య పరిష్కారమవుతుందనుకోవడం అత్యాశ, అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు ప్రోత్సహించి సమ్మెల్లోకి దించవచ్చు. ఆ రకంగా సమ్మెలు చేసిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టం లేకపోవచ్చు. ఎందుకంటే రాష్ట్రం వేరైనా రెండు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చే పాలకులు సమ్మె కాలానికి జీతభత్యాలు ఇవ్వకుండా ఉండలేరు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నా జీతాలు ఆపలేరు. కానీ గతంలో ఉపాధ్యాయుల సమ్మె మూలంగా తెలంగాణ ప్రాంతంలో పేదల పిల్లలు నష్టపోయారు. ఇప్పుడు కోస్తా-రాయలసీమలో నష్టపోతారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మార్చాలని ఏ ప్రధాన పార్టీ చెప్పని నేపథ్యంలో పిల్లల భవిష్యత్తుకు హాని చేయడం అవసరమా అనేది ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించుకోవాలి. విభజన జరిగితే ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అటువంటి సమస్యలపై ఆందోళనలు-ఉద్యమాలు తప్పకపోవచ్చు. అటువంటి వాటి కోసం పోరాటమా? పాలక రాజకీయ పార్టీల అవకాశవాద అవసరాల కోసం పోరాటమా? అనేది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ముందున్న ప్రధాన సమస్య.

విభజన అంశాలపై చాలా సమస్యలొస్తాయి. విద్వేషాలు, వివాదాలను బూర్జువా పార్టీల నాయకులు రెచ్చగొడతారు. ఆవేశకావేశాలను సృష్టిస్తారు. సంకుచితత్వం, దురహంకార భావాలకు గురికాకుండా సామాన్య ప్రజల ఐక్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలా చేస్తూనే ఉపాధి రక్షణ, వనరుల పంపిణీ, వెనుకబడిన ప్రాంతాలన్నింటి అభివృద్ధికి చర్యలు, ఉద్యోగుల, పేదల, బలహీనవర్గాల హక్కుల రక్షణ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సమ న్యాయంతో నిర్ణయాలు తీసుకునేట్టుగా కృషి చేయడం అవసరం. 
-ప్రజామిత్ర

 (Prajasakti, 9.8.2013)