రాష్ట్రాన్ని
విభజించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ప్రధాన ప్రతిపక్షం బి జె పి
మద్దతు తెలిపింది. ఇరుపార్టీలకూ కలిపి పార్లమెంటులో మూడింట రెండువంతుల బలమున్నది.
కాబట్టి విభజన, సమైక్యత విషయములో ఎవరి అభిప్రాయము ఏ
విధముగా వున్నా విభజన అనివార్యమన్న
పరిస్థితి ఏర్పడింది.
తెలుగు
దేశం అధ్యక్షుడు చంద్రబాబు గతములోనే విభజనకి అనుకూలముగా లెటరు ఇచ్చారు. సమైక్యత
కావాలని చెప్పకుండా కేంద్రమే సబబయిన నిర్ణయము తీసుకోవాలని చెప్పి వై ఎస్ ఆర్ సి పి
విభజనను సమర్థించింది. ఇక బి జె పి మన దేశ ఫేడరల్ రాజ్యాంగానికే వ్యతిరేకం. భాషా
ప్రయుక్త రాష్ట్రాలకు, బలమయిన రాష్ట్రాలకు అది
వ్యతిరేకం. మతఘర్షణలు రెచ్చగొట్టి పెరిగేందుకు, హిందుత్వ
ఎజెండా సాధనకు చిన్న రాష్ట్రాలు దానికి అనువుగా వుంటాయి. సిపిఐ తన విధానం సమైక్యత, తన పత్రిక విశాలాంధ్ర కాగా ఆ వైఖరిని విరమించి విభజనకు అనుకూలంగా
తీర్మానించింది. యం ఐ యం చివరి నిమిషం లో తన అభిప్రాయం మార్చుకుని విభజనను
సమర్థించింది.
విదేశీ
స్వదేశీ పెట్టుబడిదారులు కూడా తమ సరళీకరణ,
ప్రయివేటీకరణ ఎజెండా నిరాటంకంగా అమలు జరిగేందుకు బలమయిన కేంద్రము, బలహీనమయిన రాష్ట్రాలు వుండాలని కోరుకుంటున్నారు. ఈ విధంగా
పెట్టుబడిదారులు, వారి పార్టీలయిన కాంగ్రెస్, టిడిపి, వైఎసార్సిపి, టి ఆర్
ఎస్ లు విభజనని సమర్థించాయి. పెట్టుబడిదారీ
పార్టీలుగానే గాక మత తత్వ పార్టీలుగా
వున్న బి జె పి, యం ఐ యం లు విభజనని సమర్థించాయి. వామ పక్ష
పార్టీలుగా వున్న సి పి ఐ తదితర పార్టీలు పెటీ బూర్జువా ఆలోచనా విధానానికి లోనై
విభజనని సమర్థించాయి. ఒక్క సి పి ఐ(యం) మాత్రమే రాష్ట్రం సమైక్యంగా వుండాలని
లెటరు ఇచ్చింది. స్పష్టంగా చెప్పింది.
కార్మిక వర్గ పార్టీగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అది అనుకూలం. కానీ పార్లమెంటులో
దాని బలం స్వల్పం.
ఈ నాటి
వాస్తవం ఏమంటే కాంగ్రెస్, బి జె పి లు అదే
విధముగా తెలుగు దేశం పార్టీలు తెలంగాణా విభజన కి అనుకూలముగా ప్రకటించిన
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవు. వై ఎస్ ఆర్ సిపి కూడా తన విధానము ఆంధ్ర ప్రదేశ్
సమైక్యముగా వుండటమేనని అనటం లేదు. మరి విభజన ఆగటానికి అవకాశము ఎక్కడ వున్నది?ఒక వేళ సీమాంధ్ర ప్రాంతములో వున్న అన్నీ పార్టీల పార్లమెంటు సభ్యులు కలిసి
విభజనకి వ్యతిరేకముగా పార్లమెంటులో వోటువేసినా(ఇది జరగదు) విభజన ఆగదు. ఎందుకంటే ఆ
విధముగా జరిగినప్పటికీ విభజన బిల్లును పాస్ చేయించగల బలము పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లకు వున్నది కాబట్టి.
అయినప్పటికి
సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్, టి డి పి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు పోటీపడి ఎవరికి వారు తామే నిజమయిన
సమైక్యతావాదులమని ఎందుకు ప్రకటిస్తున్నారు? సీమాంధ్ర
ప్రాంతములో వున్న సెంటిమెంటును ఎన్నికలలో సొమ్ము చేసుకోటానికే వీరు ఈ నాటకాలు
వేస్తున్నారు. వీరికే చిత్తశుద్ధి వుంటే విభజనకి అనుకూలముగా తమ నాయకత్వాలు
నిర్ణయించినందున తమ తమ పార్టీలకు రాజీనామా చేయాలి. కానీ వీరు ఆ పని చచ్చినా చేయరు.
కావాలంటే వాటిలోనే ఒక పార్టీనుండి ఇంకొక పార్టీకి తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు
చూసుకుని మారుతుంటారు. ఇవే పార్టీల నాయకులు
తెలంగాణ సెంటిమెంటును సొమ్ము చేసుకోటానికి అక్కడ ఒకరితో ఒకరు పోటీపడి తామే
మెరుగయిన విభజనవాదులమని చెప్పుకుంటున్నారు. ఇటువంటి వారు ఆడుతున్న విభజన, సమైక్యత అనే రాజకీయ చదరంగములో ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు పావులు కాకుండా వుండటము ఎంతయినా అవసరము. వీరిని నమ్మి
మోసపోవద్దు.
సీమాంధ్రలో
కొంతమంది ఈ రాజకీయ పార్టీల నాయకులతో సంబంధములేకుండా సమైక్యాంధ్ర ఉద్యమము
జరుగుతున్నదనే భ్రమలో వున్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ఏం ఎల్ ఏ, ఏం పి పదవులకు రాజీనామా యిస్తే విభజన ఆగిపోతుందని భ్రమ పడుతున్నారు. ఏం
ఎల్ ఏ, ఏం పి పదవులకు రాజీనామా చేసినా,
మంత్రి పదవులకు రాజీనామా చేసినా వాటిని వెంటనే ఆమోదించరు. మంత్రి పదవులకు రాజీనామా
చేశామన్న వారు కూడా బుగ్గ కార్లలో అదే హోదాలో తిరుగుతున్నారు. ఒక వేళ ఈ రాజీనామాలను ఆమోదించినా ఉప ఎన్నికలు కూడా
జరగవు. ఎందుకంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు త్వరలో
జరగనున్నాయి కాబట్టి చట్టం ప్రకరం ఉప ఎన్నికలు జరగవు. మహా అయితే ఈ ఆందోళణల వలన
పదవులకు రాజీనామాలవలన రాష్ట్రపతి పాలన వస్తుంది. ప్రజల పరిస్థితి మరింత
అధ్వాన్నముగా తయారవుతుంది.
విభజన
అనివార్యమయినప్పుడు హైదారాబాద్ సంగతేమిటి? నదీజలాల వివాదాల పరిష్కారం ఎలా జరుగుతుంది?
తెలంగాణాలో వున్న ఆంధ్రా ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?రాష్ట్ర
అప్పులని, ఆస్తులని
కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య ఏ విధముగా పంచాలి? ఇవన్నీ విభజించాలనే నిర్ణయము వలన తలయెత్తే సమస్యలు. అయితే ఈ సమస్యలు
ముందే పరిష్కరించి ఆ తరువాత విభజన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆంధ్రా ప్రాంత
కాంగ్రెస్, టి డి పి, వై ఎస్ ఆర్ సి పి
నాయకులు అతితెలివి వాదన చేస్తున్నారు. విభజనకి నిర్ణయించిన తరువాతనే ఆస్తుల పంపకం
జరుగుతుంది గాని, ఆ నిర్ణయం తీసుకోటానికి ముందే ఆస్తులు ఏ
విధముగా పంచుతారు? మన రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర విభజనకి ఒక
ప్రక్రియ వున్నది. ఆ ప్రక్రియ ప్రకారం:
1. కేంద్ర
మంత్రివర్గ సమావేశము విభజనకి అనుకూలముగా నిర్ణయము తీసుకోవాలి.దానిపై రాష్ట్ర శాసన
సభ, శాసన మండలి తీర్మానాలు అడగాలి.
2. శాసన
సభ, శాసన మండలి తీర్మానాలు తనకి అందిన అనంతరం రాష్ట్రపతి
వాటిని కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తారు.అప్పుడు విభజన వలన ఏర్పడే సమస్యల
పరిష్కారానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలి. (ఒక వేళ శాసన సభ, శాసన మండలి విభజనకి వ్యతిరేకముగా చెప్పినా కేంద్రము విభజన ప్రక్రియని
కొనసాగించి పార్లమెంటు ఆమోదానికి పెట్టవచ్చు)
3. ఈ
మంత్రివర్గ ఉపసంఘం విభజనవలన ఏర్పడే సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ, ఉమ్మడి రాష్ట్రపు ఆస్తులు-అప్పుల పంపకాలు, ఉద్యోగులకు విభజన వలన ఎదురయ్యే సమస్యలు, నదీజలాల
వివాదాలు, సీమాంధ్ర కి రాజధాని విషయం,
హైదారాబాద్ ఉమ్మడి రాజధానిగా ఎన్నాళ్ళుండాలి, ఉమ్మడి
రాజధానిగా వుంటే అది ఎవరి ఆధీనములో వుండాలి తదితర సమస్యల పరిష్కారాన్ని తెలియజేస్తూ ఒక ప్రతిపాదన తయారు చేసి
రాష్ట్రపతికి సమర్పించాలి.
4. ఈ
విధముగా వచ్చిన ప్రతిపాదనను రాష్ట్రపతి మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకి పంపించి ఒక
గడువులోగా దానిపై అభిప్రాయం తెలియజేయాలని కోరాలి.
5. ఆ
విధముగా ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ అభిప్రాయము వచ్చిన అనంతరము కేంద్ర మంత్రి వర్గము
విభజన బిల్లును తయారు చేసి లోక సభ, రాజ్య సభ ల
ఆమోదానికి విడి విడిగా సమర్పిస్తుంది.
6. పార్లమెంటు
ఈ బిల్లును ఆమోదించిన అనంతరము కొత్త రాష్ట్ర ఆవిర్భావ తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
7. అయితే తెలంగాణా రాష్ట్రము ఈ విధముగా ఏర్పడే
ముందు ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల ప్రజలకు విద్యా, ఉద్యోగాలు తదితరాలలో సమాన అవకాశాలు కల్పించే వుద్దేశముతో( దీనిని
కాంగ్రెస్, టిడిపి లు ఉల్లంఘించాయి,
అది వేరే విషయం)రాజ్యాంగానికి జరిగిన సవరణ(ఆర్టీకిల్ 371 డి)కి కాలము చెల్లుతుంది.
కాబట్టి ఆ సవరణని రాజ్యాంగమునుండి
తొలగించటానికి పార్లమెంటు ఆమోదించాలి.
కాబట్టి
ఇప్పటివరకూ జరిగినది విభజనకి అనుకూలముగా కాంగ్రెస్, బి
జె పి, టిడిపి, వై ఎస్ ఆర్ సిపిల
నిర్ణయం వరకే. కాంగ్రెస్, బి జె పి లు విభజనకి అనుకూలముగా
నిర్ణయించాయి కాబట్టి విభజన అనివార్యమయిన పరిస్తితి ఏర్పడింది. ఇప్పుడు చేయగలిగినదల్లా
ఇరుప్రాంతాలకీ సమన్యాయము జరిగేలా చూడటమే. రాజధాని, ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, నదీజలాలు
తదితర పంపకాల సమస్య చర్చించి పరిష్కరించాల్సిన సమయము అందుకోసము మంత్రివర్గ
ఉపసంఘాన్ని నియమించిన తరువాత వస్తుంది. అప్పుడు మంత్రివర్గ ఉపసంఘానికి ఈ సమస్యలపై
అభిప్రాయాలూ చెప్పి ఇరుప్రాంతాలకు సమన్యాయం జరిగేలా చూడాల్సిన అవసరము వున్నది.
ఇందు కోసం చిత్తశుద్ధితో, రాజకీయస్వార్థము కోసం ఉద్రేకాలను
రెచ్చగొట్టకుండా, శాస్త్రీయమయిన పద్ధతిలో,
రాజ్యాంగ పరిధిలో ఈ పంపిణీ వ్యవహారాన్ని పరిష్కరించాలి. కానీ ఇందుకు కూడా
కాంగ్రెస్, టి డి పి, వై ఎస్ ఆర్ సి, టి ఆర్ ఎస్ లు సహకరించవు. ప్రతి అంశము పైనా ప్రాంతీయ, ఉపప్రాంతీయ, వివాదాలను సృష్టించి రాజకీయ స్వార్థాలు
నెరవేర్చుకునేందుకు వ్యక్తిగతముగా, ముఠాలవారిగా, జిల్లాల వారీగా, ఉపప్రాంతాలవారిగా ఏ పద్ధతిలో
వీలయితే ఆ పద్ధతిలో తగాదాలు సృష్టిస్తారు. కాబట్టి ఇటువంటి జిత్తులమారి
రాజకీయనాయకుల స్వార్థాలకు బలికావటానికి కార్మికులు,
ఉద్యోగులు, ప్రజలు నిరాకరించాలి.
విడిపోవటానికి అనుకూలముగా వుంటూ సీమాంధ్రకు
విభజన అనంతరము ఆ ప్రాంతానికి బయటవున్న హైదరాబాదు శాశ్వత రాజధానిగా వుండాలనే కోరిక
అర్థ రహితము. విభజన వలన హైదారాబాద్ లో, తెలంగాణా
లో వున్న ఇతర ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధముగా ఇతర ప్రాంతాలలో వున్న
తెలంగాణా ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సమస్యలకు న్యాయమయిన పరిష్కారం చూపించాలి. విడిపోయినా
పదేళ్ళ పాటు హైదరాబాదు సీమాంధ్ర కు రాజధానిగా వుంటుంది కాబట్టి ఈ పదేళ్ళలో హైదరాబాదు పరిపాలన ఏ విధముగా వుండాలో రాజ్యాంగ పరిధిలో
స్పష్టత చూపించాలి. హైదరాబాదు మరియు తెలంగాణ ప్రాంతములో ప్రయివేటు రంగములో పని చేస్తున్న ఇతర రాష్ట్రాల, ఇతర ప్రాంతాల కార్మికులు, ఉద్యోగులను రాజ్యాంగం
ప్రకారము అక్కడినుండి వెళ్ళాలనే హక్కు ఎవరికీ లేదు. ఇతర దేశాలనుండి, ఇతర రాష్ట్రాలనుండి హైదారాబాద్, మరియు తెలంగాణా లో
పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నప్పుడు అక్కడ
ప్రయివేటురంగములో పని చేస్తున్న ఇతర ప్రాంతాల కార్మికులను,
ఉద్యోగులను పంపించటం కుదరదు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ మంత్రివర్గ ఉపసంఘము
సక్రమముగా పరిష్కరించాలి. అందుకోసము కార్మికుల, ఉద్యోగుల, ప్రజల శ్రేయస్సు కోరే వారందరూ చిత్తశుద్ధితో కృషిచేయాలి.
కాంగ్రెస్, బి జె పి,
టిడిపి, టీఆర్ ఎస్, యం ఐ యం అన్నీ
పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాల పార్టీలే. వారందరి విధానాలూ ప్రజలకు, కార్మికులకు, ఉద్యోగులకు హాని కలిగించే సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలే. ఈ విధానాల వలన
వెనకబడిన ప్రాంతాలు మరింత వెనకబడతాయి. అభివృద్ధి కొన్ని ప్రాంతాలలోనే
కేంద్రీకృతమవుతుంది. కాబట్టి వెనకబాటుతనాన్ని మండలాల వారీగా గుర్తించి అటువంటి
మండలాల అభివృద్ధికి కృషి చేయాలని పోరాడాల్సిన అవసరం వున్నది. ప్రభుత్వ రంగ సంస్థలకు, పెన్షన్ కు, ఉద్యోగ భద్రతకు,
ప్రజా సంక్షేమ పథకాలకు, కార్మిక సంక్షేమ పథకాలకూ చేటు తెచ్చే
సరళీకరణ విధానాలకు వ్యతిరేకముగా పోరాడాల్సిన అవసరము వున్నది. ధరలు విపరీతంగా పెంచే
విధానాలకు వ్యతిరేకముగా పోరాడాల్సి వున్నది. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు
సమావేశాలలోనే పెన్షన్ భద్రతకు చేటు తెచ్చే పెన్షన్ బిల్లును ప్రవేశ పెట్టేందుకు యు
పి ఏ ప్రభుత్వము సమాయత్తమవుతుండగా దానిని
ఆమోదించేందుకు బి జె పి సిద్ధముగా వున్నది. ఇందుకు వ్యతిరేకముగా పోరాడాల్సి
వున్నది.
కాబట్టి
పాలక పార్టీలు ప్రాంతాలవారీగా రెచ్చగొట్టే విచ్ఛిన్నకర ఉద్యమాలకు బలికాకుండా అన్నీ
ప్రాంతాల కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలు
నిర్మించాల్సిన అవసరము వున్నది. ఈ తక్షణ కర్తవ్యానికి కార్మిక, ప్రజా సంఘాలు పూనుకోవాలి.
No comments:
Post a Comment