కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్రాన్ని విభజిస్తామని చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు చేస్తున్న రాజకీయ సర్కస్ ఫీట్లు చూస్తే కొంత మందికి వినోదకరంగా, కొంత మందికి విషాదకరంగా ఉండి ఉండవచ్చు. కానీ ఎవరికీ సంతృప్తికరంగా మాత్రం లేదు. స్వార్థపూరిత ఎన్నికల దృష్టి తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనం వాటికి పట్టడంలేదు. ఏమాత్రం నిజాయితీ ఉన్నా గందరగోళానికి, అస్పష్టతకు తావులేకుండా అవకాశవాదాన్ని పక్కనపెట్టి స్పష్టమైన వైఖరులతో ముందుకు వచ్చి ఉండేవి.
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేస్తున్న పిల్లిమొగ్గలు చూస్తే ఎక్కడి ఆట అక్కడ ఆడుతున్నట్టు ఎవరికైనా అర్థం అవుతుంది. విభజన నిర్ణయానికి ముందు జరిగిన వార్ రూం సమావేశాల చర్చల్లో తలమున కలయ్యారు. అధినేత్రి సోనియాను ప్రత్యేకంగా పలుమార్లు కలిశారు. హుషారుగా ఉన్న ముఖ్యమంత్రి అని ఒక రోజు, దిగాలుగా ఉన్న ముఖ్యమంత్రి అని ఒక రోజు మీడియాలో ఎన్ని కథనా లొచ్చినా కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన విభజన ప్రక్రియలో పాలుపం చుకున్నారనేది యదార్థం. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విభజనకు వ్యతిరేకత పెరుగుతున్న సంకేతాలు కనబడిన వెంటనే తాను సమైక్యత కోసం గట్టిగా వాదించానని చూపించుకోవడానికి తాపత్రయ పడ్డారు. తాను సమర్పించిన నివేదికలోని ఒక భాగాన్ని మీడియాకు లీకు చేయించారు. ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధమవుతున్నారన్న కథనాన్ని కూడా మీడియాలో చొప్పించారు. అధిష్టానం కన్నెర్ర చేయడంతో అది మీడియా సృష్టించిన పుకారేనని అధికారికంగా ఖండించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విభజన వల్ల వచ్చే తీవ్ర సమస్యల గురించి ఆవేశపూరితంగా మాట్లాడారు. అధిష్టానాన్ని ధిక్కరించి సమైక్యత గురించి మాట్లాడి, రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క మగాడిగా ఒక సహచరుని నుంచి ప్రశంసలను కొట్టేశారు. బహిరంగంగా ప్రెస్‌లో మాట్లాడడంపై అధిష్టానం ఆగ్రహించడంతో మళ్ళీ సర్దుకున్నారని మీడియాలో కథనాలొచ్చాయి. ముఖ్యమంత్రి వ్యవహారమంతా ఉరుములు, మెరుపులు తప్ప వాన కాదని ఎవరికైనా అర్థమవుతుంది. కోస్తా, రాయలసీమలో విస్తృతంగా వ్యక్తమవుతున్న సమైక్యతా భావం నుంచి దూరం కాకుండా ఉండాలన్న భావం ముఖ్యమంత్రిలో ఉండవచ్చు. అటువంటి భావం నిజాయితీగా ఉంటే రాష్ట్ర విభజన ప్రకటించినప్పుడే బహిరంగంగా వ్యతిరేకత ప్రకటించవచ్చు. అధిష్ఠానవర్గం నిర్ణయం మార్చుకోకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవచ్చు. పార్టీ చేసిన నిర్ణయాన్ని అమలు చేయడం ఇష్టంలేకపోతే పార్టీ నుంచే వైదొలగవచ్చు. ఇవేమీ చేయకుండా పదవిలో, పార్టీలో ఉంటూనే ఎన్ని మాట్లాడినా సమైక్యవాదులను మోసగించడమే.
కోస్తా, రాయలసీమలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకుల వ్యవహార సరళి కూడా ఏమాత్రం భిన్నంగా లేదు. ప్రజలను వంచిస్తున్నారు. మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఏమాత్రం ఉపయోగంలేని పదవులకు రాజీనామా చేయడం వారికి పెద్దగా ఇబ్బంది కలిగించడంలేదు. కానీ పార్టీకి, పార్టీ పదవులకు మాత్రం అతుక్కొనే ఉన్నారు. రాష్ట్ర విభజన నుంచి వెనక్కిపోయేది లేదని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గం పదేపదే చెబుతుంటే అధిష్ఠానాన్ని ఒప్పించి తీరుతామని మీడియా ముందు అదరగొట్టేస్తున్నారు. విభజించిన పార్టీ పేరు మీదే సమైక్యత కోసం జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. తాము చేసిన పాపానికి తమ ప్రత్యర్థులు కారణమని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎం, సిపిఎంలు మినహా మిగతా పార్టీలన్నీ విభజనను కోరినందునే తాము విభజనకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు తమనొక్కరినే దోషులుగా చిత్రీకరించడం అన్యాయమని నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మిగిలిన పార్టీలన్నీ విభజనకు అనుకూలంగా చెప్పకపోతే విభజన అనేది జరిగేదే కాదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఫోరం నేత శైలజానాథ్ ఈ వాదనకు అక్షర రూపం కూడా కల్పిం చారు. కేంద్రంలో, రాష్ట్రంలో పరిపా లిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. విభజనైనా, సమై క్యత అయినా నిర్ణయం తీసు కోవాల్సింది కూడా కాంగ్రెస్ పార్టీయే. నిర్ణయం తీసుకున్నదీ కాంగ్రెస్ పార్టీయే. ఎవరి బలవంతం మీదనో నిర్ణయం తీసుకు న్నామని చెప్పడం సిగ్గుచేటు. గత దశాబ్దం నుంచి నిర్ణయం తీసుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరి బలవంతం మీదనో తీసుకున్నామని చెప్పుకోవడం విడ్డూరం. ఇప్పుడైనా కోస్తా, రాయలసీమ కాంగ్రెస్ నాయకులకు నిజాయితీ ఉంటే డొంక తిరుగుడు వాదనలు కట్టిపెట్టి నిజాయితీతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని నిజంగా వ్యతిరేకిస్తుంటే ఆ పార్టీ నిర్ణయాన్ని మార్పించేందుకు పూనుకోవాలి. ప్రజల్లో చేరి మోసగించే ప్రయత్నం మానుకోవాలి. పార్టీ నిర్ణయం మార్చలేమనుకుంటే ఆ పార్టీలో ఉండాలో, లేదో తేల్చుకోవాలి. పార్టీ నిర్ణయం నచ్చకపోయినా ఆ పార్టీని వీడడం కుదరదనుకుంటే నోరుమెదపకుండా కూర్చోవాలి. ప్రజలను వంచించే హక్కు వారికి లేదు.
మీడియాలో తరచుగా దర్శనమిచ్చే కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి ప్రపంచమంతా గ్లోబలైజేషన్ దారిపడుతుంటే రాష్ట్రాన్ని విభజించడమేమిటని ఆశ్చర్యపోతున్నారు. ఇంత మాత్రం తెలివితేటలు కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి ఎందుకు లేదన్న అనుమానం ఆయనకుంటే అధిష్ఠానాన్నే అడిగి ఉండాల్సింది. గ్లోబలైజేషనే విభజనవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న నిజం ఆయనకు తెలిసినట్టులేదు. తెలిసినా మర్చిపోదల్చుకున్నట్టుంది. ప్రపంచబ్యాంకు 2000లో విడుదల చేసిన ప్రపంచాభివృద్ధి నివేదికలో ప్రపంచం అంతా విలీనమవుతున్న కాలంలో దేశాలకు, పెద్ద రాష్ట్రాలకు ప్రాధాన్యత లేకుండా స్థానిక స్థాయికి ప్రాధాన్యత పెరిగిందని విశ్లేషణ చేసింది. అంతర్జాతీయ పెట్టుబడికి దోచుకోవడానికి ఎక్కడా ఏ ఆటంకాలుండకూడదు. బహుళజాతి కంపెనీలకు, రిలయన్స్ వంటి దేశీయ కార్పొరేట్ గుత్త సంస్థలకు బలమైన రాష్ట్రాలు ఆటంకాలుగా ఉండకూడదు. అందుకే రాష్ట్రాలు ముక్కలు కావాలని అవి కోరుకుంటున్నాయి. గ్లోబలైజేషన్ గురించి చప్పట్లు కొడుతున్న తులసిరెడ్డి లాంటి నాయకులకు రాష్ట్రాలను ముక్కలు చేయడం దాంట్లో భాగమేనన్న విషయం తెలియకపోవడం విచిత్రమే.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన ఆవేదననంతా వెళ్ళగక్కుతూ ప్రధానమంత్రికి సుదీర్ఘమైన లేఖ రాశారు. రాష్ట్ర విభజనను ప్రకటించిన 10 రోజుల తర్వాత లేఖ రాసినా, దానిలో తెలుగుదేశం పార్టీలోని అయోమయమే కన్పించింది. తెలుగుజాతి ఐక్యంగా ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తున్న అధినేత, రాష్ట్ర విభజన ఏ రకంగా తెలుగు ప్రజల ఐక్యతను కాపాడుతుందో వివరిస్తే బాగుండేది. తమ పార్టీ రాజకీయ వైఖరిని స్పష్టం చేసేదానికన్నా కోస్తా, రాయల సీమలలో వెల్లువెత్తుతున్న సమైక్య వాం ఛను అస్పష్టమైన అనునయింపు మాట లతో సంతృప్తి పరచాలనే ఆదుర్దా కనిపిస్తుంది. గతంలో రాష్ట్ర విభజనను సమర్థించడం తప్పు అనుకుంటే ఆ విషయాన్ని ఒప్పుకుని సమైక్యత కోరుకుంటున్నట్టుగా ప్రకటించాలి. లేదా ఇప్పటికీ విభజనకు మద్దతివ్వడం సరైందనుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా, సూటిగా చెప్పిన తర్వాత ఇంకేమైనా మాట్లాడవచ్చు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తెలుగుదేశం నాయకులు రాష్ట్ర సమైక్యత గురించి చేస్తున్న విన్యాసాలు నిజాయితీతో కూడినవి అనుకుంటే వారు తమ పార్టీ వైఖరిని మార్చుకోమని నాయకత్వాన్ని కోరాలి. లేదా పార్టీ వైఖరి మార్చుకోకపోతే పార్టీలో ఉండాలో, లేదో తేల్చుకోవాలి. అలా చేయకుండా కాంగ్రెస్ వంచనను, ద్రోహాన్ని, అప్రజాస్వామిక వైఖరిని ఎంత ఖండించినా, ఆ ఖండనలో ఎంత వాస్తవం ఉన్నా తమ అవకాశవాదం, విభజనలో తమ వంతు పాత్ర నుంచి తప్పించుకోలేరు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు జగన్, విజయమ్మ కూడా సుదీర్ఘమైన బహిరంగ లేఖను సంధించారు. ఆ లేఖలో కూడా విభజనకు అనుకూలమా? ప్రతికూలమా అనే విషయాన్ని వారు స్పష్టం చేయలేదు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని గతంలో చెప్పిన మాటకు ఇంకా పార్టీ కట్టుబడి ఉన్నదా? దాని నుంచి వెనక్కి తగ్గిందా? పేర్కొనలేదు. విభజన జరిగితేనే మంచిదని మనసు లోపల ఉంచుకుని సమైక్యత కోసం ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆకాంక్షకు అనుగుణంగా బయట మాట్లాడుతున్నట్లుగా ఉన్నది. ఆ పార్టీ శాసనసభ్యులు అందరికన్నా ముందు సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేసినట్టుగా ప్రచారం చేసుకుం టున్నారు. కోస్తా, రాయలసీమల్లో సమైక్య రాష్ట్రం విషయంలో అందరూ అవకాశవాదంగా వ్యవహరిస్తుంటే తామే నిజాయితీతో ఉన్నట్టు చెప్పు కుంటున్నారు. పార్టీ పుట్టక ముందు వైఎస్‌ఆర్ వ్యవహరించిన అవకాశవాదాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసినా, ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి చేస్తున్న హడావిడి వెనకా అవకాశవాదమే ఉన్నది.
రాష్ట్ర విభజన జరగాలని చాలా కాలం నుంచి చెబుతున్న బిజెపి కూడా తన అవకాశవాద ముఖాన్ని ప్రదర్శిస్తున్నది. కోస్తా, రాయలసీమల్లో సమైక్యతా వాంఛ తీవ్రంగా ప్రజల్లో వ్యక్తం అవుతుండడాన్ని గమనించి వారిని సంతృప్తి పరిచేందుకు మోడి హైదరాబాద్ రాక సందర్భంగా చేసిన ప్రయత్నం అందరూ గమనించవచ్చు. గుజరాత్‌లో గుజరాతీలు, తెలుగు ప్రజలు కలిసి బ్రతకగా లేనిది ఇక్కడ తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రజలు ఎందుకు కలిసి బ్రతకలేరు అని ఆయన అమాయకంగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బిజెపిదే. విభిన్న భాషల ప్రజలు కలిసి బ్రతుకుతుంటే ఒకే భాష ప్రజలను విడదీయాలని బిజెపి ఎందుకు కోరుతుందో బిజెపియే చెప్పాల్సి ఉంది. ఒకవైపున ప్రత్యేక తెలంగాణా బిల్లును వెంటనే పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ మరోవైపున ఇక్కడ అనునయ వ్యాఖ్యలు పలుకుతూ బిజెపి కూడా తన ఎన్నికల రాజకీయాలను ప్రదర్శించుకుంది.
తాము మాత్రమే నిజాయితీగా ఉన్నామని తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిపిలు ఎన్నికల లాభం కోసం అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతుంటే - కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపీలే ఎన్నికల యావతో వ్యవహరిస్తున్నాయని తెలుగుదేశంవారు - టిడిపి, కాంగ్రెస్‌లే ఎన్నికల్లో లబ్ధి కోసం మోసం చేస్తున్నాయని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు నిందించుకుంటున్నారు. మొత్తంగా ఈ పార్టీల విన్యాసాలు చూస్తే బూర్జువా-భూస్వామ్య పార్టీల ఎన్నికల అవకాశవాదం ఏ రకంగా ప్రజల జీవితాలతో, ప్రజల ఐక్యతతో చెలాగాటమాడుతోందో మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది.
-ప్రజామిత్ర(ప్రజాశక్తి 15.8.2013)
No comments:
Post a Comment