Tuesday, August 13, 2013

నేటి (13.8.2013) వ్యాసం, చర్చ

మోగని మోడీ!
కార్పొరేట్‌ మీడియా నరేంద్ర మోడీ గురించి పనిగట్టుకుని సాగిస్తున్న ప్రచార కాండ పస ఏమిటో ఆదివారం హైదరాబాదు సభతో తేలిపోయింది. ప్రధాని పరుగులో ముందుండాలని కలలుగంటున్న కాషాయ నేత శత ప్రచార సభలకు ఇది పేలవమైన ప్రారంభం అనాలి. అన్యధా శరణం నాస్తి అన్నట్టున్న స్థితిలో బిజెపి నాయకత్వం మోడీపై ఆశలు పెట్టుకుని ఊరేగిస్తున్నప్పటికీ ఆయనకూ ఆ అభివృద్ధి నిరోధక మతతత్వ పార్టీకి సహజంగా ఉన్న పరిమితుల రీత్యా ఇది మరోలా ఉండటం అసంభవం. తమ మౌలిక మతతత్వ సిద్ధాంతాలు చెబితే ప్రజలు మెచ్చరు గనక సూటిగా చెప్పలేరు. ప్రగతిశీల ప్రజాస్వామిక ప్రణాళికలు వారి దగ్గర ఎలాగూ ఉండవు. ఏతావాతా మిగిలేది ఉత్తుత్తి వాగాడంబరం, శుష్క సూక్తులే.

మోడీ పర్యటనలో జరిగిందదే.నరేంద్ర మోడీ ప్రసంగం కాంగ్రెస్‌పై విమర్శలతో సాగడంలో ఆశ్చర్యం లేదు గాని విధానపరంగా ఆయన ప్రస్తుత నమూనాను ఏమీ అన్నది లేదు. యువతను అంత పెద్ద ఎత్తున సమీకరించిన మోడీ వారికి ఒక ఆశాజనకమైన విధాన ప్రణాళిక ఇవ్వకుండానే “వుయ్ కెన్,  వుయ్ కెన్”  అని ఉత్తుత్తి ప్రతిజ్ఞ చేయిస్తే ఫలమేమిటి? హౌ కెన్‌” అన్నది దాటేసి “వుయ్  కెన్‌”  అనడం బూటకం. రూపాయి విలువ పతనం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాలెన్ని ప్రస్తావించినా అందుకు కారణమైన విధానాలను అంటుకున్నది లేదు. ఎందుకంటే బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు గాని, ఇప్పుడు గుజరాత్‌తో సహా పాలిస్తున్న చోట్ల గాని అక్షరాల ఇవే విధానాలను అమలు చేస్తున్నది.

కాంగ్రెస్‌ కన్నా సమర్థంగా సరళీకరణ అమలు చేస్తానని దేశ, విదేశీ కార్పొరేట్ల అండదండలు కూడగట్టుకుంటున్న బిజెపి వాస్తవంలో వాటిని ఒక పిసరు అదనంగానే అనుసరిస్తుంది. గత శుక్రవారం మా సంపాద కీయంలో పేర్కొన్నట్టు ఈ విధానాల అమలులో ఉభయపార్టీల మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ నడుస్తోంది. రాహుల్‌ వర్సెస్‌ మోడీ రాజకీయ ప్రహసనం అందులో భాగమే. దేశ భద్రత, పాకిస్తాన్‌ సైన్యం ఘాతుకాలు వంటి అంశాలను మోడీ దాడికి ఉపయోగించుకున్నారు గాని ఘనత వహించిన వారి ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ఇంతకన్నా అధ్వానమైన వ్యవహారాలు జరిగాయని ఎవరూ మర్చిపోలేదు. కాందహార్‌లో టెర్రరిస్టుల అప్పగింత, పార్లమెంటుపై టెర్రరిస్టు దాడి, మోడీగారి గుజరాత్‌లో అక్షర ధాంపై దాడి ఇవన్నీ ఎందుకు అరికట్టలేకపోయారు? కార్గిల్‌లో పాక్‌ దళాలు చొచ్చుకు వచ్చి తిష్ట వేసేంత వరకూ పసిగట్టకుండా పడుకుని గుర్రు పెట్టారే! ఆ నిర్లక్ష్య నిర్వాకాలకు ఆ తర్వాత దేశం ఎంత మూల్యం చెల్లించింది? కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు సాగిస్తున్న అస్తవ్యస్త వ్యవహారాలను సమర్థించనవసరం లేదుగాని బిజెపి పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉందని ఈ వాస్తవాలే చెబుతున్నాయి. అలాగే పాక్‌నూ, చైనానూ ఒకే గాట కట్టి మాట్లాడ్డంలో ఆరెస్సెస్‌ రాజకీయం తప్ప దౌత్య నీతి గోచరించదు.

 విదేశాంగ విధానానికి సంబంధించి అమెరికాకు సాగిలబడటంలోనూ కాంగ్రెస్‌ బిజెపిల మధ్య ఆట్టే తేడా శూన్యం. కనుకనే దేశ సార్వభౌమత్వం, అమెరికా ఆధిపత్య వ్యతిరేకత వంటి మాటలు ఆయన నోట రావు. స్వతంత్ర ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ సంక్షోభ నివారణ, ఉపాధి కల్పనా వ్యూహం, ఇత్యాది విషయాలు ఆయన ప్రస్తావిస్తారని ఆశపడిన వారికి నిరుత్సాహమే మిగలడం సహజం.

మోడీ ఎంపిక తర్వాత మోడువారిన ఎన్‌డిఎలో అకాలీదళ్‌ తప్ప చెప్పుకోదగ్గ భాగస్వామి ఒక్కటంటే ఒక్కటి లేదు. ప్రస్తుత సభలో కేవలం 116 స్థానాలు మాత్రమే పొందిన బిజెపికి ఈసారి బలం తగ్గడం తప్ప పెరిగే సూచనలు అగుపించడం లేదు. ఈ స్థితిలో కలసి వచ్చే వారి కోసం తహతహ లాడుతున్న బిజెపి నేతగా మోడీ ఎన్టీఆర్‌ వారసత్వ స్మరణ చేసి తెలుగు దేశంపై వల విసిరారు. ఆయన చైర్మన్‌గా ఉన్న నేషనల్‌ ఫ్రంట్‌లో బిజెపికి చోటు కల్పించలేదనీ, ఆ ఫ్రంట్‌ ప్రభుత్వంలోనూ బిజెపిని చేర్చుకోలేదనీ గుర్తుంచుకోవాలి. రథయాత్రానంతర మత కలహాలనూ, బాబరీ విధ్వంసాన్ని ఎన్టీఆర్‌ నిరసించారు. తర్వాత వారితో పొత్తు పెట్టుకోలేదు కూడా. చంద్రబాబు మాత్రమే 1999, 2004 ఎన్నికల్లో జతకట్టి తర్వాత ఆ విధానం మార్చుకున్నామని ప్రకటించారు. మోడీ వ్యాఖ్యలపై తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో గానీ ఎన్టీఆర్‌ది లౌకిక వారసత్వమే. కాంగ్రెస్‌ వ్యతిరేకత పేరిట నానాజాతి కూటమి కట్టి తాను అధికార సోపానం అధిరోహించాలనేది బిజెపి చిరకాల వ్యూహమే. మోడీ దాన్ని పునరావృతం చేయాలని చూస్తున్నా కోరి కొరివితో తల గోక్కునేవారెవరూ ఉండరని ఆశించాలి.

 కాంగ్రెసేతర లౌకిక శక్తుల ప్రత్యామ్నాయం విధానాల ప్రాతిపదికన రూపొందించేందుకు వామపక్షాలు ఇప్పటికే ఒక పత్రం ప్రకటించాయి కూడా. విధానాల ప్రసక్తిలేని మోడీ వాగాడంబరానికి, దానికి హస్తిమశకాంతరం తేడా. ఇప్పుడు తెలంగాణా, సీమాంధ్ర సోదరుల్లా మెలగాలని హితబోధ చేయడం మంచిదే గాని చిన్న రాష్ట్రాల చిచ్చు బిజెపి అధికార విధానమన్నది కూడా ఆ నోటితోనే చెప్పారు. హిందూత్వ నామస్మరణ గుజరాత్‌లో ఘోర నరమేధాన్ని అనుమతించిన మోడీ హైదరాబాదు వంటి చోట నామమాత్రంగానైనా మైనార్టీల ప్రస్తావన చేయకపోవడం యాథృచ్ఛికం కాదు. ఆ బాధ్యత తమపై వేసుకున్న రాష్ట్ర జాతీయ తెలుగు నాయకులు షరా మామూలుగా మజ్లిస్‌ను విమర్శించే పేరిట స్థానిక సాంప్రదాయిక మతతత్వ భాష మాట్లాడారు. జవహర్‌లాల్‌ నెహ్రూ గాక సర్దార్‌ పటేల్‌ ప్రధాని అయివుండాల్సిందంటూ మోడీ చేసిన మరో ప్రసంగంలో సంఘ పరివార్‌ తాత్వికతను పూర్తిగా ప్రతిధ్వనించారు. వీర తెలంగాణా సాయుధ పోరాటం నిజాం నిరంకుశత్వానికి గోరికట్టి విముక్తి చేస్తే అది సర్దార్‌ పటేల్‌ ఘనకార్యమైనట్టు మోడీ ఇక్కడకొచ్చి చెప్పడం హాస్యాస్పదం. అభినవ సర్దార్‌ బిరుదు అద్వానీ నుంచి లాగేసుకున్న మోడీ సోషల్‌ నెట్‌వర్క్‌లు వాడుతున్నా బూజుపట్టిన భావజాలానికి ప్రతినిధి గనకే నవభారతం ఆయనను తోసిపుచ్చాల్సి ఉంటుంది.(ప్రజాశక్తి 13.8.2013 సంపాదకీయం)

మోసపూరితం... అవకాశవాదం

రాజకీయ పక్షాల వైఖరి మారకుండా విభజన ఆగదు –సి పి ఏం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ప్రజలను మోసం చేసేందుకే సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు విమర్శించారు. సమైక్య రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు కాకుండా తమ పార్టీలకు రాజీనామా చేసి ఆ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. సోమవారం కర్నూలులో విలేకరుల సమావేశంలోను అనంతరం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాఘవులు మాట్లాడారు. పార్టీల వైఖరి మారకుండా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగదని అన్నారు. విభజన విషయంలో కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సిడబ్య్లుసిలో రాష్ట్ర విభజనకు తీర్మానం చేశాక రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు వచ్చాయని తెలిపారు. తమ పార్టీల వైఖరిని మార్చే విధంగా నాయకులు ఒత్తిడి తేవాలని సూచించారు. నాలుగు నెలల్లో ముగిసే ఈ పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న పద్ధతిలో రాజీనామాలు చేస్తున్నారనీ, మళ్లీ ఎన్నికల్లో మీ కోసం నిలబడ్డామంటూ మాయమాటలు చెబుతారనీ అన్నారు. రాష్ట్ర విభజనకు సిద్ధమని టిడిపి లేఖ రాసిందని, కాంగ్రెస్‌ నాయకులు అధిష్టానం నిర్ణయానికి, వైఎస్‌ఆర్‌సిపి కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు సమైక్యాంధ్ర కావాలని ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులున్నా సిపిఎం భాషా ప్రయుక్త రాట్ట్రాలకు కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించే వారిని అడ్డుకునే శక్తి తమ పార్టీకి లేదన్నారు.

 ఎన్జీవోలు ఆందోళనకు సిద్ధమవుతున్నారని, మోసపూరిత పార్టీల మాటలు నమ్మి మోసపోతారేమోనని బాధగా ఉందని రాఘవులు అన్నారు.మంత్రి టిజి వెంకటేశ్‌ కాంగ్రెస్‌ అధిష్టానం ముందు రాయల తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి, ఇక్కడేమో సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆయన వైఖరి మందలో మేకతోలు వేసుకున్న తోడేలులా ఉందన్నారు. ఇలాంటి వారిని నిలదీయాలన్నారు. విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీల్లో ఉంటూ మళ్లీ సమైక్యాంధ్ర కోసం ఆందోళనలు చేస్తే అది మోసపూరితం అవుతుందని తెలిపారు.

బిజెపి నాయకులు నరేంద్ర మోడీ మాటలు మోసపూరితంగా ఉన్నాయని, గుజరాత్‌లో గుజరాతీలు, తెలుగువారు కలిసి ఉన్నప్పుడు లేని అభ్యంతరం ఇక్కడ తెలంగాణ, సీమాంధ్రులూ కలిసి ఉండలేరా అని రాఘవులు ప్రశ్నించారు. కలిసి ఉండటమంటే సమైక్యవాదం కాదా.. ఒక ప్రాంతాన్ని ఎందుకు విడగొట్టాలని బిజెపి అనుకుంటోంది... అని అన్నారు. బిజెపి మొదటి నుండీ చిన్న రాష్ట్రాల డిమాండ్‌తో ఉందని, చిన్న రాష్ట్రాలుంటే మతవిద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందవచ్చని యోచిస్తోందని విమర్శించారు. చిన్న రాష్ట్రాల వల్ల కార్పొరేట్‌ శక్తులకు, ప్రపంచ బ్యాంకుకు, సామ్రాజ్యవాదులు తమ విధానాలను సులువుగా అమలు చేసేందుకు సాధ్యమవుతుందని తెలిపారు.

రాష్ట్ర విభజన వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తాము మొదటి నుంచీ చెబుతున్నామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు విభజన ప్రక్రియ మొదలయ్యాక ఆ నష్టాల గురించి అందరూ మాట్లాడుతున్నారని చెప్పారు. విభజన వాదంపై సిపిఎం చెప్పిందే కరెక్ట్‌ అని ఇప్పుడు అంటున్నారని తెలిపారు. అవకాశవాద, మోసపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌, టిడిపి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల ఉద్యమాలు విఫలమవుతాయే తప్ప ప్రజలకు ఎలాంటి ప్రయోజనం సమకూరదని అన్నారు. రాష్ట్రంలో గత మూడున్నరేళ్ల నుండి ప్రభుత్వమే లేదని, విభజన ప్రకటన తర్వాత ప్రభుత్వం పాత్ర మరింత దిగజారిపోయిందన్నారు. 108 సిబ్బంది, జూనియర్‌ డాక్టర్లు సమ్మెలో ఉంటే వారి గురించి అస్సలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వరదలకు తోడు వర్షాకాలంలో వచ్చే రోగాలతో ప్రజలు విలవిల్లాడుతున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.(ప్రజాశక్తి 13.8.2013)

అచంచల వైఖరిపై అవహేళన

రాష్ట్రంలో అన్ని ఫ్రధాన పార్టీలూ విభజన సమస్యపై పరిపరి విధాల విన్యాసాలు చేస్తున్నాయి. అక్కడా ఇక్కడా లాభం పొందడమెలాగని తలలు పగలగొట్టుకుంటున్నాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వంటివారిని కూడా చెరొక విధంగా మాట్లాడనిస్తున్నాయి. రాజీనామాల రాజకీయాలు నడిపిస్తున్నాయి. విలీనాలనూ, ఫిరాయింపుల బెడదనూ తప్పుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ఇన్ని మల్లగుల్లాల మధ్యనా స్థిరంగా, నికరంగా నిలబడిన పార్టీ సిపిఎం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నిశ్చలంగా, నిశ్చయంగా ఒకే వైఖరి తీసుకున్న పార్టీ అది. భాషా రాష్ట్రాల విభజన నష్టదాయకమని అప్పుడూ ఇప్పుడూ చెబుతున్నది. తాజాగా రాజ్యసభలోనూ సీతారాం ఏచూరి అదే చెప్పారు. ఇందుకు భిన్నంగా ఏ రోటి దగ్గర ఆ పాట అన్నట్టు వ్యవహరిస్తున్నాయి చాలా పార్టీలు. ఈ కారణంగానే రాజకీయ ప్రత్యర్థులు సైతం సిపిఎం కచ్చితంగా నిలబడిందని అభినందిస్తున్నారు. అయితే అతికొద్దిమంది మేధావులకు, విమర్శకులకు మాత్రం సిపిఎం విధానం నచ్చడం లేదు. సమైక్యత అంటూనే అక్కడా, ఇక్కడా ఏమీ చేయడం లేదని అలాటి వారి వ్యాఖ్య. ప్రజాస్వామిక స్ఫూర్తి, వాస్తవిక దృష్టి ఉన్న ఏ పార్టీ అయినా ప్రజలు ప్రాంతాల వారీగా, రెండు శిబిరాలుగా చీల్చబడిన ఇలాటి క్లిష్ట సమయంలో సంయమనం పాటించడం సహజమని వారు అర్థం చేసుకోలేక పోవడం విచారకరం. ఈ పేజీలో ప్రచురించిన కొన్ని వ్యాసాలలో పేర్కొన్నట్టు విభజన, సమైక్యత నినాదాలు రెండింటినీ పాలక వర్గ పార్టీలు దుర్వినియోగపర్చి భావోద్వేగాలు రగిలిస్తున్నాయి. వీటన్నిటి చాటునా వాస్తవం ప్రజలకు అర్థం కావడానికి కొంత సమయం అవసరం. పైగా అధికారం చేతిలో ఉన్న పార్టీలూ అంగబలం, అర్థబలం గల పార్టీలూ రాజకీయ మనుగడ కోసం ప్రజలను దారి తప్పిస్తున్నప్పుడు మరగుపడుతున్న సమస్యలపై పోరాడవలసిన కర్తవ్యం కూడా ముఖ్యమైందే. ఒక కమ్యూనిస్టు పార్టీగా సిపిఎం ఆ పాత్ర నిబద్ధంగా నిర్వహించింది. నిర్వహిస్తున్నది. అవకాశవాదాలను ఎండగడుతూ ఒకటైనా, రెండైనా పోరాటం అనివార్యం అంటూ ప్రజల పోరాట ఐక్యతను చాటి చెబుతున్నది. ఈ క్రమంలో ప్రజల అవగాహనను పెంచేందుకు, ఆచరణను పదునెక్కించేందుకు బహుముఖ కార్యక్రమాలు సాగిస్తున్నది. అసలు దోషులను వదలిపెట్టి ఇంత నిర్దిష్టమైన కార్యాచరణతో నిలబడిన సిపిఎంపై విమర్శలు చేయడంలో ఔచిత్యమేమిటో సదరు మేధావులే ఆలోచించాలి.(ప్రజాశక్తి 13.8.2013)

 



No comments:

Post a Comment