Tuesday, September 10, 2013

రామ రాజకీయం

దసరా పులి వేషం వేసినట్టు ఎన్నికలు అనగానే సంఘ పరివార్‌ రామ మందిరం సమస్యను పైకి తీయడం పరిపాటిగా మారింది. ఒకవైపున గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో తాము పూర్తిగా ఆధునికమైనామని చెప్పుకునే పరివార్‌ వ్యూహానికి రెండవ పార్శ్వమేమిటో ఇప్పుడు అయోధ్యలో తాజాగా జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అశోక్‌ సింఘాల్‌, ప్రవీణ్‌ తొగాడియాలతో సహా అనేక మంది అరెస్టు కావడం, నిషేధాజ్ఞలు విధించి ఉండకపోతే పరిస్థితి చేయిదాటి పోయి ఉండేది. చతురాస్య పరిక్రమ కోష్‌ అని అశోక్‌ సింఘాల్‌ ప్రచారం చేసుకోవడాన్ని అయోధ్య సాధువులే వ్యతిరేకించారంటే ఈ మతతత్వ రాజకీయాల్లో మర్మం బోధపడుతుంది. మత పరంగా చూసినా పరిక్రమ ఇప్పటికే జరిగిపోగా మళ్లీ తాము చేస్తామని చెప్పుకోవడం బూటకమని ఆ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మహంత్‌ జ్ఞాన్‌దాస్‌, రామ జన్మభూమి ట్రస్టు ప్రధాన అర్చకుడు మహంత్‌ సత్యేంద్ర దాస్‌ చెప్పాల్సి వచ్చింది. ఎన్నికల ప్రయోజనాల కోసం రామ మందిర సమస్యను వాడుకోవడం మంచిది కాదని వారు సూటిగానే విమర్శించడం విహెచ్‌పి, ఆరెస్సెస్‌ వంటి వాటికి అంతకు మించి బిజెపికి చెంపపెట్టు. స్వాములనూ సాధు సంతులనూ రాజకీయ వ్యూహంలో పాచికలుగా వాడుకుంటున్నారని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. గత ఇరవై ఏళ్లలోనూ అయోధ్యలో విహెచ్‌పి పునాది కోల్పోయిందనీ, కేవలం స్వార్థపరశక్తులే వారి వెనక చేరి ఇలాటి కార్యక్రమాలు చేస్తున్నారనీ ఈ సాధు సన్యాసులు చేసిన వ్యాఖ్యలను మతానుయాయులు తీవ్రంగా తీసుకోవడం అవసరం.
నిజానికి అయోధ్యలో బాబరీ మసీదు/రామ జన్మభూమి సమస్యను గాని, కాశీ, మధుర వంటివి గాని, మరో చోట వినాయక నిమజ్జనం గాని, దానిపై రభస సృష్టించి శాంతిభద్రతల సమస్యగా చేయడం వెనక గానీ ఉన్నది మతంపై ప్రేమ కాదు. మతతత్వం రెచ్చగొట్టడం ద్వారా ఓట్లు రాబట్టుకునే ఆరాటమేనన్న మాట వామపక్షాలు, లౌకికవాదులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు. పేద ముస్లిం మైనార్టీలు లేదా ఇతరుల సంక్షేమం కోసం ఏమైనా కనీస చర్యలు తీసుకుంటే ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించే బిజెపి, ఆరెస్సెస్‌లు సాక్షాత్తూ రాముడి బొమ్మతోనే తాము రాజకీయం చేస్తున్న సంగతి కప్పిపుచ్చగలమనుకుంటారు. దేశ చరిత్రలో తొలిసారిగా తన రథయాత్రతో క్రమపద్ధతిలో హిందూత్వ హింసానలం రగిల్చిన ఎల్‌కె అద్వానీ రథంపై అటు ఎన్నికల గుర్తు కమలం ఇటు రాముడి బొమ్మలతో ఊరేగిన సంగతి ఎవరికి తెలియదు? రాముణ్ణి పూజించడం లేదా రామ మందిరం కట్టుకోవడం వేరు. ఒక మతానికి చెందిన కట్టడం ఉన్న చోట వందల ఏళ్ల కిందట ఏదో జరిగిందనే పేరుతో ప్రతీకార రాజకీయంగా దాన్ని కూలదోయడం వేరు. ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకూ ఆటంకం కానంత వరకూ ఈ దేశంలో ఉన్న వందలాది మందిరాలతో ఎవరికీ ఏ పేచీ లేదు. అలా గాకుండా ఒక మత కట్టడం ఉన్నచోట మరో మతం వారు తలదూర్చి మంటలు పెట్టడమే ఆందోళనకు కారణమవుతుంది. ఆ క్రమంలో అయోధ్య కాండ ఎంతటి అనర్థాలకు దారి తీసిందో, అంతర్జాతీయంగా ఎంతటి దుష్ప్రభావం కలిగించిందో అందరికీ తెలుసు. దాదాపు ఇరవయ్యేళ్ల కిందట యుపిలో తమకున్న అధికారాన్ని ఉపయోగించుకుని భజనలు చేస్తామని అనుమతి తీసుకుని మసీదును కూలదోసిన అఘాయిత్యం ఎవరూ మర్చిపోలేదు. తర్వాత రాష్ట్రంలో వారే అధికారంలోకి వచ్చినా, కేంద్రంలోనూ ఆరేళ్లకు పైగా అధికారం చేసినా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనే చేయలేదంటే ఏమనాలి? తమ రాజకీయ అవసరాల కోసం రామమందిర సమస్య రావణకాష్టంలా రగులుతుండాలనే కుటిలత్వం తప్ప మరో కారణమేముంది?
ఈ ఇరవయ్యేళ్లలోనూ దేశంలో చాలా మార్పులు కలిగాయి. యుపిలోనూ చాలా కాలంగా బిజెపి బలం సన్నగిల్లుతున్నది. ఒక్క గుజరాత్‌లోనే భయానక జాతి హత్యాకాండ తర్వాత ఆ పార్టీ మోడీ నాయకత్వంలో పదే పదే విజయాలు సాధించింది. అనేక లోపాలు, పొరబాట్లు ఉన్నా ఆయననే తమ సారథిగా చేసుకుని ఎన్నికలలో గట్టెక్కాలని కలలు కంటున్నది. అందుకోసం ఆనాటి అయోధ్యుడు అద్వానీని కూడా అవతలకి నెట్టిందంటే అంతకంటే ఓటు బ్యాంకు రాజకీయం ఏముంటుంది? రాముణ్ణి రాజకీయ పావుగా చేసుకున్న పార్టీకి అద్వానీ, వాజ్‌పేయి వంటి వారు ఒక లెక్కలో ఉంటారా? మోడీ భజన ఎంత చేసినా, ఎంతగా ఆయనను భూతద్దంలో చూపినా తమ మౌలిక వ్యూహాలను మార్చుకునే ఆలోచన పరివార్‌కు ఎంతమాత్రం లేదు. పైగా మోడీ అటు కార్పొరేట్‌ మార్కెట్‌ తత్వానికి, ఇటు హిందూత్వ మతతత్వానికి ఏక కాలంలో ప్రాతినిధ్యం వహించగలడనే అంచనాతోనే ఎంచుకున్నారన్నది కూడా స్పష్టం. కనుకనే అలవాటైన పని విభజన ప్రకారం ఆయన రాజకీయ కార్పొరేట్‌ సమీకరణం చూసుకుంటే పరివార్‌ హిందూత్వ రాజకీయాలను ముమ్మరం చేస్తుందన్నమాట. ఉత్తరప్రదేశ్‌ పరిణామాలు, అయోధ్య వ్యవహారాలు అన్నీ అందులో భాగమే.
ఇప్పుడు యుపిలో అఖిలేష్‌ యాదవ్‌ నాయకత్వంలో నడుస్తున్న సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వం, దాని మూలవిరాట్టు ములాయం సింగ్‌లు అనేక సందర్భాల్లో బిజెపిని గట్టిగా ఎదుర్కొన్న మాట నిజం. అయితే ఇటీవల అశోక్‌ సింఘాల్‌, తదితరులతో ముఖ్యమంత్రి సమావేశాలు జరపడం కొన్ని సందేహాలకు తావిచ్చిందంటే అందుకు యుపి రాజకీయ నేపథ్యమే కారణం. ఎస్‌పి, బిఎస్‌పిల మధ్య మూడో స్థానానికి పడిపోయిన బిజెపి మళ్లీ లేవడానికి తెర వెనక మంతనాలు జరుపుతుందన్న సందేహం చాలా మందికి ఉంది. తొలిదశలో ఎస్‌పి నేతల తీరు కూడా అందుకు కాస్త అవకాశమిచ్చినట్టు కనిపించినా అరెస్టులు, ఆంక్షలతో అవన్నీ తొలగిపోతాయని భావించాలి. అయితే కాశ్మీర్‌లోనూ, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ మత కలహాలు రగిలించడంలో బిజెపి, ఆరెస్సెస్‌లు చురుగ్గా ఉన్నాయన్న వార్తలను తీవ్రంగా తీసుకోకతప్పదు. మన రాష్ట్రంలోనూ ఇటీవల మోడీ పర్యటించి తెలుగుదేశంపై బహిరంగంగానే వల విసిరేందుకు ప్రయత్నించడం కూడా ఇందులో భాగమే. ఇక్కడ తిష్ట వేసిన అనిశ్చితి మాటున పట్టు పెంచుకునే మార్గాల కోసం సంఘ పరివార్‌కు చెందిన కొన్ని శక్తులు పొంచి చూస్తున్న మాట నిజం. అందుకే దేశవ్యాప్తంగా లౌకికశక్తులు అన్ని వేళలా అప్రమత్తత వహించాలి. అయోధ్య సాధు సంతులే చేసిన వ్యాఖ్యలను బట్టి హిందూత్వ శక్తుల నిజ స్వరూపం ఏమిటో ప్రజలు గ్రహించాలి. (ప్రజాశక్తి 30.8.2013)

Sunday, September 8, 2013

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న పాలక వర్గ పార్టీలు

జనాగ్రహాన్ని వాస్తవ సమస్యలపైకి మళ్ళించటమే వామ పక్షాల, 
అభ్యుదయ శక్తుల తక్షణ కర్తవ్యం

స్వార్థ రాజకీయ ప్రయోజనమే విభజన నిర్ణయానికి తక్షణ కారణం

భారత దేశంలో ఏర్పడిన మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ విభజనకు గురి అవుతున్నది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం 2013 జూలై 30 న నిర్ణయం తీసుకుంది. దీనిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించాక, రాష్ట్ర శాసన సభ నిర్ణయం తీసుకోబడుతుందనీ, ఆ తరువాత పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించటం జరుగుతుందనీ, ఈ మొత్తం ప్రక్రియకు 4 నుండి 5 మాసాలు పడుతుందని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు.

ప్రజల కోరిక ప్రకారమే విభజన అవసరమయిందనుకుంటే 1969 లో ప్రత్యేక జై తెలంగాణా, 1972లో జై  ఆంధ్రా ఉద్యమాలు రెండు ప్రాంతాలలో జరిగినప్పుడే జరగాలి. కాబట్టి విభజనకు తక్షణ కారణం ప్రజలూ కాదు, ఉద్యమాలూ కాదు. రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోయే పరిస్థితి ఏర్పడిన కాంగ్రెస్ ను   కనీసం ఒక ప్రాంతంలో నయినా రక్షించుకోవాలనే తాపత్రయమే ఈ నిర్ణయానికి కారణం. కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం గతంలో టి ఆర్ ఎస్ లోకి క్యూ కట్టిన రాజకీయ వలసలు ఇప్పుడు కాంగ్రెస్ లోకి ప్రారంభమయ్యాయి. కాబట్టి తన నిర్ణయం పని చేస్తున్నదనే విశ్వాసం కాంగ్రెస్ అధినాయకత్వానికి కలిగింది. అందుకనే సీమాంధ్రలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా విభజన నిర్ణయం జరిగింది, దాని నుండి వెనక్కి తగ్గేది లేదు, మీ కోరికలు సమస్యలు ఏమైనా వుంటే చెప్పుకోండి, తీరుస్తాం అని కాంగ్రెస్ అధినాయకత్వం అంటున్నది.

విభజన నిర్ణయం లో కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీల భాగస్వామ్యమూ వుంది. తెలుగుదేశం విభజనకు మద్దతుగా గతంలో ప్రణాబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖ మాత్రమేగాక, రాష్ట్ర విభజనను కోరుతూ మళ్ళీ ఒక లేఖ ఇచ్చింది. వైఎస్సార్సీపి కేంద్రం  చేసే నిర్ణయానికి ఒప్పుకుంటానంది. బిజెపి మొదటినుండీ రాష్ట్రాన్ని చీల్చాలనే అంటున్నది. గతంలో సమైక్యరాష్ట్రాన్ని బలపరచిన సి పి ఐ, సిపిఐ(ఎం ఎల్) న్యూ డెమోక్రసీ లు మాట మార్చి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని బలపరచాయి. సిపిఎం, ఎం ఐ ఎం  లు మాత్రమే సమైక్య రాష్ట్రం కొనసాగాలన్నాయి. ఎం ఐ ఎం  కూడా తెలంగాణా ప్రకటన వచ్చాక పాత వైఖరిని మార్చుకుని విభజనని సమర్థిస్తూ ప్రకటించింది. సి పి ఎం  ఒక్కటి మాత్రమే సమైక్యతకు కట్టుబడి వున్నది.

భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చరిత్ర

సి పి ఎం  మొదటినుండి భాషాప్రయుక్త రాష్ట్రాల విధానానికి కట్టుబడివున్నది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల భావం ఆవిర్భవించింది. పోరాడేవారికి తమ భావజాల వ్యాప్తికి భాషాప్రయుక్త రాష్ట్రం అవసరం. కాబట్టి ఆనాడు బ్రిటీషు పాలనకి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో, నైజాము పాలనకి వ్యతిరేకముగా తెలంగాణా ప్రాంతములో జరిగిన పోరాటాలలో తెలుగు మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రములో వుండాలనే భావం బలపడింది.  పోరాడే పాత్రలో వున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కోరుకున్నాయి. అందుకు భిన్నంగా అనేక భాషలు మాట్లాడే వాళ్ళతో తాను ఏర్పాటు చేసిన మద్రాసు, బొంబాయి తదితర ప్రావిన్సులు కొనసాగాలనీ, ఆ విధంగా భాష ప్రాతిపదికగా  ప్రజల ఐక్యత సాధ్యం కాకుండా చేయాలనీ బ్రిటీషు పాలకులు కోరుకున్నారు. భాషా  ప్రయుక్త రాష్ట్రాల డిమాండును తిరస్కరించారు. కానీ స్వాతంత్ర్యం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుని భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించింది. దాంతో హైదారాబాద్ రాష్ట్రంలో వున్న తెలంగాణాలో మరియు కోస్తా రాయలసీమ లలో తెలుగువారందరూ ఒకే రాష్ట్రంలో వుండాలనే విశాలాంధ్ర ఉద్యమం ఉధృతమయింది. ఆ కాలంలోనే భాష ప్రాతిపదికగా ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర, ఐక్య గుజరాత్ తదితర భాష ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల తాకిడికి కాంగ్రెస్ ప్రభుత్వము దిగివచ్చి విశాల హిందీ ప్రాంతం మినహా దేశమంతటా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇదీ భాషా ప్రయుక్త రాష్ట్రాల క్లుప్త చరిత్ర. ఈ క్రమంలో భాగంగా హైదరాబాదు శాసన సభ, ఆంధ్ర శాసనసభ రెండూ అత్యధిక మెజారిటీతో ఆమోదించిన తరువాత 1.11.1956న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ నాటికీ అవసరమే

భాషా ప్రయుక్త రాష్ట్రం అనేది చాలా ముఖ్యమయిన విషయాలకు సూటిగా సంబంధం ఉన్న సమస్యగా మనం చూడాలి. భారత దేశం వివిధ జాతుల సమాఖ్య. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా తదితర జాతులు మనదేశంలో వున్నాయి. ఈ జాతులన్నింటికీ ఎవరి భాష, ప్రాంతం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, చరిత్ర  వారికి వున్నాయి. కాబట్టి భాష, ప్రాంతం, సంస్కృతి, ఆర్థిక జీవనం, సాంప్రదాయాలు, చరిత్ర ఆధారంగా జాతులు ఏర్పడ్డాయి. భాష ప్రధాన ప్రాతిపదికగా ఈ జాతులన్నీ భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ విధముగా ఏర్పడిన జాతి సర్వతోముఖాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి, ఆర్థిక ప్రగతికి ఆజాతి మొత్తము కలిసి  ఐక్యముగా ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రానికి  స్వయం నిర్ణయాధికారాలు, పుష్కళముగా నిధులు అవసరం. అటువంటి రాష్ట్రాలు బలముగా వుండటం అవసరం. కానీ భారత బడా బూర్జువా పాలక వర్గాలు ఈ వైవిధ్యాన్ని గుర్తించనిరాకరిస్తున్నాయి. తమలాభ తృష్ణను సంతృప్తి పరచుకోటం కోసం అవి కేంద్ర ప్రభుత్వము వద్ద విశేష అధికారాలు ఉండాలని కోరుతున్నాయి. రాష్ట్రాలను బలహీనం చేస్తున్నాయి. వాస్తవానికి కేంద్రప్రభుత్వ పరిధిలో  దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ నిర్వహణ, అంతర్రాష్ట్ర సమస్యలులాంటి కొన్నింటిని తప్ప మిగిలినవి వుండాల్సిన అవసరం లేదు.కానీ గత 66 సంవత్సరాలలో రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కూడా కుంచించబడుతున్నాయి. ఇందుకు వ్యతిరేకముగా జ్యోతిబసు, ఎన్ టి రామారావు, ఫరూక్ అబ్దుల్లా వంటి ప్రతిపక్ష ముఖ్యమంత్రులు నాడు ఉద్యమించి అనేక ఐక్య పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాల ఫలితముగా కేంద్ర, రాష్ట్ర సంబంధాలనూ, అధికారాలనూ సమీక్షించేందుకు సర్కారియా కమిషన్ ఏర్పడింది. ఆ కమిషన్ సిఫార్సులను కూడా ఇప్పటికీ సక్రమముగా అమలు చేయలేదు. రాష్ట్రాల హక్కులు, అభివృద్ధి కోసం ఇప్పటికీ ఈ పోరాటం కొనసాగుతున్నది. ఈ పోరాటంలో నిలవాలంటే రాష్ట్రాలు బలముగా వుండాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలను చీల్చ కూడదు.కాబట్టి జాతి ఆధారముగా ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలు బలముగా వున్నప్పుడే భారత దేశ సమాఖ్య(ఫెడరల్) వ్యవస్థ మనగలుగుతుంది. రాష్ట్రాల విభజనలు రాష్ట్రాల హక్కులను బలహీనపరుస్తాయి.
\
ప్రజాస్వామ్యము బలముగా వుండటానికి కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవసరం. 1984లో అప్రజాస్వామికముగా రద్దు చేయబడిన ఎన్ టి రామారావు ప్రభుత్వ పునరుద్ధరణ ఆంధ్రప్రదేశ్ ఒక బలమయిన భాషాప్రయుక్త రాష్ట్రముగా వుండి ప్రజలందరూ ఐక్యముగా ఉద్యమించినందున జరిగింది. కాబట్టి భాషాప్రయుక్త రాష్ట్ర విభజన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రజల ఐక్య పోరాటం బలహీనమవుతుంది.

బి జె పి రాష్ట్ర విభజనని కోరటం ఇతర బూర్జువా పార్టీలలాగా తక్షణ రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కాక, దీర్ఘ కాలిక మతోన్మాద దృష్టితోనేనని మనము గమనించాలి. బి జె పి, భారత దేశం అంతా ఒకే జాతి అని అంటున్నది. దేశాన్ని బహుళ జాతుల సమాఖ్యగా అది అంగీకరించదు. దాని దృష్టిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠా, గుజరాతీ, పంజాబీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ తదితర జాతులు లేవు. ఒకే భాష(హిందీ), ఒకే జాతి(హిందూ), ఒకే దేశం (హిందుస్తాన్) అనేది ఆ పార్టీ సిద్ధాంతం. దానర్థం బి జె పి దృష్టిలో వేరే జాతులూ, మతాలు, భాషలూ లేవని కాదు. ఉన్నప్పటికీ అవి హిందీకి, హిందూ మతానికీ లొంగి వుండాలనేది వారి భావన.  వివిధ జాతులు  స్వతంత్రంగా అభివృద్ధి చెందటం కాక అవి కేంద్రం ముందు లొంగి పోవాలని, అఖండ భారత్ లో కేంద్రప్రభుత్వము వద్ద అంతులేని అధికారాలు వుండాలానీ దాని విధానం. రాష్ట్రాలను బలహీనపర్చటం ఆ పార్టీ వ్యూహములో భాగం. చిన్న రాష్ట్రాలలో మతకలహాలను సృష్టించటము దానికి తేలిక. అందుకే దేశములో 60 రాష్ట్రాలు ఏర్పడాలని అది కోరుతున్నది. కాబట్టి రాష్ట్ర విభజన వలన లౌకిక తత్వము దెబ్బ తిని మతోన్మాదం పెరుగుతుంది.

మరోకోణము నుండి కూడా రాష్ట్ర విభజన అంశాన్ని చూడాలి. ఈ విభజనలు ఒక రాష్ట్రంతోనే ఆగిపోతాయా? ఇలా రాష్ట్రాలను విభజించుకుంటూ పోతే మరిన్ని విభజనల డిమాండ్లు ముందుకు వస్తాయి. మన రాష్ట్రములో రాయలసీమ డిమాండు ముందుకు రానే వచ్చింది. తెలంగాణా ఇవ్వటం న్యాయమయితే రాయలసీమ ఇవ్వటం ఎందుకు న్యాయం కాదూ? అసలు విభజనకి ప్రాతిపదిక ఏమిటి?వెనుకబాటు తనం ప్రాతిపదికగా విభజించాలంటే వెనకబడిన జిల్లాలను కూడా రాష్ట్రాలు చెయ్యాలి కదా? ఇలా విభజిస్తూ  పోతే దేశాన్ని ఎన్ని ముక్కలు చేయాలి? విభజన వలన వెనకబాటు తనం పోతుందా? ఎక్కడయినా అలా జరిగిందా?వెనకబడిన ప్రాంతం విడిపోతే అభివృద్ధికి అవసరమయిన మౌలిక సదుపాయాల కల్పనాకు కావాల్సిన భారీ పెట్టుబడులను సమకూర్చుకోటం కష్టమై అభివృద్ధి కుంటుబడుతుంది.  వెనకబాటుతనాన్ని పోగొట్టటానికి విభజన పరిష్కారం కానేకాదు.

 కాబట్టి భాషా ప్రయుక్త రాష్ట్ర  విభజన వద్దనటానికి  కారణం  ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ప్రజలు పోరాడి సాధించుకున్న సమాఖ్య వ్యవస్థ, లౌకిక వాదం, ప్రజాస్వామ్యము, ప్రజల ఐక్యత బలహీన పడకూడదనే.

విభజన-సమైక్యత ఉద్యమాల వర్గ స్వభావం మరియు ప్రజల భావోద్వేగాలు  

విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించటానికి ముందు  తెలంగాణాలో విభజన ఉద్యమాలు బలంగా జరిగాయి.  విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన అనంతరం సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా జరుగుతున్నది. రెండు ప్రాంతాల ఉద్యమాలలోనూ ప్రజలు అధికంగా పాల్గొంటున్నారు. ఈ ఉద్యమాల వర్గ స్వభావాన్నీ,  ప్రజలలో పెల్లుబికిన భావోద్వేగాన్నీ అర్థం చేసుకోవాలి. ఒక్క సి పి ఎం  మాత్రమే నికరంగా సమైక్య రాష్ట్రానికి కట్టుబడి వున్నదని కేంద్ర హోమ్ మంత్రి షిండే 7.9.2013 న చేసిన ప్రకటనలో ధ్రువపరచారు.

మరి నిరంతరం కత్తులు దూసుకుంటూ పరస్పరం విమర్శలు చేసుకునే ప్రధాన పార్టీలు కాంగ్రెస్, తెలుగు దేశం లు విభజన విషయములో ఎందుకు ఏకాభిప్రాయం వ్యక్తము చేశాయి? విభజించాలని తెలుగు దేశం ఎందుకు లేఖలు ఇచ్చింది? విభజించాలని కాంగ్రెస్ ఎందుకు నిర్ణయించింది? ఇది చాలా ఆశ్చర్యముగా కనిపిస్తున్నది. కానీ వర్గ దృష్టితో చూస్తే ఇది ఆశ్చర్యకరమయిన విషయం కాదు. సరళీకరణ విధానాలు అమలులోకి వచ్చిన తరువాత మన దేశములో పాలక వర్గాలు బలమైన రాష్ట్రాలుండటం ఇబ్బందికరంగా భావిస్తున్నాయి. విదేశీ కార్పొరేట్ సంస్థలు, స్వదేశీ గుత్త పెట్టుబడిదారీ శక్తులు తమ దోపిడీని యధేచ్చగా సాగించుకోటానికి తమకు అనుకూలముగా నిర్ణయాలను సులభముగా సాధించుకోటానికి చిన్న చిన్న రాష్ట్రాలు ఉంటేనే ప్రభావితం చేయగలమని భావిస్తున్నాయి.అలాగే హిందూత్వ  శక్తులు కూడా చిన్న రాష్ట్రాలయితే మతోన్మాదాన్ని సులభముగా రెచ్చగొట్టవచ్చునని భావిస్తున్నాయి. దేశాన్ని 60 ముక్కలు చేయాలని బి జె పి కోరటంలో అంతరార్థం ఇదే.

ఇంతేగాక రాష్ట్రాల్లోని స్థానిక పెట్టుబడిదారీ వర్గాలు కూడా రాష్ట్రాలు ముక్కలయితేనే వనరులతోపాటు అధికారములో కూడా తమకు వాటాలు దక్కుతాయని భావిస్తున్నాయి. మన రాష్ట్రములో వివిధ ప్రాంతాల్లో పాత సంపన్న తరగతులకు తోడు కొత్త సంపన్న వర్గాలు తయారయ్యాయి. వారు అధికారములో భాగం కావాలని ఆరాట పడుతున్నారు. పాత తరగతులు తమ అధికారములో వాటా ఇవ్వటానికి స్వచ్ఛందముగా ముందుకు వచ్చే అవకాశము లేనందున తగాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నాయి.  వాటి యొక్క ఒకానొక రూపమే ఈ విభజనోద్యమాలు. అందువలన ప్రస్తుతము రాష్ట్రములో జరుగుతున్న విభజన-సమైక్య ఉద్యమాల వెనుక పాలక వర్గాల్లోని వైరుధ్యాలున్నాయనేది గమనించాలి.

ప్రధాన పార్టీలన్నీ రాష్ట్ర విభజనను కోరుతున్నప్పటికీ ఈ పార్టీలన్నీ నిట్టనిలువునా చీలి తెలంగాణాలో విభజనకు, కోస్తా రాయలసీమలో సమైక్యతకు ఆందోళన చేస్తున్నాయి. సంపన్న వర్గాలు స్థూలంగా విభజనకు సానుకూలముగా వున్నప్పుడు పాలక వర్గ పార్టీల్లో నాయకులు కోస్తా రాయాలసీమల్లో సమైక్యత కోసం నిలబడటం ఎందుకు జరుగుతున్నది? కోస్తా రాయలసీమ ప్రాంతాల ప్రధాన పార్టీల నాయకులు సమైక్యవాదం అనేదానిని ఒక ముసుగుగా వినియోగించుకుంటున్నారు తప్ప నిజముగా సమైక్యత కోరుకోవటం లేదు. వారు విభజన వలన వచ్చే సమస్యలగురించే మాట్లాడుతున్నారు. ఆ సమస్యలు పరిష్కరిస్తే వారంతా విభజనకు అనుకూలమనేది స్పష్టం. హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతమయితే చిరంజీవి గారికీ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే కిషోర్ చంద్ర దేవ్ గారికీ,  రాయల తెలంగాణా చేస్తే జె సి దివాకర రెడ్డి గారికీ, కొత్త రాజధానికి 5 లక్షల కోట్లు ఇస్తే చంద్రబాబు గారికీ, అన్నీ ప్రాంతాలకీ సమ న్యాయం చేస్తే జగన్ గారికీ సమైక్యత అవసరం లేదు. అప్పుడు వాళ్ళంతా విభజనకు సిద్ధమే.  అలాగే ఉద్యమాలు నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులకి ఉద్యోగ, ఉపాధి, ఆస్తి భద్రతలు కల్పిస్తే విభజన చేసినా సమ్మతమే. నదీజలాలు సమంజసముగా పంపిణీ అయితే అనేక మంది రైతు నాయకులకు విభజన అభ్యంతరం లేదు. అందువలన ఈ రోజు కోస్తా రాయలసీమల్లో జరుగుతున్న సమైక్య ఉద్యమములో చాలా మందికి సమైక్యత అనేది ఒక ముసుగు మాత్రమే. (7.9.2013 నా జరిగిన ఏపీ ఎన్ జి వో ల ఎల్ బీ స్టేడియం సమైక్యతా సభ విభజనవలన సీమాంధ్ర ఉద్యోగులకి, విద్యార్థులకీ, రైతులకీ జరిగే నష్టాలనే చెప్పిందిగాని తెలంగాణా విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రజలకు విభజన వలన జరిగే నష్టాలను వివరించలేదు. కాబట్టి సారాంశంలో ఇది సీమాంధ్ర ప్రాంత ఉద్యమముగానే వున్నదిగాని సమైక్య ఉద్యమముగా లేదు)

సి పి ఎం  సమైక్యతకీ, ఇతరుల సమైక్యతకీ తేడా

సి పి ఎం  చెపుతున్న సమైక్యతకీ, పంపకాలలో కొన్ని సమస్యలు పరిష్కారం అయితే విభజనకి అభ్యంతరం లేని “సమైక్య వాదుల” సమైక్యతకీ మౌలికముగా తేడా వున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రాలవలన పీడిత ప్రజల, కష్ట జీవుల, బలహీన వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి సి పి ఎం  దానిని బలపరచటం లేదు.  భాషా ప్రయుక్త రాష్ట్రాల వలన పెట్టుబడిదారీ విధానములోనే ప్రజల కృషివలన స్థిరపడిన ప్రజాస్వామ్యము, లౌకిక వాదం, ఫెడరలిజం వంటి మంచి వ్యవస్థలు దెబ్బ తినకుండా వుంటాయి. కాబట్టే సి పి ఎం భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానాన్ని బలపరుస్తున్నది. అంతే  తప్ప భాషా ప్రయుక్త రాష్ట్రాలవాలన కార్మికులకు వేతనాలు, కవులుదారులకు రుణాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, దళితులకు గిరిజనులకు ఆత్మ గౌరవము, మైనారిటీల అభివృద్ధి, వృత్తులకు రక్షణ, మహిళలకు భద్రత వస్తాయని కాదు. పెట్టుబడిదారీ విధానం వున్నంత కాలం ఈ సమస్యలు అపరిష్కృతముగానే వుంటాయి. నిరంతరం పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే వుండాలి.

రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని విభజనవాదులు భ్రమలు కల్పిస్తున్నారు. వాస్తవముగా సమాస్యలు ఇంకా తీవ్రమవుతాయి. ఐక్యముగా పోరాడాల్సిన ప్రజల పోరాడే శక్తి విభజన మూలముగా ఇంకా బలహీనమవుతుంది. కొత్త రాష్ట్రాలకు సారధ్యం వహించే పాలకులు కూడా పెట్టుబడిదారీ విధానాలనూ, సరళీకరణ విధానాలనే అమలు చేస్తారు. అందువలన ప్రజలకు మౌలికమయిన ప్రయోజనమేమీ కలగదు.

సి పి ఎం జాగ్రత్తగా, స్వతంత్రముగా వ్యవహరిస్తుంది

పై అంశాలాన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం కోస్తా రాయలసీమల్లో జరుగుతున్న సమైక్యవాద ఉద్యమం పరిమితులు అర్థమవుతాయి. ఈ ఉద్యమములో చురుకుగా పాల్గోవటం ద్వారా మార్క్సిస్టు పార్టీ బలపడవచ్చుననే ఆశకు ఉన్న పరిమితి కూడా అర్థము అవుతుంది. వాస్తవంగా ఆ ఉద్యమములో మమేకము కావటాము ద్వారా మార్క్సిస్టు పార్టీ ప్రత్యేకతను ప్రజల ముందుంచే అవకాశాన్ని కోల్పోయి పాలక వర్గ పార్టీల మోసకారితనాన్ని ఎండగట్టలేము. ఆ పార్టీల ప్రభావం ఇంకా స్థిరపడటానికీ, వారితో పాటు ప్రజలను మనం కూడా మోసం  చేయటానికీ తోడ్పడుతుంది.

అందువలననే భావోద్వేగాల మీద ఆధారపడి పాలక వర్గాలు సృష్టించే ఉద్యమాల పట్ల జాగ్రత్తగా, స్వతంత్రముగా వ్యవహరించాలి.  అందుకే సి పి ఎం  గతంలో విభజన ఉద్యమ సందర్భములో, ఇప్పుడు సమైక్య ఉద్యమ సందర్భములో స్వతంత్రముగా వ్యవహరిస్తున్నది. సి పి ఎం  చెపుతున్న సమైక్యత యొక్క ప్రత్యేకతను, సమైక్యతనూ కాపాడుకోవాలంటే అనుసరించాల్సిన పద్ధతులను వివరించి ప్రజలను చైతన్య పరచేందుకు క్షేత్ర స్థాయి వరకూ సభలూ, సమావేశాలద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.

జనాగ్రహాన్ని వాస్తవ సమస్యలపైకి మళ్ళించాలి

పాలక వర్గాలు రెండు ప్రాంతాలలో నిర్వహిస్తున్న విభజన, సమైక్య ఉద్యమాల ఫలితాలు ఎలా వున్నా దానివలన ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. ఆ డిమాండ్లు నెరవేరితే లాభ పడేది పాలక వర్గాలే కానీ ప్రజలు కాదు. ఎందువలనంటే పెద్ద రాష్ట్రమయినా, చిన్న రాష్ట్రమయినా పాలక వర్గాలు అనుసరించే విధానాలు సామాన్యుల కష్టార్జితాన్ని కుబేరులకు దోచిపెట్టేవే తప్ప ప్రజల ఆశలను నెరవేర్చేవి కావు. మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాపితముగా ఆర్థిక సంక్షోభాలు ముదురుతున్న తరుణంలో, ప్రపంచీకరణ విధానాల అమలులో చిక్కుకున్న మనం కూడా ఆ ముంపుకు గురికావటం ఖాయం. అందుకే మన దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల పడి పోతున్నది. ఇప్పటికే 5 శాతానికి దిగజారింది. ఆహారం, కూరగాయలు, పెట్రోలు, డీజీలు ధరల నిరంతర పెరుగుదలతో ఇంకా అనేక సరుకుల ధరల పెరుగుదలతో ప్రజలు సతమవుతున్నారు. డాలరుకు మన రూపాయి మారకం విలువ ఎన్నడూ లేనంతగా దిగజారింది. దీని ఫలితాలు సామాన్యులపై దారుణంగా ఉండబోతున్నాయి. ప్రజల అసంతృప్తుల్ని ప్రస్తుతానికి విచ్ఛిన్న ఉద్యమాల వైపు పాలకా వర్గాలు జయప్రదంగా మళ్ళించగలుగుతున్నప్పటికీ ఈ కుయుక్తులను ఎల్ల కాలం సాగించ లేరు. జనాగ్రహాన్ని వాస్తవ సమస్యల పైకి మళ్ళించటమే వామ పక్షాలు, అభ్యుదయ శక్తుల తక్షణ కర్తవ్యముగా వుంటుంది.

(గమనిక: ఇది “మార్క్సిస్టు” సైద్ధాంతిక పత్రిక సెప్టెంబరు 2013 సంచికలో ప్రచురించబడిన “రాజకీయ అవకాశవాదంతో రాష్ట్రం నాశనం” పేరుతో తమ్మినేని వీరభద్రం గారు రాసిన వ్యాసం నుండి, “విభజన, సమైక్య ఉద్యమాల వర్గ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి” అనే మకుటం తో కొన్ని ప్రశ్నలకు బి.వి.రాఘవులు గారు ఇచ్చిన జవాబు నుండి వివరాలను సేకరించి దానికి మరి కొన్ని వాక్యాలను అక్కడక్కడా జోడించి తయారు చేయబడినది)

Saturday, September 7, 2013

సంస్కరణలే సంక్షోభానికి మూలం

ఆర్థిక సంక్షోభానికి పరిష్కారంగా 1991 నుంచి అమలైన సరళీకరణ సంస్కరణలే ఇప్పటి సంక్షోభానికి కారణం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని రాయితీలను ఇవ్వడానికి సరళం చేయడానికి సిద్ధమవుతున్నది. స్వల్పకాలిక విదేశీ పెట్టుబడులపై మూలధన లాభాలపై పన్నును(క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌)ను రద్దు చేయడానికి, రియల్‌ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నది. దిగుమతులను విచ్ఛలవిడిగా ప్రోత్సహించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అనేక దేశాలతో చేసుకుంటున్నది.
దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని సర్వత్రా చర్చ జరుగుతున్నది. 200 టన్నుల బంగారం అమ్ముకుని అప్పులు తీర్చి గట్టెక్కిన 1991 నాటి దుస్థితి మళ్ళీ దాపురించిందని అనేక మంది అంటు న్నారు. పరిస్థితి బాగా లేని మాట నిజమే కానీ మరీ అంత ఆందోళనకరం కాదని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ పార్లమెంటులో ప్రకటన చేస్తూ అన్నారు. మాటల్లో ఎన్ని తేడాలున్నా దేశం గడ్డు పరిస్థితినెదుర్కొంటున్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితులు సామాన్య ప్రజలకు తీవ్ర హాని చేస్తున్నాయి. వారి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి. పెరిగిన ధరలు వేతనాలకు, ఆదాయాలకు గండిపెడుతున్నాయి. ఉన్న వారికి ఉపాధిపోతున్నది. కొత్తవారికి ఉపాధి దొరకటం లేదు. చేసిన అప్పులు తీర్చలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. పరిస్థి తిని సరిదిద్దేందుకు ఆర్థిక శాఖా మంత్రి ఎంతగా నమ్మకం కల్గించే మాటలు చెప్పినా, పరిస్థితి కుదుటపడడంలేదు. ఇంకా దిగజారుతుందేమోనన్న భయాం దోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏ సరళీకరణ విధానాలు ప్రస్తుత పరిస్థితికి కారణమో, అవే విధానాలను పరిష్కారాలుగా ప్రభుత్వం చూపుతున్నది. ఈ పరిష్కారాలు సంపన్నులకు మరిన్ని రాయితీలను కల్పిస్తాయి. ప్రజలపై మరిన్ని భారాలను మోపుతాయి. ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారుతున్నదో అయిదు అంశాలను పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు.
మొదటిది స్థూల ఆర్థికాభివృద్ధి మందగించడం. దేశ స్థూల ఉత్పత్తి 2010-11లో 9.3 శాతం ఉంటే 2012-13లో 5 శాతానికి పడిపోయింది. ఈ సంవత్సరం పుంజుకుంటుందని ఆర్థిక మంత్రి చెప్తున్న అంచనాలకు భిన్నంగా 2013-14 మొదటి త్రైమాసికంలో స్థూల ఉత్పత్తి పెరుగుదల 4.4 శాతానికి పడిపోయింది. ఇప్పటి వరకూ ఆర్థికాభివృద్ధిలో సింహభాగాన్ని అందిస్తున్న సేవా రంగం 6 శాతానికి పడిపోయింది. పారిశ్రామికోత్పత్తి మరీ ఘోరంగా 1.2 శాతానికి పడిపోయింది.
ఆర్థికాభివృద్ధి కోసం స్వల్పకాలిక విదేశీ పెట్టుబడుల మీద, అప్పుపై ఆధారపడి పెరిగిన వినియోగం మీద ఆధారపడడం వలన ప్రస్తుత దుస్థితి వచ్చింది. విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉండేందుకు గతంలో ఉన్న ఆంక్షలనన్నింటినీ తొలగించారు. దేశంలోకి స్వల్పకాలిక పెట్టుబడులు, అప్పులు ఇబ్బడిముబ్బడిగా ప్రవేశిం చాయి. దీనితో స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. భూముల విలువలు, అద్దెలు ఆకాశాన్ని అంటాయి. రియల్‌ ఏస్టేట్‌, స్టాక్‌ మార్కెట్టు వ్యాపారాలకు, వినిమయ సరుకుల కొనుగోలుకు రుణా లను బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉదారంగా ఇచ్చింది. దీనితో ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పెరుగుతున్నదన్న బూమ్‌ వాతావరణం ఏర్పడింది. ఆర్థికాభివృద్ధి బుడగలాగా ఉబ్బింది. స్వల్పకాలిక పెట్టుబడులన్నీ చీమ చిటుక్కుమన్నా దేశాన్ని వదిలి పారిపోయే పెట్టుబడులే. దీనితో అప్పుల మీద ఆధారపడిన ఆర్థికాభివృద్ధి బుడగ పేలిపోయింది.
ఆర్థికాభివృద్ధిలో వచ్చిన మందగింపు ఉపాధిపై తీవ్రంగా పడింది. ఉన్న కాంట్రాక్టు, తాత్కాలిక కార్మికులను తొలగిస్తున్నారు. ఆటోమొబైల్‌, స్టీల్‌, ఐటి, బ్యాంకింగ్‌, నిర్మాణం వంటి రంగాల్లో తొలగింపులు ఎక్కువగా ఉన్నాయి. లే-ఆఫ్‌లు ప్రకటిస్తున్నారు. పని దినాలు కుదిస్తున్నారు. 2004-05లో ఉపాధిలో ఉన్న కార్మికులు 42 శాతం ఉండగా 2009-10కి 36.5 శాతానికి, 2011-12కు 35.4 శాతానికి పడిపోయింది. 2013-14 మొదటి త్రైమాసికంలోనే ఐదు లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని అంచనా. దేశంలో ప్రతి సంవత్సరం 45 లక్షల మంది అదనంగా ఉపాధి కోసం ఉద్యోగార్థుల్లో చేరుతున్నారు. ఉన్నవారికే ఉపాధి ఊడిపోతుంటే కొత్తవారికి ఉపాధి దొరికే పరిస్థితి ప్రస్తుతం కన్పించడం లేదు. స్థూల ఉత్పత్తి 7 శాతం ఉంటే ఉపాధి పెరుగుదల 10.5 శాతం ఉంటుంది. స్థూల ఉత్పత్తి 5 శాతానికి పరిమితమైతే ఉపాధి పెరుగుదల 7.5 శాతానికి తగ్గిపోతుంది. ప్రస్తుతం జాతీయ స్థూల ఉత్పత్తి బాగా దిగజారడంతో నిరుద్యోగ యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
రెండవది, వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం. 2012లో ద్రవ్యోల్బణం 9.3 శాతం ఉంటే ఇప్పుడు 11.14 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వం గత మూడు నెలల్లో పెట్రోల్‌ ధరలు ఆరుసార్లు పెంచింది. మార్చిలో లీటర్‌ రూ.75 ఉంటే ఇప్పుడు రూ.93కు చేరింది. గత ఆరు నెలల్లో డీజిల్‌ ధరను ఆరు సార్లు పెంచింది. మార్చిలో రూ.53 ఉంటే ఇప్పుడు రూ.57కు చేరింది. పార్లమెంటు సమావేశాల తరువాత మళ్ళీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, కిరోసిన్‌ ధరలన్నింటినీ పెంచాలని యోచిస్తున్నది. ఇంధన ధరలు ఈ రకంగా పెంచడం ఇతర సరుకుల ధరలన్నీ పెరగడానికి కారణమవుతుంది. నిత్యజీవితావసర సరుకుల ధరలన్నీ పెరిగాయి. ఉల్లి రూ.60, మిర్చి రూ.100, బియ్యం రూ.50 అమ్ముతున్నాయి. అన్ని కూరగాయ ధరలూ ఆకాశాన్నంటుతు న్నాయి. చాలీచాలని వేతనాలతో, ఆదాయాలతో బ్రతుకు తున్న పేద ప్రజల జీవన ప్రమాణాలు ధరల పెరుగుదలతో దెబ్బతిం టున్నాయి. ఈ సంవత్సరం వర్షపాతం బాగా ఉన్నందున వ్యవసాయోత్పత్తి పెరిగి త్వరలోనే ధరలు తగ్గుతాయని ప్రధాన మంత్రి చెప్తున్నారు. ప్రధాన మంత్రి చెప్పింది నిజమనుకున్నా రూపాయి పతనంతో పెరిగే ధరలను సానుకూల వర్షపాతం తగ్గించజాలదు.
మూడవది, రూపాయి విలువ పతనం. గత మూడు నెలల నుంచి రూపాయి విలువ వేగంగా పతనం అవుతూ ఉన్నది. 2011 ఆగస్టులో డాలరుకు రూపాయి మారకం 45 ఉంటే 2012 ఆగస్టు నాటికి 55, ఈ నాటికి(2013 సెప్టెంబర్‌) 67కు పడిపోయింది. రూపాయి విలువ ఈ సంవత్సరంలోనే 20 శాతం పతనం అయింది. అమెరికాలో పరిస్థితి బాగాలేనప్పుడు విదేశీ పెట్టుబడులు మనలాంటి ఆర్థిక వ్యవస్థ వైపు ఆసక్తి కనబర్చాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు ఇప్పటి వరకూ అమలు జరుపుతున్న ఉద్దీపన పథకాన్ని క్రమేణా ఉపసంహరిస్తామని ప్రకటించడంతో అక్కడ వడ్డీరేట్లు పెరిగి లాభకరంగా ఉంటుందన్న ఆలోచనతో పెట్టుబడులన్నీ మళ్ళీ విదేశాలకు తరలిపోవడం ప్రారంభమైంది.
దీనితో విదేశాలకు తీసుకెళ్ళేందుకు లేదా చెల్లించేందుకు డాలర్లకు డిమాండు పెరగడంతో డాలరు విలువ పెరిగి రూపాయి విలువ దిగజారడం ప్రారంభమయ్యింది. ఈ పరిస్థితులను సొమ్ము చేసుకోవడానికి మారకద్రవ్య వ్యాపారులు స్పెక్యులేషన్‌కు పాల్పడడంతో రూపాయి పరిస్థితి మరింత దిగజారింది. రూపాయి విలువ పతనంతో దిగుమతుల ధరలు పెరిగిపోతున్నాయి. మనకు అవసరమైన ముడి చమురులో 80 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నది. 40 శాతం రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకుంటున్నది. పుష్కలంగా బొగ్గు ఉండి కూడా 135 మిలియన్‌ టన్నుల బొగ్గును విదేశాల నుంచి తెచ్చుకుంటున్నది. సామాన్యులు, మధ్యతరగతి వినియోగించే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వంటనూనెల ధరలు, రైతులు వినియోగించే రసాయన ఎరువుల ధరలు, విద్యుత్తుత్పత్తికి వాడే బొగ్గు ధరలు భారీగా పెరుగాయి. సిరియాపై అమెరికా దాడి చేయనున్నదన్న ఆందోళన వలన అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు ఇంధన ధరలకు మరింత ఆజ్యం పోశాయి. రుణాలు తీసుకుని విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు చెల్లింపు మొత్తాలు పెరిగాయి. విదేశాల నుంచి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు తెచ్చిన అప్పులు చెల్లించడానికి, విదేశీ పర్యటనలు చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ప్రజావసరాలకు కూడా దిగుమతుల మీద ఆధారపడే మన లాంటి దేశాలలో రూపాయి విలువ పతనం సామాన్య ప్రజల జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
నాలుగవది, కరెంటు ఖాతా లోటు భారీగా పెరగడం. కరెంటు ఖాతా అంటే ఎగుమతుల, దిగుమతుల వ్యయం మధ్య తేడా, విదేశాల నుంచి వచ్చే విదేశాలకు పోయే వడ్డీ, లాభాల మొత్తాల మధ్య తేడా, దేశంలోకి దేశం బయటకు బదిలీ అయ్యే డబ్బు మధ్య తేడా. ఈ మూడింటిని కలిపినప్పుడు మిగులు ఉంటే కరెంటు ఖాతా మిగులు అంటారు. తరుగు ఉంటే కరెంటు ఖాతా లోటు అంటారు. ప్రస్తుతం మన దేశం భారీ లోటులో ఉన్నది. 2007లో కరెంటు ఖాతా లోటు 800 కోట్ల డాలర్లు ఉంటే ఇప్పుడు 9,000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈలోటు ప్రస్తుతం జాతీయ స్థూల ఉత్పత్తిలో 4.8 శాతానికి చేరింది. 2.5 శాతం లోపైతే ఆర్థిక వ్యవస్థ కొంత మేరకు తట్టుకోగలదు. అంతకు మించితే దేశంలో ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా హరించుకుపోయి బయటి దేశాలకు బకాయిలు చెల్లించలేని పరిస్థితి వస్తుంది.
కరెంటు ఖాతా లోటు భారీగా పెరిగితే దాని దుష్ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుంది. విదేశీ ఎగుమతిదారులకు, పెట్టుబడి మదుపరులకు నమ్మకం సన్నగిల్లి పరపతి తగ్గిపోతుంది. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థలు మనకు రేటింగ్‌ తగ్గిస్తాయి. దీంతో దేశంలోకి అప్పులు, పెట్టుబడులు రావడం మరింత సన్నగిల్లుతాయి. ఇది ఒక విషయవలయంగా మారి ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుంది.
ఐదవది, విదేశీ మారకద్రవ్య నిల్వలు తరిగిపోతుండడం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉంటేనే కరెంటు ఖాతా లోటును పూడ్చుకోగలం. మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 2011 ఆగస్టులో 31,800 కోట్ల డాలర్లు ఉంటే, 2013 ఆగస్టు నాటికి 27,500 కోట్ల డాలర్లకు తగ్గాయి. 2013 మార్చి నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదు నెలల్లోనే విదేశీ మారకద్రవ్య నిల్వలు 1,400 కోట్ల డాలర్లు తగ్గాయి. విదేశీ చెల్లింపులకు 2013 సంవత్సరానికి 26,600 కోట్ల డాలర్లు కావాలని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రస్తుత నిల్వలు ఆరు నెలల దిగుమతుల ఖర్చును చెల్లించడానికి కూడా సరిపోవు. ఇక చెల్లింపులు చేయడానికి విదేశీ మారకద్రవ్యం ఉండదు.
ఎగుమతులకన్నా దిగుమతులే ఎక్కువైనందున విదేశీ మారకద్రవ్యం రావడంలేదు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం మూలంగా ప్రవాస భారతీయులు స్వదేశానికి డబ్బు పంపడం కూడా తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు, విదేశీ అప్పుల ద్వారా వచ్చే నిధులపైనే విదేశీ మారకద్రవ్యానికి ఆధారపడాల్సి ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వస్తే మారక నిల్వలు కొంత నిలకడగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ పెట్టుబడి నిష్పత్తి విదేశాల నుంచి వచ్చే మొత్తం పెట్టుబడిలో రోజురోజుకు తగ్గిపోతున్నది. మొత్తం విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిలో ప్రత్యక్ష పెట్టుబడి వాటా 35 శాతం మాత్రమే. మిగతాదంతా నిలకడలేని స్వల్ప కాల పెట్టుబడి మాత్రమే. ఈ పెట్టుబడి ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా పలాయనం చిత్తగిస్తుంది.
విదేశీ అప్పు దేశ స్థూల ఉత్పత్తిలో 2011 మార్చిలో 17.5 శాతం ఉంటే 2013 మార్చి నాటికి 21.2 శాతానికి పెరిగింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో స్వల్పకాలిక అప్పులు, వ్యాపార రుణాల నిష్పత్తి 2012 మార్చిలో 42 శాతం ఉంటే 2013 మార్చి నాటికి 59 శాతానికి పెరిగింది. ప్రస్తుతం స్వల్పకాలిక అప్పులు 17,000 కోట్ల డాలర్లుగా ఉన్నది. ఈ అప్పులను ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉండడంతో మారకద్రవ్య నిల్వలు స్థిరంగా ఉండవు. స్వల్పకాల విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, విదేశీ అప్పుల వాయిదాలు, వడ్డీలు చెల్లించాల్సి రావడం వేగంగా తరిగిపోతాయి. కరెంటు ఖాతా లోటును పూడ్చుకోవాల్సి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు గురవుతుంది. ఇప్పుడు జరుగుతున్నదదే.
ఆర్థిక సంక్షోభానికి పరిష్కారంగా 1991 నుంచి అమలైన సరళీకరణ సంస్కరణలే ఇప్పటి సంక్షోభానికి కారణం. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మరిన్ని రాయితీలను ఇవ్వడానికి సరళం చేయడానికి సిద్ధమవుతున్నది. స్వల్పకాలిక విదేశీ పెట్టుబడులపై మూలధన లాభాలపై పన్నును(క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌)ను రద్దు చేయడానికి, రియల్‌ ఎస్టేట్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నది. దిగుమతులను విచ్ఛలవిడిగా ప్రోత్సహించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను అనేక దేశాలతో చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను, స్వదేశీ గుత్త సంస్థలను సంతృప్తి పరిచే విధానాలను విడనాడి పెట్టుబడి పలాయనం కాకుండా, అనవసర దిగుమతులు పెరగకుండా సరైన ఆంక్షలను విధిస్తే ప్రస్తుత పరిస్థితిని అధిగమించవచ్చు. అలాగే ప్రధానంగా దిగుమతుల మీద ఆధారపడుతున్న బొగ్గు, రసాయనిక ఎరువులు, వంటనూనెల దేశవాళీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలి. బంగారం, విలాస వస్తువుల దిగుమతులపై గట్టి నియంత్రణలను పెట్టాలి. భారీగా దిగుమతులు చేసుకోవాల్సిన ముడి చమురును చౌకగా సరఫరా చేసే వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఇంధనం దిగుమతి చేసుకునే ఈ దేశాలకు మన ఎగుమతులను కూడా పెంచడం ద్వారా మారకద్రవ్య చెల్లింపులను పరిమితం చేసుకోవచ్చు. విదేశీ పెట్టుబడులకు, స్వదేశీ గుత్త సంస్థలకు ఇష్టం లేని ఈ చర్యలు దేశానికి మాత్రం ఎంతో ఉపయోగం. కానీ మన దేశ పాలకులు దేశ ప్రయోజనాలు, ప్రజల క్షేమం కన్నా విదేశీ పెట్టుబడి, సంపన్న వర్గాల విలాస జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడాన్ని విరమించుకుంటేనే ప్రస్తుత పరిస్థితికి శాశ్వత పరిష్కారం. లేకపోతే పదేపదే ఇటువంటి సంక్షోభాలు తప్పవు. 
                                                                                                -బివి రాఘవులు(ప్రజాశక్తి 7.9.2013)

Friday, September 6, 2013

అస్తిత్వం కోసం అడ్డగోలు విన్యాసాలు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తాము సమైక్యమేనని సూటిగా బహిరంగ లేఖ రాశారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేరుగా చెప్పక పోయినా ఇంచుమించు అదే సంకేతం ఇస్తున్నారని అందరూ గుర్తించగలుగుతున్నారు. కాంగ్రెస్‌ సరే ఈ అరవై డెబ్బయి ఏళ్లలోనూ, తెలుగు రాష్ట్ర ఏర్పాటు దశలోనూ, విభజన దశలోనూ కూడా అనేక పిల్లిమొగ్గలు వేసి ప్రజలనూ, ప్రాంతాలనూ గందరగోళపరుస్తూనే ఉంది. తెలంగాణా ఏర్పాటే ఏకైక లక్ష్యమని ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర సమితి ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ నేతలు కూడా ఈ పదేళ్లలోనూ రకరకాల వ్యూహాలతో రాజకీయ తికమకకు కారకులైనారు. ఇప్పుడు విభజనకు అనుకూలంగా నిర్ణయం వచ్చిన దశలో వారు కూడా తమ భవిష్యత్తు గురించి మల్లగుల్లాలు పడుతుండడం వింతగా కనిపించే వాస్తవం. విభజనకు వ్యతిరేకమని చెప్పిన మజ్లిస్‌ నేతలు ఇప్పుడు అనుకూలత ప్రకటించేశారు. తెలంగాణా బిల్లుకు కేంద్రంలో మా మద్దతే కీలకమని రోజూ చెప్పుకునే బిజెపి కూడా కాంగ్రెస్‌ విభజన విధానం ప్రకటించిన తర్వాత తన రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకునే పనిలో తలమునకలవుతున్నది.
మొత్తం మీద ఈ పార్టీలు రకరకాలుగా విధానాలు మార్చుకోవడం వెనక ఎలాటి రాజకీయ సూత్రం లేదా ప్రాతిపదిక లేకపోవడం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. ఎవరైనా తమకు లాభదాయకంగా ఉండే వ్యూహం అనుసరించవచ్చు గాని ఆ పేరుతో ఇష్టానుసారం రోజుకో వైఖరి ప్రకటిస్తూ ప్రజలతో, ప్రాంతాలతో చెలగాటమాడే హక్కు ఉంటుందా? ప్రజల మనోభావాలు అన్న మాటనే మంత్రంలా వాడుతూ రకరకాలుగా రాజకీయ నాట్యం చేయడం అవకాశవాదం కాక మరేమవుతుంది? ఆయా దశల్లో ఆ పార్టీల మాటలను గాఢంగా విశ్వసించిన ప్రజానీకం తర్వాత అవి తలకిందులయ్యే సరికి ఏమనుకోవాలి?
వైఎస్‌, వైసీపీ పిల్లి మొగ్గలు
వైఎస్‌ రాజశేఖర రెడ్డి 1986-87లో రాయలసీమ ప్రత్యేక ఉద్యమం అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చారు. 2000 తర్వాత అధికారం కోసం ఆయనే ప్రత్యేక తెలంగాణా కోర్కె రంగం మీదకు రావడానికి వత్తాసునిచ్చారు. 2009 ఎన్నికల ముందు రోశయ్య కమిటీ వేశారు. తర్వాత ఎన్నికల తొలి దశ మొత్తం తెలంగానం ఆలపించి మలి దశ రాగానే వీసా పల్లవి ఎత్తుకున్నారు. ఆయన మరణానంతరం కుమారుడు జగన్మోహన రెడ్డి తెలంగాణా జిల్లాల్లో ఓదార్పు యాత్ర అన్నప్పుడు ఘర్షణ జరిగినా తర్వాత మళ్లీ సర్దుకుని అక్కడ వారు, ఇక్కడ మేము అన్న చందంలో టిఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడారు. ఇడుపులపాయ సమావేశంలో తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించడం గురించి చెప్పారు. ఉప ఎన్నికల్లోనూ ఆ కారణంగానే పోటీ చేయకుండా ఉండిపోయారు. సురేఖ ఆ కారణంతో రాజీనామా చేస్తే మళ్లీ టికెట్‌ ఇచ్చి పోటీ చేయించారు. కొన్నాళ్ల తర్వాత సామాజిక కోణంలో అక్కడ భూస్వామ్య వర్గాల ప్రతినిధులు తమతో చేరతారని, తెలంగాణాలో కూడా అనూహ్యంగా పుంజుకోగలమని లెక్కలు చెప్పారు. మీరే నిర్ణయం తీసుకోండని కేంద్రానికి ఖాళీ చెక్‌ ఇచ్చి వచ్చారు. ఈ దశలన్నిటిలోనూ తెలంగాణా లేదా కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై పడే ప్రభావం ఎలా ఉంటుందో పట్టించుకున్నది లేదు. తీరా చూస్తే విభజన నిర్ణయం రాకముందే రాజీనామాలు చేసి తర్వాత మరింత బాహాటంగా బయిటపడి కోస్తా, రాయలసీమలకే పరిమితమై పోవాలని నిర్ణయించుకున్నారు. విభజన జరిగితే ఇక్కడ ప్రాబల్యం వహించే అవకాశాలు నాస్తి అని అర్థం చేసుకోగానే విధానం మార్చుకున్న వైసీపీ కేంద్రాన్ని విమర్శించడం బాగానే ఉంది గాని తనను తాను విమర్శించుకోనవసరం లేదా? పైగా ఇప్పుడు కూడా కేంద్రం కన్నా తెలుగుదేశంపైనే దాని విమర్శ అధికంగా నడుస్తున్నది!
తెలుగు దేశం మల్లగుల్లాలు
ప్రధాన ప్రతిపక్షమైన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మరింత విపరీతమైన మార్పులకు గురైంది. ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగు జాతి ఆత్మగౌరవమంటూ బయిలుదేరిన పార్టీ అది. ఆ పార్టీ నాయకులే టిఆర్‌ఎస్‌ స్థాపకు లైనారు. ప్రాంతీయం ఉప ప్రాంతీయానికి దారి తీసినప్పుడు మొత్తం రాష్ట్రంపై పట్టు నిలుపు కోవడానికే ఆ పార్టీ ప్రయత్నించింది. చిన్న రాష్ట్రాల సృష్టికర్త బిజెపితో పొత్తుపెట్టుకున్నా ఆ సూత్రం ఇక్కడ వర్తించకుండా అడ్డుకున్నది. 2004 ఎన్నికల్లో సమైక్య నినాదంతోనే పాల్గొన్నది. తర్వాత నాలుగేళ్ల పాటు ఎటూ తేల్చకుండా దాగుడు మూతలాడి 2008లో విభజనకు అనుకూలంగా ముందుకొచ్చింది. ఇందుకు ప్రాతిపదిక ఏమిటో పెద్దగా చెప్పింది లేదు. అప్పుడు ఇతర ప్రాంతాల నాయకులు అడ్డుకున్నదీ లేదు. ఢిల్లీలో లేఖ ఇవ్వడానికి వారే ఆధ్వర్యం వహించారు. అధికా రంలోకి రావడానికి కాంగ్రెస్‌ ఉపయోగించిన తెలంగాణా కార్డునే తెలుగుదేశం కూడా ప్రయోగిం చాలన్న తాపత్రయం తప్ప పర్యవసానాల గురించిన ఆలోచనే ఆనాడు లేకుండా పోయింది. ఆ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకున్నా అందులో ఉభయత్రా నిజాయితీ లోపించి పరాజయమే మిగిలింది. వైఎస్‌ ఆయన మాటల్లోనే పాసు మార్కులతో అధికారం నిలబెట్టుకున్నారు. కెసిఆర్‌ నిరాహారదీక్ష అనంతర పరిణామాలలో తెలుగుదేశం అప్పటి ప్రభుత్వంపై చాలా దూకుడుగా వ్యవహరించింది. అయితే డిసెంబర్‌ 9 ప్రకటన వచ్చిన తెల్లవారే చంద్రబాబు మాటల్లో తడబాటు కనిపించింది. ఆ సమయంలో రాజీనామాల ఘట్టం సూత్రధారులం తామేనని తెలుగుదేశం యువనాయకులు చెబుతుంటారు. దాదాపు మూడేళ్ల పాటు అనిశ్చితి తాండవిస్తున్నా ప్రధాన ప్రతిపక్షం కూడా అంతకన్నా అస్పష్టతలో కూరుకుపోయింది. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడమనే పేరిట రెండు రకాలుగా మాట్లాడ్డానికి అవకాశమిచ్చింది. టిఆర్‌ఎస్‌ దాడి కూడా దానిపైనే కేంద్రీకృతమైంది. చివరకు 2012లో చంద్రబాబు పాదయాత్రకు ముందు రాసిన లేఖతో స్పష్టత ఇచ్చామన్నారు. ఆఖరి అఖిల పక్షంలోనూ అదే చెప్పారు.
విభజన నిర్ణయం వెలువడిన వెంటనే తొలి స్పందన కూడా ఆ దిశలోనే వెలువరించారు. తర్వాత మళ్లీ క్రమంగా స్వరం సవరించుకుంటూ సీమాంధ్ర ప్రజల సందేహాలు తొలగించాలన్న దానిపై వక్కాణింపు పెంచారు. అలా అనడంతో ఆగకుండా తాము విభజనను అడ్డుకు న్నామని, కాంగ్రెస్‌ తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసిందని కొత్తగా పాత సంగతులు చెప్పడం మొదలు పెట్టారు. ఎన్‌డిఎ హయాంలో తెలుగుదేశం కారణంగానే తెలం గాణా ఇవ్వలేక పోయామని అద్వానీ వంటి వారు చెబితే ఖండిస్తూ వచ్చిన తెలుగుదేశం ఇప్పుడు చంద్రబాబు స్వయంగా చేసిన వ్యాఖ్యలపై ఇచ్చే వివరణ ఏముంటుంది? ఏం చెప్పినా ఎలా సమర్థనీయమవుతుంది? విధానాలు మార్చు కోవడమే జరిగితే మరోసారి సూటిగా చెప్పి ఒప్పించాలి గాని చాప కింద నీరులా సంకేతా లిచ్చి ప్రజల భయ సందేహాలను ఎగదోయడం సరైందేనా?
కేంద్రం నిర్ణయం రాగానే తమ వాళ్లను మౌనం పాటించాల్సిందిగా చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తానే ఊరూరా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ప్రతిచోటా ఆయన రాష్ట్ర సమస్యతో పాటు తమ పార్టీని కాపాడుకోవడం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడు తున్నారు. ఇన్ని సార్లు విధానాలు మార్చు కోవడం, నిలకడ లేకపోవడం విశ్వసనీయతకు విఘాతం కలిగిస్తాయని తెలియక కాదు. పార్టీని కాపాడుకోవడంతో పాటు వ్యక్తిగతంగా లేక కుటుంబపరంగా నాయకత్వం కాపాడుకోవాలంటే కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో దృఢమైన వైఖరితో ఉన్నట్టు కనిపించాలని ఆయన నమ్ముతున్నారు. ఇతర చోట్ల ప్రభావం ఏమిటనేది ఈ సమయంలో అంత ముఖ్యం కాదనుకుంటున్నారు. ఎందుకంటే విభజనే జరిగితే ఈ దఫా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటుంది గనక తదుపరి కాలంపైనే దృష్టి పెడుతున్నారు. తెలంగాణాలోనూ బలమైన యంత్రాంగం, నాయకత్వం ఉన్నాయి గనక వాటి కోసం ఎలాగూ తమతో ఉండేవారు ఉంటారని ఆశిస్తున్నారు. ఈ మొత్తం వ్యూహ రచనలో ఎక్కడా సూత్రాలు, విధానాల ప్రసక్తి నాస్తి. పైగా తనే హైదరాబాదును అభివృద్ధి చేశాననీ, తన సంస్కరణలు గొప్పవేనని రెండు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటూనే ఉన్నారు. ప్రస్తుత వేడి తగ్గగానే మళ్లీ తమవైపు చూస్తారన్న ఆశతోనే విధానాల గజిబిజిని పక్కన పెట్టి గంభీర ప్రసంగాలు చేస్తున్నారు. ఈ పోటీలో తమ కంటే ముందే ప్రవేశించిన వైసీపీని వెనక్కు నెట్టి ఉనికిని కాపాడుకోవడం తప్ప ఉచితానుచితాలు ముఖ్యం కాదనే తెలుగుదేశం భావనగా కనిపిస్తుంది.
విభజనవాదుల వింత కలలు
ఇక తెలంగాణాకే పరిమితమైన టిఆర్‌ఎస్‌ సంగతి కూడా ఇందుకు భిన్నం కాదు. విభజన జరిగితే విలీనమై పోతాం అని చెప్పడం ద్వారా ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్‌కు తలుపులు తెరిచి ఉంచారు. తెలంగాణా విభజనవాదులు చెప్పే కష్టనష్టాలకు ప్రధాన కారణంగా అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్సే చెప్పాలి. తెలంగాణాలో భూస్వామ్య వర్గాలు, పెత్తందారీ తరగతులు ఇప్పటికీ ఆ పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. విభజన నిర్ణయం చేసినంత మాత్రాన ఆ పాతకాలన్నీ పరిహారమై పోతాయా? ఇప్పటి దుస్థితికి కారణమైన పాలక పార్టీ వారే రేపు నవతెలంగాణా నిర్మాతలుగా మారిపోతారా? విచిత్రమేమంటే మావోయిస్టులు, ఎంఎల్‌ పార్టీల సానుభూతిపరులైన మేధావులు కూడా ఇలాటి సమ్మేళనంలో నవతెలంగాణా స్వప్నం గురించి సంభాషించడం, సంకల్పాలు చెప్పడం!! ఈ దురవస్థలన్నిటికీ మూలవిరాట్టు లాటి కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ నేతలు కలసి కరగిపోయాక విభజనవాదుల కలలు నెరవేరే అవకాశమెక్కడీ కెసిఆర్‌ కురిపించిన హామీల అమలుకు ఆధారమేమిటి? ఆ లోగా సంయమనం పాటించే బదులు ప్రాంతీయ ఉద్రేకాలు పెంచేందుకు కారణమైతే ఎవరికి నష్టం? కాంగ్రెస్‌ తమను విస్మరిస్తోంది గనక తాము మరో ప్రాంతంపై కవ్వింపులకు పాల్పడతామంటే ఏ విధంగా సమర్థనీయం?
కాంగ్రెస్‌ కాపట్యం
ఇక కాంగ్రెస్‌ రాజకీయ చదరంగం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణా రాష్ట్రం ఇచ్చేది మేమేనని, అడ్డుకునేది మేమేనన్నట్టుగా తమ వారు అటూ ఇటూ వ్యవహరించేందుకు అధిష్ఠానం అనుమతినిచ్చేసింది గనకే మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రాజకీయ విన్యాసంలో ప్రతి మలుపూ కోట్ల మంది ప్రజల జీవితాలతో ముడిబడివున్నదన్న కనీస బాధ్యత కూడా లేకుండా తెలంగాణాలో ఎక్కువ సీట్లు తెచ్చుకుని తక్కిన చోట్ల ఉనికిని కాపాడుకోగలిగితే చాలన్నదే వారి ఆరాటంగా ఉంది. అవసరమైతే తమ వారు తాత్కాలికంగా బయిటకుపోయి మళ్లీ రావడానికి కూడా పథకం వేసినట్టు కనిపిస్తుంది. ఈ రాజకీయ నాటకాలలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర తరగతుల ప్రజలూ సమిథలు కావడమే ఇక్కడ విచారకరమైన వాస్తవం. విభజన, సమైక్యత ఏ నినాదమైనా సరే పాలక పక్షాల రాజకీయ క్రీడను సవ్యంగా అర్థం చేసుకోలేకపోతే వారు ఈ పరమపద సోపానంలో పాముల నోట పడటం తథ్యం. ఏ పదజాలం వెనక ఏ ప్రయోజనాలున్నాయో అర్థం చేసుకోవాలన్న లెనిన్‌ మాటలు ఇప్పుడు బాగా అక్కరకు వస్తాయి. 
-తెలకపల్లి రవి(ప్రజాశక్తి 6.9.2013)
  

Thursday, September 5, 2013

సమ న్యాయం లోపించిన సమైక్య, విభజన ఉద్యమాలు

సమ న్యాయం లోపించిన సమైక్య, విభజన ఉద్యమాలు
సీమాంధ్ర ఉద్యమం లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తున్నారు, ప్రయివేటువి నడవనిస్తున్నారు. ఆర్ టి సి బంద్ చేయిస్తున్నారు, ప్రయివేటు సర్వీసులు నడవనిస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లు మూసివేయిస్తున్నారు, ప్రయివేటువి నడవనిస్తున్నారు.  ఆర్ టి సి కి నష్టాలు కలిగించి ప్రయివేటు బస్సుల యాజమాన్యాలు అధిక లాభాలు దండుకునేందుకు అనుమతించటం, దళిత బలహీనవర్గాల విద్యార్థుల సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలు మూసివేసి ఉన్నత వర్గాల విద్యార్థుల ప్రయివేటు హాస్టళ్లు, ప్రయివేటు విద్యాలయాలు అనుమతిన్చటమ్ న్యాయమేనా? తెలంగాణా ఉద్యమంలో కూడా ఇదే విధమయిన సామాజిక వివక్షత పాటించబడింది. విభజన, సమైక్యత పేర్లతో జరిగే ఉద్యమాలు ఇటువంటి సమాజిక వివక్షతను నివారించాలి. 

Sent from http://bit.ly/f02wSy

Tuesday, September 3, 2013

సామాన్యులపై దండయాత్ర

అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం సామాన్యులపై దండయాత్రే! లీటర్‌ పెట్రోల్‌కు కేంద్రం వేసిన రూ.2.35కు తోడు రాష్ట్రంలో వ్యాట్‌తో కలిపి రూ.3.08 అదనంగా పెరిగింది. ఇల్లు కాలిపోతుంటే బొగ్గులేరుకున్న చందంగా జనానికి ధరల భారం పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వ్యాట్‌ బాదుతోంది. దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌ మన రాష్ట్రంలోనే వసూలు చేస్తోంది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వం ఈ పెంపుదలను ప్రకటించడం కేవలం ప్రజలపై భారం వేయడమేగాక ప్రజాస్వామ్య సంప్రదాయాలకూ తిలోదకాలివ్వడమే. మరికొద్ది రోజులలోనే గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.50, డీజిల్‌పై రూ.5, కిరోసిన్‌పై రూ.2 పెరగనుందన్న వార్తలతో జనం బెంబేలెత్తుతున్నారు. రాత్రి 8 గంటల తర్వాత పెట్రోల్‌ బంకులను మూసేస్తామని కేంద్ర మంత్రి మొయిలీ చెప్పడం దుర్మార్గం. పెంచిన ధరకు కూడా పెట్రోల్‌, డీజిల్‌ కొనుక్కుందామంటే వినియోగదారులకు అందనీయడన్నమాట. కానీ పార్లమెంటులో విపక్షాలు గట్టిగా నిలదీశాక మంత్రి తూచ్‌ అనడమేగాక ప్రధానమంత్రి కూడా అలాంటిదేమీ లేదని చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి విన్యాసాలు చేయడం ద్వారా పెట్రో ధరల పెంపుపై వ్యతిరేకత తీవ్రతను తగ్గించాలన్న దుర్బుద్ధి కూడా సర్కారు పెద్దలకు ఉండవచ్చు.

పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుదలకు రూపాయి విలువ పడిపోవడమే కారణమని చెబుతున్న సర్కారు అసలు ఆ దుస్థితికి తానే కారకురాలన్న విషయాన్ని మరుగుపరుస్తోంది. గత ఆగస్టులో డాలర్‌కు రూ.49 వచ్చేదల్లా ఈ ఏడాది 69 రూపాయల వరకూ దిగజారిపోవడానికి యుపిఎ సర్కారు, దాని నయా ఉదారవాద ఆర్థిక విధానాలు తప్ప ఇంకే కారణముంది? కరెంట్‌ ఖాతా లోటు వల్లే రూపాయి విలువ పడిపోతోందంటున్న సర్కారు ఎగుమతుల పెంపుదలకు, దిగుమతుల నియంత్రణకు తీసుకున్న చర్యలు పూజ్యం. ఇరాన్‌ నుంచి మనకు చమురు చౌకగా లభించడమే గాక ఖరీదును రూపాయల్లో చెల్లించే ఏర్పాటుంది. అయినా అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మన్మోహన్‌ సర్కారు ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలును తగ్గించి డాలర్లలో చెల్లించే సౌదీ వంటి దేశాల నుంచి దిగుమతిని పెంచడం దేశీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. 2011-12లో 18.1 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతి కాగా 2012-13లో కేవలం 13.1 మిలియన్‌ టన్నులకు అంటే 26 శాతం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా అక్కడి నుంచి 11 మిలియన్‌ టన్నులు చమురు దిగుమతి చేసుకుంటే 850 కోట్ల డాలర్ల విదేశీ వాణిజ్య లోటును తగ్గించుకోవచ్చునని సాక్షాత్తూ కేంద్ర పెట్రోలియం శాఖ అంచనా. ఈ ఒక్క పని చేస్తే 8,500 కోట్ల డాలర్ల కరెంట్‌ ఖాతా లోటులో పది శాతం తగ్గుతుందన్నమాట. తన మాట వినని ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి అమెరికా మనతో సహా అనేక దేశాలపై ఇలాంటి ఒత్తిళ్లు చేస్తోంది. సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం యుపిఎ సర్కారు ప్రజలను, ప్రజల బాగోగులను గాలికొదిలేస్తోందన్నమాట. భారత ప్రభుత్వం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని వామపక్షాలు పదేపదే చెప్పడం వెనుక గల ఇలాంటి ముఖ్య కారణాలు అందరూ అర్థం చేసుకోవాలి.

పనిలో పనిగా కేంద్రం రాయితీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.57.50 పెంచింది. ఇది ఎవరో రాయితీకి అర్హత లేని వారికి మాత్రమే వర్తిస్తుందని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సెప్టెంబర్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన నగదు బదిలీ విధానంలో తమ ఆధార్‌ కార్డును బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానం చేయనివారు ఈ ధరను చెల్లించాలి. అంతేగాక ఏడాదికి తొమ్మిది సిలిండర్లు పైబడి ఉపయోగించే పెద్ద, ఉమ్మడి కుటుంబాలు కూడా ఈ అదనపు ధరను చెల్లించాల్సిందే. ఇదో దొంగ దెబ్బన్నమాట. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు కేవలం వాటికే పరిమితం కాదు. ప్రజా, సరుకు రవాణా మాత్రమేగాక వ్యవసాయంలో దున్నడం, స్ప్రేయర్ల వాడకంతో సహా అనేక వృత్తులు, ప్రక్రియల్లో ఉత్పత్తిలో అవి ముఖ్యమైన భాగం. అందుకనే పెట్రోలియం ఉత్పత్తుల ధర పెంపు మిగిలిన అనేక వస్తువులు, సేవల ధరల పెంపునకు దారితీస్తాయి. ఈ గొలుసుకట్టు ప్రభావమే ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచుతుంది.

పెట్రో ధరల పెంపుదలను కేంద్రం ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమూ వ్యాట్‌ను తగ్గించడమో లేక పెంచిన ధరపై మినహాయించడమో జరగాలి. సామాన్యులను ఘోరంగా దెబ్బతీస్తున్న యుపిఎ సర్కారు విధానాలను మార్చుకోవాలి. ప్రజా జీవితంలో కీలక పాత్ర వహించే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను గతంలో ప్రభుత్వమే నియంత్రించేది. నయా ఉదారవాద విధానాలను నెత్తికెత్తుకున్నాక దానికి తిలోదకాలిచ్చారు. యుపిఎ సర్కారు పెట్రోల్‌ ధరలను పూర్తిగా డీకంట్రోల్‌ చేయడంతో వాటికి మరింతగా రెక్కలు వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తులను తిరిగి నియంత్రిత ధరల విధానం పరిధిలోకి తీసుకెళ్లాలి. ఇరాన్‌ నుంచి గరిష్ట స్థాయిలో చమురును దిగుమతి చేసుకోవడమేగాక చౌకగా చమురు లభించే అవకాశాలను అన్వేషించాలి. సిరియాపై దాడి చేయాలన్న అమెరికా దుష్ట యత్నాల కారణంగా యుద్ధ మేఘాలు అలుముకొని అంతర్జాతీయంగా చమురు ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడి చేయవద్దని ఒబామా సర్కారుకు భారత ప్రభుత్వం గట్టిగా చెప్పాలి. అయినా దాడికి పూనుకుంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇప్పటికే అమెరికాకు వంగివంగి సలామ్‌ చేస్తున్న యుపిఎ సర్కారు తనకు తానుగా అలాంటి స్వతంత్ర వైఖరిని చేపడుతుందని ఆశించలేం. అందుకు ప్రజా ఉద్యమ ఒత్తిడి అవసరం. ఆదివారం కొల్‌కతా మహానగరంలో వామపక్షాలు చేసిన భారీ ర్యాలీ ఆ దిశలో ఒక ముందడుగు. సర్కారుపై వివిధ రూపాల్లో ప్రజలు, ప్రజా ఉద్యమాల ఒత్తిడి పెరగాలి. 
                                                              ----(సంపాదకీయం, ప్రజాశక్తి 3.9.2013)







Monday, September 2, 2013

సెప్టెంబరు 5, 6 తేదీల్లో రాష్ట్రవ్యాప్త సభలు, ధర్నాలు—సి పి ఎం రాష్ట్ర కమిటీ పిలుపు

  ధరల పెరుగుదల, రూపాయి పతనం, అభివృద్ధి తరుగుదల, ఉపాధి క్షీణతకు కారణమైన యుపిఎ ప్రభుత్వ విధానాలను మార్చుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలకు నిరసనగా ఈనెల 5,6 తేదీల్లో అన్ని జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో సభలు, ధర్నాలు తదితర పద్ధతుల్లో ఆందోళనలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.

'కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరను లీటర్‌పై మూడు రూపాయలు, డీజిల్‌పై ధరను అర్దరూపాయి పెంచింది. గత మూడు నెలల్లో పెట్రోలు ధర ఆరుసార్లు, డీజిల్‌ ధర గత ఎనిమిది నెలల్లో 8సార్లు పెరిగాయి. మరో వారంలో కిరోసిన్‌, గ్యాస్‌ ధరలను కూడా పెంచుతారనే వార్తలొస్తున్నాయి. సిరియాపై అమెరికా అక్రమదాడి చేస్తే ఆ పేరుతో ధరలను ఇంకా పెంచే ప్రమాదముంది. ఇప్పటికే నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కిలో ఉల్లి రూ.60, బియ్యం రూ.50, మిర్చి రూ.100 పలుకుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఉపసంహరించాలని, నిత్యజీవితావసర సరుకుల ధరలను నియంత్రించాలని, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ గతేడాది ఆగస్టులో రూ.49 ఉంటే, ఇప్పుడు రూ.69కి పతనమైంది. గత నాలుగు నెలల్లో రూపాయి విలువ 25% పతనమైంది. దీంతో ద్రవ్యోల్బణం అదుపుతప్పింది.

స్థూల ఉత్పత్తి పెరుగుదల ఎప్పుడూ లేనంతగా 4.4%కి పడిపోయింది. ఉపాధితోపాటు వివిధ రంగాల్లో 10 నుండి 30శాతం వరకు పడిపోయింది. లక్షల మంది పనులు కోల్పోయి, ఉపాధి కోసం పడిగాపులు కాస్తున్నారు. పనిచేస్తోన్న అసంఘటిత కార్మికులు సైతం వేతనాలు చాలక, ధరల పెరుగుదలతో సతమతమవుతున్నారు. కోస్తా, రాయలసీమల్లో రేషన్‌ డీలర్ల సమ్మెతో పేదలకు ఈ నెల చౌకబియ్యం పంపిణీ ప్రశ్నార్థంగా మారింది. రేషన్‌ బియ్యం పంపిణీకి అవసరమైన చర్యలు సత్వరం తీసుకోవాలని కోరుతున్నాం. ఉపాధిహామీ పథకం కింద పని చేసిన పేదలకు గత మూడు నెలల నుండి రావాల్సిన వేతనం అందలేదు. దీంతో వారు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వారికి బకాయిలను చెల్లించే ఏర్పాటు వెంటనే చేయాలి' అని రాఘవులు తన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 





Sunday, September 1, 2013

ప్రస్తుతం ముగ్గులో దిగిన ముగ్గురు నేతలు

తెలుగు వీర లేవరా అన్న ఘంటసాల గీతం ఇప్పుడు ముచ్చటగా మూడు పార్టీల నేతలు అందిపుచ్చుకున్నారు. ఒకరు అధికార పక్ష నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మూడో వ్యక్తి వైఎస్సార్‌ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి. వీరిలో ఒకరు తెలుగు భాషా దినోత్సవం నాడు రవీంద్ర భారతి సాక్షిగా భావి వ్యూహానికి నాంది పలికితే మరొకరు తర్జనభర్జనల తర్వాత మరోసారి బస్సెక్కాలని నిర్ణయించుకున్నారు. ఇక మూడోవారు పోలీసు పహారాలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో నిమ్స్‌లో చేర్చబడి నిరాహారదీక్ష భగం చేసే స్థితి కల్పించారు.

ముగ్గురి పార్టీలు వేరు. పథకాలు, ప్రణాళికలు వేరు. ప్రకటనలు, ప్రహసనాలు మాత్రం అట్టే తేడా లేదు. ఒకరిది అధికార ఛత్రం. మరొకరిది విస్తార యంత్రాంగం. మరొకరిది వ్యూహాత్మక ఆందోళన పర్వం. ముగ్గురూ సీమాంధ్ర ప్రజల భయసందేహాలను తొలగించాలనే అంటున్నారు. ముగ్గురూ మిగిలిన ఇద్దరినీ నమ్మొద్దంటున్నారు. ప్రతి వారూ తక్కిన ఇద్దరూ కుమ్మక్య య్యారని ఆరోపిస్తున్నారు. ప్రతివారూ అవతలి వారి చిత్తశుద్ధిని శంకి స్తున్నారు. శాపనార్థాలు కురిపి స్తున్నారు. ఇలాటి ఘట్టం కుటిల రాజ కీయాలకు మారుపేరుగా మారిన సమకాలీన భారత రాజకీయాల్లో కూడా అరుదైనదే.

ఈ మూడు పార్టీల ముగ్గురు నేతలూ వారి అనుయాయుల ఎత్తుగడల్లో తరతమ తేడాలున్నాయి. వైఎస్సార్‌సిపి ప్రజా ప్రతినిధులు అందరి కన్నా ముందే రాజీనామాలు సంధించి రంగంలోకి దిగారు గాని రాష్ట్ర విభజన ఆపాలని, సమైక్యంగా ఉండాలని గట్టిగా చెప్పడం లేదు. విభజనను బలపరచడం లేదంటూనే సమన్యాయం పల్లవి ఆలపిస్తున్నారు. రెండు విభాగాలు ఉంటేనే సమన్యాయం. విభజన జరిగితేనే రెండవుతాయి. మరి గతంలో చెప్పిన వైఖరి మార్చుకున్నారా? నేరుగా సమైక్యత నినాదం చేపట్టదలచారా? అంటే చెప్పరు. ఇప్పుడు చాలా చోట్ల సమైక్య ఉద్యమంలో వైసీపీ పట్టు ఉన్నందున తెలుగుదేశం, కాంగ్రెస్‌ నేతలు దూరంగా ఉన్నారంటున్నారు గాని ఆ పార్టీ నేతలు నేరుగా సమైక్యత నినాదం ఇంత వరకూ ఇవ్వలేదు. పైగా తెలుగుదేశం లేఖ వెనక్కు తీసుకోవాలని అంటున్న వారు తమ లేఖను ఎందుకు తీసుకోరో సమాధానం లేదు. విజయమ్మ ఢిల్లీ యాత్ర గాని, జగన్‌ జైలు నుంచి రాసిన లేఖ గాని ఈ అంశాలను వివరించింది లేదు. ఏతావాతా కోస్తా, రాయలసీమల్లో తెలుగుదేశం కన్నా ముందే తమ జెండా పాతాలన్న ఎజెండా బలంగానే కనిపిస్తుంది.

ఆ కోణంలో జగన్‌ నిరాహారదీక్ష నాటకీయ ప్రాధాన్యత సంతరించుకోవడం సహజమే. ఆయన కుటుంబ నేపథ్యం, క్విడ్‌ప్రోకో కేసుల్లో నిర్బంధంలో ఉండి నిరసన చేయడం మరింత రక్తి కట్టించడం రాజకీయంగా వూహించదగిందే. తనపై ఆరోపణలను ఈ విధంగా రాజకీయ సందర్భంతో మిళితం చేసే అవకాశాన్ని వ్యూహాత్మకంగానే ఉపయోగించుకోవడంలో జగన్‌ కృతకృత్యుడైనాడని చెప్పొచ్చు. ఒకప్పుడు కెసిఆర్‌ను, మరోసారి చంద్రబాబును నిరాహారదీక్షల భగం కోసం నిమ్స్‌కే తీసుకురావడం చూశాం. ఇప్పుడు జగన్‌ భద్రత ప్రభుత్వ బాధ్యత గనక మరింత హడావుడి ఉండటమే గాక కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం ఒక విశేషమే. కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. ఇప్పటికే తెలుగుదేశం దీనికి సంబంధించి విమర్శలు సంధించడమూ జరుగుతున్నది. చంద్రబాబు యాత్రకు ముందు మీడియాను హైజాక్‌ చేయడానికి వైసీపీకి ఈ తతంగం ఉపయోగపడింది. ఇక ముందు ఆయన పరిస్థితి, ఆ పార్టీ కార్యాచరణ ఎలా ఉంటాయో చూడాలి.

చంద్రబాబు నాయుడు బస్సు యాత్రపై ఆ పార్టీలోనే రెండు అభిప్రాయాలున్నాయి గనకే వాయిదా వేసుకుని మళ్లీ మొదలెడుతున్నారు. విభజనకు మద్దతు ఇవ్వడంపై ఒకటికి రెండు సార్లు ప్రకటించి మరీ స్పష్టత ఇచ్చానంటున్న చంద్రబాబు గతంలో తెలంగాణాలో ఎదుర్కొన్న వైముఖ్యాన్నే ఇప్పుడు మరో వైపున ఎదుర్కోవచ్చు. ఏపీ ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు, అనేక మంది కాంగ్రెస్‌, వైసీపీ నాయకులు ఇప్పటికే ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. ప్రతిపక్ష నేతగా యాత్ర చేసే హక్కు, బాధ్యత ఆయనకు ఉన్నా విధానపరమైన గజిబిజి వెంటాడుతుంటుంది. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలన్న మాట నిజమే అయితే రెండు చోట్లా ఒకే విధమైన మాట చెప్పాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో వారూ చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి అస్పష్టత కొనసాగుతున్నంత కాలం చంద్రబాబు నాయుడు చెప్పే మాటల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. హరికృష్ణతో సహా అనేకమంది ఏకపక్షంగా మాట్లాడుతుంటే అధినేత ఒక్కరే మరో కోణంలో చెప్పే మాటలను ఇతరులు విశ్వసించడం సులభం కాదు.
చంద్రబాబు యాత్రలో మరో రెండు సమస్యలు కూడా ఉన్నాయి. మొదటిది ప్రజల్లో సందేహాలు ఉన్నాయని అనడం తప్ప తను ఏమనుకుంటన్నారో చెప్పడం లేదు. కేంద్రం చెప్పకపోవడం, కుటిల రాజకీయాలు నడపడం పొరబాటే గాని వాటిపై తమ పార్టీ వైఖరి ఏమిటో నిర్దిష్టంగా చెప్పడం లేదు. ముఖ్యంగా రాజధాని గురించి మొదట చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారా లేక కట్టుబడివున్నారా? ఇవన్నీ నిజమైతే మొదటే వాటిని ఎందుకు ప్రస్తావించలేదు? ప్రజల్లో సందేహాలు మొదలైనాయి గనక ప్రతిపక్ష నేత వాటిని ప్రతిధ్వనించడమేనా లేక స్వంత సందేహాలున్నాయా? తొమ్మిదేళ్ల అధికారం తొమ్మిదేళ్ల ప్రతిపక్ష నాయకత్వం తర్వాత కూడా ఎందుకని వాటిని సూచనగానైనా చెప్పే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడైనా తమ బలాన్ని, పలుకుబడిని ఉపయోగించి పరిష్కారం సూచించేందుకు రాజకీయ ప్రయత్నం చేయడంగాక ప్రజల్లోకి వెళ్లడానికే ఎందుకు ప్రాధాన్యత నివ్వడం పార్టీ రక్షణ కోసమే అన్న సందేహం రాదా?

ప్రజల సందేహాల సంగతి ఒకటైతే చంద్ర బాబు నాయుడు పదే పదే తెలుగుదేశంకు వ్యతి రకంగా కాంగ్రెస్‌, వైసీపీ, టిఆర్‌ఎస్‌ ఒకటైనాయనే విమర్శ చేస్తున్నారు. ఆ పార్టీల విమర్శలను బట్టి చూస్తే అది నిజమే కావచ్చు కూడా. అయితే దానికి ఎవరిని తప్పు పడతారు? రాజకీయాల్లో అందులోనూ అధికారం కోసం జరిగే పోటాపోటీలో ఇవన్నీ ఉంటూనే ఉంటాయని అందరికీ తెలుసు. పైగా తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే గాక తర్వాత అన్ని ఉప ఎన్నికల్లోనూ పరాజయమే చవిచూసింది గనక ఏమంత ఊపుగా ఉందని చెప్పడానికి లేదు. తెలం గాణాలోనూ చాలా మల్లగుల్లాలు పడ్డాకే కొంత నిలదొక్కుకున్నది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సంస్థాగత బలం కారణంగా స్థానాలు బాగానే తెచ్చుకున్నా సాధారణ స్థాయిలో విశ్వాసం ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. ఈ లోగా విభజన నిర్ణయం వచ్చి మళ్లీ మొదటికి తెచ్చింది. ఇదివరకటి పాదయాత్ర లాగే ఇప్పుడు బస్సు యాత్రతో చంద్రబాబు పాత ప్రయత్నమే మళ్లీ చేపట్టవలసిన స్థితి. అధ్యక్షుడుగా అది ఆయన బాధ్యత అయినప్పటికీ దాన్ని, రాష్ట్ర సమస్యనూ కలగాపులగం చేసి మాట్లాడ్డం సరైన సంకేతాలివ్వకపోగా సానుభూతి కోరుతున్నట్టు కనిపిస్తుంది. గతంలో ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తే ఈసారి స్వంతపార్టీ శ్రేణుల్లోనే సందేహాలు రేకెత్తించిన యాత్రను ఆయన ఎలా నిర్వహిస్తారు, ఏ సందేశం అందిస్తారు అనేది చూడవలసిందే.

ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహారం వీరందరినీ మించి పోయింది. మొదటి నుంచీ కాంగ్రెస్‌ అంతర్గత ఆలోచనా ధోరణి, వ్యూహాత్మక పోకడలూ బాగా తెలిసిన వ్యక్తి ఆయన. అనేక దఫాలు చర్చల్లో పాల్గొని ఉంటారు. అలాటి వ్యక్తి కూడా ఏదో ఇప్పుడే హఠాత్తుగా విభజన వ్యతిరేక వీరభంగిమ దాల్చడం విడ్డూరమే. నిర్ణయం చేసిన తొమ్మిది రోజులకు నోరు విప్పి ఆ తర్వాత మరో ఇరవై రోజులకు సమర శంఖం పూరించినట్టు వ్యవహరించడం బృహత్తర వ్యూహంలో భాగమనుకోవాలి. ఆయనను సీమాంధ్ర సింహమన్నట్టు అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక పార్టీ పెట్టి సమైక్యత కోసం పోరాడతారని గొప్పగా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీలో మరికొన్ని వర్గాలు ఆయనకు వ్యతిరేకంగానూ మాట్లాడుతున్నాయి. లగడపాటి రాజగోపాల్‌ వంటివారు ఒక వైపు, కేంద్ర మంత్రులు మరోవైపు తమ తమ ధోరణిలో మాట్లాడుతున్నారు. తెలంగాణా కాంగ్రెస్‌ నేతలైతే సహజంగానే విమర్శలు కురిపిస్తున్నారు. పరిపాలన పూర్తిగా ప్రతిష్టంభనలో పడిపోగా ముఖ్యమంత్రి ఈ వ్యక్తిగత ప్రాంతీయ వ్యూహాల రూపకల్పనలో మునిగి తేలుతున్నారని అర్థమవుతుంది. ఇందుకు అధిష్టానం ఆశీస్సులూ ఉండొచ్చు. తెలంగాణా ఏర్పాటు చేసేదీ తామే, వ్యతిరేకించేదీ తామే అన్నట్లుగా ద్విపాత్రాభినయం చేయడం కాంగ్రెస్‌ ద్వంద్వ నీతికి దర్పణం. భవిష్యత్తు గురించిన అస్పష్టతలో మునిగిన ప్రభుత్వాధినేత కారణంగా పాలన స్తంభించిపోవడం ఒకటైతే అవతలివైపు ప్రత్యర్థులు దాడి చేసి వాతావరణం కలుషితం చేయడం మరో ఫలితంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎడాపెడా ఈ దుష్ప్రభావాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలను నష్టపరుస్తున్నాయి.

వీటన్నిటినీ ఒక సన్నివేశంలో చెప్పాలంటే- ఆగష్టు 28 విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సాక్షిగా చెప్పుకోవచ్చు. వికసించిన విద్యుత్తేజం చెలరేగిన జనసమ్మర్ధం అన్నట్టు ఆ నాడు విద్యుదుద్యమం దేశాన్ని కదిలించింది. కానీ ఇప్పుడు తాజా త్రైమాసికలోనే రూ.500 కోట్ల మేర బాదుడు వచ్చిపడినా ఉమ్మడిగా ప్రతిఘటించే వాతావరణం లేకుండా పోయింది. వికటించిన విద్యుత్తేజం అన్నట్టు ఆ విద్యుత్‌ సౌధ ఇప్పుడు విభజన, సమైక్యత ఉద్రిక్తతలకు రంగస్థలమైంది. ఒక విధంగా ఇది రాష్ట్ర రాజకీయ పరిస్థితికి అద్దం పట్టే ఉదాహరణ. ఇందులో నుంచి ఎంత త్వరగా బయిటపడి సమస్యల పరిష్కారం వైపు, సామాన్యుల జీవితాల వైపు దృష్టి సారిస్తే అంత శ్రేయస్కరం. పార్టీల ప్రమేయం లేకుండా ప్రజలే చేస్తున్నారని ఇప్పటి వరకూ తెలంగాణా ప్రాంతంలో వినిపించిన మాట ఇప్పుడు కోస్తా రాయలసీమల్లో వినిపిస్తుంది. వాస్తవం ఏమంటే ప్రజల సందేహాలను, ఆందోళనలను ఆధారం చేసుకుని అధికార సోపానాలు నిర్మించుకునే రాజకీయ పార్టీలు అపార్థాలు, అసహనాలు పెంచుతాయి తప్ప అవగాహన కలిగించవు. ఆ విషయం ప్రజలు గ్రహించడానికి సమయం పడుతుంది. అప్పటి వరకూ ఎవరి నాటకం వారు నడిపిస్తుంటారు.
                                                         -తెలకపల్లి రవి(ప్రజాశక్తి 1.9.2013)