Tuesday, September 3, 2013

సామాన్యులపై దండయాత్ర

అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం సామాన్యులపై దండయాత్రే! లీటర్‌ పెట్రోల్‌కు కేంద్రం వేసిన రూ.2.35కు తోడు రాష్ట్రంలో వ్యాట్‌తో కలిపి రూ.3.08 అదనంగా పెరిగింది. ఇల్లు కాలిపోతుంటే బొగ్గులేరుకున్న చందంగా జనానికి ధరల భారం పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా వ్యాట్‌ బాదుతోంది. దేశంలో ఎక్కడా లేనంతగా పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌ మన రాష్ట్రంలోనే వసూలు చేస్తోంది. ఒకవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వం ఈ పెంపుదలను ప్రకటించడం కేవలం ప్రజలపై భారం వేయడమేగాక ప్రజాస్వామ్య సంప్రదాయాలకూ తిలోదకాలివ్వడమే. మరికొద్ది రోజులలోనే గ్యాస్‌ సిలిండర్‌పై మరో రూ.50, డీజిల్‌పై రూ.5, కిరోసిన్‌పై రూ.2 పెరగనుందన్న వార్తలతో జనం బెంబేలెత్తుతున్నారు. రాత్రి 8 గంటల తర్వాత పెట్రోల్‌ బంకులను మూసేస్తామని కేంద్ర మంత్రి మొయిలీ చెప్పడం దుర్మార్గం. పెంచిన ధరకు కూడా పెట్రోల్‌, డీజిల్‌ కొనుక్కుందామంటే వినియోగదారులకు అందనీయడన్నమాట. కానీ పార్లమెంటులో విపక్షాలు గట్టిగా నిలదీశాక మంత్రి తూచ్‌ అనడమేగాక ప్రధానమంత్రి కూడా అలాంటిదేమీ లేదని చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి విన్యాసాలు చేయడం ద్వారా పెట్రో ధరల పెంపుపై వ్యతిరేకత తీవ్రతను తగ్గించాలన్న దుర్బుద్ధి కూడా సర్కారు పెద్దలకు ఉండవచ్చు.

పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుదలకు రూపాయి విలువ పడిపోవడమే కారణమని చెబుతున్న సర్కారు అసలు ఆ దుస్థితికి తానే కారకురాలన్న విషయాన్ని మరుగుపరుస్తోంది. గత ఆగస్టులో డాలర్‌కు రూ.49 వచ్చేదల్లా ఈ ఏడాది 69 రూపాయల వరకూ దిగజారిపోవడానికి యుపిఎ సర్కారు, దాని నయా ఉదారవాద ఆర్థిక విధానాలు తప్ప ఇంకే కారణముంది? కరెంట్‌ ఖాతా లోటు వల్లే రూపాయి విలువ పడిపోతోందంటున్న సర్కారు ఎగుమతుల పెంపుదలకు, దిగుమతుల నియంత్రణకు తీసుకున్న చర్యలు పూజ్యం. ఇరాన్‌ నుంచి మనకు చమురు చౌకగా లభించడమే గాక ఖరీదును రూపాయల్లో చెల్లించే ఏర్పాటుంది. అయినా అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మన్మోహన్‌ సర్కారు ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలును తగ్గించి డాలర్లలో చెల్లించే సౌదీ వంటి దేశాల నుంచి దిగుమతిని పెంచడం దేశీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోంది. 2011-12లో 18.1 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతి కాగా 2012-13లో కేవలం 13.1 మిలియన్‌ టన్నులకు అంటే 26 శాతం తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా అక్కడి నుంచి 11 మిలియన్‌ టన్నులు చమురు దిగుమతి చేసుకుంటే 850 కోట్ల డాలర్ల విదేశీ వాణిజ్య లోటును తగ్గించుకోవచ్చునని సాక్షాత్తూ కేంద్ర పెట్రోలియం శాఖ అంచనా. ఈ ఒక్క పని చేస్తే 8,500 కోట్ల డాలర్ల కరెంట్‌ ఖాతా లోటులో పది శాతం తగ్గుతుందన్నమాట. తన మాట వినని ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి అమెరికా మనతో సహా అనేక దేశాలపై ఇలాంటి ఒత్తిళ్లు చేస్తోంది. సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసం యుపిఎ సర్కారు ప్రజలను, ప్రజల బాగోగులను గాలికొదిలేస్తోందన్నమాట. భారత ప్రభుత్వం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని వామపక్షాలు పదేపదే చెప్పడం వెనుక గల ఇలాంటి ముఖ్య కారణాలు అందరూ అర్థం చేసుకోవాలి.

పనిలో పనిగా కేంద్రం రాయితీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌పై రూ.57.50 పెంచింది. ఇది ఎవరో రాయితీకి అర్హత లేని వారికి మాత్రమే వర్తిస్తుందని ఎవరైనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. సెప్టెంబర్‌ ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన నగదు బదిలీ విధానంలో తమ ఆధార్‌ కార్డును బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానం చేయనివారు ఈ ధరను చెల్లించాలి. అంతేగాక ఏడాదికి తొమ్మిది సిలిండర్లు పైబడి ఉపయోగించే పెద్ద, ఉమ్మడి కుటుంబాలు కూడా ఈ అదనపు ధరను చెల్లించాల్సిందే. ఇదో దొంగ దెబ్బన్నమాట. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు కేవలం వాటికే పరిమితం కాదు. ప్రజా, సరుకు రవాణా మాత్రమేగాక వ్యవసాయంలో దున్నడం, స్ప్రేయర్ల వాడకంతో సహా అనేక వృత్తులు, ప్రక్రియల్లో ఉత్పత్తిలో అవి ముఖ్యమైన భాగం. అందుకనే పెట్రోలియం ఉత్పత్తుల ధర పెంపు మిగిలిన అనేక వస్తువులు, సేవల ధరల పెంపునకు దారితీస్తాయి. ఈ గొలుసుకట్టు ప్రభావమే ద్రవ్యోల్బణాన్ని భారీగా పెంచుతుంది.

పెట్రో ధరల పెంపుదలను కేంద్రం ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమూ వ్యాట్‌ను తగ్గించడమో లేక పెంచిన ధరపై మినహాయించడమో జరగాలి. సామాన్యులను ఘోరంగా దెబ్బతీస్తున్న యుపిఎ సర్కారు విధానాలను మార్చుకోవాలి. ప్రజా జీవితంలో కీలక పాత్ర వహించే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను గతంలో ప్రభుత్వమే నియంత్రించేది. నయా ఉదారవాద విధానాలను నెత్తికెత్తుకున్నాక దానికి తిలోదకాలిచ్చారు. యుపిఎ సర్కారు పెట్రోల్‌ ధరలను పూర్తిగా డీకంట్రోల్‌ చేయడంతో వాటికి మరింతగా రెక్కలు వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తులను తిరిగి నియంత్రిత ధరల విధానం పరిధిలోకి తీసుకెళ్లాలి. ఇరాన్‌ నుంచి గరిష్ట స్థాయిలో చమురును దిగుమతి చేసుకోవడమేగాక చౌకగా చమురు లభించే అవకాశాలను అన్వేషించాలి. సిరియాపై దాడి చేయాలన్న అమెరికా దుష్ట యత్నాల కారణంగా యుద్ధ మేఘాలు అలుముకొని అంతర్జాతీయంగా చమురు ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడి చేయవద్దని ఒబామా సర్కారుకు భారత ప్రభుత్వం గట్టిగా చెప్పాలి. అయినా దాడికి పూనుకుంటే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఇప్పటికే అమెరికాకు వంగివంగి సలామ్‌ చేస్తున్న యుపిఎ సర్కారు తనకు తానుగా అలాంటి స్వతంత్ర వైఖరిని చేపడుతుందని ఆశించలేం. అందుకు ప్రజా ఉద్యమ ఒత్తిడి అవసరం. ఆదివారం కొల్‌కతా మహానగరంలో వామపక్షాలు చేసిన భారీ ర్యాలీ ఆ దిశలో ఒక ముందడుగు. సర్కారుపై వివిధ రూపాల్లో ప్రజలు, ప్రజా ఉద్యమాల ఒత్తిడి పెరగాలి. 
                                                              ----(సంపాదకీయం, ప్రజాశక్తి 3.9.2013)







No comments:

Post a Comment