Sunday, September 1, 2013

ప్రస్తుతం ముగ్గులో దిగిన ముగ్గురు నేతలు

తెలుగు వీర లేవరా అన్న ఘంటసాల గీతం ఇప్పుడు ముచ్చటగా మూడు పార్టీల నేతలు అందిపుచ్చుకున్నారు. ఒకరు అధికార పక్ష నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. మూడో వ్యక్తి వైఎస్సార్‌ పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి. వీరిలో ఒకరు తెలుగు భాషా దినోత్సవం నాడు రవీంద్ర భారతి సాక్షిగా భావి వ్యూహానికి నాంది పలికితే మరొకరు తర్జనభర్జనల తర్వాత మరోసారి బస్సెక్కాలని నిర్ణయించుకున్నారు. ఇక మూడోవారు పోలీసు పహారాలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో నిమ్స్‌లో చేర్చబడి నిరాహారదీక్ష భగం చేసే స్థితి కల్పించారు.

ముగ్గురి పార్టీలు వేరు. పథకాలు, ప్రణాళికలు వేరు. ప్రకటనలు, ప్రహసనాలు మాత్రం అట్టే తేడా లేదు. ఒకరిది అధికార ఛత్రం. మరొకరిది విస్తార యంత్రాంగం. మరొకరిది వ్యూహాత్మక ఆందోళన పర్వం. ముగ్గురూ సీమాంధ్ర ప్రజల భయసందేహాలను తొలగించాలనే అంటున్నారు. ముగ్గురూ మిగిలిన ఇద్దరినీ నమ్మొద్దంటున్నారు. ప్రతి వారూ తక్కిన ఇద్దరూ కుమ్మక్య య్యారని ఆరోపిస్తున్నారు. ప్రతివారూ అవతలి వారి చిత్తశుద్ధిని శంకి స్తున్నారు. శాపనార్థాలు కురిపి స్తున్నారు. ఇలాటి ఘట్టం కుటిల రాజ కీయాలకు మారుపేరుగా మారిన సమకాలీన భారత రాజకీయాల్లో కూడా అరుదైనదే.

ఈ మూడు పార్టీల ముగ్గురు నేతలూ వారి అనుయాయుల ఎత్తుగడల్లో తరతమ తేడాలున్నాయి. వైఎస్సార్‌సిపి ప్రజా ప్రతినిధులు అందరి కన్నా ముందే రాజీనామాలు సంధించి రంగంలోకి దిగారు గాని రాష్ట్ర విభజన ఆపాలని, సమైక్యంగా ఉండాలని గట్టిగా చెప్పడం లేదు. విభజనను బలపరచడం లేదంటూనే సమన్యాయం పల్లవి ఆలపిస్తున్నారు. రెండు విభాగాలు ఉంటేనే సమన్యాయం. విభజన జరిగితేనే రెండవుతాయి. మరి గతంలో చెప్పిన వైఖరి మార్చుకున్నారా? నేరుగా సమైక్యత నినాదం చేపట్టదలచారా? అంటే చెప్పరు. ఇప్పుడు చాలా చోట్ల సమైక్య ఉద్యమంలో వైసీపీ పట్టు ఉన్నందున తెలుగుదేశం, కాంగ్రెస్‌ నేతలు దూరంగా ఉన్నారంటున్నారు గాని ఆ పార్టీ నేతలు నేరుగా సమైక్యత నినాదం ఇంత వరకూ ఇవ్వలేదు. పైగా తెలుగుదేశం లేఖ వెనక్కు తీసుకోవాలని అంటున్న వారు తమ లేఖను ఎందుకు తీసుకోరో సమాధానం లేదు. విజయమ్మ ఢిల్లీ యాత్ర గాని, జగన్‌ జైలు నుంచి రాసిన లేఖ గాని ఈ అంశాలను వివరించింది లేదు. ఏతావాతా కోస్తా, రాయలసీమల్లో తెలుగుదేశం కన్నా ముందే తమ జెండా పాతాలన్న ఎజెండా బలంగానే కనిపిస్తుంది.

ఆ కోణంలో జగన్‌ నిరాహారదీక్ష నాటకీయ ప్రాధాన్యత సంతరించుకోవడం సహజమే. ఆయన కుటుంబ నేపథ్యం, క్విడ్‌ప్రోకో కేసుల్లో నిర్బంధంలో ఉండి నిరసన చేయడం మరింత రక్తి కట్టించడం రాజకీయంగా వూహించదగిందే. తనపై ఆరోపణలను ఈ విధంగా రాజకీయ సందర్భంతో మిళితం చేసే అవకాశాన్ని వ్యూహాత్మకంగానే ఉపయోగించుకోవడంలో జగన్‌ కృతకృత్యుడైనాడని చెప్పొచ్చు. ఒకప్పుడు కెసిఆర్‌ను, మరోసారి చంద్రబాబును నిరాహారదీక్షల భగం కోసం నిమ్స్‌కే తీసుకురావడం చూశాం. ఇప్పుడు జగన్‌ భద్రత ప్రభుత్వ బాధ్యత గనక మరింత హడావుడి ఉండటమే గాక కుటుంబ సభ్యులను కూడా అనుమతించడం ఒక విశేషమే. కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి. ఇప్పటికే తెలుగుదేశం దీనికి సంబంధించి విమర్శలు సంధించడమూ జరుగుతున్నది. చంద్రబాబు యాత్రకు ముందు మీడియాను హైజాక్‌ చేయడానికి వైసీపీకి ఈ తతంగం ఉపయోగపడింది. ఇక ముందు ఆయన పరిస్థితి, ఆ పార్టీ కార్యాచరణ ఎలా ఉంటాయో చూడాలి.

చంద్రబాబు నాయుడు బస్సు యాత్రపై ఆ పార్టీలోనే రెండు అభిప్రాయాలున్నాయి గనకే వాయిదా వేసుకుని మళ్లీ మొదలెడుతున్నారు. విభజనకు మద్దతు ఇవ్వడంపై ఒకటికి రెండు సార్లు ప్రకటించి మరీ స్పష్టత ఇచ్చానంటున్న చంద్రబాబు గతంలో తెలంగాణాలో ఎదుర్కొన్న వైముఖ్యాన్నే ఇప్పుడు మరో వైపున ఎదుర్కోవచ్చు. ఏపీ ఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు, అనేక మంది కాంగ్రెస్‌, వైసీపీ నాయకులు ఇప్పటికే ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. ప్రతిపక్ష నేతగా యాత్ర చేసే హక్కు, బాధ్యత ఆయనకు ఉన్నా విధానపరమైన గజిబిజి వెంటాడుతుంటుంది. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలన్న మాట నిజమే అయితే రెండు చోట్లా ఒకే విధమైన మాట చెప్పాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో వారూ చెప్పాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి అస్పష్టత కొనసాగుతున్నంత కాలం చంద్రబాబు నాయుడు చెప్పే మాటల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. హరికృష్ణతో సహా అనేకమంది ఏకపక్షంగా మాట్లాడుతుంటే అధినేత ఒక్కరే మరో కోణంలో చెప్పే మాటలను ఇతరులు విశ్వసించడం సులభం కాదు.
చంద్రబాబు యాత్రలో మరో రెండు సమస్యలు కూడా ఉన్నాయి. మొదటిది ప్రజల్లో సందేహాలు ఉన్నాయని అనడం తప్ప తను ఏమనుకుంటన్నారో చెప్పడం లేదు. కేంద్రం చెప్పకపోవడం, కుటిల రాజకీయాలు నడపడం పొరబాటే గాని వాటిపై తమ పార్టీ వైఖరి ఏమిటో నిర్దిష్టంగా చెప్పడం లేదు. ముఖ్యంగా రాజధాని గురించి మొదట చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారా లేక కట్టుబడివున్నారా? ఇవన్నీ నిజమైతే మొదటే వాటిని ఎందుకు ప్రస్తావించలేదు? ప్రజల్లో సందేహాలు మొదలైనాయి గనక ప్రతిపక్ష నేత వాటిని ప్రతిధ్వనించడమేనా లేక స్వంత సందేహాలున్నాయా? తొమ్మిదేళ్ల అధికారం తొమ్మిదేళ్ల ప్రతిపక్ష నాయకత్వం తర్వాత కూడా ఎందుకని వాటిని సూచనగానైనా చెప్పే ప్రయత్నం చేయలేదు? ఇప్పుడైనా తమ బలాన్ని, పలుకుబడిని ఉపయోగించి పరిష్కారం సూచించేందుకు రాజకీయ ప్రయత్నం చేయడంగాక ప్రజల్లోకి వెళ్లడానికే ఎందుకు ప్రాధాన్యత నివ్వడం పార్టీ రక్షణ కోసమే అన్న సందేహం రాదా?

ప్రజల సందేహాల సంగతి ఒకటైతే చంద్ర బాబు నాయుడు పదే పదే తెలుగుదేశంకు వ్యతి రకంగా కాంగ్రెస్‌, వైసీపీ, టిఆర్‌ఎస్‌ ఒకటైనాయనే విమర్శ చేస్తున్నారు. ఆ పార్టీల విమర్శలను బట్టి చూస్తే అది నిజమే కావచ్చు కూడా. అయితే దానికి ఎవరిని తప్పు పడతారు? రాజకీయాల్లో అందులోనూ అధికారం కోసం జరిగే పోటాపోటీలో ఇవన్నీ ఉంటూనే ఉంటాయని అందరికీ తెలుసు. పైగా తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే గాక తర్వాత అన్ని ఉప ఎన్నికల్లోనూ పరాజయమే చవిచూసింది గనక ఏమంత ఊపుగా ఉందని చెప్పడానికి లేదు. తెలం గాణాలోనూ చాలా మల్లగుల్లాలు పడ్డాకే కొంత నిలదొక్కుకున్నది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సంస్థాగత బలం కారణంగా స్థానాలు బాగానే తెచ్చుకున్నా సాధారణ స్థాయిలో విశ్వాసం ఇంకా పూర్తిగా పుంజుకోలేదు. ఈ లోగా విభజన నిర్ణయం వచ్చి మళ్లీ మొదటికి తెచ్చింది. ఇదివరకటి పాదయాత్ర లాగే ఇప్పుడు బస్సు యాత్రతో చంద్రబాబు పాత ప్రయత్నమే మళ్లీ చేపట్టవలసిన స్థితి. అధ్యక్షుడుగా అది ఆయన బాధ్యత అయినప్పటికీ దాన్ని, రాష్ట్ర సమస్యనూ కలగాపులగం చేసి మాట్లాడ్డం సరైన సంకేతాలివ్వకపోగా సానుభూతి కోరుతున్నట్టు కనిపిస్తుంది. గతంలో ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తే ఈసారి స్వంతపార్టీ శ్రేణుల్లోనే సందేహాలు రేకెత్తించిన యాత్రను ఆయన ఎలా నిర్వహిస్తారు, ఏ సందేశం అందిస్తారు అనేది చూడవలసిందే.

ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యవహారం వీరందరినీ మించి పోయింది. మొదటి నుంచీ కాంగ్రెస్‌ అంతర్గత ఆలోచనా ధోరణి, వ్యూహాత్మక పోకడలూ బాగా తెలిసిన వ్యక్తి ఆయన. అనేక దఫాలు చర్చల్లో పాల్గొని ఉంటారు. అలాటి వ్యక్తి కూడా ఏదో ఇప్పుడే హఠాత్తుగా విభజన వ్యతిరేక వీరభంగిమ దాల్చడం విడ్డూరమే. నిర్ణయం చేసిన తొమ్మిది రోజులకు నోరు విప్పి ఆ తర్వాత మరో ఇరవై రోజులకు సమర శంఖం పూరించినట్టు వ్యవహరించడం బృహత్తర వ్యూహంలో భాగమనుకోవాలి. ఆయనను సీమాంధ్ర సింహమన్నట్టు అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక పార్టీ పెట్టి సమైక్యత కోసం పోరాడతారని గొప్పగా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీలో మరికొన్ని వర్గాలు ఆయనకు వ్యతిరేకంగానూ మాట్లాడుతున్నాయి. లగడపాటి రాజగోపాల్‌ వంటివారు ఒక వైపు, కేంద్ర మంత్రులు మరోవైపు తమ తమ ధోరణిలో మాట్లాడుతున్నారు. తెలంగాణా కాంగ్రెస్‌ నేతలైతే సహజంగానే విమర్శలు కురిపిస్తున్నారు. పరిపాలన పూర్తిగా ప్రతిష్టంభనలో పడిపోగా ముఖ్యమంత్రి ఈ వ్యక్తిగత ప్రాంతీయ వ్యూహాల రూపకల్పనలో మునిగి తేలుతున్నారని అర్థమవుతుంది. ఇందుకు అధిష్టానం ఆశీస్సులూ ఉండొచ్చు. తెలంగాణా ఏర్పాటు చేసేదీ తామే, వ్యతిరేకించేదీ తామే అన్నట్లుగా ద్విపాత్రాభినయం చేయడం కాంగ్రెస్‌ ద్వంద్వ నీతికి దర్పణం. భవిష్యత్తు గురించిన అస్పష్టతలో మునిగిన ప్రభుత్వాధినేత కారణంగా పాలన స్తంభించిపోవడం ఒకటైతే అవతలివైపు ప్రత్యర్థులు దాడి చేసి వాతావరణం కలుషితం చేయడం మరో ఫలితంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎడాపెడా ఈ దుష్ప్రభావాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలను నష్టపరుస్తున్నాయి.

వీటన్నిటినీ ఒక సన్నివేశంలో చెప్పాలంటే- ఆగష్టు 28 విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సాక్షిగా చెప్పుకోవచ్చు. వికసించిన విద్యుత్తేజం చెలరేగిన జనసమ్మర్ధం అన్నట్టు ఆ నాడు విద్యుదుద్యమం దేశాన్ని కదిలించింది. కానీ ఇప్పుడు తాజా త్రైమాసికలోనే రూ.500 కోట్ల మేర బాదుడు వచ్చిపడినా ఉమ్మడిగా ప్రతిఘటించే వాతావరణం లేకుండా పోయింది. వికటించిన విద్యుత్తేజం అన్నట్టు ఆ విద్యుత్‌ సౌధ ఇప్పుడు విభజన, సమైక్యత ఉద్రిక్తతలకు రంగస్థలమైంది. ఒక విధంగా ఇది రాష్ట్ర రాజకీయ పరిస్థితికి అద్దం పట్టే ఉదాహరణ. ఇందులో నుంచి ఎంత త్వరగా బయిటపడి సమస్యల పరిష్కారం వైపు, సామాన్యుల జీవితాల వైపు దృష్టి సారిస్తే అంత శ్రేయస్కరం. పార్టీల ప్రమేయం లేకుండా ప్రజలే చేస్తున్నారని ఇప్పటి వరకూ తెలంగాణా ప్రాంతంలో వినిపించిన మాట ఇప్పుడు కోస్తా రాయలసీమల్లో వినిపిస్తుంది. వాస్తవం ఏమంటే ప్రజల సందేహాలను, ఆందోళనలను ఆధారం చేసుకుని అధికార సోపానాలు నిర్మించుకునే రాజకీయ పార్టీలు అపార్థాలు, అసహనాలు పెంచుతాయి తప్ప అవగాహన కలిగించవు. ఆ విషయం ప్రజలు గ్రహించడానికి సమయం పడుతుంది. అప్పటి వరకూ ఎవరి నాటకం వారు నడిపిస్తుంటారు.
                                                         -తెలకపల్లి రవి(ప్రజాశక్తి 1.9.2013)

  

No comments:

Post a Comment