మార్క్సిస్టు మహౌపాధ్యాయుడు ఫ్రెడెరిక్ ఏంగెల్స్ ద్విశతజయంతి సందర్భంగా సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ ఉపన్యాసాన్ని కింద ఇస్తున్నాం. సిపిఐ(ఎం) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీన జరిగిన ఈ ఆన్‌లైన్ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అధ్యక్షత వహించారు... సంపాదకుడు
కామ్రేడ్స్
ముందుగా ఇటీవల మృతి చెందిన మన నాయకులు సున్నం రాజయ్య, షడ్రక్‌లకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను.
మహా విప్లవ కారుడు ఏంగెల్స్ కారల్ మార్క్స్‌కు స్నేహితుడు, సహచరుడు, భాగస్వామి. వారిద్దరూ కలిసి శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతాన్ని రూపొందించారు. ఏంగెల్స్‌కు మార్క్స్‌కు సహాయకుడు మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు. కాని అది నిజం కాదు. ఫ్రెడరిక్ ఏంగెల్స్ తాను స్వయంగా కార్మికోద్యమ సిద్ధాంతం, ఆచరణకు, శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడానికీ ఎంతగానో తోడ్పడ్డారు. ఆయన తొలి రచన ఇంగ్లండ్‌లోని కార్మికవర్గ పరిస్థితులపై 1844లో రాశారు. ఇంగ్లండ్‌లోని కార్మికవర్గం పరిస్థితులను అధ్యయనం చేసిన ఏంగెల్స్, మార్క్స్‌కన్నా ముందుగానే కార్మిక వర్గ కేంద్ర పాత్ర గురించి వివరించారు. మార్క్స్‌తో కలిసి ఆయన 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక రచించారు. ఆయన స్వయంగా 'వ్యక్తిగత ఆస్తి, కుటుంబం, రాజ్యాంగాల పుట్టక', 'యాంటీ డూరింగ్', 'డయలెక్టిక్స్ ఆఫ్ నేచర్' వంటి గ్రంధాలు రాశారు. ఏంగెల్స్‌కు విజ్ఞాన శాస్త్రాలంటే చాలా ఆసక్తి. తన కాలంలో ఉన్న అన్ని రకాల విజ్ఞాన శాస్త్రాలనూ ఆయన అధ్యయనం చేశారు. మార్క్స్, ఆయనా కలిసి మానవ విజ్ఞానాన్ని, కార్మికవర్గ సిద్ధాంతాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లారు. ఈ రోజు కూడా మార్క్సిజం అని మనం అంటున్నాం అంటే అది మార్క్స్, ఏంగెల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతమే. అందువల్లనే ఆ మహనీయుడు ఏంగెల్స్‌కు 200వ జయంతి సందర్భంగా మనందరం నివాళులర్పిస్తున్నాం. మనందరం ఈ శాస్త్రీయ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం, కార్మిక వర్గానికి ఈ శాస్త్రీయ సిద్ధాంతం ఆయుధాన్ని అందించడమే మనం ఆయనకు నేడు ఇచ్చే ఘనమైన నివాళి.
ఈ రోజు మనం ప్రపంచంలో ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఈ రోజున కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆవహించింది. భారత దేశంలో కూడా అది ప్రబలింది. మన దేశంలో 20 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు. 40 వేల మందికి పైగా మృతి చెందారు. ఈ మహమ్మారి పెట్టుబడిదారీ వ్యవస్థలోని వైరుధ్యాలను బహిర్గతం చేసింది. సమాజంలోని సంఘర్షణ సరిహద్దులను మనముందుంచింది. ప్రతి మహమ్మారిని కూడా ఆయా చారిత్రక, రాజకీయ, ఆర్థిక సందర్భంలో పరిశీలించాలి. ఈ రోజునున్న సందర్భం ఏమిటి?
ప్రపంచ వ్యాపితంగా నయాాఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. మన పార్టీ మహాసభ దీన్ని వ్యవస్థాగత సంక్షోభం అంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలేవీ నేటికీ 2008 ముందునాటి స్థితికి కోలుకోలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేడు ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఆవహించింది. ప్రపంచంలో ఆరోగ్య ఎమర్జెన్సీ ఏర్పడింది. పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఉత్పత్తి పడిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించినతరువాత ఎన్నడూ ఎరుగనంతటి స్థాయిలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆదాయాలు పడిపోయాయి. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. ఇదంతాకూడా ప్రపంచంలో వందలాది కోట్ల మంది ప్రజల జీవనాన్ని దిగజార్చింది.
పెద్ద బ్యాంకులకూ, బడా ఫైనాన్స్ కంపెనీలకూ, కార్పొరేట్లకూ బెయిలవుట్లు ఇవ్వడం ద్వారా ఈ సంక్షోభం నుండి బయటపడడానికి నయా-ఉదారవాద ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో సామాన్య ప్రజలు, శ్రామిక ప్రజల ఉపాధిని, జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మహమ్మారి సద్దుమణిగాక ఈ ప్రభుత్వాలు ప్రజలమీద పొదుపు చర్యలను రుద్దుతాయి. 2008 సంక్షోభం తరువాత మనం దీన్ని చూశాం. పొదుపు చర్యల పేరుతో ఉద్యోగాలు కత్తిరిస్తాయి, జీతాలకు కోతపెడతాయి, పెన్షన్లు తగ్గిస్తాయి. సాంఘిక సంక్షేమ సదుపాయాలను కుదిస్తాయి. ఆ విధంగా కార్మిక ప్రజల ఉపాధిమీద, జీవనం మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడి జరగబోతోంది. ఇది పెట్టుబడికీ, శ్రమకూ మధ్య వైరుధ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. ఈ దాడి వల్ల వర్గ పోరాటం తీవ్రమవుతుంది.
రెండవ అంశం, ఈ మహమ్మారికి ముందు నుండే సామ్రాజ్యవాద శిబిరానికి నాయకత్వం వహిస్తున్న అమెరికా ఆధిపత్య ప్రభావం దీర్ఘకాలంగా తగ్గుతూ వస్తోంది. అయితే అది దుందుడుకు విన్యాసాల ద్వారా, సైనిక జోక్యాల ద్వారా, ఆర్థిక ఆంక్షల ద్వారా, బెదిరింపులు, వేధింపుల ద్వారా తన ఆధిపత్యాన్ని కాపాడుకోడానికి ప్రయత్నిస్తోంది. ఈ మహమ్మారి సందర్భంగా కూడా అమెరికా ఎలా ప్రవర్తిస్తున్నదో మనం చూస్తున్నాం. అది తన దేశంలో కరోనాను కట్టడి చేయలేక చైనా మీద దాడి చేస్తోంది. ఎందుకంటే చైనా ఆర్థికంగా ముందుకు పోతున్నందున అమెరికా భయపడుతోంది. చైనా కూడా కరోనా మహమ్మారి వల్ల బాధపడింది. అయితే మూడు మాసాల్లో దాన్ని కట్టడి చేసి ఆర్థికంగా పుంజుకోవడం ప్రారంభించింది. ఈ రోజున చైనాను లక్ష్యం చేసుకుని అమెరికా తన మిత్రులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా నేడు చైనాతో ఘర్షణను తీవ్రతరం చేసింది. రానున్న రోజుల్లో సామ్రాజ్యవాదానికీ, సోషలిజానికీ మధ్య వైరుధ్యం తీవ్రతరమవుతుందని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.
మూడవ అంశం, సోషలిస్టు దేశాలు వాటి ఆర్థిక స్థాయి, ఆదాయాల స్థితితో సంబంధం లేకుండా మహమ్మారిని కట్టడి చేయడంలో జయప్రదం అయ్యాయి. చైనా, వియత్నాం, క్యూబా తదితర సోషలిస్టు దేశాల్లో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ ఉండడం, ప్రజలను సమీకరించడం వల్ల అవి మహమ్మారిని అదుపు చేయగలిగాయి. మరోవైపు అమెరికా నేడు కరోనాకు కేంద్రంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యధిక కేసులు అక్కడే ఉన్నాయి. అత్యధిక ప్రజలు అక్కడే మరణించారు. రోజురోజుకూ అమెరికాలో కరోనాబారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. అక్కడ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ప్రయివేటీకరించబడింది గనుకనే ఈ దుస్థితి ఏర్పడింది. అక్కడ పెద్దపెద్ద ఆసుపత్రులు, సదుపాయాలు ఉన్నాయి. కానీ అవి కొనగలిగే వారికి మాత్రమే దక్కుతాయి. మహమ్మారిని ఎదుర్కోవడంలో పెట్టుబడిదారీ వ్యవస్థకూ, సోషలిజానికీ మధ్య తేడా ఏమిటో తెలిసిపోతున్నది. ఇది సోషలిజం ఔన్నత్యాన్ని, దాని శక్తిని తెలియజేస్తున్నది.
ఇక అంతర్జాతీయ పరిస్థితుల్లో చివరి విషయం ఏమంటే, పెట్టుబడిదారీ దేశాల మధ్య, సామ్రాజ్యవాద దేశాల మధ్య, అమెరికాకూ ఇతర దేశాలకూ మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. తన ఆదేశాలను రుద్దడం ద్వారా అమెరికా తన నాయకత్వ పాత్రను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఉదాహరణకు వాతావరణ మార్పుల ఒప్పందం విషయంలో అమెరికాకూ ఐరోపా దేశాలకూ మధ్య విబేధాలు తలెత్తాయి. అమెరికా ఈ ఒప్పందం నుండి ఎలా తప్పుకున్నదో మనం చూశాం. గతంలో అమెరికా ఐరోపా దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందం చేసుకున్నాయి. కానీ అమెరికా ఈ ఒప్పందం నుండి ఏకపక్షంగా బయటకు వచ్చేసింది. అయితే జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లు దానితో ఏకీభవించలేదు. ఆ విధంగాసామ్రాజ్యవాదుల మధ్య వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయి.
అందువల్ల ఈ నాడు ప్రపంచంలో నాలుగు ప్రధాన సామాజిక వైరుధ్యాలు తీవ్రతరమవుతున్నాయి. వీటితోపాటు మరో ప్రధాన వైరుధ్య కూడా తీవ్రమవుతోంది. అది వాతావరణానికీ, పెట్టుబడిదారీ వ్యవస్థకూ మధ్య వైరుధ్యం. నయా-ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో వాతావరణాన్ని రక్షించే అవకాశాలు లేవు గనుక వాతావరణ కాలుష్యం, భూతాపం, అడవులు తరిగిపోవడం, తీవ్రమైన తుపానులు, మరోవైపు దుర్భిక్షాలు, హిమనదులు కరిగిపోవడం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడం..వంటివన్నీ జరుగుతున్నాయి.
ఈ పూర్వరంగంలో మనం మన దేశంలో ఏం జరుగుతున్నదో పరిశీలించాలి. దేశంలో ఇప్పటికీ కరోనా మహమ్మారి తీవ్రంగా పెరుగుతూనే ఉంది. కరోనా కేసుల విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. రోజువారీ మరణాల విషయంలో మొదటి స్థానానికి చేరుకుంది. మన దేశంలో సరైన ప్రభుత్వారోగ్య వ్యవస్థ లేదన్న విషయం అందరికీ తెలుసు. భారత దేశం ప్రజారోగ్యం కోసం స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 1 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ. మన పాలకులు నయా-ఉదారవాద పంథా చేపట్టారు గనుక మనకీ దుస్థితి వచ్చింది. ఈ విధానాల ప్రకారం ప్రభుత్వం ఆరోగ్యం, విద్య, ఇతర ప్రజావసరాల కోసం ఖర్చు చేయకూడదు. అందువల్లనే మనకు సరైన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ లేకుండా పోయింది. ఫలితంగా మన దేశంలో, ఆంధ్ర ప్రదేశ్‌తో సహా మహమ్మారి విజృంభించింది. దీనికి కేరళ మాత్రమే మినహాయింపు. ఎందుకంటే అక్కడ వరుసగా వామపక్ష ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొంతమేరకు పటిష్టమైన ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం జరిగింది. అక్కడ ప్రజాస్వామిక పనివిధానం, అధికార వికేంద్రీకరణ, పటిష్టమైన స్థానిక సంస్థలు, ఇతర స్వయంసహాయ సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఆరోగ్య రక్షణ కోసం ప్రజలను సమీకరించగలిగాయి. అందుకే మనం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే కేరళ మహమ్మారిని సమర్ధవంతగా ఎదుర్కోవడం చూశాం.
లాక్‌డౌన్ సమయంలో మనం మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, అమానుష లక్షణాన్ని చూశాం. కోట్లాదిమంది వలస కార్మికులు వందలాది మైళ్లు నడుచుకుంటూ తమ గ్రామాలకు వెళ్లాల్సి వచ్చిందో చూశాం. ఈ క్రమంలో వందలాది మంది చనిపోయారు. గత నాలుగు మాసాల లాక్‌డౌన్, మహమ్మారి కాలంలో ప్రభుత్వం ప్రకటించిన బెయిలవుట్ ప్యాకేజీలో ఉద్యోగాలు, జీవనోపాధి, ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు కనీస ఉపశమనం కూడా కల్పించలేదు. ప్రజలకు నేరుగా సహాయం చేయడం కోసం జిడిపిలో కనీసం ఒక్క శాతం కూడా ఖర్చు చేయలేదు. అమెరికాతో సహా ఇతర పెట్టుబడిదారీ దేశాలు ఎంతో కొంత ప్రజలకు సహాయం చేశాయి. కానీ భారత దేశంలో ప్యాకేజీ మాత్రం బడా పెట్టుబడిదారులకూ, బడా ఫైనాన్స్ సంస్థలకు మాత్రమే ఉద్ధేశించి ఇచ్చారు. లాక్‌డౌన్ సందర్భంగా ఆర్థిక ప్యాకేజీలు రూపొందించి, ప్రకటించిన తీరులోనే మనకు ఈ ప్రభుత్వ వర్గ లక్షణం కనిపిస్తుంది. ఈ ప్యాకేజీ ప్రజలకు సహాయం కల్పించకపోగా ప్రయివేటీకరణను ఊపుగా అమలు చేసింది. ప్రభుత్వ రంగం సంస్థలతోపాటు సమాజంలోని అన్ని రంగాల్లో ప్రయివేటీకరణకు ద్వారాలు తెరిచింది. రైల్వేల్లో 131 రైలు మార్గాలను ప్రయివేటు వారికి అప్పజెప్పేస్తున్నది. బగ్గుతో సహా గనుల తవ్వకాలను ప్రయివేటీకరించింది. రక్షణ రంగంలోకి మరింత విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించింది, మరింత ప్రయివేటీకరించింది. లాక్‌డౌన్‌ను ఉపయోగించుకుని మన దేశంలోని అన్ని రంగాల్లో ప్రయివేటీకరణ ప్రణాళికలు అమలు చేసింది. దీని వల్ల మన ప్రభుత్వ రంగం నాశనమవుతుంది.
దీంతోపాటు కార్మిక వర్గంపై దాడులకు దిగింది. 13 రాష్ట్రాలు కార్మిక చట్టాలను సస్పెండ్ చేయడమో, పలుచబరచడమో చేశాయి. మోడీ ప్రభుత్వ సూచనలతో 8 గంటల పనిదినం 12 గంటలకు పెంచబడింది. ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో కార్మిక చట్టాలన్నిటినీ మూడేళ్లపాటు సస్పెండ్ చేశారు. ఆ విధంగా లాక్‌డౌన్ రోజుల నుండి మోడీ ప్రభుత్వం ఒకవైపు ధనికులకూ, కార్పొరేట్‌లకూ ప్యాకేజీలు ఇస్తూ మరోవైపు కార్మికవర్గంపై దాడికి పాల్పడుతోంది. వీరిలో కూడా వలస కార్మికుల పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. ఇదంతా ఆర్థిక రంగంలో మోడీ కరోనా కాలంలో ప్రజలపై చేస్తున్న దాడులు.
మోడీప్రభుత్వ రెండవ దాడి హిందూత్వ ఎజెండా అమలు రూపంలో జరుగుతోంది. మహమ్మారి రాక ముందే జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్ధు చేశారు. 370 అధికరణ ద్వారా రాష్ట్రానికి లభించే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశారు. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ముక్కలు చేశారు. మన దేశంలో జమ్మూ-కాశ్మీర్ మాత్రమే ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉంది గనుక వారు ఈ పనిచేశారు. ఆ రాష్ట్ర ప్రజలను ఈ నాటికి కూడా, రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఏడాదితరువాత కూడా శిక్షిస్తూనే ఉన్నారు. మొదట వారిపై నిషేధాలు పెట్టారు, తరువాత లాక్‌డౌన్ పెట్టారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా జమ్మూ-కాశ్మీర్ ప్రజలకు నేటికీ 4జి కమ్యూనికేషన్ లేదు. 4జి మొబైల్ ఫోన్‌లు లేవు. ఇప్పటికీ అనేక మంది రాజకీయ నాయకులను నిర్బంధంలో ఉంచారు. కొన్ని సార్లు వారిని విడుదల చేసినా వెంటనే గృహ నిర్భందంలో ఉంచుతున్నారు.
ప్రధానమంత్రి అయోధ్య వెళ్లి రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం మనకు తెలుసు. వాస్తవానికి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఒక ప్రయివేటు ట్రస్ట్ రామ మందిరాన్ని నిర్మించాలి. కానీ ప్రధాన మంత్రి, ఉత్తర ప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గన్నారు. దాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. మోడీ ప్రభుత్వం కింద భారత దేశంలో లౌకిక తత్వం ఈ స్థితికి దిగజార్చబడింది. మనది పేరుకు మాత్రమే లౌకిక గణతంత్ర రాజ్యం. ఆచరణలో హిందూత్వ రాజ్యంగా మారిపోయింది. మెజారిటీ మతస్తుల రాజ్యంగా, హిందూ రాష్ట్రగా మార్చాలన్న సిద్ధాంతాన్నికి అనుగుణంగా ఆచరిస్తున్నారు. కరోనా మహమ్మారి కాలంలో కూడా ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ముస్లింలను కరోనా కారియర్స్‌గా అభివర్ణిస్తూ ఎలా ప్రచారం గావించారో చూశాం. ఢిల్లీలో తబ్లిగి జమాత్ సమావేశం తరువాత ముస్లింలే దేశంలో కరోనా వైరస్‌ను వ్యాపింప జేస్తున్నారన్న ప్రచారాన్ని పనిగట్టుకుని చేశారు. ముస్లింలను బహిష్కరించాలి, వారి షాపుల్లో వస్తువులు కొనకూడదు, ముస్లిం వీధి వ్యాపారులను తరిమేయాలి అంటూ అనేక ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఆ విధంగా హిందూత్వ దాడి ఈ కాలంలో తీవ్రమైంది. ఢిల్లీలో గత మూడు మాసాలుగా సిఎఎ-ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వాయవ్య ఢిల్లీలో సృష్టించిన మతఘర్షణలకు ముస్లింలే కారణమంటూ వారిని అరెస్టులు చేశారు. ఢిల్లీలో సిఎఎ-ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన వారినందరిపై మతఘర్షణలకు కుట్రపన్నారంటూ ముద్రవేస్తున్నారు. యుఎపిఎ చట్టం కింద అనేక మందిని అరెస్టు చేశారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం, జెఎన్‌యు విద్యార్ధులను, ఉపాధ్యాయులను, రిటైర్డ్ స్కాలర్స్‌ను అరెస్టు చేశారు. ఇతర సామాజిక కార్యకర్తలను వెంటాడి వేధిస్తున్నారు. మహమ్మారి సమయంలో కోర్టులు పనిచేయకపోవడం వల్ల అరెస్టయిన వారిలో చాలా మందికి బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోడానికి కూడా అవకాశం ఉండడం లేదు. మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో ఇటువంటి పరిస్థితిని సృష్టించింది.
మూడవ విషయం, ప్రజాతంత్ర హక్కులపైనా, ప్రజా తంత్ర సంస్థలపైనా మోడీ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. యుఎపిఎ చట్టం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, వారి కార్యకలాపాలు అరికట్టడానికి అమలు చేయాలి. కానీ దాన్ని నేడు ప్రతిపక్షాల కార్యకర్తపైనా, సామాజిక, ప్రజా కార్యకర్తలపైనా ప్రయోగిస్తున్నారు. దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి కాలంలోనే ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాను అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహమ్మారి ప్రారంభంలోనే మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని పడదోశారు. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యం పైనా, ప్రజాతంత్ర హక్కులపైనా దాడులు చేయడం, నిరంకుశ చట్టాలు ఉపయోగించడం మహమ్మారి కాలంలో పెరిగింది.
నాల్గవ అంశం, మహమ్మారిని ఉపయోగించుకుని వారు అధికారంపై తమ నియంతృత్వ పట్టును పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాతంత్ర సంస్థలన్నీ నిర్వీర్యం చేయబడుతున్నాయి.
అయిదవ విషయం, అమెరికా సామ్రాజ్యవాదంతో బంధాలను మరింత పెంచుకుంటున్నది. లడక్ సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల తరువాత మోడీ ప్రభుత్వం అమెరికాతో వ్యూహాత్మకంగా, సైనికంగా మరింత సన్నిహితం అయింది. ఈ నాడు అమెరికాతో వ్యూహాత్మకంగా జతకట్టడమే కాదు, మొత్తం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్‌ను అమెరికా అనుచర దేశంగా మార్చేస్తోంది.
మహమ్మారి కాలంలో నెలకొన్న పరిస్థితులివి. ఈ మహమ్మారి ఇప్పుడిప్పుడే పోయేట్లు లేదు. మరికొన్ని మాసాలుంటుంది. ఈ పరిస్థితుల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటూనే, భౌతిక దూరం పాటిస్తూనే, మాస్కులు ధరిస్తూనే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజాస్వామ్యంపై దాడులను ఎదుర్కోవాలి. గత రెండు మాసాలుగా మనం తక్షణం చేపట్టాల్సిన లక్ష్యాలగురించి చర్చిస్తున్నాం. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతున్న సమయంలో ప్రభుత్వం వరుసగా 16 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. దీన్ని ఎలా ప్రతిఘటించాలి? నిత్వావసరాల ధరలు ఇప్పుడు పెరిగిపోతున్నాయి. వ్యవసాయ దారుల సంక్షోభం ఉండనే ఉంది. కార్మిక వర్గం దాడులకు గురవుతోంది. ఈ సమస్యన్నిటిపైనా మనం మెట్టుమెట్టుగా ప్రజలను కదిలించాలి. ఆందోళనలు చేయాలి. పోరాటాలు అభివృద్ధి చేయాలి. కరోనా ఉన్న కాలంలో దీన్నిమనం ఎలా చేయగలం?
దీనికి మార్గం ఏమంటే, మొదటి మెట్టుగా మనం స్థానిక సమస్యలను చేపట్టాలి. ఈ మహమ్మారి స్థానిక ప్రజల జీవనాన్ని, ఉపాధిని ఎలా దెబ్బతీసిందో పరిశీలించాలి, వారికి ఆహారం కావాలి. రేషన్స్ కావాలి. వారికి ప్రభుత్వం నుండి రావలసిన అనేక సదుపాయాల రావాలి. ఈ అన్ని సమస్యలను మనం కింది స్థాయి నుండి చేపట్టాలి. మెట్టుమెట్టుగా ప్రజలను సమీకరించాలి. ఆ ప్రాంతంలోని పరిస్థితిని బట్టి, కరోనా పరిస్థితి మెరుగుపడే దాన్ని బట్టి మరింత విస్తృత స్థాయిలో సమీకరణ చేపట్టాలి.
పార్టీ నిర్మాణ పరంగా చూస్తే కరోనా మహమ్మారి వల్ల మనం సాధారణ పద్ధతిలో పార్టీ పనిచేయడం సాధ్యం కాదు. ముందుగా మనం మన పార్టీ సభ్యులతో సంబంధంలో ఉండాలి. మన పార్టీ శాఖలు చురుకుగా పని చేసేట్లు చూడాలి. పార్టీ కమిటీలు అవసరమైతే ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవాలి. కానీ ఉన్న పరిస్థితుల్లో గరిష్ట స్థాయిలో పని జరిగే పద్ధతులు అవలంభించాలి.
మరోవిషయం ఏమంటే అనేక చోట్ల కార్మికవర్గం పోరాటాల్లోకి వస్తున్నారు. బగ్గు గనుల్లో కార్మికులు మూడు రోజులు సమ్మె చేసిన సంగతి మనకు తెలుసు. బగ్గు బ్లాకులను ప్రయివేటు వారికి వేలానికి నిరసనగా అయిదు బగ్గు గని కార్మిక సమాఖ్యలు ఇచ్చిన ఐక్య పోరాటంలో 5.3 లక్షల మంది కార్మికులు పాల్గన్నారు. దేశ వ్యాపితంగా ప్రతి బగ్గు గని ప్రాంతంలోనూ కార్మికులు మూడు రోజుల సమ్మెలో పాల్గన్నారు. దీనికి పెద్ద ఎత్తున కార్మికులను ఒక చోట సమీకరించాల్సిన అవసరం లేదు. ఈ సమ్మె జయప్రదం కావడంతో ఆగస్టులో వాస్తవ వేలం జరిగే టప్పుడు ఒక రోజు సమ్మె చేయాలని నిర్ణయించారు. స్కీమ్ వర్కర్లు సమ్మెకు వెళుతున్నారు. ఇలా సెక్షన్ తరువాత సెక్షన్ కార్మికులు పోరాటంలోకి వస్తున్నారు. ఇటువంటి పోరాటాలు ముందుముందు మరిన్ని వస్తాయి. మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాటిలో చురుకుగా పాల్గనడానికి, నాయకత్వం వహించడానికి చొరవ చూపాలి.
అదే సమయంలో మనం ప్రజల్లో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని సోషల్ మీడియాలో రాజకీయ క్యాంపెయిన్ నిర్వహించాలి. ఈ క్యాంపెయన్స్‌లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఎండగట్టాలి. మన ప్రత్యామ్నాయ వేదికలను ప్రచారం చేయాలి. మనం డిజిటల్ టెక్నాలజీని, మనకున్న వనరులను ఉపయోగించుకుని ఈ క్యాంపెయిన్లన్నిటినీ నిర్వహించాలి. డిజిటల్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. నైపుణ్యంగా ఉపయోగించుకోవాలి.
రాన్ను రోజుల్లో మహమ్మారి తెచ్చే రాజకీయ మార్పులను కూడా మనం గమనించాలి. బిజెపి ఈ మహమ్మారిని అడ్డుపెట్టుకుని తన రాజకీయ పట్టును మరింత పెంచుకోడానికి ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షాలను చూస్తే, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది. ఆ పార్టీలో అంతర్గత కలహాలను, మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లో బిజెపి ఎలా ఉపయోగించుకున్నదో చూశాం. కాశ్మీర్ వంటి అనేక సమస్యలపై కాంగ్రెస్ ఒక నిర్ధిష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నది. చివరికి రామ్ మందిరం విషయంలో కూడా అంతే. మేము కూడా రామమందిర నిర్మాణంలో భాగస్వాములమే అని ఆ పార్టీ చెప్పుకుంటున్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం రాష్ట్రాల వారీగా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా, ఆయా రాష్ట్రాల్లో పాలక పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు, బిజెపితో జతకట్టిన పార్టీలకూ వ్యతిరేకంగా ఎవరిని సమీకరించగలమో పరిశీలించాలి. విస్తృత ప్రాతిపదికపై సమస్యలపై మనతో కలిసి వచ్చేవారిని ఒకే వేదికమీదకు సమీకరించాలి. విభిన్న సమస్యలపై మనం విభిన్న శక్తులను సమీకరించే ప్రయత్నం చేయాలి. మనం ఐక్య ఉద్యమాలనూ, విస్తృత పోరాటాలనూ నిర్మించగలిగినప్పుడు మాత్రమే ప్రతిపక్షాల్లో మనం కొంత బలాన్ని, నమ్మకాన్ని కలిగించగలం. హిందుత్వ మతతత్వవాదం,నయా-ఉదారవాదాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాడేవాళ్లం మనమే గనుక మనం ఈ శక్తులన్నిటినీ ఒక చోటకు సమీకరించడానికి ప్రయత్నించాలి. మొదట మనం స్వతంత్ర పని ద్వారా స్వతంత్ర బలాన్ని పెంచుకోవాలి, అన్ని శక్తులను సమీకరించడానికి ప్రయత్నించాలి. మనం ప్రజారోగ్యం, ప్రజల విద్యకు సంబంధించిన సమస్యల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రజలు ప్రజారోగ్య వ్యవస్థ ఆవశ్యకతను గుర్తిస్తారు. అందువల్ల ఇప్పుడు మనం ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాల మీద, గ్రామ స్థాయిలో, బ్లాకు, తాలూకా స్థాయిలో ఉన్న సదుపాయాలను మెరుగుపరిచే విషయం మీద ఆందోళనలు చేయాలి. తాలూకా స్థాయి అసుపత్రులు, జిల్లా స్థాయి ఆసుపత్రులు మెరుగుపరచాలని, మరిన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని ఆందోళనలు చేపట్టాలి.
మనం ఏ రకమైన ఆందోళనలు చేపట్టినా ప్రజలతో మన సంబంధాలను పెంచుకోవాలి. ఈ కష్ట కాలంలో ప్రజలతో ఉండాలి.
మనం కరోనా మహమ్మారి తరువాతి రోజులకు సిద్ధం కావాలి. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక మతతత్వ విధానాలనుండి వెనక్కు రాదు. ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడి చేస్తున్న వారు తరువాత కూడా దాన్ని కొనసాగిస్తారు. ప్రజలపై అనేక భారాలు వేస్తారు. ఆ పనిచేయకుండా ఆగరు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు. వీటికి వ్యతిరేకంగా పోరాడ్డానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మనం పెద్ద పోరాటాలు చేయలేకపోవచ్చు. కానీ నిరంతరం రాజకీయంగా, నిర్మాణ పరంగా సిద్ధమై ఉంటే, ఇతర పార్టీల మాదిరిగా కాకుండా మహమ్మారి తరువాత మనం ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ల గలుగుతాము. మన స్వతంత్ర కృషి, వామపక్షాలతో కలిసి చేసే పోరాటాలూ ఇతర లౌకిక, ప్రజాతంత్ర శక్తులను సమీకరించగలగాలి. రాన్ను రోజుల్లో ఈ కర్తవ్యాలను పూరిస్తారని నేను భావిస్తున్నాను. మన కామ్రేడ్స్ అంతా ఈ మహమ్మారి కాలంలో తగిన జాగ్రత్తలుతీసుకుంటారని భావిస్తున్నాను. ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలతో సంబంధాలను పెట్టుకోడానికీ, కొనసాగించ డానికీ మార్గాలు వెదుకుతారని భావిస్తున్నాను.
చివరిగా చెప్పేదేమంటే, ప్రస్తుతం ఈ భూగోళం మీద కరోనా మహమ్మారి వివిధ శక్తుల మధ్య ఇప్పటికే ఉన్న ఘర్షణలను, వైరుధ్యాలను తీవ్రతరం చేస్తున్నది. ప్రస్తుతం మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ రానున్న పరిస్థితి మనకు అనేక అవకాశాలను, కొత్త అవకాశాలను కల్పి స్తుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర ఉద్యమం పెద్ద అంగలతో ముందుకు పురోగమించగలుగుతుంది.
- ప్రకాశ్ కరత్