కేంద్ర ప్రభుత్వం జూన్ 5న తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులు రైతు వెన్ను విరిచేస్తాయి. మన వ్యవసాయ
రంగాన్ని, రైతాంగాన్ని తీవ్రంగా
ప్రభావితం చేస్తాయి. పండిన పంటను రెగ్యులేటెడ్ వ్యవసాయ మార్కెట్‌లో కాక ఎక్కడైనా
అమ్ముకోవచ్చునని తెచ్చిన ఆర్డినెన్సుతో కేంద్ర ప్రభుత్వం రైతుకు మద్దతు ధర
చెల్లింపజేసే బాధ్యతకు మంగళం పాడడంతోపాటు వ్యాపారులు మార్కెట్ సెస్‌ను రాష్ట్ర
ప్రభుత్వాలకు చెల్లించే పని లేకుండా చేస్తోంది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని
చట్టబద్ధం చేసే రెండో ఆర్డినెన్స్ ద్వారా కార్పొరేట్లకు రక్షణ కల్పించనుంది. ఇక
నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ ఆర్డినెన్స్‌తో వ్యాపారులు వ్యవసాయోత్పత్తుల
ధరలను దిగ్గొయ్యడానికి, వాటిని నల్ల బజారుకు తరలించడానికి మార్గం సుగమం చేస్తుంది.
దేశ విదేశీ కార్పొరేట్లకు మేలు చేసేందుకు భారత రైతు వెన్ను విరిచేందుకైనా
మోడీ సర్కారు వెనకాడదనిఈ మూడు ఆర్డినెన్సుల జారీతో స్పష్టమయింది. భారత రాజ్యాంగంలో
వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశం. కాబట్టి విధానపరమైన మార్పులు చేయాలంటే మెజారిటీ
రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా శాసన సభల ఆమోదం కూడా అవసరం. ఇవేమీ లేకుండానే ఆర్డినెన్సులతో కీలక
మార్పులు చేయడం ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం మాత్రమే కాక అత్యంత నిరంకుశ చర్య.
ఆగస్టు 20 నుండి 26 వరకు సిపిఎం
దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ఛార్టర్‌లో 'మూడు ఆర్డినెన్సుల
రద్దు' 6వ డిమాండ్‌గా వుంది.
రైతు పండించిన పంటను స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోనే అమ్ముకోవాలన్న నిబంధన
పోయి, దేశంలో ఎక్కడైనా
అమ్ముకోవచ్చునని బిజెపి పెద్దలు చెబుతున్నారు.
నిజానికి 2015-16 భూ కమతాల సెన్సస్ ప్రకారం 86.2 శాతం మందికి రెండు హెక్టార్లకు మించి భూమి లేదు. సన్న చిన్నకారు రైతు
దేశంలో ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పంటను ఎలా తీసుకెళ్తాడు? ఎలా అమ్ముకుంటాడు? కాబట్టి అదంతా అసత్య
ప్రచారమే! వాస్తవం ఏమిటంటే పంటను మార్కెట్ యార్డులో కాకుండా ఎక్కడైనా
కొనుక్కోవచ్చు కనుక ప్రైవేటు వ్యాపారులు తమ ఇష్టమొచ్చిన ధరను మాత్రమే
చెల్లిస్తారు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్కెట్ సెస్ చెల్లించనక్కరలేదు (ఆర్డినెన్స్
క్లాజు6) ఆర్డినెన్స్ అసలు
బండారం ఇదీ!
వ్యవసాయ మార్కెట్లను వ్యాపారుల స్వేచ్ఛకు వదిలేయాలని రెండు దశాబ్దాల క్రితం
నుండీ ప్రపంచ బ్యాంకు చెబుతోంది. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక
మోడల్ మార్కెట్ చట్టం రూపొందించి రాష్ట్రాలకు పంపింది కానీ అత్యధిక రాష్ట్రాలు
అందుకు పూనుకోలేదు. ఇప్పుడు మోడీ సర్కారు నేరుగా ఆర్డినెన్స్ రూట్‌ను ఎంచుకుంది.
కాంట్రాక్టు వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయడమేగాక కార్పొరేట్ల ఇష్టారాజ్యంగా
మార్చి, రైతుల హక్కులు కాలరాసే
ఆర్డినెన్సు ఇంకొకటి. కాంట్రాక్టు వివాదం ఏదైనా వస్తే ఆర్‌డిఓ తుది పరిష్కారం
చేస్తారని చెప్పడం ద్వారా బలవంతులదే రాజ్యం అని చెప్పకనే చెప్పినట్టయింది.
కాంట్రాక్టు, కార్పొరేట్ సేద్యం కూడా ప్రపంచ బ్యాంకు విధానాలే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసి రైతులను భ్రష్టు పట్టించిన విషయం చాలామందికి
గుర్తుండే వుంటుంది.
నిత్యావసర సరుకుల నిల్వలపై పరిమితులు ఎత్తేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ నల్ల
బజారుకు గేట్లెత్తడమేగాక రైతు పంటకు న్యాయమైన ధర కూడా రాకుండా చేయడానికే. 1955 నుండి అమలులోవున్న
నిత్యావసర సరుకుల చట్టానికి ఈ సవరణలు చేయడం ద్వారా వ్యాపారులు సరుకులను అపరిమితంగా
నిల్వ చేస్తారు. వివిధ పంటలను అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకగా దొరికేటపుడు కొని, ఇక్కడ స్టాక్
చేస్తారు. ఆ వ్యవసాయోత్పత్తులు నిల్వలు కావాల్సినంత వున్నాయని చెప్పి రైతుల నుండి
తక్కువ ధరకు కొంటారు. కొంత కాలం తరువాత కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచి
వినియోగదారుల్ని దోపిడీ చేస్తారు. ఇప్పుడైతే సరుకు నిల్వకు పరిమితులున్నాయి కనుక
అది సాధ్యం కకావడంలేదు. ఇకపై దేశ, విదేశీ వ్యాపారులకు ఇష్టారాజ్యం అవుతుంది. ఈ ఆర్డినెన్స్ కూడా డబ్ల్యుటిఒ
ఒప్పందాల కొనసాగింపుగానే వచ్చిందని నిపుణులు అంటున్నారు.
రైతులకు, యావత్ దేశానికి నష్టదాయకమైన ఈ మూడు ఆర్డినెన్స్‌లను ప్రతిఘటించడం ప్రతి
దేశభక్తుని కర్తవ్యం. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు.
విస్తారమైన మార్కెట్ వ్యవస్థ కలిగిన పంజాబ్‌లో అక్కడి రైతులు ట్రాక్టర్లతో భారీ
నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం జరిపారు. ఈ
ఆర్డినెన్సులను ఉపసంహరించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణ, కేరళ తదితర రాష్ట్ర
ప్రభుత్వాలు కూడా ఆర్డినెన్సులను వ్యతిరేకించాయి కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మాత్రం కిమ్మనలేదు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగినా, ఖజానాకు చిల్లు
పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రానికి నిరసన తెలియజేయడంతోపాటు ఆర్డినెన్సులను వ్యతిరేకించాలి.
No comments:
Post a Comment