Monday, August 24, 2020

ఎవరి యుద్ధమిది?

 

.....యుద్ధం అంటే ఏమిటో నాకు తెలుసు. ఒక్కటి మినహా చాలా సైన్యాలతో నేను పనిచేశాను. మనుషులు చనిపోవడం చూశాను. పిచ్చెత్తిపోవడం, ఆసుపత్రిలో నరకం అనుభవించడం చూశాను. కాని వీటన్నిటికన్నా ఘోరాతిఘోరమైన విషయం మరోటి ఉంది. యుద్ధం అంటే వికృతమైన సామూహిక-మానసిక వైకల్యం. నిజాలు చెప్పేవారిని నిలువునా శిలువ వేయడం. కళాకారుల చేతులు నరికివేయడం. సంస్కరణలనూ, విప్లవాలనూ, సామాజిక శక్తులనూ పక్కదోవపట్టించడం. యూరప్‌ యుద్ధంలో అమెరికా పాల్గొనకూడదని చెబుతున్న వారిని ఇప్పటికే ''దేశ ద్రోహులు'' అని అమెరికాలో ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే అడుగంటిపోయిన మన భావప్రకటనా స్వేచ్ఛను మరింత అణగదొక్కడాన్ని వ్యతిరేకించేవారిని ''ప్రమాదకరమైన ఉన్మాదులు''గా పేర్కొంటున్నారు. పత్రికా సెన్సార్‌షిప్‌ కూడా పెడతారన్న వార్తలు వస్తున్నాయి....పత్రికలు కూడా యుద్ధ నాదాలు చేస్తున్నాయి. చర్చి యుద్ధం కోసం కాలుదువ్వుతోంది. లాయర్లు, రాజకీయ నాయకులు, స్టాక్‌ బ్రోకర్లు, సామాజిక గ్రూపుల నాయకులు...అంతా రణన్నినాదాలు చేస్తున్నారు....


. ...
కాని ఈ యుద్ధం ఎవరిది? నాది కాదు. మహాగొప్ప ఫైనాన్షియల్‌ ''దేశభక్తుల'' వద్ద పనిచేస్తున్న లక్షలాదిమంది అమెరికన్‌ కార్మికులకు కనీసజీవనం సాగించడానికి ఉపయోగపడే వేతనాలు ఇవ్వడం లేదన్న విషయం నాకు తెలుసు. పేద ప్రజలను కనీసం విచారణ కూడా లేకుండా దీర్ఘకాలం పాటు జైళ్లలో పెట్టిన వైనం చూశాను. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులనూ, వారి భార్యలనూ, పిల్లలనూ ప్రయివేటు డిటెక్టివ్‌లూ, సైనికులూ కాల్చి చంపడం, అగ్ని మంటల్లో వేసి కాల్చడం చూశాను. యుద్ధంలో ధనికులు మరింత ధనికులయ్యారు. జీవన వ్యయం పెరిగింది. కార్మికులు మరింత పేదలైనారు. ఈ శ్రామికులు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. చివరికి అంతర్యుద్ధాన్ని కూడా కోరుకోవడం లేదు.

కాని జర్మనీ, ఇంగ్లాండ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా స్పెక్యులేటర్లు, యజమానులు, ధనికులూ యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అబద్ధాలు, అభూత కల్పనలతో వారు మన రక్తాన్ని మరిగించి మనల్ని నరరూప రాక్షసులుగా మారుస్తారు. అప్పుడుగాని మనం వారికోసం యుద్ధం చేసి, వారికోసం చావం....

- జాన్‌ రీడ్‌ (రచయిత రష్యాలోని అక్టోబర్‌ మహావిప్లవం, మెక్సికో అంతర్యుద్ధంతో సహా అనేక చారిత్రక ఘటనలను గ్రంథస్థం చేసిన ప్రముఖ అమెరికన్‌ జర్నలిస్టు. 1917 ఏప్రిల్‌లో ఆయన మొదటి ప్రపంచ యుద్ధం గురించి ''ఎవరి యుద్ధం'' అనే పేరుతో రాసిన వ్యాసం నుండి.)

 

No comments:

Post a Comment