Friday, August 14, 2020

భారత దేశం అనే భావన ఎలా రూపొందింది?

 


భారత దేశం అనే భావన ఎప్పుడు ఏ విధముగా ఆవిర్భవించింది, ఏ విధముగా బల పడింది, భారత జాతీయత ఏ విధముగా రూపొందింది, ఇప్పుడు ఈ భావన కి వచ్చిన ప్రమాదం ఏమిటి, ఈ విషయాల పై మాట్లాడుకుందాం.  

ఋగ్వేదం లో భారత దేశం అనే మాట ఎక్కడా లేదు. యజుర్వేదం, సామ వేదం, అధర్వణ వేదాలలో కూడా ఈ భావన లేదు. బ్రాహ్మణికాలు, ఉపనిషత్తులలో కూడా లేదు. ఋగ్వేదం లో కొన్ని నదులు, కొన్ని తెగల పేర్లు వున్నాయి. సప్త సైంధవ అనే మాట సింధు నది, దాని ఉపనదుల ను తెలిజేసెసేది మాత్రమే.

కొన్ని ప్రాంతాలను కలిపి మొట్ట మొదటి సారిగా ప్రాకృత భాషలో “సోలా మహా జన పద” (16 మహా జనపదాలు) అన్నారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటికి ఈ మాట కొన్ని గ్రంధాలలో కనిపిస్తుంది.  “సోలాహ్”అనేది ప్రాకృత భాష పదం. హింది, ఉర్దూ భాషల మూలాలు ఈ ప్రాకృతిక భాష లోనే వున్నాయి. కాంభోజ ( ఆఫ్గానిస్తాన్ ప్రాంతం) నుండి అంగ (తూర్పు బీహారు) వరకు ఈ పదహారు మహాజనపదాలు వున్నాయి. కానీ ఇవి  నేటి భారత దేశం లో వున్న ఉత్తర భారత ప్రాంతాలకే పరిమితం. ఆర్యావర్తం అంటే హిమాలయాల నుండి వింధ్య పర్వతాల వరకు అని మను స్మృతి అన్నది.

అశోకుని శాసనాలు కాందహార్ నుండి కర్ణాటక, ఆంధ్ర  వరకు లభించాయి. ఈ శాసనాలు ప్రాకృతిక భాష లో మరియు గ్రీకు, ఆరమైక్ భాషలలొ వున్నాయి. ఇటు వంటి రాజకీయ ఐక్యత వలన భారత దేశం అనే భావన ప్రారంభమయింది. కానీ దాని పేరు “ జంబూ ద్వీప” అని అశోకుని శిలాశాసనం లో వున్నది. జంబూ అంటే నేరేడు.  నేరేడు  బాగా వున్న ప్రాంతం అని దీని అర్థం. ఒరిస్సా లో “హాతి గుంఫ” వద్ద కళింగ పాలకుడైన ఖారవేలుడు క్రీస్తు పూర్వం 1 వ శతాబ్దం లో వేయించిన శిలా శాసనం లో “భారత” అనే మాట ప్రాకృతిక భాష లో వున్నది. ఈ విధముగా క్రమముగా “భారత దేశం” అనే భావన ఉదయించింది. ఇంతే గాక సాంస్కృతికముగా ఒక ఐక్యత కూడా మొదలయింది. బౌద్ధ, జైన, బ్రాహ్మణ మతాలు దేశం అన్ని భాగాల లో వ్యాపించాయి. అన్ని ప్రాంతాలలో కనీసం గ్రాంధిక భాష గానైనా ప్రాకృత భాషని వాడారు. కాబట్టి ఈ అంశాలు ప్రజలను ఐక్యం చేశాయి. గ్రాంధిక భాష గా ప్రాకృతము, పూజారి భాషగా సంస్కృతము వ్యాప్తిలోకి వచ్చాయి.  ఈ లక్షణాలను బట్టి విదేశీయులు కూడా భారతీయులను గుర్తించగలిగే పరిస్థితి వచ్చింది.

ఇరానీయులు మనల్ని మొదటి సారిగా “హిందూ” అనే పదం తో గుర్తించారు. కానీ వారు సింధు నే హిందూ అన్నారు. హిందూ అంటే సింధు నది కి తమ భాషలో వారు పెట్టిన పేరు.  కాబట్టి సింధు నదికి   తూర్పున వున్న ప్రాంతాన్ని వారు హిందూ అని అన్నారు. దీని నుండే ఇండియా అనే పేరు వచ్చింది. గ్రీకులు హిందూ ని ఇండు అన్నారు. హిందూ లో వున్న మొదటి అక్షరం  హెచ్ ని వారు పలకలేక ఇండు అన్నారు. దీని నుండి ఇండియా అనే మాట వచ్చింది. చైనా వాళ్ళు హిందూ ని ఇంటు అన్నారు. ఆ తరువాత పర్షియన్ భాష లో “హిందుస్తాన్” అనే మాట వచ్చింది. సంస్కృతం లో ఎక్కడా హిందుస్తాన్ అనే మాట లేదు. క్రీస్తు తరువాత 4వ శతాబ్దం లో శాసనీడ్ (పర్షియన్ సామ్రాజ్యం పాలకుల ఆఖరు వంశం) శాసనం లో దీనిని వాడారు.

ఈ విధముగా హిందూ అనే పదాన్ని బయటి వారు సృష్టించారు. హిందుత్వ వాదులుగా తమని చెప్పుకుంటూ విదేశీ అయిన ప్రతి దానిని విసర్జించాలనే వాళ్ళు తమ సొంత పేరుగా వున్న హిందూ అనేది ఇరాన్ లో పుట్టిన పదం అని సంస్కృతం లో ఈ మాట 14 వ శతాబ్దం వరకు లేదని మరచి పోతున్నారు. సంస్కృత శాసనాలలో హిందూ అనే మాటని మొట్ట మొదటి సారిగా వాడింది విజయనగర సామ్రాజ్యపు రాజులు. వారు తమని “హిందూ రాయ సురత్రాన” అని వర్ణించుకున్నారు. హిందూ సుల్తానులని దీని అర్థం. ఇది మన మిశ్రిత సంస్కృతికి ఒక తార్కాణం.  (అమిత్ షా అనే పేరులో వున్న షా అనేది పర్షియన్ నుండి వచ్చినదే... అనువాదకుడు)

భారత దేశం అనే భావన క్రీస్తు పూర్వమే వున్నప్పటికి దేశ ప్రేమ అనే భావం గాని, దేశ భక్తి గేయం గాని సంస్కృతం లో ప్రాచీన భారత దేశం లో లేదు. భారత దేశాన్ని పొగుడుతూ ప్రేమిస్తూ రాసిన వాడు అమీర్ ఖుస్రో. 1318 లో ఇది రాయబడింది. భారత దేశాన్ని అమీర్ ఖుస్రో ఏమని ప్రశంసించాడు? దాని వాతావరణాన్ని ప్రశంసించాడు. కానీ భారత దేశపు వాతావరణం నిజానికి ప్రశంసనీయమైనది కాదు. దీనితో పాటు దాని ప్రకృతి సౌందర్యాన్ని, జంతువులను, మహిళలను వారి అందాన్ని, పాతివ్రత్యాన్ని ప్రశంసించాడు. బ్రాహ్మణుల పాండిత్యాన్ని ప్రశంసించాడు. వారి భాష అయిన సంస్కృతాన్ని ప్రశంసించాడు. భారత దేశం అంటే బ్రాహ్మణులే గాక ముస్లిం లు కూడా అని అన్నాడు. భారత దేశం అంతటా పర్షియన్ మరియు అరబిక్ భాషలు మాట్లాడే వాళ్ళున్నారని అన్నాడు. కాశ్మీరీ భాష నుండి  నుండి మాబారి(తమిళం) వరకు వున్న అనేక భాషలను ప్రశంసించాడు. వీటిని హైందవి భాషలని అన్నాడు. సంస్కృతము విజ్ఞాన శాస్త్రాల భాష అన్నాడు. భారత దేశం పంచ తంత్ర కథలకి, చదరంగానికి, దశాంస అంకె ల పద్ధతికి మూలమయిన దేశం అని ప్రశంసించాడు.

ఆ తరువాత క్రీ.శ. 1350 లో ఈసామి అనే కవి భారత దేశాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం లో హిందుస్తాన్ అనే పూల తోటని చూసి స్వర్గం కూడా ఈర్ష్య పడుతుందని అన్నాడు. మొగల్ చక్రవర్తుల పాలన లో ప్రత్యేకించి అక్బరు చక్రవర్తి మరియు అబు ఫజల్ లు భారత దేశం విశిష్ఠమయిన దేశం అన్నారు. అనేక మతాల వారున్నందున మత సామరస్యత ఉండాలన్నారు. నిరపేక్ష శాంతి అవసరం అన్నారు. ఔరంగజేబు కూడా రాజ కుమారుడుగా వున్నప్పుడు 1658 లో వర్షం మరియు సూర్యుని  వెలుగు అందరి పై పడుతున్నట్లే దేవుడు కూడా వివక్షత  లేకుండానే వుంటాడని అన్నాడు. తురాన్ (నేటి ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలు)  లో సున్నిల పట్ల, ఇరాన్ లో  షియాల పట్ల సహనం వుంటుందని , కానీ భారత దేశం లో ప్రతి మతానికి  సహనం అవసరమని జహంగీర్ అన్నాడు.  ఢిల్లీ సుల్తాన్ లు, ఆ తరువాత మొగల్ చక్రవర్తులు భారత దేశపు అన్ని భాగాలను ఒకే ఛత్రం కిందికి తీసుకు వచ్చారు.

1857 లో  జరిగిన  సిపాయిల తిరుగుబాటు లో రాజకీయ పరమైన భారత దేశపు భావన బలముగా వ్యాపించింది. లక్షా ముప్ఫై వేల సిపాయిలలో లక్ష మంది ఈ తిరుగుబాటు లో పాల్గొన్నారు. వారిలో అత్యధికులు బ్రాహ్మణులు. కానీ వారేమన్నారు? ఢిల్లీకి వెళ్ళి బహదూర్ షా జాఫర్ ను భారత దేశపు చక్రవర్తిగా ప్రకటించుదామని అన్నారు. హిందుస్తాన్ త్తరఫున వారు మాట్లాడారు. హిందువులు, ముస్లిం ల మధ్య  తేడా లేదని, ఒకరికి దెబ్బ తగిలితే ఇంకొకరికి తగిలినట్లే నని, కాబట్టి హిందువులు, ముస్లిములు ఐక్యముగా వుండాలని తిరుగుబాటు దారులు అన్నారు. తిరుగుబాటు దార్లందరు తాము భారత దేశం కోసం పోరాడుతున్నామని అన్నారు. బహదూర్ షా జాఫర్ ని బ్రిటీషు పాలకులు జైలు లో పెట్టిన అనంతరమ్ “ ఓ జాఫర్, భారత దేశం ఉన్నంత కాలం ఈ రాలిన పుష్పపు కీర్తి ప్రకాశిస్తూ  వుంటుంది”  అని అన్నాడు.

ఈ విధముగా ఒక స్వతంత్ర రాజ్యముగా భారత దేశం ఉండాలనే భావన 1857 నాటికే వున్నది.  కానీ ఇది సరిపోతుందా? చాలదు. ఈ తిరుగు బాటు బెంగాల్ సైన్యానికే పరిమితం. హిందూస్తానీ భాష మాట్లాడే ప్రాంతాలకే పరిమితం. దేశానికి ఒక జాతీయతా భావం కలిపించటానికి ఇంకా అదనముగా మరి కొన్ని అవసరం. స్వతంత్ర భారత దేశం బ్రిటిష్ పాలన కన్నా మెరుగైనదిగా వుంటుందనే భావం ఉండాలి.

బ్రిటిష్ పాలనని సమర్థించిన రాజా రామ్ మోహన్ రాయ్, సయ్యద్ అహ్మద్ ఖాన్ లు బ్రిటిష్ పాలన భారత దేశానికి మంచిదని భావించారు. సంఘ సంస్కరణలు, ఆధునిక విద్య ల ను బ్రిటిష్ పాలన ప్రోత్సహిస్తుందని భావించారు. కులాల పేరుతో విభజించబడినంత కాలం భారత  ప్రజలకు దేశ భక్తి వుండదని  రాజా రామ్ మోహన్ రాయ్ అన్నారు. ఈ పరిస్థితిని  మార్చటానికి సంఘ సంస్కరణలు అవసరమని భావించారు.  అంటరాని తనం అనేది ఉండ కూడదని, కులాంతర వివాహాలు జరగాలని, పురుషులతో సమం గా మహిళా లకు ఆస్తి హక్కు, ఇతర అన్నీ హక్కులు ఉండాలని, ఆధునిక విద్య మహిళకు  అవసరమని  కేశవ్  చంద్ర సేన్ అన్నారు.

దాదా భాయి నౌరోజీ, రమేశ్ చంద్ర దత్తు, జస్టిస్ రానడె ల పాత్ర చాలా ముఖ్యమయినది. భారత దేశాన్ని బ్రిటిష్ పాలకులు ఎలా దోపిడి చేస్తున్నారో, స్వేచ్చా వాణిజ్యం పేరుతో మన పరిశ్రమలని ఎలా దెబ్బ తీశారో వివరించారు.  వారు అన్ని  మతాల వారి తరఫున మాట్లాడారు. కానీ  వారు ఇంగ్లీష్ మాట్లాడే వారి కోసమే రాశారు. పేదరికం లో వున్న వాళ్ళు, నిరుద్యోగులు, నేత పని వారు తదితర ప్రజల కోసమే రాశారు. కానీ వారి సందేశం కొందరికే పరిమితమయింది.

గదర్ యోధులు, మహారాష్ట్ర, బెంగాల్ విప్లవకారులు అసమాన త్యాగాలు చేసినా అది ప్రజల ఉద్యమం కాలేదు.

స్వాతంత్ర్యోద్యమం లోకి ప్రజలను తీసుకు వచ్చింది గాంధీ గారే. 1915 లో భారత దేశానికి వచ్చారు. 1917 లో చంపారన్ లో రైతు సత్యాగ్రహం నిర్వహించారు. రైతులను రాజకీయాలలోకి తెచ్చారు. జాతీయోద్యమం లోకి రైతులు రాకుండా ఉద్యమం బలపడదని గ్రహించారు. కలెక్టరే అల్లా అని ముస్లిం పేద రైతులు అనుకునే వాళ్ళు. కానీ గాంధీ గారు బుద్ధు మియా ని కూడా చరిత్ర గమనం లో కి తీసుకొచ్చారు. “బుద్ధు మియా భీ హజరత్ గాంధీ కే సాత్ హై, ఏక్-ముష్ట్ -ఏ-ఖాక్ హై మగర్ ఆంధి కె సాత్ హై” ( బుద్ధు మియా కూడా హజ్రత్ గాంధీ అనుచరుడయ్యాడు, అతను మట్టి మనిషియే అయినప్పటికి  తుఫాను లో భాగమయ్యాడు ) “ అని అక్బర్ ఆల్హాబాది అన్నారు. ఈ విధముగా గాంధీ గారి వలన అంతకి ముందు ఎన్నడూ లేని విధముగా మొదటి సారిగా రైతులు కూడా చరిత్రకెక్కారు.

కానీ స్వతంత్రం వస్తే  ప్రజలకేమి దక్కుతుంది? ఇది చెప్పాల్సిన అవసరం వున్నది. భారత దేశపు గతం అంటే హిందువులు, ముస్లిం లు ఇరువురు అని గాంధీ గారన్నారు. రాజులు, సుల్తానుల పాలనే  బాగున్నదని గాంధీ గారి అభిప్రాయం. ప్రయివేటు వ్యక్తుల  చర్యల వలననే ప్రజలు బాగు పడాలి. ఫ్యాక్టరీ యజమానులు తమ కార్మికుల పట్ల ధర్మ కర్తలుగా వ్యవహరించాలి. జమీందార్లు రైతుల బాగోగులు చూసుకోవాలి. దేశం బాగుపడేందుకు ఇదే మార్గం అని గాంధీ గారన్నారు. కానీ ఈ ధర్మ కర్తృత్వ సిద్ధాంతం వాస్తవ జీవితం లో పని చేయదు. కాబట్టి జాతీయోద్యమం లోకి ప్రజారాశులను సమీకరించేందుకు  ఇది చాలదు. ఇందుకు  వామ పక్ష భావజాలం అవసరం. ఈ దిశలో కొంత మేరకు నెహ్రూగారు పని చేశారు. నెహ్రూ గారు రైతులకి భూమి కావాలని, కార్మికులకి రక్షణ  కావాలని,  మహిళలకి సమానత కావాలని అన్నారు. ప్రజాస్వామ్యం, అందరికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ఈ భావజాలాన్ని వామ పక్ష సహకారం తో నెహ్రూ ముందుకు తీసుకెళ్లారు.

కరాచీ కాంగ్రెస్ తీర్మానం ( 1931) లో మతాల పట్ల రాజ్యం తటస్థముగా వుండాలని, మహిళలకు సమాన హక్కులు కావాలని,  రైతులకి భూమి కావాలని, వారిని కవులు నుండి విముక్తం చేయాలని,  ప్రాథమిక పరిశ్రమలు రాజ్యం నిర్వహణలో వుండాలని తీర్మానించింది. కరాచీ తీర్మానం లేకుంటే ఈ స్థాయిలో స్వాతంత్ర్యోద్యమం  జరిగేది కాదు.

కాని  హిందూ మత తత్వ వాదులకు, ముస్లిం మత తత్వ వాదులకు స్వాతంత్ర్యోద్యమ నాయకులు లేరు. ఆర్ ఎస్ ఎస్ 1925 లో ఏర్పడింది. అప్పటినుండి 1947 లో స్వాతంత్ర్యం వచ్చే వరకు  స్వతంత్ర పోరాటం లో అది లేదు. బ్రిటిష్ పాలకులకు  క్షమాపణ పత్రం రాసి ఇచ్చి అండమాన్ జైలు నుండి  విడుదల అయిన సావర్కర్ ఆ తరువాత ముస్లిం ల పట్ల ద్వేషాన్ని పెంచే పనులే చేశాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఆ తరువాతనే జిన్నా కూడా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రకటించాడు. భగత్ సింగ్ వారసులం తామని ఆర్ ఎస్ ఎస్ వారు అంటున్నారు. మరి భగత్ సింగ్ నినాదమైన ఇంక్విలాబ్ జిందాబాద్ అని వారెందుకనరు?  జాతీయోద్యమాన్ని  వ్యతిరేకించే వారిలో మరింత హాని జరిగేది హిందూ మత తత్వ వాదులనుండే  అని భగత్ సింగ్ అన్నాడు.  కాంగ్రెస్ నాయకులలో తాను సమర్థించేది నెహ్రూనే అని అన్నాడు. మహాత్మా గాంధీ కి నేను ముఖ్య అనుచరుడనని చెప్పిన పటేల్ మీ కెలా నాయకడవుతాడు? మత ప్రాతిపదికన భారత దేశం ఏర్పడాలని బోస్ అన్నారా? ఇక్బాల్ గేయం “సారా జహాన్ సే అచ్ఛా” గీతాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ జాతీయ గేయముగా ప్రకటించాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ కు అధికారిక భాషలుగా హింది, ఉర్దు లను ఎంపిక చేశాడు. ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు జై హింద్ అనరు, ఇంకిలాబ్ జిందాబాద్  అనరు.

ఆర్ ఎస్ ఎస్ కె గాక ముస్లిం లీగ్ కి కూడా ఇదే సమస్య ఎదురయింది. స్వాతంత్ర్యం రాక ముందు కరాచి నుండి ప్రచురింప బడుతున్న ముస్లిం లీగ్ పత్రిక "డాన్" పత్రిక లో వాచ్చిన ఒక వ్యాసం లో ఆ వ్యాస రచయిత,  పాకిస్తాన్ కోసం బ్రిటిష్ పాలన కి వ్యతిరేకముగా పోరాడిన ప్రముఖ నాయకులు లేదా ప్రాణాన్ని అర్పించిన అమరులు ఒక్కరి పేరు కూడా చెప్పలేని పరిస్థితి లో మనమున్నామని  అన్నారు. కారణం ఏమిటంటే మనము హిందువులను వ్యతిరేకించామే గాని బ్రిటిష్ పాలకులను వ్యతిరేకిచలేదని ఆ రచయిత అన్నారు. ఇప్పుడు మనల్ని పాలిస్తున్న బి జె పి ని నడిపించే ఆర్ ఎస్ ఎస్ హిందూ మహా సభల పరిస్థితి  కూడా ఇదే.

ఆర్ ఎస్ ఎస్ కథానాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లు బ్రిటిష్ పాలనకి వ్యతిరేకముగా  చేసిందేమి లేదు. వారి సిద్ధాంతము, నమ్మకాలు అన్నీ జాతీయోద్యమానికి పూర్తి వ్యతిరేకముగా వున్నాయి. ముఖర్జీ బెంగాల్ మంత్రి వర్గం లో క్విట్ ఇండియా ఉద్యమ కాలం లో వున్నాడు. ముస్లిం లీగ్ తో కలిసి వున్నాడు.  హిందుత్వ వాదులు ఆ నాడు హిందూ-ముస్లిం ల మధ్య తగాదాలను సృష్టించారు.

ఆగస్టు 1947 లో ఆలీగడ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లలో మత కలహాలు తీవ్రమైనాయి. ముస్లిం ల పై తీవ్రమైన హింసాకాండ కొనసాగుతున్నది. సైన్యాన్ని పంపించినా ప్రయోజనం లేక పోయింది. గాంధీ గారొక్కరే ఈ హింసా కాండకి వ్యతిరేకముగా గట్టిగా నిలబడ్డారు. ఆయన ముస్లిం క్యాంపులకెళితే  వారు అవమానాల పాలు చేశారు. హిందూ క్యాంపులకెళితే వారూ అవమానించారు. ఈ అవమానాలను రోజులతరబడి భరించారు. 13 జనవరి 1948 నుండి  నిరాహార దీక్షని ప్రారంభించారు. ముస్లిం ల పై దాడి చేయొద్దని, ముస్లిం లు శరణార్థి శిబిరాల నుండి తమ ఇళ్ళకి వెళ్ళ సహకరించాలని, ఆ విధముగా ఖాళీ  అయిన శరణార్థి శిబిరాలలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులకు నివాసం కల్పించవచ్చునని, పాకిస్తాన్ కు చెల్లించాల్సిన రు.50 కొట్లను భారత ప్రభుత్వం చెల్లించాలని కోరారు. తమ దేశ  ప్రభుత్వానికి వ్యతిరేకముగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకూలముగా ఎవరైనా ఈ విధముగా గట్టిగా నిలబడటం సాధ్యమయ్యేడా? కానీ గాంధీ గారు అలా నిలబడగలిగారు. నేను భారతీయుడనే గాక  పాకిస్తానీ ని కూడా నని, తాను ఈ రెండు దేశాలకు చెందిన వాడినని అన్నారు. గాంధిగారి నిరాహార దీక్ష ప్రారంభమయినప్పటి నుండి ఢిల్లీలో మత తత్వ వాదులు గాంధీ ముర్దాబాద్ అని నినాదాలిచ్చారు.

నిరాహార దీక్ష 3వ రోజున నెహ్రూ గారు ఎర్ర కోట వద్ద  10000 మంది తో జరిగిన  సభ లో ప్రసంగించారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గాని, పటేల్ గారు కానీ ఈ పని చేయ లేదు. నెహ్రూ గారే చేయగలిగారు. ఈ ప్రసంగం అనంతరం సభికులు నెహ్రూ కి మద్దతునిచ్చారు. 5వ రోజున మీరట్, ముజఫర్ నగర్, అలీగర్ జిలాల నుండి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి వచ్చి స్వీపర్ యూనియన్, టాంగా వాలా ల యూనియన్, ఫ్యాక్టరీ వర్కర్ల యూనియన్ లతో కలిసి అందరూ లక్ష మంది పైగా మత కలహాలు ఆపాలని  కోరుతూ ప్రదర్శనలు చేశారు. మత కలహాలకు బాధ్యులైన వారి ఇళ్లకు వెళ్ళి మతకలహాల లో పాల్గొనం అని ఒక ప్రతిజ్ఞా పత్రం పై వారితో సంతకాలు చేయించారు. వారిని గాంధిగారి వద్దకు తీసుకొచ్చారు. దీనితో గాంధిగారు నిరాహార దీక్ష విరమించారు. భారత దేశం లో మరియు పాకిస్తాన్ లో హింసా కాండ ముగిసింది. భారత ప్రభుత్వము పాకిస్తాన్ ప్రభుత్వానికి రు.50 కోట్లు చెల్లించింది.

కాబట్టి భారత జాతీయత అనేది ఆకాశం నుండి రాలేదు. స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాల వలన త్యాగశీలురైన నాయకుయల వలన జాతీయతా భావం ఆవిర్భవించి బల పడింది. 1955-56 లో భారత పార్లమెంటు హిందూ కోడ్ ను ఆమోదించింది. హిందూ మహిళలకు వారసత్వం ప్రకారం ఆస్తిలో వాటా ఇవ్వాలని ఈ చట్టం సారాంశం. మహిళలకు చట్ట ప్రకారం సమాన హక్కులు వచ్చాయి. పాత కాలపు ధర్మ శాస్త్రాలను రద్దు చేసి ఈ చట్టం తెచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ చట్టం తెస్తామని ఎన్నికల ప్రచారం చేసి గెలిచిన తరువాత ఈ పని చేశారు. కాగా తమని మించిన జాతీయ వాదులు లేరని  చెప్పుకునే వారు ఆ నాడు తమ జనసంఘ్, రామ రాజ్య పరిషత్ లు ధర్మ శాస్త్రాలను కాపాడాలని, హిందూ కోడ్ వద్దని ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలి. స్త్రీ లకి పురుషులతో  సమాన హక్కులివ్వటానికి  తమ నాయకులు  ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలి. ఆ ఎన్నికలలో ప్రజలు జనసంఘ్ (నేటి బిజెపి), రామరాజ్య పరిషత్, హిందూ మహాసభ లను చిత్తు చిత్తుగా ఓడించారు.

ఈ విధముగా భారత దేశం ప్రజాస్వామిక దేశం అయింది. స్త్రీ పురుషులకు సమాన హక్కులిచ్చింది. భూసంస్కరణలు జరిగాయి. లక్షలాది రైతులకు భూమి లభించింది.  జమిందారి విధానం రద్దయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ విధముగా స్వాతంత్ర్యోద్యమం అనంతరం నూతన భారత దేశం ఆవిర్భవించింది. 1950, 60 లలో ఇందుకు పునాది ఏర్పడింది.

కానీ అసలు విషయం పేదల పరిస్థితి ఏమిటనేది. పెద్ద మార్పు రాలేదు. తలకి ఎన్ని కేలరీల ఆహారం లభిస్తున్నది అని చూస్తే 1989 వరకు అది పెరుగుతూ వచ్చింది. కరువు వచ్చిన సంవత్సరాలలో కూడా ఫుడ్ కార్పొరేషన్ మరియు సబ్సిడీల ద్వారా ఈ పెరుగుదల కొనసాగింది. కానీ 1991  తరువాత తలసరి ఆహారం కేలరీలు తగ్గుతున్నాయి. 2003 నాటికి బ్రిటిష్ కాలం ఆనాటి దయనీయ స్థితికి చేరుకున్నది. కానీ మోడి ప్రభుత్వము పెట్టుబడుల ప్రవాహం మన దేశానికి రావటం  గురించి మాట్లాడుతున్నది. కార్పొరేట్లకే మద్దతునిస్తున్నది.

 ముస్లిం లీగ్ వలెనే ఆర్ ఎస్ ఎస్ మరియు హిందూ మహాసభలకు కూడా ఆర్థిక పరమైన కార్యక్రమము లేదు. పేదలంటే వారికి లెక్క లేదు. తమకి నిధులిచ్చే సంపన్నులే వారికి ముఖ్యం. బిజెపి కి మద్దతునిచ్చేది ఉన్నత కులస్థులు, ఉన్నత వర్గాలు. కాబట్టి దేశాన్ని పాలించేందుకు ఓట్లకోసం మతపరమైన సమస్యలను రెచ్చగొడుతుంటారు. ఈ విధముగా చేసే వారిలో వీరే మొదటి వారు కాదు. జర్మనీలో నాజీలు జాతి పేరుతో ఈ పని  చేశారు.  ఆర్ ఎస్ ఎస్ గురువైన గురు గోవాల్కర్, జర్మనీలో నాజీలు యూదులను అణచివేయటాన్ని పొగిదారు. మన దేశం లో కూడా హిందువులు కానీ వారిపట్ల ఇటువంటి విధానాన్నే అనుసరించాలన్నారు.    

మతొన్మాదులు తాము చెప్పే  హిందుత్వకి వ్యతిరేకముగా ఎవరు మాట్లాడినా సహించ లేని పరిస్థితి లో వున్నారు. ఋగ్వేదం కూర్పు క్రీస్తు పూర్వం 1500 జరిగిందని అనటం వారికి నచ్చదు.  తాము క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల క్రితం అని అంటున్నారు  కాబట్టి కాబట్టి అందరూ అదే నమ్మాలంటారు. దభోల్కర్, పన్సారే, మరియు కల్బుర్గి ల హత్యలు యాదృచ్చికముగా జరిగినవి కావు. బెదిరించి ప్రజలనోళ్ళు కట్టేయాలని వారి ఉద్దేశం. భారత చరిత్ర పరిశోధన సంస్థ, ఇండియన్ కవున్సిల్ ఆఫ్ సోషల్ రిసెర్చ్, జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం తదితర సంస్థలను మతోన్మాదులతో నింపుతున్నారు. భారత చరిత్రను, భారత రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నారు. ప్రజాస్వామిక హక్కుల పై దాడి చేస్తున్నారు. మతం పేరుతో ముస్లిం ల పై చేసే దాడులను ఏదో యాదృచ్చికముగా జరుగుతున్నవని కాకుండా “భారత దేశం” అనే భావన పై జరుగుతున్న దాడిగా పరిగణించాలి. బి జె పి, ఆర్ ఎస్ ఎస్ లు భారత దేశం అనే భావన కి వ్యతిరేకులని గుర్తించాలి. ఈ కుట్రని తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి.

(ప్రముఖ మార్క్సిస్టు చరిత్ర కారులు శ్రీ ఇర్ఫాన్ హాబీబ్ గారు 7.10.2015 న ఆలీ గడ్ ముస్లిం యూనివర్సిటీ లో చేసిన ప్రసంగానికి ఇది సంక్షిప్త అనువాదం)

అనువాదకులు: పి.అశోకబాబు 

 

No comments:

Post a Comment