Sunday, August 23, 2020

*రాజ్యాంగ విధ్వంసమే నవభారతానికి పునాదా?


*సీతారాం ఏచూరి*

🇮🇳 *73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో కొత్త భాష్యాన్ని చలామణీలోకి తెస్తున్నారు. దీన్నే భావి భారత వారసత్వంగా మార్చనున్నారు. 1947 ఆగస్టు 15న మనకు వచ్చింది సాధారణ స్వాతంత్య్రం మాత్రమేననీ 2019, ఆగస్టు 5న ఆర్టికల్‌ 370, 35ఏని రాజ్యాంగంనుంచి రద్దు చేసిన రోజు, 2020 ఆగస్టు 5న రామాలయం నిర్మించడానికి ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ నిర్వహించిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనేది ఈ కొత్త బాష్యం. ఈ బాష్యం వీరోచితమైన మన స్వాతంత్య్రం పోరాట స్ఫూర్తికీ, ఆ స్పూర్తితో రూపొందిన రాజ్యాంగ విలువలకూ పూర్తి విరుద్ధమైనది. అయోధ్యలో మోడీ ఉపన్యాసం సారాంశం ఇదే.*

📓  *మన రాజ్యాంగం గొప్ప బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విభిన్న స్రవంతులను ఏకం చేసినప్పుడు మాత్రమే భారతదేశపు ఐక్యతను బలోపేతం చేయగలం. భిన్నత్వంలో అన్నింటిని కలుపుకు వచ్చే అంశాలను బలోపేతం చేయాలి. బహుళత్వంలో భాగమైన భాష, జాతి, మతం లాంటి అంశాలను గౌరవించాలి. రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వానికి ఈ భిన్నత్వం పునాది కావాలి. సమానత్వమే ఐక్యతను బలోపేతం చేస్తుంది. ఈ భిన్నత్వాన్ని కాదని దానిపై ఏకశిలా సదృశ్య భావనను మోపే ప్రయత్నం చేస్తే సామాజిక అశాంతి బద్దలవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ సాధనమైన బీజేపీ ఈ దేశంపై ఏకశిలా సదృశ్య వ్యవస్థను నిర్మించాలంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులను హరించక తప్పదు. ఈ దిశగా చర్యలు చేపట్టే క్రమంలో దేశంలోని అంతర్గత శతృవులుగా ముద్రవేసిన కొందరిని కాలరాయడానికి నిరంకుశ పద్ధతులను ఉపయోగించేందుకు సైతం వెనుకాడదు.*

🚩 *ఈ నిరంకుశ నవభారత నిర్మాణం కేవలం మోడీ ఒక్కరి కృషి కాదు. ఈ ఆలోచనకు 100సంవత్సరాల చరిత్ర ఉన్నది. అది 1925 ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టినప్పటిది. లౌకిక భారతదేశాన్ని హిందూమతతత్వ భారతంగా రూపొందించటానికి కావల్సిన సిద్ధాంతాన్ని, దాన్ని ఆచరణలోకి తేవటానికి కావల్సిన నిర్మాణాన్ని 1939లోనే గోల్వాల్కర్‌ తన హిందూరాష్ట్ర అన్న రచనలో స్పష్టం చేశారు. భారత ప్రజలు ఈ భావజాలాన్ని అనేక సార్లు తిరస్కరించారు. స్వాతంత్య్ర పోరాటం స్వాతంత్య్ర భారతదేశాన్ని లౌకిక ప్రజాతంత్ర గణతంత్రంగా ప్రకటించి దాన్ని ధృవీకరిచింది. గణతంత్ర భారతదేశం యొక్క లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని తోసిపుచ్చి దాని స్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ యొక్క ఆలోచనా విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నం దశాబ్దాలుగా సాగుతూ ఈనాటి పరిస్థితికి చేరుకున్నది.*

*🏹 *భారత రాజ్యాంగంపై దాడి*

*ఈ నూతన భారత్‌ను ఆవిష్కరించాలంటే మొట్టమొదట కావాల్సింది ప్రస్తుత రాజ్యాంగం ధృవీకరించిన లౌకిక భారతాన్ని ముందుగా ధ్వంసం చేయాలి. గత ఆరేండ్లుగా మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న తీవ్రమైన దాడిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ దాడి లౌకిక పునాదిని, ప్రజాతంత్ర స్వభావాన్ని, సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన లాంటి అంశాలను దెబ్బతీయడంలో కనబడుతున్నది.*

*రాజ్యాంగంపై దాడి అంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. రాజ్యాంగం ప్రకారం మన గణతంత్రానికి మూడు అంశాలు ఉన్నాయి. అవి కార్య నిర్వాహక వ్యవస్థ, చట్టసభలు, న్యాయవ్యవస్థ. ఇవి వేటికి అవే విడివిడి అంగాలు కానీ, తమ విధులను, బాధ్యతలను నిర్వహించడానికి ఒకదానికి మరొకటి సహాయపడుతుంటాయి.*

*చట్టసభలు అంటే పార్లమెంటు.* 

🇮🇳  *ఈ చట్టసభలు పని చేయకుండ దెబ్బతీసి, మందబలంతో తమ ఇష్టారాజ్యంగా మార్చేసారు. పార్లమెంటరీ విధి విధానాలను, కమిటీల నిర్వహణపద్ధతులను పూర్తిగా చిన్నచూపు చూస్తున్నారు. భారత రాజ్యాంగం దేశాన్ని సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ప్రకటించింది. ఈ సార్వభౌమత్వం ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధుల ద్వారా వ్యక్తీకరించబడుతోంది. అటువంటి ప్రజా ప్రతినిధుల అధికారాలు, బాధ్యతలకే నేడు ముప్పు వాటిల్లుతోంది. పార్లమెంటే పనిచేయకుండా పోతే, ప్రజలకు జవాబుదారీతనం ఉండదు. ఈ జవాబురీతనం లోపించిన విషయం గత ఆరేళ్లుగా కండ్ల ముందు కనిపిస్తోంది.*

 *న్యాయవ్యవస్థ*

🇮🇳  *రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను కార్యనిర్వహణా వ్యవస్థ ఉల్లంఘించకుండా గమనిస్తూ రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులు, హామీలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటం న్యాయవ్యవస్థ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, నిస్పక్షపాతంగా ఉండాలి. కానీ ఈ స్వభావంలో రాజీపడటంతో న్యాయవ్యవస్థ యొక్క పర్యవేక్షణ కనుమరుగై పౌరహక్కులు, ప్రజాతంత్ర హక్కులు అమలుజరగకుండా అడ్డుకట్టపడుతున్నది.*

*ఎన్నికల సంఘం*

🇮🇳  *ఎన్నికల సంఘం యొక్క స్వతంత్రత, నిస్పక్షపాత స్వభావమే ప్రజాస్వామ్యానికి మూల విరాట్టుగా ఉంటుంది. దాని ద్వారానే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కాపాడబడేది. స్వేచ్ఛాయుత, న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడి ప్రతి అభ్యర్థికి పోటీ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించబడతాయి. ఇందులో రాజీపడితే ఏర్పడే ప్రభుత్వాలు ప్రజల తీర్పుకు అనుగుణమైనవి కావని స్పష్టమవుతుంది.*

*అధికారం*

🇮🇳 *సాధికారత గల సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, విజిలెన్స్‌శాఖలను రాజ్యాంగం ప్రకారం పౌర, నేర సంబంధమైన కేసులను విచారించి నిందితులకు శిక్షలు పడేలా చూడటానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాస్తా నేడు అధికార పార్టీ వాళ్ళు నేరాల నుంచి తప్పించుకుని, ప్రతిపక్షాల వాళ్ళను ఇరికించి వేధించే సాధనాలుగా మారిపోతున్నాయి. రాజ్యాంగం, దాని కింద పనిచేసే వ్యవస్థల ఉనికి తుడుచుకు పోతున్నప్పుడు అధికారపార్టీకి అపారమైన ధనబలం సమకూరటానికి మార్గం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యం యొక్క నాణ్యతను దెబ్బతీస్తుంది. దీనివలన ప్రజల తీర్పుకు భిన్నమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి డబ్బు ఎరచూపి శాసనసభ్యులను కొనుగోలు చేసే అవకాశాలు ఏర్పడుతాయి. ''బీజేపీ ఎన్నికలలో ఓడిపోతుంది కాని ప్రభుత్వాన్ని మాత్రం అదే ఏర్పాటు చేస్తుంది'' అనేది ఓ నానుడిగా ప్రచారంలో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.*

*హేతుబద్దతపై దాడి*

🇮🇳  *"నవీన్‌ భారత్‌'' అనేది విజయవంతం కావాలంటే భారత దేశ చరిత్రను తమ భావజాలానికి అతికేలా తిరిగి రాయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ భావజాలం మనగలుగుతుంది. దీనికి అనుగుణంగా దేశంలోని విద్యా విధానాన్ని మార్చాల్సి ఉన్నది. అందులో భాగంగానే హేతువుకు విరుద్ధమైన ఆలోచనలకు పెంపొందించడం, మూడ విశ్వాసాలను, అర్థంచేసుకోలేని అంశాలను, పురాణగాథలను ముందుకు తెచ్చి శాస్త్రీయ ఆలోచనలకు తావులేకుండా చేస్తున్నారు. భారతదేశ నిజ చరిత్రను మరుగుపరుస్తూ దాని స్థానం పురాణగాథలతో నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దారి మళ్లించే చరిత్ర రచనకు, అశాస్త్రీయ వాదనలను నిరూపించడానికి పురావస్తుశాఖ ఇప్పుడు హిందూత్వవాదులకు అనుకూలంగా ఆధారాలను తయారు చేయాల్సి ఉన్నది. అవి మన గతాన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడానికి విరుద్ధంగా ఉంటాయి. ''నవీన భారత్‌'' అనే భావన విజయవంతం అయి, నిలబడాలి అంటే కొన్ని కొత్త ప్రతీకలను సమాజంలో ఏర్పడేలా చేయాలి. హిట్లర్‌ బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన డూమ్‌లాగే మన దేశంలో సెంట్రల్‌ విస్టాను ఈ కరోనా కష్టకాలంలో బారీ ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు, బులెట్‌ ట్రెయిన్‌లాంటి అత్యవసరం కాని వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనితోపాటు ప్రజల ఆలోచనలను మళ్లించడానికి ఫేక్‌ వార్తలు, తప్పుడు భాష్యాలతో ఊదరకొడుతున్నారు. దీనితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి బాధలు పక్కకు పోతున్నాయి. సామాజిక అశాంతి వ్యాపించడానికి విద్వేష ఉపన్యాసాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలపై హింసాత్మక దాడులతో హిందూ ఓటు బ్యాంకును పటిష్ట పరచుకోవడానికీ ప్రయత్నం జరుగుతున్నది.*

*అయోధ్యలో భూమి పూజ తర్వాత మోడీ చేసిన ఉపన్యాసం పై అంశాలను ప్రతిబించేలా ఉన్నది. సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పునిచ్చిందే గానీ అందులో న్యాయం లేదు. బాబ్రీమసీదు కూల్చివేయడాన్ని నేరపూరితమైన చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ దోషులను తొందరగా శిక్షించాలని పేర్కొన్నది. వివాదాస్పద స్థలంలో గుడినిర్మాణ బాధ్యతను మసీదు కూలగొట్టినవారికే అప్పగించింది. రామమందిర నిర్మాణం వాస్తవంగా అయితే ట్రస్టు నిర్వహించాల్సింది. కానీ ప్రధానమంత్రి, ప్రభుత్వం గుడినిర్మాణ పనులను తమ చేతుల్లోకి తీసుకుని, దానిని ఒక ప్రభుత్వ కార్యంగా చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక లౌకిక ప్రజాస్వామిక ప్రధానిగా ప్రమాణం చేసిన ప్రధానమంత్రి తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు.ప్రతి పౌరునికి రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛను ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వానికి ఏ మతం ఉండకూడదు. రాజ్యాంగం ప్రకారం ఉల్లంఘిచలేని ఈ అంశాన్ని స్వయంగా ప్రధానమంత్రే ఉల్లంఘించారు. ఈ ఘోరమైన ఉల్లంఘన ద్వారా 'నవీన భారత్‌' అనేది ఆర్‌ఎస్‌ఎస్‌ యొక్క రాజకీయ ప్రాజెక్టు అనే సంకేతాన్ని ఇచ్చారు.*

*🇮🇳 రామమందిర నిర్మాణాన్ని స్వతంత్ర పోరాటంతో పోల్చి ప్రధాని తన ఉపన్యాసంలో మాట్లాడటమనేది దారుణమైన అంశం. స్వతంత్ర పోరాటానికి ఉన్న దృక్పథం ప్రకారం భారతదేశం ఒక ఐక్యతకు చిహ్నం. ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకునే ప్రజల మధ్య విభజన అనే సిద్ధాంతానికి ఇది విరుద్ధమైనది. స్వతంత్రం కోసం అందరూ ఐక్యంగా పోరాడటమనే నినాదం లక్షలాది మందిని ఉత్సాహపరిచి స్వతంత్ర పోరాటంలోకి దించగలిగింది. దాని ఫలితమే 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సాధించుకోగలగటం. ప్రజల మధ్య విభజనకు చిహ్నమైన ప్రస్తుత నవీన భారత్‌ అనే భాష్యం స్వతంత్ర పోరాటం ప్రతిబింబించిన స్ఫూర్తిని తుడిపేస్తున్నది.*

*🇮🇳 ఆర్‌ఎస్‌ఎస్‌ భారత స్వతంత్ర పోరాటంలో ఎప్పుడూ పాల్గనలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల రచనల్లో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వతంత్ర పోరాటంలో పాల్గనలేదనీ, ప్రతిఫలంగా ఆనాడు బ్రిటిష్‌వారి నుంచి రాయితీలు పొందారనీ పొందుపరచబడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత కర్త అయిన నానాజీ దేశ్‌ముఖ్‌ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వతంత్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదనే ప్రశ్నను లేవనెత్తారు.*

*ఇప్పుడు ఈ నవీన భారతమనే భావనలో భాగంగా భారత చరిత్రను తిరిగి రాస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. దానికి అనుబంధంగా ఉన్న వ్యవస్థలను, అధికారాన్ని, ప్రజలకిచ్చిన హామీలను, పౌర హక్కులను నిరాకరిస్తూ భారతదేశం యొక్క భవిష్యత్తును అస్థిరపరుస్తూ దళితులు, ఆదివాసీలు మహిళలు మైనారిటీ మతాలవారిపై విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు.*

*ఈ నవీన భారత్‌ అనేది దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తుందనడానికి గత ఆరేండ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన విధానమే ఒక నిదర్శనంగా ఉన్నది. విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థల యొక్క లాభాలను గరిష్టస్థాయికి పెంచేందుకు ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు. అందులో ప్రభుత్వ ఆస్తులను లూటీ చేసే, ప్రభుత్వరంగ సంస్థలను గంపగుత్తగా ప్రయివేటీకరించే, దేశంలో లభ్యమయ్యే ఖనిజసంపదను, అటవీసంపదను కార్పొరేట్‌ శక్తులకు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించే విధానాలున్నాయి. ఈ ప్రణాళిక అడ్డంకులు లేకుండా అమలు జరగడానికి రాజ్యాంగం కార్మికులకు ఇచ్చిన హక్కులను రద్దు చేస్తున్నారు. అన్నదాతలను దివాళా తీయించే విధంగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరి స్తున్నారు. అందుకోసం ఈ మధ్యకాలంలో తెచ్చిన ఆర్డినెన్సులు నిత్యావసర సరుకుల చట్టం రద్దు చేయడానికి ఉద్దేశించబడినవి. దీని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర దక్కకుండా పోతుంది. ధరల నియంత్రణ, ఆహార ధాన్యాల కొనుగోళ్లకు చెల్లుచీటీ పాడి, ప్రజా పంపినీ వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఆహార కొరత ఏర్పడటానికి దారులు వేస్తున్నారు. కార్పొరేట్‌ శక్తులు చేసే వ్యవసాయాధారిత వ్యాపారానికి లాభాలు పెంచేందుకే ఈ ధ్వంస రచన జరుగుతోంది.*

*నవీన భారతం అనే ఈ భావన రాజ్యాంగం యొక్క ఉనికినే సంక్షోభంలోకి నెట్టుతున్నది. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, హేతుబద్దతలకే కాదు, అశేష ప్రజానీకం యొక్క బతుకుదెరువు, స్వేచ్ఛ, ఆత్మగౌరనవం వారి ఆర్థికాభివృద్ధికి కూడా ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాలనే నేడు మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. 74వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంలో మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఇదే*

No comments:

Post a Comment