Posted On:
బిజెపి హిందూ ఆధిపత్యవాద పార్టీ అని అందరికీ తెలుసు. ఫాసిస్టు తరహా సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ కి ఇది రాజకీయ వేదిక. ఆర్‌ఎస్‌ఎస్ హిందూ రాజ్యాన్ని నెలకొల్పడం లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ. అయితే బిజెపి భారత రాజ్యాంగం పరిధికి లోబడి వ్యవహరించాల్సి వుంటుంది. అందుకే ఈ హిందూ రాజ్యం లక్ష్యం గురించి ఆ పార్టీ బాహాటంగా ప్రస్తావించలేదు. అయినా ఆ లక్ష్యాన్ని అమలులోకి తెచ్చే దిశగా అది ఆచరణలో వ్యవహరిస్తోంది. ఇంతకీ వాస్తవంలో హిందూ రాజ్యం అంటే ఏమిటి? అది లౌకికతత్వాన్ని దెబ్బ తీస్తుందని, ప్రత్యేకించి ముస్లింలను రెండో తరగతి పౌరులుగా దిగజారుస్తుందని అందరికీ స్పష్టం అవుతోంది. అయితే చాలామంది హిందూ రాజ్యం అంటే హిందువుల ప్రయోజనాల కోసం పని చేస్తుందని అనుకుంటున్నారు.
కాని ఇది మౌలికంగానే
పొరపాటు అవగాహన. హిందూ రాజ్యం అనేది ఒక నిరంకుశ రాజ్యం. అది ముస్లింలను, హిందువులను కూడా అణచివేస్తుంది. వారి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుంది.
దేశ రాజకీయ చట్రంలో ముఖ్యమైన ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తుంది. అంతర్జాతీయ
ద్రవ్య పెట్టుబడికి, దేశీయ కార్పొరేట్ల యొక్క అవధులు లేని
దోపిడీకి ముస్లింలనేగాక అత్యధికులు హిందువులను కూడా బలి చేస్తుంది. ఒక్క మాటలో
చెప్పాలంటే హిందూ రాజ్యం అంటే గుత్తపెట్టుబడి చలాయించే నియంతృత్వం. అంతేగాని
కొందరు అనుకుంటున్నట్టు హిందువుల ఆధిపత్యం ఎంతమాత్రమూ కాదు. హిందూ రాజ్యంలో
హిందువులు ఇంతకు ముందుకన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉంటారనుకోవడం భ్రమ. నిజానికి
గుత్తపెట్టుబడి విచ్చలవిడి దోపిడీ ఫలితంగా హిందువుల పరిస్థితి కూడా ముస్లింల
మాదిరిగానే దయనీయంగా దిగజారుతుంది.
ఈ దేశంలో
గుత్తపెట్టుబడి ఎప్పటి నుంచో తన ఆధిపత్యాన్ని చలాయిస్తూనే వుంది. అటువంటప్పుడు ఈ
దేశ రాజకీయాల పైన, సమాజం పైన మరింతగా తమ పట్టు పెంచుకోవాలని
వారు ప్రయత్నించడం దేనికోసం? హిందూ ఆధిపత్య సిద్ధాంతంతో ఉన్న
బిజెపిని ఎన్నికలలో బలపరచడం, దానికే ఎన్నికల్లో ప్రజలు
ఓట్లేసేలా ఆ పార్టీకి అన్ని రకాలా తోడ్పాటునివ్వడం ఎందుకోసం?
గతం కన్నా ప్రస్తుత
కాలంలో అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బ
తీస్తోంది. కార్పొరేట్ల వద్ద సంపద ఎంత ఎక్కువగా పోగుబడితే అంత ఎక్కువగా అది ప్రజల
వద్దకు ప్రవహిస్తుందని ఇన్నాళ్ళూ చెప్పిన 'ట్రికిల్ డౌన్
సిద్ధాంతం' వట్టిదేనని ప్రజలకు అర్ధమై చాలా రోజులైంది.
జిడిపి వృద్ధి చెందితే ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగా
పెరుగుతుందని, తద్వారా పేదల కోసం ఖర్చు చేయడానికి ఎక్కువ
వీలు కలుగుతుందని 11వ పంచవర్ష ప్రణాళిక డాక్యుమెంటులో
చెప్పిందంతా బూటకమేనని కూడా ప్రజలకు బోధపడింది. ఆదాయాల నడుమ వ్యత్యాసాలు, సంపదలో వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సంక్షోభం ఫలితంగా గత ఐదు
దశాబ్దాల కాలంలోనూ మనం ఎన్నడూ చూడనంత స్థాయికి నిరుద్యోగం ప్రబలింది. గ్రామీణ
పేదరికం ఎంతగా పెరిగిందంటే దానికి సంబంధించిన వాస్తవాలు వెల్లడి కాకుండా చూసేందుకు
కేంద్ర ప్రభుత్వం నేషనల్ శాంపిల్ సర్వే వివరాలను తొక్కిపట్టింది. 2011 నుంచి 2018 మధ్య కాలంలో గ్రామీణ ప్రజల కొనుగోలు
శక్తి 9 శాతం మేరకు పడిపోయింది. ప్రస్తుత కరోనా మహమ్మారి
రాకమునుపే ఈ దేశ ప్రజలను పీల్చి పిప్పి చేయడం అసాధారణ స్థాయికి చేరింది. కరోనాతో
ఇంకా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజలను పాత పద్ధతుల్లోనే
పాలించడం, వారిని అదుపు చేయడం పాలకులకు సాధ్యం కావడంలేదు.
ఇంకొక సమస్య కూడా
ఉంది. ఈ సంక్షోభాన్నుంచి బైటపడే మార్గం నయా ఉదారవాద చట్రం పరిధిలో ఎక్కడా కానరావడం
లేదు. కాని ద్రవ్య పెట్టుబడి ఈ వాస్తవాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. అందుచేత
అది మరింత ఉధృతంగా అవే నయా ఉదారవాద విధానాలను అమలు చేయాలని పట్టుబడుతోంది. కార్మిక
సంఘాలను ఉనికిలో లేకుండా చేయాలని, గిరిజన భూములను మరింత
సునాయాసంగా స్వాధీనం చేసుకోవాలని, మరింత ఎక్కువగా ప్రభుత్వ
రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని, మరింత ఎక్కువ మోతాదుల్లో
ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు ఆర్థిక వనరులను బదలాయించాలని ద్రవ్య పెట్టుబడి
వత్తిడి చేస్తోంది.
ద్రవ్య పెట్టుబడి
కోరిన విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టమో ఆర్థిక విధానాలు తెలిసిన
వారెవరైనా స్పష్టంగా గ్రహించగలరు. అందుకే బొత్తిగా ఆర్థిక పరిజ్ఞానం లేని
ప్రభుత్వం, తాను చెప్పినట్టల్లా తలాడించి అమలు చేసే
ప్రభుత్వం ద్రవ్య పెట్టుబడికి ఇప్పుడు అవసరం. అలా అమలు చేస్తూనే ఆ విధానాలకు
ప్రజానీకం మద్దత్తు తెలిపేలా చేయగల సామర్ధ్యం ఉన్న రాజకీయ పార్టీ ద్రవ్య
పెట్టుబడికి ఇప్పుడు కావాలి. ఈ లక్షణాలన్నీ అతికినట్టు బిజెపికి ఉన్నాయి. దానికి
ఆర్థిక పరిజ్ఞానం శూన్యం. ద్రవ్య పెట్టుబడి ఆడమన్నట్టల్లా ఆడుతుంది. ఆ ద్రవ్యపెట్టుబడినే
తెలివితక్కువగా '' సంపద సృష్టికర్తలు'' గా పరిగణిస్తుంది. అదే సమయంలో తన హిందూత్వ ఎజండాతో ఆ ద్రవ్య పెట్టుబడి
దురాగతాన్నంతటినీ ప్రజలకు కనపడకుండా దాచిపెడుతుంది. ఈ హిందూత్వ ఇంతవరకూ ఏ ఒక్కరి
కడుపునూ నింపలేకపోయింది. కాని అయోధ్యలో ఆలయానికి చేసిన భూమిపూజ వైపు యావద్దేశం
దృష్టినీ మళ్ళించింది. ఇంకోవైపున ద్రవ్య పెట్టుబడికి అపారంగా రాయితీల వర్షం
కురిపించింది.
గడిచిన కొద్ది
వారాలలో బిజెపి-పాలిత రాష్ట్రాలలో కార్మికుల పని గంటలు రోజుకు 12 కు పెంచివేశారు. తద్వారా శతాబ్దాల తరబడి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు
చేస్తున్న పోరాటాన్ని తోసిరాజన్నారు. కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టులకు పర్యావరణ
అనుమతులిచ్చే విధానాన్ని సడలించి వేశారు. నిబంధనలు నామమాత్రం చేశారు.
పెట్టుబడిదారులకు రు.1.45 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశారు.
బొగ్గుగనులు వంటి సహజ వనరులకు సైతం ప్రైవేటీకరణను వర్తింపజేశారు. తద్వారా
సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమం ముందుకు తెచ్చిన ఒక ముఖ్యమైన డిమాండును
నీరుగార్చారు. ఇప్పుడు రైల్వేల లోనూ ఈ విధానాన్నే అమలు చేయనున్నారు.
పెట్టుబడిదారుల పరిస్థితి ఇంత సౌకర్యవంతంగా మున్నెన్నడూ లేదు. అదే సమయంలో, గిరిజనులతో సహా శ్రామిక ప్రజల పరిస్థితులు ఇంత దుర్భరంగా గతంలో ఎన్నడూ
లేవు.
పెట్టుబడిదారీ
వర్గానికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలేవీ ఆర్థిక సంక్షోభ తీవ్రతను
తగ్గించలేవు సరికదా, మరింత పెంచుతాయి. ఉత్పత్తి అయిన
సరుకులను కొనేవారు లేకపోవడం ఈ సంక్షోభంలో ఒక ప్రధాన లక్షణం. ప్రభుత్వ చర్యలు ప్రజల
కొనుగోలు శక్తిని పెంచకపోగా మరింత తగ్గిస్తాయి. దాంతో పరిస్థితి మరింత
తీవ్రమౌతుంది. పెట్టుబడిదారులకు చేసిన ఆర్థిక బదలాయింపుల వలన ప్రభుత్వం వద్ద ఖర్చు
చేయగల నిధులు తరిగిపోతాయి. ద్రవ్యలోటు పెరగకుండా ఉండే పద్ధతిలో ఆ కొరవను
పూడ్చుకోవాలంటే శ్రామిక ప్రజల మీద మరింత పన్నుల భారం మోపక తప్పదు. అంటే ఈ విధానాల
ఫలితంగా శ్రామిక ప్రజలనుండి సంపద పెట్టుబడిదారీ వర్గానికి బదలాయించబడుతున్నది.
ఎక్కువమంది వినియోగదారులు పేదలు. వారివద్ద నుండి సంపదను లాక్కుని పెట్టుబడిదారులకు
బదలాయిస్తే మొత్తం మీద కొనుగోలుశక్తి తగ్గిపోతుంది. అలా తమ వద్దకు చేరిన సొమ్మును
ఆ పెట్టుబడిదారులేమైనా తిరిగి పెట్టుబడిగా మార్కెట్‌లో పెడతారా అంటే అదీ జరగదు.
కొనుగోలుశక్తి తగ్గిపోతోంది గనుక కొత్త పెట్టుబడులు పెట్టరు. మొత్తంగా సంక్షోభం
మరింత తీవ్రమౌతుంది. నయా ఉదారవాద చట్రంలో ఈ సంక్షోభానికి పరిష్కారం లేదు.
దీని పర్యవసానంగా
ప్రజల్లో అసంతృప్తి రానున్న రోజుల్లో అంతకంతకూ పెరుగుతుంది. దానిని అదుపు
చేయడానికి అంతకంతకూ ఎక్కువ అణచివేతకు పాలకులు పూనుకుంటారు. అదే సమయంలో ప్రజల
దృష్టిని పక్కకు మళ్ళించే రామ మందిరం వంటి అంశాలు ముందుకు తెస్తారు. హిందూత్వ
ఎజండాను మరింత దూకుడుగా ముందుకు తేవడం వెనుక అసలు కారణం ఇదే. ఇటువంటి ఎజండా అటు
ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల వైపు నుండి పక్కుకు మళ్ళించడంతోబాటు శ్రామిక ప్రజలను
విడదీస్తుంది. పరస్పర విద్వేషాలను రెచ్చగొడుతుంది. ఆర్థిక అంశాలపై అసంతృప్తి
ఉన్నప్పటికీ మతపరంగా మెజారిటీగా ఉన్న హిందువులలో ఎక్కువమంది బిజెపికే వోట్లేసి
దానిని అధికారంలో కొనసాగేలా చేస్తారు. అందుచేత హిందూ ఆధిపత్యవాదం ద్రవ్య
పెట్టుబడికి అనుకూలమైన సిద్ధాంతం. ఇది హిందువులకు అనుకూలంగా ఉండే సిద్ధాంతం కాదు.
ద్రవ్యపెట్టుబడికి, గుత్త పెట్టుబడికి సేవ చేసే సిద్ధాంతం.
హిందూ ఆధిపత్యవాదం
అమలు జరిగితే ముస్లింలు ఉద్యోగాలకు, ఇతర అవకాశాలకు దూరంగా
నెట్టివేయబడతారు గనుక ఆ మేరకు ఆ ఉద్యోగాలు, అవకాశాలు
హిందువులకు దక్కుతాయి కదా. అటువంటప్పుడు హిందూ ఆధిపత్యవాదం హిందువులకు అనుకూలం
కాదని ఎలా చెప్పగలం? అని కొందరు అడగవచ్చు. ఇప్పటికే ముస్లిం
మైనారిటీలు ఉద్యోగాలలో, అవకాశాలలో ఎక్కువ శాతం
చేజిక్కించుకుని గనుక ఉండినట్టయితే ఈ వాదన కొంతవరకు సహేతుకమౌతుంది. కాని ఇప్పటికే
తమ జనాభా శాతానికి తగ్గట్టుగా నైనా ఉద్యోగాలను, విద్యావకాశాలను,
సంక్షేమ పథకాలను పొందలేకపోతున్న మన దేశ మైనారిటీల విషయంలో ఈ వాదన
చెల్లదు.
హిందూ రాజ్యం వైపుగా
పడుతున్న ప్రతి అడుగూ శ్రామిక ప్రజానీకం మీద ఎక్కుపెట్టిన దాడిలో భాగమే. ఈ దాడికి
హిందువులు, ముస్లిములు అందరూ బలౌతారు. హిందూ రాజ్య భావన
హిందువుల ప్రయోజనాల కోసం అన్న తప్పుడు అభిప్రాయం నుంచి ఎంత తొందరగా బైట పడగలిగితే
దేశానికి అంత క్షేమం.
- ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ) (ప్రజాశక్తి 24.8.2020)
No comments:
Post a Comment