Thursday, August 20, 2020

కోవిడ్ 2019 సంక్షోభ కాలంలో చైనా-భారత్‌ విధానాలు

 

ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహించే పరిస్థితి

కోవిడ్‌ 19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేయలేక, ఆర్థికాభివృద్ధి పతనాన్ని అరికట్టలేక ఆర్థికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు సతమతమౌతుంటే చైనా ఈ మహమ్మారిని జయప్రదంగా కట్టడి చేయటంతో పాటు జిడిపి పెరుగుదలను కూడా సాధించింది. చైనా ఈ ఘన విజయాన్ని ఎలా సాధించిందో తెలుసుకుందాం.

అభివృద్ధికి చైనా ప్రణాళిక-దాని ఫలితాలు


అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించటంతో ఆ దేశాలలో ఉద్యోగాలు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటంతో తమ ఎగుమతులు తగ్గుతాయని చైనా అంచనా వేసింది. ఎగుమతుల తగ్గుదల వలన సంభవించే ఉత్పత్తి మాంద్యాన్ని అధిగమించటం కోసం తమ ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి చర్యలు తీసుకుంది. ప్రజల ఉద్యోగాలు, కొనుగోలు శక్తిని కాపాడటం కోసం చైనా తమ దేశ చరిత్ర లోనే అతి పెద్ద ఆర్థిక ప్యాకేజిని ప్రకటించింది. ఈ ప్యాకేజీ విలువ మొత్తం 6 లక్షల కోట్ల యువాన్లు  (రూ.66 లక్షల కోట్లు). మహమ్మారి కారణంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు పొందిన నష్టాన్ని భర్తీ చేసి, ఉద్యోగాలను నిలబెట్టటం కోసం అనేక రాయితీలు, సబ్సిడీలను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ బాండ్లను విడుదల చేయటం ద్వారా ప్రాంతీయ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఖర్చు చేస్తున్న రెండు లక్షల కోట్ల యువాన్లకు ఇది అదనం.

2020 మొదటి త్రైమాసికంలో 6.8 శాతం కుచించుకుపోయిన చైనా జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి)  ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ రెండవ త్రైమాసికంలో  3.2 శాతానికి పెరిగింది. గత సంవత్సరం 6.1 శాతం జిడిపి వృద్ధిని సాధించిన చైనా జిడిపి ఈ సంవత్సరం 5 శాతం పెరగవచ్చునని ఇపుడు అన్ని సంస్థలూ అంచనాలు వేస్తున్నాయి. 90 కోట్ల మంది శ్రామికులు ఉన్న చైనాలో శ్రామికులందరికీ పని కల్పించకపోతే వారు ఆకలితో ఉంటారని, పని కల్పిస్తే సంపదను ఉత్పత్తి చేస్తారనే అవగాహనతో చైనా నాయకత్వం పనిచేస్తున్నది. అభివృద్ధిని పట్టాలెక్కించటంతో ప్రజలకు జీవనోపాధిని మెరుగుపరచటం, కొత్తగా ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు. ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాల కాలంలో 56.4 లక్షల మందికి నూతనంగా ఉపాధిని కల్పించారు. పేద ప్రజలు ఎక్కువగా ఉన్న సిచువాన్‌, గ్విజౌ, గ్వాంగ్జిలలో గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం 5.5 నుండి 7.6 శాతం వరకు పెరిగింది. సామాజిక సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయటం వలన వృద్ధాప్య, రిటైర్‌మెంటు పెన్షన్లు 9.3 శాతం, సంక్షేమ గ్రాంట్లు, సబ్సిడీలు 13.2 శాతం పెరిగాయి.

మోడీ పభుత్వ బాధ్యతారాహిత్యం- కరోనా రోగుల సంఖ్య లో 3వ స్థానం కు ఎదుగుదల

చైనా వ్యవహరిస్తున్న తీరుకు పూర్తి విరుద్ధంగా భారత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. కోవిడ్‌ను అరికట్టటం పేరుతో హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం వైరస్‌ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయటం, రోగులను గుర్తించటం, వైద్యం అందించటం, అనుమానితులను ఐసొలేషన్‌లో ఉంచటం తదితర చర్యలు తీసుకోవటానికి మారుగా లైట్లు ఆపివేయటం, చప్పట్లు చరచటం, వైద్య సిబ్బందిపై పూలు చల్లటం, నౌకలపై లైట్లు వెలిగించటం తదితర హాస్యాస్పదమైన చర్యలు తీసుకుంది.  ఫలితంగా 500లకు పైగా కేసులతో మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌ ప్రకటించిన మన దేశంలో ఆగస్టు 17 తేదీ నాటికి కేసులు 27 లక్షలు, మరణాలు 50 వేలు దాటిపోయాయి. ఫలితంగా ఈ రోజు వైరస్‌ సోకినవారి సంఖ్యలో ప్రపంచంలో మూడవ స్థానం, మరణించిన వారిలో నాలుగవ స్థానానికి చేరుకున్నది.

ఆర్థిక రంగం లో ప్రజా వ్యతిరేక విధానాలు:

ఆర్థిక రంగంలో కూడా ఇదే విధమైన విధానాలను అనుసరిస్తున్నది. ఉద్యోగాలను కాపాడటం, ప్రజలకు ఉపాధి కల్పించే అంశాలను పక్కనపెట్టి, బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే విధానాలను అనుసరిస్తున్నది. కోవిడ్‌-19 మహమ్మారి, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవటం కోసం అంటూ ప్రకటించిన రూ.20.79 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవవానికి రూ.1.5 లక్షల కోట్లకు మించదు. ఆదాయం పన్ను చెల్లించని 80 శాతం ప్రజలకు నెలకు తలకు 10 కిలోల ఆహార ధాన్యాలు, కుటుంబానికి 7,500 రూపాయల చొప్పున ఆరు మాసాల పాటు అందించాలన్న నిపుణుల సూచనలను పట్టించుకోవటం లేదు.

లాక్‌డౌన్‌ వలన ప్రజలు పెద్దసంఖ్యలో కదిలి ఆందోళనలు చేయటం సాధ్యం కాని పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దిగజారుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన లక్ష కోట్ల రూపాయలకు పైగా రుణాలను రద్దు చేసింది. ఈ విధానాల ఫలితంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జిడిపి  రెండంకెలు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 3-4 శాతం తగ్గవచ్చని మొదట అంచనా వేయగా ఇపుడు 7 శాతం తగ్గుతుందని అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇదే విధానాలను కొనసాగిస్తే జిడిపి 10 శాతానికి మించి తగ్గినా ఆశ్చర్యం లేదు.
విధానాల లో వ్యత్యాసం

సంక్షోభ కాలంలో చైనా ప్రభుత్వ విధానాలు ప్రజలకి అనుకూలముగా వుండగా  భారత ప్రభుత్వ విధానాలు ప్రజలకి వ్యతిరేకముగా, కార్పొరేట్ల, బహుళ  జాతి సంస్థల లాభాలు పెంచే విధముగా వున్నాయి. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలతో ఆర్థిక మాంద్యం తీవ్రం కావటంతో పాటు దేశం ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయి, నివారించదగిన వైరస్‌కు లక్షలాది మంది అమాయక ప్రజలు బలైపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. (ప్రజాశక్తి 20.8.2020 సంచికలోప్రచురించబడిన శ్రీ ఏ.కోటిరెడ్డి గారి వ్యాసానికి కొన్ని చిన్నమార్పులను జోడించి సంక్షిప్తముగా చేయబడిన వ్యాసం ఇది) 

Friday, August 14, 2020

భారత దేశం అనే భావన ఎలా రూపొందింది?

 


భారత దేశం అనే భావన ఎప్పుడు ఏ విధముగా ఆవిర్భవించింది, ఏ విధముగా బల పడింది, భారత జాతీయత ఏ విధముగా రూపొందింది, ఇప్పుడు ఈ భావన కి వచ్చిన ప్రమాదం ఏమిటి, ఈ విషయాల పై మాట్లాడుకుందాం.  

ఋగ్వేదం లో భారత దేశం అనే మాట ఎక్కడా లేదు. యజుర్వేదం, సామ వేదం, అధర్వణ వేదాలలో కూడా ఈ భావన లేదు. బ్రాహ్మణికాలు, ఉపనిషత్తులలో కూడా లేదు. ఋగ్వేదం లో కొన్ని నదులు, కొన్ని తెగల పేర్లు వున్నాయి. సప్త సైంధవ అనే మాట సింధు నది, దాని ఉపనదుల ను తెలిజేసెసేది మాత్రమే.

కొన్ని ప్రాంతాలను కలిపి మొట్ట మొదటి సారిగా ప్రాకృత భాషలో “సోలా మహా జన పద” (16 మహా జనపదాలు) అన్నారు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాటికి ఈ మాట కొన్ని గ్రంధాలలో కనిపిస్తుంది.  “సోలాహ్”అనేది ప్రాకృత భాష పదం. హింది, ఉర్దూ భాషల మూలాలు ఈ ప్రాకృతిక భాష లోనే వున్నాయి. కాంభోజ ( ఆఫ్గానిస్తాన్ ప్రాంతం) నుండి అంగ (తూర్పు బీహారు) వరకు ఈ పదహారు మహాజనపదాలు వున్నాయి. కానీ ఇవి  నేటి భారత దేశం లో వున్న ఉత్తర భారత ప్రాంతాలకే పరిమితం. ఆర్యావర్తం అంటే హిమాలయాల నుండి వింధ్య పర్వతాల వరకు అని మను స్మృతి అన్నది.

అశోకుని శాసనాలు కాందహార్ నుండి కర్ణాటక, ఆంధ్ర  వరకు లభించాయి. ఈ శాసనాలు ప్రాకృతిక భాష లో మరియు గ్రీకు, ఆరమైక్ భాషలలొ వున్నాయి. ఇటు వంటి రాజకీయ ఐక్యత వలన భారత దేశం అనే భావన ప్రారంభమయింది. కానీ దాని పేరు “ జంబూ ద్వీప” అని అశోకుని శిలాశాసనం లో వున్నది. జంబూ అంటే నేరేడు.  నేరేడు  బాగా వున్న ప్రాంతం అని దీని అర్థం. ఒరిస్సా లో “హాతి గుంఫ” వద్ద కళింగ పాలకుడైన ఖారవేలుడు క్రీస్తు పూర్వం 1 వ శతాబ్దం లో వేయించిన శిలా శాసనం లో “భారత” అనే మాట ప్రాకృతిక భాష లో వున్నది. ఈ విధముగా క్రమముగా “భారత దేశం” అనే భావన ఉదయించింది. ఇంతే గాక సాంస్కృతికముగా ఒక ఐక్యత కూడా మొదలయింది. బౌద్ధ, జైన, బ్రాహ్మణ మతాలు దేశం అన్ని భాగాల లో వ్యాపించాయి. అన్ని ప్రాంతాలలో కనీసం గ్రాంధిక భాష గానైనా ప్రాకృత భాషని వాడారు. కాబట్టి ఈ అంశాలు ప్రజలను ఐక్యం చేశాయి. గ్రాంధిక భాష గా ప్రాకృతము, పూజారి భాషగా సంస్కృతము వ్యాప్తిలోకి వచ్చాయి.  ఈ లక్షణాలను బట్టి విదేశీయులు కూడా భారతీయులను గుర్తించగలిగే పరిస్థితి వచ్చింది.

ఇరానీయులు మనల్ని మొదటి సారిగా “హిందూ” అనే పదం తో గుర్తించారు. కానీ వారు సింధు నే హిందూ అన్నారు. హిందూ అంటే సింధు నది కి తమ భాషలో వారు పెట్టిన పేరు.  కాబట్టి సింధు నదికి   తూర్పున వున్న ప్రాంతాన్ని వారు హిందూ అని అన్నారు. దీని నుండే ఇండియా అనే పేరు వచ్చింది. గ్రీకులు హిందూ ని ఇండు అన్నారు. హిందూ లో వున్న మొదటి అక్షరం  హెచ్ ని వారు పలకలేక ఇండు అన్నారు. దీని నుండి ఇండియా అనే మాట వచ్చింది. చైనా వాళ్ళు హిందూ ని ఇంటు అన్నారు. ఆ తరువాత పర్షియన్ భాష లో “హిందుస్తాన్” అనే మాట వచ్చింది. సంస్కృతం లో ఎక్కడా హిందుస్తాన్ అనే మాట లేదు. క్రీస్తు తరువాత 4వ శతాబ్దం లో శాసనీడ్ (పర్షియన్ సామ్రాజ్యం పాలకుల ఆఖరు వంశం) శాసనం లో దీనిని వాడారు.

ఈ విధముగా హిందూ అనే పదాన్ని బయటి వారు సృష్టించారు. హిందుత్వ వాదులుగా తమని చెప్పుకుంటూ విదేశీ అయిన ప్రతి దానిని విసర్జించాలనే వాళ్ళు తమ సొంత పేరుగా వున్న హిందూ అనేది ఇరాన్ లో పుట్టిన పదం అని సంస్కృతం లో ఈ మాట 14 వ శతాబ్దం వరకు లేదని మరచి పోతున్నారు. సంస్కృత శాసనాలలో హిందూ అనే మాటని మొట్ట మొదటి సారిగా వాడింది విజయనగర సామ్రాజ్యపు రాజులు. వారు తమని “హిందూ రాయ సురత్రాన” అని వర్ణించుకున్నారు. హిందూ సుల్తానులని దీని అర్థం. ఇది మన మిశ్రిత సంస్కృతికి ఒక తార్కాణం.  (అమిత్ షా అనే పేరులో వున్న షా అనేది పర్షియన్ నుండి వచ్చినదే... అనువాదకుడు)

భారత దేశం అనే భావన క్రీస్తు పూర్వమే వున్నప్పటికి దేశ ప్రేమ అనే భావం గాని, దేశ భక్తి గేయం గాని సంస్కృతం లో ప్రాచీన భారత దేశం లో లేదు. భారత దేశాన్ని పొగుడుతూ ప్రేమిస్తూ రాసిన వాడు అమీర్ ఖుస్రో. 1318 లో ఇది రాయబడింది. భారత దేశాన్ని అమీర్ ఖుస్రో ఏమని ప్రశంసించాడు? దాని వాతావరణాన్ని ప్రశంసించాడు. కానీ భారత దేశపు వాతావరణం నిజానికి ప్రశంసనీయమైనది కాదు. దీనితో పాటు దాని ప్రకృతి సౌందర్యాన్ని, జంతువులను, మహిళలను వారి అందాన్ని, పాతివ్రత్యాన్ని ప్రశంసించాడు. బ్రాహ్మణుల పాండిత్యాన్ని ప్రశంసించాడు. వారి భాష అయిన సంస్కృతాన్ని ప్రశంసించాడు. భారత దేశం అంటే బ్రాహ్మణులే గాక ముస్లిం లు కూడా అని అన్నాడు. భారత దేశం అంతటా పర్షియన్ మరియు అరబిక్ భాషలు మాట్లాడే వాళ్ళున్నారని అన్నాడు. కాశ్మీరీ భాష నుండి  నుండి మాబారి(తమిళం) వరకు వున్న అనేక భాషలను ప్రశంసించాడు. వీటిని హైందవి భాషలని అన్నాడు. సంస్కృతము విజ్ఞాన శాస్త్రాల భాష అన్నాడు. భారత దేశం పంచ తంత్ర కథలకి, చదరంగానికి, దశాంస అంకె ల పద్ధతికి మూలమయిన దేశం అని ప్రశంసించాడు.

ఆ తరువాత క్రీ.శ. 1350 లో ఈసామి అనే కవి భారత దేశాన్ని పొగుడుతూ రాసిన కవిత్వం లో హిందుస్తాన్ అనే పూల తోటని చూసి స్వర్గం కూడా ఈర్ష్య పడుతుందని అన్నాడు. మొగల్ చక్రవర్తుల పాలన లో ప్రత్యేకించి అక్బరు చక్రవర్తి మరియు అబు ఫజల్ లు భారత దేశం విశిష్ఠమయిన దేశం అన్నారు. అనేక మతాల వారున్నందున మత సామరస్యత ఉండాలన్నారు. నిరపేక్ష శాంతి అవసరం అన్నారు. ఔరంగజేబు కూడా రాజ కుమారుడుగా వున్నప్పుడు 1658 లో వర్షం మరియు సూర్యుని  వెలుగు అందరి పై పడుతున్నట్లే దేవుడు కూడా వివక్షత  లేకుండానే వుంటాడని అన్నాడు. తురాన్ (నేటి ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలు)  లో సున్నిల పట్ల, ఇరాన్ లో  షియాల పట్ల సహనం వుంటుందని , కానీ భారత దేశం లో ప్రతి మతానికి  సహనం అవసరమని జహంగీర్ అన్నాడు.  ఢిల్లీ సుల్తాన్ లు, ఆ తరువాత మొగల్ చక్రవర్తులు భారత దేశపు అన్ని భాగాలను ఒకే ఛత్రం కిందికి తీసుకు వచ్చారు.

1857 లో  జరిగిన  సిపాయిల తిరుగుబాటు లో రాజకీయ పరమైన భారత దేశపు భావన బలముగా వ్యాపించింది. లక్షా ముప్ఫై వేల సిపాయిలలో లక్ష మంది ఈ తిరుగుబాటు లో పాల్గొన్నారు. వారిలో అత్యధికులు బ్రాహ్మణులు. కానీ వారేమన్నారు? ఢిల్లీకి వెళ్ళి బహదూర్ షా జాఫర్ ను భారత దేశపు చక్రవర్తిగా ప్రకటించుదామని అన్నారు. హిందుస్తాన్ త్తరఫున వారు మాట్లాడారు. హిందువులు, ముస్లిం ల మధ్య  తేడా లేదని, ఒకరికి దెబ్బ తగిలితే ఇంకొకరికి తగిలినట్లే నని, కాబట్టి హిందువులు, ముస్లిములు ఐక్యముగా వుండాలని తిరుగుబాటు దారులు అన్నారు. తిరుగుబాటు దార్లందరు తాము భారత దేశం కోసం పోరాడుతున్నామని అన్నారు. బహదూర్ షా జాఫర్ ని బ్రిటీషు పాలకులు జైలు లో పెట్టిన అనంతరమ్ “ ఓ జాఫర్, భారత దేశం ఉన్నంత కాలం ఈ రాలిన పుష్పపు కీర్తి ప్రకాశిస్తూ  వుంటుంది”  అని అన్నాడు.

ఈ విధముగా ఒక స్వతంత్ర రాజ్యముగా భారత దేశం ఉండాలనే భావన 1857 నాటికే వున్నది.  కానీ ఇది సరిపోతుందా? చాలదు. ఈ తిరుగు బాటు బెంగాల్ సైన్యానికే పరిమితం. హిందూస్తానీ భాష మాట్లాడే ప్రాంతాలకే పరిమితం. దేశానికి ఒక జాతీయతా భావం కలిపించటానికి ఇంకా అదనముగా మరి కొన్ని అవసరం. స్వతంత్ర భారత దేశం బ్రిటిష్ పాలన కన్నా మెరుగైనదిగా వుంటుందనే భావం ఉండాలి.

బ్రిటిష్ పాలనని సమర్థించిన రాజా రామ్ మోహన్ రాయ్, సయ్యద్ అహ్మద్ ఖాన్ లు బ్రిటిష్ పాలన భారత దేశానికి మంచిదని భావించారు. సంఘ సంస్కరణలు, ఆధునిక విద్య ల ను బ్రిటిష్ పాలన ప్రోత్సహిస్తుందని భావించారు. కులాల పేరుతో విభజించబడినంత కాలం భారత  ప్రజలకు దేశ భక్తి వుండదని  రాజా రామ్ మోహన్ రాయ్ అన్నారు. ఈ పరిస్థితిని  మార్చటానికి సంఘ సంస్కరణలు అవసరమని భావించారు.  అంటరాని తనం అనేది ఉండ కూడదని, కులాంతర వివాహాలు జరగాలని, పురుషులతో సమం గా మహిళా లకు ఆస్తి హక్కు, ఇతర అన్నీ హక్కులు ఉండాలని, ఆధునిక విద్య మహిళకు  అవసరమని  కేశవ్  చంద్ర సేన్ అన్నారు.

దాదా భాయి నౌరోజీ, రమేశ్ చంద్ర దత్తు, జస్టిస్ రానడె ల పాత్ర చాలా ముఖ్యమయినది. భారత దేశాన్ని బ్రిటిష్ పాలకులు ఎలా దోపిడి చేస్తున్నారో, స్వేచ్చా వాణిజ్యం పేరుతో మన పరిశ్రమలని ఎలా దెబ్బ తీశారో వివరించారు.  వారు అన్ని  మతాల వారి తరఫున మాట్లాడారు. కానీ  వారు ఇంగ్లీష్ మాట్లాడే వారి కోసమే రాశారు. పేదరికం లో వున్న వాళ్ళు, నిరుద్యోగులు, నేత పని వారు తదితర ప్రజల కోసమే రాశారు. కానీ వారి సందేశం కొందరికే పరిమితమయింది.

గదర్ యోధులు, మహారాష్ట్ర, బెంగాల్ విప్లవకారులు అసమాన త్యాగాలు చేసినా అది ప్రజల ఉద్యమం కాలేదు.

స్వాతంత్ర్యోద్యమం లోకి ప్రజలను తీసుకు వచ్చింది గాంధీ గారే. 1915 లో భారత దేశానికి వచ్చారు. 1917 లో చంపారన్ లో రైతు సత్యాగ్రహం నిర్వహించారు. రైతులను రాజకీయాలలోకి తెచ్చారు. జాతీయోద్యమం లోకి రైతులు రాకుండా ఉద్యమం బలపడదని గ్రహించారు. కలెక్టరే అల్లా అని ముస్లిం పేద రైతులు అనుకునే వాళ్ళు. కానీ గాంధీ గారు బుద్ధు మియా ని కూడా చరిత్ర గమనం లో కి తీసుకొచ్చారు. “బుద్ధు మియా భీ హజరత్ గాంధీ కే సాత్ హై, ఏక్-ముష్ట్ -ఏ-ఖాక్ హై మగర్ ఆంధి కె సాత్ హై” ( బుద్ధు మియా కూడా హజ్రత్ గాంధీ అనుచరుడయ్యాడు, అతను మట్టి మనిషియే అయినప్పటికి  తుఫాను లో భాగమయ్యాడు ) “ అని అక్బర్ ఆల్హాబాది అన్నారు. ఈ విధముగా గాంధీ గారి వలన అంతకి ముందు ఎన్నడూ లేని విధముగా మొదటి సారిగా రైతులు కూడా చరిత్రకెక్కారు.

కానీ స్వతంత్రం వస్తే  ప్రజలకేమి దక్కుతుంది? ఇది చెప్పాల్సిన అవసరం వున్నది. భారత దేశపు గతం అంటే హిందువులు, ముస్లిం లు ఇరువురు అని గాంధీ గారన్నారు. రాజులు, సుల్తానుల పాలనే  బాగున్నదని గాంధీ గారి అభిప్రాయం. ప్రయివేటు వ్యక్తుల  చర్యల వలననే ప్రజలు బాగు పడాలి. ఫ్యాక్టరీ యజమానులు తమ కార్మికుల పట్ల ధర్మ కర్తలుగా వ్యవహరించాలి. జమీందార్లు రైతుల బాగోగులు చూసుకోవాలి. దేశం బాగుపడేందుకు ఇదే మార్గం అని గాంధీ గారన్నారు. కానీ ఈ ధర్మ కర్తృత్వ సిద్ధాంతం వాస్తవ జీవితం లో పని చేయదు. కాబట్టి జాతీయోద్యమం లోకి ప్రజారాశులను సమీకరించేందుకు  ఇది చాలదు. ఇందుకు  వామ పక్ష భావజాలం అవసరం. ఈ దిశలో కొంత మేరకు నెహ్రూగారు పని చేశారు. నెహ్రూ గారు రైతులకి భూమి కావాలని, కార్మికులకి రక్షణ  కావాలని,  మహిళలకి సమానత కావాలని అన్నారు. ప్రజాస్వామ్యం, అందరికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ఈ భావజాలాన్ని వామ పక్ష సహకారం తో నెహ్రూ ముందుకు తీసుకెళ్లారు.

కరాచీ కాంగ్రెస్ తీర్మానం ( 1931) లో మతాల పట్ల రాజ్యం తటస్థముగా వుండాలని, మహిళలకు సమాన హక్కులు కావాలని,  రైతులకి భూమి కావాలని, వారిని కవులు నుండి విముక్తం చేయాలని,  ప్రాథమిక పరిశ్రమలు రాజ్యం నిర్వహణలో వుండాలని తీర్మానించింది. కరాచీ తీర్మానం లేకుంటే ఈ స్థాయిలో స్వాతంత్ర్యోద్యమం  జరిగేది కాదు.

కాని  హిందూ మత తత్వ వాదులకు, ముస్లిం మత తత్వ వాదులకు స్వాతంత్ర్యోద్యమ నాయకులు లేరు. ఆర్ ఎస్ ఎస్ 1925 లో ఏర్పడింది. అప్పటినుండి 1947 లో స్వాతంత్ర్యం వచ్చే వరకు  స్వతంత్ర పోరాటం లో అది లేదు. బ్రిటిష్ పాలకులకు  క్షమాపణ పత్రం రాసి ఇచ్చి అండమాన్ జైలు నుండి  విడుదల అయిన సావర్కర్ ఆ తరువాత ముస్లిం ల పట్ల ద్వేషాన్ని పెంచే పనులే చేశాడు. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రవచించాడు. ఆ తరువాతనే జిన్నా కూడా ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రకటించాడు. భగత్ సింగ్ వారసులం తామని ఆర్ ఎస్ ఎస్ వారు అంటున్నారు. మరి భగత్ సింగ్ నినాదమైన ఇంక్విలాబ్ జిందాబాద్ అని వారెందుకనరు?  జాతీయోద్యమాన్ని  వ్యతిరేకించే వారిలో మరింత హాని జరిగేది హిందూ మత తత్వ వాదులనుండే  అని భగత్ సింగ్ అన్నాడు.  కాంగ్రెస్ నాయకులలో తాను సమర్థించేది నెహ్రూనే అని అన్నాడు. మహాత్మా గాంధీ కి నేను ముఖ్య అనుచరుడనని చెప్పిన పటేల్ మీ కెలా నాయకడవుతాడు? మత ప్రాతిపదికన భారత దేశం ఏర్పడాలని బోస్ అన్నారా? ఇక్బాల్ గేయం “సారా జహాన్ సే అచ్ఛా” గీతాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ జాతీయ గేయముగా ప్రకటించాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ కు అధికారిక భాషలుగా హింది, ఉర్దు లను ఎంపిక చేశాడు. ఆర్ ఎస్ ఎస్ వాళ్ళు జై హింద్ అనరు, ఇంకిలాబ్ జిందాబాద్  అనరు.

ఆర్ ఎస్ ఎస్ కె గాక ముస్లిం లీగ్ కి కూడా ఇదే సమస్య ఎదురయింది. స్వాతంత్ర్యం రాక ముందు కరాచి నుండి ప్రచురింప బడుతున్న ముస్లిం లీగ్ పత్రిక "డాన్" పత్రిక లో వాచ్చిన ఒక వ్యాసం లో ఆ వ్యాస రచయిత,  పాకిస్తాన్ కోసం బ్రిటిష్ పాలన కి వ్యతిరేకముగా పోరాడిన ప్రముఖ నాయకులు లేదా ప్రాణాన్ని అర్పించిన అమరులు ఒక్కరి పేరు కూడా చెప్పలేని పరిస్థితి లో మనమున్నామని  అన్నారు. కారణం ఏమిటంటే మనము హిందువులను వ్యతిరేకించామే గాని బ్రిటిష్ పాలకులను వ్యతిరేకిచలేదని ఆ రచయిత అన్నారు. ఇప్పుడు మనల్ని పాలిస్తున్న బి జె పి ని నడిపించే ఆర్ ఎస్ ఎస్ హిందూ మహా సభల పరిస్థితి  కూడా ఇదే.

ఆర్ ఎస్ ఎస్ కథానాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లు బ్రిటిష్ పాలనకి వ్యతిరేకముగా  చేసిందేమి లేదు. వారి సిద్ధాంతము, నమ్మకాలు అన్నీ జాతీయోద్యమానికి పూర్తి వ్యతిరేకముగా వున్నాయి. ముఖర్జీ బెంగాల్ మంత్రి వర్గం లో క్విట్ ఇండియా ఉద్యమ కాలం లో వున్నాడు. ముస్లిం లీగ్ తో కలిసి వున్నాడు.  హిందుత్వ వాదులు ఆ నాడు హిందూ-ముస్లిం ల మధ్య తగాదాలను సృష్టించారు.

ఆగస్టు 1947 లో ఆలీగడ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లలో మత కలహాలు తీవ్రమైనాయి. ముస్లిం ల పై తీవ్రమైన హింసాకాండ కొనసాగుతున్నది. సైన్యాన్ని పంపించినా ప్రయోజనం లేక పోయింది. గాంధీ గారొక్కరే ఈ హింసా కాండకి వ్యతిరేకముగా గట్టిగా నిలబడ్డారు. ఆయన ముస్లిం క్యాంపులకెళితే  వారు అవమానాల పాలు చేశారు. హిందూ క్యాంపులకెళితే వారూ అవమానించారు. ఈ అవమానాలను రోజులతరబడి భరించారు. 13 జనవరి 1948 నుండి  నిరాహార దీక్షని ప్రారంభించారు. ముస్లిం ల పై దాడి చేయొద్దని, ముస్లిం లు శరణార్థి శిబిరాల నుండి తమ ఇళ్ళకి వెళ్ళ సహకరించాలని, ఆ విధముగా ఖాళీ  అయిన శరణార్థి శిబిరాలలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందువులకు నివాసం కల్పించవచ్చునని, పాకిస్తాన్ కు చెల్లించాల్సిన రు.50 కొట్లను భారత ప్రభుత్వం చెల్లించాలని కోరారు. తమ దేశ  ప్రభుత్వానికి వ్యతిరేకముగా, పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకూలముగా ఎవరైనా ఈ విధముగా గట్టిగా నిలబడటం సాధ్యమయ్యేడా? కానీ గాంధీ గారు అలా నిలబడగలిగారు. నేను భారతీయుడనే గాక  పాకిస్తానీ ని కూడా నని, తాను ఈ రెండు దేశాలకు చెందిన వాడినని అన్నారు. గాంధిగారి నిరాహార దీక్ష ప్రారంభమయినప్పటి నుండి ఢిల్లీలో మత తత్వ వాదులు గాంధీ ముర్దాబాద్ అని నినాదాలిచ్చారు.

నిరాహార దీక్ష 3వ రోజున నెహ్రూ గారు ఎర్ర కోట వద్ద  10000 మంది తో జరిగిన  సభ లో ప్రసంగించారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు గాని, పటేల్ గారు కానీ ఈ పని చేయ లేదు. నెహ్రూ గారే చేయగలిగారు. ఈ ప్రసంగం అనంతరం సభికులు నెహ్రూ కి మద్దతునిచ్చారు. 5వ రోజున మీరట్, ముజఫర్ నగర్, అలీగర్ జిలాల నుండి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి వచ్చి స్వీపర్ యూనియన్, టాంగా వాలా ల యూనియన్, ఫ్యాక్టరీ వర్కర్ల యూనియన్ లతో కలిసి అందరూ లక్ష మంది పైగా మత కలహాలు ఆపాలని  కోరుతూ ప్రదర్శనలు చేశారు. మత కలహాలకు బాధ్యులైన వారి ఇళ్లకు వెళ్ళి మతకలహాల లో పాల్గొనం అని ఒక ప్రతిజ్ఞా పత్రం పై వారితో సంతకాలు చేయించారు. వారిని గాంధిగారి వద్దకు తీసుకొచ్చారు. దీనితో గాంధిగారు నిరాహార దీక్ష విరమించారు. భారత దేశం లో మరియు పాకిస్తాన్ లో హింసా కాండ ముగిసింది. భారత ప్రభుత్వము పాకిస్తాన్ ప్రభుత్వానికి రు.50 కోట్లు చెల్లించింది.

కాబట్టి భారత జాతీయత అనేది ఆకాశం నుండి రాలేదు. స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాల వలన త్యాగశీలురైన నాయకుయల వలన జాతీయతా భావం ఆవిర్భవించి బల పడింది. 1955-56 లో భారత పార్లమెంటు హిందూ కోడ్ ను ఆమోదించింది. హిందూ మహిళలకు వారసత్వం ప్రకారం ఆస్తిలో వాటా ఇవ్వాలని ఈ చట్టం సారాంశం. మహిళలకు చట్ట ప్రకారం సమాన హక్కులు వచ్చాయి. పాత కాలపు ధర్మ శాస్త్రాలను రద్దు చేసి ఈ చట్టం తెచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ చట్టం తెస్తామని ఎన్నికల ప్రచారం చేసి గెలిచిన తరువాత ఈ పని చేశారు. కాగా తమని మించిన జాతీయ వాదులు లేరని  చెప్పుకునే వారు ఆ నాడు తమ జనసంఘ్, రామ రాజ్య పరిషత్ లు ధర్మ శాస్త్రాలను కాపాడాలని, హిందూ కోడ్ వద్దని ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలి. స్త్రీ లకి పురుషులతో  సమాన హక్కులివ్వటానికి  తమ నాయకులు  ఎందుకు వ్యతిరేకించారో చెప్పాలి. ఆ ఎన్నికలలో ప్రజలు జనసంఘ్ (నేటి బిజెపి), రామరాజ్య పరిషత్, హిందూ మహాసభ లను చిత్తు చిత్తుగా ఓడించారు.

ఈ విధముగా భారత దేశం ప్రజాస్వామిక దేశం అయింది. స్త్రీ పురుషులకు సమాన హక్కులిచ్చింది. భూసంస్కరణలు జరిగాయి. లక్షలాది రైతులకు భూమి లభించింది.  జమిందారి విధానం రద్దయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ విధముగా స్వాతంత్ర్యోద్యమం అనంతరం నూతన భారత దేశం ఆవిర్భవించింది. 1950, 60 లలో ఇందుకు పునాది ఏర్పడింది.

కానీ అసలు విషయం పేదల పరిస్థితి ఏమిటనేది. పెద్ద మార్పు రాలేదు. తలకి ఎన్ని కేలరీల ఆహారం లభిస్తున్నది అని చూస్తే 1989 వరకు అది పెరుగుతూ వచ్చింది. కరువు వచ్చిన సంవత్సరాలలో కూడా ఫుడ్ కార్పొరేషన్ మరియు సబ్సిడీల ద్వారా ఈ పెరుగుదల కొనసాగింది. కానీ 1991  తరువాత తలసరి ఆహారం కేలరీలు తగ్గుతున్నాయి. 2003 నాటికి బ్రిటిష్ కాలం ఆనాటి దయనీయ స్థితికి చేరుకున్నది. కానీ మోడి ప్రభుత్వము పెట్టుబడుల ప్రవాహం మన దేశానికి రావటం  గురించి మాట్లాడుతున్నది. కార్పొరేట్లకే మద్దతునిస్తున్నది.

 ముస్లిం లీగ్ వలెనే ఆర్ ఎస్ ఎస్ మరియు హిందూ మహాసభలకు కూడా ఆర్థిక పరమైన కార్యక్రమము లేదు. పేదలంటే వారికి లెక్క లేదు. తమకి నిధులిచ్చే సంపన్నులే వారికి ముఖ్యం. బిజెపి కి మద్దతునిచ్చేది ఉన్నత కులస్థులు, ఉన్నత వర్గాలు. కాబట్టి దేశాన్ని పాలించేందుకు ఓట్లకోసం మతపరమైన సమస్యలను రెచ్చగొడుతుంటారు. ఈ విధముగా చేసే వారిలో వీరే మొదటి వారు కాదు. జర్మనీలో నాజీలు జాతి పేరుతో ఈ పని  చేశారు.  ఆర్ ఎస్ ఎస్ గురువైన గురు గోవాల్కర్, జర్మనీలో నాజీలు యూదులను అణచివేయటాన్ని పొగిదారు. మన దేశం లో కూడా హిందువులు కానీ వారిపట్ల ఇటువంటి విధానాన్నే అనుసరించాలన్నారు.    

మతొన్మాదులు తాము చెప్పే  హిందుత్వకి వ్యతిరేకముగా ఎవరు మాట్లాడినా సహించ లేని పరిస్థితి లో వున్నారు. ఋగ్వేదం కూర్పు క్రీస్తు పూర్వం 1500 జరిగిందని అనటం వారికి నచ్చదు.  తాము క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల క్రితం అని అంటున్నారు  కాబట్టి కాబట్టి అందరూ అదే నమ్మాలంటారు. దభోల్కర్, పన్సారే, మరియు కల్బుర్గి ల హత్యలు యాదృచ్చికముగా జరిగినవి కావు. బెదిరించి ప్రజలనోళ్ళు కట్టేయాలని వారి ఉద్దేశం. భారత చరిత్ర పరిశోధన సంస్థ, ఇండియన్ కవున్సిల్ ఆఫ్ సోషల్ రిసెర్చ్, జవహర్ లాల్ నెహ్రూ మ్యూజియం తదితర సంస్థలను మతోన్మాదులతో నింపుతున్నారు. భారత చరిత్రను, భారత రాజ్యాంగాన్ని వక్రీకరిస్తున్నారు. ప్రజాస్వామిక హక్కుల పై దాడి చేస్తున్నారు. మతం పేరుతో ముస్లిం ల పై చేసే దాడులను ఏదో యాదృచ్చికముగా జరుగుతున్నవని కాకుండా “భారత దేశం” అనే భావన పై జరుగుతున్న దాడిగా పరిగణించాలి. బి జె పి, ఆర్ ఎస్ ఎస్ లు భారత దేశం అనే భావన కి వ్యతిరేకులని గుర్తించాలి. ఈ కుట్రని తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి.

(ప్రముఖ మార్క్సిస్టు చరిత్ర కారులు శ్రీ ఇర్ఫాన్ హాబీబ్ గారు 7.10.2015 న ఆలీ గడ్ ముస్లిం యూనివర్సిటీ లో చేసిన ప్రసంగానికి ఇది సంక్షిప్త అనువాదం)

అనువాదకులు: పి.అశోకబాబు 

 

Wednesday, August 5, 2020

కరోనా వైరస్ - ప్రపంచం- మన దేశం - మన టెలికం రంగం (మొదటి భాగం)

కరోనా వైరస్ అనుభవం చెప్పిన నిజం—ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ రంగం లోనే వుండాలి

కరోనా వైరస్ వ్యాధి సోకిన వారి సంఖ్య ప్రకారం అమెరికా మొదటి స్థానం లో,  బ్రెజిల్ 2వ స్థానంలో, భారత దేశం మూడో స్థానంలో వున్నాయి. ఈ 3 దేశాలను పరిపాలించే ప్రభుత్వాలు మితవాదాన్ని ( కార్పొరేట్సుకు  పూర్తి అనుకూలం, ప్రజల ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం) నియంతృత్వ వైఖరిని అవలంబిస్తున్నాయి.

ఈ వ్యాది  ప్రారంభమయున దేశమైనప్భపటికి దీనిని నియంత్రించటంలో చైనా సఫలమయింది.  క్యూబాలో ఈ వ్యాధి వలన మరణించిన వారి  సంఖ్య 100 లోపే. ఇంతేగాక ఆ దేశం,  ఇతర అనేక దేశాలకు కరోనా కట్టడి చేయటంలో సహకరించేందుకు డాక్టర్లను పంపింది. వియత్నాం , లావోస్   లలో ఇంత వరకు ఎవరూ చని పోలేదు. ఉత్తర కొరియా లో కూడా  ఈ వ్యాధి వలన ఇంత వరకు ఎవరూ చనిపోలేదు.  కరోనాని నియంత్రించటంలో ఈ విధముగా సోషలిస్టు దేశాల ఆధిక్యత రుజువయింది.

సార్వత్రిక ఆరోగ్య  సంరక్షణ వ్యవస్థ మెరుగుగా వున్న    దక్షిణ కొరియా, సింగపూర్, న్యూజిలాండ్, తైవాన్ తదితర దేశాలలో కోవిడ్ నియంత్రణ, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే  కొంత మెరుగుగా వున్నది.

మన దేశంలో సిపిఎం నాయకత్వంలో వున్న కేరళ వామపక్ష  ప్రజాస్వామిక ఫ్రంట్ ప్రభుత్వము కరోనా వ్యాధిని నియంత్రించటం లో సాధించిన విజయాన్ని  “ కేరళ మోడల్” గా  అందరూ ప్రశంసిస్తున్నారు. .ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది.

లాభాల కోసమే  పని చేసే పెట్టుబడిదారీ విధానం  మరింతగా వికటించిన దశలో నేడున్నాము. ఈ దేశాలు ప్రజారోగ్య రంగాన్ని కూడా  ప్రయివేటు పరం చేసి  ఆరోగ్యాన్ని లాభాలు  తెచ్చే  వ్యాపారముగా మార్చాయి. కాబట్టి  ప్రజా ఆరోగ్య రంగం ప్రభుత్వ రంగం లో వుండాల్సిన అవసరాన్ని కరోనా వైరస్ అనుభవం రుజువు చేసింది.

( మిగతాది  రెండవ భాగం లో తెలుసుకుందాం)

..... పి.అశోకబాబు

Wednesday, January 10, 2018

ఢిల్లీలో 08.01.2018న జరిగిన అన్ని యూనియన్ల,అసోసియేషన్ల సమావేశం ఇచ్చిన పిలుపు


ఢిల్లీలో 08.01.2018న జరిగిన అన్ని యూనియన్ల, అసోసియేషన్ల సమావేశం ఇచ్చిన పిలుపు


డిమాండ్స్ 

1. వేతన  సవరణ, పెన్షన్  సవరణ
• 15% శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ తో 1.1.2017 నుండి వేతన సవరణ
• 1.1.2017 నుండి పెన్షన్ రివిజన్
• సెకండ్ పి ఆర్ సి సిఫార్సుల్లో  అమలు చేయకుండా వదిలి వేసినవి (ఉదా: డైరెక్టు రిక్రూటిస్ కు 30 శాతం పెన్షనరీ బెనిఫిట్స్) అమలు చేయాలి. 
2. సబ్సిడియరి టవర్ కంపెనీ ఏర్పాటును ఆపు చేయాలి. 
3. రిటైర్మెంట్ వయసు 58 కి తగ్గింపు/వి ఆర్ ఎస్ ప్రతిపాదనలను విరమించాలి. 

పోరాట కార్యక్రమం

1)  30.1.2018 నుండి 5 రోజులు ఆల్ ఇండియా/సర్కిల్/జిల్లా స్థాయిలలో సత్యాగ్రహం; ఢిల్లీలో అన్ని యూనియన్ల, అసోసియేషన్ల నాయకులు గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి సమర్పించటం తో సత్యాగ్రహం ప్రారంభం. (సత్యాగ్రహ కార్యక్రమం ఏ విధముగా అమలు చేయాలో త్వరలో  తెలియజేయబడుతుంది) 

2)  31.01.2018 నుండి నిరవధిక  “వర్క్ టు రూల్"

3)  28.2.2018న "ఛలో సంచార్ భవన్" -- ఢిల్లీలో సంచార్ భవన్ వద్ద  భారీ ప్రదర్శన

4) వారం రోజుల్లోగా కమ్యూనికేషన్సు మంత్రి ని, డి ఓ టి సెక్రెటరిని,  బి ఎస్ ఎన్ ఎల్ సి ఎం డి ని కలిసేందుకు అన్ని  యూనియన్ల,అసోసియేషన్ల నాయకులు అన్ని ప్రయత్నాలు చేయాలి.  

5) టవర్ కంపెనీ ఏర్పాటును ఆపు చేసేందుకు న్యాయస్థానం లో కేసు వేసేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఎస్ ఎన్ ఈ ఏ నాయకులు కా.జి.ఎల్.జోగి మరియు ఏఐ బి ఎస్ ఎన్ ఎల్ ఈ ఏ ప్రధాన కార్యదర్శి  కా.ప్రహ్లాద్ రాయ్ లకు బాధ్యత అప్పగింత. 

5) పోరాట కార్య్క్రమాలకు మార్గదర్శకత్వం వహించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ ఈ యు, ఎన్ ఎఫ్ టి ఈ, ఎస్ ఎన్ ఈ ఏ, మారియు ఏ ఐ బి ఎస్ ఎన్ ఎల్ ఈ ఏ ల జనరల్ సెక్రెటరీ లతో స్టీరింగ్ కమిటీ. 

6) డిమాండ్స్ కు మద్దతు కోసం రాజకీయ పార్టీల నాయకులను,సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల నాయకులను 30.01.2018 లోగా కలవాలి. 

అన్ని  యూనియన్లు, అసోసియేషన్లను కలుపుకుని ఈ కార్యక్రమాలను జయప్రదముగా అమలు చేయండి. 

 

బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్ర ప్రదేశ్  సర్కిల్

Thursday, February 2, 2017

ప్రయివేటీకరణని ఆపేందుకు, వేతన సవరణ సాధించేందుకు ఉద్యమించండి

29.1.2017న బెంగుళూరు లో జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ల జాతీయ సదస్సు తీర్మానం పూర్తి పాఠం

29.1.2017 న బెంగుళూరు లో జరిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల సంయుక్త జాతీయ సదస్సుకు కేంద్ర ట్రేడ్ యూనియన్లకు అనుబంధముగా వున్న, స్వతంత్రముగా వున్న ప్రభుత్వ రంగ సంస్థల యూనియన్ల నాయకులు, ప్రతినిధులు దేశం లో అన్ని ప్రాంతాలనుండి హాజరయ్యారు. 2.9.2016న చారిత్రాత్మకమయిన స్థాయిలో సమ్మేని విజయవంతముగా చేసినందుకు ఈ సదస్సు కార్మికులందరిని అభినందిస్తున్నది. ఈ సమ్మె పునాది స్థాయిలో కార్మిక ఐక్యత మరింత బలపడేలా చేసింది. ఎన్ డి ఏ ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక  ప్రజా వ్యతిరేక  విధానాలకు వ్యతిరేకముగా పోరాటాలు నిర్వహించటం  ద్వారా ఈ ఐక్యత మరింత బలపడేలా, విస్తృతమయ్యేలా చేయాలి.

ప్రభుత్వ రంగ సంస్థల మూసి వేత, ప్రయివేటీకరణ ల అమలుకు అనేక విధాలుగా  జరుగుతున్న దాడులు

పూర్తి ప్రయివేటీకరణ, మూసివేత, తదితర అనేక పద్ధతులలో ప్రభుత్వ రంగ సంస్థలను అంతరించేలా చేసేందుకు ఎన్ డి ఏ ప్రభుత్వము చేస్తున్న ఉధృతమయిన  దాడి పట్ల ఈ సదస్సు  తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నది. ఆర్థిక మంత్రి ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 1న 2017-18 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సమర్పణ జరుగుతుంది. ఈ సందర్భముగా మనము 2016-17 బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా రు.56500 కోట్లు సంపాదించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వము ప్రకటించిందని, అందులో ఇప్పటివరకు రు.23528.73 కోట్లు సాధించిందని, దీనికి తోడు మరో రు.11,224.06 కోట్లు “బై బ్యాక్” మార్గం లో సాధించిందని గమనించాలి.
ఈ ఆర్థిక సంవత్సరం 2016-17 లో మిగిలిన రోజులలో అనుమానాస్పదమయిన వాణిజ్య మార్గాలలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను మరింత పెద్ద ఎత్తున అమ్మి నిధి వసూలును మరింత పెంచేందుకు ప్రభుత్వము చేస్తున్న  ప్రయత్నాలు దిగ్భ్రాంతిని కలిగించేవిగా, ఖండించాల్సినవిగా వున్నాయి. మనము ఈ సదస్సునుండి తిరిగి మన  డ్యూటీలకు వెళ్ళేలోగా పార్లమెంటులో సమర్పించే బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థలపై మరిన్ని దాడులు ప్రతిపాదించే పరిస్తితి వున్నది. (ఈ అనుమానాన్ని ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి సమర్పించిన బడ్జెట్ నిజమని ధృవీకరించింది. ప్రభుత్వ  రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా 2017-18 లో రు.72500 కోట్లు సంపాదించాలని, ETF(ఎక్చేంజ్ ట్రెడెడ్ ఫండ్) మార్గం లో త్వరితముగా డిజిన్వెస్ట్మెంట్ ను అమలు చేయాలని, ఎంపిక చేయబడిన ప్రభుత్వ రంగ సంస్థలను ఒక నిర్ణీత కాల వ్యవధిలో షేర్ మార్కెట్ లో లిస్టింగుకు పెట్టాలని,రైల్వే విభాగం లో వున్న మూడు ప్రభుత్వ రంగ సంస్థలను—IRCTC, IRFC, మరియు IRCON—వెంటనే ఈ విధముగా లిస్టింగుకు పెట్టాలని   ఈ బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు)
ఇప్పటికే ప్రభుత్వము వాణిజ్య పరమయిన, పాలనా పరమయిన పద్ధతులకు విరుద్ధముగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయోజనాలను లెక్క చేయకుండా ఈ ETF మార్గం లో చాలా దూకుడుగా వాటాల అమ్మకాన్ని కొనసాగిస్తున్నది. మీడియా రిపోర్టుల ప్రకారం ఈ ETF పద్ధతిలో రు.6000 కోట్లు సంపాదించాలని నిర్ణయించింది. ఇందుకోసం రు.13726 కోట్ల విలువయిన బిడ్స్ ప్రొసెస్ లో వున్నాయి. ప్రస్తుత ETF లో  10 మహారత్న, నవరత్న ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు (ఓ ఎన్ జి సి, జి ఏ ఐ ఎల్, కోల్ ఇండియా, ఆర్ ఈ సి, ఆయిల్ ఇండియా, పవర్ ఫైనాన్స్, కంటెయినర్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్, మరియు ఇంజినీర్స్ ఇండియా) వున్నాయి. ఈ ETF ద్వారా జాతీయ ప్రయోజనాలకు  కీలకమయిన ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలను  ప్రయివేటు పరం చేసే పనిని  రిలయన్స్ మ్యూచ్యువల్ ఫండ్ మేనేజర్స్ కు అప్పగించి ప్రభుత్వము తన నిజ స్వరూపాన్ని వెల్లడించింది.  

ప్రమాదకరమయిన సిఫార్సులు

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు సంబంధించి ఒక ప్రమాదకరమయిన ప్రణాళిక ఇటీవలే వెలువడింది. ప్రభుత్వము ప్రోత్సహించి నిధులను సమకూర్చిన “ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ”(NIPFP) అనే ఏజెన్సీ, ప్రభుత్వ రంగ సంస్థల రద్దు కోసం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరింత దూకుడుగా ప్రయివేటీకరణ అమలు చేయటమే ముందుకు పోయెందుకు మార్గం అని, ప్రత్యేకించి 17 నవరత్న సంస్థలను, 73 మినీ రత్న సంస్థలను, మిగతా 140 చిన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేయాలని, అప్పుడు మాత్రమే ప్రభుత్వం పని వ్యాపారం చేయటం కాదని ప్రధాన మంత్రి అన్న మాటకు విలువ ఇచ్చినట్లవుతుందని ఈ నివేదిక పేర్కొన్నది. ప్రతి సంవత్సరం ఇంత లక్ష్యం అని పెట్టుకోటం వలన ఉపయోగం లేదని,  ఆ విధముగా కాకుండా 10 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులలో 50 శాతం అమ్మాలనే లక్ష్యం తో పని చేయాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది. 74 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయానికి నీతి ఆయోగ్ ఒక జాబితాని సమర్పించిందని ఈ సందర్భముగా మనం గమనించాలి.

NIPFP ప్రతిపాదించిన ఈ వినాశకర మార్గాన్ని అనుసరించి మోడి ప్రభుత్వము 20 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మెందుకు, ఖాయిలా పడినవని చెప్పబడే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేయటానికి తన ఆమోద ముద్ర వేసింది. రక్షణ రంగానికి సంబంధించిన BEML ను పూర్తిగా ప్రయివేటు పరం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఇందులో 46 శాతం వాటాలు అమ్మేశారు. దీనికి అదనముగా మరో 25 శాతం వాటాలను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టాలని నిర్ణయించారు. ఇది జరిగితే ఈ సంస్థ స్వదేశీ లేదా విదేశీ ప్రయివేటు కంపెనీ హస్తగతమవుతుంది. మరో మహారత్న సంస్థ SAIL పై కూడా తీవ్రమయిన దాడి జరుగుతున్నది. ఈ సంస్థ ఆధీనములో వున్న సేలం, దుర్గాపూర్, భద్రావతి స్టీల్ ప్లాంట్లను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టి ప్రయివేటు పరం చేయాలని ప్రభుత్వము  నిర్ణయించింది. ఓ ఎన్ జి సి  మరియు ఆయిల్ ఇండియా లు కనిపెట్టిన 67 ఆయిల్ ఫీల్దులను   ప్రయివేటు పరం చేసే ప్రక్రియ ప్రారంభమయింది. ప్రభుత్వ రంగం లో వున్న 5 జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలలో 25 శాతం వాటాలను అమ్మాలని, ఇందుకోసం ఈ సంస్థలను షేర్ మార్కెట్ లో లిస్టింగుకు పెట్టాలని ప్రభుత్వము ఒక దిగ్భ్రాంతికరమయిన నిర్ణయం చేసింది. ఇందుకు ఆర్థిక మంత్రి తెలియజేసిన కారణాలు,  లాభసాటిగా వున్న ఈ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీలను క్రమముగా ప్రయివేటు పరం చేయటమే అసలు ఉద్దేశమని తెలియజేస్తున్నాయి. ఐ డి పి ఎల్, ఆర్ డి పి ఎల్ లను మూసి వేయాలని, హిందుస్తాన్ యాంటీ  బయాటిక్స్ మరియు బెంగాల్ కెమికల్స్ ను ప్రయివేటు పరం  చేయాలని ఎన్ డి ఏ ప్రభుత్వము నిర్ణయించింది.

ఖాయిలా పడిన  ప్రభుత్వ రంగ సంస్థలను పరిశీలించి వాటి పునరుద్ధరణకు లేదా మూసి వేతకు ఒక నిర్దిష్టమయిన పద్ధతిలో సిఫార్సు చేసేందుకు ఏర్పాటు చేయబడిన రెగ్యులేటరీ సంస్థలు బి ఐ ఎఫ్ ఆర్  మరియు ఏ ఐ ఎఫ్ ఆర్ లను రద్దు చేయాలని ఒక వినాశకరనిర్ణయాన్ని ప్రభుత్వము ప్రకటించింది. ఖాయిలా పడిన వేలాది సంస్థలు మూతపడి లక్షలాది కార్మికులు నిరుద్యోగులవటం అనివార్యమవుతుంది.  ఈ విధముగా ఖాయిలా పడిన సంస్థల పునరుద్ధరణకు తర్క బద్ధమయిన, న్యాయ బద్ధమయిన పద్ధతిలో వుండే అవకాశాలను ఒక వంక రద్దు చేసి, మరో వంక సంబంధిత ప్రభుత్వ శాఖలే ప్రతి సంవత్సరము తమ ఆధీనములో వున్న ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితిని సమీక్షించి వాటిని ఖాయిలా పడినవిగా ఉదారముగా ప్రకటించి రద్దు చేసేందుకు/మూసి వేసేందుకు వీలుగా వినాశకరమయిన  ఆదేశాలను ప్రభుత్వము  జారీ చేసింది.

రక్షణ, బొగ్గు, మైనింగ్, విద్యుత్తు, టెలికాం, సివిల్ ఏవియేషన్, శాటిలైట్స్, నిర్మాణం, ఇన్సూరెన్సు, బ్యాంకింగు, పెన్షన్ ఫండ్స్, రైల్వే నిర్వహణ, మల్టీ బ్రాండ్ రిటెయిల్, ఫార్మాస్యుటికల్స్ తదితర రంగాలలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమటించేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి  పరిమితిని పెంచటం ద్వారా  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెద్ద ఎత్తున అనుమతించాలని ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల పూర్వ రంగం లో పైన తెలియజేసిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, ప్రయివేత్తికరణ  నిర్ణయాలను పరిశీలించాలి. ఈ నిర్ణయాల వలన అనేక కీలక రంగాలలో జాతీయ ఆర్థిక వ్యవస్థపై నియంత్రణను కోల్పోయే వినాశకర పరిస్థితి ఏర్పడుతుంది. సైన్యానికి కీలకమయిన ఆయుధాలను పరికరాలను అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు దెబ్బ తింటాయి. ఈ విధానాలు మన ఆర్థిక వ్యవస్థ ని ప్రపంచములో అత్యంత బహిరంగ ఆర్థిక వ్యవస్థగా మార్చాయని, ఈ సంస్కరణలను మరింతగా కొనసాగించేందుకు తాము కట్టుబడి వున్నామని ప్రధాన మంత్రి సగర్వముగా ప్రకటించటం ఆశ్చర్యకరం.

వేగవంత మవుతున్న కాంట్రాక్టరీకరణ

ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టరీకరణ, కాంట్రాక్టు కార్మికులపై విశృంఖల దోపిడి  వేగవంతమవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రభుత్వ రంగం మొత్తముగా, అదే విధముగా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలో తమ అనుబంధాలకు అతితముగా ఈ సమస్య పై  స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ఐక్య పోరాటాలను తాత్కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే విధముగా నిర్వహించాల్సిన అవసరం వున్నది.

ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరుగుతున్నది. ఈ పరిస్థితిలో రెగ్యులర్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు మధ్య సన్నిహిత సహకారం ఎంతయినా అవసరం. ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి మరియు లాభదాయకత లో కాంట్రాక్టు కార్మికుల భాగస్వామ్యం చాలా వున్నప్పటికి కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ధమయిన వేతనాలు, సాంఘిక భద్రత, రక్షణ అమలు కావటం లేదు. సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన సమాన పనికి సమాన వేతనం తీర్పును కాంట్రాక్టు కార్మికులకు అమలు చేసేందుకు ట్రేడ్ యూనియన్ ఉద్యమం పెద్ద ఎత్తున ఉద్యమించాలి.
ప్రభుత్వ రంగ సంస్థలలో జరగనున్న వేతన సవరణ చర్చలు

జస్టిస్ సతీశ్ చంద్ర అధ్యక్షతన ప్రభుత్వ రంగ సంస్థల అధికారుల వేతన సవరణ పై నియమించబడిన కమిటీ (థర్డ్ పి ఆర్ సి) గతం లో ఎన్నడూ జరగని విధముగా తన సిఫార్సులను డి పి ఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్) కి  కాకుండా నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది. ఈ సిఫార్సులపై ప్రధాన మంత్రి కార్ర్యాలయం ఉద్దేశ పూర్వక మౌనాన్ని అవలంబిస్తున్నది.  ఈ సిఫార్సుల వలన అధికారులు, ఉద్యోగులు అనేక తీవ్రమయిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తున్నది.

ఈ లోగా 1.1.2017 నుండి జరగాల్సిన వేతన సవరణ కి సంబంధించిన డిమాండ్స్ ను ట్రేడ్ యూనియన్లు మేనేజిమెంట్సుకు  సమర్పిస్తున్నాయి. సి పి ఎస్ టి యు (కమిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ట్రేడ్ యూనియన్స్) ఆద్వర్యం లో ఒక వర్క్ షాపును నిర్వహించి అందులో ప్రాధమికమయిన డిమాండ్స్ ను రూపొందించటం, వాటి ఆధారముగా యూనియన్లు తమ డిమాండ్స్ ను సమర్పించటం  గతం లో జరిగేది. కానీ ఈ సారి అలా జరగ లేదు. ఏమయినప్పటికి,  ఈ క్రింది  ముఖ్యమయిన సమస్యలను వేతన సవరణ డిమాండ్స్ లో అన్నీ యూనియన్లు పొందుపరచాల్సిన  అవసరం వున్నది:

·         వివిధ మార్గాలలో ప్రయివేటీకరణకు జరుగుతున్నా ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ  ప్రభుత్వ రంగ  సంస్థల  పరిరక్షణను డిమాండ్ చేయాలి.

·         పైన తెలియజేసిన విధముగా కాంట్రాక్టు వర్కర్ల డిమాండ్స్ ను తప్పని సరిగా చేర్చాలి. ఆ డిమాండ్స్ పై చర్చించి ఒప్పందం సాధించాలి. కోల్ ఇండియాలో కాంటాక్ట్ వర్కర్ల వేతన సవరణ పై చర్చించి వారి డిమాండ్స్ పై ఒక చాప్టర్ గత వేతన సవరణ ఒప్పందం లో చేర్పించటం జరిగింది.

·         ఆఫీసర్ల అసోసియేషన్లు మరియు అనేక ప్రభుత్వ రంగ సంస్థల మేనేజిమెంట్లు థర్డ్ పి ఆర్ సి కి సమర్పించిన మెమోరాండం లలో  వేతన సవరణ కాలపరిమితి 3 నుండి 5 సంవత్సరాలు వుండాలని డిమాండ్ చేశాయి. ఇదే వైఖరిని ట్రేడ్ యూనియన్లు అవలంబించాలి. కోల్ ఇండియాలో 5 సంవత్సరాల కాల పరిమితి ప్రాతిపదికగా వేతన సవరణ చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

·         పెట్రోలియం రంగం లో కొన్ని  ప్రభుత్వరంగ సంస్థలను మినహాయించి మిగతా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో ట్రేడ్ యూనియన్లు పి ఆర్ పి (పెర్ఫార్మెంస్ రిలేటెడ్ పే =పని ప్రాతిపదికగా వేతనం) విధానాన్ని తిరస్కరించాయి. ఈ విధానం కార్మికులకు ఉపయోగం అని అనుకోటం అంటే దూరదృష్టి లోపించటమే. పని ప్రమాణాన్ని, అందుకనుగుణమయిన వేతన స్థాయిని నిర్ధారించటం లో అనేక కార్మిక వ్యతిరేక విధానాలకు ఇది అవకాశం కల్పిస్తుంది.

·         పే, పెర్క్స్స్, ఇతర బెనిఫిట్సు మరియు  సౌకర్యాల విషయం లో అధికారులకు ఉద్యోగులకు మధ్య వివక్షత పెరుగుతున్నది. ఈ వివక్షతని నివారించాలని,  హేతుబద్ధమయిన సాపేక్షత వుండాలని డిమాండ్ చేయాలి.

·         అధికారుల సంఖ్య పెరుగుతూ ఉద్యోగుల సంఖ్య తగ్గే క్రమాన్ని ఆపు చేయాలి. అధికారులు, ఉద్యోగుల మధ్య నిష్పత్తి ని పునరుద్ధరించాలి. ఇందుకోసం తగు సంఖ్యలో ఉద్యోగులను రిక్రూట్ చేయాలని  డిమాండ్ చేయాలి.

·         ఆరోగ్యకరమయిన, భద్రత కలిగిన  పని పరిస్థితులను  మరియు సాంఘిక భద్రత ప్రయోజనాలను డిమాండ్ చేయాలి.

నోట్ల రద్దు

నల్ల ధనాన్ని రద్దు చేసేందుకు, ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు అనే పేరుతో మోడి ప్రభుత్వము అమలు చేసిన నోట్ల రద్దు విధానం ప్రజలను అనేక ఇబ్బందులపాలు చేసింది. రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారు. కార్మికులు పనిని, వేతనాన్ని కోల్పోయారు. స్వయం ఉపాధి దారులు మరియు చిన్న వ్యాపారులు తమ  జీవనాధారాన్ని కోల్పోయారు. పనిని కోల్పోయిన కార్మికుల సంఖ్య చాలా ఎక్కువగా వున్నది. నగదు కొరత వలన చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కార్మికులు ఉపాధిని కోల్పోయారు. రోజు కూలీలు నగదు చలామణి లేనందున పనులు కోల్పోయారు. రెండు నెలలయినా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోలేదు. కార్మికులు పట్టణాలను వదిలి గ్రామాలకు వెళ్లాల్సి వచ్చింది.

బ్యాంకులు , పోస్ట్ ఆఫీసుల వద్ద నగదు కోసం పొడవైన క్యూ లలో నిలబడి అలసట వలన, వైద్య సదుపాయం లేనందున కొందరు చనిపోయారు. వారాల తరబడి అర్ధ రాత్రి వరకు పని చేసి ఆ ఒత్తిడి వలన 10 మంది బ్యాంకు ఉద్యోగులు చనిపోయారు. నోట్ల రద్దు ఫలితముగా ఏర్పడిన ఈ పరిస్థితి  వలన 120 మంది చనిపోయారు. 28 జనవరి 2017న ఈ పరిస్థితులకు వ్యతిరేకముగా  కేంద్ర ట్రేడ్ యూనియన్లు మరియు  జాతీయ ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపుననుసరించి  దేశ వ్యాపిత  నిరసన లో పాల్గొన్న వారిని ఈ సదస్సు అభినందిస్తున్నది.

సదస్సు పిలుపు

ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను వివిధ పద్ధతులలో అమ్మే విధానాలను,  పాక్షిక లేదా సంపూర్ణ  ప్రయివేటీకరణను, బి ఐ ఎఫ్ ఆర్ మరియు ఏ ఐ ఎఫ్ ఆర్ ల రద్దును వ్యతిరేకిస్తూ  దీర్ఘ కాలిక ప్రచారాన్ని ఆందోళనను నిర్వహించాల్సిన అవసరం వుందని,  ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల మూసివేతని నివారించి వాటిని పూర్తి స్థాయి ప్రభుత్వ రంగా సంస్థలుగా పునరుద్ధరించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని, అదే విధముగా సమిష్టి బేరం హక్కును, ప్రత్యేకించి రానున్న వేతన సవరణ చర్చల రీత్యా కాపాడుకోవాల్సిన అవసరాన్ని    ఈ సదస్సు నిర్ధారించింది. ఈ సదస్సు ఈ క్రింది కార్యక్రమాన్ని నిర్ణయించింది:

·         ప్రభుత్వ రంగ సంస్థ/పరిశ్రమ/రంగం స్థాయిలో సంయుక్త సదస్సులు/సెమీనార్లు/సమావేశాలు  స్థానిక/ ప్రాంతీయ/జాతీయ స్థాయిలో 28 ఫిబ్రవరి 2017 లోగా నిర్వహించాలి.

·         మార్చి 20, 2017 లోగా కరపత్రాలు, పోస్టర్లు, గేట్ మీటింగులు, ధర్నాలు, స్లోగన్లు కార్యక్రమాలను విరామ సమయం లో లేదా డ్యూటీ అయిన వెంటనే నిర్వహించాలి.

·         మార్చి 30, 2017న బ్లాక్ బ్యాద్జీలు, ధర్నా, ప్రదర్శనలు తదితర రూపాలలో అఖిల భారత నిరసన దినం అమలు చేయాలి.

·         పార్ర్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండవ విడత జరిగే సందర్భములో ఢిల్లీలో జాతీయ సదస్సు జరపాలి( తేదీని తరువాత నిర్ణయిస్తారు)

·         ఈ కార్యక్రమాలు అమలు చేయాలని, ఆ తరువాత దేశ వ్యాపిత సమ్మెకు (తగు సమయం లో సమ్మె తేదీ నిర్ణయించ బడుతుంది) సంసిద్ధముగా వుండాలని ఈ సదస్సు పిలుపునిస్తున్నది.

ఈ తీర్మానం పై సంతకం చేసిన వారు :

డాక్టర్ జి.సంజీవరెడ్డి (ఇఐ ఎన్ టి  యు సి), హెచ్.మహదేవన్ (ఏ ఐ టి యు సి), హర్భజన్ సింగ్ సిద్ధు (హెచ్ ఎం ఎస్), తపన్ సేన్ (సి ఐ టి యు), ఎం. షణ్ముగం  (ఎల్ పి ఎఫ్), మీనాక్షీ సుందరం ( కన్వీనర్, జె ఏ ఎఫ్,  బెంగుళూరు), యు.ప్రభాకర్ ( సి పి ఎస్ టి  యు కోఆర్డినేషన్ కమిటీ హైదారాబాద్ )