Monday, January 30, 2012

ప్రపంచీకరణ విధానాల పరాకాష్ట 'యానాం' ఘటనలు


యానాంలోని రీజెన్సీ సిరామిక్స్‌ కంపెనీలో గత ఆరు మాసాల నుంచి ఆందోళన సాగుతున్నది. శుక్రవారం కార్మికులపై తుపాకి తూటాలు పేల్చారు. యానాం రక్తసిక్తమైంది. విచ్చలవిడి కాల్పుల్లో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో సాధనాల దుర్గాప్రసాద్‌, కమిడి శ్రీనివాస్‌, ఎం.శ్రీనివాసరావు, బొండా సూర్యప్రకాశ్‌, గెడ్డం జార్జి విక్టర్‌బాబు, ఎం.సూర్యనారాయణ, బడుగు గోపాలకృష్ణ, ఆర్‌.సూర్యప్రకాశ్‌, గెడ్డం రాధాకృష్ణలున్నారు.దీనికి ముందు యూనియన్‌ నాయకులు మచ్చా మురళీమోహన్‌ను గుండెలపై లాఠీలతో పొడిచి చంపారు. కార్మికవర్గ చరిత్రలో ఇదొక దుర్మార్గ సంఘటన మాయనిమచ్చ. బ్రిటిష్‌ కాలాన్ని తలపించే విధంగా పోలీసులు,యాజమాన్యం వ్యవహరించాయి. ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా కార్మిక సంఘాలు లేకుండా యధేేచ్చగా దోపిడీ చేయడానికి ప్రభుత్వం చట్టాలను తుంగలోకి తొక్కి కార్మిక వర్గాన్ని అణచడానికి పూనుకోవడమే ఇటువంటి సంఘటనకు దారితీసింది. ప్రపంచీకరణ విధానాలు అమలుచేయడం వల్ల ఉద్భవించిన దుష్పరిణామం ఇది. ఇటీవల కాలంలో దేశంలోను, రాష్ట్రంలోను అనేక చోట్ల కార్మికుల అసంతృప్తి అనేక రూపాల్లో వెళ్ళగక్కుతున్నారు. ఢిల్లీ ప్రక్కనే గుర్‌గావ్‌ వద్ద మారుతీ సుజుకీ కంపెనీలో మూడు నెలలు సాగిన ఆందోళన మనకు తెలుసు, శ్రీకాకుళం రెడ్డిల్యాబ్స్‌ పోరాటం మన కళ్ళముందే సాగింది. వీరి పోరాటాలకు చుట్టూ వున్న వేలాది మంది కార్మికులు సమ్మె చేసి మద్ధతుపలికారు. యూనియన్‌లో ఉన్నా, లేకపోయినా సెప్టెంబర్‌ 7 దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనడం కార్మికుల తీవ్ర అసంతృప్తికి తార్కాణం.
స్ధానిక కాంగ్రెస్‌ ఎం.ఎల్‌.ఎ ఆల్లాడి కృష్ణారావు యాజమాన్యానికి పూర్తి అండగావున్నాడు. యూనియన్‌ ఏర్పాటు చేశారనే కక్షతో యాజమాన్యం 11 మందిని పాండిచ్చేరికి బదిలీచేసింది. 2010 జనవరిలో కార్మికులు ఏర్పాటు చేసుకున్న యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ను యాజమాన్యం రద్దు చేసింది. యూనియన్‌ నాయకులను సస్పెండ్‌ చేసింది. కార్మికులు జీతాలు పెంచాలని, తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని, యూనియన్‌ను గుర్తించాలని ఆందోళన చేస్తున్నారు. కార్మికుల పోరాటాన్ని అణచడానికి యాజమాన్యం పోటీ కార్మికులను తెచ్చింది. పోటీ కార్మికులను అడ్డుకున్నందుకు సుమారు 100 మందిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి చితగ్గొట్టారు. ఈ సంఘటన కారణాలను లోతుగా పరిశీలించాలి.
ప్రపంచీకరణ విధానాల్లో భాగంగా సెజ్‌ల నుంచి సాధారణ పరిశ్రమల వరకు కార్మికులు యూనియన్లను ఏర్పాటు చేయడానికి అనుమతించడంలేదు. ట్రేడ్‌ యూనియన్‌ చట్టం 1926 ప్రకారం ఏడుగురు కంటే అదనంగా కార్మికులున్న చోట సంఘాన్ని పెట్టుకోవచ్చు. బయట నుంచి కూడా నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని స్పష్టంగా వుంది. కాని కార్మికులు యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్న వెంటనే యాజమాన్యాలు కార్మిక నాయకులను పనుల నుంచి తొలగిస్తున్నారు. కోర్టులకు వెళ్ళి సంఘాల రిజిస్ట్రేషన్స్‌ను రద్దు చేయిస్తున్నారు. కార్మికులు ఆందోళన చేయకుండా కోర్టు నుంచి ఆంక్షలు విధిస్తున్నారు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ యాజమాన్యాల కొమ్ముకాస్తున్నాయి. ప్రభుత్వం యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నది. యానాంలో జరిగిందిదే. 2010 జనవరిలో కార్మికులు ఏర్పాటు చేసుకున్న యూనియన్‌ను యాజమాన్యం గుర్తించలేదు. సిరామిక్‌ టైల్స్‌లో దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రీజెన్సీ యాజమాన్యం బాగా లాభాలు గడిస్తున్నది. కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తున్నది. వీరిలో కూడా కేవలం 880 మంది శాశ్వత ఉద్యోగులు కాగా, 1200 మందికి పైగా అతితక్కువ జీతాలతో కాంట్రాక్టు కార్మికులుగానే పని చేయిస్తున్నారు. కార్మికుల్లో సుమారు 60 శాతం మంది దళితులే. 20 సంవత్సరాల నుంచి పనిచేసే కార్మికులకు కూడా నెలకు 4 వేలు కూడా జీతం చెల్లించటంలేదు. జీతం పెంచమని అడిగినందుకు యాజమాన్యం కక్షకట్టింది. ఆందోళన చేసే కార్మికులు 200 మీటర్లు దూరంలో వుండాలని కోర్టు నుంచి ఆంక్షలు విధించింది. విధి లేక కార్మికులు వీధుల్లోపడ్డారు. ఆరుమాసాల నుంచి ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ గుడ్లప్పగించి చూస్తున్నది. ఫ్యాక్టరీ అధికారుల తనిఖీలు ఆగిపోయాయి. న్యాయస్థానాలు కార్మికుల పోరాటాల నడ్డివిరుస్తున్నాయి. అసంఘటిత కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది. గత్యంతరం లేక తిరుగుబాట్లు తథ్యమని భావిస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయకపోయినా, పి.ఎఫ్‌ లాంటి చట్టాలు అమలుచేయక పోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. శుక్రవారం యూనియన్‌ నాయకత్వంలో దొంగ కార్మికులను అడ్డుకున్నారు. పోలీస్‌ బలగాలు కార్మికులను బలవంతంగా అరెస్టు చేశాయి.. అరెస్టు అయిన యూనియన్‌ నాయకులు మురళీమోహన్‌ను కొట్టిచంపడంతో కార్మికుల ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. వారిని అదుపుచేసేవారే లేరు. కంపెనీ యాజమాన్యంపై దాడిజరిగింది. పరిశ్రమ వైస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గాయాలపాలయ్యాడు. తరువాత ఆసుపత్రిలో మరణించాడు. దీనికి యాజమాన్యమే బాధ్యత వహించాలి.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు యానాం ఘటననుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచీకరణ విధానాలపేరుతో కార్మిక వర్గాన్ని నిస్సహాయులుగా చేయాలని పూనుకోవడం పొరపాటు. కార్మిక వర్గానికి యూనియన్లు లేకుండా ''డియానినైజేషన్‌'' చేయాలనే విధానం శుద్ధ తప్పు. కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, బోనస్‌, శెలవు దినాలు, పి.ఎఫ్‌ వగైరా చట్టాలను అమలుచేయించే బాధ్యత ప్రభుత్వాలదే. కార్మికచట్టాలు అమలుచేయించే కార్మిక శాఖ, ఫ్యాక్టరీ శాఖలను నిర్వీర్యం చేసే విధానాలు విరమించుకోవాలి. లేకుంటే ఇటువంటి పరిణామాలు పునరావృతం కాక మానవు.
-సి.హెచ్‌.నరసింగరావు
  (రచయిత సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)

Saturday, January 28, 2012

'ఇది నా అరకు డిక్లరేషన్‌ '


 శృంగవరపు కోట వరకు డబల్‌ట్రాక్‌ రోడ్‌ ఉంది. విశాఖలో ప్రజాప్రతినిధుల బృందంతో బస్సులో వెళితే అన్నీ చూడలేను. అదీగాక అది ప్రభుత్వ కార్యక్రమంగా ఉంటుందని కారులో ప్రత్యేకించి వెళ్లాను. విశాఖలో మా విద్యార్థులు తెచ్చిన కారులో ప్రయాణించాను. శృంగవరపు కోట వరకు కారు స్పీడ్‌గా వెళ్లింది. మేమంతా ప్రభుత్వ అతిధులం కాబట్టి ఆ రోడ్డంతా పోలీసులు క్లియర్‌ చేశారు. ఎస్‌.కోట తర్వాత రోడ్డు సింగిల్‌ ట్రాక్‌ అయ్యింది. అది నాకు చాలా అనుకూలమైనది. ఎందుచేతనంటే ఎక్కడ నలుగురు కనబడితే అక్కడే కారు ఆపటం, ఎక్కడ నాలుగు గుడిసెలు కనబడితే అక్కడకు పోవటం, జనంతో కలవటం చేశాను. అది నా పుట్టుక నుంచి వచ్చిన బుద్ధి కదా! ఆడవాళ్లు కనబడితే వారితో మాట్లాడాను. నా పక్కన గిరిజన భాష తెలిసిన అప్పల్నాయుడున్నాడు. మహిళలు కనపడగానే ఏం చదువుకున్నావని అడిగేవాణ్ణి. చదువులేదు ఏంలేదు అని కొందరు సమాధానం చెప్పారు. మరి ఎటుపోతున్నావమ్మా? ఏం పని చేస్తున్నావమ్మా? అని కొందరిని అడిగితే బతకటానికి వెళుతున్నానని సమాధానం చెప్పారు. కట్టెపుల్లలు ఏరుకొచ్చుకునేందుకు వెళుతున్నానని ఒక ఆమె చెప్పింది. ప్రభుత్వం మీకు గ్యాస్‌పొయ్యిలను ఇవ్వలేదా అన్నాను. అంటే నా ప్రశ్న వాళ్లకు అమెరికాలో స్పానిష్‌ వాళ్లను అడిగినట్లనిపించింది. ఎవరో కరువు వచ్చిందా అంటే బిర్యాని దొరకలేదా అని నైజాం నవాబు అడిగినట్లుంది. ఆ ప్రశ్న అడిగితే మమ్మల్ని నైజాం నవాబు ఎలా చూశాడో ఆమె మమ్ముల్ని అలా చూసింది. అయ్యో, ఈమెను ఈ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. ఆమె వయసు 20 సంవత్సరాలకు తక్కువగా ఉన్నది. ఎంత మంది పిల్లలమ్మా అని అడిగాను. ముగ్గురు పిల్లలని చెప్పింది. 20 ఏళ్ల లోపే వాళ్ల జీవితం ముగిసింది. కొంచెం దూరం పోతే రోడ్డుపైననే అంత చలి ఉన్నా ఆ మనుషులు గోచి పెట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నారు.

కొందరిని మీదేవూరు అని, మీ తండా ఎక్కడుందని అడిగాను. ఒక స్థలంలోనే నివాసమన్నది మాకెక్కడుంది? ఎక్కడ బువ్వ దొరికితే అక్కడికే వలసలు పోవటం మా జీవనం అన్నారు. స్కూళ్లు ఏమైనా వాళ్లకు అందుబాటులో ఉన్నాయా అని అడిగాను. బడులున్నాయి. రెండు మూడు ఆశ్రమ బడులు కనపడ్డాయి. టాయిలెట్స్‌ ఉన్నాయి. కానీ నీళ్లు లేవు. మూత్రం వస్తే ఎటువెళతారని అడిగితే ఆ విద్యార్థిని తలవంచుకుంది. పక్కన ఉన్న మగపిల్లలను అడిగాను. ఆ చెట్ల పక్కన అని చూపించటం జరిగింది. బడి అంటే బోర్డుయని, బెంచీలని, నల్లబల్లలని అనుకుంటాం. అక్కడ బడి అంటే ఆశ్రమ పాఠశాల పిల్లలు కింద కూర్చున్నారు. అక్కడే ఆ మూలనా అన్నం వండుతున్నారు. అది మధ్యాహ్న భోజన పథకం కింద వంట వండుతున్నారు. సత్రపు తిండిలాగా, ఆ బడులు మఠాల తీరుగా ఉన్నాయి. గతంలో సన్యాసులను కూర్చుండపెట్టేది ఇపుడు పిల్లలను కూర్చుండ బెడుతున్నట్లు నాకనిపించింది.

ఆ తోవలో ఒక దుకాణంలోకి పోయి మంచి నీళ్లు ఉన్నాయా అని అడిగాను. సీసాలా అన్నది అవునన్నాను. ఆమె వెంటనే ఓ మద్యం మందు సీసా తీసుకుని వచ్చింది. నేనడిగింది ఈ సీసా మందు కాదు. మంచినీళ్లు బాటిల్స్‌ ఉన్నాయా అని అడిగాను. ఇక్కడ వద్దు సార్‌ బైటకు పోయి తాగుదామన్నాడు. చివరకు రోడ్డంతా పోలీసులున్నారు కాబట్టి ఒక పోలీసు తను గద్దెమీద కూర్చోని తుపాకీ మెడ మీద వేసుకుని నలు దిక్కులా ఆసక్తిగా చూస్తున్నాడు. ఏం చూస్తున్నావని అడిగాను. ఇది ఎంత అద్భుతమైన సన్నివేశం సార్‌ అన్నాడా కానిస్టేబుల్‌. ఆ కానిస్టేబుల్‌ తాను గోదావరి జిల్లా వాణ్ణని చెప్పాడు. బి.ఏ. చదువుని మధ్యలో వదిలి పోలీసు ఉద్యోగంలో చేరానని చెప్పాడు. నువ్వొక్కడివే కూర్చుని పహారా కాస్తుంటే నీకు భయం వేయటం లేదా అని అడిగాను. నాకు ఆనందంగా ఉందని అన్నాడు. చక్కటి సీనరీలున్నాయి. చూసిన కొద్దీ నాకు చూడబుద్ధి అవుతుంది. నేనుండేది రెండు రోజులేగా సార్‌. ఇదొక అద్భుతమైన టూరిస్టు సెంటర్‌గా ఉందన్నాడు. ప్రజల స్థితిగతులు ఒకరకంగా ఉన్నాయి. యాత్రికుల ఆనందం మరోరకంగా ఉంది. ఈ విధంగా నాకు ఎస్‌. కోట నుంచి అనంతగిరి చేరే వరకు రెండు గంటలు పట్టింది. ఇంత సుసంపన్న ప్రదేశంలో ఇంత దరిద్రులుండటం ఏమిటని నాకనిపించింది.

మేము అనంతగిరి చేరేవరకు ఒక 30 మంది మహిళలను తీసుకువచ్చి నిలబెట్టారు. అదొక టూరిజం కేంద్రం. అక్కడ నూటముప్పరు వరకు గదులు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్ని వసతులున్నాయి. మా మధ్యాహ్న భోజనం అక్కడే ఏర్పాటు చేశారు. ఫైవ్‌స్టార్‌ హౌటల్‌లో ఉండే వసతులకు తలదన్నే విధంగా సౌకర్యాలు, అన్ని రకాల రుచులు, తిండి పదార్థాలు ఏర్పాటు చేశారు. నేను నా జీవితంలో మాంసం వాసన, చేపల వాసనను పీల్చవలసి వచ్చింది. ఇక్కడ కూర్చుంటే లాభం లేదని అక్కడకు దూరంలో నున్న ఆడవాళ్ల దగ్గరకు పోయాను. వారంతా 16 -45 సంవత్సరాల మధ్య వయసున్నవారే. మీరేం చేస్తారని అడిగితే, మీలాంటి టూరిస్టులు వస్తే గిరిజన సంస్కృతికి ప్రతిబింబమైన నృత్యం చేస్తామని చెప్పారు. గిరిజన సంస్కృతి నృత్యం చేస్తూ ఆ కళలను ప్రదర్శిస్తున్న సాంస్కృతిక టీమ్‌ అది. అక్కడున్న ఆ 20 మందిలో ఇద్దరు మాత్రమే బడిముఖం చూశారు. వీళ్లంతా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్లు. అతిథులు రాగానే నాట్యం చేస్తున్నారు. తమ గిరిజన కళలను ప్రదర్శిస్తున్నారు. అది ఇతరులకు ఆనందం కలిగించవచ్చు కానీ నాకు మాత్రం వాళ్ల చప్పుడు నాగుండె మీద బరువేసినట్లయ్యింది. అక్షర జ్ఞానం లేదాయె? సంబంధిత అంశంపై పనిచేసే ఉద్యోగం కాదు. టూరిస్టులు వస్తే వాళ్ల వినోదం కోసం వీళ్లను అడుగులు వేయిస్తుంటే అది ఆనందమా? క్షోభనా ఒక్కసారి ఆలోచించుకోవాలనిపించింది.

టూరిజంలో సంపాదించే డబ్బుతో ఈ స్థానికుల జీవితాలను మెరుగుపరిచే ప్రయత్నం ఏమన్నా చేస్తే మనమీద వారికి ఎక్కువ నమ్మకం కలిగేది. మనది టూరిజం పరిశ్రమ కదా! అది టూరిస్టుల కోసం, మార్కెట్‌ కోసమే కానీ ప్రజల కోసం కాదు అని అనిపించింది. కాబట్టి నేను అక్కడ నుంచి వెళ్లిపోయాను. అక్కడ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో అరుకులోయ ఉంది. అక్కడే మా బస. దానికి 10 కిలోమీటర్ల దూరంలో చోటికీ అనే గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఒకవైపున ప్రజలు రెండోవైపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. మధ్యలో అధికారులున్నారు. మా అందరికీ నాయకత్వం వహిస్తున్న స్పీకర్‌ ఉన్నారు. ఆ సభ సందర్భంలో వర్షం కురుస్తోంది. అయితే అది మామూలు వర్షం కాదు. ప్రశ్నల వర్షం. అప్పటికే ఆర్డర్‌, ఆర్డర్‌, సప్లిమెంటరీస్‌...అని స్పీకర్‌ అన్నారు. అయ్యా గవర్నరుగారొచ్చి పోయారు. మీరొచ్చారు. 80 మంది చట్టసభల ప్రతినిధులు వచ్చారు. ఇన్ని రోజుల నుంచి మా ప్రాంతంలోని సంపదను మేం ముట్టుకోలేదు. అవి ముట్టుకుంటే పాపం అని, అది దైవ సంపద అని మా పెద్దలు చెప్పారు. మలేరియా వచ్చినా చనిపోయాం, నీళ్లు లేకున్నా మాడిపోయాం. కానీ ఇపుడు ఆ గుట్టలను తవ్వితే గాలి కూడా పీల్చుకోలేమంటున్నారు. దాన్ని ఆపుదల చేస్తారా? చెప్పమని అడిగారు.

దీనికి సమాధానం చెప్పమని స్పీకర్‌ కలెక్టర్‌ను అడిగాడు. ''ఇందుకు సంబంధించి జిందాల్‌ కంపెనీతో ఒప్పందాలు జరిగాయి. బాక్సైట్‌ తవ్వకాలకు ఒకరకంగా అనుమతి లభించింది. కానీ అటవీశాఖ అనుమతి కోసం తవ్వకాలు ఎదురుచేస్తున్నాయని'' కలెక్టర్‌ చెప్పాడు.

బాక్సైట్‌ తవ్వకాలు తవ్వితే కాలుష్యం ఏర్పడుతుందంటున్నారు. ఆ కాలుష్యాన్ని మీరు నిలుపుదల చేస్తారా? అని ఒక గిరిజనుడు అడిగాడు. అక్కడున్న సంబంధిత కాలుష్య నియంత్రణాధికారిని సమాధానం చెప్పమన్నారు. అటవీశాఖ అనుమతి లభించాక ఆ కాలుష్యం గురించి అధ్యయనం చేస్తామన్నారు. ఈ విధంగా ప్రజలను భయం ఆవరించి ఉన్నది. బైటకు రాగానే విలేకరులు ప్రశ్నలతో మా వెంటపడ్డారు.ఇక్కడ సమస్యలు అధ్యయనం చేయటాని కొచ్చామని చెప్పాను. ఈ అధ్యయనం చేసి మార్కెట్‌ వాళ్లకు రోడ్డు సాఫీ చేసి రెడ్‌ కార్పెట్‌ పరచేందుకు వచ్చారా అని విలేకరులు ప్రశ్నించారు. ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని గిరిజనుల సమస్యను ప్రజల సమస్యగా మార్చటానికై ప్రజా ఉద్యమాలకు నాంది పలికేందుకే వచ్చానన్నాను. ఇవాళ నా ముందున్న ప్రశ్న ఏమిటంటే పాలకులు చేస్తున్న పని మార్కెట్‌ వైపా? ప్రజలవైపా? ప్రభుత్వాలు నెలకొల్పుతున్న పరిశ్రమలు వాటినుంచి వెలువడే కాలుష్యం పర్యావరణాన్ని కాటేస్తుంది కదా. స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నామన్న ఆందోళన నన్ను వెంటాడింది. ఇవన్నీ చూస్తుంటే మన పాలకుల అడుగులు ప్రజల ఆరోగ్యం వైపా? మార్కెట్‌ లాభాల వైపా? అన్న ఆలోచనలతో నాబుర్ర వేడెక్కింది. ఈ సందర్భంలో ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల జీవించే హక్కు అయిన బతుకువైపా? 'అభివృద్ధి' వైపా? అని నన్ను నా అంతరాత్మ అడిగింది. ప్రజలు జీవించే హక్కు కాపాడటమే నాకు ముఖ్యం, ఆ తరువాతే అభివృద్ధి అని నాలో నేను అనుకున్నాను. ఇదే నా అరుకులోయ డిక్లరేషన్‌.

-చుక్కా రామయ్య
(prajasakti, 28-1-2012)
(రచయిత ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి సభ్యులు)

Friday, January 27, 2012

అసమానతలపై ఓ ఆసక్తికర అధ్యయనం


దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల అమలు ఆరంభమై రెండు దశాబ్దాలు గడిచాయి. జిడిపి వృద్ధిరేటు అంత పెరిగిపోయింది, ఇంత పెరిగిపోయింది అన్న మాటలే ఇప్పటివరకు వినిపిస్తున్నాయి. అభివృద్ధి రేటు పెరిగిందన్న దానిలో కొంత నిజం లేకపోలేదు. అయితే ఇలా చెప్పేవారు ఆ అభివృద్ధి ఫలితాలు ఎవరికి దక్కాయన్నదాన్ని మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ అసలు వాస్తవాల్ని వెల్లడించే సమాచారం, అధ్యయనాలు అనేకం వెలువడుతూనే ఉన్నాయి. పలు అంశాలు యథాలాపంగా కూడ వెల్లడవుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులు మొదటి స్థానాలలో నిలబడటం, అలాంటి వారి సంఖ్య ఏడాదికేడాదికి పెరగడం తెలుస్తూనే ఉంది. మరో వైపున దేశంలో పేదరికం గురించి, పౌష్టికాహారలోపం గురించి అనేక వివరాలు వస్తున్నాయి. ఇటీవల పేదరిక రేఖపై ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కొద్దిరోజుల క్రితమే ఓ స్వచ్ఛంద సంస్థ తన అధ్యయనంలో నేటికీ దేశంలో 42 శాతం మంది బాలలు పౌష్టికాహారలోపానికి గురవుతున్నారని స్పష్టం చేసింది. ఆ అధ్యయన నివేదికను దేశంలో సరళీకృత ఆర్థిక విధానాల అమలుకు మూలపురుషుడయిన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విడుదల చేస్తూ ఈ పరిస్థితి పట్ల తాను సిగ్గుపడుతున్నానని చెప్పడం సంచలనాత్మకం అయింది. అయినా ఇలాంటి దుర్భర పరిస్థితికి కారణం ఏ విధానాలు అన్న విషయం జోలికి ఆయన పోలేదు.

అసమానతల తీవ్రతను వెల్లడించే మరొక నివేదిక తాజాగా వెల్లడయింది. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చి (ఎన్‌సిఏఇర్‌), సెంటర్‌ ఫర్‌ మాక్రో కన్జ్యూమర్‌ రీసెర్చి (సిఎంసిఆర్‌) ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. అయితే ఈ అధ్యయనం అసలు ఉద్దేశం దేశంలో అసమానతలను పరిశీలించడం కాదు. ఇప్పటివరకు మొత్తం ఆదాయం ఎంత? దానికనుగుణంగా వినియోగ, విలాస వస్తువుల తయారీని ఎంత పెంచవచ్చు అనే అంచనాలు స్థూలంగా వెలువడుతున్నాయి. దానికి భిన్నంగా ప్రస్తుతం ప్రజల ఆదాయాల పరిస్థితి తరగతుల వారీగా ఏమిటి, వారి వారి ఆదాయ స్థాయిని బట్టి వినియోగ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి, ఎవరికి ఏ వస్తువులను విక్రయించవచ్చు- ఇలాంటి విషయాలను కార్పొరేట్‌ రంగానికి వాస్తవానికి దగ్గరగా విశదీకరించడం ఈ అధ్యయనం లక్ష్యం. కార్పొరేట్‌ అవసరాలకోసమే అయినా వాస్తవ పరిస్థితిని ఈ అధ్యయనం చక్కగా వ్యక్తం చేస్తున్నది. అత్యున్నత ఆదాయ వర్గాల వినియోగం ఏ విధంగా ఉంటున్నది, ఎలా మారబోతుంది, అంత తక్కువ, మధ్యస్థ, మొత్తంగా దిగువ తరగతుల వారి వినియోగం ఎలా ఉంటుంది- ఇలాంటి అంశాలను ఇది వివరిస్తుంది.

మొత్తం కుటుంబాలను 20 శాతం చొప్పున ఐదు విభాగాలుగా ఈ అధ్యయనం విభజించింది. ఒక్కొక్క విభాగం వాటా మొత్తం ఆదాయంలో ఎంత, మొత్తం వ్యయంలో ఎంత, మిగులులో ఎంత- ఇలా పలు అంశాలను పరిశీలించింది. ఈ అధ్యయనం ప్రకారం అందరికన్నా దిగువన 20 శాతం తరగతి ఆదాయం మొత్తం ఆదాయంలో 6 శాతంగాను, వ్యయంలో 9 శాతంగాను ఉంది. తగులే తప్ప మిగులనేది వీరికి లేదు. అందరికన్నా ఎగువ 20 శాతం తరగతి ఆదాయం మొత్తం ఆదాయంలో 51 శాతంగాను, వ్యయంలో 40 శాతం గాను, మిగులులో 55 శాతంగాను ఉంది. అతి సంపన్న తరగతి మొత్తం ఆదాయంలో సగానికిపైగానే పొందుతుండగా, అతి పేద తరగతి ఆదాయం కేవలం 6 శాతం మాత్రమే. పైగా మనం ఇక్కడ చెప్పుకుంటున్న అతి సంపన్న ఆదాయ తరగతిలో అంబానీలు, టాటాలు, బిర్లాలు లాంటి వారంతా ఉంటారు. అలాంటి తరగతి సగటు ఆదాయం పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, అతి పేద తరగతి సగటు ఆదాయం కన్నా ఎనిమిది రెట్లు అధికంగా ఉంది.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఆదాయ అసమానతలను కూడ ఈ అధ్యయనం బేరీజు వేసింది. ఉదాహరణకు అతి సంపన్న 20 శాతం తరగతికి పట్టణ ప్రాంతాలలో 100 రూపాయల ఆదాయం వస్తున్నదనుకుంటే, అతి సంపన్న 20 శాతం తరగతికి గ్రామీణ ప్రాంతాలలో 51 రూపాయలు మాత్రమే ఆదాయం లభిస్తున్నది. మధ్య 20 శాతం వారికి సైతం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆదాయాలలో అసమానత తీవ్రంగానే ఉంది. మధ్య 20 శాతం మందికి పట్టణ ప్రాంతాలలో 30 రూపాయలు ఆదాయం లభిస్తున్నదనుకుంటే, గ్రామీణ ప్రాంతాలలో 15 శాతం మాత్రమే లభిస్తున్నది. నిరుపేద తరగతిలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆదాయ అసమానతలు నామమాత్రమే. పట్టణ ప్రాంతాలలో 11 రూపాయలు లభిస్తే, గ్రామీణ ప్రాంతాలలో 7 రూపాయలు లభిస్తున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య రోడ్లు, ఇతర రవాణా కమ్యూనికేషన్‌ సదుపాయాలు అభివృద్ధి చెందటంతో దేశవ్యాపితంగా వినియోగవస్తువులకు గిరాకీ వారి వారి ఆదాయ స్థాయిలను బట్టి అధికంగానే ఉందని కూడ ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అతి సంపన్న 20 శాతం తరగతి ఆదాయం మొత్తం ఆదాయంలో 51 శాతం ఉంటే, అది 1993-94లో 37 శాతమే. ఈ వాటా 2014-15 నాటికి 59 శాతానికి పెరుగుతుందని అంచనా. అంటే అతి సంపన్నుల ఆదాయాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో స్పష్టంగా అవగతమవుతున్నది. ఇదే సంస్థ మరొక విధంగా కూడ అతి సంపన్నుల ఆదాయాన్ని పరిశీలించింది. అతి సంపన్నుల్లో ఒక శాతం వారి ఆదాయం ఎంత ఉంటుందనేది అంచనా వేసింది. నేడు అతి సంపన్న ఒక శాతం జాబితాలో చేరాలంటే ఏ కుటుంబానికైనా రు.12.5 లక్షల వార్షికాదాయం ఉండాలి. ప్రపంచ ప్రమాణాలతో పోల్చుకుంటే ఇది ఓ రకంగా తక్కువే. అమెరికాలో ఒక శాతం అత్యున్నత ఆదాయ తరగతి కుటుంబానికి 5 నుండి 7 లక్షల డాలర్లు లభించాలి. కనిష్టంగా 5 లక్షల డాలర్లు తీసుకున్నా రూపాయల్లో అది రు.2.6 కోట్లు అవుతుంది. అంటే భారత్‌లో అతి సంపన్న ఒక శాతంలోని కుటుంబం సగటు ఆదాయం కన్నా ఇది 20 రెట్లు ఎక్కువ. కొనుగోలు శక్తి సమానీకరణతో చూసుకున్నప్పటికీ 10 రెట్లు అధికంగా ఉంటుంది.

అమెరికాతో పోలిక సంగతి ఎలా ఉన్నప్పటికీ అతి సంపన్న తరగతి వాటా వినియోగంలోనూ అధికంగానే 40 శాతంగా ఉంది. అదే సమయంలో మిగులు కూడ ఎక్కువగా ఉండటం వల్ల పొదుపు, మదుపులో కూడ వీరి వాటా అధికంగా 76 శాతంగా ఉంది. ఇదే సమయంలో మధ్య తరగతి వారి వినియోగం వాటా వారి ఆదాయంతో పోల్చుకున్నపుడు అధికంగానే 17 శాతంగా ఉంది. మిగులులో మధ్యతరగతి వారి వాటా 7 శాతమే. అందరికన్నా దిగువ తరగతి వారికి ఆదాయం అతి తక్కువ కావడంతో వినియోగంలో వారి వాటా 9 శాతమే. మిగులు అనేదే వారి వద్ద ఉండదు.

ఉన్నతశ్రేణివారు తమ మొత్తం వ్యయంలో 40 శాతాన్ని ఆహారంపై ఖర్చు పెడుతున్నారు. ఇదే మధ్యతరగతి వారు 42.5 శాతం వ్యయాన్ని ఆహారంపై పెడుతున్నారు. మధ్యతరగతికి ఎగబాకాలనుకునే దిగువ మధ్య తరగతి ఆహారంపై 47.5 శాతం వెచ్చిస్తున్నది. అందరికన్నా దిగువ తరగతి వారు తమ మొత్తం వ్యయంలో 57.3 శాతాన్ని ఆహారంపైనే వెచ్చిస్తున్నారు. అతి సంపన్న తరగతి వారు గృహ సదుపాయంపై పెద్దగా వెచ్చించడం లేదు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు మాత్రమే వరుసగా 4.7 శాతం, 5.2 శాతాన్ని వెచ్చిస్తున్నారు. అతి దిగువ తరగతి వారు సైతం గృహసదుపాయంపై 4.2 శాతం ఖర్చుపెడుతున్నారు. అతి సంపన్నులకు ఇప్పటికే అభిరుచులకు తగిన గృహాలు ఉంటాయి కాబట్టి వారు దానికి కొత్తగా ప్రాధాన్యతనివ్వడం లేదు.

అతి సంపన్న, మధ్య, దిగువ మధ్య తరగతుల వారు మొత్తంగా అధిక ప్రాధాన్యతనిచ్చే అంశం ఒకటుంది. అది విద్య. అతి సంపన్న తరగతి 8.8 శాతాన్ని, మధ్య తరగతి 9.2 శాతాన్ని, దిగువ మధ్య తరగతి 8.1 శాతాన్ని విద్యపై ఖర్చు చేస్తున్నాయి. నిరుపేద తరగతి వారు తమ వ్యయంలో 5.7 శాతాన్ని మాత్రమే విద్యపై పెట్టగలుగుతున్నారు. ఇంటి యజమాని విద్యాస్థాయి కూడ విద్యపై పెట్టే ఖర్చుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇంటి యజమాని ప్రాథమిక విద్యాస్థాయి మాత్రమే కలిగిన వాడయితే 22 శాతం ప్రభావం, డిగ్రీ అంతకు పైన చదువుకున్నవారయితే 264 శాతం ప్రభావం ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంటున్నది. రవాణా సదుపాయాలకు ఉన్నత, మధ్య, దిగువ మధ్య తరగతి ముగ్గురూ దాదాపు సమానంగానే తమ వ్యయంలో కేటాయిస్తున్నారు. సంపన్న వర్గాలు 14.7 శాతాన్ని, మధ్య తరగతి 13.5 శాతాన్ని, దిగువ మధ్య తరగతి 11.6 శాతాన్ని వెచ్చిస్తున్నాయి.

ఈ విధంగా ఎన్‌సిఎఇఆర్‌, సిఎంసిఆర్‌ల అధ్యయనం వారెందుకు చేసినప్పటికీ ఆదాయ అంతరాలు గత రెండు దశాబ్దాల కాలంలో ఎంతగా పెరిగిందీ, ఇటీవల కాలంలో వాటి తీవ్రత ఎంత వేగం పుంజుకున్నదీ కళ్ళకు కట్టినట్టు చూపుతున్నది. సరళీకరణ సమర్థకులు ఈ అంశాన్ని ఎంతవరకు గుర్తిస్తారో చూడాలి. 
-గుడిపూడి విజయరావు
  (Prajasakti, 27/1/2012)