యానాంలోని
రీజెన్సీ సిరామిక్స్ కంపెనీలో గత ఆరు మాసాల నుంచి ఆందోళన సాగుతున్నది. శుక్రవారం
కార్మికులపై తుపాకి తూటాలు పేల్చారు. యానాం రక్తసిక్తమైంది. విచ్చలవిడి కాల్పుల్లో
9 మంది కార్మికులు
గాయపడ్డారు. వీరిలో సాధనాల దుర్గాప్రసాద్, కమిడి శ్రీనివాస్, ఎం.శ్రీనివాసరావు, బొండా సూర్యప్రకాశ్, గెడ్డం జార్జి విక్టర్‌బాబు, ఎం.సూర్యనారాయణ, బడుగు గోపాలకృష్ణ, ఆర్.సూర్యప్రకాశ్, గెడ్డం
రాధాకృష్ణలున్నారు.దీనికి ముందు యూనియన్ నాయకులు మచ్చా మురళీమోహన్‌ను గుండెలపై
లాఠీలతో పొడిచి చంపారు. కార్మికవర్గ చరిత్రలో ఇదొక దుర్మార్గ సంఘటన మాయనిమచ్చ.
బ్రిటిష్ కాలాన్ని తలపించే విధంగా పోలీసులు,యాజమాన్యం వ్యవహరించాయి. ప్రపంచీకరణ విధానాల్లో
భాగంగా కార్మిక సంఘాలు లేకుండా యధేేచ్చగా దోపిడీ చేయడానికి ప్రభుత్వం చట్టాలను
తుంగలోకి తొక్కి కార్మిక వర్గాన్ని అణచడానికి పూనుకోవడమే ఇటువంటి సంఘటనకు దారితీసింది.
ప్రపంచీకరణ విధానాలు అమలుచేయడం వల్ల ఉద్భవించిన దుష్పరిణామం ఇది. ఇటీవల కాలంలో
దేశంలోను, రాష్ట్రంలోను
అనేక చోట్ల కార్మికుల అసంతృప్తి అనేక రూపాల్లో వెళ్ళగక్కుతున్నారు. ఢిల్లీ
ప్రక్కనే గుర్‌గావ్ వద్ద మారుతీ సుజుకీ కంపెనీలో మూడు నెలలు సాగిన ఆందోళన మనకు
తెలుసు, శ్రీకాకుళం
రెడ్డిల్యాబ్స్ పోరాటం మన కళ్ళముందే సాగింది. వీరి పోరాటాలకు చుట్టూ వున్న వేలాది
మంది కార్మికులు సమ్మె చేసి మద్ధతుపలికారు. యూనియన్‌లో ఉన్నా, లేకపోయినా
సెప్టెంబర్ 7 దేశవ్యాప్త
సమ్మెలో కార్మికులు పాల్గొనడం కార్మికుల తీవ్ర అసంతృప్తికి తార్కాణం.
స్ధానిక
కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ ఆల్లాడి కృష్ణారావు యాజమాన్యానికి పూర్తి అండగావున్నాడు.
యూనియన్ ఏర్పాటు చేశారనే కక్షతో యాజమాన్యం 11 మందిని పాండిచ్చేరికి బదిలీచేసింది. 2010 జనవరిలో
కార్మికులు ఏర్పాటు చేసుకున్న యూనియన్ రిజిస్ట్రేషన్‌ను యాజమాన్యం రద్దు చేసింది.
యూనియన్ నాయకులను సస్పెండ్ చేసింది. కార్మికులు జీతాలు పెంచాలని, తొలగించిన
కార్మికులను పనిలోకి తీసుకోవాలని, యూనియన్‌ను గుర్తించాలని ఆందోళన చేస్తున్నారు. కార్మికుల
పోరాటాన్ని అణచడానికి యాజమాన్యం పోటీ కార్మికులను తెచ్చింది. పోటీ కార్మికులను
అడ్డుకున్నందుకు సుమారు 100 మందిని అరెస్టు
చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టి చితగ్గొట్టారు. ఈ సంఘటన కారణాలను లోతుగా
పరిశీలించాలి.
ప్రపంచీకరణ
విధానాల్లో భాగంగా సెజ్‌ల నుంచి సాధారణ పరిశ్రమల వరకు కార్మికులు యూనియన్లను
ఏర్పాటు చేయడానికి అనుమతించడంలేదు. ట్రేడ్ యూనియన్ చట్టం 1926 ప్రకారం ఏడుగురు
కంటే అదనంగా కార్మికులున్న చోట సంఘాన్ని పెట్టుకోవచ్చు. బయట నుంచి కూడా
నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని స్పష్టంగా వుంది. కాని కార్మికులు యూనియన్‌ను ఏర్పాటు
చేసుకున్న వెంటనే యాజమాన్యాలు కార్మిక నాయకులను పనుల నుంచి తొలగిస్తున్నారు.
కోర్టులకు వెళ్ళి సంఘాల రిజిస్ట్రేషన్స్‌ను రద్దు చేయిస్తున్నారు. కార్మికులు
ఆందోళన చేయకుండా కోర్టు నుంచి ఆంక్షలు విధిస్తున్నారు. లేబర్ డిపార్ట్‌మెంట్
యాజమాన్యాల కొమ్ముకాస్తున్నాయి. ప్రభుత్వం యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నది.
యానాంలో జరిగిందిదే. 2010 జనవరిలో కార్మికులు
ఏర్పాటు చేసుకున్న యూనియన్‌ను యాజమాన్యం గుర్తించలేదు. సిరామిక్ టైల్స్‌లో
దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రీజెన్సీ యాజమాన్యం బాగా లాభాలు గడిస్తున్నది.
కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తున్నది. వీరిలో కూడా కేవలం 880 మంది శాశ్వత
ఉద్యోగులు కాగా, 1200 మందికి పైగా
అతితక్కువ జీతాలతో కాంట్రాక్టు కార్మికులుగానే పని చేయిస్తున్నారు. కార్మికుల్లో
సుమారు 60 శాతం మంది
దళితులే. 20 సంవత్సరాల నుంచి
పనిచేసే కార్మికులకు కూడా నెలకు 4 వేలు కూడా జీతం చెల్లించటంలేదు. జీతం పెంచమని అడిగినందుకు
యాజమాన్యం కక్షకట్టింది. ఆందోళన చేసే కార్మికులు 200 మీటర్లు దూరంలో వుండాలని కోర్టు నుంచి ఆంక్షలు
విధించింది. విధి లేక కార్మికులు వీధుల్లోపడ్డారు. ఆరుమాసాల నుంచి ఆందోళన
చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోలేదు. లేబర్ డిపార్ట్‌మెంట్ గుడ్లప్పగించి
చూస్తున్నది. ఫ్యాక్టరీ అధికారుల తనిఖీలు ఆగిపోయాయి. న్యాయస్థానాలు కార్మికుల
పోరాటాల నడ్డివిరుస్తున్నాయి. అసంఘటిత కార్మికుల పరిస్థితి మరింత అధ్వానంగా
తయారయ్యింది. గత్యంతరం లేక తిరుగుబాట్లు తథ్యమని భావిస్తున్నారు. కనీస వేతనాలు
అమలు చేయకపోయినా, పి.ఎఫ్ లాంటి
చట్టాలు అమలుచేయక పోయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. శుక్రవారం యూనియన్
నాయకత్వంలో దొంగ కార్మికులను అడ్డుకున్నారు. పోలీస్ బలగాలు కార్మికులను బలవంతంగా
అరెస్టు చేశాయి.. అరెస్టు అయిన యూనియన్ నాయకులు మురళీమోహన్‌ను కొట్టిచంపడంతో
కార్మికుల ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. వారిని అదుపుచేసేవారే లేరు. కంపెనీ
యాజమాన్యంపై దాడిజరిగింది. పరిశ్రమ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గాయాలపాలయ్యాడు.
తరువాత ఆసుపత్రిలో మరణించాడు. దీనికి యాజమాన్యమే బాధ్యత వహించాలి.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు
యానాం ఘటననుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రపంచీకరణ విధానాలపేరుతో కార్మిక
వర్గాన్ని నిస్సహాయులుగా చేయాలని పూనుకోవడం పొరపాటు. కార్మిక వర్గానికి యూనియన్లు
లేకుండా ''డియానినైజేషన్'' చేయాలనే విధానం
శుద్ధ తప్పు. కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, బోనస్, శెలవు దినాలు, పి.ఎఫ్ వగైరా చట్టాలను అమలుచేయించే బాధ్యత
ప్రభుత్వాలదే. కార్మికచట్టాలు అమలుచేయించే కార్మిక శాఖ, ఫ్యాక్టరీ శాఖలను
నిర్వీర్యం చేసే విధానాలు విరమించుకోవాలి. లేకుంటే ఇటువంటి పరిణామాలు పునరావృతం
కాక మానవు.
-సి.హెచ్.నరసింగరావు
(రచయిత సి.పి.ఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)
No comments:
Post a Comment