Tuesday, January 24, 2012

ఈ ప్రమాద ఘంటికలైనా వినిపిస్తాయా?


ఒక సంవత్సరం మందగమనం అనంతరం ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోనున్నదని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం, నయా ఉదారవాద విధానాలను బలపరిచేవారు ఊదరగొడుతున్నారు. అయితే ప్రపంచ బ్యాంక్‌ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఒక హెచ్చరిక చేసింది. 2008-09లో సంభవించిన దానికంటే కూడా తీవ్ర స్థాయిలో సంక్షోభం తలెత్తనున్ననున్నదని, ఇందుకోసం వర్థమాన దేశాలు, ముఖ్యంగా భారతదేశం సంసిద్ధంగా ఉండాలని అది హెచ్చరించింది.
''ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక ప్రాంతమైన యూరోపియన్‌ యూనియన్‌ మాంద్యం ఎదుర్కొంటున్న సమయంలోనే గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థ చోదక శక్తి అయిన వర్ధమాన దేశాలు మందగమనంలో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకోవాలి'' అని ప్రపంచ బ్యాంక్‌ స్థూల ఆర్థిక విభాగం అధినేత పేర్కొన్నారు. ప్రపంచబ్యాంక్‌ 2011 జూన్‌ నెలలో వేసిన అంచనాల కంటే వాస్తవ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 2011లో వ్యక్తం చేసిన భయాందోళనలు ఇప్పటికే నిజమయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2012లో 2.5 శాతం, 2013లో 3.1 శాతం మాత్రమే వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ రెండు సంవత్సరాల్లో వృద్ధి రేటు 3.6 శాతం ఉండగలదని తొలుత అంచనా వేసింది. యూరో జోన్‌ లోని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ 2012లో మరింత కుంచించుకుపోయే అవకాశం లేదని, అయితే యూరప్‌ మొత్తం ప్రాంతం మరింత పతనం చవిచూడగలదని అంచనా వేసింది. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాల్లో గరిష్టంగా 2.1 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది.
మరింతగా సరళీకరణ విధానాలను అమలు చేయడం వల్ల విదేశాల నుండి నిధులు ప్రవాహంలా వస్తాయని, ఫలితంగా వృద్ధి రేటు పెరగగలదనే ఆశలు అడియాసలేనని ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరికతో తేటతెల్లమైంది. కొనసాగుతున్న మాంద్యానికి అడ్డుకట్ట వేసేందుకు ధనిక దేశాల వద్ద తక్షణం ఫలితమిచ్చే ఆర్థిక, ద్రవ్య చిట్కాలేమీ లేవని ప్రపంచ బ్యాంక్‌ చెప్పింది.
అయినప్పటికీ యుపిఎ-2 ప్రభుత్వం కీలకమైన ఆర్థిక సంస్కరణల చట్టాలను పార్లమెంటు బడ్జెట్‌ సమావేశంలో తీసుకొచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. వామపక్షాలు ఈ చట్టాలనే గత ఏడు సంవత్సరాలుగా అడ్డుకుంటున్నాయి. ఆర్థిక రంగం తలుపులు బార్లా తెరిచే విధానాన్ని అడ్డుకోవడం వల్ల భారత్‌ ప్రపంచ మాంద్యం ప్రభావాన్ని నివారించగలిగిందని మన అనుభవం తెలియజేస్తోంది. ప్రపంచ బ్యాంక్‌ తాజాగా జారీ చేసిన హెచ్చరికను సైతం ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది.
మన బీమా రంగంలో విదేశీ నిధుల ప్రవేశంపై పరిమితిని పెంచుతూ చట్టం చేయడంతోపాటు భారతదేశంలో ప్రయివేటు బ్యాంకులను స్వాధీనం చేసుకునేందుకు విదేశీ బ్యాంకులను అనుమతిస్తూ బ్యాంకింగ్‌ సంస్కరణలు ప్రవేశపెట్టడం, పెన్షన్‌ నిధులను ప్రయివేటీకరించడం, రిటైల్‌ వర్తక రంగాన్ని ఎఫ్‌డిఐలకు తెరవడానికి ప్రభుత్వం సంసిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరగనున్న ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, భారీ సంఖ్యలో ప్రజల జీవనోపాధిపై మరింతగా దాడి జరుగుతుందని ఈ కాలమ్స్‌లో ఇంతకుముందు హెచ్చరించాం. వీటికి ప్రభుత్వం తగు సమాధానం చెప్పలేకపోయింది,
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకే రిటైల్‌ వర్తకాన్ని ఎఫ్‌డిఐలకు బార్లా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు భారత్‌లో సూపర్‌ లాభాలు పొందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ పెట్టుబడుల ప్రవాహం ఆర్థిక వ్యవస్థలో ఆత్మవిశ్వాసం కలగజేసి 'అంతా బాగానే ఉంది' అనే అభిప్రాయం కలుగజేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సెన్సెక్స్‌ పెరిగేందుకు అనుమతించి అతి కొద్ది మందికి మాత్రమే భారత్‌ వెలిగిపోయేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా వుంది. రిటైల్‌ వర్తకం లేదా భారత ప్రజలపై పడే ప్రభావం గురించి ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టడంలేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపైనే దాని దృష్టంతా. ప్రపంచ బ్యాంక్‌ అంచనాల ప్రకారం ఇది జరిగే అవకాశం చాలా అరుదు. దేశానికి ఇంధన భద్రత సృష్టించే పేరుతో ఎన్రాన్‌ సంస్థకు పెద్ద ఎత్తున ఇచ్చిన రాయితీలను సమర్థించుకోవడానికి ఆనాడు ప్రభుత్వం చేసిన వాదనల్లానే ఇవీ ఉన్నాయి. ఎన్రాన్‌ భాగోతం అందరికీ తెలిసిందే. భారతదేశంలో ఎన్రాన్‌ పెట్టుబడులు ఇటువంటి అంతా బాగుందనే అభిప్రాయం కలిగించగలవని భావించారు. నికర ఫలితం మాత్రం ఘోర ఉత్పాతమే. అదేవిధంగా, రిటైల్‌ వర్తకంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం రైతులు, వినియోగదారుల ప్రయోజనాల కోసమేని పేర్కొనడం ప్రజలను మభ్యపుచ్చే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు.
వర్థమాన దేశాల్లో చైనాకు ఒక్కదానికే మాంద్యం ప్రభావాన్ని తట్టుకునే సామార్ధ్యం ఉందని, కొత్తగా ఏర్పడిన ఆర్థిక మాంద్యాన్ని నివారించగల విధానాలను అమలు చేయగలదని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. అయితే 2008తో పోలిస్తే చైనా సామర్ధ్యం కూడా తగ్గవచ్చునని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయపడింది.
నయా ఉదారవాద అజెండా ద్వారా ప్రపంచ మాంద్యం ప్రభావాన్ని భారతదేశం పారదోలలేదు. సంపన్నులకు భారీ మొత్తంలో పన్నుల్లో రాయితీలు కల్పించడానికిబదులు ఈ మొత్తాలను సామాజిక, ఆర్థిక మౌలిక వనరులను పెంపొందించుకునేందుకు ఉపయోగించాలని మేము పదేపదే చెబుతూ వస్తున్నాము. ఇందువల్ల పెద్దమొత్తంలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ఫలితంగా దేశీయంగా డిమాండ్‌ పెరిగి ఆరోగ్యవంతమైన ఆర్థికాభివృద్ధి రేటు సాధించే అవకాశం ఉంది.
1981 నుండి 22 సంవత్సరాలపాటు మలేసియా ప్రధానిగా ఉన్న మహతీర్‌ మహమ్మద్‌ ( దక్షిణాసియాలో సంస్కరణలు అమలు జరుగుతున్న సమయం) మలేసియా సామెతను చెబుతుండేవారు (అన్ని నాగరికతల్లో ఇది కనిపిస్తుంది). ఏదైనా ప్రయ త్నంలో విఫలమైతే, మళ్లీ మొదటికి వెళ్లి ప్రయత్నించాలి. గ్లోబల్‌ పెట్టుబడిదారీ వ్యవస్థ దీని నుండి పాఠాలు నేర్చుకునే స్థితిలో లేదు. దీనికి బదులుగా నయా ఉదారవాద విధానాలు పొదుపు చర్యలను ప్రబోధిస్తుంటాయి. గతంలో చాలా సార్లు ప్రస్తావించినట్లుగా మున్ముందు పరిస్థితి మరింత జఠిలమవుతుంది. సంక్షోభం మరింతగా పెరుగుతుంది.
''మనం ఏ విధంగా చరిత్రను తప్పుగా అన్వయించుకుని, జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ బోధలను వక్రీకరించాం?'' అని న్యూయార్క్‌ రివ్యూ ఆఫ్‌ బుక్స్‌ తాజా సమీక్ష ప్రశ్నించింది. 1930 మహా మాంద్యం తరువాత పరిస్థితులను పునశ్చరణ చేసుకుందాం. ప్రభుత్వం క్రియాశీలకంగా జోక్యం చేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తి స్థాయి ఉపాధి అవకాశాలను సాధించేలా చూడవచ్చునని కీన్స్‌్‌ చెప్పాడు. పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించేందుకు, సోషలిజం అనివార్యంగా చోటుచేసుకోకుండా నివారించేందుకు ఇదొక్కటే మార్గమని ఆయన ప్రబోధించారు.
పైన పేర్కొన్న సూచనలను ఆమోదించడానికి బదులు మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం నయా ఉదారవాద అజెండాను చురుకుగా అమలు చేస్తోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, మెజారిటీ ప్రజలకు అత్యంత ప్రమాదకరం. గోడమీద రాసిన రాతలను సైతం విస్మరించడం పెట్టుబడిదారీ వ్యవస్థ నైజం. పెట్టుబడిదారీ వ్యవస్థగురించి కారల్‌ మార్క్స్‌ ఒక సందర్బంలో ఇలా పేర్కొన్నాడు.'' ఉత్పత్తి సాధనాలు, మారకాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ వాటితో గారడీచేసే సామర్థ్యం పెట్టుబడిదారీ వ్యవస్థకలిగి ఉంటుంది. అయితే గారడీవాడు తాను సృష్టించిన ప్రపంచాన్ని ఎక్కువ కాలం ఎలా నియంత్రించలేడో అలానే ఇది కూడా అంతే.'' ఈ సంక్షోభం వ్యవస్థాగతమైనది. ఇది ఎవరో కొందరి దురాశ వల్లనో లేదా ధనదాహం వల్లనో తలెత్తింది కాదు. ఈ వ్యవస్థను కూలదోయడం వల్ల మాత్రమే మానవాళికి నిజమైన విముక్తి లభిస్తుంది.
నయా ఉదారవాద విధానాలను మార్చుకునేలా, అత్యంత అవసరమైన మౌలిక వనరులపై, విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలు సృష్టించడంపై భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా యుపిఎ ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడి పెంచడం అవసరం. ప్రజల జీవనోపాధి స్థాయిని మెరుగుపరచేందుకు ఇదొక్కటే మార్గం.
(జనవరి18,2012) 
Prajasakti, 23-1-2012

No comments:

Post a Comment