1991 లో
పి.వి.నరసింహారావు ప్రభుత్వము నూతన ఆర్థిక విధానాల పేరుతో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాలను ప్రవేశ
పెట్టింది. ఈ విధానాలనే నయా ఉదార వాడ ఆర్థిక విధానాలని అంటారు. ఈ విధానాల సారాంశం:
1.
విదేశీ పెట్టుబడులు, సరుకులు, సేవలు మన దేశం లోకి స్వేచ్ఛగా రావటానికి
అనుమతించాలి(ప్రపంచీకరణ)
2.
ఇందుకు వున్న అన్నీ
ఆంక్షలను తొలగించాలి(సరళీకరణ)
3.
ప్రభుత్వము ప్రజా సంక్షేమం
పై, వ్యవసాయం పై, మౌలిక వసతుల నిర్మాణం పై ఖర్చు చేయకూడదు.
ప్రభుత్వ రంగానికి రిజర్వు చేయబడిన రంగాలనుండి ప్రభుత్వము వైదొలగి ప్రయివేటు రంగానికి అప్పగించాలి. ప్రభుత్వ రంగ
సంస్థలను ప్రయివేటుపరం చేయాలి(ప్రయివేటీకరణ)
4.
ఆర్థిక వ్యవస్థని
విచ్చలవిడిగా లూటీ చేసేందుకు అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడిని దానితో మిలాఖత్ అయిన భారత పెట్టుబడిదారీ
వర్గాన్ని అనుమతించాలి.
పి.వి.నరసింహారావు ప్రభుత్వ హయాములో ఈ
విధానాల అమలు ప్రారంభం కాగా వాజపాయి ప్రభుత్వము మరింత వేగముగా కొనసాగించింది.
మన్మోహన్ సింగ్ యూపీ ఏ 1 ప్రభుత్వ హయాములో మద్దతిచ్చిన వామపక్షాల ఒత్తిడివలన వీటి
అమలు వేగం తగ్గింది. కానీ యు పి ఏ 2 ప్రభుత్వము వామపక్షాల మద్దతు అవసరం లేకుండా
ఏర్పడినందున ఈ విధానాల అమలు వేగం మళ్ళీ పెరిగింది.
రాజ్యసభలో బి జె పి నాయకుడు అరుణ్
జైట్లీ, 114.2.2014న “మోడినామిక్స్” అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఈ క్రింది
విధముగా చెప్పారు:
“బి జె పి పార్టీ సైద్ధాంతిక ఆలోచనలో
సహజ భాగం ఆర్థిక సంస్కరణల అమలు. కాబట్టే బి జె పి ప్రధానమంత్రిగా వాజపాయి, సంస్కరణల అమలును సులభముగా చేయగలిగారు. కానీ ఆర్థిక వ్యవస్థలో
నియంత్రణలుండాలనే సిద్ధాంతం వున్న
కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన మంత్రిగా వున్న పి.వి.నరసింహారావు కు ఈ నియంత్రణల
ధోరణిని అధిగమించి సంస్కరణలు ప్రారంభించటం చాలా కష్టమయిన పని”.
ఈ విధముగా బి జె పి
నాయకుడు అరుణ్ జైట్లీ, సంస్కరణలు ప్రారంభించటం అనే కష్ట
సాధ్యమయిన పనిని చేసినందుకు పి.వి.నరసింహారావును అభినందించారు. వాజపాయి ప్రభుత్వము
బి జె పి పార్టీ సహజ సిద్ధాంతమే సంస్కరణలకి(ప్రయివేటీకరణకి) అనుకూలం కాబట్టి
వాటిని తేలికగా అమలు చేయగలిగిందని అన్నారు. కాబట్టి కాంగ్రెస్ కన్నా బి జె పి
మరింత తేలికగా మరింత వేగముగా ఈ నయా ఉదార వాద ఆర్థిక విధానాలను అమలు చేయగలదని, అదే తమ గొప్ప అని బి జె పి నాయకులు స్పష్టముగా చెపుతున్నారు.
1991 నుండి కాంగ్రెస్, బి జె పి ఏ ప్రభుత్వమున్నా అమలు చేసిన
ఈ విధానాల వలన జరిగిందేమిటి? ఈ విధానాల ఫలితాలు
వినాశకరంగా వున్నాయి.
- విపరీతముగా పెరిగిన సంపద కేంద్రీకరణ- అక్రమముగా విదేశాలకు దేశ సంపద తరలింపు: ఈ విధానాల వలన సంపద కేంద్రీకరణ విపరీతముగా పెరిగింది. 2014 నాటికి మన దేశములో అత్యంత ధనికులుగా వున్న 70 మంది డాలర్ బిలియనీర్ల ( బిలియన్ డాలర్లు అంటే ప్రస్తుతం సుమారు ఋ.6300 కోట్లకు సమానము. కనీస సంపద ఇంత వున్న వ్యక్తిని డాలర్ బిలియనీర్ అంటారు) సంపద రు. 24,00,000 కోట్లు. ఇది మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25 శాతం!
·
నిధుల అక్రమ తరలింపు
1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ మన దేశము నుండి విదేశాలకు
అక్రమముగా తరలించబడిన సంపద రు. 20.92 లక్షల కోట్లు. ఇందులో 1947 నుండి 2009 వరకూ
తరలించబడింది 9.64 లక్షల కోట్లు కాగా
2008-10 మధ్య రెండు సంవత్సరాల కాలం లోనే రు. 11.28 లక్షల కోట్ల సంపద తరలించబడింది.
·
శ్రమశక్తి సృష్టించిన నికర
విలువలో వేతనాల వాటా తగ్గి లాభాల వాటా పెరిగింది(శ్రమ దోపిడి పెరుగుదల) సరుకుల తయారీ
రంగములో 1980 నుండి 2010 వరకూ శ్రమశక్తి ఉత్పాదకత 5 రెట్లు పెరిగింది. కానీ శ్రమశక్తి
సృష్టించిన నికర విలువలో వేతనాల వాటా 1981-82 లో 30 శాతం వుండగా 1992-93 నాటికి 19 శాతానికి, 2010-11 లో 12 శాతానికి పడి పోయింది. లాభాల వాటా 70 శాతం నుండి 88
శాతానికి పెరిగింది.
·
సహజ వనరుల లూటీ : బొగ్గు, ఇనుప ఖనిజం, స్పెక్ట్రమ్,
భూమి, సహజ వాయువు తదితర సహజ వనరులన్నింటి లూటీ జరిగింది. ఇందుకు సంబంధించిన కొన్ని
ఉదాహరణలు-2జి కుంభకోణం రు.1,76,000 కోట్లు; బొగ్గు గనుల కుంభ కోణం రు.1,86,000 కోట్లు; సహజ వాయువు (తూర్పు గోదావరి జిల్లాలో గ్యాస్ నిక్షేపాలు అంబానీకి
కట్టబెట్టి వారికి గ్యాస్ కు అతి ఎక్కువ రేటు చెల్లించటం) రు.1,00,000 కోట్లు ; గుజరాత్ లో మోడి ప్రభుత్వము ఆదానీలకు 6700
హెక్టార్ల భూమి అతి తక్కువ రేటుకు ఇచ్చినందున ప్రభుత్వానికి నష్టం రు.10,000
కోట్లు! కొద్ది సంవత్సరాల క్రితం వేసిన ఒక అంచనా ప్రకారం 1991 నుండి
జరిగిన ఇటువంటి కుంభకోణాల విలువ రు.73 లక్షల కోట్లు!
·
కార్పొరేట్సుకు, సంపన్నులకు ప్రపంచములోనే అతి తక్కువ పన్నులు:
స్థూల జాతీయ ఉత్పత్తి లో పన్నుల
నిష్పత్తి బ్రెజిల్ లో 24.5 శాతం, దక్షిణ ఆఫ్రికాలో 26.5
శాతం కాగా మన దేశములో 15 శాతమే వున్నది.
ఇందుకు కారణం కార్పొరేట్సుకు సంపన్నులకు వారి ఆదాయాలపై విధించే పన్ను
స్వల్పముగా వుండటమే. మొత్తం పన్నులలో
ఆదాయాలపై విధించే పన్ను అమెరికాలో 75 శాతం కాగా మన దేశములో 37.7 శాతమే.
·
కార్పొరేట్సుకు, సంపన్నులకు భారీ స్థాయిలో పన్ను రాయితీలు: కార్పొరేట్సు పై,
సంపన్నులపై వేసే పన్నులు ఇంత తక్కువ స్థాయిలో వున్నప్పటికి అందులో కూడా భారీ
రాయితీలిస్తున్నారు. 2008-09 నుండి
2012-13 వరకు సంపన్నులకు, కార్పొరేట్సుకు భారతప్రభుత్వము
ఇచ్చిన పన్ను మినహాయింపుల మొత్తం రు.23.84 లక్షల కోట్లు. ఇందులో 2012-13 లో ఇచ్చిన
మినహాయింపులు రు.5.74 లక్షల కోట్లు.
కాబట్టి
శ్రమ దోపిడి, సహజ వనరుల లూటీ, స్వల్ప పన్నులు, వాటిలో కూడా భారీ మినహాయింపులు
తదితర మార్గాల ద్వారా సంపద కేంద్రీకరణ, విదేశాలకు అక్రమముగా
సంపద తరలింపు జరుగుతున్నది.
·
విదేశాలకు పెట్టుబడుల
తరలింపు: ఇతర
దేశాల నుండి మన దేశానికి ఎఫ్ డి ఐ లు రావటమే
గాక ఈ విధానాల వలన మన దేశ బడా పెట్టుబడిదారులు తమపెట్టుబడులను విదేశాలకు
తరలిస్తున్నారు. 2008ఏప్రిల్ నుండి2014జనవరి వరకు విదేశాలనుండి మన దేశానికి రు. 16.47 లక్షల కోట్ల ఎఫ్ డి ఐ రాగా మన దేశము
నుండి విదేశాలకు తరలి వెళ్ళిన ఎఫ్ డి ఐ
రు. 6,30,000 కోట్లు.
·
వ్యవసాయ రంగం లో సంక్షోభం: ఈ
విధానాల వలన వ్యవసాయం సంక్షోభంలో
పడి 1997-2014 మధ్య కాలములో 2,75,000 మండి రైతులు ఆత్మ
హత్య చేసుకున్నారు. 1991-2011 మధ్య 1.5
కోట్ల మంది రైతులు వ్యవసాయం నుండి తప్పుకున్నారు.
·
పెరగని ఉద్యోగిత: 2004-05నుండి
2009-10 వరకు ఆర్థిక వ్యవస్థ మంచి ఊపులో సగటున సంవత్సరానికి 8 శాతం పెరిగినా ఈ
కాలం లో ఉద్యోగిత సంవత్సరానికి 0.8 శాతమే పెరిగింది. కానీ ఇదే కాలం లో జనాభా సగటున
1.5 శాతం పెరిగింది. రెగ్యులర్ ఉద్యోగాలు తగ్గి క్యాజువల్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తదితర స్వల్ప వేతనాల
ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి.
·
సబ్సిడీల కోత: ఒక వంక సంపన్నులకు
భారీ స్థాయిలో పన్నుల రాయితీలివ్వటంతో పాటు
సహజ వనరుల లూటీకి, శ్రమశక్తి దోపిడీకి అవకాశాలు కలిపిస్తూ మరో వంక
సామాన్యులకిస్తున్న సబ్సిడీలు రద్దు చేయటం జరుగుతున్నది. గత మూడు సంవత్సరాలలో
ఆహారం, ఎరువులపై రు.78000 కోట్ల సబ్సిడీకి కోతపెట్టారు.
·
ప్రభుత్వ రంగం అమ్మకం: 2009-10 నుండి
2012-13 వరకు ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం
ద్వారా ప్రభుత్వము రు.91,000 కోట్లు
సేకరించింది.(వామపక్షాల మద్దతుపై ఆధారపడినందున యూపీఏ 1 ప్రభుత్వము 2004-05 నుండి
2008-09 వరకు రు.9000 కోట్ల డిజిన్వేస్టుమెంటు మాత్రమే చేయగలిగింది)
·
ప్రపంచీకరణ పాలయినందున
ఒడిదుడుకులనెదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ : 1991
లో మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో విదేశీ వాణిజ్యం (ఎగుమతులు, దిగుమతులు కలిపి) వాటా 14 శాతమే కాగా ఇప్పుడది 50 శాతం అయింది. మన ఆర్థిక
వ్యవస్థ ప్రపంచీకరణకు ఇది నిదర్శనం. 2012-13 లో సరుకుల విదేశీ వాణిజ్యములో ఏర్పడిన
లోటు స్థూల జాతీయ ఉత్పత్తిలో 10 శాతం. సరళీకరణ విధానాలు విదేశీ ఫైనాన్సు
పెట్టుబడులు మన దేశం లోకి స్వేచ్ఛగా రావటానికి, పోవటానికి
అనుమతిస్తున్నందున అవి వెళ్ళేటప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు
లోనవుతున్నది.
·
విదేశీ పెట్టుబడులను సంతోష
పరచటమే ప్రభుత్వ విధానముగా మారింది: విదేశాలనుండి పెద్ద
ఎత్తున వస్తున్న ఫైనాన్సు పెట్టుబడులు అలిగి ఇక్కడినుండి వెళితే ఆర్థిక
వ్యవస్థ ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కాబట్టి విదేశీ ఫైనాన్సు పెట్టుబడులను
సంతోషముగా వుంచేందుకు వాటికి అధిక లాభాలు కలిగించటమే ప్రభుత్వము ప్రధాన
కార్యక్రమం అయింది.
·
పతనమవుతున్న ప్రజల ఆర్థిక
పరిస్థితి: ఈ విధానాల కారణముగా ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది.
Ø పట్టణ
దారిద్ర్య రేఖ కి దిగువన వున్న వారు (రోజుకి తలకి 2100 కేలరీల శక్తినిచ్చే కనీస
ఆహారం దొరకని వారు) పట్టణ జనాభాలో 1993-94
లో 57 శాతం వుండగా ఇది 2009-10 నాటికి 73 శాతానికి పెరిగింది.
Ø గ్రామీణ
దారిద్ర్య రేఖకి దిగువన వున్న వారు (రోజుకి తలకి 2200 కేలరీల శక్తినిచ్చే కనీస
ఆహారందొరకని వారు) గ్రామీణ జనాభాలో
1993-94 లో 58.5 శాతం వుండగా 2009-10 నాటికి 76 శాతం అయ్యారు.
Ø 5 సం. లోపు వయసు వున్న పిల్లలలో సగం మండి
పోషకాహారం లేక బరువు తక్కువగా వున్నారు. 60 శాతం మాహిళలు రక్త హీనతతో
బాధపడుతున్నారు.
Ø దేశములో
వున్న మొత్తం 33 కోట్ల కుటుంబాలలో 57 శాతానికి రక్షిత త్రాగు నీటి సౌకర్యం లేదు.
53 శాతానికి టాయిలేట్ సౌకర్యం లేదు. ఈనాటికీ 26 శాతం మండి నిరక్షరాస్యులుగా
వున్నారు.
·
ప్రజల కొనుగోలు
శక్తి పతనం పైన
తెలియ జేసిన విధముగా నికర విలువలో వేతనాల వాటా తీవ్రముగా తగ్గినందున, వ్యవసాయం సంక్షోభములో పడినందున, దారిద్ర్యం, నిరుద్యోగం పెరిగినందున ప్రజల
కొనుగోలు శక్తి తీవ్రముగా పడి పోయింది. ప్రయివేటు వినిమయ ఖర్చు (ఇది ప్రజల
కొనుగోలు శక్తిని తెలియ జేస్తుంది) పెరుగుదల 2003-04 నుండి 2007-08 మధ్య కాలములో 8
శాతం వుండగా 2012-13 లో 4 శాతానికి పడి పోయింది.
·
తగ్గిన ప్రభుత్వ ఖర్చు: అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యము తనకి అనుకూలముగా, ప్రజలకి వ్యతిరేకముగా వుండాలని కోరుకుంటుంది. ప్రజా సంక్షేమం పై, మౌలిక వసతుల నిర్మాణం పై, వ్యవసాయ రంగం పై పెట్టె ఖర్చు తగ్గించి తద్వారా బడ్జెట్ లోటును
తగ్గించాలని కోరుకుంటుంది. బడ్జెట్ లోటు
స్థూల జాతీయ ఆదాయం లో 3 శాతానికి మించకుండా
వుండే లక్ష్యము పెట్టుకుని క్రమముగా
దీనిని సాధించాలని షరతు విధిస్తుంది.
ప్రభుత్వాలు అవి కాంగ్రెస్ నాయకత్వములో ఏర్పడినా, బి జె పి
నాయకత్వములో ఏర్పడినా ,
ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీని ఫలితముగా మౌలిక వసతులు, ప్రజా సంక్షేమం పై ప్రభుత్వ ఖర్చు క్రమముగా తగ్గుతున్నది. 2008-09 నుండి
2012-13 మధ్య కాలములో ప్రభుత్వ వినిమయ ఖర్చు పెరుగుదల 8.5 శాతం వుండగా 2013-14 లో
అది సగానికి తగ్గి 4.4 శాతమే అయింది.
·
ధరల పెరుగుదల : ద్రవ్యోల్బణం
(ధరల పెరుగుదల) సగటున సంవత్సరానికి 9 శాతం
వుంటున్నది. ఆహార ధాన్యాల ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా, 10 శాతం పైన వుంటున్నది.
·
ఆర్థిక మాంద్యం : ప్రజల
వినిమయ ఖర్చు, ప్రభుత్వ వినిమయ ఖర్చు తగ్గుతున్నందున
మార్కెట్లో డిమాండు తగ్గి, తదనుగుణముగా సరుకుల ఉత్పత్తి
పెరుగుదల కూడా తగ్గింది. 2010-11 లో స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదల 9.32 శాతం
వుండగా అది 2012-13 లో సగానికి తగ్గి 4.5 శాతమే అయింది. మ్యాన్యుఫాక్చర్ రంగం
(తయారీ రంగం) లో 2012-13 లో 1.4 శాతం పెరుగుదల
వుండగా అది 2013-14 లో మైనస్(-) 0.2 శాతమయింది. అంటే అంతకి ముందు సంవత్సరం కన్నా
తగ్గింది. మరి కొన్నిసంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ ఇదే విధముగా మాంద్యం లో
వుంటుందని అంచనా వేస్తున్నారు.
·
ఋణ భారం తో సతమతమవుతున్న
కార్పొరేట్లు :క్రెడిట్ సూయిస్
అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2013 నవంబరులో అది పరిశీలించిన మొత్తం
3700 లిస్టెడ్ కంపెనీలలో మూడవ వంతు(34 శాతం) కంపెనీల ఆదాయం అవి చేసిన అప్పుల పై
వడ్డీ చెల్లించటానికి సరిపోవటం లేదు. పది భారీ కార్పొరేట్ కంపెనీల అప్పు 2006-07
లో రు.99300 కోట్లు కాగా అది 2012-13 నాటికి రు. 6,31,024 కోట్లు అయింది. వీటిలో ఐదు కంపెనీలకు( జివికే, జిఎంఆర్, లాంకో, వీడియొకాన్,ఎస్సార్)
వచ్చే ఆదాయం అవి చేసిన అప్పులపై వడ్డీ
చెల్లించటానికి సరిపోవటం లేదు.
·
మరి కొన్ని సంవత్సరాలు
ఆర్థిక మాంద్యం కొనసాగే పరిస్థితి : కనీసం
2018 వరకు భారత దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటు తక్కువ స్థాయిలో, 5-6 శాతం మధ్య వుంటుందని నిపుణుల అంచనా.
కాబట్టి కాంగ్రెస్, బి జె పి ల
వినాశకర ఆర్థిక విధానాలను తిరస్కరించాలి. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల కోసం
ఉద్యమించాలి.
No comments:
Post a Comment