కేంద్ర గణాంక
కార్యాలయం ప్రకారం ఫిబ్రవరి 2014 లో పారిశ్రామిక అభివృద్ధి సూచిక 1.8 శాతం తగ్గగా
దానిపై మార్చి 2014 లో 0.5 శాతం తగ్గింది. వినియోగదారుల ధరల సూచిక పెరుగుదల మార్చి
2014 లో 8.31 శాతం వుండగా ఏప్రిల్ లో 8.59శాతం పెరిగింది. 5శాతం కన్నా తక్కువ
వున్న పెరుగుదల రేటు నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సూచనలు కనిపించటం లేదని
ఇది తెలియజేస్తున్నది. సరుకుల తయారీ రంగం లో 11 రంగాలలో అంటే సగం రంగాలలో మార్చి
నెలలో క్షీణత కనపడింది. కన్స్యూమర్
డ్యూరబుల్స్ ఉత్పత్తి మార్చి నెలలో 11.8 శాతం పడిపోయింది. ఏప్రిల్ 2013
నుండి మార్చి 2014 వరకు చూస్తే 12.2 శాతం పడిపోయింది.
ఆర్థిక వ్యవస్థ
పెరుగుదల లో మాంద్యం సమస్య పరిష్కారం కావాలంటే పారిశ్రామిక వేత్తలకు వడ్డీ రేటు
తగ్గించి అప్పులిచ్చి పెట్టుబడులు పెట్టటానికి ప్రోత్సహించాలని, ఇందుకు రిజర్వు బ్యాంకు చొరవ తీసుకుని వడ్డి రేటు తగ్గించాలని ప్రభుత్వం
అంటున్నది. వడ్డీ రేటు తగ్గించి అప్పులిస్తే డబ్బు సర్క్యులేషన్ పెరిగి ధరలు
మరింతగా పెరుగుతాయని, ఇప్పటికి ద్రవ్యోల్బణం 8 శాతం పైగా
వున్నదని, ద్రవ్యోల్బణాన్ని 2015మార్చి నాటికి 8 శాతం కు
తగ్గించాలని రిజర్వు బ్యాంకు అంటున్నది. ద్రవ్యోల్బణం తగ్గించాలి కాబట్టి వడ్డీ
రేటు తగ్గింపు సాధ్యం కాదని రిజర్వు బ్యాంకు అంటున్నది.
కానీ అసలు సమస్య
పెట్టుబడికి అవసరమయిన డబ్బును సప్లై చేయటం కాదు. అసలు సమస్య కొనుగోలు శక్తిని
పెంచటం. ప్రజల కొనుగోలు శక్తి తగు స్థాయిలో లేనందున ఉత్పత్తి చేసిన సరుకు అమ్ముడు
పోవటం లేదు కాబట్టి పరిశ్రమలలో ఉత్పత్తిని పెంచటం లేదు. ఈ సమస్యని పరిష్కరించకుండా
పెట్టుబడిదారులకు తక్కువ వడ్డీకి అప్పులిచ్చినంత మాత్రాన వాళ్ళు ఉత్పత్తిని పెంచుతారా?
కాబట్టి అసలు సమస్య
ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకోటం. కొత్తగా ఏర్పడే
కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరిస్తుందా? కాంగ్రెస్
గాని, బి జె పి గాని ఏ ఇతర బూర్జువా పార్టీగాని ప్రజల
కొనుగోలు శక్తిని పెంచటమే అసలు సమస్య అని గుర్తించటం లేదు. పెట్టుబడిదారులకు
రాయితీలిస్తే చాలు, వాళ్ళే దేశాన్ని అభివృద్ధి చేస్తారని
అందరూ అదే పాత పాడుతున్నారు. ఇటువంటి రాయితీలను పెట్టుబడిదారులకు నిర్భయముగా
తెగింపుతో ఇవ్వగల సమర్థుడు మోడీ అని భారత బడా పెట్టుబడిదారుల భావన. అందుకే వారు
మోడీని సమర్థించారు.
కొత్త ప్రభుత్వ
ఏర్పాటుకు కాంగ్రెస్ కు అవకాశం కనిపించటం లేదు. తగినన్ని సీట్లు ఎన్ డి ఏ కి వచ్చి
మోడి ఏర్పాటు చేస్తాడా లేక ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చి మూడవ కూటమి
ప్రభుత్వం ఏర్పడుతుందా? ఏది ఏమయినప్పటికి ప్రజల
కొనుగోలు శక్తిని పెంచటానికి అవసరమయిన చర్యలు తీసుకోవాలని కొత్త ప్రభుత్వం పై
ఒత్తిడి తేవాల్సిన అవసరం వుంది.
No comments:
Post a Comment