Monday, July 7, 2014

భారత దేశం లో దరిద్రుల సంఖ్య ఎంత? దారిద్ర్య నివారణకు తీసుకోవాల్సిన కనీస చర్య ఏమిటి?


గత వారం లో ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్జీత్ సింగ్ కు రంగరాజన్ కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం భారత దేశం లో దరిద్రుల సంఖ్య 36.3 కోట్లు(జనాభాలో 29.6 శాతం). రంగరాజన్ కమిటీ తలకి అయ్యే వినిమయ ఖర్చు ఆధారముగా దారిద్ర్యాన్ని నిర్వచించింది. గ్రామీణ ప్రాంతం లో తలకి రు. 32 వరకూ రోజుకి ఖర్చు చేసే వారిని, పట్టణాలలో రోజుకి తలకి రు.47 వరకూ ఖర్చు చేసే వారిని దరిద్రులుగా లెక్కించింది. అంతకు మించి ఖర్చు చేసే వారు దరిద్రులు కాదని నిర్ధారించింది. గతం లో టెండూల్కర్ కమిటీ గ్రామీణ ప్రాంతాలలో తలకి రు.27, పట్టణాలలో రు.33 ఖర్చు చేసేవారిని దరిద్రులుగా నిర్ధారించింది. అంతకు మించి ఖర్చు చేసే వారు దరిద్రులు కాదన్నది. టెండూల్కర్ కమిటీ ప్రకారమయితే దారిడ్రుల సంఖ్య 26.98 కోట్లు మాత్రమే(21.9 శాతం). టెండూల్కర్ కమిటీ నిర్ణయించిన దారిద్ర్య రేఖ చాలా అధమంగా వుందని  తీవ్రమయిన విమర్శ వచ్చిన అనంతరం గత యు పి ఏ ప్రభుత్వము దీనిని పున:సమీక్షించేందుకు ఆనాటి ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి అధ్యక్షుడు  రంగరాజన్  అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ రంగరాజన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత దేశం లో దరిద్రుల  సంఖ్య టెండూల్కర్ కమిటీ నిర్ధారించిన దానికన్నా 10 కోట్లు ఎక్కువగా వున్నది. ఈ రంగరాజన్ కమిటీ నివేదికని మోడీ ప్రభుత్వము ఆమోదిస్తే దారిద్ర్య రేఖాకి దిగువన వున్నందున రేషన్ కార్డులు తదితర ప్రయోజనాలు పొందేవారి సంఖ్య ఈ మేరకు పెరుగుతుంది.
రంగరాజన్ కమిటీ ప్రకారం  5 గురు సభ్యులున్న కుటుంబానికి నెలకి వినిమయఖర్చు పట్టణ ప్రాంతం లో అయితే రు.7035, గ్రామీణ ప్రాంతం లో అయితే 4760 లోపు వుంటే వారు దారిద్ర్య రేఖకి దిగువన వున్నట్లు లెక్క. వాస్తవానికి ఇది కూడా చాలా తక్కువే. ఒక మనిషి ఆరోగ్యముగా వుండి సవ్యముగా పని చేయగలగాలంటే రోజుకి రు.2400 కేలరీల ఆహారం అవసరం. ఈ ప్రకారమయితే కుటుంబానికి నెలకి రు.10,000 పైనే కావాలి. ఈ ప్రకారం చూస్తే దరిద్రుల సంఖ్య రంగరాజన్ కమిటీ చెప్పినదానికన్నా రెట్టింపు అవుతుంది.
దరిద్రుల సంఖ్య ఎక్కువున్నప్పటికీ ఏదో విధముగా తక్కువగా చూపే ప్రయత్నాలనే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ గారడీలకి బదులు కుటుంబానికి నెలకి 35 కిలోల బియ్యం లేదా గోధుమలని కిలో రెండు రూపాయిలకు దేశ ప్రజలందరికీ, దారిద్ర్య రేఖకి దిగువన వున్నారా లేదా ఎగువన వున్నారా అనే దానితో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా అందించటం అవసరం.
కానీ యు పి ఏ ప్రభుత్వము వెలువదించిన ఆహార భద్రతా చట్టం ప్రకారం తలకి నెలకి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను 67 శాతం ప్రజానీకానికి కిలో రు.3 చొప్పున అందించాలి. కాగా నేటి మోడీ ప్రభుత్వము దీని కూడా నీరుగార్చే ప్రయత్నం లో వున్నది. ఈ కుటిల ప్రయత్నాలను ఓడించచేందుకు,  సార్వత్రిక ఆహార భద్రత చట్టం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం వున్నది.
సంపన్నులకు అనుచితముగా ఇస్తున్న రు. 5 లక్షల కోట్ల పన్ను రాయితీలను రద్దు చేసి వారు ఎగగొట్టిన పన్ను బకాయిలు మరో రు.5 లక్షల కోట్లను వసూలు చేస్తే ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించటం, విద్యా, వైద్య సౌకర్యాలు అందించటం సాధ్యమే. 

No comments:

Post a Comment