మోడి గారు తన అసలు
రంగును బయటపెట్టుకున్నాడు. తనకు అనుకూలముగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి
ప్రచారం చేసి గెలిపించిన భారత పెట్టుబడిదారీవర్గాని, తాను
ప్రధాని అయితే బాగుండునని చెప్పిన విదేశీ పెట్టుబడిదారులకు రుణం చెల్లించాలని
నిర్ణయించాడు. అందుకోసం స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులు
కార్మికులను మరింత విశృంఖలముగా దోచుకునేందుకు అనుమతించాలని నిర్ణయించాడు. ఇందుకు
అనుగుణముగా కార్మిక చట్టాలను సవరించే పని ప్రారంభించాడు.
ఇందుకు మొదట
రాజస్తాన్ ను ప్రయోగశాల గా ఎన్నుకున్నాడు. రాజస్తాన్ బి జె పి ప్రభుత్వము ఇటీవల ఈ
క్రింది కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకముగా సవరించింది:
1.
రాజస్తాన్ పారిశ్రామిక
వివాదాల చట్టం లో ప్రవేశ పెట్టిన సవరణలు : (అ) ఇప్పటివరకు
100 లోపు కార్మికులున్న పారిశ్రామిక సంస్థలలో మాత్రమే ప్రభుత్వ అనుమతి లేకుండా
కార్మికులను రిట్రెంచి చేయవచ్చు. అంతకు మించితే ప్రభుత్వ అనుమతి అవసరం. ఇప్పుడు
దీనిని 300 లోపు వరకూ కార్మికులున్న
సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండానే రిట్రెంచి చేయవచ్చునని సవరించారు. రాజస్తాన్ లో
7622 ఫ్యాక్టరీలు వుండగా అందులో 7252
ఫ్యాక్టరీలలో కార్మికుల సంఖ్య 300 లోపు వున్నది. కాబట్టి ఈ సవరణ వలన 95 శాతం
ఫ్యాక్టరీలలో కార్మికులను ప్రభుత్వ అనుమతి లేకుండా తొలగించే అధికారం యజమానులకు
లభించింది. (ఆ) కార్మికుల సమస్యల కు ప్రాతినిధ్యం వహించాలంటే ఒక ట్రేడ్ యూనియన్ కు ఆ సంస్థలో కనీసం 30 శాతం కార్మికులు సభ్యులుగా
వుండాలని సవరించింది. కార్మికులకు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రాతినిధ్యమే
లేకుండా ఇది చేస్తున్నది(అనేక రాష్ట్రాలలో, కేంద్రం లో
అనేక సందర్భాలలో పాలిస్తున్న ప్రభుత్వాలకు 30 శాతం కన్నా తక్కువగా వోటింగు
వచ్చింది. మరి కార్మిక సంఘానికి 30 శాతం సభ్యత్వం ఎందుకుండాలి?) (ఇ) “గో స్లో” అనే దాని నిర్వచనాన్ని మార్చి ఉత్పత్తిలో ఎదురయ్యే ప్రతి
వైఫల్యాన్నీ కార్మికుల వైఫల్యముగా చిత్రించేందుకు వీలు కలిగే విధముగా మార్చింది.
2.
ఫ్యాక్టరీ చట్టం: ఎలక్ట్రిసిటీ
అవసరం లేకుండా పని చేసే సంస్థలలో 20 కి మించి కార్మికులున్న సంస్థలన్నింటికీ, ఎలక్ట్రిసిటీ తో పని చేసే సంస్థలలో 10 కి మించి కార్మికులుండే అన్నీ
సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుంది. దీనిని మార్చి ఈ పరిమితిని 20 నుండి 40 కి, 10 నుండి 20 కి పెంచారు. దీనివలన అత్యధిక కార్మికులకు ఈ చట్టం
వర్తించకుండా పోతున్నది.
3.
కాంట్రాక్టు కార్మికుల
చట్టం ను సవరించి ఈ చట్టం 50 లోపు కాంట్రాక్టు
కార్మికులను నియమించిన యజమానులకు వర్తించదని చెప్పారు. ఆ విధముగా కాంట్రాక్టు
కార్మికులలో అత్యధికులకు ఈ చట్టం వర్తించకుండా చేశారు.
\
4.
అప్రెంటిస్ చట్టాన్ని సవరించి
రెగ్యులర్ కార్మికులకు బదులు అప్రెంటిస్ లను నియమించేందుకు యజమానులకు అవకాశం
కలిగించారు.
రాజస్తాన్
బాటలో మోడీ ప్రభుత్వము
మోడీ
అనుమతితో రాజస్తాన్ లో పై ప్రయోగము జరిగిన అనంతరం ఇప్పుడు మోడీ ప్రధానమంత్రిగా వున్న
కేంద్ర ప్రభుత్వమే కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకముగా, యజమానులకు అనుకూలముగా సవరించేందుకు పూనుకున్నది. కార్మిక చట్టాలకు ఈ
క్రింది సవరణలను ప్రతిపాదించింది:
1.
ఫ్యాక్టరీల చట్టం
(అ)అవసరమయిన సందర్భములో కార్మికునితో 10.5 గంటలు పని చేయించవచ్చునని, చీఫ్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్
అనుమతితో మాత్రమే 12 గంటలు పని
చేయించవచ్చునని వున్న చట్టాన్ని మార్చి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనుమతి లేకుండానే రాష్ట్ర
ప్రభుత్వము ఈ విధముగా పెంచవచ్చునని ప్రతిపాదించారు. ఇది కార్మికులతో నిర్బంధముగా
ఎక్కువ గంటలు అదనపు చెల్లింపు ఏమీ లేకుండానే పని చేయించేందుకు దారితీస్తుంది. (ఆ)
మూడు నెలలలో 50 గంటలు మించి ఓవర్ టైమ్ చేయించకూడదని వున్న నిబంధనను సవరించి 100
గంటలు చేయించవచ్చునని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 125 గంటలు
చేయించవచ్చునని ప్రతిపాదించారు. దీని వలన కొత్త కార్మికులను నియమించుకోవాల్సిన
అవసరం యజమానులకు లేకుండా పోతుంది. (ఇ) మరీ ఘోరం ఏమిటంటే ఫ్యాక్టరీ చట్టం పరిధిలోకి
వచ్చే ఫ్యాక్టరీ అంటే ఏమిటో నిర్ణయించే స్వేచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలని
ప్రతిపాదించారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో
ఒకటి పోటీ పడి తమ రాష్ట్రాలలో ఫ్యాక్టరీల చట్టం వర్తించే కార్మికుల సంఖ్యను
కుదించి అత్యధిక కార్మికులకు ఏ విధమయిన చట్టపరమయిన రక్షణ కూడా లేకుండా చేయటానికి
ఇది దారి తీస్తుంది.
2.
కనీస వేతన చట్టం: 15వ
లేబర్ కాన్ఫరెన్స్ సిఫార్సును మరియు సుప్రీం కోర్టు రాప్తాకోస్ బ్రెట్ కేసులో
ఇచ్చిన తీర్పును దృష్టిలో వుంచుకుని కనీస వేతనాన్ని నిర్ణయించాలని 43వ జాతీయ లేబర్
కాన్ఫరెన్స్ ఏకాభిప్రాయానికి వచ్చింది.ఇప్పుడు మోడీ ప్రభుత్వము కనీసవేతన చట్టానికి
ప్రతిపాదించిన సవరణ, దీనిని తిరస్కరిస్తున్నది. ఈ సిఫార్సులతో మరియు
సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధములేకుండానే
జాతీయ స్థాయి న్యూనతమ కనీస వేతనాన్ని ఒక ప్రాతిపదిక లేకుండా
ప్రభుత్వము/ప్రభుత్వాలు తమ ఇష్టం వచ్చినట్లు నిర్ణయించే అవకాశం కల్పిస్తున్నది. ఏ
కేంద్ర చట్టమయినా కనీస వేతనం పై ధరల పెరుగుదలకి అనుగుణముగా డిఏ చెల్లింపును
నిర్దేశించాలి. కానీ మోడి ప్రభుత్వము డి ఏ ఇవ్వాల్సిన అవసరం లేకుండా 5 సంవత్సరాల
లోపు కనీస వేతనాన్ని సవరించాలని ప్రతిపాదించింది. షెడ్యూల్ లో ప్రకటించని రంగాలు
/వృత్తులలో పని చేసే కార్మికులకు వారి నైపుణ్యం కనీస స్థాయికన్నా ఎక్కువ
వున్నప్పటికి నైపుణ్యములేని కార్మికులకిచ్చే కనీస వేతనాన్నే వర్తింపజేయాలని
ప్రతిపాదించారు.
3.
అప్రెంటిస్ చట్టం కు మోడి ప్రభుత్వము ప్రతిపాదించిన సవరణలు
కాంట్రాక్టు/క్యాజువల్ వర్కర్లకు బదులు
అంతేగాక రెగ్యులర్ వర్కర్లకు బదులు
అప్రెంటిస్ ల పేరుతో తక్కువ వేతనం తో పని చేయించుకునే అవకాశం కల్పిస్తున్నది.
(కాంట్రాక్టు/క్యాజువల్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి. అప్రెంటిస్ లయితే ఆ కనీస
వేతనం లో 70 శాతమే ఇస్తారు).
4.
కార్మిక చట్టాల అమలుకు
సంబంధించిన రిటర్న్స్ సమర్పించాల్సిన అవసరం లేకుండా/రిజిస్టర్లు మెయింటెయిన్
చెయ్యాల్సిన అవసరం లేకుండా చేసేందుకు కార్మిక చట్టాల సవరణ చిన్న పారిశ్రామిక
సంస్థ అంటే 19 మంది వరకూ కార్మికులు పని చేసే సంస్థ అనే నిర్వచనాన్ని మార్చి 40
మంది వరకూ కార్మికులు చేసే సంస్థ అని ప్రతిపాదించారు. ఈ చిన్న పారిశ్రామిక
సంస్థలకు 16 రకాల కార్మిక చట్టాల (ఫ్యాక్టరీల చట్టం,
కనీస వేతన చట్టం, వారాంతపు సెలవుల చట్టం, కాంట్రాక్ట్ కార్మిక చట్టం మొ.)
అమలుకు సంబంధించిన రిటర్న్సు సమర్పించాల్సిన అవసరము నుండి మరియు రిజిస్టర్లు మెయింటెయిన్ చేయాల్సిన అవసరం
నుండి మినహాయింపునివ్వాలని ప్రతిపాదించారు. ఈ రోజు అందుబాటులో వున్న అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానం వలన అనేక పెద్ద పరిశ్రమలు 20 లేదా అంతకు తక్కువ మంది
కార్మికులనే నియమిస్తున్నాయి. దీని వలన 72 శాతం ఫ్యాక్టరీలలో ఈ
రిజిస్టర్లు/రిటర్న్సు మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది. యజమానులు తమ
ఇష్టం వచ్చినట్లు చట్టాలను ఉల్లంఘించి కార్మికులపై దోపిడిని మరింత తీవ్రం చేసే
పరిస్థితి ఏర్పడుతుంది.
“మేక్ ఇన్ ఇండియా” అని తన స్వాతంత్ర్య దిన ఉపన్యాసం లో మోడీ ప్రస్తావించిన దాని అర్థం
ఏమిటంటే విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులారా, మేము కార్మికులకు వున్న హక్కులు తొలగించేందుకు చట్టాలు సవరిస్తాము, మీరు వచ్చి వారిని విశృంఖలముగా దోపిడీ చేయండని. కార్మికులకు హక్కులు
లేకుండా చేస్తే విదేశీస్వదేశీ పెట్టుబడిదారులు వచ్చి అత్యుత్సాహం తో పెట్టుబడులు
పెట్టి దేశాన్ని పారిశ్రామికముగా అభివృద్ధి చేస్తారని మోడీ సిద్ధాంతం. ఇది
వాస్తవానికి మోడీ కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతం కాదు. ఇది పెట్టుబడిదారుల, వారి రాజకీయ పార్టీల దివాలాకోరు సిద్ధాంతం. కాంగ్రెస్ కూడా ఇదే
విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నించి తనకి పూర్తి మెజారిటీ లేనందున అమలు చేయలేక
పోయింది. ఇప్పుడు బి జె పి కి పూర్తి మెజారిటీ వచ్చింది కాబట్ట్తి ఈ అడ్డగోలు
పనులన్నీ చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి జరగాలంటే కార్మికుల, ప్రజల హక్కులు, సౌకర్యాలు కోత పెట్టటం తప్ప మరో
మార్గం లేదని మోడీ ఉవాచ.
పైన
తెలియజేసిన విధముగా కార్మిక చట్టాలకు సవరణలను మోడి ప్రభుత్వము పార్లమెంటు ఆమోదం కోసం
సమర్పించింది. ఇప్పుడు జరుగుతున్న ఈ
పార్లమెంటు సమావేశాలలోనే ఈ సవరణాలను ఆమోదింపజేసుకోవాలని ప్రయత్నిస్తున్నది.
కార్మిక సంఘాల ఐక్య ప్రతిఘటన
కార్మిక
వర్గం పై మోడీ ప్రభుత్వము ప్రకటించిన ఈ దాడిని త్రిప్పి కొట్టాలని రాజకీయ
అనుబంధాలకతీతముగా అన్నీ కేంద్ర కార్మిక సంఘాలూ
నిర్ణయించాయి. 7.8.2014న ఢిల్లీ లో తపన్ సేన్ (సి ఐ టి యు ప్రధాన
కార్యదర్శి), గురుదాస్ దాస్ గుప్తా (ఏ ఐ టి యు సి
ప్రధాన కార్యదర్శి), బ్రజేష్ ఉపాధ్యాయ (బి ఏం ఎస్ ప్రధాన
కార్యదర్శి), హర్భజన్ సింగ్ సిద్ధు ( హెచ్ ఏం ఎస్ ప్రధాన కార్యదర్శి)
తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఐ ఎన్
టి యు సి అధ్యక్షులు జి.సంజీవరెడ్డి అధ్యక్షతన సమావేశమై మోడీ ప్రభుత్వము కార్మిక
వర్గం పై చేస్తున్న ఈ దాడులను ప్రతిఘటించాలని తీర్మానించారు. ఇంతేగాక డిఫెన్స్, రైల్వే,
ఇన్సూరెన్సు, పెన్షన్ వంటి అనేక రంగాలలో ఎఫ్ డి ఐ సీలింగు ను పెంచేందుకు, ప్రభుత్వ
సంస్థల డిజిన్వేస్టుమెంటుకు మోడి ప్రభుత్వము చేసిన నిర్ణయాలను ఈ సమావేశం ఖండించింది.
మోడి
ప్రభుత్వము అనుసరిస్తున్న ఈ విధానాలకు నిరసనగా సెప్టెంబరు మొదటి వారములో ‘జాతీయ స్థాయి నిరసన సదస్సు” ను నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటించాలని ఈ సమావేశం
నిర్ణయించింది.
No comments:
Post a Comment