చిదంబరం, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ, అరవింద కేజ్రీవాల్, అన్నా హజారే-అందరి సారాంశమూ
ఒకటే. రోసిపోయిన పెట్టుబడిదారీ విధానానికి నగిషీలు చెక్కే వారే. అసలు సమస్యలు
వదిలి కొసరునే అసలనే వాళ్ళే. ప్రజలలో సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఉద్రేకాలు
సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్ళే. సామాన్యుని మోసం చేసే వాళ్ళే. కాకపోతే
ఒకరి నిజస్వరూపం బయటపడి ప్రజలు వారిని నమ్మని పరిస్థితి వచ్చినప్పుడు తామేదో
కొత్తగా ఉద్ధరిస్తామని మరొకరు ముందుకు వచ్చి తాత్కాలికముగా భ్రమలు సృష్టించటమే
వీరి ప్రత్యేకత.
మధ్య యుగాలలో మన దేశ పాలకులు వాళ్ళు హిందువులయినా, ముస్లిములయినా, దేవాలయాలను వాటిలో వున్న సంపదను దోచుకునేందుకు ధ్వంసం చేసే వాళ్ళు.
కాశ్మీరు రాజు హర్ష (క్రీ.శ.1089-1101) దేవాలయాలను ధ్వంసము చేసి వాటి సంపదను లూటీ
చేసేందుకు “దేవోత్పతన నాయక” పేరుతో ఒక మంత్రిని నియమించాడు. పారమార పాలకుడు
శుభతవర్మన్ (క్రీ.శ. 1193-1210)గుజరాత్ లో దభోయి, కాంబే లలో
వున్న అనేక జైన మందిరాలను లూటీ చేశాడు. శైవ పాలకులు బౌద్ధ దేవాలయాలను
ఆక్రమించుకున్నారు, జైన దేవాలయాలను ధ్వంసం చేసి జైనులను
బలవంతముగా శైవులుగా మార్చారు. ముస్లిం పాలకులు కొందరు హిందూ దేవాలయాలను లూటీ చేశారు.
ఇదే విధముగా ఇప్పటి పాలకులు సరళీకరణ విధానాలలో భాగముగా
ఆధునిక దేవాలయాలని నెహ్రూ వర్ణించిన ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసి వాటి
సంపదను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు కొల్లగొట్టేందుకు అనుమతిస్తున్నారు.
ఇందుకోసం ఉద్దేశ పూర్వకముగా ప్రభుత్వరంగ సంస్థలను సక్రమముగా పని చేయనీయకుండా
ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమములోనే ఆనాటి వాజపాయీ బి జె పి ప్రభుత్వము డిజిన్వెస్ట్మెంటు
శాఖను సృష్టించింది. వి ఎస్ ఎన్ ఎల్ ను టాటాలకు చవుకగా అమ్మింది. ముంబయిలో వున్న
రెండు సెంటార్ హోటల్సును, బాల్కోను చవుకగా అమ్మింది. కాంగ్రెస్ నాయకత్వములో అధికారములోకి వచ్చిన మొదటి
యు పి ఏ ప్రభుత్వము వామాపక్షాల మద్దతు పై ఆధారపడిన కాలములో డిజిన్వేస్టుమెంటు
శాఖను రద్దు చేసి పెద్దగా డిజిన్వేస్టుమెంటును అమలు చేయనప్పటికి , రెండవ యు పి ఏ ప్రభుత్వము వామ పక్షాల మద్దతు అవసరము లేకుండా ఏర్పడినందున
డిజిన్వేస్టుమెంటు ప్రక్రియను వేగవంతం చేసింది. మన్మోహన్ సింగు, చిదంబరం లు ప్రతి బడ్జెటులోనూ డిజిన్వేస్టుమెంటు ద్వారా వేల కోట్ల
రూపాయలను ప్రభుత్వము సంపాదించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. 2012-13 సంవత్సరపు
బడ్జెట్ లో ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ద్వారా రు.30,000 కోట్లు సంపాదించాలని ఆర్థిక మంత్రి చిదంబరం నిర్ణయించగా ఫిబ్రవరి 10, 2014 నాటికి ఋ. 22000 కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే 31 మార్చి
నాటికి మొత్తం రు.27000 కోట్లు వస్తాయని అంచనా. 2014-15 లో డిజిన్వేస్టుమెంటు
ద్వారా ప్రభుత్వము రు.36900 కోట్లు సంపాదించాలని 17.2.2014న పార్లమెంటులో ప్రవేశ
పెట్టిన వోట్ ఆన్ ఎకవుంట్ లో ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు.
డిసిన్వేస్టుమెంటును ఈ విధముగా అమలు చేసిన ఎన్ డి ఎ ని
ప్రజలు ఓడించారు. ఇప్పుడు యు పి ఏ కూడా ఓటమి ముంగిట వున్నది. అయితే పెట్టుబడికి
కట్టుకథకి పుట్టిన విషపుత్రికలని శ్రీ శ్రీ వర్ణించిన పెట్టుబడిదారుల పత్రికలు
మరియు టి వి చానల్సు కాబోయే ప్రధాన మంత్రిగా వర్ణిస్తున్న బి జె పి పార్టీకి
చెందిన నరేంద్ర మోడీ, బి జె పి కన్నా భిన్నమయిన వికాసపురుషుడన్నట్లు
ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఈ నరేంద్ర మోడీ గారి సిద్ధాంతమేమిటి? ఢిల్లీ లో 2013 ఎప్రీల్ 8న మీడియా సంస్థ
నెట్ వర్క్ 18 నిర్వహించిన “థింక్ ఇండియా డైలాగ్’
సమావేశం లో తన సిద్ధాంతమేమిటో నరేంద్ర
మోడీ ప్రకటించారు. ప్రయివేటీకరణ, డిజిన్వేస్టుమెంటు తన విధానమన్నారు. “It is my philosophy that
government has no business doing business”(ప్రభుత్వము వ్యాపారములో
వుండాల్సిన అవసరం లేదని నా తాత్విక దృక్పథం) అని ఆన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయాలని దీని ఉద్దేశం. ప్రభుత్వ
రంగ సంస్థల ప్రయివేటీకరణ విషయాములో మీ ఆలోచన ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జవాబు
ఇస్తూ వాజపాయీ నాయకత్వములో ఎన్ డి ఏ అనుసరించిన విధానమే తన విధానం అన్నారు(బాల్కో, ఐ పి సి ఎల్ ల డిజిన్వేస్తుమెంటు, బి ఎస్ ఎన్ ఎల్ ఏర్పాటు). “We need a panel of neutral persons to
consider the matter. Some PSUs are there for social service, some for commercial
ends. I am for their privatization.” (ఈ విషయాన్ని పరిశీలించటానికి
తటస్థ వ్యక్తులతో కూడిన ఒక ప్యానల్ ను నియమించాలి. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు
సేవలందించటానికి వున్నాయి, కొన్ని వర్తకం చేస్తున్నాయి. నేను
ప్రయివేటీకరణకు అనుకూలం) అని అన్నారు. కేంద్రం ద్వారా కాకుండా అంతర్జాతీయ
వాణిజ్యాన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విదేశాలతో నేరుగా సంబంధం పెట్టుకుని చేసే
అవకాశం ఇవ్వాలన్నారు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విదేశీ
డెస్కు వుండాలన్నారు. పి పి పి (పబ్లిక్ ప్రయివేట్ పార్టీసీపేషన్) ద్వారా
అభివృద్ధి జరగాలన్నారు. ప్రయివేటు రంగానికి మరింత ప్రాధాన్యతనివ్వాలని దీని ఉద్దేశం. యు పి ఏ కూడా
దీనినే అమలు చేస్తున్నది.
ఇప్పుడు కొత్తగా అరవింద కేజ్రీవాల్ కు అతని ఆం ఆద్మీ
పార్టీకి మీడియాలో విశేష ప్రాధాన్యత లభిస్తున్నది. తానేదో అందరికన్నా అతీతుడనన్నట్లు
అతను చెప్పుకుంటాడు. నిన్నటివరకూ అతని రంగు బయట పడలేదు. కానీ నిన్న(17.2.2014)
ఢిల్లీ లో భారత బడా పెట్టుబడిదారుల సంఘం సి ఐ ఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్
ఇండస్ట్రీస్) సమావేశం లో చేసిన ప్రసంగం లో అతను తన రంగును బయట పెట్టుకున్నాడు. “The government has no business to
be in business, it should be left to the private sector”(ప్రభుత్వం
వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. వ్యాపారాన్ని ప్రయివేటు రంగానికి వదిలి వేయాలి”) అని
అన్నాడు.పోటీకి అవకాశం వున్న అన్నీ రంగాలలో ప్రయివేటీకరణ జరగాలన్నాడు. ఉదాహరణకు టెలికాం
రంగం లో ఇప్పటికే వివిధ కంపెనీల మధ్య పోటీ జరుగుతున్నది కాబాట్టి ఈ రంగం లో బి ఎస్
ఎన్ ఎల్, ఏం టి ఎన్ ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు వుండాల్సిన
అవసరం లేదని దీని అర్థం. తాము కార్పొరేట్సుకు, ప్రయివేటీకరణకు వ్యతిరేకం కాదన్నాడు. ప్రభుత్వ రంగం లో ఉద్యోగాలు రావు కాబట్టి
యువకులు తామే పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పించే వారుగా మారాలన్నాడు.కాలేజీలలో పాస్
అయిన తరువాత వారికి పరిశ్రమలను వ్యాపారాలను పెట్టటానికి తోడ్పడాలన్నారు. ఇందుకు వ్యాపారానికి
అనుకూలమయిన వాతావరాణాన్ని నెలకొల్పాలన్నాడు.తాము ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికేగాని
పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకం కాదన్నాడు.ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అంటే
ప్రభుత్వ సహాయముతో ప్రభుత్వ రంగాన్ని, సహజ వనరులను దోచుకోటం. ఇప్పుడు పెట్టుబడిదారీ విధానం
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానముగా మారింది. కాబట్టి
పెట్టుబడిదారీ విధానానికి అనుకూలం గాని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి అనుకూలం కాదనటం
నయవంచన. వ్యవసాయాన్ని నియంత్రణలనుండి విముక్తం చేయాలన్నారు. దీని సారాంశం వ్యవసాయం
లో రైతులకు అనుకూలముగా ప్రభుత్వ జోక్యం అవసరం లేదని, అంతా కార్పొరేట్సుకే
అప్పజెప్పాలని.
ఇక అన్నా హజారే కథ మరింత విచిత్రంగా మారింది. కొండంత రాగం
తీసి పిచ్చి కూత కుసినట్లు అవినీతిని వ్యతిరేకించే యోధుడిగా బయలుదేరి చివరికి అవినీతి
ఆరోపణలలో మునిగి తేలుతున్న తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ పార్టీ) కు అనుకూలముగా ఎన్నికల ప్రచారం చేయటానికి సన్నద్ధవుతున్నాడు.
వీరందరి విధానాలలో తేడా ఏమీ లేదని ఇదంతా రుజువు చేస్తున్నది.
అందరూ ప్రయివేటీకరణ విధానాలనే సమర్తిస్తున్నారు. అందరూ ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వాలది
కాదంటున్నారు. యువతకి సాధికారత కల్పించే పేరుతో తమకి తామే పరిశ్రమాలు, వ్యాపారాలు పెట్టుకోవాలని
అందుకు ప్రభుత్వాలు సహకరించాలని అంటున్నారు.అసలు సమస్య ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెరగనందున
ఆర్థిక వ్యవస్థ మాంద్యం లో పడటం కాగా దానికి పరిష్కారమేమితో చెప్పకుండా ఇటువంటి ఊరింపు
కబుర్లు చెపుతున్నారు.
పెట్టుబడిదారీ విధానం ఫైనాన్సు పెట్టుబడిదారీ విధానముగా, ఆశ్రిత పెట్టుబడిదారీ
విధానముగా మారి అవినీతి మయముగా తయారయిన పరిస్థితులలో, ఈ వికృత
రూపములో కాకుండా మరో రూపములో వుండటం దానికి సాధ్యం కాని పరిస్థితులలో దానికి నగిషీలు
చేక్కాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే వాళ్ళుగానే
మారతారు. ఒక వంక అవినీతి మయమయిన పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థిస్తూ మరొక వంక అవినీతి
వ్యతిరేక పోరాటం చేయటం సాధ్యం కాదు. వ్యక్తిగతముగా ఎవరయినా అవినీతిపరులు కాకున్నా వారు పెట్టుబడిదారీ విధానాపు సమర్థకులుగా వున్నంతవరకూ
మన్ మోహన్ సింగ్ లాగానే అవినీతికర వ్యవస్థని సమర్థించక తప్పదు.
కాబట్టి ఎవరయితే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకముగా వుంటూ
సోషలిస్టు విధానాన్ని కోరుకుంటారో అందుకోసం నిజాయితీగా పోరాడుటారో వాళ్ళే అవినీతికి
వ్యతిరేకముగా నిఖార్సుగా వుండగలరు. పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర వామ పక్ష మంత్రివర్గాలు అవినీతికి అతీతముగా వుండటానికి కారణం ఇదే. పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం కోసం జరిగే
పోరాటం తో సంబంధం లేకుండా అవినీతి నిర్మూలన
సాధ్యం కాదు. వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలు కలిసి పెట్టుబడిదారీ
విధానానికి ప్రత్యామ్నాయం కోసం ఉద్యమిస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది.
No comments:
Post a Comment