Friday, February 7, 2014

భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి

2011-12లో భారత దేశ స్థూల జాతీయ ఉత్పత్తి విలువ రు. 2004-05 ధరల ప్రకారం రు. 52.5 లక్షల కోట్లు. 2012-13 లో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి 2004-05 ధరల ప్రకారం రు. 54.8 లక్షల కోట్లు. 2011-12 తో పోలిస్తే 2012-13 లో పెరుగుదల  4.5 శాతం. 2010-11 తో పోలిస్తే 2011-12 లో 6.7 శాతం పెరుగుదల వున్నది. అంటే 2012-13 లో పెరుగుదల రేటు 6.7 నుండి 4.5 కు పడిపోయింది. ఇది ఆర్థిక మాంద్యానికి సంకేతం.
ఈ 4.5 శాతం పెరుగుదలలో అధిక భాగం ఫైనాన్సు, ఇన్సూరెన్సు, రియల్ ఎస్టేటు,మరియు బిజినెస్ సర్వీసుల రంగంలో(10.9 శాతం పెరుగుదల) జరుగింది. రవాణా,స్టోరేజి, కమ్యూనికేషన్స్ రంగాలలో పెరుగుదల 6 శాతం. కమ్యూనిటీ, సోషల్ మరియు పర్సనల్ సర్వీసుల రంగం లో పెరుగుదల 5.3 శాతం.వ్యవసాయం, అడవులు, చేపలు రంగం లో పెరుగుదల 1.4 శాతం. కాగా మైనింగ్ రంగం లో ఉత్పత్తి అంతకు ముందు సంవత్సరం కన్నా 2.2 శాతం తగ్గింది. సరుకుల తయారీ, ఎలక్ట్రిసిటీ,గ్యాస్, నీటి సరఫరా మరియు నిర్మాణ రంగాలలో పెరుగుదల చాలా స్వల్పముగా 1.2 శాతమే వున్నది.
2012-13 స్థూల జాతీయ ఆదాయం లో ప్రాథమిక రంగం వాటా 19.9 శాతం, ద్వితీయ రంగం వాటా 23.8 శాతం, తృతీయ రంగం వాటా 56.3 శాతం. (ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, చేపలు, అటవీ ఉత్పత్తులు, మైనింగ్, క్వారీయింగ్. ప్రకృతినుండీ ప్రత్యక్షముగా చేయగలిగే ఉత్పత్తుల రంగం ప్రాథమిక రంగం. ద్వితీయ రంగం అంటే ప్రాథమిక రంగం నుండి లభించే వస్తువులను ముడిపదార్థాలుగా వినియోగించి కొత్త ఉత్పత్తులు చేసే రంగం. సరుకుల తయారీ,ప్రాసెసింగ్ పరిశ్రమలు, యంత్రాల తయారీ, నిర్మాణ రంగం ద్వితీయ రంగం లో వుంటాయి. తృతీయ రంగం అంటే సేవల రంగం. ప్రజలకి పరిశ్రమలకి అందించే సేవలను తృతీయ రంగం అంటారు. హోల్ సేల్, రిటెయిల్ వ్యాపారం, రవాణా, పంపిణీ, సినిమా, టి వి, రేడియో, మీడియా, ఆరోగ్యం, విద్యా, టూరిజం, వ్యక్తిగత సేవలు, బ్యాంకింగు, ఇన్సూరెన్సు , లీగల్ సేవలు వంటివి సేవల రంగం లో వుంటాయి).
పని చేసే వారిలో 60 శాతం మంది వుండే ప్రాథమిక రంగం  ఉత్పత్తి,  మొత్తం జాతీయ ఉత్పత్తిలో 19.9 శాతం వున్నది.  18 శాతం మంది పని చేసే ద్వితీయ రంగం లో  ఉత్పత్తి,  మొత్తం ఉత్పత్తిలో 23.8 శాతమే వున్నది. 22 శాతం మంది పని చేసే సర్వీసుల రంగం లో ఉత్పత్తి అధికముగా 56.3 శాతం వున్నది. ఇది మన దేశం లో పరిస్థితి.
ఇందుకు భిన్నం గా చైనా లో 2011 లెక్కల ప్రకారం స్థూల జాతీయ ఉత్పత్తిలో  ప్రాథమిక రంగం వాటా 10.1 శాతం, ద్వితీయ రంగం వాటా 46.8 శాతం, తృతీయ రంగం వాటా 43.1 శాతం వున్నది. చైనాలో పని చేసే జనాభాలో ప్రాథమిక రంగం లో 38.1 శాతం, ద్వితీయ రంగం లో 27.8 శాతం, తృతీయ రంగం లో 34.1 శాతం వున్నారు(2009 నాటికి). ద్వితీయ రంగం లో పని చేసే జనాభా, స్థూల జాతీయ ఉత్పత్తి మనకన్నా అధికముగా వున్నది కాబట్టి చైనా మనకన్నా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినట్లు లెక్క.



No comments:

Post a Comment