హిందూయిజం. ఈ పేరు బ్రిటిష్‌వాళ్లు
పెట్టినప్పటికీ, ఈ పేరును ఆర్.ఎస్.ఎస్., భారతీయ జనతాపార్టీలు భ్రష్టు పట్టించినప్పటికీ
హిందూదేశమని ఒకప్పుడు పిలవబడిన మన దేశంలో బహుళ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఎన్నో
జాతులు, రీతులు, సంప్రదాయాలు, లౌకిక
వ్యవహారాలు ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తూ, ఎవరి ప్రత్యేకతలను వాళ్లు కాపాడుకుంటూ చాలా
సంవత్సరాల పాటు ఒక జీవన విధానాన్ని అలవరుచుకున్నారు. పొరుగునున్న మతాలు ఇక్కడి
కొచ్చాయి. ఇక్కడి మతాచారాలు పొరుగు దేశాలకు వెళ్లాయి. అలాంటి జీవన విధానానికి
బ్రిటిష్ వాళ్ళు హిందూయిజం హిందూమతం అని పేరు పెట్టి సగం చిచ్చు పెట్టారు.
మిగిలిన సగం మన హిందూత్వవాదులు మంటపెట్టారు. ఆ మంటను చల్లారనివ్వకుండా
ఎప్పటికప్పుడు ఏదో ఒక కట్టె పేడు చేరుస్తున్నారు. దానిని చూసి భయపడే స్థాయికి మనం
దిగజారాం.
మనమే కాదు పెంగ్విన్ ప్రచురణాలయం - ప్రపంచంలోనే అతి పెద్ద ప్రచురణాలయం
ఏదో చిన్న సంస్థ కోర్టులో వేసిన కేసుకి భయపడి, తను
ప్రచురించిన పుస్తకాన్ని మనదేశం మార్కెట్‌లో లేకుండా నాశనం చేసింది. ఏమిటా పుస్తకం? హిందూస్: ఎన్ ఆల్టర్నేటివ్ హిస్టరి. ఎవరు
రాసింది? వెండీ డానిగర్. ఆమె చరిత్రకారిణి. పైగా భారతీయ
చరిత్ర మీద ప్రత్యేక పరిశోధన చేసింది. మనదేశం గురించి ఎందరో చరిత్రకారులు ఎన్నో
పుస్తకాలు రాశారు. వాటిలోని సత్యాసత్యాల గురించి చర్చలు జరుగుతాయి. జరగాలి.
పరిశోధనకు చర్చ, ఆధార నిరూపణ, విశ్లేషణ...
ఇవి ప్రాణం. ఈ చర్చకు ఆస్కారం లేకుండా పుస్తకాలే ప్రచురించకూడదనే అధికారం ఎవరికైనా
ఎలా ఉంటుంది? ఆ పుస్తకం నాలుగేళ్ళ నుంచీ ఎందరో చదివారు. ఇవాళ
ఎవరికో ఏదో అభ్యంతరం వచ్చి కేసు పెడితే పెంగ్విన్ వంటి సంస్థ అంత భయపడిందెందుకు? దేశంలో అంత భయపెట్టే సాంస్కృతిక ఫాసిజం ఎంత
వేగంగా అభివృద్ధి చెందుతోందో ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతోంది. పెంగ్విన్ ''వీళ్ళ''తో పెట్టుకోదల్చుకోలేదు. తన వ్యాపార ప్రయోజనాలు
దెబ్బతింటాయనుకుంది. ఒక ప్రచురణాలయం, పుస్తకాల మీద బతికే సంస్థ, మేధావులు, రచయితల ఆలోచనలను సొమ్ము చేసుకుని వృద్ధి చెందిన
సంస్థ. పుస్తకాలను, ఆలోచనలను, భిన్నత్వాన్ని ప్రజాస్వామ్య సంస్కృతిని అతి
పిరికితనంతో తగలబెట్టింది.
పెంగ్విన్ పిరికితనం ఈ పుస్తకానికి పరిమితం కాదు.
పెంగ్విన్ తన పిరికితనంతో, బలహీనతతో ఫాసిస్టులకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది. భారతదేశ ప్రజాస్వామ్య శక్తులను
పరోక్షంగా తక్కువ చేసింది. మనదేశంలో ప్రజాస్వామ్యశక్తులు ఫాసిజాన్ని ఎదుర్కోవటంలో
చూపవలసిన ధైర్య సాహసాలు చూపటం లేదని చెప్పింది. మన ప్రభుత్వం కూడా ఫాసిస్టు
శక్తులకే అనుకూలంగా ఉందనీ, కోర్టులలో ఫాసిస్టులకు అనుకూలమైన తీర్పులు
వస్తున్నాయనీ పెంగ్విన్ గమనించినట్లుంది. అందుకే ఒక వ్యక్తి వేసిన కేసును తను
కోర్టులోనే సవాలు చేయాలన్న నిర్ణయం తీసుకోలేకపోయింది. తన రచయితల పక్షాన తను నిలబడే
నైతిక బలాన్ని చూపించలేకపోయింది.
సరే- తను తీసుకుకున్న నిర్ణయం ఫలితాలను ఇవాళ కాకపోతే రేపు ఆ సంస్థ రుచి చూస్తుంది.
సరే- తను తీసుకుకున్న నిర్ణయం ఫలితాలను ఇవాళ కాకపోతే రేపు ఆ సంస్థ రుచి చూస్తుంది.
కానీ మన
దేశంలో ప్రజాస్వామిక విలువల సంగతేమిటి? మొన్న, అంటే ఫిబ్రవరి 14వ
తారీఖున త్రిచూర్‌లో బిలాల్ అనే కాశ్మీర్ ముస్లిం దర్శకుడు తీసిన డాక్యుమెంటరీ
చిత్రం ప్రదర్శిస్తున్నామని, వారం రోజుల పాటు చిత్రోత్సవం నిర్వహించిన విబ్‌గోర్
సంస్థవారు ప్రకటించారు. మేం ఆ డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో మూడు రోజుల పాటు
పాల్గొన్నాం. 12వ తారీఖు నుంచే భారతీయ జనతా పార్టీ వాళ్లు ఆ
సినిమా ప్రదర్శించటానికి వీలులేదనీ, ప్రదర్శించనివ్వమనీ హెచ్చరికలు పంపారు. ఆ
సినిమాలో విషయం ఏమిటనే సంగతి తర్వాత చూద్దాం. ఏ సినిమా ప్రదర్శించాలో, ఏ సినిమా ప్రదర్శించకూడదో చెప్పటానికి వాళ్ళెవరు? వాళ్లకున్న అధికారం ఏమిటి? రచయితలను, కళాకారులను నిరోధించే శాసనకర్తలుగా తమను తాము
ప్రకటించుకునే ధైర్యం వీళ్ల కెక్కడి నుంచి వచ్చింది? దీపా
మెహతా 'వాటర్' సినిమా వారణాసిలో తీయలేక శ్రీలంకలో తీసినప్పుడే ఈ
శాసనకర్తలు బలం పుంజుకోలేదా? ఆ రోజు మనందరం... ప్రజాస్వామిక వాదులమనీ, లౌకిక వాదులమనీ చెప్పుకునే మనందరం విఫలమయ్యాం.
అంతకు ముందే, బాబ్రీ మసీదు ఘటన నాటికే విఫలమయ్యాం. మన వైఫల్యమే
వాళ్ళ విజయమవుతోంది, ప్రతిసారీ! ఎందుకు విఫలమవుతున్నామని ఇవాళైనా
ఆలోచించుకోకపోతే ఆలోచించటానికి ఎవరూ మిగలరు. ఇది నిరాశ కాదు, ఆవేదన.
బిలాల్ అనే ఆ దర్శకుడు తన సినిమా
ప్రదర్శిస్తారని కాశ్మీరు నుంచి కేరళ వచ్చాడు. ఈ సంగతి తెలిసి చాలా అమాయకంగా, ''నా సినిమాలో రాజకీయాలు లేవు. నాకు ఏ రాజకీయాలతో
సంబంధం లేదు. ఎందుకిలా జరుగుతోంది'' అని
అడిగాడు. ఆ సినిమా, కాశ్మీర్‌లో భద్రతా బలగాలు పాల్పడే అఘాయిత్యాల
గురించి. కాశ్మీరులోని ఒక గ్రామంలోని స్త్రీలందరిపైనా భద్రతా బలగాలు అత్యాచారం
చేశాయి. ఆ స్త్రీలతోనే ఆ వాస్తవాన్ని చెప్పించాడు. ప్రభుత్వం దాచేయదల్చుకున్న
వాస్తవాలను విప్పి చెప్పాడు. ఆ సినిమాను సెన్సార్‌బోర్డు చూసింది.
ప్రదర్శనయోగ్యమని సర్టిఫికెట్ ఇచ్చింది. ఐనాసరే, హిందూత్వశక్తులు
ఆ సినిమా వెంటపడి, ఆ సినిమాను ప్రదర్శించనివ్వటం లేదు. భద్రతాదళాల
గురించి వ్యతిరేకంగా ఎవరేం చెప్పినా హిందువుల పరువు, దేశ
ప్రతిష్ట దెబ్బతింటాయట! ఎంత ఘోరం! రక్షించవలసినవాళ్ళే అత్యాచారాలు చేస్తే ఎవరి
పరువు ప్రతిష్టలూ పోవు. దేశ గౌరవం సురక్షితంగా ఉంటుంది. కానీ, ఆ స్త్రీలు మాకిలా జరిగిందని చెబితే దేశానికి
ప్రమాదం ముంచుకొస్తుంది. ఇదెక్కడి న్యాయం? దీని తరఫున మాట్లాడేవాళ్ళెవరు?
కేరళలో కొందరు దర్శకులు, రచయితలు దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు.
బి.జె.పి వాళ్ళు ఎలా ఆపుతారో చూస్తామన్నారు. సినిమా ప్రదర్శన జరిగి తీరుతుందని
దర్శకుడికి హామీ ఇచ్చారు. 14వ తారీఖున ప్రదర్శన జరిగే చోటికి బిజెపి, ఆర్.ఎస్.ఎస్, వి.హెచ్.పి.
మనుషులు వచ్చి గొడవ చేశారు. వీళ్ళూ వెనక్కు తగ్గలేదు. కొట్లాట జరిగింది.
ఒకరిద్దరికి దెబ్బలు తగిలాయి. గ్లాసులు పగిలాయి. కుర్చీలు విరిగాయి. చివరకు
పోలీసులు వచ్చి బిజెపి వాళ్లను అక్కడి నుంచి వెనక్కు పంపారు. కార్యక్రమం
కొనసాగింది. భావ ప్రకటనా స్వేచ్ఛమీద నమ్మకమున్న కళాకారులు, సాంస్కృతిక కార్యకర్తలు ఉండటం వల్ల గొడవ జరిగినా
కార్యక్రమం కొనసాగింది. ముందే భయపడి ప్రదర్శన ఆపేస్తే అంతకంటే పిరికితనం ఏముంటుంది?
దేశంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. కానీ ఈ గొడవ చాలా విలువైనది. మనం గొంతెత్తటానికి, పాటలోనో, కవిత్వంలోనో, సినిమాలోనో మన ఆలోచనలను, దేశంలోని యధార్థస్థితిని చెప్పటానికి మనం భయపడకుండా గొడవ పడాలి. ఆ గొడవ చెయ్యకపోతే, ఒక పుస్తకం లేకపోతే ప్రపంచం మునిగిపోదనుకుంటే, ఒక పాట పాడకపోతే ప్రజలకేం ప్రమాదం రాదనుకుంటే, ఒక సినిమా తియ్యకపోతే, ప్రదర్శించకపోతే, ముంచుకు పోయిందేమనుకుంటే ఆ ఉదాసీనత చివరకు ప్రజలందరి గొంతులనూ నొక్కేస్తుంది. అందుకే వెండీ డానిగర్ పుస్తకం మీద కేసు వేసిన వ్యక్తి మీదకంటే పెంగ్విన్ మీద ఎక్కువ కోపం రావాలి మనకు. ఫాసిస్టు శక్తులు బలపడుతున్నాయనీ మనకు తెలుసు. ఢిల్లీ సింహాసనం కోసం ఆరాటపడుతున్నాయనీ తెలుసు. సింహాసనాల సంగతి ప్రజలు చూస్తారు. ప్రజల ప్రాథమిక హక్కుల గురించి మనం చెయ్యవలసింది చాలా ఉంది. పెంగ్విన్ తగలబెట్టిన ఆ పుస్తకాన్ని అన్ని భారతీయ భాషలలోకీ అనువదించి, ప్రచురించగల ప్రచురణ సంస్థ ఏదైనా ఉందా? అలాంటి ప్రచురణాలయాలు, రచయితల పక్షాన నిలబడే ప్రచురణ సంస్థలు కావాలి మనకిప్పుడు. ఆ సంస్థలను కాపాడుకునే నిబద్ధత ఉన్న వ్యక్తులు పౌర సమాజానికి అత్యవసరం.
- ఓల్గా, వసంత కన్నబిరాన్
(ప్రజాశక్తి 20.2.2014)
No comments:
Post a Comment