Wednesday, February 5, 2014

పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే ప్రయత్నాలు

పార్లమెంటు ఎన్నికలు జరిగిన అనంతరం గెలిచిన ఎం పి లు ప్రధాన  మంత్రిని ఎన్నుకోవాలి. ఇది పార్లమెంటరీ విధానం. కాబట్టి ఫలానా వారు ప్రధాన మంత్రి అభ్యర్థి అని ముందే ప్రకటించటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య  పద్ధతికి విరుద్ధం. అయినప్పటికి బి జె పి వాళ్ళు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారికముగా ప్రకటించకపోయినా రాహుల్ గాంధీయే తమ ప్రధాన మంత్రి అభ్యర్థి అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ వున్న మన దేశములో ఎన్నికలు పార్లమెంటు సభ్యులను ఎన్నుకోటానికే జరుగుతాయిగాని ప్రధాన మంత్రిని ఎన్నుకోటానికి జరగవు.ఆ విధముగా ముందే ప్రకటించటం పార్లమెంటరీ విధానానికి బదులు అధ్యక్ష తరహా పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టే ప్రయత్నములో భాగమే.
భారత ప్రజలు తమ సార్వభౌమత్వాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రతి 5 సంవత్సరాలకి ఒక సారి పార్లమెంటు/శాసన సభ్యులను ఎన్నుకొంటారు.ఆ పార్లమెంటు/శాసన సభ్యులు తమ నియోజక వర్గ ప్రజలకు జవాబుదారీగా వుండాలి.  ఏ పార్టీకి లేదా ఏ సంఘటనకు ఎక్కువమంది పార్లమెంటు/శాసనసభ్యులు వుంటే వారు కేంద్రం లో/రాష్ట్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆవిధముగా ఏర్పడిన ప్రభుత్వము(కార్యనిర్వాహక వర్గము) పార్లమెంటుకు/శాసనసభకు జవాబుదారీగా వుండాలి.   పార్లమెంటు/శాసనసభ ప్రజలకు జవాబుదారీగా వుండాలి. అటువంటప్పుడు ఒక వ్యక్తిని “ప్రధానమంత్రి అభ్యర్థి” గా ముందే ప్రకటించటం పనికి రాదు. ఒక వేళ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించబడిన వ్యక్తి తన నియోజకవర్గములో ఓడిపోతే ఆ పార్టీ లేదా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదా? అత్యంత శక్తిశాలియయిన ఇందిరా గాంధీ కూడా ఎన్నికలలో ఓడిపోయింది. అందుకనే వామపక్ష పార్టీలు మినహా ఇతర పార్టీల నాయకులు ఒకటికన్నా ఎక్కువ నియోజక వర్గాలలో పోటీ చేస్తుంటారు. మన ప్రస్తుత ప్రధానమంత్రి తాను ప్రధాన మంత్రిగా  గా వున్న కాలం లో ఎన్నడూ  లోక్ సభకి  పోటీ చేయలేదు.
భారతదేశం లో వున్న వైవిధ్యాన్ని , భాష, సంస్కృతి , జాతి, మతం లలో బహుళత్వాన్ని దృష్టిలో వుంచుకుని మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగములో పొందుపరచారు. మన ప్రజాస్వామ్యం ఈ బహుళత్వాన్ని ప్రతిబింబించేదిగా వుండాలంటే రాజ్యాంగం యొక్క అన్ని  సంస్థలలో దీనికి చోటివ్వాలి. అందుకనే భారత దేశాన్ని ఏక శిలా సదృశమయినదిగా  కాకుండా  రాష్ట్రాల సమాఖ్యగా నిర్ణయించారు. రాజ్యాంగములో మొదటి అధికరణములోనే భారత దేశాన్ని “భారతదేశమంటే రాష్ట్రాల సమాఖ్య” అని నిర్వచించటం జరిగింది. కాబట్టి భారతదేశ సమాఖ్య స్వభావం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే కాపాడటం సాధ్యమవుతుంది. అధ్యక్ష పాలన వైవిధ్యము లేని దేశాలలో ప్రజలలో అత్యధికులు ఒకే భాష మాట్లాడుతూ ఒకే జాతిగా వున్న దేశాలలో సమర్థవంతంగా పని చేస్తుంది. కానీ ఇన్ని భాషలు, ఇన్ని జాతులు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని మతాలు వున్న మన దేశానికి అది కుదరదు.
బి జె పి/ఆర్ ఎస్ ఎస్ లు ఎప్పటినుండో మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష పాలనా విధానముగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయి. 1991 ఎన్నికల ప్రణాళికలో తాము గెలిస్తే ప్రస్తుత పార్లమెంటరీ పాలనా విధానానికి బదులు అధ్యక్ష పాలనా విధానాన్ని ప్రవేశ పెట్టే విషయం పరిశీలించేందుకు ఒక కమిషన్ ను నియమిస్తామని బి జె పి అన్నది. అధ్యక్ష పాలనలో అధికారాలన్నీ అధ్యక్షునికే వుంటాయి. రాజ్యాంగం లోని వివిధ సంస్థలను నిర్వహించేందుకు అధ్యక్షుడు తనకి నచ్చిన వ్యక్తులను నియమిస్తాడు. ఇటువంటి అధ్యక్ష తరహా పాలన కావాలని బి జె పి కోరటం లో వుద్దేశం భారత లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థని పరమత సహనం లేని ఫాసిస్టు హిందూ రాజ్యముగా మార్చాలనే ప్రణాళికని ముందుకు తీసుకెళ్ళటానికే.
భారత రిపబ్లిక్ స్వర్ణోత్సవాల సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ప్రసంగిస్తూ  ఆనాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్, పార్లమెంటరీ ప్రజాస్వామిక తరహా ప్రభుత్వ రూపాన్ని మన రాజ్యాంగ నిర్ణేతలు లోతుగా చర్చించి ఆలోచించిన అనంతరం నిర్ణయించారని అన్నారు. రాజ్యాంగ ముసాయిదాని తయారు చేసిన కమిటీ,  స్థిరత్వానికన్నా జవాబుదారీతనానికి, ప్రభుత్వాన్ని రోజూ పరీక్షనేదుర్కొనేలా చేయటానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిందని డాక్టర్ అంబేద్కర్ అన్నారని చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వ రోజు వారీ కార్యక్రమాలలో జవాబుదారీ తనం రాబట్టటం  కష్ట సాధ్యముగా వున్నదని అన్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్ణాయక సభ ఉద్దేశ పూర్వకముగా, బాగా ఆలోచించిన అనంతరం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన దేశానికి నిర్ణయించింది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అప్పటివరకూ మన దేశాన్ని పాలించిన బ్రిటిష్ వారి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని చూసి మాత్రమే రూపొందించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాపు పునాదులు  మన దేశం లో ఎప్పటినుండో వున్నాయి. బౌద్ధ సంఘాలు పార్లమెంటరీ తరహా వ్యవస్థలని రాజ్యాంగ సభ లో  అంబేడ్కర్ అన్నారు. ఆధునిక పార్లమెంటరీ వ్యవస్థలో వున్న తీర్మానాలు, వోటింగు, విప్ జారీ చేయటం వంటివి బౌద్ధ సంఘాలలో వుండేవన్నారు. కాబట్టే మన దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వరించటం సులువయిందన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లోనే నియంతృత్వ పోకడలను(ఎమర్జెన్సీని) మనం అనుభవించాము. అధ్యక్ష తరహా పాలనలో ఈ నియంతృత్వ పోకడలకు మరిన్ని ఎక్కువ అవకాశాలుంటాయి.
కాంగ్రెస్, బి జె పి లు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను తాము నెరవేర్చనందునే, ఆ ఒత్తిడి కారణంగానే తమ మిత్రపక్షాలు తమ నుండి దూరమయ్యాయని బి జె పి, కాంగ్రెస్ లు గుర్తించాలి. తమ జీవన ప్రమాణాలను దెబ్బ తీస్తున్న ఆర్థిక భారాలనుండి ప్రజలు ఉపశమనాన్ని కోరుతున్నారు. ఆర్థిక విధానాలు, అవినీతి విషయం లో కాంగ్రెస్ కు, బి జె పి కి తేడా లేదని ప్రజలు సరిగానే గుర్తించారు. కుంభకోణాల మరకలున్న యెడియూరప్పను తిరిగి తమ పార్టీలో చేర్చుకోటం, కోర్టు దోషి అని తేల్చిన తరువాత కూడా గుజరాత్ మంత్రివర్గం లో మోడీ ఒక మంత్రిని కొనసాగించటం ఉన్నత స్థానాలలో అవినీతిని బి జె పి ఏ విధముగా సమర్థిస్తున్నదీ రుజువు చేస్తున్నది.
పార్లమెంటులో అనుభవం కూడా బి జె పి, కాంగ్రెస్ ల మధ్య తేడా లేదని రుజువు చేస్తున్నది. 2జి స్పెక్ట్రమ్ కుంభ కోణం, బొగ్గు కుంభ కోణం వంటి కుంభకోణాలపై పార్లమెంటులో చర్చ జరగకుండా అల్లరి చేసి బి జె పి అడ్డుకున్నది. ఇందుకు కారణం ఈ చర్చ జరిగితే వాజపాయీ హయాములో తమ పాలనలో జరిగిన కుంభకోణాలు బయటపడతాయని భయపడటమే. కాబట్టి ఈ విషయములో కాంగ్రెస్-బి జె పి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనే ఆరోపణలు అవాస్తవమని అనుకోలేము. కోట్లాది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ప్రమాదం తెచ్చే విధముగా పెన్షన్ ఫండ్స్ లో ఎఫ్ డి ఐ కి అనుమతించే బిల్లుకు పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లు రెండూ కలిసి ఆమోదించాయి. బ్యాంకుల జాతీయకరణ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధముగా ప్రయివేటీకరణ మరియు విదేశీ ఫైనాన్స్ కంపెనీలను అనుమతించే బిల్లును పార్లమెంటులో కాంగ్రెస్, బి జె పి లు రెండు కలిసి బలపరచాయి. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ ను  అంతర్జాతీయ ఫైనాన్సు పెట్టుబడి సంస్థల జూదానికి బలి చేసే విధానాలను కాంగ్రెస్, బి జె పి లు సమర్థిస్తున్నాయి, రెండూ ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి.
ఈ పరిస్థితులలో ప్రజలు కాంగ్రెస్, బి జె పి లకు ప్రత్యామ్నాయముగా ఏదయినా బలమయిన శక్తి కనపడితే దానికి వోటు వేస్తున్నారు. ఢిల్లీ లో ఆం ఆద్మీ పార్టీ విజయం ఇందుకు నిదర్శనం.ఒక ఆదర్శ వంతమయిన, అవినీతి రహితమయిన లౌకిక ప్రజాస్వామిక రాజ్యాన్ని సాధించాలనే ఆకాంక్ష తో మధ్యతరగతి ప్రజలు ఆం ఆద్మీ పార్టీని ఢిల్లీ లో సమర్థించారు. మధ్యతరగతిలో వున్న ఈ మద్దతుతోపాటు గృహాలకు సగం రేటుకే విద్యుత్తు, 700 లీటర్ల ఉచిత నీరు వంటి వాగ్దానాల జల్లులతో ఆం ఆద్మీ పార్టీ విజయాన్ని సాధించింది.
అయితే అటువంటి “ఆదర్శ రాజ్యం” సరళీకృత ఆర్థిక విధానాల పరిధిలో  సాధ్యమయ్యేది కాదు. అవినీతి, ప్రజలపై భారాలు అనేవి కాంగ్రెస్ లేదా బి జె పి నాయకత్వాలలో వున్న సంఘటనలు అమలు చేసే విధానాలలో అవిభాజ్యమయిన భాగాలుగా వున్నాయి. ఈ విధానాలకు భిన్న మయిన ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేస్తేనే అవినీతిని, ప్రజలపై భారాన్ని నివారించటం సాధ్యమవుతుంది. ఆం ఆద్మీ పార్టీ మత తత్వ శక్తులు, ఆర్థిక విధానాల విషయం లో తన వైఖరి ఏమిటో స్పష్టం చేయటం లేదు. మన దేశ విదేశాంగ విధానం ఏ విధముగా వుండాలి, ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలు- ఈ విషయాల పట్ల కూడా తన వైఖరి ఏమిటో ఆం ఆద్మీ పార్టీ చెప్పటం లేదు. ప్రత్యామ్నాయ విధానాలు కావాలనే వైఖరి లోపిస్తే అది ప్రస్తుత ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు అవినీతి మరియు  ప్రజలపై భారాలు మోపే విధానాలు బలపడటానికే దారి తీస్తుంది.
కాబట్టి ఇప్పుడు అనుసరించబడుతున్న ఆశ్రిత పెట్టుబడిదారీ అవినీతికర విధానాల స్థానం లో ప్రత్యామ్నాయ విధానాలు రావాలి. ప్రజందరికి సార్వత్రికముగా హక్కులిచ్చే విధానాలు కావాలి.  దాన ధర్మం లాగా కాకుండా అందరికీ ఆహార భద్రత, ఉచిత ఆరోగ్య సంరక్షణ, సార్వత్రిక ఉచిత విద్య,  పని హక్కు లేదంటే తగినంత నిరుద్యోగభృతి, వయోవృద్ధుల సంరక్షణ, భిన్న సామర్థ్యం కలవారికి(వికలాంగులకు) తగు పథకాలు -ఇవి ప్రత్యామ్నాయ విధానపు ముఖ్య భాగాలుగా వుండాలి. ఈ ప్రత్యామ్నాయ విధానం మానవతా దృష్టి రీత్యా మాత్రమే గాక ఆర్థిక అభివృద్ధి  పరంగా కూడా సమంజసమయిందే. ప్రజలకు ఈ హక్కులివ్వటం వలన దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమయిన అదనపు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలుశక్తి పెరిగితే సరుకుల తయారీ పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, దాని వలన ఉద్యోగిత విస్తారంగా పెరుగుతుంది. ఫలితముగా ఆర్థిక సమానతతో కూడిన ఒక మన్నికగల ఆర్థిక పెరుగుదల సాధ్యమవుతుంది.
కాబట్టి మనకు కావాల్సింది ఎన్నికల ప్రత్యామ్నాయం మాత్రమే కాదు. ఒక శక్తివంతమయిన ప్రజాపోరాటం మాత్రమే 2014 లో అటువంటి వామ పక్ష-ప్రజాస్వామిక-లౌకిక ప్రత్యామ్నాయాన్ని ముందుకు తీసుకురాగలదు.
(పీపుల్స్ డెమోక్రసీ 2.2.2014 సంచికలో సీతారాం యేచూరి సంపాదకీయానికి ఇది స్వేచ్ఛానువాదం)



No comments:

Post a Comment