Sunday, August 30, 2020

విద్వేష రాజకీయాలతో ఫేస్ బుక్ లాలూచీ

 

బిజెపికి, ఫేస్‌బుక్‌కి నడుమ ఉన్న లోపాయకారీ లాలూచీ కాస్తా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంతో బట్టబయలైంది. భారతదేశంలో కొందరు బిజెపి నేతలు ఫేస్‌బుక్‌ ద్వారా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రచారాలకు పాల్పడినా, వారిపైగాని, ఆ పోస్టింగులపై గాని ఎటువంటి చర్యా తీసుకోరాదంటూ ఫేస్‌బుక్‌ భారతదేశ ప్రతినిధి అంఖిదాస్‌ అడ్డుపడ్డారంటూ 'వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌' ఆ వివరాలను బైటపెట్టింది. బిజెపి నేతలు పెట్టిన పోస్టింగులు 'ప్రమాదకరం' అని, 'విద్వేషపూరితం' అని, అవి హింసకు దారితీస్తాయని ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కొందరు ఎత్తిచూపినా, ఈ దేశంలో ఫేస్‌బుక్‌ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న కారణాన్ని చూపి అంఖిదాస్‌ ఆ పోస్టింగులపై ఎటువంటి చర్యా తీసుకోకుండా చూశారని ఆ పత్రిక తన కథనంలో బైటపెట్టింది. ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువమంది ఫేస్‌బుక్‌ వాడకందార్లు భారతదేశంలోనే ఉన్నారు. పైగా, ఫేస్‌బుక్‌ ఇటీవలే రిలయన్స్‌ జియోలో రూ.40,000కోట్లకుపైనే పెట్టుబడులుపెట్టింది.


కొన్ని రాజకీయ పార్టీలతో, నాయకులతో చేతులు కలిపి వారి ప్రతిపక్షాల గొంతులు వినబడకుండా చేయడానికి ఫేస్‌బుక్‌ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని వ్యాపింప చేసే ట్రోల్స్‌తో కలిసి తీవ్రమైన భావజాలాన్ని, సిద్ధాంతాలను ప్రచారం చేసిందని డిసెంబరు 2017లోనే 'బ్లూమ్‌బెర్గ్‌' అనే పత్రిక ఫేస్‌బుక్‌ గురించి రాసింది.  ఫేస్‌బుక్‌ కు చెందిన కేటీ హార్‌బాత్‌ నాయకత్వంలో ఒక గ్లోబల్‌ ప్రభుత్వమే నడుస్తోందని, దాని రాజకీయ బృందం ఇండియా, బ్రెజిల్‌, జర్మనీ, బ్రిటన్‌ తదితర పెద్ద పెద్ద దేశాలలోని కొన్ని రాజకీయ పార్టీలకు సహాయపడుతూ ఉంటుందని, ఫేస్‌బుక్‌ ఉద్యోగులే ఒక విధంగా ఆయా పార్టీలకు ప్రచార కార్యకర్తలుగా పని చేస్తుంటారని 'బ్లూమ్‌బెర్గ్‌' రాసింది.


ఫేస్‌బుక్‌కు అతి ఎక్కువమంది వినియోగదారులు భారతదేశంలోనే ఉన్నారు. అంతే కాక, అతి ఎక్కువ వాట్సప్‌ వాడకందారులు కూడా వీరే. 2018లో ఫేస్‌బుక్‌ ఈ వాట్సప్‌ను దాదాపు రు.1,50,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వాట్సప్‌ ను నిర్వహించే విధానం చాలా అస్పష్టంగా, ఫేస్‌బుక్‌ కన్నా ఎక్కువ అస్పష్టంగా ఉంటుంది. బిజెపి కి, ఆ పార్టీకి చెందిన 'ట్రోల్‌' సైన్యానికి ప్రధాన వేదికగా ఈ వాట్సప్‌ ఉంది. ముస్లిములే కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకులన్న ప్రచారాన్ని, లవ్‌ జిహాద్‌ ప్రచారాన్ని, అదే తరహాలో ఇతర విద్వేష ప్రచారాలను ఫేస్‌బుక్‌లో చేసిన బిజెపి నాయకులెవరిపైనా ఫేస్‌బుక్‌ ఏ చర్యా తీసుకోలేదు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ఈ వివరాలను తెలిపింది.


ప్రజలందరికీ ఒక సమాచార సాధనంగా ఉపయోగపడే ఫేస్‌బుక్‌ నిర్వహణ బాధ్యతలను అంఖిదాస్‌ వంటి వ్యక్తులకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నను వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ లేవనెత్తింది. ఈ సందర్భంగా భారతీయ ముస్లింలు ఒక దిగజారిన సమూహం అన్న ఒక పోస్టును అంఖిదాస్‌ తన స్వంత పేజీలో పోస్టు చేసిన వైనాన్ని ఆ పత్రిక ఉదహరిం చింది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వ్యాసాన్ని బట్టి ఫేస్‌బుక్‌లో ఈ తేడా అంతటికీ అంఖిదాస్‌ అనే ఒక వ్యక్తి కారణం అన్న అభిప్రాయం కలుగుతుంది. కాని అసలు సమస్యకి మూలం ఇంకా లోతైనది.

 

గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి డిజిటల్‌ గుత్త సంస్థలు వాటి ఆర్థిక బలానికి మించి ఇంకా ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నాయి. పెట్టుబడిదారీ సమాజంలో మీడియాను బతికించి వుంచేది యాడ్స్‌ ఆదాయం అన్న సంగతి అందరికీ తెలుసు. ప్రజలను ప్రభావితం చేసే శక్తి మీడియాకు ఎంత ఉందో అదీ తెలుసు. ఎంత ఎక్కువమంది పాఠకులు లేదా వీక్షకులు ఉంటే యాడ్స్‌ ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ డిజిటల్‌ మీడియా యాడ్స్‌ ఆదాయంలో ప్రధాన భాగాన్ని చేజిక్కించుకుంటోంది. వారి ఆదాయం ఇంకా ఎక్కువగా పెరగాలంటే వీక్షకులు పెరగాలి, వారు చూసే సమయమూ పెరగాలి. ఇదెలా జరుగుతుంది? కపిల్‌ మిశ్రా ఢిల్లీలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా రోడ్లపై బైఠాయించిన వారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టాక, నిరసనకారులు ఖాళీ చేయకుంటే వారిపై భౌతిక దాడులు తప్పవని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టాక, వాటిని వీక్షించిన వారి సంఖ్య పది రెట్లు పెరిగింది. కనుక ఈ తరహా పోస్టులను అనుమతిస్తే ఫేస్‌బుక్‌ యాడ్‌ ఆదాయం పెరుగుతుందన్నమాట!


మీడియాకి ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా, ప్రజల ప్రయోజనాల కోసం దానిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. 
ఈ విషయంలో ప్రెస్‌ కౌన్సిల్‌ కి ఒక నియమావళి ఉంది. పెయిడ్‌ న్యూస్‌ లతో దానిని ఉల్లంఘించినప్పుడు ఒక కమిటీ వేసి చక్కదిద్దే ప్రయత్నం పరిమితంగానైనా జరిగింది. అమెరికాలో ఒక తరహా మీడియా సంస్థ మరో తరహా సంస్థలో వాటాలు కలిగివుండకూడదన్న ఆంక్షలు ఉన్నాయి (ప్రింట్‌ మీడియా సంస్థకు టి.వి చానెళ్ళ లో వాటాలు ఉండకూడదు వంటి నిబంధనలు). అలాగే టెలికాం కంపెనీలకు మీడియా కంపెనీల్లో వాటాలు వుండకూడదు.


ఇక్కడ రెండు విషయాలు గుర్తించాలి. మీడియా వ్యాపారం ఇతర వ్యాపారాల వంటిది కాదు. అది ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేయగలదు. ఇక ప్రజాస్వామ్యానికి అన్నింటికన్నా పెద్ద ప్రమాదం గుత్త సంస్థల నుండే వస్తుందన్నది రెండో విషయం. 'మనకి ప్రజాస్వామ్యమైనా ఉంటుంది, లేదా కొద్దిమంది చేతుల్లో సంపదను కేంద్రీకరించే గుత్త సంస్థలైనా ఉంటాయి. కాని రెండూ ఏక కాలంలో ఉండవు' అని అమెరికన్‌ న్యాయమూర్తి బ్రాండీస్‌ ''స్టాండర్డ్‌ ఆయిల్‌'' గుత్త సంస్థ ఆధిపత్యాన్ని సవాలు చేసిన కేసులో విచారణ సందర్భంగా అన్నారు.


మళ్ళీ చాలా కాలం తర్వాత అమెరికన్‌ పార్లమెంటు లో ఈ గుత్తాధిపత్యం విషయం ఈ మధ్య చర్చకు వచ్చింది. ఆ పార్లమెంటరీ కమిటీల ముందు గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌ సంస్థలు విచారణకు హాజరయ్యాయి. ఈ నాలుగు సంస్థల షేర్ల మార్కెట్‌ విలువ 4 లక్షల కోట్ల డాలర్లు దాటి వుంది (అంటే రూ.300 లక్షల కోట్లు). ఇది జర్మనీ దేశపు జిడిపి కన్నా ఎక్కువ. అంటే, అమెరికా, చైనా, జపాన్‌ దేశాల తర్వాత బలమైన ఆర్థిక శక్తి ఈ నాలుగు సంస్థలే. ఈ శక్తితోటే అవి బలమైన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలను లంగదీయడం, బెదిరించడం, వాటి చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడం వంటివి చేయగలుగుతున్నాయి. సమాజ హితానికి, కంపెనీల స్వంత లాభాలకు మధ్య ఎంచుకోవలసి వస్తే ఆ కంపెనీలు సమాజ హితానికి పెద్దపీట వేస్తాయని ఎవరైనా భావిస్తే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు.

 

ఫేస్‌బుక్‌ ఆదాయంలో 98.5 శాతం యాడ్స్‌ నుంచే వస్తుంది. యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం వీక్షకుల సంఖ్య పైన, వారు వీక్షించే సమయం పైన ఆధారపడి వుంటుంది. ఒక పోస్టు ఎంత వైరల్‌ అయితే ఫేస్‌బుక్‌ కి అంత లాభం. అందువలన అటువంటి వైరల్‌ అయ్యే పోస్టులను నిషేధించాలనో, నియంత్రించాలనో ఫేస్‌బుక్‌ కోరుకోదు. పైకి సమాజంలో సామరస్య వాతావరణం ఉండాలని, ఆరోగ్య కరంగా చర్చలు జరగాలని ఎంత చెప్పినా, ఫేస్‌బుక్‌ వ్యాపార ప్రయోజనాలు మాత్రం ఎక్కువగా వైరల్‌ అయ్యే పోస్టులతోనే ముడిపడి వున్నాయి. ఈ జబ్బు ఒక ఫేస్‌బుక్‌ కే పరిమితం అయిలేదు. గూగుల్‌కి కూడా దాని యూట్యూబ్‌ వీడియోలతో ఇటువంటి ప్రయోజనాలే ఉన్నాయి. అయితే, ఫేస్‌బుక్‌ మాత్రం నిస్సందేహంగా విద్వేష రాజకీయాలను, ఫేక్‌ న్యూస్‌ ను ప్రచారం చేయడంలో అందరికన్నా ముందుంది.


ట్రంప్‌, బోల్సనారో, మోడీ  ఈ ముగ్గురికీ మితవాద రాజకీయాలు ఉమ్మడి అంశం. వాటితోబాటు తమ ప్రచారంలో వాట్సప్‌ పైన, ఫేస్‌బుక్‌ పైన ఎక్కువగా ఆధారపడడం ఈ ముగ్గురికీ ఉన్న మరో ఉమ్మడి అంశం. టి.వి చానెళ్ళలో ఫ్యాక్స్‌ న్యూస్‌ (అమెరికా), రిపబ్లిక్‌ టి.వి (ఇండియా) వంటివి ఏ విధంగా ఇతర పార్టీల వారిని మాట్లాడనివ్వకుండా ఒక పార్టీ తరఫునే వకాల్తా పుచ్చుకుని పని చేస్తాయో చూస్తున్నాం. అయితే ఆ సంగతి అందరికీ బోధపడిన విషయమే. కాని ఫేస్‌బుక్‌, వాట్సప్‌ అలా కాదు. తమ పాత్ర ఏమీ లేనట్టే ఉంటూనే ఎన్నికలలో విద్వేష రాజకీయాలను, ఫేక్‌ న్యూస్‌ ను బాగా ప్రచారం లోకి తీసుకువస్తాయి. బిజెపి, ఇతర మితవాద శక్తులు సోషల్‌ మీడియాను ఉపయోగించుకోవడంలో, వాటి ప్రయోజనాన్ని అర్ధం చేసుకోవడంలో తక్కిన వారందరికన్నా ముందున్నాయని చాలామంది అనుకుంటారు. అందువల్లనే ఆ శక్తులు విజయాలు సాధించగలుగుతున్నాయని అనుకుంటారు. కాని ఫేస్‌బుక్‌ ఈ మితవాద శక్తులకు తోడ్పాటునివ్వడం యాదృచ్ఛికం కాదని, తన వ్యాపార ప్రయోజనాల కోసమే అలా చేస్తోందని వారు తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇప్పుడు స్పష్టంగా బైటకు వస్తున్నాయి కూడా.


విద్వేష ప్రసంగాలు, పోస్టులు సోషల్‌ మీడియాలో చొరబడిన పురుగులని, వాటిని ఏరిపారేయాలని అనుకుంటూ వచ్చారు. కాని అవి సోషల్‌ మీడియాకు అత్యంత అవశ్యమైన అంతర్భాగం అని గ్రహించాలి. అందుచేత చాలా మర్యాదగా జుకర్‌బర్గ్‌కు, ఇతర డిజిటల్‌ గుత్త సంస్థల అధిపతులకు పిటిషన్లు పెడితే ఏమీ ఉపయోగం లేదు. వాటి గుత్తాధిపత్యాన్ని బద్దలుగొట్టి వాటిని ప్రజాప్రయోజనాల కోసం పని చేసే సర్వీసులుగా మార్చడమే నిజమైన పరిష్కారం.

రచయిత: ప్రబీర్‌ పురకాయస్థ; ప్రచురణ: ప్రజాశక్తి 29.8.2020 సంచిక 


ప్రబీర్‌ పురకాయస్థ 

 

Friday, August 28, 2020

కరోనా వైరస్ సమస్య- అసెంబ్లీ ల ఎన్నికలు- ఎన్నికల ప్రచారం


బీహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు కరోనా వైరస్ సమస్యని దృష్టిలో వుంచుకుని అసెంబ్లీ ఎన్నికలను ఆన్ లైన్ పద్దతిలో నిర్వహించాలని అన్నారు. ఈ సూచనను అత్యధిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. చాలా మంది వోటర్లు డిజిటల్ టెక్నాలజీని వినియోగించటం తెలియనందున రహస్యముగా ఓటు వేసే  అవకాశాన్ని కోల్పోతారు. ఇంతేగాక ఎన్నికల ప్రచారానికి కూడా డిజిటల్ ప్రచారమే వినియోగించాలని సూచించారు. ఇది కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమయినదే. డిజిటల్ (స్మార్ట్ ఫోన్) సౌకర్యం లేని వోటర్లకు ఈ ప్రచారం చేరదు.  ధన బలం వున్న రాజకీయ పార్టీలు సోషల్ మీడియా, టెలివిజన్, తదితర అనేక డిజిటల్ టెక్నాలజిల సహకారముతో విరివిగా తమ ఎన్నికల ప్రచారం చేసుకోగలుగుతాయి. ధనబలం లేని పార్టీలకు ఈ అవకాశం తక్కువగా వుంటుంది.

  2019 సార్వత్రిక ఎన్నికల సందర్భముగా ఆనాటి బి జె పి అధ్యక్షులు అమిత్ షా,  తమకి గల  32 లక్షల వాట్సప్  గ్రూప్ ల ద్వారా మెసేజిలు అవి ఒప్పయినా, తప్పయినా కొద్ది గంటలలోనే దేశ వ్యాపితముగా విస్తారముగా (వైరల్) ప్రచారం చేయగలిగే సామర్థ్యం తమకి  వున్నదని అన్నారు.  సోషల్ మీడియా లో జరిగే ప్రచారం తప్పో ఒప్పే చెప్పే అంతర్జాతీయ వెబ్ సైట్స్ ప్రకారం ప్రపంచం మొత్తం లో తప్పుడు వార్తలలో అత్యధికం భారత దేశం లో ఆవిర్భవించినవేనని తేల్చి చెప్పాయి.

ఇప్పుడు బీహార్ ఎన్నికలు త్వరలో జరగ బోతున్నందున బి జె పి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ పార్టీ నాయకుడు అమిత్ షా (కేంద్ర హోమ్ శాఖా మంత్రి) ఆన్ లైన్ ఎన్నికల సభ నిర్వహించారు. ఇందుకోసం 72000 ఎల్ఈ డి టి వి  మానిటర్లు ఏర్పాటు చేశారు.   60 వర్చువల్ ర్యాలీలను నిర్వహించిన  అనంతరం బి జె పి, తాము ఎన్నికల ప్రచారం లో 9500 ఐ టి సెల్సు కు ప్రత్యేక బాధ్యులను ఏర్పాటు చేశామని, వీరు ప్రతి పోలింగ్ బూత్  కు ఒక గ్రూప్ చొప్పున 72000 వాట్సప్  గ్రూప్ లను కొ ఆర్డినేట్ చేస్తారని అన్నది. ఇప్పటికే గత 2 నెలలలో 50,000 గ్రూప్ లను ఏర్పాటు చేశామని అన్నది.

ఈ స్థాయిలో డిజిటల్ ప్రచారానికి అవసరమైన సిబ్బందికి, మరియు టెక్నాలజీ కి అయ్యే భారీ ఖర్చును ఎవరు భరిస్తారు? కార్పొరేట్ల నుండి ఈ నిధులొస్తున్నాయి. ఎవరిచ్చారో చెప్పాల్సిన అవసరం లేని అనామక ఎన్నికల బాండ్స్ విధానాన్ని బి జె పి ప్రభుత్వము ప్రవేశ పెట్టినది. ఇందు కోసం ఫైనాన్స్ చట్టం 2017 ను, ఆదాయపు పన్ను చట్టాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించింది.  ఈ బాండ్స్ ద్వారా ఇతర రాజకీయ పార్టీలకు కొన్ని నిధులు సమ కూరినా వాటన్నింటికి వచ్చిన నిధులను  కలపగా వచ్చే మొత్తం కన్నా అనేక రెట్లు ఎక్కువగా బి జె పి కి ఈ పద్ధతిలో ఎన్నికల నిధులు లభిస్తున్నాయి. కార్పొరేట్ నిధులు అనామికముగా, అపరిమితముగా ఒక రాజకీయ పార్టీ కి ఇచ్చే వీలు కలిగించిన ఈ విధానం వలన ఎన్నికల ప్రజాస్వామ్యానికి మృత్యు ఘంటిక  మోగినట్లయింది. తమకి నచ్చిన రాజకీయ పార్టీకి ఎన్నికల నిధులు భారీ స్థాయిలో సమకూర్చి తమకి నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించుకునేందుకు, తమకి నచ్చిన విధానాలే అవి అమలు చేసేలా చేసేందుకు ఈ ఎన్నికల బాండ్స్ విధానం కార్పొరేట్సుకు ఉపయోగ పడుతుంది.   ఈ విధముగా బిజెపి, ఎన్నికల ప్రజాస్వామికానికి తిలోదకాలిచ్చే విధానాలను తీసుకొచ్చింది. కాబట్టి మన దేశం లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు ఎన్నికల బాండ్స్ విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల బాండ్స్ వలన రాజకీయ పార్టీలకు ఇచ్చే ఫండ్స్ విషయం లో పారదర్శకత లోపిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు చెప్పినది. ఇంతేగాక భారత కంపెనీలలో మెజారిటీ వాటాలున్న విదేశీ కంపెనీలు గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ పార్టీలకు  ఎన్నికల నిధులిచ్చే అవకాశం ఏర్పడినదని, ఇందువలన విదేశీ కంపెనీలు మన దేశ విధానాలను ప్రభావితం చేసే అవకాశం వుంటుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు సమర్పించిన ఎఫిడవిట్ లో చెప్పింది.

2019 లోక్ సభ ఎన్నికల సందర్భముగా “నమో టీవి” అనేది రూల్సుకు విరుద్ధముగా మార్మికముగా వచ్చింది. ఎన్నికలయిన తరువాత అంతర్ధానమయింది. ఎన్నికల సంఘం ప్రతినిధి ఈ డిటిహెచ్ చానల్ కు అయిన ఖర్చులను  బి జె పి భరించినదని అన్నారు. కానీ ఎన్నికల ఖర్చుకు సంబధించి ఎన్నికల సంఘానికి సమర్పించిన లెక్కల లో  ఈ చానల్ ఖర్చును బిజెపి చూపించ లేదని తెలిసింది. ఎన్నికల నియమావళికి సంబంధించి ఇది తీవ్రమైన ఉల్లంఘన. కాబట్టి బి జె పి పై ఎన్నికల సంఘం తగు చర్యను తీసుకోవాల్సిన అవసరం వున్నది.  ఒక బి జె పి నాయకునికి చెందిన ఎడ్వర్టైజింగ్ మరియు సోషల్ మీడియా కంపెనీకి ఎలక్షన్ కమిషన్ తరఫున ఎన్నికల ప్రక్రియ కి సంబంధించిన విషయాలపై  ఆన్ లైన్ ప్రచారం చేసే బాధ్యతని 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భముగా  మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అప్పగించినట్లు తెలుస్తున్నది.  ఇంతే గాక 2019 లోక్ సభ ఎన్నికల సందర్భములో కూడా ఎన్నికల సంఘం తరఫున చేసే ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతని ఇదే మీడియా కంపెనీకి అప్పగించ వచ్చునని సంబంధిత ప్రభుత్వ సంస్థలకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా,  అధికారమిచ్చినట్లు తెలిసింది.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలను  సమంజసమైన పద్ధతిలో నిర్వహించటమే గాక అలా నిర్వహించినట్లు కనిపించే విధముగా ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం వున్నది.

(ఇందులో వున్న అంశాలను  సిపి ఏం పార్టీ ప్రధాన  కార్యదర్శి శ్రీ సీతారాం ఏచూరి గారు 18.8.2020 న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కు రాసిన లేఖ నుండి తీసుకోటం జరిరిగినది) 

Thursday, August 27, 2020

రైతు వెన్నెముక విరిచే ఆర్డినెన్సులు

 


కేంద్ర ప్రభుత్వం జూన్‌ 5న తీసుకొచ్చిన మూడు ఆర్డినెన్సులు రైతు వెన్ను విరిచేస్తాయి. మన వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. పండిన పంటను రెగ్యులేటెడ్‌ వ్యవసాయ మార్కెట్‌లో కాక ఎక్కడైనా అమ్ముకోవచ్చునని తెచ్చిన ఆర్డినెన్సుతో కేంద్ర ప్రభుత్వం రైతుకు మద్దతు ధర చెల్లింపజేసే బాధ్యతకు మంగళం పాడడంతోపాటు వ్యాపారులు మార్కెట్‌ సెస్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించే పని లేకుండా చేస్తోంది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని చట్టబద్ధం చేసే రెండో ఆర్డినెన్స్‌ ద్వారా కార్పొరేట్లకు రక్షణ కల్పించనుంది. ఇక నిత్యావసర సరుకుల చట్టానికి సవరణ ఆర్డినెన్స్‌తో వ్యాపారులు వ్యవసాయోత్పత్తుల ధరలను దిగ్గొయ్యడానికి, వాటిని నల్ల బజారుకు తరలించడానికి మార్గం సుగమం చేస్తుంది.

 

దేశ విదేశీ కార్పొరేట్లకు మేలు చేసేందుకు భారత రైతు వెన్ను విరిచేందుకైనా మోడీ సర్కారు వెనకాడదనిఈ మూడు ఆర్డినెన్సుల జారీతో స్పష్టమయింది. భారత రాజ్యాంగంలో వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశం. కాబట్టి విధానపరమైన మార్పులు చేయాలంటే మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా శాసన సభల ఆమోదం కూడా అవసరం. ఇవేమీ లేకుండానే ఆర్డినెన్సులతో కీలక మార్పులు చేయడం ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం మాత్రమే కాక అత్యంత నిరంకుశ చర్య. ఆగస్టు 20 నుండి 26 వరకు సిపిఎం దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం ఛార్టర్‌లో 'మూడు ఆర్డినెన్సుల రద్దు' 6వ డిమాండ్‌గా వుంది.
రైతు పండించిన పంటను స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోనే అమ్ముకోవాలన్న నిబంధన పోయి, దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని బిజెపి పెద్దలు చెబుతున్నారు.

నిజానికి 2015-16 భూ కమతాల సెన్సస్‌ ప్రకారం 86.2 శాతం మందికి రెండు హెక్టార్లకు మించి భూమి లేదు. సన్న చిన్నకారు రైతు దేశంలో ఎక్కడికో సుదూర ప్రాంతాలకు పంటను ఎలా తీసుకెళ్తాడు? ఎలా అమ్ముకుంటాడు? కాబట్టి అదంతా అసత్య ప్రచారమే! వాస్తవం ఏమిటంటే పంటను మార్కెట్‌ యార్డులో కాకుండా ఎక్కడైనా కొనుక్కోవచ్చు కనుక ప్రైవేటు వ్యాపారులు తమ ఇష్టమొచ్చిన ధరను మాత్రమే చెల్లిస్తారు. పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్కెట్‌ సెస్‌ చెల్లించనక్కరలేదు (ఆర్డినెన్స్‌ క్లాజు6) ఆర్డినెన్స్‌ అసలు బండారం ఇదీ!

 

వ్యవసాయ మార్కెట్లను వ్యాపారుల స్వేచ్ఛకు వదిలేయాలని రెండు దశాబ్దాల క్రితం నుండీ ప్రపంచ బ్యాంకు చెబుతోంది. వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్‌ మార్కెట్‌ చట్టం రూపొందించి రాష్ట్రాలకు పంపింది కానీ అత్యధిక రాష్ట్రాలు అందుకు పూనుకోలేదు. ఇప్పుడు మోడీ సర్కారు నేరుగా ఆర్డినెన్స్‌ రూట్‌ను ఎంచుకుంది.


కాంట్రాక్టు వ్యవసాయాన్ని చట్టబద్ధం చేయడమేగాక కార్పొరేట్ల ఇష్టారాజ్యంగా మార్చి, రైతుల హక్కులు కాలరాసే ఆర్డినెన్సు ఇంకొకటి. కాంట్రాక్టు వివాదం ఏదైనా వస్తే ఆర్‌డిఓ తుది పరిష్కారం చేస్తారని చెప్పడం ద్వారా బలవంతులదే రాజ్యం అని చెప్పకనే చెప్పినట్టయింది. కాంట్రాక్టు, కార్పొరేట్‌ సేద్యం కూడా ప్రపంచ బ్యాంకు విధానాలే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమలు చేసి రైతులను భ్రష్టు పట్టించిన విషయం చాలామందికి గుర్తుండే వుంటుంది.

నిత్యావసర సరుకుల నిల్వలపై పరిమితులు ఎత్తేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ నల్ల బజారుకు గేట్లెత్తడమేగాక రైతు పంటకు న్యాయమైన ధర కూడా రాకుండా చేయడానికే. 1955 నుండి అమలులోవున్న నిత్యావసర సరుకుల చట్టానికి ఈ సవరణలు చేయడం ద్వారా వ్యాపారులు సరుకులను అపరిమితంగా నిల్వ చేస్తారు. వివిధ పంటలను అంతర్జాతీయ మార్కెట్‌లో చౌకగా దొరికేటపుడు కొని, ఇక్కడ స్టాక్‌ చేస్తారు. ఆ వ్యవసాయోత్పత్తులు నిల్వలు కావాల్సినంత వున్నాయని చెప్పి రైతుల నుండి తక్కువ ధరకు కొంటారు. కొంత కాలం తరువాత కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచి వినియోగదారుల్ని దోపిడీ చేస్తారు. ఇప్పుడైతే సరుకు నిల్వకు పరిమితులున్నాయి కనుక అది సాధ్యం కకావడంలేదు. ఇకపై దేశ, విదేశీ వ్యాపారులకు ఇష్టారాజ్యం అవుతుంది. ఈ ఆర్డినెన్స్‌ కూడా డబ్ల్యుటిఒ ఒప్పందాల కొనసాగింపుగానే వచ్చిందని నిపుణులు అంటున్నారు.

రైతులకు, యావత్‌ దేశానికి నష్టదాయకమైన ఈ మూడు ఆర్డినెన్స్‌లను ప్రతిఘటించడం ప్రతి దేశభక్తుని కర్తవ్యం. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. విస్తారమైన మార్కెట్‌ వ్యవస్థ కలిగిన పంజాబ్‌లో అక్కడి రైతులు ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం జరిపారు. ఈ ఆర్డినెన్సులను ఉపసంహరించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణ, కేరళ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్డినెన్సులను వ్యతిరేకించాయి కాని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం కిమ్మనలేదు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగినా, ఖజానాకు చిల్లు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నిరసన తెలియజేయడంతోపాటు ఆర్డినెన్సులను వ్యతిరేకించాలి.

Tuesday, August 25, 2020

హిందూ రాజ్యం అంటే హిందువులకెక్కువ ప్రయోజనం కలిగించే రాజ్యమనా?

 Posted On: 

బిజెపి హిందూ ఆధిపత్యవాద పార్టీ అని అందరికీ తెలుసు. ఫాసిస్టు తరహా సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ కి ఇది రాజకీయ వేదిక. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూ రాజ్యాన్ని నెలకొల్పడం లక్ష్యంగా పని చేస్తున్న సంస్థ. అయితే బిజెపి భారత రాజ్యాంగం పరిధికి లోబడి వ్యవహరించాల్సి వుంటుంది. అందుకే ఈ హిందూ రాజ్యం లక్ష్యం గురించి ఆ పార్టీ బాహాటంగా ప్రస్తావించలేదు. అయినా ఆ లక్ష్యాన్ని అమలులోకి తెచ్చే దిశగా అది ఆచరణలో వ్యవహరిస్తోంది. ఇంతకీ వాస్తవంలో హిందూ రాజ్యం అంటే ఏమిటి? అది లౌకికతత్వాన్ని దెబ్బ తీస్తుందని, ప్రత్యేకించి ముస్లింలను రెండో తరగతి పౌరులుగా దిగజారుస్తుందని అందరికీ స్పష్టం అవుతోంది. అయితే చాలామంది హిందూ రాజ్యం అంటే హిందువుల ప్రయోజనాల కోసం పని చేస్తుందని అనుకుంటున్నారు.


కాని ఇది మౌలికంగానే పొరపాటు అవగాహన. హిందూ రాజ్యం అనేది ఒక నిరంకుశ రాజ్యం. అది ముస్లింలను, హిందువులను కూడా అణచివేస్తుంది. వారి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుంది. దేశ రాజకీయ చట్రంలో ముఖ్యమైన ఫెడరల్‌ వ్యవస్థను నాశనం చేస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి, దేశీయ కార్పొరేట్ల యొక్క అవధులు లేని దోపిడీకి ముస్లింలనేగాక అత్యధికులు హిందువులను కూడా బలి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ రాజ్యం అంటే గుత్తపెట్టుబడి చలాయించే నియంతృత్వం. అంతేగాని కొందరు అనుకుంటున్నట్టు హిందువుల ఆధిపత్యం ఎంతమాత్రమూ కాదు. హిందూ రాజ్యంలో హిందువులు ఇంతకు ముందుకన్నా మెరుగైన పరిస్థితుల్లో ఉంటారనుకోవడం భ్రమ. నిజానికి గుత్తపెట్టుబడి విచ్చలవిడి దోపిడీ ఫలితంగా హిందువుల పరిస్థితి కూడా ముస్లింల మాదిరిగానే దయనీయంగా దిగజారుతుంది.


ఈ దేశంలో గుత్తపెట్టుబడి ఎప్పటి నుంచో తన ఆధిపత్యాన్ని చలాయిస్తూనే వుంది. అటువంటప్పుడు ఈ దేశ రాజకీయాల పైన, సమాజం పైన మరింతగా తమ పట్టు పెంచుకోవాలని వారు ప్రయత్నించడం దేనికోసం? హిందూ ఆధిపత్య సిద్ధాంతంతో ఉన్న బిజెపిని ఎన్నికలలో బలపరచడం, దానికే ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసేలా ఆ పార్టీకి అన్ని రకాలా తోడ్పాటునివ్వడం ఎందుకోసం?


గతం కన్నా ప్రస్తుత కాలంలో అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం మన దేశ ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బ తీస్తోంది. కార్పొరేట్ల వద్ద సంపద ఎంత ఎక్కువగా పోగుబడితే అంత ఎక్కువగా అది ప్రజల వద్దకు ప్రవహిస్తుందని ఇన్నాళ్ళూ చెప్పిన 'ట్రికిల్‌ డౌన్‌ సిద్ధాంతం' వట్టిదేనని ప్రజలకు అర్ధమై చాలా రోజులైంది. జిడిపి వృద్ధి చెందితే ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగా పెరుగుతుందని, తద్వారా పేదల కోసం ఖర్చు చేయడానికి ఎక్కువ వీలు కలుగుతుందని 11వ పంచవర్ష ప్రణాళిక డాక్యుమెంటులో చెప్పిందంతా బూటకమేనని కూడా ప్రజలకు బోధపడింది. ఆదాయాల నడుమ వ్యత్యాసాలు, సంపదలో వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సంక్షోభం ఫలితంగా గత ఐదు దశాబ్దాల కాలంలోనూ మనం ఎన్నడూ చూడనంత స్థాయికి నిరుద్యోగం ప్రబలింది. గ్రామీణ పేదరికం ఎంతగా పెరిగిందంటే దానికి సంబంధించిన వాస్తవాలు వెల్లడి కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ శాంపిల్‌ సర్వే వివరాలను తొక్కిపట్టింది. 2011 నుంచి 2018 మధ్య కాలంలో గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి 9 శాతం మేరకు పడిపోయింది. ప్రస్తుత కరోనా మహమ్మారి రాకమునుపే ఈ దేశ ప్రజలను పీల్చి పిప్పి చేయడం అసాధారణ స్థాయికి చేరింది. కరోనాతో ఇంకా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజలను పాత పద్ధతుల్లోనే పాలించడం, వారిని అదుపు చేయడం పాలకులకు సాధ్యం కావడంలేదు.


ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ సంక్షోభాన్నుంచి బైటపడే మార్గం నయా ఉదారవాద చట్రం పరిధిలో ఎక్కడా కానరావడం లేదు. కాని ద్రవ్య పెట్టుబడి ఈ వాస్తవాన్ని గుర్తించడానికి సిద్ధంగా లేదు. అందుచేత అది మరింత ఉధృతంగా అవే నయా ఉదారవాద విధానాలను అమలు చేయాలని పట్టుబడుతోంది. కార్మిక సంఘాలను ఉనికిలో లేకుండా చేయాలని, గిరిజన భూములను మరింత సునాయాసంగా స్వాధీనం చేసుకోవాలని, మరింత ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని, మరింత ఎక్కువ మోతాదుల్లో ప్రభుత్వం నుంచి పెట్టుబడిదారులకు ఆర్థిక వనరులను బదలాయించాలని ద్రవ్య పెట్టుబడి వత్తిడి చేస్తోంది.


ద్రవ్య పెట్టుబడి కోరిన విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టమో ఆర్థిక విధానాలు తెలిసిన వారెవరైనా స్పష్టంగా గ్రహించగలరు. అందుకే బొత్తిగా ఆర్థిక పరిజ్ఞానం లేని ప్రభుత్వం, తాను చెప్పినట్టల్లా తలాడించి అమలు చేసే ప్రభుత్వం ద్రవ్య పెట్టుబడికి ఇప్పుడు అవసరం. అలా అమలు చేస్తూనే ఆ విధానాలకు ప్రజానీకం మద్దత్తు తెలిపేలా చేయగల సామర్ధ్యం ఉన్న రాజకీయ పార్టీ ద్రవ్య పెట్టుబడికి ఇప్పుడు కావాలి. ఈ లక్షణాలన్నీ అతికినట్టు బిజెపికి ఉన్నాయి. దానికి ఆర్థిక పరిజ్ఞానం శూన్యం. ద్రవ్య పెట్టుబడి ఆడమన్నట్టల్లా ఆడుతుంది. ఆ ద్రవ్యపెట్టుబడినే తెలివితక్కువగా '' సంపద సృష్టికర్తలు'' గా పరిగణిస్తుంది. అదే సమయంలో తన హిందూత్వ ఎజండాతో ఆ ద్రవ్య పెట్టుబడి దురాగతాన్నంతటినీ ప్రజలకు కనపడకుండా దాచిపెడుతుంది. ఈ హిందూత్వ ఇంతవరకూ ఏ ఒక్కరి కడుపునూ నింపలేకపోయింది. కాని అయోధ్యలో ఆలయానికి చేసిన భూమిపూజ వైపు యావద్దేశం దృష్టినీ మళ్ళించింది. ఇంకోవైపున ద్రవ్య పెట్టుబడికి అపారంగా రాయితీల వర్షం కురిపించింది.


గడిచిన కొద్ది వారాలలో బిజెపి-పాలిత రాష్ట్రాలలో కార్మికుల పని గంటలు రోజుకు 12 కు పెంచివేశారు. తద్వారా శతాబ్దాల తరబడి ప్రపంచవ్యాప్తంగా కార్మికులు చేస్తున్న పోరాటాన్ని తోసిరాజన్నారు. కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులిచ్చే విధానాన్ని సడలించి వేశారు. నిబంధనలు నామమాత్రం చేశారు. పెట్టుబడిదారులకు రు.1.45 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేశారు. బొగ్గుగనులు వంటి సహజ వనరులకు సైతం ప్రైవేటీకరణను వర్తింపజేశారు. తద్వారా సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయోద్యమం ముందుకు తెచ్చిన ఒక ముఖ్యమైన డిమాండును నీరుగార్చారు. ఇప్పుడు రైల్వేల లోనూ ఈ విధానాన్నే అమలు చేయనున్నారు. పెట్టుబడిదారుల పరిస్థితి ఇంత సౌకర్యవంతంగా మున్నెన్నడూ లేదు. అదే సమయంలో, గిరిజనులతో సహా శ్రామిక ప్రజల పరిస్థితులు ఇంత దుర్భరంగా గతంలో ఎన్నడూ లేవు.


పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా మోడీ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలేవీ ఆర్థిక సంక్షోభ తీవ్రతను తగ్గించలేవు సరికదా, మరింత పెంచుతాయి. ఉత్పత్తి అయిన సరుకులను కొనేవారు లేకపోవడం ఈ సంక్షోభంలో ఒక ప్రధాన లక్షణం. ప్రభుత్వ చర్యలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచకపోగా మరింత తగ్గిస్తాయి. దాంతో పరిస్థితి మరింత తీవ్రమౌతుంది. పెట్టుబడిదారులకు చేసిన ఆర్థిక బదలాయింపుల వలన ప్రభుత్వం వద్ద ఖర్చు చేయగల నిధులు తరిగిపోతాయి. ద్రవ్యలోటు పెరగకుండా ఉండే పద్ధతిలో ఆ కొరవను పూడ్చుకోవాలంటే శ్రామిక ప్రజల మీద మరింత పన్నుల భారం మోపక తప్పదు. అంటే ఈ విధానాల ఫలితంగా శ్రామిక ప్రజలనుండి సంపద పెట్టుబడిదారీ వర్గానికి బదలాయించబడుతున్నది. ఎక్కువమంది వినియోగదారులు పేదలు. వారివద్ద నుండి సంపదను లాక్కుని పెట్టుబడిదారులకు బదలాయిస్తే మొత్తం మీద కొనుగోలుశక్తి తగ్గిపోతుంది. అలా తమ వద్దకు చేరిన సొమ్మును ఆ పెట్టుబడిదారులేమైనా తిరిగి పెట్టుబడిగా మార్కెట్‌లో పెడతారా అంటే అదీ జరగదు. కొనుగోలుశక్తి తగ్గిపోతోంది గనుక కొత్త పెట్టుబడులు పెట్టరు. మొత్తంగా సంక్షోభం మరింత తీవ్రమౌతుంది. నయా ఉదారవాద చట్రంలో ఈ సంక్షోభానికి పరిష్కారం లేదు.
దీని పర్యవసానంగా ప్రజల్లో అసంతృప్తి రానున్న రోజుల్లో అంతకంతకూ పెరుగుతుంది. దానిని అదుపు చేయడానికి అంతకంతకూ ఎక్కువ అణచివేతకు పాలకులు పూనుకుంటారు. అదే సమయంలో ప్రజల దృష్టిని పక్కకు మళ్ళించే రామ మందిరం వంటి అంశాలు ముందుకు తెస్తారు. హిందూత్వ ఎజండాను మరింత దూకుడుగా ముందుకు తేవడం వెనుక అసలు కారణం ఇదే. ఇటువంటి ఎజండా అటు ప్రజల దృష్టిని ప్రధాన సమస్యల వైపు నుండి పక్కుకు మళ్ళించడంతోబాటు శ్రామిక ప్రజలను విడదీస్తుంది. పరస్పర విద్వేషాలను రెచ్చగొడుతుంది. ఆర్థిక అంశాలపై అసంతృప్తి ఉన్నప్పటికీ మతపరంగా మెజారిటీగా ఉన్న హిందువులలో ఎక్కువమంది బిజెపికే వోట్లేసి దానిని అధికారంలో కొనసాగేలా చేస్తారు. అందుచేత హిందూ ఆధిపత్యవాదం ద్రవ్య పెట్టుబడికి అనుకూలమైన సిద్ధాంతం. ఇది హిందువులకు అనుకూలంగా ఉండే సిద్ధాంతం కాదు. ద్రవ్యపెట్టుబడికి, గుత్త పెట్టుబడికి సేవ చేసే సిద్ధాంతం.


హిందూ ఆధిపత్యవాదం అమలు జరిగితే ముస్లింలు ఉద్యోగాలకు, ఇతర అవకాశాలకు దూరంగా నెట్టివేయబడతారు గనుక ఆ మేరకు ఆ ఉద్యోగాలు, అవకాశాలు హిందువులకు దక్కుతాయి కదా. అటువంటప్పుడు హిందూ ఆధిపత్యవాదం హిందువులకు అనుకూలం కాదని ఎలా చెప్పగలం? అని కొందరు అడగవచ్చు. ఇప్పటికే ముస్లిం మైనారిటీలు ఉద్యోగాలలో, అవకాశాలలో ఎక్కువ శాతం చేజిక్కించుకుని గనుక ఉండినట్టయితే ఈ వాదన కొంతవరకు సహేతుకమౌతుంది. కాని ఇప్పటికే తమ జనాభా శాతానికి తగ్గట్టుగా నైనా ఉద్యోగాలను, విద్యావకాశాలను, సంక్షేమ పథకాలను పొందలేకపోతున్న మన దేశ మైనారిటీల విషయంలో ఈ వాదన చెల్లదు.


హిందూ రాజ్యం వైపుగా పడుతున్న ప్రతి అడుగూ శ్రామిక ప్రజానీకం మీద ఎక్కుపెట్టిన దాడిలో భాగమే. ఈ దాడికి హిందువులు, ముస్లిములు అందరూ బలౌతారు. హిందూ రాజ్య భావన హిందువుల ప్రయోజనాల కోసం అన్న తప్పుడు అభిప్రాయం నుంచి ఎంత తొందరగా బైట పడగలిగితే దేశానికి అంత క్షేమం.
- ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ) (ప్రజాశక్తి 24.8.2020)

Monday, August 24, 2020

ఎవరి యుద్ధమిది?

 

.....యుద్ధం అంటే ఏమిటో నాకు తెలుసు. ఒక్కటి మినహా చాలా సైన్యాలతో నేను పనిచేశాను. మనుషులు చనిపోవడం చూశాను. పిచ్చెత్తిపోవడం, ఆసుపత్రిలో నరకం అనుభవించడం చూశాను. కాని వీటన్నిటికన్నా ఘోరాతిఘోరమైన విషయం మరోటి ఉంది. యుద్ధం అంటే వికృతమైన సామూహిక-మానసిక వైకల్యం. నిజాలు చెప్పేవారిని నిలువునా శిలువ వేయడం. కళాకారుల చేతులు నరికివేయడం. సంస్కరణలనూ, విప్లవాలనూ, సామాజిక శక్తులనూ పక్కదోవపట్టించడం. యూరప్‌ యుద్ధంలో అమెరికా పాల్గొనకూడదని చెబుతున్న వారిని ఇప్పటికే ''దేశ ద్రోహులు'' అని అమెరికాలో ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే అడుగంటిపోయిన మన భావప్రకటనా స్వేచ్ఛను మరింత అణగదొక్కడాన్ని వ్యతిరేకించేవారిని ''ప్రమాదకరమైన ఉన్మాదులు''గా పేర్కొంటున్నారు. పత్రికా సెన్సార్‌షిప్‌ కూడా పెడతారన్న వార్తలు వస్తున్నాయి....పత్రికలు కూడా యుద్ధ నాదాలు చేస్తున్నాయి. చర్చి యుద్ధం కోసం కాలుదువ్వుతోంది. లాయర్లు, రాజకీయ నాయకులు, స్టాక్‌ బ్రోకర్లు, సామాజిక గ్రూపుల నాయకులు...అంతా రణన్నినాదాలు చేస్తున్నారు....


. ...
కాని ఈ యుద్ధం ఎవరిది? నాది కాదు. మహాగొప్ప ఫైనాన్షియల్‌ ''దేశభక్తుల'' వద్ద పనిచేస్తున్న లక్షలాదిమంది అమెరికన్‌ కార్మికులకు కనీసజీవనం సాగించడానికి ఉపయోగపడే వేతనాలు ఇవ్వడం లేదన్న విషయం నాకు తెలుసు. పేద ప్రజలను కనీసం విచారణ కూడా లేకుండా దీర్ఘకాలం పాటు జైళ్లలో పెట్టిన వైనం చూశాను. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులనూ, వారి భార్యలనూ, పిల్లలనూ ప్రయివేటు డిటెక్టివ్‌లూ, సైనికులూ కాల్చి చంపడం, అగ్ని మంటల్లో వేసి కాల్చడం చూశాను. యుద్ధంలో ధనికులు మరింత ధనికులయ్యారు. జీవన వ్యయం పెరిగింది. కార్మికులు మరింత పేదలైనారు. ఈ శ్రామికులు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. చివరికి అంతర్యుద్ధాన్ని కూడా కోరుకోవడం లేదు.

కాని జర్మనీ, ఇంగ్లాండ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా స్పెక్యులేటర్లు, యజమానులు, ధనికులూ యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అబద్ధాలు, అభూత కల్పనలతో వారు మన రక్తాన్ని మరిగించి మనల్ని నరరూప రాక్షసులుగా మారుస్తారు. అప్పుడుగాని మనం వారికోసం యుద్ధం చేసి, వారికోసం చావం....

- జాన్‌ రీడ్‌ (రచయిత రష్యాలోని అక్టోబర్‌ మహావిప్లవం, మెక్సికో అంతర్యుద్ధంతో సహా అనేక చారిత్రక ఘటనలను గ్రంథస్థం చేసిన ప్రముఖ అమెరికన్‌ జర్నలిస్టు. 1917 ఏప్రిల్‌లో ఆయన మొదటి ప్రపంచ యుద్ధం గురించి ''ఎవరి యుద్ధం'' అనే పేరుతో రాసిన వ్యాసం నుండి.)

 

Sunday, August 23, 2020

*రాజ్యాంగ విధ్వంసమే నవభారతానికి పునాదా?


*సీతారాం ఏచూరి*

🇮🇳 *73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో కొత్త భాష్యాన్ని చలామణీలోకి తెస్తున్నారు. దీన్నే భావి భారత వారసత్వంగా మార్చనున్నారు. 1947 ఆగస్టు 15న మనకు వచ్చింది సాధారణ స్వాతంత్య్రం మాత్రమేననీ 2019, ఆగస్టు 5న ఆర్టికల్‌ 370, 35ఏని రాజ్యాంగంనుంచి రద్దు చేసిన రోజు, 2020 ఆగస్టు 5న రామాలయం నిర్మించడానికి ప్రధాని నరేంద్రమోడీ భూమిపూజ నిర్వహించిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందనేది ఈ కొత్త బాష్యం. ఈ బాష్యం వీరోచితమైన మన స్వాతంత్య్రం పోరాట స్ఫూర్తికీ, ఆ స్పూర్తితో రూపొందిన రాజ్యాంగ విలువలకూ పూర్తి విరుద్ధమైనది. అయోధ్యలో మోడీ ఉపన్యాసం సారాంశం ఇదే.*

📓  *మన రాజ్యాంగం గొప్ప బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది. విభిన్న స్రవంతులను ఏకం చేసినప్పుడు మాత్రమే భారతదేశపు ఐక్యతను బలోపేతం చేయగలం. భిన్నత్వంలో అన్నింటిని కలుపుకు వచ్చే అంశాలను బలోపేతం చేయాలి. బహుళత్వంలో భాగమైన భాష, జాతి, మతం లాంటి అంశాలను గౌరవించాలి. రాజ్యాంగం ప్రతిపాదించిన సమానత్వానికి ఈ భిన్నత్వం పునాది కావాలి. సమానత్వమే ఐక్యతను బలోపేతం చేస్తుంది. ఈ భిన్నత్వాన్ని కాదని దానిపై ఏకశిలా సదృశ్య భావనను మోపే ప్రయత్నం చేస్తే సామాజిక అశాంతి బద్దలవుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ దాని రాజకీయ సాధనమైన బీజేపీ ఈ దేశంపై ఏకశిలా సదృశ్య వ్యవస్థను నిర్మించాలంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులను హరించక తప్పదు. ఈ దిశగా చర్యలు చేపట్టే క్రమంలో దేశంలోని అంతర్గత శతృవులుగా ముద్రవేసిన కొందరిని కాలరాయడానికి నిరంకుశ పద్ధతులను ఉపయోగించేందుకు సైతం వెనుకాడదు.*

🚩 *ఈ నిరంకుశ నవభారత నిర్మాణం కేవలం మోడీ ఒక్కరి కృషి కాదు. ఈ ఆలోచనకు 100సంవత్సరాల చరిత్ర ఉన్నది. అది 1925 ఆర్‌ఎస్‌ఎస్‌ పుట్టినప్పటిది. లౌకిక భారతదేశాన్ని హిందూమతతత్వ భారతంగా రూపొందించటానికి కావల్సిన సిద్ధాంతాన్ని, దాన్ని ఆచరణలోకి తేవటానికి కావల్సిన నిర్మాణాన్ని 1939లోనే గోల్వాల్కర్‌ తన హిందూరాష్ట్ర అన్న రచనలో స్పష్టం చేశారు. భారత ప్రజలు ఈ భావజాలాన్ని అనేక సార్లు తిరస్కరించారు. స్వాతంత్య్ర పోరాటం స్వాతంత్య్ర భారతదేశాన్ని లౌకిక ప్రజాతంత్ర గణతంత్రంగా ప్రకటించి దాన్ని ధృవీకరిచింది. గణతంత్ర భారతదేశం యొక్క లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని తోసిపుచ్చి దాని స్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ యొక్క ఆలోచనా విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నం దశాబ్దాలుగా సాగుతూ ఈనాటి పరిస్థితికి చేరుకున్నది.*

*🏹 *భారత రాజ్యాంగంపై దాడి*

*ఈ నూతన భారత్‌ను ఆవిష్కరించాలంటే మొట్టమొదట కావాల్సింది ప్రస్తుత రాజ్యాంగం ధృవీకరించిన లౌకిక భారతాన్ని ముందుగా ధ్వంసం చేయాలి. గత ఆరేండ్లుగా మోడీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న తీవ్రమైన దాడిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ దాడి లౌకిక పునాదిని, ప్రజాతంత్ర స్వభావాన్ని, సమాఖ్య స్ఫూర్తిని, సామాజిక న్యాయం, ఆర్థిక స్వావలంబన లాంటి అంశాలను దెబ్బతీయడంలో కనబడుతున్నది.*

*రాజ్యాంగంపై దాడి అంటే అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే. రాజ్యాంగం ప్రకారం మన గణతంత్రానికి మూడు అంశాలు ఉన్నాయి. అవి కార్య నిర్వాహక వ్యవస్థ, చట్టసభలు, న్యాయవ్యవస్థ. ఇవి వేటికి అవే విడివిడి అంగాలు కానీ, తమ విధులను, బాధ్యతలను నిర్వహించడానికి ఒకదానికి మరొకటి సహాయపడుతుంటాయి.*

*చట్టసభలు అంటే పార్లమెంటు.* 

🇮🇳  *ఈ చట్టసభలు పని చేయకుండ దెబ్బతీసి, మందబలంతో తమ ఇష్టారాజ్యంగా మార్చేసారు. పార్లమెంటరీ విధి విధానాలను, కమిటీల నిర్వహణపద్ధతులను పూర్తిగా చిన్నచూపు చూస్తున్నారు. భారత రాజ్యాంగం దేశాన్ని సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ప్రకటించింది. ఈ సార్వభౌమత్వం ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధుల ద్వారా వ్యక్తీకరించబడుతోంది. అటువంటి ప్రజా ప్రతినిధుల అధికారాలు, బాధ్యతలకే నేడు ముప్పు వాటిల్లుతోంది. పార్లమెంటే పనిచేయకుండా పోతే, ప్రజలకు జవాబుదారీతనం ఉండదు. ఈ జవాబురీతనం లోపించిన విషయం గత ఆరేళ్లుగా కండ్ల ముందు కనిపిస్తోంది.*

 *న్యాయవ్యవస్థ*

🇮🇳  *రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలను కార్యనిర్వహణా వ్యవస్థ ఉల్లంఘించకుండా గమనిస్తూ రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులు, హామీలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటం న్యాయవ్యవస్థ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా, నిస్పక్షపాతంగా ఉండాలి. కానీ ఈ స్వభావంలో రాజీపడటంతో న్యాయవ్యవస్థ యొక్క పర్యవేక్షణ కనుమరుగై పౌరహక్కులు, ప్రజాతంత్ర హక్కులు అమలుజరగకుండా అడ్డుకట్టపడుతున్నది.*

*ఎన్నికల సంఘం*

🇮🇳  *ఎన్నికల సంఘం యొక్క స్వతంత్రత, నిస్పక్షపాత స్వభావమే ప్రజాస్వామ్యానికి మూల విరాట్టుగా ఉంటుంది. దాని ద్వారానే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కాపాడబడేది. స్వేచ్ఛాయుత, న్యాయమైన పద్ధతిలో ఎన్నికలు నిర్వహించబడి ప్రతి అభ్యర్థికి పోటీ చేసేందుకు సమాన అవకాశాలు కల్పించబడతాయి. ఇందులో రాజీపడితే ఏర్పడే ప్రభుత్వాలు ప్రజల తీర్పుకు అనుగుణమైనవి కావని స్పష్టమవుతుంది.*

*అధికారం*

🇮🇳 *సాధికారత గల సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, విజిలెన్స్‌శాఖలను రాజ్యాంగం ప్రకారం పౌర, నేర సంబంధమైన కేసులను విచారించి నిందితులకు శిక్షలు పడేలా చూడటానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాస్తా నేడు అధికార పార్టీ వాళ్ళు నేరాల నుంచి తప్పించుకుని, ప్రతిపక్షాల వాళ్ళను ఇరికించి వేధించే సాధనాలుగా మారిపోతున్నాయి. రాజ్యాంగం, దాని కింద పనిచేసే వ్యవస్థల ఉనికి తుడుచుకు పోతున్నప్పుడు అధికారపార్టీకి అపారమైన ధనబలం సమకూరటానికి మార్గం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ప్రజాస్వామ్యం యొక్క నాణ్యతను దెబ్బతీస్తుంది. దీనివలన ప్రజల తీర్పుకు భిన్నమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి డబ్బు ఎరచూపి శాసనసభ్యులను కొనుగోలు చేసే అవకాశాలు ఏర్పడుతాయి. ''బీజేపీ ఎన్నికలలో ఓడిపోతుంది కాని ప్రభుత్వాన్ని మాత్రం అదే ఏర్పాటు చేస్తుంది'' అనేది ఓ నానుడిగా ప్రచారంలో ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.*

*హేతుబద్దతపై దాడి*

🇮🇳  *"నవీన్‌ భారత్‌'' అనేది విజయవంతం కావాలంటే భారత దేశ చరిత్రను తమ భావజాలానికి అతికేలా తిరిగి రాయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ భావజాలం మనగలుగుతుంది. దీనికి అనుగుణంగా దేశంలోని విద్యా విధానాన్ని మార్చాల్సి ఉన్నది. అందులో భాగంగానే హేతువుకు విరుద్ధమైన ఆలోచనలకు పెంపొందించడం, మూడ విశ్వాసాలను, అర్థంచేసుకోలేని అంశాలను, పురాణగాథలను ముందుకు తెచ్చి శాస్త్రీయ ఆలోచనలకు తావులేకుండా చేస్తున్నారు. భారతదేశ నిజ చరిత్రను మరుగుపరుస్తూ దాని స్థానం పురాణగాథలతో నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దారి మళ్లించే చరిత్ర రచనకు, అశాస్త్రీయ వాదనలను నిరూపించడానికి పురావస్తుశాఖ ఇప్పుడు హిందూత్వవాదులకు అనుకూలంగా ఆధారాలను తయారు చేయాల్సి ఉన్నది. అవి మన గతాన్ని శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేయడానికి విరుద్ధంగా ఉంటాయి. ''నవీన భారత్‌'' అనే భావన విజయవంతం అయి, నిలబడాలి అంటే కొన్ని కొత్త ప్రతీకలను సమాజంలో ఏర్పడేలా చేయాలి. హిట్లర్‌ బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన డూమ్‌లాగే మన దేశంలో సెంట్రల్‌ విస్టాను ఈ కరోనా కష్టకాలంలో బారీ ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు, బులెట్‌ ట్రెయిన్‌లాంటి అత్యవసరం కాని వాటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనితోపాటు ప్రజల ఆలోచనలను మళ్లించడానికి ఫేక్‌ వార్తలు, తప్పుడు భాష్యాలతో ఊదరకొడుతున్నారు. దీనితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి బాధలు పక్కకు పోతున్నాయి. సామాజిక అశాంతి వ్యాపించడానికి విద్వేష ఉపన్యాసాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలపై హింసాత్మక దాడులతో హిందూ ఓటు బ్యాంకును పటిష్ట పరచుకోవడానికీ ప్రయత్నం జరుగుతున్నది.*

*అయోధ్యలో భూమి పూజ తర్వాత మోడీ చేసిన ఉపన్యాసం పై అంశాలను ప్రతిబించేలా ఉన్నది. సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పునిచ్చిందే గానీ అందులో న్యాయం లేదు. బాబ్రీమసీదు కూల్చివేయడాన్ని నేరపూరితమైన చట్టాల ఉల్లంఘనగా పేర్కొంటూ దోషులను తొందరగా శిక్షించాలని పేర్కొన్నది. వివాదాస్పద స్థలంలో గుడినిర్మాణ బాధ్యతను మసీదు కూలగొట్టినవారికే అప్పగించింది. రామమందిర నిర్మాణం వాస్తవంగా అయితే ట్రస్టు నిర్వహించాల్సింది. కానీ ప్రధానమంత్రి, ప్రభుత్వం గుడినిర్మాణ పనులను తమ చేతుల్లోకి తీసుకుని, దానిని ఒక ప్రభుత్వ కార్యంగా చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం ఒక లౌకిక ప్రజాస్వామిక ప్రధానిగా ప్రమాణం చేసిన ప్రధానమంత్రి తాను చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారు.ప్రతి పౌరునికి రాజ్యాంగం హామీ ఇచ్చిన మత స్వేచ్ఛను ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వానికి ఏ మతం ఉండకూడదు. రాజ్యాంగం ప్రకారం ఉల్లంఘిచలేని ఈ అంశాన్ని స్వయంగా ప్రధానమంత్రే ఉల్లంఘించారు. ఈ ఘోరమైన ఉల్లంఘన ద్వారా 'నవీన భారత్‌' అనేది ఆర్‌ఎస్‌ఎస్‌ యొక్క రాజకీయ ప్రాజెక్టు అనే సంకేతాన్ని ఇచ్చారు.*

*🇮🇳 రామమందిర నిర్మాణాన్ని స్వతంత్ర పోరాటంతో పోల్చి ప్రధాని తన ఉపన్యాసంలో మాట్లాడటమనేది దారుణమైన అంశం. స్వతంత్ర పోరాటానికి ఉన్న దృక్పథం ప్రకారం భారతదేశం ఒక ఐక్యతకు చిహ్నం. ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుకునే ప్రజల మధ్య విభజన అనే సిద్ధాంతానికి ఇది విరుద్ధమైనది. స్వతంత్రం కోసం అందరూ ఐక్యంగా పోరాడటమనే నినాదం లక్షలాది మందిని ఉత్సాహపరిచి స్వతంత్ర పోరాటంలోకి దించగలిగింది. దాని ఫలితమే 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సాధించుకోగలగటం. ప్రజల మధ్య విభజనకు చిహ్నమైన ప్రస్తుత నవీన భారత్‌ అనే భాష్యం స్వతంత్ర పోరాటం ప్రతిబింబించిన స్ఫూర్తిని తుడిపేస్తున్నది.*

*🇮🇳 ఆర్‌ఎస్‌ఎస్‌ భారత స్వతంత్ర పోరాటంలో ఎప్పుడూ పాల్గనలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకూల రచనల్లో కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వతంత్ర పోరాటంలో పాల్గనలేదనీ, ప్రతిఫలంగా ఆనాడు బ్రిటిష్‌వారి నుంచి రాయితీలు పొందారనీ పొందుపరచబడింది. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత కర్త అయిన నానాజీ దేశ్‌ముఖ్‌ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వతంత్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదనే ప్రశ్నను లేవనెత్తారు.*

*ఇప్పుడు ఈ నవీన భారతమనే భావనలో భాగంగా భారత చరిత్రను తిరిగి రాస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. దానికి అనుబంధంగా ఉన్న వ్యవస్థలను, అధికారాన్ని, ప్రజలకిచ్చిన హామీలను, పౌర హక్కులను నిరాకరిస్తూ భారతదేశం యొక్క భవిష్యత్తును అస్థిరపరుస్తూ దళితులు, ఆదివాసీలు మహిళలు మైనారిటీ మతాలవారిపై విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు.*

*ఈ నవీన భారత్‌ అనేది దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తుందనడానికి గత ఆరేండ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన విధానమే ఒక నిదర్శనంగా ఉన్నది. విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థల యొక్క లాభాలను గరిష్టస్థాయికి పెంచేందుకు ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు. అందులో ప్రభుత్వ ఆస్తులను లూటీ చేసే, ప్రభుత్వరంగ సంస్థలను గంపగుత్తగా ప్రయివేటీకరించే, దేశంలో లభ్యమయ్యే ఖనిజసంపదను, అటవీసంపదను కార్పొరేట్‌ శక్తులకు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించే విధానాలున్నాయి. ఈ ప్రణాళిక అడ్డంకులు లేకుండా అమలు జరగడానికి రాజ్యాంగం కార్మికులకు ఇచ్చిన హక్కులను రద్దు చేస్తున్నారు. అన్నదాతలను దివాళా తీయించే విధంగా వ్యవసాయాన్ని కార్పొరేటీకరి స్తున్నారు. అందుకోసం ఈ మధ్యకాలంలో తెచ్చిన ఆర్డినెన్సులు నిత్యావసర సరుకుల చట్టం రద్దు చేయడానికి ఉద్దేశించబడినవి. దీని ఫలితంగా రైతులకు కనీస మద్దతు ధర దక్కకుండా పోతుంది. ధరల నియంత్రణ, ఆహార ధాన్యాల కొనుగోళ్లకు చెల్లుచీటీ పాడి, ప్రజా పంపినీ వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఆహార కొరత ఏర్పడటానికి దారులు వేస్తున్నారు. కార్పొరేట్‌ శక్తులు చేసే వ్యవసాయాధారిత వ్యాపారానికి లాభాలు పెంచేందుకే ఈ ధ్వంస రచన జరుగుతోంది.*

*నవీన భారతం అనే ఈ భావన రాజ్యాంగం యొక్క ఉనికినే సంక్షోభంలోకి నెట్టుతున్నది. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, హేతుబద్దతలకే కాదు, అశేష ప్రజానీకం యొక్క బతుకుదెరువు, స్వేచ్ఛ, ఆత్మగౌరనవం వారి ఆర్థికాభివృద్ధికి కూడా ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాలనే నేడు మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. 74వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంలో మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఇదే*

Thursday, August 20, 2020

వివిధ రంగాల కార్మికుల, ప్రజల డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ 20.8.2020 నుండి 26.8.2020 వరకు సి పిఎం పార్టీ దేశ వ్యాప్త ఉద్యమం

 

కోవిడ్ వలన పెరుగుతున్న ఆర్థిక మాంద్యం వలన ప్రజల సమస్యలు పెరుగుతుండగా వాటిని పట్టించుకోకుండా ఉద్యమాలు చేయటం సాధ్యం కాని పరిస్థితిని  వినియోగించుకుని మోడి ప్రభుత్వము స్వదేశీ,  విదేశీ కార్పొరేట్ల లాభాలు పెంచేందుకు, ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు పరమ్ చేసేందుకు , కార్మిక హక్కులను మరియు ప్రజాస్వామిక హక్కులను రద్దు చేయుటకు ఉపక్రమిస్తున్నది.

ఇందుకు వ్యతిరేకముగా ఉద్యమించాలని సి పి ఎం పార్టీ నిర్ణయించింది. కార్మికుల, ప్రజల ఆర్థిక పరమయిన డిమాండ్స్ ను పరిష్కారించాలని, కార్మిక హక్కులను కాపాడాలని, ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని కోరుతూ ఈ క్రింది డిమాండ్స్ కోసం 20.8.2020 నుండి 26.8.2020 వరకు దేశ వ్యాప్తముగా  ఉద్యమించాలని సి పి ఎం పార్టీ నిర్ణయించింది. ఈ ఉద్యమం లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చింది.   

డిమాండ్స్

1.      ఆదాయపు పన్ను పరిధికి బయట వున్న వారికి కుటుంబానికి నెల కి రూ.7500/- చొప్పున రాబోవు 6 నెలలపాటు  నగదు బదిలీ చేయాలి.  

2.      నెలకి తలకి 10 కిలోల చొప్పున ఆహార ధాన్యాలు ఉచితముగా 6 నెలల పాటు అందించాలి.

3.      మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను విస్తరించి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి. వేతనం పెంచాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని కూడా తేవాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ భత్యం చెల్లించాలి.

4.      అంతర రాష్ట్ర (ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి) వలస కార్మిక ( ఉద్యోగిత మరియు సర్వీసు కండిషన్ల నియంత్రణ)   చట్టం  1979 ను రద్దు చేసే ప్రతిపాదనని విరమించాలి. ఇంతేగాక ఈ చట్టాన్ని మరింత మెరుగు పరచాలి.

5.      ప్రజారోగ్యానికి  కేంద్ర ప్రభుత్వము చేసే ఖర్చును అది జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి)  లో 3 శాతం గా వుండేలా పెంచాలి. ప్రాథమిక దశ నుండి తృతీయ స్థాయి  ట్రీట్మెంటు కోసం ప్రభుత్వము నిర్వహించే ఆరోగ్య రక్షణ వ్యవస్థను పటిష్ఠ వంతం చేయాలి. 

6.      ఆహార ధాన్యాల వ్యాపారుల లాభాల కోసం ఒక రాష్ట్రం నుండి మరో రాష్టానికి ఆహార ధాన్యాలు తరలించెందుకు వీలు కల్పించే ఉద్దేశం తో   అత్యవసర సరుకుల చట్టం రద్దు చేయుటకు మరియు ఎ పి ఎం సి చట్టం ను సవరించెందుకు తెచ్చిన  ఆర్డినేన్సులను రద్దు చేయాలి.

7.       కార్మిక చట్టాలను కార్మికులకు వ్యతిరేకముగా మార్చేందుకు, అమలు కాకుండా చేసేందుకు, చేస్తున్న ప్రతిపాదనలను రద్దు చేయాలి.

8.      ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను, ప్రత్యేకించి రైల్వేలో, మరియు ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం, బొగ్గు, బ్యాంకులు, ఇన్సూరెన్సు , రక్షణ రంగ ఆయుధాలు మరియు పరికరాల ఉత్పత్తి రంగాలలో విరమించాలి.

9.      ప్రధాన మంత్రి పేరుతో ఏర్పాటు చేయబడిన ప్రయివేటు  ట్రస్ట్ ఫండ్ కు చెల్లించబడిన నిధులను కోవిడ్ 2019 కు వ్యతిరేకముగా జరుగుతున్న పోరాటం లో మొదటి వరుసలో వుంటున్నాయి కాబట్టి రాష్ట్రాలకు బదిలీ చేయాలి.

10.   కోవిడ్ మహమ్మారిని నిర్మూలించేందుకోసం విపత్తుల మేనేజిమెంటు చట్టాన్ని ముందుకు తెచ్చారు కాబట్టి కోవిడ్ వలన మృతి చెందిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తుల సహాయ నిధి చట్టం లో వున్న రూల్సు ననుసరించి  ఆర్థిక సహాయాన్ని వన్ టైమ్ మేజర్ గా (ఒక్క సారికి మాత్రమే అందించేది)  అందించాలి.

11.   ఎస్ సి/ఎస్ టి/ఓబీసీ రిజర్వేషన్లను పకడ్బందీగా  అమలు చేయాలి. బ్యాక్ లాగ్ వేకెన్సీ లను భర్తీ చేయాలి.

12.   గ్రాడ్యువేట్ మరియు పోస్ట్ గ్రాడ్యువేట్  కోర్సుల ఆఖరు సంవత్సరం లో వున్న వారికి అంతకి ముందు సెమిస్టర్  లో వచ్చిన మార్కుల ప్రకారం ఉత్తీర్ణులైన వారిని ఈ కోర్సులలో ఉత్తీర్ణులైనట్టుగా ప్రకటించాలి.

13.   జమ్ము & కాశ్మీర్ లో ఆగస్టు 2019 నుండి డిటెయిన్ చేయబడిన వారిని వెంటనే విడుదల చేయాలి. కమ్యూనికేషన్లను పూర్తిగా పునరుద్ధరించాలి. ప్రజలని స్వేచ్ఛగా తిరగనివ్వాలి.

14.   భయంకరమైన యూ‌ఏ‌పి‌ఏ, ఎన్ ఎస్ ఎ, విద్రోహ చట్టం వంటి చట్టాల పేరుతో జమ్ము & కాశ్మీర్ లో డీటెయిన్ చేయబడిన రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలి.

15.   “ఎన్విరాన్ మెంటల్  ఇంపాక్ట్ అసెస్మెంట్ 2020” ని ఉపసంహరించాలి.

16.   దళితులపై కుల దురహంకారం తో దాడులు చేసే వారిని,  ఇంటి పని చేసే వారు మరియు మహిళల  పై లైంగిక హింస కు పాల్పడే వారిని, గిరిజన ప్రజలను దోచుకునే వారిని శిక్షించాలి. 

****

 

కోవిడ్ 2019 సంక్షోభ కాలంలో చైనా-భారత్‌ విధానాలు

 

ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహించే పరిస్థితి

కోవిడ్‌ 19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవనానికి చైనా నాయకత్వం వహిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్‌-19 మహమ్మారిని కట్టడి చేయలేక, ఆర్థికాభివృద్ధి పతనాన్ని అరికట్టలేక ఆర్థికంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు సతమతమౌతుంటే చైనా మహమ్మారిని జయప్రదంగా కట్టడి చేయటంతో పాటు జిడిపి పెరుగుదలను కూడా సాధించింది. చైనా ఈ ఘన విజయాన్ని ఎలా సాధించిందో తెలుసుకుందాం.

అభివృద్ధికి చైనా ప్రణాళిక-దాని ఫలితాలు


అన్ని దేశాలు లాక్‌డౌన్‌లు ప్రకటించటంతో ఆ దేశాలలో ఉద్యోగాలు, ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటంతో తమ ఎగుమతులు తగ్గుతాయని చైనా అంచనా వేసింది. ఎగుమతుల తగ్గుదల వలన సంభవించే ఉత్పత్తి మాంద్యాన్ని అధిగమించటం కోసం తమ ప్రజల కొనుగోలు శక్తిని పెంచటానికి చర్యలు తీసుకుంది. ప్రజల ఉద్యోగాలు, కొనుగోలు శక్తిని కాపాడటం కోసం చైనా తమ దేశ చరిత్ర లోనే అతి పెద్ద ఆర్థిక ప్యాకేజిని ప్రకటించింది. ఈ ప్యాకేజీ విలువ మొత్తం 6 లక్షల కోట్ల యువాన్లు  (రూ.66 లక్షల కోట్లు). మహమ్మారి కారణంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు పొందిన నష్టాన్ని భర్తీ చేసి, ఉద్యోగాలను నిలబెట్టటం కోసం అనేక రాయితీలు, సబ్సిడీలను ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ బాండ్లను విడుదల చేయటం ద్వారా ప్రాంతీయ ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఖర్చు చేస్తున్న రెండు లక్షల కోట్ల యువాన్లకు ఇది అదనం.

2020 మొదటి త్రైమాసికంలో 6.8 శాతం కుచించుకుపోయిన చైనా జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి)  ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ రెండవ త్రైమాసికంలో  3.2 శాతానికి పెరిగింది. గత సంవత్సరం 6.1 శాతం జిడిపి వృద్ధిని సాధించిన చైనా జిడిపి ఈ సంవత్సరం 5 శాతం పెరగవచ్చునని ఇపుడు అన్ని సంస్థలూ అంచనాలు వేస్తున్నాయి. 90 కోట్ల మంది శ్రామికులు ఉన్న చైనాలో శ్రామికులందరికీ పని కల్పించకపోతే వారు ఆకలితో ఉంటారని, పని కల్పిస్తే సంపదను ఉత్పత్తి చేస్తారనే అవగాహనతో చైనా నాయకత్వం పనిచేస్తున్నది. అభివృద్ధిని పట్టాలెక్కించటంతో ప్రజలకు జీవనోపాధిని మెరుగుపరచటం, కొత్తగా ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు. ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాల కాలంలో 56.4 లక్షల మందికి నూతనంగా ఉపాధిని కల్పించారు. పేద ప్రజలు ఎక్కువగా ఉన్న సిచువాన్‌, గ్విజౌ, గ్వాంగ్జిలలో గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం 5.5 నుండి 7.6 శాతం వరకు పెరిగింది. సామాజిక సంక్షేమ పథకాలను మరింత బలోపేతం చేయటం వలన వృద్ధాప్య, రిటైర్‌మెంటు పెన్షన్లు 9.3 శాతం, సంక్షేమ గ్రాంట్లు, సబ్సిడీలు 13.2 శాతం పెరిగాయి.

మోడీ పభుత్వ బాధ్యతారాహిత్యం- కరోనా రోగుల సంఖ్య లో 3వ స్థానం కు ఎదుగుదల

చైనా వ్యవహరిస్తున్న తీరుకు పూర్తి విరుద్ధంగా భారత ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. కోవిడ్‌ను అరికట్టటం పేరుతో హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం వైరస్‌ లక్షణాలున్న వారికి పరీక్షలు చేయటం, రోగులను గుర్తించటం, వైద్యం అందించటం, అనుమానితులను ఐసొలేషన్‌లో ఉంచటం తదితర చర్యలు తీసుకోవటానికి మారుగా లైట్లు ఆపివేయటం, చప్పట్లు చరచటం, వైద్య సిబ్బందిపై పూలు చల్లటం, నౌకలపై లైట్లు వెలిగించటం తదితర హాస్యాస్పదమైన చర్యలు తీసుకుంది.  ఫలితంగా 500లకు పైగా కేసులతో మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌ ప్రకటించిన మన దేశంలో ఆగస్టు 17 తేదీ నాటికి కేసులు 27 లక్షలు, మరణాలు 50 వేలు దాటిపోయాయి. ఫలితంగా ఈ రోజు వైరస్‌ సోకినవారి సంఖ్యలో ప్రపంచంలో మూడవ స్థానం, మరణించిన వారిలో నాలుగవ స్థానానికి చేరుకున్నది.

ఆర్థిక రంగం లో ప్రజా వ్యతిరేక విధానాలు:

ఆర్థిక రంగంలో కూడా ఇదే విధమైన విధానాలను అనుసరిస్తున్నది. ఉద్యోగాలను కాపాడటం, ప్రజలకు ఉపాధి కల్పించే అంశాలను పక్కనపెట్టి, బహుళజాతి సంస్థలు, బడా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టే విధానాలను అనుసరిస్తున్నది. కోవిడ్‌-19 మహమ్మారి, ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవటం కోసం అంటూ ప్రకటించిన రూ.20.79 లక్షల కోట్ల ప్యాకేజీ వాస్తవవానికి రూ.1.5 లక్షల కోట్లకు మించదు. ఆదాయం పన్ను చెల్లించని 80 శాతం ప్రజలకు నెలకు తలకు 10 కిలోల ఆహార ధాన్యాలు, కుటుంబానికి 7,500 రూపాయల చొప్పున ఆరు మాసాల పాటు అందించాలన్న నిపుణుల సూచనలను పట్టించుకోవటం లేదు.

లాక్‌డౌన్‌ వలన ప్రజలు పెద్దసంఖ్యలో కదిలి ఆందోళనలు చేయటం సాధ్యం కాని పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ దిగజారుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది. కార్పొరేట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన లక్ష కోట్ల రూపాయలకు పైగా రుణాలను రద్దు చేసింది. ఈ విధానాల ఫలితంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జిడిపి  రెండంకెలు పడిపోతుందని అంచనా వేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 3-4 శాతం తగ్గవచ్చని మొదట అంచనా వేయగా ఇపుడు 7 శాతం తగ్గుతుందని అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వం ఇదే విధానాలను కొనసాగిస్తే జిడిపి 10 శాతానికి మించి తగ్గినా ఆశ్చర్యం లేదు.
విధానాల లో వ్యత్యాసం

సంక్షోభ కాలంలో చైనా ప్రభుత్వ విధానాలు ప్రజలకి అనుకూలముగా వుండగా  భారత ప్రభుత్వ విధానాలు ప్రజలకి వ్యతిరేకముగా, కార్పొరేట్ల, బహుళ  జాతి సంస్థల లాభాలు పెంచే విధముగా వున్నాయి. మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలతో ఆర్థిక మాంద్యం తీవ్రం కావటంతో పాటు దేశం ఆరోగ్య సంక్షోభంలో కూరుకుపోయి, నివారించదగిన వైరస్‌కు లక్షలాది మంది అమాయక ప్రజలు బలైపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. (ప్రజాశక్తి 20.8.2020 సంచికలోప్రచురించబడిన శ్రీ ఏ.కోటిరెడ్డి గారి వ్యాసానికి కొన్ని చిన్నమార్పులను జోడించి సంక్షిప్తముగా చేయబడిన వ్యాసం ఇది)