Sunday, February 13, 2022

మేలి ముసుగు

 

 దిల్‌ కా ఖాన్‌ హోనా చాహియే' అన్నది అక్షరాల నిజం. ఇది ఆ గాయం యొక్క స్వరం. ఇక్కడ మాట్లాడుతున్నది స్వయంగా 'నొప్పి'. ఆ నొప్పి తాలూకు స్వరం వినాలంటే మనసుకు చెవులుండాలి. గుండెల్లో తడి ఉండాలి. ఏ మనిషికైనా కావాల్సింది స్వేచ్ఛే. రూపం ఏదైనా జరుగుతున్న పోరాటం మాత్రం ఉనికి కోసమే. కప్పుకున్న హిజాబ్‌ (ముసుగు) చాటు నుంచి నల్లటి మేఘం వర్షిస్తున్న కన్నీటి ఆక్రందన ఇది. తల నుంచి ఛాతి వరకు ముస్లిం బాలికలు, యువతులు కప్పుకునే వస్త్రం హిజాబ్‌. హిందూ మహిళలు ధరించే మేలిముసుగు వంటిదే ఇదీన్నూ. ఇప్పుడు వాళ్లూ... వీళ్లు అని తేడా లేకుండా తలకు స్కార్ఫ్‌లు చుట్టుకుంటున్నారు చాలామంది యువతులు. దీనివలన మిగతావారికి కలిగే నష్టమేమిటి? కట్టు, బట్టు, ఆచార వ్యవహారాలు వారి వారి సంస్కృతుల్లో భాగం.


మేలిముసుగు అనేదానికి పెద్ద చరిత్ర వుంది. చాలామంది హిందూ మహిళలు చీర చెంగును ముఖం కనిపించకుండా కప్పుకుంటారు. అది సాంప్రదాయం. క్షత్రియ మహిళలు చీర చెంగుతో ముఖం కప్పుకోవడం తెలిసిందే. దాన్ని మేలిముసుగు లేదా పరదా అంటారు. ఉత్తర భారతంలో మహిళలు కచ్చితంగా ముసుగు ధరిస్తారు. అది వాళ్ల ఆచారం. స్త్రీలు కేవలం ఐదు సందర్భాల్లో మాత్రమే ముసుగు తొలగించాలట! వ్రతం చేసేటప్పుడు, స్వయంవరం ముందు, వివాహ సమయంలో, ఆపద సమయంలో, యుద్ధంలో మాత్రమే, మిగతా సమయాల్లో పరపురుషుల ముందు స్త్రీ ముసుగులోనే వుండాలని భారతీయ గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాదు... 'అసూరంపశ్య' అని పెద్దలు చెబుతుంటారు. అంటే... స్త్రీల జీవితాల్లో సూర్యుడి వెలుగు లేదని అర్థం. బురఖా, హిజాబ్‌ కూడా అంతే. ఇది వీళ్ల ఆచారం. అనాదిగా వస్తోన్న సంప్రదాయం. ఇది పురుషాధిక్యతకు, లైంగిక అణచివేతకు చిహ్నం.


ముసుగు మతానికి సంబంధించినది కాదు. హిజాబ్‌ ధరించిన మహిళ ఇది మా మతాచారం అని కోర్టులో వాదించి వుండొచ్చు. అది ఆసరా చేసుకొని దీన్ని ఒక మతపరమైన విషయంగా మార్చడానికి కొంతమంది యువకులు కాషాయ కండువాలతో వచ్చారు. 'కొంతమంది యువకులు/ పుట్టుకతో వృద్ధులు/ పేర్లకి, పుకార్లకి, షికార్లకి/ నిబద్దులు/ తాతగారి నాన్నగారి/ భావాలకు దాసులు/ నేటి నిజం చూడలేని/ కీటక సన్యాసులు' అంటాడు మహాకవి శ్రీశ్రీ.

అసలు కాషాయం ఒక మతానికి చెందినది కాదు. అది ఒక రంగు. కానీ, కాషాయవాదులు ముసుగు మీద, రంగుల మీద మత విద్వేషపు రంగును పులిమేస్తున్నారు. మిగతా రంగులన్నీ కంటికి కనిపించేవే. ఈ విద్వేషపు రంగు మాత్రం కనబడదు. మేలిముసుగుకి మతానికి సంబంధం లేకపోయినా... ముఖానికి ముసుగు కప్పుకున్నారని హిజాబ్‌ని వ్యతిరేకించే వీరు 'వాలెంటైన్స్‌ డే'ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అక్కడ ముసుగు వేసుకోడం నిషేధం అంటారు... ఇక్కడ లవ్‌ జిహాద్‌ అంటూ ప్రేమపై నిషేధం విధిస్తున్నారు. ఒక మహిళ ఏ దుస్తులు ధరించాలి, ఎవరిని ప్రేమించాలి అనేది ఆమె ఇష్టం. అసలు నిషేధాలు విధించడానికి వీళ్లెవరు? 'ఈ దేశ పటాన్ని చుట్టచుట్టి నీ తల కింద పెట్టుకోవడానికి/ అది నీ అయ్య జాగీరు కాదు/ అంగట్లో దొరికే కుంకుమ బట్టు కాదు దేశభక్తి' అంటూ నిలదీస్తాడు సయ్యద్‌ గఫార్‌. అసలు తొలగించాల్సింది...చీర చెంగుతో కప్పుకునే ముసుగునో, హిజాబ్‌ నో కాదు....దేశం వీళ్ల జాగీరుగా భావిస్తోన్న మతోన్మాదుల ముసుగుని తొలగించాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది.

(ప్రజాశక్తి పత్రిక 13.02.2022 తేదీ  సంపాదకీయం)