Wednesday, December 30, 2015

ఫేస్ బుక్ మోసాన్ని ఓడించండి -ఇంటర్నెట్ ను కాపాడండి


ఇందుకు fsmi.in వెబ్ సైట్ చూసి దానిలో వున్న సమాచారం ప్రకారం మీ అభిప్రాయాన్ని 7.1.2016 లోగా టి ఆర్ ఏ ఐ కి ఈ మెయిల్ చేయండి

ఫేస్ బుక్ పత్రికలనిండా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నది. ఇందుకు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నది. తాము దేశ సేవ చేద్దామనుకుంటే “ఇంటర్నెట్ తటస్థత” కోసం  పని చేసే  కార్యకర్తలు అడ్డుపడుతున్నారని,  కాబట్టి భారత ప్రజలు తమకి మద్దతు ఇవ్వాలని ఈ ప్రకటనల సారాంశం. 

‘ఇంటర్నెట్ తటస్థత’ అంటే ఏమిటి? టెలిఫోన్ లో మీరు ఎవరితోనయినా మాట్లాడవచ్చు. ఏ విషయమయినా మాట్లాడవచ్చు. ఫలానా వారితోనే మాట్లాడాలి, ఫలానా విషయమే మాట్లాడాలి అంటే అంగీకరించము. అది మన టెలిఫోన్ హక్కుకి వ్యతిరేకం అంటాం. ఇంటర్నెట్ విషయం లో కూడా ఇదే విధమయిన హక్కుని ప్రతి వినియోగదారు కలిగి  వుండాలి. మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఇస్తాము, కానీ మీరు మేము అనుమతించిన సమాచారాన్నే  చూడాలి, మేము అనుమతించిన వెబ్ సైట్స్ నే చూడాలి, మేము అనుమతించిన బ్లాగులనే మీరు తయారు చేసుకోవాలి, మేము అనుమతించిన అప్లికేషన్సునే మీరు అభివృద్ధి చేసుకోవాలి అని ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఏ టెలికాం లేదా ఇంటర్నెట్ కంపెనీ అయినా సరే అంటే దానికి మనము అంగీకరిస్తామా? అంగీకరించము. ఇంతేగాక ఒక వెబ్ సైట్ చూడటానికి ఒక రేటు, ఇంకొక వెబ్ సైట్ చూడటానికి ఇంకొక రేటు వుండే వివక్షతా పూర్వక విధానాన్ని మనము అంగీకరించము. ఒక వెబ్ సైట్ ను వేగముగా మరొక వెబ్ సైట్ ను చాలా నెమ్మదిగా చూసే విధముగా , ఆ వెబ్ సైట్  యాజమాన్యం టెలికాం కంపెనీకి చెల్లించే రేటును బట్టి ఏర్పాటు చేసే విధానాన్ని మనము అంగీకరించము. ఇదే విధముగా ఎవరయినా ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని ఏదయినా అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటే ఒక రకమయిన అప్లికేషన్ కు ఒక రేటు, ఇంకొక రకమయిన అప్లికేషన్ కు ఇంకొక రేటు వుండే వివక్షతాపూర్వక విధానాన్ని మనము అనుమతించము. ఇంటర్నెట్ ను వినియోగించుకుని అప్లికేషన్ డెవలప్ చేయటానికి డేటా చార్జీలకు మించి అదనముగా చెల్లించటానికి అంగీకరించము.  ఇంటర్నెట్ వినియోగానికి చెల్లించటం తోపాటు ఇంటర్నెట్ పై డెవలప్ చేసిన వాట్సప్, స్కైప్ తదితర అప్లికేషన్ వినియోగానికి అదనముగా చెల్లించాలంటే అందుకు మనము అంగీకరించము. ఈ విధముగా ఇంటర్నెట్ ను ఎటువంటి వివక్షత, ఆటంకము లేకుండా స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కునే "ఇంటర్నెట్ తటస్థత" అంటారు. 

ఇప్పుడు ఫేస్ బుక్ చేసేది భారత ప్రజల హక్కు అయిన ఈ ఇంటర్నెట్ తటస్థతకి వ్యతిరేకమయిన కార్యక్రమం. దీని ఆటలు సాగనిస్తే కొన్నాళ్ళకి మనము ఇంటర్నెట్ తటస్థత హక్కుని కోల్పోతాము. ఇంతకీ ఫేస్ బుక్ చేయదలచుకున్నదేమిటి? ఇంతకు ముందే ఫేస్ బుక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికాం కంపెనితో ఒప్పందానికొచ్చి, “ఇంటర్నెట్. ఆర్గ్” (internet.org) పేరుతో రిలయన్స్ వినియోగదారుల మొబైల్ ఫోన్ లో ఉచితముగా 38 వెబ్ సైట్ లు, సర్వీసులు అందించే ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని వార్తలు అందించేవి, కొన్ని వార్తలు మరియు వినోదం అందించేవి, కొన్ని వినోదాన్ని అందించేవి వున్నాయి. కానీ ఈ సేవలందించే కంపెనీలలో ఒక కంపెనీని మాత్రమే అనుమతించి మిగతా కంపెనీలని అనుమతించలేదు. కాబట్టి వార్తలు చూడాలంటే ఏదో ఒక సంస్థ ఇచ్చే వార్తాలే చూడాలి. నచ్చిన వార్తా పత్రికని నెట్ లో చూడటానికి వీలు కాదు. ఫేస్ బుక్ కు నచ్చిన వార్తా పత్రికని మాత్రమే చూడాలి! ఇదే విధముగా ఇతర సేవలపై కూడా ఆంక్షలున్నాయి. కొంత విమర్శ వచ్చిన తరువాత ఫేస్ బుక్ ఈ ఇంటర్నెట్.ఆర్గ్ కు “ఫ్రీ బేసిక్స్” అనే పేరు పెట్టింది. పేరు మార్చినా విషయం మారలేదు. వివక్షత కొనసాగింది. ఇది వివక్షతా పూర్వక విధానమని, ఇంటర్నెట్ తటస్థతకి ఇది వ్యతిరేకమని చెప్పి టి ఆర్ ఏ ఐ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) దీనిని ఆపు చేయించింది. 

అయినప్పటికి టి ఆర్ ఏ ఐ ఆపు చేయించిన ఈ “ఫ్రీ బేసిక్స్’ కు మద్దతుగా ఇదేదో తాము భారత దేశాన్ని ఉద్ధరించటానికి చేస్తున్న ఘనకార్యమన్నట్లు ఫేస్ బుక్ పత్రికా ప్రకటనలు విరివిగా ఇస్తున్నది. విచిత్రమయిన విషయమేమిటంటే ఫ్రీ బేసిక్స్ ను ఆపు చేయించిన టి ఆర్ ఏ ఐ, అందుకనుకులముగా ఫేస్ బుక్ ఇస్తున్న ఈ ప్రకటనలను మాత్రం ఆపు చేయించటం లేదు!
టి ఆర్ ఏ ఐ తన వెబ్ సైట్ లో ఈ సమస్య పై ఒక కన్సల్టెషన్ పేపర్ ను పెట్టింది. దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకునే ప్రతి ఒక్కరూ టి ఆర్ ఏ ఐ కి 7.1.2016 లోగా అందె విధముగా ఈ మెయిల్ ద్వారా గాని, పోస్ట్ ద్వారా గాని తెలియజేయవచ్చును.
 
మొబైల్ వినియోగ దారులలో అల్పాదాయ వర్గాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ను ఫ్రీ గా ఇచ్చి దాని ద్వారా కొన్ని వెబ్ సైట్స్ నయినా ఉచితముగా చూసే అవకాశం, కొన్ని  సేవలని అయినా ఉచితముగా పొందే అవకాశం కల్పిస్తున్నామని, కానీ ఇంటర్నెట్ తటస్థత కార్యకర్తలు పేదలకు తాము ఈ విధముగా ఉచిత సేవలు ఉచితముగా అందించటాన్ని  వ్యతిరేకిస్తున్నారని ఫేస్ బుక్ తప్పుడు ప్రచారం చేస్తున్నది.

 పేదలకు  నిజముగా ఉచితముగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఫేస్ బుక్ అందించదలచుకుంటే ఫలానా ఆదాయం లోపు వారికి తాము ఇన్ని ఏం బి లు లేదా ఇన్ని జి బీలు డేటా ఉచితముగా అందిస్తామని, అందుకయ్యే చార్జీలని తాము పేదల తరఫున ఆ డేటా అందించే టెలికాం కంపెనీలకు చెల్లిస్తామని చెప్పవచ్చు. లేదా నైట్ ఫ్రీ టెలిఫోన్ కాల్సు సౌకర్యాన్ని ల్యాండ్ లైన్స్ పై బి ఎస్ ఎన్ ఎల్ ఇచ్చినట్లు ఫేస్ బుక్ కూడా అల్పాదాయ మొబైల్ వినియోగదారులకు నైట్ టైమ్ ఉచితముగా డేటా అందించే ఏర్పాటును టెలికాం కంపెనీలతో ఒప్పందానికి వచ్చి ఏర్పాటు చేయవచ్చు.  అలా చేయకుండా  పేదలకు తమకి నచ్చిన వెబ్ సయిట్స్  మాత్రమే ఉచితముగా చూసే అవకాశం కల్పిస్తామని అంటున్నది. ఋ.2000 లు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనగలిగే వాళ్ళకి నెలకి ఋ.20 లేదా ఋ.30 చెల్లించి తమకి కావాల్సిన డేటా ప్లాన్ తీసుకోటం అంతా భారమవుతుందా? అయినా పేదలకు  కొన్ని వెబ్ సయిట్స్ మాత్రమే చూసేందుకు అనుమతించటం ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు ఎలా అవుతుంది?పేదలుల ఫేస్ బుక్ లో క్యాండి క్రష్ ఆట మాత్రమే ఆడుకోవాలని, గూగుల్ లేదా యు ట్యూబు  తదితర సెర్చి ఇంజిన్లను వాడి తమకి కావాల్సిన వెబ్ సైట్లను చూడకూడదని ఫేస్ బుక్ ఉద్దేశమా? ఇది భారత దేశ పేద ప్రజలకి  ఏదో ముష్టి వేసినట్లు అవమానించటమే కదా?   ఇది ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం పేరుతో కుట్ర చేయటం తప్ప మరొకటి కాదు. 

ప్రభుత్వము అందించే సేవలన్నింటిని తమ ఫ్రీ బేసిక్స్ ద్వారా ఉచితముగా అందిస్తామని ఫేస్ బుక్ అంటున్నది. ప్రభుత్వము నిజముగా ఫేస్ బుక్ ద్వారా మాత్రమే తన సేవలు ఉచితముగా అందిస్తే అది అక్రమం అవుతుంది.పోలీసు సేవలు 100 నంబరుకి డయల్ చేస్తే  అందుబాటులోకి వస్తున్నాయి. ఏ టెలికాం కంపెనీ వినియోగదారు అయినా అదే నంబరుకి డయల్ చేయవచ్చు. అలా కాకుండా ఫలానా టెలికాం కంపెనీ వినియోగ దారులకి మాత్రమే ఈ సేవ అందుబాటులో వుంటుంది అని ప్రభుత్వము అంటే అది అక్రమం, చట్ట విరుద్ధం అవుతుంది. కాబట్టి ఫేస్ బుక్ ద్వారానే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి ప్రభుత్వము అంగీకరించటం సాధ్యము కాదు.  ప్రభుత్వ సెవలను ఉచితముగా, ఏ టెలికాం సర్వీసు కంపెనీ వినియోగ దారు అయినా సరే, ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశం వుండాలి. ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లందరికి ప్రభుత్వము ఈ షరతు విధించాలి.

కొన్ని వెబ్ సైట్స్ ను ఉచితముగా చూసే ప్లాన్ లను అనుమతించటం అంటే అది తీవ్రమయిన వివక్షతకు దారి తీస్తుంది. తమకి డబ్బులు ఎక్కువ చెల్లించే కంపెనీల వెబ్ సైట్సు ను ఉచితముగానో, లేదా ఎక్కువ స్పీడ్ తోనో చూపించే విధానానికి ఇది దారి తీస్తుంది. అంటే ఎక్కువ చెల్లించగలిగే కంపెనీల వెబ్ సయిట్సుకే ఇంటర్నెట్ లో ప్రాధాన్యత లభిస్తుంది. చెల్లించలేని కంపెనీల వెబ్ సైట్స్ చూడటం కష్ట సాధ్యమవుతుంది. చివరికి ఇంటర్నెట్ వినియోగాన్ని దాని శక్తి సామర్థ్యాలతో పోలిస్తే చాలా పరిమితమయిన స్థాయికి దిగజార్చటానికి ఇది దారి తీస్తుంది. ఇంతేగాక మిలియన్లకొద్ది వున్న వెబ్ సైట్సు, అప్లికేషన్సు లో ఏవో కొన్నింటిని మాత్రమే ఉచితముగా అందించి మిగతా వాటికి రకరకాలుగా చెల్లించే విధానం రావటం అంటే నేను చూసే వెబ్ సైట్సు మీకు అందుబాటులో లేక, మీరు చూసే వెబ్ సైట్సు  నాకు అందుబాటులో లేక ఇంటర్నెట్ ద్వారా ఒకరితో ఒకరు సంబంధం కలిగి వుండటం చాలా పరిమితమవుతుంది. 

ఉచితముగా అందించే పేరుతో ఫేస్ బుక్ ఈ విధముగా ఎక్కువ వినియోగదారులను పొందగలిగితే ఎవరయినా ఒక చిన్న పారిశ్రామిక వేత్త తన కంపెనీ వెబ్ సైట్ ను ఫేస్ బుక్ వినియోగదారులకు అందుబాటులోకి తేవాలంటే అందుకు ఫేస్ బుక్ కు చాలా చెల్లించాల్సి వుంటుంది. 

ఇంటర్నెట్ ను ఈ విధముగా పరిమితమయినదిగా చేయటాన్ని ప్రభుత్వము మరియు టి ఆర్ ఏ ఐ లు నివారించాలి. ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లద్వారా అండాలంటే దానికి ప్రభుత్వ నిధి అయిన యు ఎస్ ఓ ఫండ్ తో నిర్మించే ఆప్టిక్ కేబుల్ నెట్ వర్క్ ఉపయోగించాలి. దేశ సహజ సంపద అయిన స్పెక్ట్రమ్ ను ఉపయోగించాలి. కాబట్టి ఇంటర్నెట్ ను ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకు రావటం, సాధ్యమయినంత తక్కువ ధరకు అందుబాటులోకి తేవటం, పేదలకు ఉచితముగా ఒక మెరకయినా అందుబాటులోకి వచ్చేలా చేయటం ప్రభుత్వము మరియు టి ఆర్ ఏ ఐ ల బాధ్యత. ఉచితముగా కొన్ని వెబ్ సైట్లు అందిస్తున్నామనే సాకుతో భారత దేశ ఇంటర్నెట్ ఆవరణలో అధిక భాగాన్ని కాజేసే అవకాశం ఫేస్ బుక్ కు ఇవ్వ కూడదు. పేదలకు ఉచితం పేరుతో ఫేస్ బుక్ ఇవ్వదలచుకున్న కొన్ని వెబ్ సైట్లు మాత్రమే చూసే అవకాశం కల్పించి అత్యధిక వెబ్ సైట్లు చూసే అవకాశం లేకుండా చేసే ఈ కుట్రని ఓడించాలి. పేదలకు తగిన మేరకు డేటాని అన్నీ రకాల వెబ్  సైట్లు చూడగలిగే విధముగా ఉచితముగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. భారత పేదల మీద ఫేస్ బుక్ కు నిజముగా అంతా ప్రేమ వుంటే అది కూడా పేదలకు ఎటువంటి ఆంక్షలు లేని విధముగా కొన్ని ఏం బి లు లేదా కొన్ని జి బి లు డేటాని ప్రతినెలా ఉచితముగా అందించేందుకు ముందుకు రావాలి. అంతే గాని ఈ మోస పూరిత విధానం మంచిది కాదు. 

ఫ్రీ బేసిక్ లో  అడ్వర్టైజ్మెంట్లు వుండవని ఫేస్ బుక్ అంటున్నది. కానీ అది ప్రస్తుతానికి మాత్రమే. భవిష్యత్తులో ఫ్రీ బేసిక్స్ లో ప్రకటనలు ప్రసారం చేసే  హక్కు తనకి వునందని  ఫేస్ బుక్ ఇప్పటికే ప్రకాటించింది. మరొక విషయం ఏమిటంటే  ఫేస్ బుక్ తన వినియోగ దారుల డేటాని మార్కెటింగ్ కంపెనీలకి అమ్ముకుంటుంది. అదే దాని ఆదాయ మార్గం లో ముఖ్యమయినది. కాబాట్టి ఎంత మంది వినియోగదారులను రాబడితే ఫేస్ బుక్ కు అంత లాభం. ఇంతేగాక ఫేస్ బుక్ ఒక అమెరికా కంపెనీ. ఒక అమెరికా కంపెనీగా అది తన వినియోగదారుల డేటాని అమెరికా గూఢచారి సంస్థ లేదా భద్రతా సంస్థ “ఎన్ ఎస్ ఏ” (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ) ” కి అందించాలి. కాబట్టి ఇది భారతీయుల వ్యక్తిగత విషయాల  భద్రతకి భంగకరం. 
కాబట్టి పేదలకు ఉచితం పేరుతో  కొన్ని వెబ్సైట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చి సంపూర్ణమయిన ఇంటర్నెట్ కు బదులు దానిని పాక్షికం చేసి ఇంటర్నెట్ ప్రయోజనాన్ని సంకుచితం చేసి తన లాభాలను పెంచుకునేందుకు ఫేస్ బుక్ చేస్తున్న కుట్రని ఓడించండి. ఇందుకు ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కు వ్యతిరేకముగా అదే విధముగా ఇంటర్నెట్ తటస్తతకు అనుకూలముగా, దానితోపాటు  ప్రజలందరికీ కొన్ని ఏం బి లు లేదా జి బిల మేరకు డేటా ఉచితముగా, అన్నీ వెబ్సైట్లు/అన్నీ అప్లికేషన్లు అందుబాటులో వుండే విధముగా తగిన విధానాన్ని రుపోదించాలని కోరుతూ టి ఆర్ ఏ ఐ కి 7.1.2016 లోగా మీ అభిప్రాయాన్ని ఈ మెయిల్ ద్వారా తెలియజేయండి. ఇందుకు మీరు వెంటనే www.fsmi.in  వెబ్ సైట్ చూడండి.

Thursday, December 17, 2015

మోడీ సిలికాన్‌ పర్యటన: డిజిటల్‌ ఇండియా


                       ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర సాంకేతిక కేంద్ర మైన సిలికాన్ వ్యాలీలో మోడీ పర్యటన, ఆ సందర్భంగా ఆయన ఐటి దిగ్గజాలైన గుగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ కంపెనీల ప్రతినిధులను కలవడం లాంటి అంశాలకు మీడియా విపరీత మైన ప్రచారహోరును కల్పించింది. ఈ పర్యటన తోనే మోడీ భారతదేశ శాస్త్రసాంకేతిక పురోగతిని ఉన్నత సోపానాలనెక్కించినట్లు కార్పొరేట్ మీడియా చిత్రీకరించింది. భవిష్యత్తులో భారతీ యులు మరిన్ని స్మార్ట్ ఫోన్లు, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం గల కార్లు, పరికరాలు వాడగల గడంలో సందేహం లేదు. దీనర్థం భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిని సాధించి నట్లు కాదు. ఈ అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులలో సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రెండూ కలిపి భారత్లో తయారవుతున్న ఉత్పత్తులు ఎన్ని అన్నదే ఇక్కడ ప్రశ్న. అవి దాదాపుగా ఏమీ లేవన్నది తక్షణ సమాధానం. ఈ దిశలో మోడీ పర్యటన వల్ల కించిత్తు ప్రయోజనం కూడా కలగటం లేదు. 
సిలికాన్ వ్యాలీగా పిలువబడే అమెరికా లోని శాన్ఫ్రాన్సిస్కో దక్షిణ భాగం, ప్రపంచం లోనే అతిపెద్ద అత్యాధునిక సాంకేతిక కార్పొరే షన్లకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. అత్యధిక సంఖ్యలో పేరుగాంచిన సిలికాన్ చిప్ ఆవిష్కర్త లు, తయారీదార్ల ప్రాముఖ్యతతోనే ఆ ప్రాంతం సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల కృషితో ఆవిష్కృతమైన నూతన ఉత్పత్తులు, వెంచర్ పెట్టుబడులు, అమెరికా రక్షణశాఖ వ్యయాలు లాంటి అనేక అంశాలు కలగలిపి ఆ ప్రాంత ఉద్భావనకు కారణాలయ్యాయి. వేలాది శాస్త్ర, సాంకేతిక అంకుర పరిశ్రమలు ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకు పురుడు పోసుకొని అక్కడి నుండే తమ ప్రయాణాన్ని మొదలెట్టాయి. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక శ్రమజీవులు అత్యధి కంగా కేంద్రీకరింపబడిన ప్రాంతం ఇదేనేమో! మోడీ తన ఉపన్యాసాన్ని శ్రోతలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడతారన్న అంశం సిలికాన్ వ్యాలీలో ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి విదిత మౌతుంది. సాంకేతిక మేధావులు హాజరైన ఆ సమావేశంలో ఆయన తనుగాని, తన పార్టీగాని, ఆర్ఎస్ఎస్గాని సామాన్యంగా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నట్లు మాట్లాడలేకపోయారు. ఉదాహరణకు జనవరి 3, 2014లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహమ్మదాబాద్లో జరిగిన గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ ప్రారంభోత్సవ సమయంలో ప్రస్తావిం చిన అంశాలను మోడీ ఇక్కడ ప్రస్తావించలేదు. ఆయన ఇక్కడ ఇలా చెప్పారు. ''మనం వినాయ కుడిని పూజిస్తుంటాం. వినాయకుడి కాలంలో మనిషి దేహానికి ఏనుగు తలను అతికించగల ప్లాస్టిక్ సర్జన్, తన వృత్తిని నిర్వహిస్తూ ఉండి తీరాలి. కర్ణుడు తన తల్లి ఉదరం నుండి జన్మించలేదని మహాభారతం చెబుతుంది. అంటే జన్యుశాస్త్రం ఆ కాలానికి అభివృద్ధి అయ్యిందని అర్థం.' విశ్వవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన పురోగతిని అపహాస్యం చేస్తూ, మోడీ బృందం ఈ శాస్త్ర సాంకేతిక పురోగతి వేదకాలం నాడే ఉందని నమ్మబలుకుతున్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం వేదశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రాల అభివృద్ధికి నిధులను సమకూరుస్తుందని సమర్థించుకున్నారు.
కాని సిలికాన్ వ్యాలీలో చేసిన ప్రసం గంలో మోడీ ఈ అంశాలను ఏమీ ప్రస్తావించ లేదు. వేదకాలంనాటి శాస్త్ర సాంకేతిక పురోగమ నంతో పోల్చుకుంటే, ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగం సాధించలేని ఆవిష్కరణలుగా వీటిని ప్రస్తావించలేకపోయారు. దానికి బదులు ఆయన ఇలా అన్నారు. ''నూతన ఆలోచనలు ఇక్కడే (సిలికాన్ వ్యాలీలో) తొలి వెలుగును చూడగలి గాయి.'' ఒకపక్క, చరిత్రను వక్రీకరిస్తూ, పుక్కిటి పురాణాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ, ప్రజల్లో మత ఛాందసాలను రెచ్చగొడుతూ, వేద కాలాన్ని కీర్తిస్తూ మోడీ తన దేశ ప్రజల చైతన్యస్థాయిని పురాతన కాలానికి చేర్చదలిచారు. మరోప్రక్క, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజా సమూహాల్ని సులువుగాచేరుకోగలగ డంలో దాని ప్రాధాన్యతను గూర్చి ఆయన ప్రస్తుతిస్తారు. 
మౌలికరంగ ఆవశ్యకత 
మోడీ తన ప్రసంగంలో భారతదేశాన్ని డిజిటలైజ్ చేయడంలో తన దార్శనికతను వ్యక్తపరిచారు. ''123 కోట్ల నా దేశ పౌరులు డిజిటల్గా అనుసంధించబడాలని నేను కోరు తున్నాను'' భారతదేశంలో 25 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. భారత జనాభాతో పోల్చుకుంటే దేశంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువైనప్పటికీ (10 శాతం) సంఖ్యాపరంగా చూసే అది అత్యధికంగా ఉంది. ప్రపంచ దేశాల ఇంటర్నెట్ వినియోగంలో చైనా, అమెరికా తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది. చైనాలో 64 కోట్ల ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తూ, వాళ్ళ జనాభాలో 46 శాతంగా ఉన్నారు. ప్రపంచ దేశాల మొబైల్ ఫోన్ల వినియోగంలో భారతదేశం, చైనా తర్వాత రెండవ స్థానంలో ఉంది. 125 కోట్ల భారతీయు లలో 96 కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు ఉండగా, 137 కోట్ల చైనీయులలో 127 కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి. భారతదేశంలో ప్రతివారికి మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి తేవాలంటే, మొదటగా మనకు దేశవ్యాప్తంగా విస్తరింపబడ్డ ఫైబర్ ఆప్టిక్ సమాహారం, ఫోన్లను అనుసరించ డానికి కొన్ని టవర్లు లాంటి మౌలిక సదుపా యాలు కావాలి. ఈ సమాహారం సాధారణ రవాణా వ్యవస్థను పోలి ఉంటుంది. మన దేశంలో హైవేలు, రోడ్లు, రైల్వే లైన్లు లాంటి వాటిద్వారా బస్సులు, కార్లు, ట్రక్కులు, రైళ్ళు, వాహనాలుగా ఉపయోగపడుతూ ప్రజలను ఒకచోటి నుండి మరోచోటికి చేరుస్తున్నాయి. అదే రకంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్లు డేటాను, సమాచారాన్ని ఒకచోట నుండి మరో చోటకు చేర్చగలిగే వాహనాలుగా ఉన్నాయి. హైవేలను నిర్మించితే, వాహనాలు వాటంతటవే తప్పనిసరిగా వస్తాయి. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీలు ఖచ్చితంగా బ్రాడ్బ్యాండ్ హైవేలను నిర్మించవు. అదేకాకుండా మౌలిక సదుపాయాల నిర్మాణం వాళ్ళ వృత్తి కాదు. టాటా మోటార్స్, మారుతీ కంపెనీలు రోడ్లను నిర్మిస్తాయా? ఈ మౌలిక సదుపాయాలను భారతదేశం దానంతటదే నిర్మించుకోవాలి. మరెవ్వరూ చెయ్యరు.
జపాన్, జర్మనీ దేశాల్లో 86 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. అలాగని ఆ దేశాధినేతలందరూ ఈ కంపెనీలను కలవలేరు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగదారులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనా, తమ దేశాన్ని డిజిటల్ చైనాగా మార్చటంకోసం గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ కంపెనీలను ఆశ్రయించలేడు. గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్, ట్విట్టర్ లాంటి కంపెనీలను తమ దేశంలోకి అనుమతించక పోవడమే కాకుండా, గూగుల్కు బదులుగా ఇతర సెర్చ్ ఇంజన్లను చైనీయులు వాడుతున్నారు. చైనా ప్రజలు వినియోగిస్తున్న ఇంటర్నెట్, ఇ-మెయిళ్ళ సమాచారాన్ని చైనాయేతర ప్రపపంచానికి గూగుల్ అందజేస్తుంది. చైనా లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం స్నోడెన్ అమెరికా సమాచార వ్యవస్థ బండారాన్ని బయటపెట్టిన తర్వాత వాస్తవమని రుజువైంది. గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ సేవలను పొందుతున్న ప్రజానీకంపై నిఘా ఉంచేందుకు, వారి సమాచారం మొత్తాన్ని అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి అందించేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గూగుల్, ఫేస్బుక్, యుట్యూబ్, ట్విట్టర్లను వినియోగించకుండా డిజిటల్ ప్రపంచంలో చైనా ఎలా నెగ్గుకు రాగలుగుతుందన్నది అందరి ముందున్న పెద్ద ప్రశ్న. గణాంకాల రీత్యా ఈ రంగంలో చైనా పనితీరు చాలా బాగున్నది. సామాజిక మాధ్యమాల వినియోగదారులలో అమెరికా ఉత్పత్తి అయిన ఫేస్బుక్ 118 కోట్ల మంది వినియోగదారులు కలిగి మొదటి స్థానంలో ఉన్నది. క్యూక్యూ 83 కోట్ల వినియోగ దారులు కలిగి రెండవస్థానంలో, క్యూజోన్ 63 కోట్ల వినియోగదారులు కలిగి మూడవస్థానంలో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు చైనాలో ఉత్పత్తి చేయబడి ప్రధానంగా చైనా ప్రజలచే వినియో గింపబడుతున్నాయి. చైనా ఇంటర్నెట్ వినియోగ దారులు సగటున రోజుకు 2.7 గంటలు ఆన్లైన్లో ఉంటారని, ఈ సంఖ్య అమెరికా యేతర అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే ఎక్కువగాను, అమెరికా, జపాన్లతో సమానం గానో లేదా ఎక్కువగానో ఉన్నట్లు ఒక బోస్టన్ కన్సల్టెన్సీ బృందం అధ్యయనంలో తేలింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లకు మౌలిక సదుపా యాల కల్పనకు ఈ కంపెనీలతో అవసరం లేదన్న విషయం మోడీకి బాగా తెలుసు. కానీ ఆయన కార్యాన్ని ఆయన సాధించుకున్నారు. ఆయన మీడియా ప్రచారాన్ని చేజిక్కించుకొని, ఆ ప్రఖ్యాత కంపెనీల సాయంతో తాను ప్రఖ్యాత భారతదేశాన్ని నిర్మిస్తున్నాని కొందరితో నమ్మబలుకుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కొంత భాగాన్ని అందిస్తామని ఆ కంపెనీల ద్వారా చెప్పిస్తున్నారు. మొత్తం దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఈ కంపెనీలు చివరి అంచున కల్పించే మౌలిక సదుపాయాల కల్పన అరకొరలాంటిది. ఈ కంపెనీలు వాగ్దానం చేసిన అంశాన్ని రేఖా మాత్రంగా చూద్దాము. వాళ్ళు చేస్తున్నది వాగ్దా నం మాత్రమే. అది కూడా ఖచ్చితంగా ఖరీదు కట్టే ఉంటుంది. 
సిలికాన్ వ్యాలిలో ఆయన పర్యటన సంద ర్భంగా భారతదేశంలో 500 రైల్వే స్టేషన్లను దత్తత తీసుకొని వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని, ఇందుకోసం కొంత మౌలిక సదుపాయాల కల్పన చేస్తామని గూగుల్ ప్రకటించింది. దీన్ని గూగుల్ ఎలా చేస్తుంది? అని పరిశీలిస్తే, రైల్వేలలో ఇప్పటికీ అందుబాటులో ఉన్న ''రైల్టెల్'' ఆప్టిక్ ఫైబర్ సమాహారాన్ని తప్పనిసరిగా వినియోగిం చుకుంటుంది. పెద్ద హైవేల సమీపంలో ఉండే ఇళ్ళకు చేరటానికి కలిపే చిన్న రోడ్లతో ఈ పరిస్థితిని పోల్చవచ్చును. అదేకాకుండా గూగుల్ వైఫై పరిజ్ఞానంలో నిష్ణాతులేమీ కాదు. వైఫై పరిజ్ఞానంలో నిపుణులైన ఇతర కంపెనీలు చాలా ఉన్నాయి. మన దేశంలోని కొన్ని విమానా శ్రయాలలో ఉచితంగా వైఫై సదుపాయాన్ని అందిస్తున్నారు. అవి చాలా బాగా పనిచేస్తు న్నాయి. భారతదేశంలో వైఫై కల్పించే కంపెనీలు చాలా ఉన్నాయి. సాధారణంగా వైఫై కల్పనకు ఎవ్వరూ గూగుల్ని పిలవరు. ఎందుకంటే అది వాళ్ళ పనికాదు కాబట్టి. భారతదేశ గ్రామాలన్నిం టికీ టెలివిజన్ ప్రసారమయ్యేటట్లు వీలు కల్పించటానికి, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల విక్రయాల వ్యాపారం చేయటమని అర్థం. మైక్రోసాఫ్ట్ యాజమాన్య సాఫ్ట్వేర్ మరింతగా వాడటం మూలంగా మనం లెక్కకు మించి ఖర్చు పెట్టాల్సిన విష వలయం లో పడతాము. మైక్రోసాఫ్ట్ కూడా మన దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అది అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీతో ఒప్పం దం కలిగివున్నందున, ఈ డేటా సెంటర్లలో పోగుపడిన సమాచారాన్ని అనివార్యంగా అమెరి కా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి తెలియచేస్తుంది. ఫేస్బుక్ కూడా తన ఇంటర్నెట్ను మనకు అందించటానికి తన సంసిద్ధతను వ్యక్తపరిచింది. దాని ఇంటర్నెట్ పరిమితమైన ఇంటర్నెట్గానే గుర్తించాలి. ఇంటర్నెట్లో మనం ఏమి చూడాలో ఫేస్బుక్ నిర్ణయిస్తుంది. ''తటస్థ విధానానికి ఇది వ్యతిరేకం. ఈ కంపెనీలేమీ మనదేశంలో చెప్పు కోదగ్గ ఉద్యోగాల్ని కల్పించలేవు. కల్పించగల మని వాళ్ళూ చెప్పడం లేదు.
డిజిటల్ ప్రపంచంపై గుత్తాధిపత్యం
సిలికాన్ వ్యాలీకి మోడీ సందర్శనను ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టివి మోహన్ దాస్ సారు ప్రస్తుతిస్తూ, ''మొత్తం ప్రపంచాన్ని డిజిటల్గా సొంతం చేసుకోవటం కోసం మైక్రో సాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్ మరియు యాపిల్లు కన్న కలలకు మోడీలో సమాధానం దొరికింది. అని ఆయన సరిగ్గానే చెప్పారు. ఆయన మాటల్లో రెండు సత్యాలున్నాయి. ఒకటి, ఈ కంపెనీలన్నీ డిజిటల్ ప్రపంచం మొత్తాన్ని తమ గుత్తాధిపత్యం లోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసం వాళ్ళు ఇతరులెవరినీ ఈ రంగం లోకి అడుగుపెట్టనివ్వరు. కానీ ఈ స్వప్నాన్ని నిజం చేసుకోవటానికి వాళ్ళు ఎన్నో అవరోధా లను ఎదుర్కోవలసి ఉంది. ప్రపం చంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన చైనా, ఇతరులను తమ దేశంలోకి అడుగు పెట్టనీయటం లేదు. కొన్ని దేశాల్లో యాజమాన్య సాఫ్ట్వేర్ వినియో గానికి నిధులూ, ఫ్రీ సాఫ్ట్వేర్ వినియోగం పెరి గింది. చైనా తర్వాత భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్నది. అందువల్ల బహుళజాతి కంపెనీలు ఈ మార్కెట్పై ఆసక్తిగా ఉన్నాయి. బహుళజాతి ఐటి కంపెనీలు మన దేశంలో వ్యాపారం చేయటం వల్ల అనేక ప్రయో జనాలు పొందగలుగుతున్నాయి. మొదటగా భారతదేశం యాజమాన్య సాఫ్ట్వేర్ వినియో గంలో ఆధిపత్యం కలిగి ఉంది. ఆచరణలో ప్రభుత్వం, ఐటి దిగ్గజాలు యాజమాన్య సాఫ్ట్ వేర్కు ఇచ్చినంత ప్రాధాన్యతను స్వేచ్ఛా, ఫ్రీ సాఫ్ట్వేర్లకు ఇవ్వటం లేదు. రెండవ అంశం, 
భారతదేశం రెండవ అతిపెద్ద మార్కెట్గా ఉన్నది. అందువల్ల బహుళజాతి కంపెనీలు ఈ మార్కెట్పై ఆసక్తిగా ఉంటాయి. అయినప్పటికీ అవుట్సోర్సింగ్కు వినియోగించే సాఫ్ట్వేర్ నిర్మాణం అనేక సందర్భాలలో అంత తేలికైన పనికాదు. భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఆ నైపుణ్యం ఉంది. కాని మనదేశంలో నూతన ఉత్పత్తుల స్థానంలో భారతదేశ సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు స్థానం కల్పించాలన్న సంకల్పం భారత ప్రభుత్వానికి లేదు. అవుట్ సోర్సింగ్ ద్వారా పొందగలిగే సత్వర ఆదాయాన్ని ప్రైవేట్ ఐటి కంపెనీలు నూతన ఉత్పత్తుల ద్వారా పొందలేకపోవటం మూలంగా వాటి ఉత్పత్తిలో ఆసక్తి కనబరచడం లేదు. మూడవ అంశం ఇతర దేశాలలాగా కాకుండా, బహుళజాతి సాఫ్ట్వేర్ దిగ్గజాల సహకారంతో అమెరికా సాగిస్తున్న నిఘా చర్యల్ని ష్నోడెన్ బట్టబయలు చేసినప్పటికీ, భారత దేశం, వాటినేమీ పట్టించు కోవడం లేదు. చివరి అంశం పర్యవసానాలే మైనా భారత మార్కెట్ను సాధ్యమైనంత త్వరగా బహుళజాతి సంస్థలకు అప్పచెప్పటానికి ప్రస్తుత ప్రధానమంత్రి, సిద్ధమయ్యారు. బహుళజాతి ఐటి కంపెనీలకు భారత మార్కెట్, భారత ప్రధానమంత్రి ప్రీతిపాత్రమయ్యాయి. అమెరికన్ బహుళజాతి ఐటి కంపెనీల కలలకు మోడీతో సమాధానం చూడగలిగారన్న మోహన్దాస్ సారు ప్రకటనలో రెండవ సత్యం ఇక్కడ దొరుకు తుంది. అమెరికన్ కంపెనీల ప్రయోజనాలకు కొమ్ముగాస్తున్న మోడీని అమెరికన్ మీడియా ఆనందంతో కీర్తించడం సర్వసాధారణమైనదే. మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో అదే జరిగింది. కానీ మోడీ తన పర్యటనలో ఏమి చేసి ఉండాల్సింది? దానికి బదులు ఆయన అనంతమైన విజ్ఞానాన్ని అందించకలిగే విద్యాసంస్థలు, అపార సంపదను పెట్టుబడిగా పెట్టగలిగే వెంచర్ పెట్టుబడిసంస్థలు, కేంద్రీకరిం పబడ్డ నైపుణ్య సమూహాలన్నింటి పరస్పర సమన్వయంతో అంకుర పరిశ్రమలు వారి ఆవిష్కరణలతో సిలికాన్ వ్యాలీలో ఎలా వృద్ధి కాగలిగాయో అధ్యయనం చేసి ఉండాల్సింది. ఆయన సిలికాన్ వ్యాలీ చరిత్రను పరిశీలించి ఉంటే, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన పాత్ర తెలిసి ఉండేది. సాధారణంగా భారత కంపెనీలు నూతన ఆవిష్కరణలకు విముఖంగా ఉన్న ప్రాంతంలో నూతన ఉత్పత్తుల నిర్మాణంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు పాత్రకు తగిన ప్రణాళికను మోడీ రచించగలిగేవారు. ఆ దిశలో మోడీ ఏమీ చేయటం లేదు. అనేక సందర్భాలలో మోడీ ''భారత్లో తయారీ''పై ప్రసంగిస్తుండేవారు. అనేక ఆవిష్కరణలు సిలికాన్ వ్యాలీలో చిన్న చిన్న అంకుర పరిశ్రమల ద్వారానే సాధ్యమైందన్న వాస్తవాన్ని ఆయన అధ్యయనం చేస్తే అర్థమయ్యేది. ''భారత్లో తయారీ'' ప్రణాళిక విజయసాధనకు అటువంటి అకుంర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వవలసి ఉంది. ఆ రకమైన ప్రోత్సాహాన్ని అందించటానికి తగిన ప్రభుత్వం విధానాలను ఆయన రూపొం దించవలసి ఉంది. భారతదేశ ఐటి పరిశ్రమ లలో మనం చూస్తున్న అభివృద్ధి, సాఫ్ట్వేర్ పార్క్ ఆఫ్ ఇండియా ద్వారా ఉద్భవించిన ఐటి పరిశ్రమ అనుకూల భారత ప్రభుత్వ పన్నుల విధానం ద్వారానే సంభవించింది. సాఫ్ట్వేర్ పార్క్ ఆఫ్ ఇండియా క్రింద నమోదైన ఐటి కంపెనీ, అది చిన్నదైనా, పెద్దదైనా, భారత్లో ఉన్నా లేకపోయినా, అది ఎగుమతులు చేయ గలిగితే పన్ను రాయితీలకు అర్హమై ఉంటుంది. ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందిన అనేక చిన్న కంపెనీలు భారతీయ కంపెనీలుగా పరిణామం చెందాయి. (ఉదాహరణకు టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మొదలైనవి). గత యుపియే ప్రభుత్వం పన్ను రాయితీలను ఉపసంహరించు కుంది. ఈ పరిణామం చిన్న ఐటి కంపెనీలపై అధిక పన్ను భారాన్ని మోపుతూ అసమాన పోటీకి దారితీస్తుండగా, పెద్ద ఐటి కంపెనీలు అధిక పన్ను మినహాయింపులు, అనేక ఇతర రాయితీలను అందిస్తున్న ''ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు'' తరలిపోయి అధిక ప్రయోజనాలు పొందగలుతున్నాయి. ఒక చిన్న కంపెనీ కూడా ప్రత్యేక ఆర్థిక మండలిలో 25 ఎకరాల కనిష్ట భూమిని కొనగలిగే స్థితిలో లేదు. డిఎల్ఎఫ్, షాపూర్జి సల్లోంజీ లాంటి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రత్యేక ఆర్థిక మండళ్ళలో కొంత స్థలం అద్దెకు ఇస్తున్నా, వారు డిమాండు చేస్తున్న అత్యధిక అద్దెలు భరించే స్థితిలో చిన్న కంపెనీలు లేవు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం గత యుపియే ప్రభుత్వం తీసుకున్న చర్యలను రద్దు చేసి అంతకు ముందున్న స్థితిని పునరుద్ధరి స్తుందా? లేక భారీ, చిన్న కంపెనీలు ఒకేరకమైన ప్రభుత్వ రాయితీలను పొందేటట్లు విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా? లేదు. ఆయన అలా చేయరు. కాంగ్రెస్, బిజెపిలది ఒకే రకమైన ఆర్థిక విధానం. బిజెపికి ఎన్నికల నిధి ఇవ్వగలిగే స్తోమత చిన్న కంపెనీలకు లేదు. అందువల్ల బిజెపి చిన్న కంపెనీలను ప్రోత్సహించే ప్రశ్నే ఉదయించదు. మోడీ ప్రకటించిన ''భారత్లో తయారీ'' నినాదం ఆయన ప్రసంగాలలో తప్ప ఆచరణలో లేదు. మోడీ సిలికాన్ వ్యాలి పర్యటన ఒక ఇచ్చి పుచ్చుకునే ప్రణాళిక. ప్రభుత్వ మద్దతుతో భారతదేశంలో తమ వ్యాపారాన్ని చేసుకోమని బహుళజాతి ఐటి కంపెనీలను మోడీ ఆహ్వానిం చారు. వాళ్ళు ఆయనకు అత్యధిక ప్రచార హోదాను కల్పిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ తమ దగ్గరున్న డేటాను, సమాచారాన్ని అమెరికా జాతీయ నిఘా సంస్థకు ఎప్పటికప్పుడు అంద జేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా మోడీకి ఇంటర్నెట్లో, సామాజిక మాధ్యమంలో అత్యధిక ప్రచారాన్ని ఇస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవటం లేదా ఆలస్యం చేయటం చేస్తున్నారు (తమకు కావలసింది 8 సెకండ్లలో రాకపోతే వినియోగదారులు మరో సైట్కు మరలిపోతారు). భారతదేశ భారీ ఐటి కంపెనీలు భారత్ మార్కెట్కంటే అవుట్ సోర్సింగ్పై ఆసక్తితో ఉన్నందున, వాళ్ళు విదేశీ కంపెనీలతో సంబంధ బాంధవ్యాలను పెంచు కొని మనదేశం వెలుపల వారి మార్కెట్ను విస్తరించుకుంటున్నారు. తమకు సంబంధ బాంధవ్యాలున్న బహుళజాతి కంపెనీలను మోడీ భారత మార్కెట్కు ఆహ్వానించటం సహజంగా భారతదేశ భారీ ఐటి కంపెనీలకు అనందంగా ఉంటుంది. ఇందుకోసం భారతదేశంలో కార్పొరేట్లు, కార్పొరేట్ మీడియాల మద్దతు పొందటంలో మోడీకి ఎటువంటి సమస్యా లేదు. నరేంద్ర మోడీకి సొంత ప్రచారానికి మించి, మనదేశం యొక్క నిజమైన అభివృద్ధి సాధన ఆయన ఎజెండాలో ఉండే ప్రశ్నే లేదు. 
- - డిబెన్ దాస్ 
(స్వేచ్ఛానువాదం : కొండముది లక్ష్మీప్రసాద్)